Tags

, , , , , ,

Image result for is telangana going for midterm elections

ఎం కోటేశ్వరరావు

   తెలంగాణాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రాజకీయ రంగంలో అనూహ్య చర్యలకు తెరలేవనున్నదా అనే అనుమానం కలగక మానదు. అవలోకిస్తే రెండు దృశ్యాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.ఒకటి తెరాస అధికారానికి వచ్చి మూడో సంవత్సరం పూర్తి కావస్తున్నా నిర్ధిష్టంగా ఫలానా పని చేశామని చెప్పుకొనేందుకేమీ లేకపోవటంతో అధికారపక్షంలో ఆందోళన, ప్రతిపక్షాలలో ఆశలు మొలకలెత్తటం, కొంత అస్పష్టంగానే వున్నప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తిగాక ముందే ఏదో ఒక సాకుతో నాలుగో సంవత్సరం ప్రారంభంలోనే అధికారపక్షం మధ్యంతర ఎన్నికలకు వెళ్ల నుందా అన్నది మరొకటి. రెండు దృశ్యాలూ ఒకదానికొకటి సంబంధం కలిగివున్నాయి.

    తాజాగా ప్రత్యక్షంగా అధికారపక్షానికి, పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలకు మధ్య టిజాక్‌( తెలంగాణా జెఎసి) నేత కోదండరాం లేదా తెరాస ప్రచారం చేస్తున్నట్లు కోదండరాం రెడ్డి కేంద్ర బిందువుగా వున్నారు. ప్రత్యేక తెలంగాణా ఆందోళనకు నాయకుడిగా కోదండరాంను తెరమీదకు తెచ్చిన సారధి కెసిఆర్‌ ఇప్పుడు తన సైనికులతో కోదండరాంపైనే ప్రచార దాడి చేయిస్తున్నారు. తామేమీ చేశామో చెప్పుకొనేందుంకటే ప్రత్యర్ధులపై విరుచుకుపడటానికే అధికారపక్షం, దాని మద్దతుదార్లు, అధికారానికి దగ్గరై ఫలాలను అందుకోవాలని చూస్తున్న శక్తులు ప్రయత్నిస్తున్నాయి.పంచ రంగులలో తాము చూపిన బంగారు తెలంగాణా గురించి చెబుతున్నప్పటికీ ఆ నగ తయారీ ఎంతవరకు వచ్చిందో మాత్రం ఎవరూ చెప్పటం లేదు. అంతకంటే ఎక్కువగా కోదండరాం కులం గురించి, ఒక కులానికి చెందిన నేతలందరూ ఒక్కటవుతున్నారనేదానిపైనే కేంద్రీకరించి మాట్లాడుతున్నారు.

     ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కులం తురుఫు ముక్కలతోనే తన లేదా తమ కుటుంబ పట్టును పదిల పరుచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు రాజ్యాంగ బద్దంగా వున్న షెడ్యూలు కులాలు, తెగల వుప ప్రణాళికలకు తిలోదకాలిచ్చి దానిని నీరు గార్చేందుకు చేయాల్సిందంతా చేస్తూనే మరోవైపు కులాలవారీ ప్రతినిధులను పిలిచి వందల, వేల కోట్ల కేటాయింపులు, సంక్షేమం గురించి ఆకాశంలో వెండి మబ్బులను చూపుతున్నారు. కన్నతల్లికి కాస్తంత కూడు పెట్టని కొడుకు పినతల్లికి బంగారు తొడుగులు చేయిస్తా అన్నట్లుగా దళితులకు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి పదవే ఇవ్వకపోతే పోయారు వాగ్దానం చేసిన భూమి గురించి మాట్లాడటం లేదు. అలాంటిది బిసిలు, అందులోనూ అత్యంత వెనుకబడిన బీసీలంటూ వారి సంక్షేమానికి వేల కోట్ల రూపాయల కేటాయింపులనే ఎండమావులను చూపి వాటి వెంట పరిగెత్తించాలని చూస్తున్నారు. దళితుల గురించి మాట్లాడటం మాని వెనుకబడిన తరగతుల గురించి జపం చేస్తున్నారు. ఎంత ఎక్కువగా వాగ్దానాలు చేస్తే అంత ఎక్కువగా భ్రమలు పెంచి అంతే స్ధాయిలో నిరసనను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం తెలియనంత అమాయకుడు కాదు కెసిఆర్‌. అయినా చట్టపరంగా ఇంకా ఎన్నికలు రెండు సంవత్సరాలు వుండగానే ఇంతగా వాగ్దానం చేస్తున్నారంటే కొత్త రాజకీయ ఎత్తులకు తెరలేవనున్నదని భావించకతప్పదు.

    ఇంతకాలం తమ వేతనాలు పెంచాలనిఅందోళన చేసిన కాంట్రాక్టు లెక్షరర్లు, అంగన్వాడీలు, విఆర్వోలు, ఇతర చిరుద్యోగుల డిమాండ్లకు తలొగ్గి కొంతమేరకు వేతనాలు పెంచుతున్నారు. అనివార్యమై కొన్ని పోస్టులను రెగ్యులర్‌ చేసేందుకు నిర్ణయించారు.ఇవన్నీ ఆయా తరగతుల పోరాట ఫలితాలు తప్ప మరొకటి కాదు. ఎవరి సంగతి వారు చూసుకోవటం ముఖ్యమనే వాతావరణం ఆవరించి వున్న నేటి పరిస్థితులలో తమ సంగతేమిటన్నది నిరుద్యోగుల ప్రశ్న. భారత్‌ను ఆక్రమించిన తెల్లవారు దేశం వదలి వెళితే మన పరిస్థితి బాగుపడుతుందని నమ్మి యావత్‌ దేశం ఆశోపహతులైనట్లే, వుమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ‘ఆంధ్రావలస పాలకులు’ పోయి తెలంగాణా స్వంతపాలకులు అధికారానికి వస్తే ఎంతో మేలు జరుగుతుందని భావించిన వారు కూడా అదే మాదిరి పాలకులు మారారు తప్ప పాలనా పద్దతులు మారలేదని గ్రహించటానికి ఎంతో కాలం పట్టలేదు. మిషన్‌ భగీరధ, సింగరేణి, ఆర్టీసి వంటివాటిలో సంవత్సరాల తరబడి పనికి తగ్గ వేతనాలు లేకుండా పని చేసిన వారిలో ఓ పద్నాలుగువేల మందిని క్రమబద్దీకరించటం అభినందించదగినదే. మిగిలిన వన్నీ గతంలో మాదిరి సాధారణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన, చేపట్టనున్న బండి గుర్రానికి గడ్డి చూపుడు వ్యవహారం తప్ప మరొకటి కాదు. హైదరాబాదు మహానగరంలో ముఖ్య మంత్రి వుండటానికి లేదా గృహకార్యాలయ ఏర్పాటుకు భవనాలే లేవా ? కానీ అలాంటివేమీ లేనట్లుగా ఆఘమేఘాల మీద గతంలో వున్న వాటిని పడగొట్టి పూర్వపు రాజులు, దొరల మాదిరి పెద్ద గడీని కట్టించటానికి చూపిన శ్రద్ధ వుద్యోగ నియామకాలలో కనిపించటం లేదన్నదే నిరుద్యోగుల ఫిర్యాదు. అనేక మంది వయసు మీరిపోయి అనర్హులుగా మారిపోతున్నారు. లేదూ మినహాయింపులు ఇచ్చినా ఒక వేళ వారు వుద్యోగం పొందినా వారికి పెన్షన్ల వంటివి లేవు. ఎవరి పెన్షన్‌కు వారు చెల్లించుకోవాలి. ఆ మొత్తంలో కొంత షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెడితే లాభం వస్తే ఎంత ఇస్తారో ఇంకా తెలియదు గానీ నష్టం వస్తే అసలుకే మోసం.

    ఈ పూర్వరంగంలోనే కోదండరాం నాయకత్వంలోని జెఎసి నిరుద్యోగ సమస్యపై ప్రదర&శనకు పిలుపు ఇచ్చింది. ఒక ర్యాలీ జరిగినంత మాత్రాన చంద్రశేఖరరావు ప్రభుత్వానికి వచ్చే ముప్పు వుండదు. అయినప్పటికీ నా పాలనను ఎత్తి చూపటమా అన్న భావోద్వేగానికి లోనై లేదా కొందరు చెబుతున్నట్లు దొరతనపు అహం గానీ మొత్తానికి సహించలేక ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవటం, అసాధారణ రీతిలో కోదండరాంను, ఇతరులను అరెస్టు చేయటం అనేక మందిని ఆశ్చర్యపరచింది. ఏట్లో వుండగా ఓడ మల్లయ్య ఓడ దిగింతరువాత బోడి మల్లిగాడన్నట్లుగా కెసిఆరన తయారైనట్లు చెప్పకనే చెప్పినట్లయింది. ప్రత్యేక తెలంగాణా కోసం ఆందోళనలు నిర్వహించి విద్యారు&ధలు, నిరుద్యోగులకు అనేక ఆశలు చూపిన కెసిఆర్లో ఎంతలో ఎంత మార్పు !

    తెలంగాణా రాష్ట్ర సమితి నాయకత్వంలో వెల్లడవుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు ఆ పార్టీ బలహీనతకు రుజువు. వారి వాదనల ప్రకారం తెలంగాణా రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారు వారి నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదు. ఐదు నెలల పాటు నాలుగువేల కిలోమీటర్ల దూరం జరిపే మహాజన పాదయాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం శ్రీకారం చుట్టినపుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వుక్రోషం వెలిబుచ్చారు. పాదయాత్ర చేపట్టటానికి ఆ పార్టీకి నైతిక హక్కు లేదని, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సిపిఎం నేతలు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, అలాంటి వారిని అసలు తమ ప్రాంతాలకు రానివ్వవద్దని జనానికి పిలుపు ఇచ్చారు. తమ యాత్ర ప్రభుత్వానికి, అధికారపక్షానికి వ్యతిరేకం కాదని దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల సమస్యలను తెలుసుకొని వారిని చైతన్యపరచటానికి తప్ప మరొకటి కాదని సిపిఎం స్పష్టం చేసింది. తనపాలనను ఎవరూ ఎత్తి చూపవద్దన్న పెత్తందారీ భావజాలంతో ముఖ్యమంత్రి అలాంటి ప్రకటన చేశారు తప్ప మరొకటి కాదని అనేక మంది అప్పుడు భావించారు. ఒక జాతీయ పార్టీగా భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనను సిపిఎం వ్యతిరేకించింది.తెలంగాణాను వ్యతిరేకించిన ఇతర పార్టీలలోని నేతలను, అసలు నిజాంపాలనకు మద్దతు పలికి భారతదేశంలో విలీనాన్నే వ్యతిరేకించిన వారి వారుసులందరినీ తనలో చేర్చుకున్న టిఆర్‌ఎస్‌కు ఇతరులను విమరి&శంచే నైతిక హక్కు ఎక్కడిది అన్న ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్ర సమైక్యత, విభజన అన్నది ఇప్పుడు ముగిసిన అంశం. దాని గురించి రెచ్చగొడితే రెచ్చిపోయేంత అమాయకత్వం జనంలో లేదని సజావుగా సా సిపిఎం మహాజన పాదయాత్ర నిరూపించింది. రాజకీయాలకు అతీతంగా ఆ యాత్రకు సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకులు ఇతర అనేక సంస్ధల వారు మద్దతు తెలిపారు. తెరాస మద్దతుదారులు కూడా తమనేతల రెచ్చగొట్టుడు వ్యాఖ్యలకు రెచ్చిపోకుండా సంయమనం పాటించారు. ఒక వేళవారా పని చేసి వుంటే పాదయాత్ర మరింతగా జయప్రదం అయి వుండేది. చేసిన వాగ్దానాలను అమలు జరపకుండా అధికార మత్తులో మునిగిపోయారని అధికారపక్షం గురించి జనంలో ఆలోచన ప్రారంభయ్యాకనే సిపిఎం పాదయాత్ర చేపట్టింది, ఆ కారణంగానే దాన్ని వ్యతిరేకించాలన్న ముఖ్యమంత్రి పిలుపును జనం కూడా పట్టించుకోలేదని ఇప్పటికైనా అధికారపక్షం గ్రహిస్తుందా ?

    ‘ఆంధ్రావలసపాలన’ అంతం కాగానే లక్షలాది వుద్యోగాలను కల్పిస్తామని, ప్రభుత్వ వుద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేసి హడావుడి చేసిన విషయాన్ని యువతకు ఏ కోదండరామో, మరొక ప్రతిపక్ష పార్టీయో గుర్తు చేయనవసరం లేదు. తెలంగాణా యువత మరీ అంత అమాయకంగా లేదు. మూడవ సంవత్సరం పూర్తి కావస్తున్నా వట్టిస్తరి-మంచి నీళ్ల మాదిరి ప్రకటనలు తప్ప నిర్దిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ వుద్యోగాల ఖాళీలను భర్తీ చేయటానికి, అవసరమైన చోట కొత్త వుద్యోగాలను కల్పించటానికి కావాల్సింది చిత్త శుద్ది తప్ప రాజ్యాంగ సవరణ, దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర అవసరం లేదే. అటువంటి చిత్త శుద్ది లోపించిన కారణంగానే టిజాక్‌ నాయకుడు కోదండరాం నిరుద్యోగ నిరసన ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. తెలంగాణా ఆందోళనలో భాగస్వాములైన అనేక మంది తెరాసకు దూరంగా వుంటున్నారు. అదే సమయంలో అధికారం కారణంగా అవకాశవాదులు దగ్గర అవుతున్నారు.

  తెలంగాణాలో వున్న నిరుద్యోగులతో పోల్చితే వుద్యోగఅవకాశాలు పరిమితంగా వున్నాయి. హైదరాబాదు ఐటి, ఐటి అనుబంధ పరిశ్రమలకు ఒక ప్రధాన కేంద్రంగా మారినప్పటికీ ఆ రంగంలో లభించే వుద్యోగాలకు దేశంలోని ఇతర రాష్ట్రాల వారూ పోటీ పడుతున్నారు తప్ప తెలంగాణా వాసులకే పరిమితం కాదు, రిజర్వేషన్లు లేవు. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు కొన్ని మూతపడటం తప్ప కొత్తవి రావటం లేదు. కొత్త పెట్టుబడులు పెట్టటం కేంద్ర ప్రభుత్వ అజండా నుంచి ఎప్పుడో రద్దయింది. వుమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పరిశ్రమలేవీ పెట్టలేదు. పోనీ వారు ‘వలస పాలకులు’ అనుకుంటే స్వరాష్ట్ర పాలకులు తెరాస వారు కూడా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ పెట్టలేదు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే ఓలా, వుబేరన వంటి అంతర్జాతీయ దిగ్గజాలు హైదరాబాదు నగరాన్ని చుట్టేస్తున్నాయి. దీంతో ఆటోలకు కొంత మేర గిరాకీ తగ్గిపోయింది. ఇదే సమయంలో తమ ఆదాయాలు పడిపోతున్నాయని ఓలా, వుబేరన టాక్సీ సిబ్బంది సమ్మెకు దిగినపుడు ప్రభుత్వం వారికే మాత్రం సాయపడలేదు. పరోక్షంగా యజమానుల కొమ్ము కాసింది. త్వరలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అది కూడా ఆటో, టాక్సీ రంగాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయటం అనివార్యం. ఈ పూర్వరంగంలో యువతలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధలలో వుద్యోగాలు, గౌరవ ప్రదమైన వేతనాల గురించి ఆశలు పెరగటం తప్పు, అత్యాశమే కాదు. వారిని ఎంతగా భ్రమలలో ముంచితే అంతగా అసంతృప్తి పెరుగుతుందని గ్రహించాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆందోళనకు ప్రయత్నించి అనేక మంది గతంలో విఫలమయ్యారు.కెసిఆర్‌ నాయకత్వం సఫలమైంది. అలాగే నిరుద్యోగ సమస్యపై తెరాస, దానికి వెన్నుదన్నుగా వున్న మీడియా పెద్దలు కోదండరాం ఆందోళన విఫలమైందని సంతోషపడితే పడవచ్చు. కోదండరాం కాకపోతే మరొకరు, మరొకరు వస్తారు తప్ప ఆగిపోదు.

    ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు తన కుమారుడికి ముఖ్యమంత్రి కుర్చీని అప్పగించేందుకు ప్రారంభం నుంచి పావులు కదుపుతున్నారు. అధికారం చుట్టూ తిరిగే పాలక రాజకీయాలలో ఇది సహజం. గడువు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల గడువుంది. అయినప్పటికీ కొద్ది నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయన్నట్లుగా ఆయన చర్యలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్‌, తెలుగుదేశం ఎవరు అధికారంలో వున్నప్పటికీ ఒక బలమైన సామాజిక వర్గం చక్రం తిప్పిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. కెసిర్‌ ఆ వర్గంతో అమీ తుమీ తేల్చుకోవాలనే ఎత్తుగడతో వున్నట్లు కనిపిస్తోంది. అందుకు అవసరమైన ఇతర వెనుకబడిన, మైనారిటీ సామాజిక సామాజిక వర్గాలను కూడగట్టే వైపు పావులు కదుపుతున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఇటీవలి కాలంలో కులాలవారీ ప్రతినిధులను పిలిచి వందల కోట్ల రూపాయలను సంక్షేమ కార్యక్రమాల పేరుతో వాగ్దానాలు చేస్తున్నారు. దళితులలో గణనీయంగా వున్న ఒక వర్గాన్ని కూడగట్టుకొనేందుకు రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు తప్ప అంతకు మించి చేసిందేమీ లేదు. వర్గీకరణను వ్యతిరేకించే మరో బలమైన తరగతిని దూరం చేసుకొనేందుకు అటు కేంద్రంలోని బిజెపి సిద్దంగా లేదు. ఎన్నికల రాజకీయాలలో దేనికైనా ఓట్ల లాభ నష్టాలే ప్రాతిపదిక. బీసి కులాలతో ములాఖత్‌లు నడుపుతున్న కెసిఆర్‌ కుల వృత్తులను పునరుద్దరిస్తామనే వాగ్దానాలతో వందల కోట్ల కేటాయింపుల గురించి రెండు సంవత్సరాల ముందుగానే వాగ్దానాలు కుమ్మరిస్తున్నారంటే వాటి భ్రమల నుంచి వారు బయటపడక ముందే ఎన్నికలకు పోవటం అనివార్యం. దీనికి తోడు రాజకీయ నిరుద్యోగుల వుపాధికి తప్ప మరొకందుకు పనికిరావని గతంలో స్పష్టం చేసిన అనేక కార్పొరేషన్లకు ఇటీవల జరుపుతున్న నియామకాలు ఓట్ల వలతప్ప మరొకటి కాదు. చిన్నా చితకా కలిపి మరో ఐదారువేల పోస్టులలో తమ మద్దతుదార్లను నియమించేందుకు కసరత్తు మొదలైందని వార్తలు. ఇలాంటి వన్నీ ఎన్నికల ముందే చేస్తారు తప్ప మరొకటి కాదన్నది కూడా మరో అనుభవం. పదవులు రాని వారిలో అసంతృప్తి పెరిగి అది సంఘటితం కాక ముందే ఎన్నికలకు పోవాలి తప్ప ఆలస్యం చేస్తే నష్టమే.

    వీటన్నింటినీ చూస్తున్నపుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలకు తెరలేచిందని చెప్పవచ్చు. దానికి కోదండరాం నిరుద్యోగ ఆందోళన పిలుపు నాంది అయితే రానున్న నెలల్లో పరిణామాలు ఏ మలుపులు తిరుగుతాయన్నది చూడాల్సి వుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అటు కేంద్రంలో బిజెపి రాజకీయాలు, కార్యాచరణను కూడా ప్రభావితం చేస్తాయి. అది తెరాసమీద కూడా ఏదో ఒక ప్రభావం చూపకపోదు. నరేంద్రమోడీ బలహీనపడే పరిణామాలు వస్తే చంద్రశేఖరరావు వంటి వారిని మచ్చిక చేసుకుంటారు. లేదు తమకు ఎదురు లేదు అనుకుంటే మరొక విధంగా జరుగుతుంది. ఏదైనా పరిణామాలు వేగం పుంజుకుంటాయి.