Tags
China, china communist party, communist manifesto, Engels, Marx, Marx and Engels, Narendra Modi, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
ఏ తర్కానికైనా దానికి ఒక న్యాయబద్దమైన ముగింపు వుంటుంది. తర్కంలో పాల్గొనేవారు తమకు అనుకూలమైనంత వరకే స్వీకరించి ఎదుటి వారికి సరైన సమాధానం చెప్పకపోతే చివరకు ఆ తర్కం అసంబద్దంగా ముగుస్తుంది. వుదాహరణకు కమ్యూనిజానికి కాలం చెల్లింది, అది పనికిరాదు అంటారు. అదే నిజమైతే ప్రపంచవ్యాపితంగా కమ్యూనిజం గురించి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఎందుకు చర్చ జరుగుతోంది?
కారల్ మార్క్స్-ఫెడరిక్ ఎంగెల్స్ రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక తొలి ముద్రణ జరిగి ఫిబ్రవరి 21 నాటికి 170 సంవత్సరాలు పూర్తి అయింది.అమెరికాలో ట్రంప్ అధికారానికి వచ్చిన తరువాత పుస్తక దుకాణాలలో ఆఫ్రో-అమెరికన్ల గురించి రాసిన న్యూ జిమ్ క్రో గ్రంధం తరువాత కమ్యూనిస్టు మానిఫెస్టో గురించి పాఠకులు అడుగుతున్నారని అమెరికాలోని సింపోజియం బుక్స్ యజమాని చెప్పారు. జనం కమ్యూనిస్టుమానిఫెస్టో గురించి ఎందుకు అడుగుతున్నట్లు ? అంటే కమ్యూనిస్టు సిద్దాంతం పనికిరాదని చెబుతున్నమాటలను జనం పూర్తిగా విశ్వసించటం లేదన్నమాట. 2008లో ధనిక దేశాలలో సంక్షోభం ప్రారంభమైన తరువాత అనేక మంది కమ్యూనిస్టు మానిఫెస్టో దుమ్ముదులుపుతున్నారు. ప్రఖ్యాత అమెరికన్ ఆర్ధికవేత్త రాబర్ట్ ఎల్ హెయిల్‌బ్రోనర్ ఒక సందర్భంలో ‘మనం మార్క్స్‌వైపు చూస్తున్నామంటే ఆయన సర్వజ్ఞుడని కాదు, ఎందుకంటే ఆయన్నుంచి మనం తప్పించుకోలేం’ అన్నారు. పాలకవర్గాలు తమ అస్ధిత్వానికి ముప్పు ఏర్పడినపుడు అంతకు ముందు ఏం చెప్పినప్పటికీ దాన్నుంచి తప్పించుకొనేందుకు ఒక మహా సంఘటనగా ఏర్పడతాయి. సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల కూల్చివేతకు ఐరోపా, అమెరికాలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు, పోప్ ఒక కూటమిగా ఏర్పడటం ప్రపంచ చరిత్రలో ఒక ప్రధాన ఘటన కాదా? అంటే ఈ రెండు ఖండాలలోని అధికార శక్తులు కమ్యూనిజం తమను సవాలు చేసే ఒక శక్తి అని గుర్తించినట్లే కదా ? చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జరిగిన కుట్రలో బౌద్ద దలైలామా ఒక పావుగా వుపయోగపడ్డారా లేదా ? అందుకే ఎవరెన్ని చెప్పినా కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్ గ్రంధాలు ఇప్పటికీ కొత్త తరాలకు ఆసక్తి కలిగిస్తూనే వున్నాయి. ఇక్కడొక ప్రశ్న తలెత్త వచ్చు. తమకు ముప్పు తెచ్చే పుస్తకాలను అమెజాన్ వంటి బహుళజాతి కార్పొరేషన్లు ఎందుకు విక్రయిస్తున్నాయి, గూగుల్ వంటి కంపెనీలు ఆ సాహిత్యాన్ని ఆన్లైన్లో ఎందుకు అనుమతిస్తున్నాయని ఎవరైనా అడగవచ్చు. మార్క్సు రైనిష్ జీటుంగ్ పత్రికలో నాటి రష్యన్ జారు ఒకటవ నికోలస్‌ను విమర్శిస్తూ వ్యాసం రాయటంతో ఆ పత్రికపై నిషేధం విధించాలని ప్రష్యన్ ప్రభుత్వాన్ని కోరగా ఆ పని చేశారు. కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్ తొలి ముద్రణలు పొందినపుడు వాటి వల్ల ముప్పు వస్తుందని నాటి పాలకవర్గాలు భావించలేదు కనుకనే ముద్రణ, విక్రయాలకు అనుమతిచ్చాయి, ఇప్పుడు ముప్పులేదని పైకి చెబుతున్న కారణంగా, దాని కంటే ఆ పుస్తకాలకు గిరాకీ వున్నందున వాటిపై కూడా లాభం సంపాదించేందుకు ఇప్పుడు అనుమతిస్తున్నారు. ఎంతకాలం అనుమతిస్తారో చూడాల్సిందే.
చైనా కంటే భారత్ ఎందుకు వెనుకబడింది అంటే అది నిరంకుశ దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని టక్కున సమాధానం చెబుతారు.అమెరికాతో పోలిస్తే 1917కు ముందు రష్యా కూడా నిరంకుశ జార్ పాలనలోనే మగ్గింది. మరి అదెందుకు వెనుకబడిపోయింది. ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని నేర్పినట్లు చెప్పుకొనే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని కలిగి వున్న బ్రిటన్ ఈ రోజు అమెరికా అనుచర దేశంగా ఎందుకు మారిపోయింది? నిరంకుశ దేశాలన్నీ చైనా మాదిరి అంతగాకపోయినా వాటి స్ధాయిలో అయినా ఎందుకు పురోగమించటం లేదు అంటే సరైన సమాధానం వుండదు. మన దేశం త్వరలో చైనాను అధిగమించనుంది అని చెబుతున్నారు. అంతకంటే కావాల్సిందేముంది? మన వారందరూ అమెరికా వెళ్లి ఆ దేశాన్ని ప్రధమ స్ధానంలో వుంచుతున్నారని మన చంద్రబాబు వంటి వారు చెబుతున్నారు. అందువలన అభివృద్దిలో చైనాతోయేం ఖర్మ అమెరికాతోనే పోటీ పడాలి. కానీ మనం ఎక్కడున్నాం, సర్దార్ పటేల్ విగ్రహాన్ని కూడా తయారు చేసుకోలేక చైనాకు ఆర్డర్ ఇచ్చాము. అదే నోటితో మేకిన్ ఇండియా అని పిలుపులు ఇస్తాము. మన ముందు ఏం మాట్లాడినా మన వెనుక ప్రపంచం నవ్వదా ?
చైనా విజయానికి కమ్యూనిస్టు పార్టీ ఎలా మార్గదర్శకత్వం వహించింది అనే పేరుతో అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అదేమీ మ్యూనిస్టు అనుకూల పత్రిక కాదు. సెబాస్టియన్ హెయిల్‌మాన్(51) అనే ఒక జర్మన్ బెర్లిన్‌లోని మెర్కాటర్ ఇసిస్టిట్యూట్ ఆఫ్ చైనీస్ స్టడీస్ సంస్ధ స్ధాపక అధ్యక్షుడు. ట్రయర్ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ప్రొఫెసర్.ఆయనతో ఇంటర్వూ చేసి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. హెయిల్ మన్ రాసిన చైనా రాజకీయ వ్యవస్ధ అనే అంగ్ల అనువాదాన్ని ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి నవీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు చైనాలో జరుగుతున్న మార్పులను పాఠకులకు అందించేందుకు దానిని ఆన్లైన్లో పెట్టారు. చైనా పురోభివృద్ధిలో చైనా కమ్యూనిస్టు పార్టీ పాత్ర గురించి ఆయనెంతో లోతుగా పరిశోధించారు. ఇది కమ్యూనిజం విజయం కాదా? మనమెంతో తెలివిగలవారమని, చైనీయులు నల్లమందు భాయీలని ఎద్దేవా చేసిన రోజులను మనం మరిచిపోయామా ? అలాంటి వారిని ఎంతో తెలివిగలవారిగా మార్చిందెవరు ? కమ్యూనిస్టులు కాదా ? ప్రజాస్వామ్య వ్యవస్ధ మనలను అలా ఎందుకు మార్చలేకపోయింది ?
మన దేశంలో అధికారంలో ఏ పార్టీ వున్నా తన కాడర్‌పై ఆధారపడటం అన్నది ఆత్మవంచన చేసుకొనేవారు తప్ప మిగిలిన వారందరూ అంగీకరిస్తున్న సత్యం. పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇచ్చి రాజకీయ నిరుద్యోగం పోగొట్టి వుపాధి కల్పించటం, ఆ పదవులను స్ధాయిని బట్టి పెద్ద ఎత్తున అక్రమంగా పోగేసుకోవటానికి వినియోగించటం తెలిసిందే. అది చైనాలో లేదా అంటే అక్కడా వుందని కమ్యూనిస్టుపార్టీయే స్వయంగా చెప్పి అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నది. ఎన్నో వేల మందిపై వేటు వేశారు. మన దేశంలో ఏ పార్టీ అయినా అవినీతికి పాల్పడిన వారిని ఒక్కరినంటే ఒక్కరిని తొలగించి, శిక్షించిన వుదంతం వుందా ? ఎందుకు లేదు? ప్రజాస్వామ్యం నుకనా ?
మన వంటి దేశాలలో విధాన నిర్ణయాలు, చట్టాలు చేసేది చట్టసభలు. వాటిని అమలు జరిపేది వుద్యోగ యంత్రాంగం. చైనాలో చట్టసభలు తమపని తాము చేస్తే వాటిని అమలు చేసే బాధ్యత పార్టీ కార్యకర్తలపై పెట్టటమే అక్కడి విజయ రహస్యం అన్నది హెయిల్‌మన్ అధ్యయన సారంశాలలో ఒకటి. వుదాహరణకు మన ప్రధాని నరేంద్రమోడీ సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్ అన్నట్లుగా నల్లధనం నుంచి అవినీతి, వుగ్రవాదం, పన్నుల ఎగవేత, నగదు రహిత లావాదేవీల వంటి అనేక చర్యలకు గాను ఒకే మాత్ర అన్నట్లుగా పెద్ద నోట్ల రద్దును ప్రకటించి అమలు చేశారు. ఆ సందర్భంగా బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులందరూ తమ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను పార్టీ నాయకత్వానికి అందచేయాలని ఆదేశించినట్లు మన ప్రజాస్వామిక మీడియాలో వార్తలు చదివాము. ఆ లెక్కల్లో ఎలాంటి అక్రమాలు లేవని అయినా ప్రకటించాలి కదా ? అసలు దాని గురించి ఎందుకు మాట్లాడరు ? అన్నింటికీ మించి రిజర్వుబ్యాంకు దగ్గరకు వచ్చిన రద్దయిన నోట్లెన్ని? ఎంత నల్లధనం బయటపడిందీ ఎందుకు ప్రకటించలేదు. ప్రజాస్వామిక వ్యవస్ధలలో ఇలాంటి వన్నీ రహస్యమా ?
చైనాలో కూడా బయటి నుంచి వచ్చిన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అవినీతి కూడా దిగుమతి అయి కొందరు అవినీతిపరులుగా మారారు. వారిపై అక్కడి అధ్యక్షుడు గ్జీ జింగ్ పింగ్ కూడా చర్యలు తీసుకున్నారు. రోజూ ఏదో ఒక మూల నుంచి అవినీతి పరులపై చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు చదువుతూనే వున్నాము కదా? మన దేశంలో అలాంటి వార్తలు ఎందుకు రావటం లేదు. చెన్నయ్‌లో కోట్ల కొలది కొత్త నోట్లు పోగేసిన బడా కాంట్రాక్టర్ వుదంతంలో ఎందరు బ్యాంకు వున్నతాధికారులపై చర్యతీసుకున్నారో ఎవరైనా ప్రకటించారా ?
చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎంతో పట్టువిడుపులతో చట్టాలు చేయబోయే ముందు అనేక అంశాలపై ప్రయోగాలు చేసిన తరువాతే చట్టాలు చేయటం కూడా విజయ రహస్యమని జర్మన్ ప్రొఫెసర్ అంటున్నారు. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అన్నది 1917కు ముందు తెలియదు. సోవియట్ ఒక ప్రయోగం. అక్కడ వచ్చిన ఫలితాలను అధ్యయనం చేసిన తరువాత చైనా తనదైన పంధాను ఎంచుకున్నది. భూ సంస్కరణల విషయంలో అది కనిపిస్తుంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి ఒక మూస అనేది వుండదని గ్రహించిన తరువాత చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్, తరువాత నేతలుగా వున్న వారు అనేక ప్రయోగాలకు తెరతీశారు. మంచి గాలికోసం కిటికీలు తెరిస్తే దాంతో పాటు ఈగలు, దోమలు కూడా ప్రవేశించవచ్చు, అయితే వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు అని డెంగ్ అన్నారంటే ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టటమే. దానికి తోడు సత్వర ఫలితాలు రావాలంటే ప్రయోగాలను కూడా వికేంద్రీకరించాలని భావించారు, అది అవినీతికి తెరతీసిందని గ్రహించిన తరువాత ప్రస్తుత అధ్యక్షుడు గ్జీ జింగ్ పింగ్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కేంద్ర స్ధానం నుంచి పధకాలకు రూపకల్పన చేస్తున్నారు. దీని ఫలితాలను చూసిన తరువాత మార్పులు చేర్పులు చేయటం అనివార్యం. చైనా విజయ రహస్యం ఇదే. సోషలిజం, కమ్యూనిజం వాటిని అమలు చేసే వ్యవస్ధల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఎదురుదెబ్బలు తిన్న పూర్వపు సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా దేశాల గురించిగానీ లేదా ప్రస్తుతం సోషలిస్టు వ్యవస్ధల నిర్మాణంలో నిమగ్నమైన చైనా, వియత్నాం, క్యూబా, లావోస్, కంపూచియా ప్రయోగాల గురించి తమ తమ దృక్కోణాల నుంచి అనేక మంది విశ్లేషణలు చేస్తున్నారు. వాటిని యథాతధంగా స్వీకరించటం లేదా తిరస్కరించటం గాకుండా అధ్యయనం చేయటం అవసరం. మావో మరణం తరువాత ఇంక చైనా పని అయిపోయినట్లే అని అనేక మంది వ్యాఖ్యానాలు చేశారు. తరువాత డెంగ్‌ను గురించి కూడా అదే విధంగా మాట్లాడారు. కానీ చైనా, వియత్నాం, క్యూబా వంటి దేశాలలో వున్న కమ్యూనిస్టు పార్టీలకు ఒక ప్రత్యేక చరిత్ర, అంకిత భావం గల కార్యకర్తల గురించి వారు విస్మరించారు. నాయకులు మరణించిన తరువాత కమ్యూనిజానికి భవిష్యత్ లేదని చెప్పటం వ్యతిరేకుల ప్రచారదాడిలో అస్త్రాలు తప్ప మరొకటి కాదని అనేక దేశాల అనుభవాలు నిరూపించాయి. రామాయణం గురించి చెప్పేవారు రాక్షసుడిగా చిత్రించినప్పటికీ రావణుడిని , మహాభారతంలో ధుర్యోధనుడిని, హిట్లర్‌ను పొగిడేవారు వాడి పీచమణిన స్టాలిన్ గురించి, గాడ్సేసు దేవుడిగా కొలిచే ‘జాతీయవాదులు’ మహాత్మాగాంధీని పక్కన పెట్టి ముందుకు పోలేరు. అలాగే ప్రఖ్యాత అమెరికన్ ఆర్ధికవేత్త రాబర్ట్ ఎల్ హెయిల్‌బ్రోనర్ ‘మార్క్స్ నుంచి మనం తప్పించుకోలేం’ అని చెప్పినట్లుగానే వర్తమానంలో అపూర్వ విజయాలు సాధించిన, సాధిస్తున్న చైనా గురించి అధ్యయనం చేయకుండా కమ్యూనిస్టు వ్యతిరేకులతో సహా ఎవరూ తప్పించుకోలేరు.
భూమి పొరలలో వుండి నిరంతరం తొలిచే లక్షణం గల చుంచెలుక మనం వూహించని చోట బయటకు వచ్చి కనిపిస్తుంది. అలాగే దోపిడీ శక్తులను వ్యతిరేకించే శక్తులు కూడా నిరంతరం పని చేస్తూనే వుంటాయి. అవి ఎక్కడ, ఎలా కనిపిస్తాయనేది ఎవరూ చెప్పజాలరు. రూపం మారవచ్చు తప్ప మౌలిక లక్షణం మారదు. కమ్యూనిస్టు మానిఫెస్టో కూడా అలాంటిదే. రెండు రెళ్లు నాలుగు అన్నది మారనట్లే దోపిడీ వున్నంత కాలం దానిని కొనసాగించేందుకు ఎవరెంతగా ప్రయత్నించినా, దానిని నాశనం చేసేందుకు పిలుపు ఇచ్చిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఏదో రూపంలో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే వుంటుంది. ఇదే కమ్యూనిస్టుల తర్కానికి మూలం, ముగింపు కూడా.
మన దేశంలో పాలకులు బయపడి వ్యతిరేకంగా కమ్యూనజానికి కాలం చెల్లిందని కారుకూతలు కూస్తూన్నారు. వారి నోర్లు మూతలు పడేరోజు వస్తాయి.
LikeLike