Tags

, , , , ,

Image result for yogi adityanath

ఎం కోటేశ్వరరావు


ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి, కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. వుద్రేకాలు, వుద్వేగాలు, అధికార రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి నిజాయితీగా ఆలోచించాల్సిన సమయమిది. ప్రజాస్వామ్యాన్ని వమ్ము చేయటంలో కాంగ్రెస్‌ కంటే తామేమీ వెనుకపడలేదని, తమకూ ఆ సత్తా వుందని బాల్యంలోనే బిజెపి నిరూపించుకుంది. ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే ఈ క్రీడలో మాకు మేమే సాటి, బస్తీమే సవాల్‌ అంటూ తొడగొడుతున్న బిజెపిని ప్రస్తుతానికి ఎవరేమీ చేయలేరనే వాతావరణం అంతటా ఆవరించి వుంది. కాంగ్రెస్‌ అప్రజాస్వామిక, నియంతృత్వ రూపం బయట పడటానికి దేశానికి 28 సంవత్సరాలు పట్టింది.(1975 అత్యవసర పరిస్ధితి) మీడియా ఎంతగా మూసిపెట్టాలని చూసినా బిజెపి గురించి తెలుసుకోవటానికి అంత వ్యవధి అవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమం అనే ఒక ప్రజాతంత్ర ప్రవాహం నుంచి వచ్చిన కాంగ్రెస్‌ నేతలు అందుకు విరుద్దమైన మారుమనసు పుచ్చుకోవటానికి మూడు దశాబ్దాలు పట్టింది. బిజెపి పూర్తిగా తన సంఖ్యాబలంపై ఆధారపడి అధికారానికి వచ్చిన మూడు సంవత్సరాలు కూడా పూర్తిగాక ముందే తానేమిటో బహిర్గతం చేయటం ప్రారంభించింది. పురాణాల ప్రకారం నరకుడనే రాక్షసుడు విష్ణుమూర్తి-భూదేవికి పుట్టినట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రారంభమే వివాదాస్పదం, భయానికి నాంది పలికింది. అందువలన ఇప్పుడు బిజెపికి మద్దతు ఇస్తున్నవారందరూ దాని గతాన్ని అంగీకరించి ఆ పని చేస్తున్నారని అనుకోలేము.నరకుడిని భరించలేని స్ధితిలో విష్ణువు మరో రూపంలో తల్లిచేతనే సంహరింపచేసిన దీపావళి కథ తెలిసిందే. చరిత్రలో ఇలాంటి పనులు చేసిన వ్యక్తులు, శక్తులు చివరికి ఏమయ్యాయో కూడా చూస్తూనే వున్నాం.

మన గొప్పతనం గురించి మాత్రమే కాదు, మన బలహీనతల గురించి కూడా వ్యాఖ్యానించే స్వేచ్చ మనకు వుండాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడు చోట్ల బిజెపి ఓడిపోయింది. రెండు చోట్ల గెలిచింది. నాలుగు చోట్ల మంత్రి వర్గాలను ఏర్పాటు చేసింది. ఇదెలా సాధ్యమైంది అని ప్రశ్నించేవారు లోకం పోకడ పట్టించుకోని, ఈ కాలానికి తగని వారు అనుకోవటం తప్ప మరొక విధంగా చెప్పలేం. అన్నయ్యా వాలిని, రావణుడిని రాముడు చంపా డాలేదా అని తప్ప ఎలా అన్నది ముఖ్యం కాదు అన్నట్లు, ప్రస్తుత పరిస్ధితుల్లో మనం ఆవు అంటే వీపులు పగులగొట్టే వారు సిద్ధంగా వున్నారు కనుక మరో విధంగా చెప్పుకుందాం. మన గేదె లేక బర్రె ఏ దొడ్లో కట్టింది అని కాదు మన దొడ్లో ఈనిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లు అనుకున్న విజయం సాధించారా లేదా ఎలా అన్నది ముఖ్యం కాదంటూ దానిని కీర్తించేవారే ఎక్కువగా వున్నారు. మన సమాజ బలహీనత ఇది.

2014లోక్‌సభ, 2017 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం యూపీలో 42.3 నుంచి 39.7కు, వుత్తరాఖండ్‌లో 55.3 నుంచి 46.5కు పడిపోయింది. వీటికోసం నానా గడ్డీ కరిచిన తరువాత వచ్చిన ఫలితమిది. దీన్ని మద్దతు పెరగటంగా చెప్పటమంటే జనాన్ని చెవిలో పూలు పెట్టుకున్నవారిగా జమకట్టటమే. ఈ రీతిలో పెరుగుతున్న ‘మద్దతుతో ‘ రెండు సంవత్సరాల తరువాత జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో మరోసారి మోడీ విజయం సాధించబోతున్నారనే ‘ప్రచారదాడికి ‘ నాంది పలికారు. మీడియాను ఆక్రమించిన కార్పొరేట్లు తమ లాభాలకు ఎవరు తోడ్పడతారో వారి ప్రచార కార్యకర్తలుగా మారటాన్ని చూశాము. అందువలన విజయగానాలకు కొదవేముంటుంది. ప్రతిపక్షం చీలికలు పేలికలు, జనం కులాలు, మతాలు, ప్రజావ్యతిరేకుల పట్ల వుపేక్ష వహిస్తే 2014 పునరావృతం కూడా కావచ్చేమో !

హిట్లర్‌ హయాంలో జన మెదళ్లను గందరగోళ పరచే ప్రచారదాడికి రూపకల్పన చేసిన గోబెల్స్‌ కనుక స్వర్గం లేదా నరకం నుంచో మన వేద లేద పురాణ కాల పుష్పక విమానమెక్కి మన దేశంలో దిగి చూస్తే తనకంటే ఎన్నో రెట్లు పెద్దవారిగా కనిపించే మీడియా గోబెల్స్‌ను చూసి ఇంత విపరీతమా అని సిగ్గుపడిపోతాడు. పెద్ద నోట్ల రద్దును జనం సమర్ధించారని చెప్పుకొనేందుకు రెండు రాష్ట్రాల ఫలితాను చూపుతున్నారు. గెలిచిన యూపిలో 60శాతం వ్యతిరేకంగా జనం ఓటు చేయటం సమర్ధించటమా? ఓడిపోయిన మూడు రాష్ట్రాల సంగతేమిటి? పోనీ గెలిచిన చోటయినా గతం కంటే ఓట్లెందుకు తగ్గాయి ? పెద్ద నోట్ల రద్దు వలన సాధించిందేమిటి ? అసలు ఎన్ని నోట్లు రిజర్వుబ్యాంకుకు తిరిగి వచ్చాయి? ఎన్నికలు ముగిసిన తరువాత కూడా దాని గురించి చెప్పరెందుకని, చన్నయ్‌ శేఖర రెడ్డి వంటి వారికి కొత్త రెండువేల నోట్ల రూపాయలకట్టలను నేరుగా అందించిన వున్నతాధికారులపై తీసుకున్న చర్యలేమిటి ? ఇలాంటి ప్రశ్నలన్నీ విజయగానాల ముందు వినిపించవు, మీడియాలో కనిపించవు.

నిప్పు, పట్టుకోవద్దు, కాలుతుంది అని చెబుతాం. ప్రశ్నించటం పిల్లల లక్షణం కనుక నీకెలా తెలుసు అని ఠకీమని అడగటం సహజం. వారితో పాటు వున్న వారు లేదు మీకు నిప్పంటే మొదటి నుంచి సదభిప్రాయం లేదు, అందుకే అలా చెబుతున్నారు అన్నారనుకోండి కాలేది పిల్లలకే, వారికి కాదు. డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వస్తే అమెరికాలోనే కాదు, ప్రపంచమంతటా అల్లకల్లోలం తలెత్తుతుంది అని అతగాడి గురించి తెలిసిన వారు చెప్పారు. అయినా సరే అమెరికా సామాన్యుల కంటే ఆంగ్లం బాగా చదివి, రాయగలిగిన అక్షరాస్యులైన ప్రవాస భారతీయులతో సహా అనేక మంది తన్మయత్వంతో ఓటేసి గెలిపించారు. ఇప్పుడు ఏం జరుగుతోందో చూస్తున్నాము. అక్కడి జాత్యహంకార దాడికి బలైన తెలుగువాడు కూచిభొట్ల శ్రీనివాస్‌ అంత్యక్రియలలో ట్రంప్‌ వ్యతిరేక నినాదాల హోరులో వేదమంత్రాలు వినిపించలేదన్న వార్తలు చదువుకున్నాం. అందువలన జనం ఎల్లకాలం ఒకేలా వుంటారని అనుకోనవసరం లేదు. ఏ కమ్యూనిస్టులు ప్రేరేపిస్తే అంత్యక్రియలలో ట్రంప్‌ వ్యతిరేక నినాదాలు చేసినట్లు ? ఎవరి కాళ్ల కిందకు నీరు వస్తే గాని వారికి తెలియదు.

కనుక కేంద్రంలోని బిజెపి తన అధికారాన్ని మరింతగా విస్తరించుకోవటానికి గోవా, మణిపూర్‌ వంటి చోట్ల అప్రజాస్వామిక పద్దతులకు పాల్పడి ప్రజాతీర్పును వమ్ము చేసినా, గతం కంటే తక్కువ ఓట్లు తెచ్చుకొని తమ విధానాలకు మద్దతు పెరిగిందని పెద్ద నోళ్లు వేసుకొని అరిచినా, నోరు తెరిస్తే మతోన్మాదం, పరమత విద్వేషం, హంతక భాష తప్ప మరొకటి పలకటం రాని ‘యోగి ‘ ఆదిత్యనాథ్‌ను వుత్తర ప్రదేశ్‌ పీఠంపై కూర్చో బెట్టినా ముందే చెప్పినట్లు చరిత్ర తనపని తాను చేస్తుంది. విదేశీ దండయాత్రలను, ఆక్రమణను సమైక్యంగా అడ్డుకోలేకపోయిన కారణంగా మన దేశం అనుభవిస్తున్న పర్యవసానాలను చూస్తున్నాము. విదేశీయులు సోమనాధ దేవాలయాన్ని కొల్లగొట్టి దానిని నాశనం చేయటం తప్పని చెబుతున్న స్వదేశీయులు ఆయోధ్యలో బాబరీ మసీదును కూల్చివేయటాన్ని ఏమనాలి? చరిత్రనుంచి మనం ఏ పాఠాలు నేర్చుకున్నట్లు ?

మనం చరిత్రలో, పురాణాలు, ఇతిహాసాలలో అనేక మంది యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినుల గురించి చదివాం. కొంత మంది దృష్టిలో హిందూత్వను పునరుద్దరించే కారణ జన్ములుగా స్ధానం వున్న ఇలాంటి యోగులు ఎవరి వారసులో, ఎలా పుట్టుకు వచ్చారో, వారిని సమర్ధించేవారు అడ్డగోలుగా కాకుండా ఆధారాలతో చెప్పాలి. కులాల పరిభాషలో చెప్పాలంటే వెనుకబడిన తరగతుల మంత్రం జపించే బిజెపి ఒక వేళ ఒక యోగినే ఎంచుకోదలచుకుంటే క్షత్రియడు తప్ప వివాదాస్పదం కాని వెనుకబడిన తరగతుల యోగి దొరకలేదా ?

యోగి ఆదిత్యనాధ్‌ గురించి లోకానికి తెలిసిందానితో పాటు తానేమిటో తనపై వున్న నేరపూర్తి కేసులేమిటో పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్‌ పత్రాలలోనే స్వయంగా రాసుకున్నారు. మత రాజ్యాలుగా ప్రకటించుకున్న పాకిస్తాన్‌ వంటి దేశాల గురించి విమర్శలు తెలిసిందే. మరి వుత్తర ప్రదేశ్‌ సంగతేమిటి ? హిందూ మతానికి చెందిన గోరఖనాధ్‌ మఠాధిపతి అయిన ఆదిత్యనాధ్‌ దాన్ని వదులుకోకుండానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. దీన్నేమనాలి ? మత రాజ్యం గాక పోతే మత రాష్ట్రం. ఒక చోట అధికారికంగా మతాన్ని రుద్దుతారు మరోచోట అనధికారికంగా అదే పని చేస్తారు. ఇలాంటి విపరీత పరిస్ధితిని మన లౌకిక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ వూహించి వుండరు.

యుపి ముఖ్యమంత్రిగా వివాదాస్పద యోగిని ఎంపిక చేయటాన్ని సమర్ధించుకోవటానికి బిజెపికి అడ్డగోలు వాదనలు తప్ప తర్కానికి నిలిచే మాటలు చెప్పటం లేదు. రాజ్యాంగం ప్రకారం మెజారిటీ వచ్చిన పార్టీ తమ నేతగా ఎవరిని నియమించుకోవాలన్నది ఆ పార్టీ ఇష్టం, ఒక ఎత్తుగడగానే ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించలేదు ఇలాంటి సారం లేని వాదనలు తప్ప తమ యోగికి వున్న అర్హతల సమర్ధించుకొంటూ మాట్లాడకపోవటం దాని బలహీనతను సూచిస్తోంది. ఎవరిని ఎంచుకోవాలన్నది మీ ఇష్టమైతే ముఖ్యమంత్రి ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తారు కనుక ఆ ఎంపికపై విమర్శలు చేసే అధికారం ప్రతిపక్షాలకు, ప్రజలందరికీ వుంటుంది. చెప్పుకొనేందుకేమీ లేకపోగా వివాదాస్పద నేపధ్యం వున్న కారణంగానే యోగికి ఒక అవకాశమిస్తే తప్పేమిటి, ఇటీవలి ఎన్నికలలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టలేదు కదా, ముఖ్యమంత్రి పాత్రలో ఎలా వుంటారో చూడకుండానే విమర్శలా అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరికొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రధాని నరేంద్రమోడీ తన మంత్ర దండంతో ఇలాంటి వారందరినీ అదుపులో వుంచుతాడు అంటూ భరోసా ఇస్తున్నారు. రంజాన్‌ సమయంలో పూర్తి విద్యుత్‌ ఇచ్చారు, దీపావళికి కోతలు విధించారంటూ స్వయంగా సదరు మోడీయే యుపీ గల్లీలలో రెచ్చగొట్టే ప్రచారం చేసి ఓట్లడుక్కున్న దిగజారుడు తనం దాస్తే దాగుతుందా ? తానే మత భావనలను రెచ్చగొట్టే భాష మాట్లాడకుండా తమాయించుకోలేని వ్యక్తి ఆదిత్యనాధ్‌ వంటి యోగులను నియంత్రిస్తారంటే నమ్మటం ఎలా ? సదరు పెద్దమనిషి గత చరిత్ర చూస్తే బిజెపియే తన బాటలో నడవాలి తప్ప తాను నడవాల్సిన అవసరం లేదని చెప్పటమే కాదు, తన మత అజెండాను అమలు జరిపేందుకు ఒక సంస్ధనే ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ తేడా ఏమంటే మాంసం తినండి గానీ ఎముకలు మెడలో వేసుకొని తిరగవద్దని బిజెపి చెబితే మాంసమంటూ తింటున్న తరువాత ఎముకలు వేసుకు తిరిగితేనే కదా జనానికి మనమీద నమ్మకం కలిగేదన్నది యోగి తీరు.

ఆదిత్యనాథ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్లుగా తనపై వున్న హత్యాయత్నం, నేరపూరిత బెదిరింపులు, కొట్లాటలు, భిన్నమతాల జనం మధ్య శతృత్వాన్ని పెంచే నేరాలకు సంబంధించిన కేసులను ఎలా ఎత్తివేయించుకుంటారన్నది ఆసక్తికరం. ఎన్నికల సభలలో నోరు పారవేసుకున్నందుకు ఎన్నికల కమిషన్‌ ఆయన్ను మందలించింది. ప్రధాని నరేంద్రమోడీ అపరభక్తురాలైన జర్నలిస్టు తవ్లీన్‌ సింగ్‌ ‘బూతులు, దుర్భాషలు మాట్లాడే వున్మత్తుడని’ ఒక సందర్భంలో వర్ణించారు. రెండు సంవత్సరాల క్రితం లష్కరే తాయెబా స్ధాపకుడు హఫీస్‌ సయిద్‌కు సినీనటుడు షారూఖ్‌ ఖాన్‌కు తేడాలేదని యోగి సెలవిచ్చారు. ఆ మాటలు సరికాదని, తమ పార్టీ లేదా ప్రధాని నరేంద్రమోడీ మూల విశ్వాసాలకు అవి ప్రతిబింబాలు కాదని బిజెపి అధికార ప్రతినిధి నలిన్‌ కోహ్లీ స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిని దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రిని చేశారు. ఒక యోగిగా ఏం చేశాడన్నది పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా ఏం చేస్తారో చూసేందుకు ఒక అవకాశం ఇచ్చి చూడండంటూ వంది మాగధులచేత మాట్లాడిస్తున్నారు. అదే సరైన ప్రాతిపదిక అయితే మాకూ ఒక అవకాశమిచ్చి చూడండి అని అసదుద్దీన్‌ ఒవైసీ పార్టీ మజ్లిస్‌ కూడా ఓటర్లను అడుగుతోంది. ఒకరు గాడ్సే భావజాలానికి, కార్యాచరణకు, మరొకరు రజాకార్ల భావజాలం, కార్యాచరణకు వారసులన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందువలన అవకాశమివ్వాల్సిన ‘అర్హతల’లో ఎవరు ఎవరికీ తీసిపోరు ! అవకాశం ఇచ్చి చూడాలనటం గురించి ఒక విశ్లేషకుడు పాఠకులకు ఒక ప్రశ్న వేశారు. పోటీగా వున్న ఒక స్కూలును తగులబెట్టి రమ్మని మీ పిల్లలు చదివే స్కూలు హెడ్మాస్టర్‌ ఒక పని అప్పగించారనుకోండి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు ఒక అవకాశం ఇచ్చి, వారి పనితీరు ఎలా వుంటుందో చూద్దామని అనుకుంటారా లేక ఆందోళన వ్యక్తం చేస్తారా ? అన్నదే ఆప్రశ్న.

ఐదుసార్లు ఎంపీగా గెలిచాడు, మీకు ఇష్టం లేకపోతే ఆరునెలల్లో అసెంబ్లీకి పోటీ చేయాలి గనుక అప్పుడు ఓడించండి అంటూ ఒక వుచిత సలహా. ఆ మాత్రం తెలియని అమాయకత్వంతో యోగిని విమర్శించే వారు వున్నారనుకుంటున్నారా ?

రాహుల్‌ గాంధీ కూడా మూడుసార్లు వరుసగా ఎన్నికైనప్పటికీ ఆయనకు పార్టీ నడిపే అర్హత లేదని బిజెపి విమర్శిస్తుంది. ఎన్నిక కావటమే అర్హత అయితే వుత్తర ప్రదేశ్‌లో ఆదిత్యనాధ్‌ కంటే పేరు మోసినవారు ఎందరో వున్నారు, వారికి ముందు అవకాశం ఇవ్వాలి. అక్కడ ఎన్నికైన ప్రతి నాలుగో ఎంఎల్‌ఏ మీద అత్యాచారం, హత్యల వంటి తీవ్ర నేరాల కేసులు వున్నాయి. కొత్త అసెంబ్లీకి నూట మూడు మంది ఎన్నికైనందున రొటేషన్‌ పద్దతులలో వారందరికీ ఒక్కో ఏడాది పాటు మంత్రి పదవుల అవకాశాలు ఇచ్చి కొత్త పాత్రను వారెలా పోషిస్తారో చూడాలి. బిజెపికి మాత్రమే అలాంటి అవకాశం అంటే ఆపార్టీలో వున్న 82 మందికి రెండున్నర సంవత్సరాల చొప్పున అవకాశం ఇవ్వాలి మరి. ముక్తార్‌ అన్సారీ అనే పేరుమోసిన కేసులున్న పెద్దమనిషి అదే యూపీలో తాజా ఎన్నికలతో సహా 1996 నుంచి ఆదిత్యనాధ్‌తో పాటు వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికౌతూనే వున్నాడు.అదీ నాలుగుసార్లు జైల్లో వుండే గెలిచాడు. మరో పెద్ద మనిషి వున్నాడు రాజా భయ్యాగా పేరుమోసిన రఘురాజ్‌ ప్రతాప్‌ సింగ్‌. మాజీ రాజకుటుంబానికి చెందిన ఆ పెద్దమనిషిపై కేసులు తక్కువేమీ లేవు.ఆదిత్యనాధ్‌ కంటే ముందునుంచి అంటే 1993 నుంచి వరుసగా ఎన్నికవుతూనే వున్నాడు.కేరళలో కెఎం మణి ఏకంగా 13 సార్లు వరుసగా ఎన్నికయ్యాడు. అందువలన ఈ రోజుల్లో ఐదుసార్లు ఎన్నికయ్యాడు కనుక సచ్చీలుడు అంటే కుదరదు. బిజెపి తరఫున తాజాగా ఎన్నికైన వారిలో నేరస్ధ నేపధ్యం వున్న ఇద్దరు మహిళలు కూడా ఎన్నికైన ఘనత ఆపార్టీ ఖాతాలో వుంది. అందులో ఒకరు ఇటీవల కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి బిజెపిలో చేరి గెలిచిన ఒక డాక్టర్‌ కూడా వున్నారు.

మా యోగి రాహుల్‌ గాంధీ మాదిరి కుటుంబ నేపధ్యం నుంచి రాలేదు అన్నది మరొక ముక్తాయింపు. నిజమే గోరఖ్‌ పూర్‌ మఠం ఒక మతానికి చెందినది. దాని అధిపతిగా వున్న మహంత్‌ అవైద్యనాధ్‌ మతాధికారిగా వుంటూనే రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన స్ధానంలో మతబాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాధ్‌ అదే మత పూర్వరంగంలో ఐదుసార్లు ఎన్నికయ్యారు. ఒకరికి కుటుంబం, మరొకరికి మత వారసత్వం ! తేడా ఏముంది? వారసత్వ పరంపరను కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీ నలుపు మాత్రం బిజెపికి కనపడదు. నరేంద్రమోడీ ఒక ఎత్తుగడగా తన మత అజెండాను పక్కన పెట్టి గత ఎన్నికలలో అభివృద్ధి మంత్రం జపించారు. కానీ ఆదిత్యనాధ్‌ రికార్డులో నేరపూరిత, మతోన్మాదం తప్ప అభివృద్ధి జాడలు లేవు. తాజా ఎన్నికలలో అలాంటి ప్రసంగాలు, ప్రచారం చేసిన దాఖలాలు లేవు. అసలు ఆయనొక ప్రధాన ప్రచారకుడిగా కూడా లేరు. గతంలో ఆయన ప్రసంగాలన్నీ ముస్లింల చుట్టూ తిరిగాయి తప్ప అభివృద్ధి కాదు. చివరిగా ఒక ముక్క చెప్పాలి. ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ తనదైన శైలిలో ఆదిత్యనాధ్‌ను సమర్ధించారు. దొంగకు తాళాలిస్తే సొత్తుకు హామీ వుంటుందన్నట్లుగా ఒక తరగతిలో చెడు ప్రవర్తన కలిగిన పిల్లవాడిని తరగతి పర్యవేక్షకుడిగా చేస్తే మంచిగా ప్రవర్తించే మాదిరి యుపి ముఖ్య మంత్రిగా ఆదిత్యనాధ్‌ వ్యవహరిస్తారు అని కితాబునిస్తూ భగత్‌ ట్వీట్‌ చేశాడు.