Tags

, , , , , , , , , ,

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

ఎంకెఆర్‌

యోగులైనా, భోగులైనా తమ తమ మఠాలు, మందిరాలకు పరిమితమైనంత వరకే వారి చర్యలు ప్రయివేటు వ్యవహారాలు. గీత దాటి బహిరంగ జీవితంలోకి వస్తే వారి చర్యల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకైనా సభ్య సమాజానికి హక్కు, అవకాశం వుంటుంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న, తలెత్తుతున్న చర్చలు, అభిప్రాయాలపై కొన్ని శక్తులు తమ అసహనాన్ని వెళ్ల గక్కుతున్నాయి. వాటిపై ప్రతి వ్యాఖ్య, విమర్శ వేరు, అవి చేయలేక అసహనం వ్యక్తం చేయటం మరో తీరు. గతంలో ఎన్నో నీతులు, రీతులు బోధించిన బిజెపి ఇప్పుడు వాటిని తానే దిగమింగి వ్యవహరిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినవారిపై ఆ పార్టీ అనుచరగణం విరుచుకుపడిపోతున్నది. మిత్ర సూచనలు, హెచ్చరికలను కూడా ‘సహించ ‘టం లేదు. ఇది కచ్చితంగా భారతీయ సంస్కృతి కాదు.

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బిజెపి ఎంపిక చేసిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్‌. అయోధ్యలో బాబరీ మసీదును కూలదోసి దాని స్ధానంలో రామమందిరం కట్టాలన్న హిందూత్వ వాదుల నాయకత్వాన్ని చూసి వుత్తేజితుడై తన జీవితాన్ని రామమందిరం, హిందూత్వకోసం అంకితం చేయాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇష్టం, దానిలో భాగంగానే ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు, ఇతరనేరపూరిత చర్యలకు పాల్పడిన కారణంగా కేసులు నమోదు చేసినా వెనక్కు తగ్గలేదు. చట్టం ఇంకా తనపని తాను చేయలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హిందూత్వకు ప్రతీక, హిందూత్వను అమలు జరపటానికే బిజెపి, దాని మార్గదర్శ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంపిక చేసిందని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలపై యోగి అనుయాయులు భజరంగ భళీ-బలి అంటున్నారు. వారు ఆత్మవంచనకు పాల్పడుతున్నారని ఎవరైనా అంటే తప్పేముంది.

ప్రజాసేవకోసం చిన్నతనంలోనే దేశ సేవకు, బ్రిటీష్‌ వారిని ఎదిరించేందుకు అంకితమైన అల్లూరి, భగత్‌సింగ్‌, సుందరయ్య వంటి వారి గురించి ఎన్నో విన్నాం. సామాన్యజనం వారిని విప్లవకారులని పిలిచినందుకు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకున్నవారేమీ అభ్యంతర పెట్టలేదు, అసహనం వ్యక్తం చేయలేదు. వారి చర్యలతో తమకు ప్రమాదం అని భావించిన శక్తులు వాటికి ప్రాతినిధ్యం వహించిన నాటి ప్రభుత్వాలు వారిని సమాజంలో అశాంతిరేపేవారుగా చిత్రించి ఆరోపణలు చేయటాన్ని జనం అంగీకరించలేదు. అనేక మంది వారి బాటలో నడిచారు, ఇప్పటికీ నడుస్తున్నారు.

Image result for BJP, hippocracy, values cartoons

అలాగే ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించే వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి జైలు జీవితాన్ని తట్టుకోలేక అదే బ్రిటీష్‌ ప్రభుత్వానికి లొంగిపోయి లేఖలు రాసి తన రాణీగారీ భక్తిని ప్రదర్శించుకున్న విడి సావర్కర్‌ గురించి కూడా మనకు తెలుసు. ఆయనొక ఎత్తుగడలో భాగంగా ఆ లేఖలు రాశారని అందువలన ఆయన దేశభక్తుడే అన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ వారి వ్యాఖ్యానం. దాన్ని సమాజం అంగీకరించిన దాఖలాలు లేవు. కానీ ఆ తరువాత స్వాతంత్య్రపోరాటంలోకి దూకిన భగత్‌ సింగ్‌కు అలాంటి తెలివితేటలు, ఎత్తుగడలు లేవు, చిరునవ్వుతో ప్రాణాలు అర్పించటం తప్ప మరొకటి తెలియని అసలు సిసలు దేశ భక్తుడు. బ్రిటీష్‌ వారికి విధేయుడిగా వుంటానని లేఖ రాసిన సావర్కర్‌ ఆ తరువాత ఎక్కడా బ్రిటీష్‌ వ్యతిరేకపోరాటంలో కనపడరు. వారికి మరో రూపంలో సాయం చేసేందుకు హిందూత్వను ముందుకు తెచ్చారు. ఆయన రాసిన లేఖ బయటపడిన తరువాత కూడా సావర్కర్‌ను దేశభక్తుడిగా సమర్ధించేందుకు, భగత్‌ సింగ్‌ కంటే పెద్ద త్యాగధనుడిగా చిత్రించేందుకు, ఆయన ముందుకు తెచ్చిన హిందూత్వకు వారసులుగా చెప్పుకోవటానికి అనేక మందికి ఎలాంటి అభ్యంతరం వుండటం లేదు. అలాంటపుడు యోగి ఆదిత్యనాధ్‌ హిందూత్వవాది గురించి ఆయనను వ్యతిరేకించేవారు ఏమి అన్నప్పటికీ సరైన బాటలోనే నడుస్తున్నారని భావించే ఆయన అభిమానులు సంతోషంతో పులకించి పోవటానికి బదులు హిందూత్వ ప్రతినిధి అని వ్యాఖ్యానించిన వారిని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది. అలా చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారా ?

కాంగ్రెస్‌ తాను ప్రవచించిన ఆదర్శాలను ఎప్పుడో వదలి పెట్టింది. అందుకు తగిన ఫలితాలు అనుభవిస్తున్నది. దానికి భిన్నమైన పార్టీ అని కదా బిజెపి చెప్పుకున్నది. మాంసం దగ్గర మంచోడి సంగతి తెలుస్తుందన్నది ఒక సామెత. ఇప్పుడు బిజెపికి అది చక్కగా వర్తిస్తుంది. దాని నిజరూపం వామపక్ష శక్తులు, ప్రజాతంత్ర శక్తులలో కొంత భాగానికి ముందే తెలిసినా సామాన్య జనానికి అర్ధం కావటం ఇప్పుడే ప్రారంభమైంది. ఆ పార్టీ ఆత్మవంచన, పరవంచన గురించి మచ్చుకు రెండు అంశాలను చూద్దాం.

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

హాజ్‌యాత్రకు సబ్సిడీ లేదా రాయితీ ఇచ్చి ముస్లింలను సంతృప్తి పరచి ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ఇతర పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్ధలైన బిజెపి వంటివి ఎన్నో ఏళ్లుగా నానా యాగీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రాయితీని క్రమంగా తగ్గించి 2022 నాటికి పూర్తిగా రద్దు చేయాలని 2012లో సుప్రీం కోర్టు ఆదేశించింది. చిత్రం ఏమంటే మానస సరోవర యాత్ర చేసేందుకు హిందువులకు లక్ష రూపాయల వరకు ఇవ్వటానికి నిర్ణయించినట్లు యోగి ఆదిత్యనాధ్‌ ప్రకటించారు. ముస్లింలకు హాజ్‌ హౌస్‌లు నిర్మించినట్లుగానే మానస సరోవర్‌ యాత్రీకులకూ ఢిల్లీ సమీపంలో భవనాలు నిర్మించనున్నట్లు కూడా ప్రకటించారు. ఇదేమిటి? ఒక మత యాత్రకు అభ్యంతరం తెలిపిన వారు మరొక మత యాత్రకు సబ్సిడీలు ఇవ్వటం ప్రారంభించటాన్ని ఏమనాలి? మైనారిటీ మత సంతుష్టీకరణ మాత్రమే తప్పు మెజారిటీది ఒప్పు అంటారా ?

ఇక బీఫ్‌ గురించి చూద్దాం. రీడ్‌ ఇండియా రైట్‌ ( ఇండియా మితవాదులు చెప్పేది చదవండి) అని టాగ్‌లైన్‌ పెట్టుకున్న పత్రిక ‘స్వరాజ్య ‘. దాని సారధి ఆర్‌ జగన్నాథన్‌. అక్రమంగా వున్న కబేళాల మూసివేతకు యోగి ఆదిత్యనాథ్‌ తొందర పడితే జరిగే మంచికంటే నష్టమే ఎక్కువ అనే శీర్షికతో ఆయనొక విశ్లేషణ రాశారు. ఇంకేముంది ఆ పత్రికను చదివే మితవాదులు అతగాడొక కమ్యూనిస్టు అని, వుద్యోగం నుంచి తొలగించాలంటూ దాడికి దిగారు. ఎన్నికలలో మెజారిటీ సంపాదించటం వేరు ప్రభుత్వాలు అందరికోసం పని చేయాలి. యోగి తొలి చర్యలు చూస్తుంటే సబ్‌కాసాత్‌ సబ్‌కా ఏక్‌ ను సాధించే అవకాశమే లేదని, పెద్ద సంఖ్యలో మైనారీటీల మనసులను విరిచివేస్తాయని జగన్నాధన్‌ వ్యాఖ్యానించారు.గోవధనిషేధం అంటే ఆవు ఆర్ధిక విలువ పడిపోవటమేనని, దున్న లేక బర్రె మాంసానికి డిమాండ్‌ పెరుగుతున్న కారణంగా ఆవుల రాష్ట్రాలుగా వున్న ప్రాంతాలలో వాటి స్ధానంలో గేదెలు పెరుగుతున్నాయని,2007 లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం పశు సంపదలో గేదెలశాతం 34.6కాగా హర్యానాలో 79.3, పంజాబ్‌లో 74, వుత్తర ప్రదేశ్‌లో 55.8, ఆంధ్రప్రదేశ్‌లో 54.2, గుజరాత్‌లో 52.4, రాజస్తాన్‌లో 47.8, బీహార్‌లో 34.8శాతం వున్నాయి. గేదెల శాతం అతి తక్కువగా వున్న కేరళ 3.2, బెంగాల్‌ 3.8, ఈశాన్య రాష్ట్రాలలో 4.6శాతం కాగా అక్కడ గోవధ లేదా గొడ్డు మాంసం విక్రయాలపై నిషేధం లేదని జగన్నాధన్‌ పేర్కొన్నారు.అవు ప్రాంతాల హిందువులు తమ పార్టీకి ఓటు వేసిన చోట గేదెల కంటే తక్కువ ఆర్ధిక విలువ కారణంగా ఆవులను వదిలించుకుంటున్న విషయాన్ని యోగి ఆదిత్యనాధ్‌ గమనించవచ్చని ఈ నేపధ్యంలో పశువధ శాలలపై నిషేధం గురించి పునరాలోచించాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించారు. ఆవు మరియు దున్న-గేదె మాంసానికి తేడాను సులభంగా తెలుసుకోలేని స్ధితిలో అత్యధిక నిఘా బృందాలు వున్న కారణంగా యోగి ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారని ముగించారు.

దేశం నుంచి జరుగుతున్న దున్న-గేదె మాంస ఎగుమతుల్లో సగం వుత్తర ప్రదేశ్‌ నుంచే వున్నాయి. అనధికార కబేళాల మూసివేత పేరుతో తీసుకుంటున్న చర్యల వలన జరిగే ఆర్ధిక, వుపాధి నష్టాలను పూడ్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు లేకుండా మొరటుగా ముందుకు పోయినట్లయితే జరిగే నష్టం ముస్లింలకే కాదు, వాటిపై ఆధారపడిన ఇతర వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దళితులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అనుమతి వున్న కబేళాల జోలికి తాను పోవటం లేదని, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు అనధికారికంగా నడుపుతున్నవాటి మీదే చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ సమర్ధనలు జగన్నాధన్‌ వంటి బిజెపి భక్తులకు తెలియకుండానే ఇలాంటి వ్యాఖ్యానం చేసి వుంటారని అనుకోగలమా ? ఎన్నికల తరువాత ఇలా మాట్లాడుతున్న జగన్నాధన్‌ వంటి వారు బీఫ్‌ లేదా గొడ్డు మాంసాన్ని వివాదాస్పదం చేసి ఓట్ల లబ్ది పొందేందుకు చూస్తున్నపుడు ఎందుకు మౌనంగా వున్నట్లు ?

అనధికార కబేళాలను ఎవరూ సమర్ధించరు, అదే సమయంలో వాటివలన జరిగే నష్టమూ లేదు. సదుద్ధేశ్యంతో వాటిని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకొని వుంటే అక్కడి మాంసం వ్యాపారులు సమ్మెకు దిగి వుండేవారు కాదు. బీఫ్‌ తినేవారు, తయారు చేసేవారు కేవలం ముస్లింలే కాదు ఇతరులు కూడా వున్నారని గ్రహిస్తే మంచిది. పురాణాల ప్రకారం ఆవులతో పాటు దున్నలు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినవే. యముడి వాహనం దున్న. ఆవు పవిత్రత దున్నలు-గేదెలకు లేదా?ఎందుకీ ఆత్మవంచన?

ఎన్నో నీతులు చెప్పే బిజెపి ఏటా ఎన్నో కుటుంబాలలో చిచ్చు రేపుతున్న, జేబులను గుల్ల చేస్తున్న జూదశాలలను నిషేధించాలని గతంలో డిమాండ్‌ చేసింది. జూదం మనదే కాదు, ఏ సభ్య సమాజ సంస్కృతీ కాదు. కానీ మన సంస్కృతిని పరిరక్షించే ఏకైక రక్షకురాలిని అని చెప్పుకొనే బిజెపి గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో వున్న గోవాలో అక్కడి జూదశాలలపై ఎలాంటి నిషేధం విధించలేదు. గోవా ఆర్ధిక వనరులను పెంచే పేరుతో గతంలో కాంగ్రెస్‌ పాలకులు జూదశాలలకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు గోవా గడ్డమీద, మాండవీ నది మీద కలిపి దాదాపు ఇరవై జూదశాలలున్నాయి. బిజెపి వాటిని కొనసాగించింది. ఈ ఐదు సంవత్సరాలలో గోవాలో ‘ఎంజాయ్‌’ చేసే వారి సంఖ్య పెరగటం తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారి భారతీయ సంస్కృతి పరిరక్షణ లక్ష్యం ఏమైనట్లు ? అక్కడ జరిగే పర్యావరణ హాని గురించి వారికి పట్టదు.గోవాలో అనధికారికంగా నడుస్తున్న జూదశాలల గురించి తెలిసినప్పటికీ వాటి గురించి పట్టించుకోలేదు.అదేమి చిత్రమో దేశమంతటా సంస్కృతి పరిరక్షణ పేరుతో ఏ పార్కులో ఏ ప్రేమికులున్నారో వెతికేందుకు, వారిపై దాడులు చేసేందుకు వివిధ సంస్ధల ముసుగులో వుత్సాహం చూపే ఆర్‌ఎస్‌ఎస్‌ ఖాకీ వాలాలు, గోవాలో మనకు ఎక్కడా కనపడరు.

అనధికారికంగా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్నవారందరూ అక్రమాలకు పాల్పడుతున్నవారిగా జమకడితే అంతకంటే అన్యాయం మరొకటి వుండదు. కానీ యోగి గారు అదే తన ప్రాధాన్యత అంటున్నారు. ఇదే సమయంలో అదే పార్టీకి చెందిన గోవా పాలకులు ఎన్నో కుటుంబాలను బలితీసుకొనే, ఎందరో మహిళల జీవితాలను అతలాకుతలం గావించే అక్కడి జూదశాలలను మాత్రం అరికట్టరు. మాదక ద్రవ్యాలకు, అత్యాచారాలు, హత్యలు, అన్ని రకాల వ్యభిచారాలకు నిలయం గోవా అన్నది జగమెరిగిన సత్యం. అందుకే దేశ విదేశాల నుంచి వీటన్నింటినీ అనుభవించటానికి( ఎంజాయ్‌ చేయటానికి) వచ్చే వారికి మాత్రం టూరిజం పేరుతో సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు.ఒకే పార్టీ ! ఎందుకీ ఆత్మవంచన?

Image result for goa bjp,casinos cartoons

అభివృద్ధి నినాదాన్ని నిత్యం పారాయణం చేస్తున్న బిజెపి, దాని మిత్రులైన చంద్రబాబు నాయుడి వంటి వారు టూరిజం అభివృద్ధి పేరుతో జూదశాలలకు తెరతీయటానికి ప్రయత్నిస్తున్నారు. సంస్కృతి పరిరక్షకులుగా ఫోజు పెడుతున్న మనువాదులు, నయా జాతీయ వాదులు, వారి మద్దతుదారులు జూదాన్ని ఎంత నాజూకుగా సమర్ధిస్తున్నారో ‘స్వరాజ్య’ పత్రికలో వెల్లడైన అభిప్రాయాలు చదివితే మతిపోతుంది. పశువధ నిషేధం ద్వారా యోగి ఆదిత్యనాధ్‌ చర్యలతో మంచికంటే చెడే ఎక్కువ వుంటుంది అని చెప్పిన జగన్నాధన్‌ను విమర్శించిన స్వరాజ్య పత్రిక పాఠకులు కొందరు గోవాలో జూదశాలల గురించి సమర్ధనకు పూనుకున్నారు. వేదాలలోనే జూదం గురించి వుందట. బలి ప్రతిపాద, లక్ష్మీపూజ అంటే ద్యూత క్రీడ అని టీకాతాత్పర్యాలు చెబుతున్నారు. బెట్టింగ్‌, నగదు అక్రమలావాదేవీలను అరికట్టాలంటే బ్రిటన్‌ మాదిరి జూదశాలలను అనుమతించాలని కొందరు, ఆదాయపన్ను కట్టేవారినే అలాంటి వాటిలో అనుమతించాలని మరికొందరు సూచించారు. కౌటిల్యుడు తన అర్ధశాస్త్రంలో వేశ్యావృత్తిని పూర్తిగా నిషేధించకుండా క్రమబద్దీకరించాలని మాత్రమే చెప్పాడని కొందరు సమర్ధించారు. ఎవరేమి చెప్పినా నీవు చేయాల్సిందాని గురించి తప్ప పర్యవసానాలపై నీ అదుపు వుండదని శ్రీకృష్ణుడు చెప్పారంటూ మద్దతు. ఇలాంటి వాదనలు దోపిడీదారులు లేదా దోపిడీ సమాజం వున్నదాన్ని వున్నట్లు వుంచాలని కోరుకొనే వారు చేసే వుద్ధేశ్యపూర్వక ప్రచారంలో భాగం లేదా వాటిని ఎందుకు అనే ప్రశ్న వేసుకోకుండా నమ్మి ప్రచారం చేసే వారు మరికొందరు. హానిలేని పశువధ శాలల మూసివేతకు వుత్తర ప్రదేశ్‌లో ఆతృపడుతున్న బిజెపి గోవాలో గత ఐదు సంవత్సరాలలో అధికారంలో వుండి, తాజాగా అడ్డదారిలో పాగావేసి జన జీవితాలను నాశనం చేసే జూదశాలల అనుమతుల రద్దుకు, అనుమతి లేని ఇతర అక్రమ చర్యల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోదు ? పశ్చిమ దేశాలు ఆత్మవంచన చేసుకుంటున్నాయని విమర్శించే బిజెపి తన కింది నలుపును చూసుకుంటుందా ? జనాన్ని మభ్యపెట్టటం మానుకుంటుందా?