Tags

, , ,

Image result for lenín moreno ecuador

నిల్చున్న వ్యక్తి రాఫెల్‌ కొరెయా,  కూర్చున్నది లెనిన్‌ మొరేనో

ఎంకెఆర్‌

లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులకు ఎదురు దెబ్బలు తగులుతూ మితవాదశక్తులు చెలరేగిపోతున్న తరుణంలో వాటికి అడ్డుకట్ట వేసి ఈక్వెడార్‌లో వామపక్ష శక్తులు విజయం సాధించాయి. ఆదివారం నాడు జరిగిన తుది విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధి లెనిన్‌ మొరేనో సాధించిన విజయం ప్రపంచ అభ్యుదయ శక్తులన్నింటికీ కొత్త శక్తి నిస్తుంది. పోలైన ఓట్లలో 99.65శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయనకు 51.16శాతం, ప్రత్యర్ధి గులెర్మో లాసోకు 48.84శాతం వచ్చినట్లు తెలిపిన ఎన్నికల అధికారులు లెనిన్‌ విజయసాధించినట్లు ప్రకటించారు. తాను విజయం సాధించనున్నట్లు మూడు ఎగ్జిట్స్‌ పోల్స్‌లో ప్రకటించారని, తీరా అందుకు భిన్నంగా ఫలితాలు వుండటం అంటే ఎన్నికలలో అక్రమాలు జరగటమే అంటూ తానే అసలైన విజేతనని లాసో ప్రకటించుకోవటమే గాక ఎన్నికల అక్రమాలకు నిరసన తెలపాలని మద్దతుదార్లకు పిలుపు ఇచ్చాడు. న్యాయమూర్తులు కూడా అక్రమాలలో భాగస్వాములయ్యారని ఆరోపిస్తూ తిరిగి ఓట్ల లెక్కింపు జరపాలని డిమాండ్‌ చేశాడు. ఎన్నికలను పర్యవేక్షించిన అమెరికా రాజ్యాల సంస్ధ ప్రతినిధులు తాము తనిఖీ చేసిన 480చోట్ల పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు ఎక్కడా తేడా బయటపడలేదని, అందువలన లాసో చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని ప్రకటించారు. లాసో మద్దతుదార్లు పలుచోట్ల ప్రదర్శనలకు దిగి హింసాకాండకు పాల్పడ్డారు.

Image result for lenín moreno victory marches

ప్రతిపక్ష అభ్యర్ధి చర్య జనాన్ని రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు చేసిన కుట్ర అని ప్రస్తుత అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా విమర్శించారు. బ్యాలట్‌ ద్వారా సాధించలేని దానిని హింసాకాండద్వారా పొందాలని చూస్తున్నారని దేశ ప్రజలను హెచ్చరించారు. ఫిబ్రవరి19న జరిగిన ఎన్నికల ఫలితాలపై సెడాటోస్‌ అనే ఎన్నికల జోశ్యుడు చెప్పిన అంశాలకు అనుగుణంగానే ఫలితాలు వచ్చాయి. విజయం సాధించేందుకు ఎవరికీ అవసరమైన మెజారిటీ రాకపోవటంతో తొలి రెండు స్ధానాలలో వచ్చిన వారు తుది విడత పోటీ పడ్డారు. ఈ పోటీలో ప్రతిపక్ష లాసో ఆరుశాతం మెజారిటీతో విజయం సాధిస్తారని అదే జోశ్యుడు చెప్పాడు. అయితే అందుకు భిన్నంగా ఫలితం వచ్చింది. ప్రతిపక్ష అభ్యర్ధి ఓటమిని అంగీకరించకుండా, అక్రమాలు జరిగాయని, తానే విజయం సాధించానని ప్రకటించి ఆందోళనకు రెచ్చగొట్టిన నేపధ్యంలో ఏర్పడిన గందరగోళానికి మంగళవారం నాడు ఎన్నికల కమిషన్‌ తెరదించింది. కమిషన్‌ అధ్యక్షుడు జువాన్‌ పాబ్లో పోజో అధికారికంగా టీవీలో ఒక ప్రకటన చేస్తూ ‘ఫలితాలకు తిరుగులేదు, అక్రమాల ఆనవాళ్లు లేవు, దేశం తమ అధ్యక్షుడిని స్వేచ్చగా ఎంపిక చేసుకుంది’ అని ప్రకటించారు.

Image result for lenín moreno victory marches

 

రాఫెల్‌ కొరెయా నాయకత్వంలోని వామపక్ష అలయన్స్‌ పాయిస్‌ పార్టీ రాజకీయ వారసుడిగా ఎన్నికైన లెనిన్‌ మొరేనో మేనెల 17న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఓట్ల లెక్కింపులో విజయం ఖరారు అయిన వెంటనే పాలకపార్టీ నేతలందరూ అధ్యక్ష భవనం నుంచి జనానికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా లెనిన్‌ హాపీ బర్తడే అంటూ శుభాకాంక్షలు తెలుపగా పదవీ విరమణ చేయనున్న అధ్యక్షుడు కొరెయా ఈనెల ఆరున జరుపుకోవాల్సిన తన 54వ పుట్టిన రోజును ముందే జరుపుకుంటూ మూడవ తేదీనే కేక్‌ కట్‌ చేశారు. పది సంవత్సరాల కొరెయా పాలన తరువాత మూడవ సారి కూడా వామపక్షం విజయం సాధించటానికి ఎంతో ప్రాధాన్యత వుంది. అర్జెంటీనా, బ్రెజిల్‌ దేశాలలో తలెత్తిన ఆర్ధిక సమస్యలను ఆసరా చేసుకొని అమెరికన్‌ సామ్రాజ్యవాదులు, లాటిన్‌ అమెరికా పెట్టుబడిదారులు, మితవాద, క్రైస్తవ మతవాద శక్తులు, అగ్రశ్రేణి మీడియా కుమ్మక్కుతో వామపక్ష శక్తులు అధికారానికి దూరమయ్యాయి.ఈ నేపథ్యంలో తదుపరి వంతు ఈక్వెడోర్‌ అని వామపక్ష వ్యతిరేక శక్తులు సంబరపడ్డాయి. తొలి విడత ఓటింగ్‌లో కూడా అదే ధోరణి వ్యక్తమైంది.ఫిబ్రవరి 19న అధ్యక్ష ఎన్నికతో పాటు జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో 137 స్థానాలకు గాను వామపక్ష పార్టీ 74 సంపాదించి మెజారిటీ తెచ్చుకుంది. గతం కంటే 26 స్ధానాలు తగ్గాయి. ప్రతిపక్షంలోని ఏడు పార్టీలకు కలిపి 60, స్వతంత్రులకు మూడు స్ధానాలు వచ్చాయి. ఈ ఎన్నికలలో ఎవరికీ ఓటు వేయకుండా ఖాళీ బ్యాలట్‌ పత్రాలను వేసిన వారు 22.1శాతం మంది వున్నారు.

లాటిన్‌ అమెరికాను తమ నయా వుదారవాద విధానాల ప్రయోగశాలగా చేసుకున్న పెట్టుబడిదారీ వర్గం ఆఖండంలోని దేశాల ఆర్ధిక వ్యవస్ధలను వస్తు ఎగుమతి ఆధారితంగా మార్చివేశాయి. కార్మికవర్గ సంక్షేమ చర్యలకు మంగళం పాడటంతో పాటు, రుణవూబిలో ముంచివేశాయి. జనం నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను అణచివేయటానికి సైనిక నియంతలను లేదా వారితో కుమ్మక్కైన మితవాద శక్తులను గద్దెలపై ప్రతిష్ఠించాయి. వారిని భరించలేక జనంలో తిరుగుబాట్లు తలెత్తటంతో వారిని పక్కన పెట్టి తమ అడుగుజాడల్లో నడిచే శక్తులను రంగంలోకి తెచ్చాయి. ఎన్నికలకు కాస్త వెసులుబాటు కల్పించిన పూర్వరంగంలో నయావుదారవాద విధానాలను వ్యతిరేకించే శక్తులు, వామపక్షాలు అనేక చోట్ల అధికారానికి వచ్చి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయి. జనానికి తక్షణం వుపశమనం కలిగించే చర్యలు చేపట్టటంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాయి. అందుకే జనం గత పదిహేను సంవత్సరాలలో వరుసగా అనేక చోట్ల ఆశక్తులకు పట్టం గట్టారు. తమకు రాగల ముప్పును పసిగట్టిన సామ్రాజ్యవాదులు, బహుళజాతి గుత్త సంస్ధలు ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక కుట్రలు చేశాయి. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలలో 2008 నుంచి కొనసాగుతున్న తీవ్ర ఆర్ధిక మాంద్యం, సంక్షోభాల ప్రభావం వామపక్షాలు అధికారంలో వున్న లాటిన్‌ అమెరికా దేశాలపై కూడా పడటంతో ఆ ప్రభుత్వాలకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. పర్యవసానంగా జనంలోని కొన్ని తరగతులలో వాటిపై అసంతృప్తి మొదలైంది. ఈ తరుణంలో మీడియా ప్రచార ఆయుధాలతో మితవాద శక్తులు విజృంభించి జనంలో అయోమయం, వామపక్ష వ్యతిరేకతను రెచ్చగొట్టటం, అప్పటికే వున్న మితవాద శక్తులను మరింత సంఘటిత పరచటం వంటి చర్యలకు పూనుకున్నాయి. మరోవైపు ఆర్ధిక రంగంలో ప్రపంచ మార్కెట్లో పెట్రోలియంతో సహా వస్తువుల ధరలు పతనం కావటంతో ఎగుమతి ఆధారిత వ్యవస్ధలుగా వున్న దేశాలలో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. వీటికి ఇతర కారణాలు కూడా తోడు కావటంతో సామ్రాజ్యవాద, మితవాద శక్తుల కుట్రలు ఫలించి అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి చోట్ల వామపక్ష శక్తులకు ఎదురుదెబ్బలు తగిలాయి. దానికి భిన్నంగా ఫలితం రావటమే ఈక్వెడోర్‌ ఎన్నికల ప్రత్యేకత.

Photo by: Reuters

2007లో అధికారానికి వచ్చిన రాఫెల్‌ కొరెయా అంతకు ముందు ప్రభుత్వాలు చేసిన అప్పులను తాము తీర్చాల్సిన అవసరం లేదంటూ మూడువందల కోట్ల డాలర్లను చెల్లించేది లేదని ప్రకటించారు. అయితే అప్పులిచ్చిన వారు అంతర్జాతీయ కోర్టులకు ఎక్కారు. అప్పులలో 60శాతం మేరకు రద్దు కావటంలో కొరెయా ప్రభుత్వం విజయం సాధించింది.దాంతో సంక్షేమ కార్యక్రమాల అమలుకు వీలు కలిగింది. 2006-16 మధ్య కాలంలో దారిద్య్ర రేఖకు దిగువన వున్నవారి సంఖ్య తగ్గింపు చర్యల కారణంగా 36.7 నుంచి 22.5శాతానికి తగ్గిపోయింది. కనీస వేతనాల పెంపుతో పాటు ఇతర జీవన ప్రమాణాల మెరుగుదలకు చర్యలు తీసుకున్నారు. అంతకు ముందు రెండదశాబ్దాల కాలంలో తలసరి జిడిపి పెరుగుదల రేటు 0.6శాతం కాగా కొరెయా పదేళ్ల కాలంలో అది 1.5శాతానికి పెరిగింది. అసమానతలను సూచించే జినీ సూచిక 0.55 నుంచి 0.47కు తగ్గింది. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ అధ్యయనం ప్రకారం అవినీతి కూడా తగ్గింది. ఇదే సమయంలో చమురు, వస్తువుల ధరలు పతనం కావటంతో ఎగుమతుల ఆదాయం తగ్గిపోయింది. భూకంప బాధితులను ఆదుకొనేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావటం వంటి కారణాలతో 2014 నుంచి ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర వడిదుడుకులకు లోనైంది.వృద్ధి రేటు పడిపోయింది. మాంద్య పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వ ఖర్చు కూడా తగ్గిపోయింది. అనేక పరిశ్రమలు, వ్యాపారాలలో కార్మికులు వుద్వాసనకు గురయ్యారు. పర్యవసానంగా జనంలోని కొన్ని తరగతుల్లో అసంతృప్తి మొదలైంది. దీనిని గోరంతను కొండంతగా చిత్రించటంలో మీడియా ప్రారంభం నుంచి ప్రచారదాడి జరిపింది.

ఈ పూర్వరంగంలో ఫిబ్రవరిలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో అధికార వామపక్ష నేత లెనిన్‌ మొరేనోకు రాజ్యాంగం ప్రకారం రావాల్సిన 40కిగాను 39శాతమే వచ్చాయి. మిగతా వారికి 28,16 చొప్పున వచ్చాయి. దాంతో తొలి ఇద్దరి మధ్య ఎన్నిక ఈనెల రెండున జరిగింది. పదహారుశాతం వచ్చిన మితవాద క్రైస్తవ పార్టీతో సహా వామపక్ష వ్యతిరేకులందరూ పాలకపార్టీకి వ్యతిరేకంగా నిలిచిన మితవాది లాసోకు మద్దతు ప్రకటించారు. అరవై ఒక్కశాతం ఓట్లు అధికారపక్షానికి వ్యతిరేకంగా పడటంతో ప్రతిపక్ష నేత లాసో గెలుపు తధ్యమని ఎన్నికల పండితులు జోశ్యాలు చెప్పారు. అంతిమ ఎన్నికలలో అందుకు విరుద్దంగా పదకొండుశాతానికి పైగా ఓటర్లు వామపక్షం వైపు మొగ్గటం మితవాద శక్తులను కంగు తినిపించింది.

Image result for lenín moreno victory marches

నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లెనిన్‌ మొరేనో ఎలాంటి మచ్చలు లేని స్వచ్చమైన వామపక్ష కార్యకర్త, సార్ధక నామధేయుడిగా మారారు. ఈక్వెడోర్‌ అమెజాన్‌ ప్రాంతంలో మధ్యతరగతికి చెందిన సెర్వియో తులియో మొరేనో లెనిన్‌ రచనలతో ఎంతో ప్రేరణ పొందాడు. ఆ కారణంగానే 1953 మార్చి 19న జన్మించిన తన కుమారుడు బోల్టెయిర్‌ మొరేనో గ్రేసెస్‌కు ముందు లెనిన్‌ అని చేర్చాడు. తండ్రి ఆకాంక్షకు అనుగుణ్యంగానే లెనిన్‌ మొరేనో వామపక్ష భావజాలానికి ప్రతినిధిగా జీవించి ఇపుడు దేశాధ్యక్షుడయ్యాడు. ఇంతకు ముందు 2007-13 సంవత్సరాల మధ్య దేశ వుపాధ్యక్షుడిగా పని చేశారు. వికలాంగుల సంక్షేమానికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గాను ఎన్నో ప్రశంసలు పొందారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొంది వుత్తమ గ్రాడ్యుయేట్‌గా గౌరవం పొందిన లెనిన్‌ 1976లో ఒక శిక్షణా కేంద్ర డైరెక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించారు.1998 మార్చి మూడవ తేదీన ఒక దుకాణ పార్కింగ్‌లో వున్న సమయంలో వచ్చిన ఇద్దరు యువకులు ఆయనకు తుపాకి చూపి కారు, పర్సు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వెంటనే ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఆయన కారు తాళం చెవి, పర్సు వారికి ఇచ్చారు. వాటిని తీసుకొని వెళ్లిపోతూ వారిలో ఒకడు లెనిన్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడి పక్షవాతానికి గురయ్యాడు. దాని నుంచి కోలుకోవటం కష్టమని వైద్యులు నిర్ధారించారు. అయితే ధైర్యం కోల్పోకుండా చదివి నవ్వుల చికిత్స ద్వారా స్వస్ధత పొందవచ్చని తాను గతంలో చదివిన దానిని ఆచరణలో పెట్టి నాలుగు సంవత్సరాల తరువాత చక్రాల కుర్చీలో కూర్చొని రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే స్ధితికి చేరారు. అదే స్ధితిలో వుపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడై ఒక చరిత్రను సృష్టించారు. నడవలేని వ్యక్తి ఒక దేశాధ్యక్షుడు కావటం బహుశా ఇదే ప్రధమం కావచ్చు.

ప్రత్యర్ధి లాసో దేశం 1999లో ఎదుర్కొన్న బ్యాంకింగ్‌ సంక్షోభాన్ని సొమ్ము చేసుకొన్న ఒక బ్యాంకరు. రాజకీయాలకు దూరంగా వున్న ఆయనను మితవాదులు ఎన్నికలపుడు మాత్రమే రంగంలోకి తెచ్చారు. ఆ పెద్దమనిషి ఎన్నికైతే ఇప్పటి వరకు తమ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలు, కార్మికుల హక్కులకు పూర్తి భంగం కలుగుతుందని, కార్మికవర్గం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని అధ్యక్షుడు కొరెయా పెద్ద ఎత్తున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జనాన్ని కోరారు. దీనికి తోడు గత రెండు నెలల కాలంలో మితవాదుల ఆధ్వర్యాన వున్న అర్జెంటీనా, బ్రెజిల్‌ పాలకుల చర్యలకు నిరసనగా అంతకు ముందు వారికి మద్దతు ఇచ్చిన వారితో సహా కార్మికవర్గం పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంది. రెండోవైపు మితవాదులు అధికారంలో వున్న దేశాలన్నింటా ఇదే పరిస్థితి పునరావృతం కావటం తదితర కారణాలతో ఓటర్ల ఆలోచనలో మార్పు వచ్చింది. అంతకు ముందు వామపక్ష అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు చేసిన వారిలో పదకొండుశాతం మంది మనసు మార్చుకొని లెనిన్‌కు ఓటు వేయటంతో మితవాదుల యాత్రకు బ్రేక్‌ పడినట్లయింది.

అమెరికా ప్రభుత్వ, సిఐఏ ఇతర సంస్ధల కుట్రలు, కూహకాలు, బండారాలను బయటపెడుతూ ఇప్పటికీ మిలియన్ల కొలది పత్రాలను బయట పెడుతున్న వికీలీక్స్‌ స్ధాపకుడు, ఆస్ట్రేలియన్‌ అయిన జులియన్‌ అసాంజేను ఎదో ఒక పేరుతో శిక్షించాలని, అంతం చేయాలని చూస్తున్న అమెరికా ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ లండన్‌లోని తమ రాయబార కార్యాలయంలో 2012 నుంచి ఈక్వెడోర్‌ వామపక్ష ప్రభుత్వం ఆశ్రయం కల్పించి రక్షిస్తున్న విషయం తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే నెల రోజుల్లో అసాంజేను బయటికి పంపిస్తానని మితవాద అభ్యర్ధి లాసో ప్రకటించగా ఆశ్రయం కొనసాగిస్తానని లెనిన్‌ వాగ్దానం చేశారు. ఇప్పుడు లెనిన్‌ విజయంతో అసాంజేకు ముప్పు తప్పింది. ఫలితాలు స్పష్టమైన తరువాత అసాంజే ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ‘ పన్నుల స్వర్గాల(అక్రమంగా సంపదలు దాచుకొనే ప్రాంతాలు) లోని మిలియన్ల కొద్దీ దాచుకున్న సంపదలతో గానీ లేకుండా గానీ నెల రోజుల్లో లోపల ఈక్వెడోర్‌ వదలి వెళ్లాలని లాసోకు సవినయంగా మనవి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

అయితే ఈ విజయంతో ఈక్వెడోర్‌ వామపక్షం సంతృప్తి చెందితే అది ఎంతో కాలం నిలవదు.అధికారంలో వున్న లేదా తిరిగి అధికారానికి రావాలని ప్రయత్నిస్తున్న లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులందరి ముందు పెద్ద సవాలు వుంది. నయా వుదారవాద పునాదులను అలాగే వుంచి సంక్షేమ చర్యలు చేపట్టటం ఎల్లకాలం సాధ్యం కాదని అన్ని దేశాల అనుభవాలూ నిరూపించాయి. తమకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న సామ్రాజ్యవాద శక్తులను ఎదుర్కొనేందుకు లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులు సంఘటితం కావటానికి అధికారికంగా చేసిన కొన్ని ప్రయత్నాలు రాజకీయంగా చైతన్యవంతులైన జనాన్ని వుత్తేజితం చేస్తాయి తప్ప ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నవారిని సంతృప్తి పరచజాలవు. నయా వుదారవాద విధానాల నుంచి క్రమంగా దూరం జరుగుతూ ప్రజాహిత వైపు అడుగులు వేస్తూ అందుకు ఆటంకంగా వుంటూ ఆర్ధిక వ్యవస్ధను అదుపులో వుంచుకున్న శక్తులను, వారికి మద్దతుగా ప్రచారదాడి చేస్తున్న స్వప్రయోజన మీడియాను అదుపు చేయకుండా లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు ముందుకు పోజాలవని గత పదిహేను సంవత్సరాల అనుభవాలు విదితం చేస్తున్నాయి. బొలివర్‌ సోషలిజం, 21వ శతాబ్దపు సోషలిజం, ప్రజాస్వామిక సోషలిజం ఇలా ఏ పేరు పెట్టుకున్నప్పటికీ పెట్టుబడిదారీ వర్గ ఆర్ధిక పునాదులను కదిలించకుండా మరొక అడుగు ముందుకు వేయలేము అనే అంశాన్ని అవి గుర్తించకతప్పదు. ప్రపంచీకరణ పేరుతో సకల దేశాలను ఆక్రమించాలని చూసిన అగ్రగామి పెట్టుబడిదారీ వ్యవస్ధలన్నీ మరొక మారు స్వరక్షణ చర్యలకు పూనుకుంటున్న సమయమిది. ఇది పెట్టుబడిదారీ వ్యవస్ధలోని బలహీనతకు చిహ్నం. ఇలాంటి రక్షణ చర్యలు, మార్కెట్ల ఆక్రమణ క్రమంలోనే రెండు ప్రపంచ యుద్ధాలు సంభవించాయి. అందువలన వర్తమాన పరిస్ధితులలో మార్క్సిజం-లెనినిజాలను ఏ దేశానికి ఆదేశం తమ పరిస్థితులకు సక్రమంగా అన్వయించుకొని తదుపరి పోరాట మార్గం, రూపాలు,ఎత్తుగడలను నిర్ణయించుకోవాల్సి వుంది.