Tags

, , ,

View image on Twitter

ఎం కోటేశ్వరరావు

ఇటీవల దక్షిణాఫ్రికా పాలక కూటమిలో సంభవిస్తున్న పరిణామాలు రానున్న రోజులలో నూతన రాజకీయ సమీకరణలకు సూచనలా ? గత కొద్ది రోజులుగా వేగంగా మారుతున్న పరిణామాలు, అక్కడ జరుగుతున్న ఘటనలు ప్రపంచ అభ్యుదయశక్తులకు ఒకింత ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ పాలక కూటమిలో విబేధాలు తీవ్రం కావటాన్ని సూచిస్తున్నాయి. అవి ఎలా పరిణమించనున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. జాత్యహంకార పాలన అంతమై 23 సంవత్సరాల క్రితం ప్రజాస్వామిక పాలన ఏర్పడిన తరువాత పాలక ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఎన్‌ఎన్‌సి)లో భాగస్వాములైన దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీ(ఎస్‌ఏసిపి), దక్షిణాఫ్రికా కార్మిక సంఘాల సమాఖ్య(కొసాటు) మధ్య సంబంధాలలో తొలిసారిగా తీవ్ర పొరపొచ్చాలు తలెత్తాయి.

ఆర్ధిక మంత్రి ప్రవీన్‌ గోర్ధన్‌ను తొలగించిన దేశాధ్యక్షుడు జాకబ్‌ జుమా చర్యను కమ్యూనిస్టుపార్టీ వ్యతిరేకించటమేగాక, జుమా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. పదవీకాల ప్రారంభం నుంచి అనేక వివాదాలకు, ఆరోపణలకు, విమర్శలకు కారణమౌతున్న జుమా వ్యవహార శైలి ప్రస్తుత వివాదానికి తక్షణ కారణంగా కనిపిస్తున్నప్పటికీ కూటమిలో అంతర్గతంగా అంతకు మించిన తీవ్ర రాజకీయ, విధానపరమైన విబేధాలు వున్నట్లుగా కనిపిస్తోంది. అనేక వార్తా వ్యాఖ్యలను పరిశీలించినపుడు 2019లో జరగనున్న ఎన్నికలలో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు విడివిడిగా తలపడనున్నాయా అన్నంత వరకు ఆలోచనలు పోతున్నాయి.అదే జరిగితే దక్షిణాఫ్రికా రాజకీయ రంగంలో మరొక కొత్త అధ్యాయానికి నాంది అవుతుంది.

మార్చి 31న అధ్యక్షుడు జాకబ్‌ జుమా ఆర్ధిక మంత్రి ప్రవీన్‌ గోర్ధన్‌, వుప ఆర్ధిక మంత్రి మెకిబిసీ జోన్స్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయటమేగాక అనేక మంది శాఖలను మార్చారు.ఈ చర్యను కమ్యూనిస్టుపార్టీతో పాటు దేశ వుపాధ్యక్షుడు, ఎఎన్‌సి నాయకుడు సిరిల్‌ రాంఫొసా, కొసాటు, తదితర సంస్ధలు, ప్రముఖులు విమర్శించారు. దేశ ప్రయోజనాలరీత్యా జుమా రాజీనామా చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. గోర్దన్‌ను తొలిగించిన తరువాత దేశ రుణ స్థితిపై స్టాండర్డ్‌ అండ్‌పూర్‌ సంస్ధ రేటింగ్‌ను తగ్గించింది. అధ్యక్షుడిని అభిశంసించాలని , ఆమేరకు తాము తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్ష డెమాక్రటిక్‌ అలయన్స్‌ ప్రకటించింది. ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సభ్యులే అధ్యక్షుడిపై విశ్వాసం లేదని ప్రకటించే తీర్మానం గురించి ఆలోచించాలని కమ్యూనిస్టుపార్టీ సూచించింది. జుమాకు వ్యతిరేకంగా శుక్రవారం నాడు ప్రదర్శనలు చేయాలని అనేక సంస్ధలు పిలుపునిచ్చాయి. కొన్ని చోట్ల అనుమతి నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. కమ్యూనిస్టుపార్టీ శుక్రవారం నాటి ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణాఫ్రికాను రక్షించండి అంటూ ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించతలపెట్టిన ప్రదర్శనలను చట్టవిరుద్దమైనవిగా ప్రకటించాలని స్ధానిక అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన కారణంగానే అనుమతి నిరాకరించారని కమ్యూనిస్టుపార్టీ పేర్కొన్నది. అయితే కొన్ని చోట్ల స్ధానిక కోర్టులు ప్రదర్శనలకు అనుమతినిచ్చాయి.దీంతో తాను విడిగా జరపతలపెట్టిన ప్రదర్శనలను వాయిదా వేసుకున్న కమ్యూనిస్టుపార్టీ ఇతర సంస్దలు ఇచ్చిన పిలుపు మేరకు వాటిలో పాల్గొంటున్నట్లు ప్రకటించింది.

జాత్యహంకార వ్యవస్ధ వ్యతిరేక పోరాట యోథుడు అహమ్మద్‌ కత్రాడా స్మారక సభలో మాట్లాడిన కమ్యూనిస్టు నాయకులు దేశం కావాలో, గుప్తా కుటుంబంతో సంబంధాలున్న జాకబ్‌ జుమా కావాలో తేల్చుకోవాలని ఎఎన్‌సి నాయకత్వాన్ని బహిరంగంగా కోరారు.కమ్యూనిస్టుపార్టీ రెండవ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ సోలీ మాపిలా మాట్లాడుతూ ప్రవీన్‌ గోర్దన్‌ను పదవి నుంచి తొలగించటం పోరాడి సాధించుకున్న ప్రజాస్వామిక వ్యవస్ధల విజయాన్ని వమ్ము చేయటం తప్ప మరొకటి కాదన్నారు.

FILE: An SACP protest. Picture: Rahima Essop/EWN.

ఈనెల ఐదున కమ్యూనిస్టు పార్టీ విడుదల చేసిన ప్రకటనలోని అంశాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ‘ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నేషనల్‌ వర్కింగ్‌ కమిటీ ఈ రోజు మీడియా గోష్టిలో చెప్పిన అంశాలను కమ్యూనిస్టు పార్టీ పరిగణనలోకి తీసుకున్నది. అధ్యక్షుడు జుమా రాజీనామా చేసే సమయం ఆసన్నమైందని పార్టీ నిర్ణయం మేరకు అధికారికంగా మొదట ఎఎన్‌సికి తెలియ చేసింది.పార్టీ నిర్ణయాన్ని బహిర్గతం చేయటానికి ముందే ఈ సమస్యపై చర్చించటానికి అందుబాటులో వుంటామని కూడా తెలియచేసింది. భేటీ కావటానికి ఎఎన్‌సి ఆమోదం తెలపటాన్ని కమ్యూనిస్టు పార్టీ స్వాగతించింది.అయితే అధ్యక్షుడు జాకబ్‌ జుమా సంప్రదింపులు జరపకుండా కమ్యూనిస్టుపార్టీని బలిపశువును చేయటాన్ని ఏ మాత్రం అంగీకరించటం లేదు. కూటమి భాగస్వాములనే కాదు చివరికి ఎఎన్‌సిని కూడా సంప్రదించకుండా మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్దీకరించటం, మార్పులు, చేర్పులకు సంబంధించిపేర్లపై నిర్ణయం మరెక్కడో జరిగిందని ఎఎన్‌సి ప్రతినిధుల స్పందనను బట్టే నిర్ధారణ అయింది. గత వారంలో ఎఎన్‌సితో జరిపిన ద్విపక్ష సంప్రదింపులను కమ్యూనిస్టు పార్టీ లీక్‌ చేసి గోప్యంగా వుంచాలన్న అంగీకారానికి తూట్లు పొడిచిందన్న ఆధారం లేని ఆరోపణను కమ్యూనిస్టుపార్టీ తిరస్కరిస్తున్నది. నిజానికి లీకు ఎఎన్‌సి నాయకత్వం వైపు నుంచే జరిగిందన్నది స్పష్టం. మంత్రివర్గ మార్పులలో మాజీ ఆర్ధిక మంత్రి ప్రవీన్‌ గోర్ధన్‌ను తొలగించటానికి కమ్యూనిస్టుపార్టీ అంగీకరించిందని చెప్పటం అవాస్తవం. లీకు వార్తల కారణంగా వాస్తవాలను తెలియ చెప్పేందుకే మార్చి 30 కమ్యూనిస్టు పార్టీ మీడియా గోష్టిని ఏర్పాటు చేసింది. లీకుల ద్వారా కమ్యూనిస్టు పార్టీ సమాచారాన్ని తెలియచేయదు. జుమా రాజీనామా చేయాలని తొలుత పిలుపు ఇచ్చిన కొందరు ఎఎన్‌సి నాయకులు వెనక్కు తగ్గినట్లుగా కనిపిస్తున్నది, అతను రాజీనామా చేయాల్సిందే అన్న వైఖరికి కమ్యూనిస్టు పార్టీ కట్టుబడి వుంది’ అని ప్రకటనలో కమ్యూనిస్టుపార్టీ స్పష్టం చేసింది.

జుమా రాజీనామా చేయాలని కమ్యూనిస్టు పార్టీ గత కొద్ది నెలలుగా కోరుతున్నట్లు గతేడాదే వార్తలు వచ్చాయి. మంత్రులను తొలగించిన తరువాత జుమా రాజీనామా చేయాలని అధికార కూటమిలోని మూడవ పక్షమైన కొసాటు కూడా కోరింది. పాత మంత్రుల తొలగింపు, కొత్త మంత్రు నియామకం కారణాల గురించి జుమా ఇచ్చిన వివరణతో తాము సంతప్తి చెందినట్లు ఎఎన్సీ ప్రకటించింది. జుమా రాజీనామాతో పాటు తాజా పరిణామాల వెనుక కీలకపాత్రధారిగా పరిగణించబడుతున్న ప్రముఖ వ్యాపారవేత్త గుప్తా పౌరసత్వం, నివాస హక్కులను రద్దు చేయాలని తాము డిమాండు చేస్తున్నట్లు కమ్యూనిస్టుపార్టీ ప్రధానకార్యదర్శి జెర్మీ క్రోనిన్‌ వెల్లడించారు. గుప్తా కుటుంబం,జుమా స్నేహితుల ప్రమేయం వున్న సంస్దలు, కంపెనీలన్నింటిపై విచారణ జరపాలని అన్నారు.

దక్షిణాఫ్రికాలో ఎఎన్‌సి నాయకత్వంలోని కూటమి 23 సంవత్సరాల పాలనలో అనేక సంక్షేమ చర్యలు చేపట్టినప్పటికీ ఈ కాలంలో అంతకు ముందు ప్రారంభమైన నయా వుదారవాద విధానాల కొనసాగింపు తప్ప ప్రత్యామ్నాయ మౌలిక విధానాలను అమలు జరపలేదు. పర్యవసానంగా అనేక తరగతులలో ఇటీవలి కాలంలో అసంతృప్తి ప్రారంభమైంది. ప్రభుత్వంలో కమ్యూనిస్టు పార్టీ కూడా ఒక భాగస్వామిగా వున్నప్పటికీ విధానాలలో ఎలాంటి మార్పులేదు. కమ్యూనిస్టు మంత్రులపై ఎలాంటి అవినీతి అక్రమాల ఆరోపణలు లేవు, వారు నిర్వహిస్తున్న శాఖలు కొంత మేరకు మిగతావారితో పోల్చితే మెరుగ్గా వున్నాయి తప్ప మెజారిటీ ఆఫ్రికన్ల ఆకాంక్షలకు అనుగుణంగా లేవు. దీంతో ఎఎన్‌సి నుంచి కమ్యూనిస్టు పార్టీ విడిపోవాలని, ప్రత్యామ్నాయ విధానాలను అమలు జరపాలని అందుకుగాను ఎన్నికలలో విడిగా పోటీ చేయాలనే ప్రతిపాదనలు గత కొంత కాలంగా కమ్యూనిస్టుపార్టీలో ముందుకు వస్తున్నాయి. జుమా పాలనలో అవినీతి, అక్రమాల ఆరోపణలు తీవ్రతరం కావటంతో ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగింది. జాత్యహంకార వ్యతిరేక శక్తుల మధ్య ఐక్యతను కొనసాగించాలన్న అవగాహనతో వున్న కమ్యూనిస్టుపార్టీ, కొసాటు గత ఇరవై సంవత్సరాల కాలంలో వ్యవహరించిన తీరును గమనిస్తే అధికార కూటమిలో తలెత్తిన సంక్షోభ తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. మాజీ అధ్యక్షుడు తాబో ఎంబెకీ చర్యలను వ్యతిరేకించిన జాకబ్‌ జుమాను గతంలో బలపరచటమే కాదు, రెండు పర్యాయాలు అధ్య క్షుడిగా కూడా అంగీకరించింది. అదే కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు మరో రెండు సంవత్సరాల పదవీకాలం వున్నప్పటికీ రాజీనామా చేయాలని, జనం కావాలో-జుమా కావాలో తేల్చుకొమ్మని ఎఎన్‌సిని డిమాండ్‌ చేస్తున్నది. జుమా విధానాలను విమర్శించి వ్యతిరేకించిన కారణంగా తన స్వంత ప్రధాన కార్యదర్శి వెలిన్‌ జిమా వావిని కాసాటు పదవి నుంచి తొలగించింది, అతి పెద్ద మెటల్‌ కార్మిక సంఘాన్ని బహిష్కరించింది. అదే కొసాటు ఇప్పుడు జుమా రాజీనామా కోరుతున్నది. గతంలో ఎఎన్‌సి నుంచి వెలివేతకు గురైన వారు, లేదా తామే తప్పుకున్నవారు రాజీనామా కోరటం సరేసరి. అధికార కూటమిలో తలెత్తిన విభేదాలను వుపయోగించుకొనేందుకు ప్రతిపక్ష డెమొక్రటిక్‌ అలయన్స్‌ అభిశంసన అస్త్రంతో తయారైంది.

మరోవైపున జుమా మద్దతుదార్లు కూడా రంగంలోకి దిగారు. వారిలో రెండు రకాలు జుమా అధికారాన్ని ఆసరా చేసుకొని అక్రమలబ్ది పొందిన వాణిజ్య, పారిశ్రామికవేత్తల లాబీతో పాటు సామాజిక మాధ్యమంలో డబ్బుతీసుకొని ఏ ప్రచారం కావాలంటే అది చేసి పెట్టే ట్రోల్స్‌ లేదా మరుగుజ్జు వీరులు కూడా పూర్తి స్ధాయిలో దిగారు. నలుపు-తెలుపు మనో భావాలను రెచ్చగొడుతూ గుప్తా కుటుంబం దేశభక్తి పరులైన జాతీయ బూర్జువా అని, తమ నేత జుమా తెల్లజాతి పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు వ్యతిరేకంగా పని చేస్తున్న కారణంగా ఆ గుత్త సంస్ధలు, నల్లవారి వ్యతిరేకులైన సామ్రాజ్యవాదులు రాజీనామా డిమాండ్‌ వెనుక వున్నారని ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు జుమా వెనుక వున్న గుప్తా కుటుంబానికి చెందిన టీవీ ఛానల్‌, ఇతర మీడియా సంస్దలు కూడా రంగంలోకి దిగాయి. తనకు వ్యతిరేకంగా ప్రవీణ్‌ గోర్దన్‌ కుట్రకు పాల్పడిన కారణంగానే పదవి నుంచి తొలగించినట్లు జుమా చెబుతున్నాడు.

జాత్యహంకార పాలన అంతమైన తరువాత జనంలో ఎన్నో ఆశలు మొలకెత్తాయి. అయితే 1990 దశకం చివరిలో పెట్టుబడిదారీ వ్యవస్ధలున్న దేశాలలో తలెత్తిన ఆర్ధిక సమస్యలు 2008 నాటికి తీవ్ర సంక్షోభ రూపంలో బయటపడిన విషయం తెలిసినదే. దక్షిణాఫ్రికాలో 1994లో అధికార మార్పిడి తప్ప అంతకు ముందు అభివృద్ధి చేసిన పెట్టుబడిదారీ, నయా వుదారవాద వ్యవస్ధలో ఎలాంటి మౌలిక మార్పులు లేవు. అదే నేటి రాజకీయ సంక్షోభానికి నాంది అని చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాలలో విధానాల మార్పుకు కమ్యూనిస్టుపార్టీ తన కర్తవ్యాన్ని నిర్వహించటంలో విఫలమైందనే విమర్శలు వున్నాయి. గోర్డన్‌ తొలగింపును వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టుపార్టీ జుమా రాజీనామా డిమాండ్‌ చేసి ప్రదర్శనలకు కూడా పిలుపు ఇచ్చినప్పటికీ ప్రభుత్వంలోని తన మంత్రులను కొనసాగిస్తున్నది. జుమా రాజీనామా ఒక్క కమ్యూనిస్టుపార్టీ వైఖరిపైనే ఆధారపడి లేదు. ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో వున్న జుమా వ్యతిరేకులు ఏం చేస్తారన్నది కూడా చూడాల్సి వుంది. 2019 ఎన్నికలలో కమ్యూనిస్టుపార్టీ ఒంటరిగా బరిలోకి దిగాలా లేక త్రిపక్ష కూటమి ఏకాభిప్రాయంతో ఐక్య అభ్యర్ధిని దించాలా అనే ప్రధాన అంశాలపై కమ్యూనిస్టులు తీసుకొనే నిర్ణయంపై దక్షిణాఫ్రికా పరిణామాలు ఆధారపడి వుంటాయి.