Tags

, , , , , , , , , ,

Image result for mayday-haymarket

ఎం కోటేశ్వరరావు

మే డే ! కొంత మంది ఆ రోజును దినోత్సవంగా జరుపుతారు, మరి కొందరు దీక్షా దినంగా పాటిస్తారు. పశ్చిమార్ధ గోళంలో అనేక దేశాలలో, సమాజాలలో అది వసంత రుతు ఆగమన పండుగ రోజు. మే ఒకటవ తేదీని కార్మికులు వుత్సవంగా జరుపుకుంటే యజమానులకు పండుగ, వారు కూడా దానికి అవసరమైన నగదు మొత్తాలను సంతోషంతో సమకూర్చుతారు. అదే దీక్షా దినంగా పాటించే చోట సదరు కార్మిక సంఘాన్నే మొత్తంగా లేపేయటానికి, కార్మికులను భయపెట్టటానికి కూడా వెనుకాడరు. మే ఒకటవ తేదీ ప్రాధాన్యతను కార్మికవర్గం తెలుసుకోకుండా చేసేందుకు ఆ రోజుకు బదులు మరొక రోజును కార్మికదినంగా మార్చేందుకు మరోవైపున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక సంప్రదాయ వసంత రుతు వుత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. కార్మికుల బతుకులు మాడిపోతున్నా, యజమానులు, వారి అడుగులకు మడుగులొత్తే పాలకులు అణచివేస్తున్నా అవేమీ పట్టకుండా ప్రకృతి పరంగా చెట్లు చేమలు వికసిస్తాయి. కానీ మేడే వస్తే కార్మికుల బతుకులు వాటంతట అవే వికసించవని గుర్తించాలి. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే ఒకటవ తేదీని ఎలా జరుపుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అది వారి చైతన్యానికి గీటురాయి.

ముందుగా మే డే చరిత్ర గురించి తెలుసుకుందాం. అబ్బో దీని గురించి మాకు తెలియందేముంది, ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో ఎన్నోసార్లు విన్నది, చదువుకున్నదేగా అని పెద్దలు అనుకుంటారు. ప్రపంచ పువ్వుల రోజు, లవ్వుల రోజు, నవ్వుల రోజుల మాదిరిగా ఇది కూడా 365రోజుల్లో ఇదొక రోజేగా అని యువత భావించవచ్చు. అనేక దేశాలలో చాలా మందికి ఇప్పటికీ , చివరికి దీనికి నాంది పలికిన అమెరికాలో సైతం మే డే గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రతిమనిషీ యాదృచ్చికంగానో లేదా కొంత మంది అన్నట్లు ప్రమాదవశాత్తో ఏదో ఒక మతాన్ని అవలంభించే కుటుంబంలో పుట్టటం తెలిసిందే. ఆయా మతాల దేవుళ్ల లేదా దేవ దూతలు లేదా ఇతర ప్రతినిధుల ప్రవచనాలు అనేకసార్లు విన్నప్పటికీ కుటుంబ, సామాజిక వుత్సవాల సందర్భాలలో మరోసారి వినేందుకు డబ్చిచ్చి మరీ ఏర్పాట్లు చేసుకుంటారు. అలాగే ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని పని చేసే ఐటి ఇంజనీరు, కార్యాలయ బంట్రోతు, ప్రభుత్వ వుద్యోగి, కార్మికుడు, గుమస్తా ఇలా ఎవరైనా తెల్ల చొక్కా లేక యూనిఫాం వేసుకున్నా అందరూ కార్మికులే. అందువలన ప్రతి ఒక్కరూ తమ వర్గానికి చెందిన అంతర్జాతీయ రోజు గురించి మంత్ర తంత్రాలు, ప్రవచనాల క్రతువు మాదిరి అయినా తెలుసుకోవాల్సిన అవసరం వుందా లేదా ?

Image result for mayday-haymarket

చాలా మంది మే డే అంటే ఎర్రజెండాల పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. నిజానికి దీనికీ కమ్యూనిస్టుపార్టీకి సంబంధం లేదు. రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటి కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచివేసేందుకు పూనుకుంది.దాంతో చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మికులను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో అప్పీలులో శిక్షలను ఖరారు చేశారు. 1987 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

Image result for mayday-haymarket

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని ప్రతిపాదించి ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ఖరారు చేస్తూ ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో 1919లో, తరువాత మన దేశంలో, ఇంకా అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు ఏర్పడ్డాయి. అందువలన ఎవరైనా మే డేను కమ్యూనిస్టుపార్టీలకు చెందినదిగా చిత్రిస్తే అది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. అది కార్మికవర్గ వుద్యమం నుంచి ఆవిర్భవించింది. కమ్యూనిస్టు పార్టీలు కార్మిక, కర్షక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి కనుక మేడేను విధిగా పాటించటంతో చివరికి అది కమ్యూనిస్టుల కార్యక్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

కార్మికవర్గం కంటే పెట్టుబడిదారీ వర్గానికే ముందు చూపు ఎక్కువని అనేక సందరా&భలలో రుజువైంది. తన చావు గోపబాలుడి చేతిలోనే వుందని గ్రహించిన కంసుడు చంపటానికి పుట్టుక నుంచి ఎలా ప్రయత్నించాడో అలాగే తనకు సమాధికట్టేది కార్మికవర్గం అని గ్రహించిన పెట్టుబడిదారీ వర్గం కూడా అదే చేసింది. చికాగో అమరజీవుల త్యాగం ప్రపంచ కార్మికవర్గానికి వుత్తేజం కలిగించేందు మే ఒకటవ తేదీని అంతర్జాతీయ కార్మికదినంగా పాటించాలని రెండవ ఇంటర్నేషనలన చేసిన నిర&ణయం తమ దేశ కార్మికవర్గాన్ని ప్రభావితం చేయకుండా చూసేందుకు అమెరికా పాలకవర్గం ప్రారంభం నుంచీ ప్రయత్నించింది. అమెరికా కార్మికోద్యమంలో సోషలిస్టు భావాలున్న శక్తులు చురుకుగా వుండటాన్ని గమనించిన పెట్టుబడిదారీ వర్గం తమ చెప్పుచేతలలో వుండే వారిని కార్మికనేతలుగా ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించింది. సోషలిజాన్ని వ్యతిరేకించే నైట్స ఆఫ్‌ లేబరన పేరుతో వ్యవహరించేవారితో 1869లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయించారు. వారి ప్రతిపాదనలలో సెప్టెంబరులో కార్మికులకు ఒక రోజు సెలవు ఇవ్వాలనే ఒక డిమాండు వుంది. దానిని ఆసరా చేసుకొని మే డే వైపు తమ కార్మికవర్గం మొగ్గకుండా చూసేందుకు 1887లో ఓరేగాన్లో, తరువాత 1894 నుంచీ దేశ వ్యాపితంగా సెప్టెంబరులో మొదటి సోమవారాన్ని కార్మికదిన సెలవుగా, కార్మికదినోత్సవంగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మే ఒకటవ తేదీని కార్మికదినంగా చేస్తే చికాగోలో హేమార్కెటన మాదిరి కార్మికులు కొట్లాటలకు దిగుతారని పాలకవర్గం ప్రచారం చేసింది. అయినప్పటికీ అక్కడి కార్మికులు మే డేను పాటించారు. తరువాత 1958లో కార్మికులను గందరగోళపరిచేందుకు, యజమానులకు విధేయులుగా చేసేందుకు మే ఒకటవ తేదీని అమెరికా విధేయతా దినంగా ప్రకటించింది. దానికి స్వాతంత్య్రవుద్యమ వారసత్వం అనే మనోభావాన్ని జోడించింది. ఇలాంటి ప్రయత్నాలను ప్రపంచంలో అనేక చోట్ల పాలకవర్గం చేసింది, చేస్తోంది.

Image result for mayday-haymarket

మన దేశంలో కార్మికవర్గం సమరశీలంగా తయారు కాకుండా , సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలవైపు మళ్లకుండా చూసేందుకు గాను 1953న భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. జాతీయవాదం ముసుగులో మే ఒకటవ తేదీకి బదులు విశ్వకర్మ జయంతి రోజు పేరుతో కార్మికదినాన్ని పాటించాలని ఆ సంస్ధ నిర్ణయించింది. అయితే దాని సభ్యులుగా వున్న కార్మికులు మే డేను పాటిస్తున్నా వద్దని నివారిస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయనే భయంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తుంది. ఇలాంటివే చరిత్రలో అనేకం గురించి చెప్పుకోవచ్చు.

ఇరవయ్యవ శతాబ్దం ప్రపంచ కార్మికవర్గానికి అనేక పాఠాలు నేర్పింది. ప్రపంచంలో తొలి కార్మికరాజ్యాన్ని, తరువాత అనేక దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను వునికిలోకి తేవటంలో కార్మికవర్గం ముందు పీఠీన వుంది. అదే కార్మికవర్గం 1990 దశకంలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేస్తుంటే కళ్లప్పగించి చూడటమే కాదు, ఎండమావుల వంటి పెట్టుబడిదారీ వ్యవస్ద స్వర్గాలను చేరాలనే అత్యాశతో తాను కూడా సోషలిస్టు వ్యతిరేక శక్తులతో చేతులు కలపటం కూడా ఆ శతాబ్దంలోనే జరిగింది. కార్మికవర్గం సోషలిస్టు భావజాలం వైపు మొగ్గకుండా చూసేందుకు పెట్టుబడిదారీ వర్గం రెండవ ప్రపంచ యుద్దం తరువాత తన లాభాలను కాపాడుకొనేందుకు నూతన మార్గాలను వెతుకుతూనే కార్మికవర్గానికి కొన్ని రాయితీలు కల్పించి, సంక్షేమ కార్య క్రమాలను అమలు జరిపింది. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్దలను కూల్చివేసిన తరువాత కమ్యూనిజం, సోషలిజాలకు కాలం చెల్లిందనే ప్రచారదాడితో పాటు అంతకు ముందు తాను అమలు జరిపిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయటం, కార్మికవర్గంపై కొత్త భారాలను మోపటం గత పాతిక సంవత్సరాలలో ఐరోపా, ఇతర ధనిక దేశాలలో చూశాము. ఇదే సమయంలో సోషలిస్టు వ్యవస్ధలను కాలదన్నుకున్న దేశాల కార్మికవర్గ పరిస్థితులు మరింతగా దిగజారాయి. అనేక సమస్యలున్నప్పటికీ ఇప్పటికీ సోషలిస్టు వ్యవస్దలున్న చైనా, వియత్నాం, క్యూబా వంటి చోట్ల కార్మికవర్గ పరిస్థితులు మెరుగ్గా వున్నాయన్నది దాచినా దాగని సత్యం.

పెట్టుబడిదారీ వర్గం అమలు జరుపుతున్న వుదారవాద విధానాల ప్రభావం, ప్రపంచ సోషలిస్టు శిబిరానికి తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన తరువాత యాజమాన్యవర్గాలదే పై చేయి అయింది. కార్మికవర్గాన్ని మరింతగా దోచుకొనేందుకు కార్మికవర్గంపై అనేక షరతులను రుద్దుతున్నారు. వాటిని వుల్లంఘిస్తే వుద్యోగాల నుంచి వూడగొడతామని బెదిరిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. ప్రభుత్వాలు సామాజిక బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాయి. కార్మిక చట్టాలను నీరు గార్చటంతో పాటు వున్న చట్టాలను కూడా అమలు జరపకుండా, కనీసం తనిఖీ చేసే అధికారం కూడా కార్మికశాఖకు లేకుండా వ్యవస్ధను నిర్వీర్యం చేస్తున్నారు. అనేక చట్టాలను పూర్తిగా ఎత్తివేయటానికి పూనుకున్నారు. కార్మిక సంఘాలు కొన్ని వర్గసామరస్య విధానాల వూబిలో కూరుకుపోయాయి. పైరవీల ద్వారా కొన్ని రాయితీలను సాధించుకొనేందుకు పూనుకున్నాయి. భవిష్యత్‌ తరాల ప్రయోజనాలను గాలికి వదలి పెట్టాయంటే అతిశయోక్తి కాదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. వుదాహరణకు కేంద్ర ప్రభుత్వ వుద్యోగుల వేతన సవరణ విషయమే చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తీసుకోవటం తప్ప న్యాయంగా తమకు రావాల్సిందాన్ని సాధించుకొనేందుకు కనీసం అన్ని తరగతుల వుద్యోగులు, కార్మికులు ఒక రోజు సమ్మె చేసేందుకు కూడా అనువైన పరిస్ధితులు నేడు లేకపోవటానికి ప్రపంచవ్యాపితంగా మారిన పరిస్థితులు, వర్గ సామరస్య వైఖరే కారణం. ఇదే ధోరణి కానసాగితే భవిష్యత్‌లో మరింత దారుణ స్ధితిలోకి నెట్టబడతారని గుర్తించాలి. 2004 తరువాత ప్రభుత్వ వుద్యోగాలలో చేరిన వారు నూతన పెన్షన్‌ పధకం పేరుతో తమ పెన్షన్‌కు తామే డబ్బు చెల్లించుకుంటున్నారు. దానిని ప్రారంభం నుంచీ వామపక్ష పార్టీలు, ఆ పార్టీల కార్యకర్తలు పనిచేసే కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.కొంత మంది ఈ స్కీమును బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం వాజ్‌పేయి ప్రధానిగా వుండగా ప్రవేశపెట్టింది కనుక కమ్యూనిస్టులు వ్యతిరేకించారని కొందరు ఆ రోజుల్లో తప్పుడు వ్యాఖ్యానాలు చేసిన వారున్నారు. అసలు ఇప్పుడు చాలా మందికి ఇది బిజెపి సర్కార్‌ పుణ్యమే అని తెలియదు. 1998-2004 మధ్య కాలంలో అధికారంలో వున్న వాజ్‌పేయి సర్కార్‌ 1999లో ‘ఒయాసిస్‌ ‘(ఓల్డ్‌ ఏజ్‌ సోషల్‌ అండ్‌ ఇన్‌కమ్‌ ) పేరుతో ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దాని సిఫార్సుల ప్రాతిపదికన నూతన పెన్షన్‌ పధకాన్ని రూపొందించింది. దాన్ని అమలు చేసేందుకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీని కూడా ఏర్పాటు చేశారు. 2003 డిసెంబరు 22న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 2004 జనవరి ఒకటవ తేదీ తరువాత చేరిన సాయుధ దళాల సిబ్బంది తప్ప ప్రభుత్వ వుద్యోగులందరూ ఈ స్వచ్చంద పెన్షన్‌ స్కీములో విధిగా చేరాల్సి వచ్చింది. ఇది అమెరికాలో అమలులో వున్న 401(కె) పెన్షన్‌ స్కీముకు అనుకరణ తప్ప ‘భారతీయ’ పధకం కాదు. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే బిజెపి అమలులోకి తెచ్చిన ఈ పధకాన్ని తరువాత పది సంవత్సరాలు అధికారంలో వున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కాగా అమలు చేసింది. ఆ నాడు వుద్యోగ సంఘాలు నామ మాత్ర వ్యతిరేకత తప్ప దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు, ప్రతిఘటించలేదు. అప్పటికే వుద్యోగులుగా వున్న వారు అది తమకు వర్తించదు కనుక రాబోయే వుద్యోగులే చూసుకొంటారు మనకెందుకు లెమ్మని వుదాసీనంగా వున్నారు. వారిలో తమ భవిష్యత్‌ కుటుంబ సభ్యులు వుంటారని కూడా ముందు చూపుతో ఆలోచించలేదంటే అతిశయోక్తి కాదు. ఈ రోజు ఆ పెన్షన్‌ స్కీము కింద చేరిన వుద్యోగులు దాని తీరుతెన్నులు చూసి గొల్లు మంటూ రద్దు కోసం ఆందోళనలు చేయాలని కోరుతున్నారు. చిత్రం ఏమిటంటే గతంలో వుద్యోగ సంఘాల నేతలుగా వుండి ఏ మాత్రం పట్టించుకోని నేతలు తగుదునమ్మా అంటూ ఇప్పుడు నూతన పెన్షన్‌ వ్యతిరేక ప్రకటనలు చేయటం గమనించాల్సిన అంశం. తెలంగాణా వంటి చోట్ల వుద్యోగ సంఘాల నేతలుగా పని చేసిన వారు ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా వున్నారు. అయినా ఆ ప్రభుత్వం నూతన పెన్షన్‌ స్కీమును అమలు చేస్తోంది తప్ప రద్దు చేసే విషయాన్ని కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోలేదు.

ఇక ఏడవ వేతన కమిషన్‌ చేసిన దారుణమైన సిఫార్సులు, వాటిని అమలు జరిపేందుకు మోడీ సర్కార్‌ వుద్యోగుల మెడలు వంచిన తీరు గురించి తెలిసిందే. వాటి మంచి చెడ్డల గురించి ఇక్కడ చర్చించనవసరం లేదు. సాధ్యమైన మేరకు తాము ఇవ్వదలచుకున్నదానికే వుద్యోగుల చేత ఆమోదింపచేయించేందుకు చేయాల్సిందంతా చేశారు, చేస్తున్నారు. కేంద్ర వుద్యోగులకు ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి వర్తింప చేసే అలవెన్సుల గురించి ప్రకటన వెలువడుతుందని ఎంతో ఆశించి ఫూల్స్‌ అయ్యారు.అసలు ఎప్పుడు వాటిని ఖరారు చేస్తారో కూడా తెలియని స్ధితి ఇప్పుడు నెలకొందంటే అతిశయోక్తి కాదు. ఆర్ధికశాఖ కార్యదర్శి అశోక్‌ లావాస నాయకత్వంలోని అలవెన్సుల కమిటీ నివేదిక గతేడాది నవంబరునెలలోనే వెలువడాల్సి వుంది. ప్రభుత్వం దాని గడువును మూడు నెలలు పొడిగించింది. ఫిబ్రవరిలో వెలువడాల్సిస సిఫార్సుల నివేదికకు ఐదు రాష్ట్రాల ఎన్నికల కోడ్‌ అడ్డం వచ్చిందని చెప్పారు. ఎన్నికలైపోయాయి. ఏర్పడిన కొత్త ప్రభుత్వాలు పాతపడుతున్నాయి. ఇంతవరకు నివేదికను సమర్పించలేదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. దానిని ప్రభుత్వం పరిశీలించేది ఎప్పుడు ఖరారు చేసేది ఎన్నడో చెప్పనవసరం లేదు. కాలం గడిచే కొద్దీ గతేడాది జనవరి నుంచి అమలు కావాల్సిన అలవెన్సుల బకాయిల గురించి వుద్యోగులు ఆశలు వదులుకొని ఏదో ఒకటి అసలు అలవెన్సులు ప్రకటిస్తే చాలనే విధంగా పరిస్ధితిని తెచ్చేందుకు చూస్తున్నారన్నది స్పష్టం. తాజాగా మూడు శాతం డిఎ వస్తుందని చూసిన వుద్యోగులు రెండుశాతం ప్రకటనతో కంగుతిన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వస్తే వేతన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని స్ధితి. మరో వేతన సవరణ నాటి వరకు వాయిదా వేస్తారని చెప్పినా అతిశయోక్తి కాదు.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం వలన ఆశాభంగమే తప్ప జరిగేదేమీ వుండదు. సంఘాలలో చేరటమే కాదు, వాటి నాయకత్వాలు అనుసరిస్తున్న రాజీపద్దతుల గురించి నిలదీయాలి. న్యాయమైన డిమాండ్లపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. వుద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిందానిని కోరుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. నేడు, నా సంగతి నేను చూసుకుంటే చాలు అని గాక రేపు, మన సంగతేమిటి అని కూడా విశాల దృక్పధంతో ఆలోచించటం అవసరం.

గమనిక:ఈ వ్యాసం ‘ ఎంప్లాయీస్‌ వాయిస్‌ ‘ పత్రిక కోసం రాసినది.