Tags

, , ,

Image result for Bini Adamczak

ఎం కోటేశ్వరరావు

యాభై సంవత్సరాల తరువాత ఇటీవల జపాన్‌లోని కొయోటో పట్టణంలో ఒక ప్రాంతాన్ని సందర్శించిన ఒక అమెరికన్‌ అక్కడి కమ్యూనిస్టులను చూసి రాసిన ఒక వ్యాఖ్యను ఇలా ముగించాడు.’ కమ్యూనిజం చావటానికి తిరస్కరించే ఒక వైరస్‌ వంటిది- చివరికది దారిద్య్రం నుంచి సంపదలవైపు పయనించిన దేశంలో కూడా వుందంటే మార్కెట్ల శక్తికి కృతజ్ఞతలు ‘ అన్నాడు. అంటే ప్రపంచంలో ఇటీవలి వరకు అమెరికా తరువాత అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వున్న జపాన్‌లో కూడా మ్యూనిస్టులు వుండటాన్ని జీర్ణించుకోలేక వెల్లడించిన వుక్రోషం అనుకోవాలి. వదిలేద్దాం ! గోడకు బంతిని ఎంత వేగంతో అంతే వేగంతో తిరిగి వస్తుందని తెలియని ఎందరో కమ్యూనిస్టు వ్యతిరేక మహానుభావులు. ప్రతి తరంలో పుట్టి కమ్యూనిజాన్ని నిలబెడుతున్నందుకు వారందరికీ వందనాలు. ఒక సారి పుట్టిన వ్యక్తి మరోసారి తల్లి గర్భంలోకి ప్రవేశించాలని కోరుకోవటమే ప్రకృతి విరుద్దం. అలాంటి కోరికలు వున్నవారికి అది ఎలా సాధ్యం కాదో కాలగతిని, చరిత్రను వెనక్కు తిప్పాలని చూసే వారికి కూడా అదే జరుగుతుంది. ప్రపంచంలో కమ్యూనిస్టు వ్యతిరేకులు అలాంటి కోవకు చెందిన వారే. హిరణ్యకశ్యపుడి కడుపులో ప్రహ్లాదుడు వుట్టినట్లే ప్రపంచవ్యాపితంగా సోషలిజాన్ని నాశనం చేశామని చెప్పుకున్న అమెరికా సామ్రాజ్యవాదులు తమ ఏలుబడిలో సోషలిజాన్ని అభిమానించేవారు పెరుగుతున్నట్లు గ్రహించలేకపోయారు.

గతేడాది నిర్వహించిన ఒక సర్వేలో 18-29 సంవత్సరాల మధ్య వయస్సు యువకులు 51శాతం మంది పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పగా 42శాతం అనుకూలతను వ్యక్తం చేశారు, 33శాతం సోషలిజానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. బ్రిటన్‌లో వీరిశాతం 36వరకు వుండగా సోషలిజాన్ని వ్యతిరేకించే వారు 32శాతం వున్నారని, కాపిటలిజాన్ని వ్యతిరేకించే వారు 39శాతం కాగా అనుకూలించే వారు 33 శాతమే వున్నారు. దీనంతటికీ కారణం పెట్టుబడిదారీ వైఫల్యాలను గ్రహిస్తున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరగటమే. ఒకసారి పెట్టుబడిదారీ విధానం పనికిరాదనుకున్న తరువాత దానికి ప్రత్యామ్నాయం వైపు చూడటం అవసరం. కమ్యూనిస్టులు గతంలో ఏవైనా పొరపాటు చేశారని భావిస్తే అలాంటివి జరగకుండా నూతన తరాలు జాగ్రత్తపడతాయని వేరే చెప్పనవసరం లేదు. లేదూ పెట్టుబడిదారీ విధానాన్ని నాశనం చేసి సమ సమాజాన్ని స్ధాపింపచేసే మరొక ప్రత్యామ్నాయం ఏదైనా వుంటే దాని వైపు మొగ్గుతారు తప్ప తిరిగి వెనక్కు పోరు.గత రెండువందల సంవత్సరాలలో పెట్టుబడిదారీ విధానం అనేక విజయాలు సాధించటంతో పాటు ఇంతకాలం తరువాత సమాజంలో అంతులేని అసమానతలను కూడా అదే తెచ్చిందన్న వాస్తవాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. ప్రతివారూ దానిని సరిచేస్తామని చెప్పటమే తప్ప కమ్యూనిస్టులు తప్ప ఇతర పార్టీలేవీ చిత్తశుద్ధిని ప్రదర్శించటం లేదు.

చరిత్రలో పెట్టుబడిదారీ విధానానికి అనేక తీవ్ర ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ విధానాన్ని అవలంభిస్తున్న వారి మధ్య దోపిడీలో వాటాలు కుదరకనే ఇప్పటికీ రెండు ప్రపంచ యుద్ధాలు తెచ్చారు. వియత్నాం నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ వరకు ప్రపంచ అగ్రరాజ్యాలన్నీ ఏకమై దాడులు, దురాక్రమణలకు పాల్పడినా అవి చావు దెబ్బలు తిని తోకముడుస్తున్నాయి తప్ప మరొకటి కాదు. పెట్టుబడిదారీ విధానం పాఠాలు నేర్చుకున్నట్లే దాని కంటే వయసులో చిన్నది, అనుభవం కూడా పరిమితమే అయిన సోషలిస్టు వ్యవస్ధ, కమ్యూనిస్టు పార్టీలు కూడా పాఠాలు నేర్చుకొని దోపిడీ వ్యవస్ధను నిర్మూలించి సమసమాజాన్ని స్ధాపించేందుకు ముందుకు పోవటం అనివార్యం.

Image result for Bini Adamczak

బినీ ఆదామ్‌ జెక్‌

తన రాజ్యంలో హరి నామ స్మరణ వినిపించరాదని ప్రహ్లాదుడిని తండ్రి ఆజ్ఞాపించినట్లే తమ దేశంలో కమ్యూనిజం, సోషలిజం అనే పదాలకు తావు లేదని అమెరికా హిరణ్యకశ్యపులు చెబుతున్నారు. అలాంటి చోట బాలలకు సోషలిజం, కమ్యూనిజం పాఠాలు చెబుతుంటే కమ్యూనిస్టు వ్యతిరేకులు మిన్నకుంటారా ? కొద్ది వారాల క్రితం అమెరికాలోని ‘మిట్‌ ప్రెస్‌’ అనే ఒక ప్రముఖ ప్రచురణ సంస్ధ ‘కమ్యూనిజం ఫర్‌ కిడ్స్‌ ‘ పిల్లలకోసం కమ్యూనిజం అనే పుస్తకాన్ని ప్రచురించి మార్కెట్లో పెట్టింది. ఒకసారి ఏమైందంటే పెట్టుబడిదారీ విధాన దురవస్ధల నుంచి బయపడాలని జనం కోరుకున్నారు. మరి దాన్ని ఎలాసాధించారో తెలుసుకోవాలనుందా పిల్లలూ అన్నట్లుగా ఆ పుస్తకం మొదలౌతుంది. పిడుగులు మరి పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి అని అడుగుతారు కదా ! రాజకుమారి వంటి సోషలిజాన్ని సాధించటానికి ప్రయత్నించిన రాజకుమారుడిని దుష్ట పెట్టుబడిదారులు ఎన్నో కష్టాలు పెట్టటం, చివరికి ఎలా విజయం సాధించిందీ దానిలో వివరించిన తరువాత పిల్లలు ఆకర్షితులు కాకుండా వుంటారా ? వారికి అర్ధమయ్యే రీతిలో, భాషలో జర్మన్‌ భాషలో బినీ ఆదామ్‌ జెక్‌ అనే సామాజిక సిద్ధాంతవేత్త, చిత్రకారిణి కార్టూన్లతో సహా వివరిస్తూ రాసిన పుస్తకాన్ని అమెరికా సంస్ధ అనువాదం చేసి ఆంగ్లంలో ప్రచురించింది. దానిని అమెజాన్‌ సంస్ధ ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు గుండెలు బాదుకుంటూ పిల్లలకు కమ్యూనిజం పాఠాలు బోధించటమా అంటూ నానా యాగీ చేస్తున్నారు.

పెట్టుబడిదారీ విధానం మీద అసంతృప్తిని పెంచుకుంటున్న యువత సోషలిజం పట్ల సానుకూలత పెంచుకుంటూ చివరికి ఏ దారి పడుతుందో అని ఆందోళన పడుతున్న పాలకవర్గ శక్తులకు, కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఇటువంటి పుస్తకాలు ఎక్కడ మండాలో అక్కడ మండేట్లు చేస్తాయని వేరే చెప్పనవసరం లేదు. కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు కమ్యూనిస్టు ప్రణాళికను రచించేంత వరకు విజేతలే చరిత్రను రచించారు, వ్యాఖ్యానించారన్నది ఒక వాస్తవం. ఆ తరువాత చరిత్రను ప్రజాస్వామ్యీకరించటం, శాస్త్రీయ వ్యాఖ్యానం చేయటం ప్రారంభమైంది. ఇది పాలకవర్గానికి మింగుడు పడని వ్యవహారం. పెట్టుబడిదారీ విధాన సమర్ధకులు ఒక వ్యక్తి పెద్ద పెట్టుబడిదారు, గుత్త పెట్టుబడిదారుగా మారే క్రమంలో ఎన్నికష్టాలు పడిందీ చివరికి ఎంత పెద్ద ఆర్ధిక సామ్రాజ్యాన్ని స్ధాపించిందీ లొట్టలు వేసుకుంటూ చదివే విధంగా అనేక విజయ గాధలు రచించిన విషయం తెలిసిందే. కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడిదానా బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు అన్నట్లుగా పెట్టుబడిదారు విజయ గాధ వెనుక వున్న ఎందరివో కష్ట గాధలను ఈ పుస్తకంలో వివరించారని సమీక్షలను బట్టి వెల్లడైంది.

ఈ పుస్తక సమీక్షలలో ఒకదానికి పెట్టిన పెట్టిన పేరు ‘బ్రెయిన్‌ వాషింగ్‌ షాకర్‌’ అంటే బుద్ధి శుద్ధి చేసే ఘాతము అని అర్ధం. ఎవరైతే గతాన్ని గుర్తు పెట్టుకోలేరో అది పునరావృతం కావటానికి వారు దండనార్హులు అన్న అమెరికన్‌ రచయిత జార్జి శాంతాయన మాటల మాదిరి గత పొరపాట్లను ఎవరైతే ప్రేమిస్తారో అవి పునరావృతం కావటానికి వారు దండనార్హులు అని ఆ సమీక్షకుడు వ్యాఖ్యానించారు. మరొక సమీక్షకుడు ‘ఈ పిల్లల పుస్తక సిద్ధాంతమైన కమ్యూనిజం ఏదైతే వుందో అది అంత కఠినమైనది కాదు, కాకపోతే దానిని సరైన దారిలో అమలు జరపలేదు ‘ అని ఈ పుస్తకం చెబుతుంది. వావ్‌ ఇలాంటి మాటలను నేను గతంలో వినలేదు, అంటే మీరు చెప్పిన దానికర్ధం ఏమంటే వేడిగా వున్న స్టౌను నేను మరోసారి ముట్టుకుంటే నా చేతిని కాల్చకపోవచ్చు అనే కదా ? అని వుక్రోషం వెలిబుచ్చాడు. మరొక సమీక్షకుడు ఈ పుస్తకం ఆలోచనను నాశనం చేస్తుంది. ఇదొక కథల పుస్తకం దీనిలో మరోసారి ఈర్షాపరులైన రాజకుమార్తెలు, కత్తులు, భూముల నుంచి గెంటివేతకు గురైన రైతులు, దుష్ట యజమానులు, అలసిపోయిన కార్మికులు, వారి గురించి మాట్లాడే ఒక కుర్చీ, కుండ అనే రాజ్యం అన్నీ వున్నాయిందులో. పెట్టుబడిదారుల గురించి చెప్పాల్సి వస్తే లాభాల కోసం కార్యకలాపాలు నిర్వహించే సంస్ధ మిట్‌ ప్రెస్‌ దీనిని ప్రచురించింది.పోనీ ఈ పుస్తకాన్నేమైనా తక్కువ ధరకు అందించారా అంటే అదీ లేదు, అది మామూలుగా వసూలు చేసే 12.95 డాలర్ల కంటే తక్కువేమీ కాదు. ఇలా సాగుతూ తన పాండిత్యాన్ని ప్రదర్శించారనుకోండి. పుస్తకాన్ని ప్రచురించిన మిట్‌ ప్రెస్‌కు వుచిత సలహా కూడా ఇచ్చారు. పిల్లలకోసం కమ్యూనిజం అన్న పుస్తకం ప్రచురించి సొమ్ము చేసుకుంటున్న మీరు పిల్లల కోసం నాజీజం, 9-12 సంవత్సరాల వయస్సు వారిని సులభంగా వూచకోయట ఎలా ? వంటి పుస్తకాలనుకూడా ప్రచురించి సొమ్ము చేసుకోవచ్చు అని దెప్పిపొడిచారు. మరొక వ్యాఖ్యాత ఏమన్నాడో చూడండి. ‘కమ్యూనిస్టు మూల సూత్రాల గురించి ఏదైనా ఒక సినిమాలో ప్రస్తావించటంగానీ లేదా పాఠశాల సిలబస్‌లో చేర్చటంగానీ మనం ఎన్నడైనా చూశామా ఈ సైద్ధాంతిక పోరులో విజేతలం మనమే అని నిజంగా చెప్పుకోగలమా’ అంటూ మితవాదులకు ప్రశ్న వేశాడు. ఒక పుస్తకాన్ని కమ్యూనిస్టు వ్యతిరేకులు తిడుతున్నారంటే అది తప్పకుండా చదవాల్సిన పుస్తకమే అని అర్ధం చేసుకోవాలి. మరొక వ్యాఖ్యాత పుస్తక ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు అది అమెజాన్‌ కంపెనీ అగ్రశ్రేణి వంద పుస్తకాలలో స్ధానం సంపాదించటంలో విఫలమైంది అన్నాడు. కమ్యూనిజం మరియు సోషలిజం గురించి వెలువడిన నూతన పుస్తకాల విభాగంలో అదే అమెజాన్‌ కంపెనీలో ఈ పుస్తకం ప్రధమ స్ధానంలో వుంది. ఈ పుస్తక సమీక్ష పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేక పండితులు మరోసారి పాతపడిప పాచిపాటలనే పాడి బోరు కొట్టించారు తప్ప తాము సమర్ధించే పెట్టుబడిదారీ విధానం ఎలా గొప్పదో, ప్రస్తుతం అది ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి అదెప్పుడు బయటపడుతుందో ఒక్క ముక్కా చెప్పలేదు. మెరుగైన ప్రపంచం కోసం ఇప్పటికీ మనల్ని ముందుకు నడిపించేది వర్గపోరాటమే అనే సందేశంతో ఈ పుస్తకం ముగుస్తుంది.

ప్రపంచం నాశనమౌతున్న వర్తమానంలో ఆశించటానికి మరొక నూతన ప్రపంచమేదీ కనిపించని, నమ్మకంలేని స్ధితిలో ఈ పుస్తకం ఎంతో ప్రయోజనకారి, అవసరం అని మరికొన్ని సమీక్షలు వెలువడ్డాయి. రెండు వందల సంవత్సరాల పెట్టుబడిదారీ విధానం మనకు స్వేచ్చను తెచ్చిందా లేక భూమిపై మానవులు ఎన్నడూ ఎరగని అసమానతలను తెచ్చిందా అని కషనర్‌ అనే సమీక్షకుడు అమెరికా సమాజాన్ని ప్రశ్నించారు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ మానవుల విధిరాత కాదు, ఆడమ్‌చెక్‌ సాయంతో దానికి మించి ఆలోచించేందుకు ఈ పుస్తకం వుపకరిస్తుంది.స్వేచ్చకోసం మొదటి అడుగు వేసేందుకు ప్రాధమికంగా తోడ్పడుతుంది. కనీసం ఇతర ప్రపంచాల గురించి వూహించుకొనే స్వేచ్చ వైపు అడుగువేయిస్తుంది అని కూడా కషనర్‌ చెప్పారు. డ్యూక్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఫ్రెడరిక్‌ ఆర్‌ జేమ్సన్‌ తన సమీక్షలో ఈ పుస్తకాన్ని ఎంతగానో పొగిడారు. ‘మనోజ్ఞమైన ఈ చిన్ని పుస్తకం ఇప్పుడు మనం అనుభవిస్తున్న దాని కంటే జీవితం,జీవనంలో ఇతర పద్దతులు వున్నాయని చిన్నారులకు చూపటంలో తోడ్పడుతుంది. కొంత మంది పెద్దవారూ దీన్నుంచి నేర్చు కోవచ్చు. మన యువతరం కేవలం అసంతృప్తి చెందటమే కాదు, తమవైన నూతన ఆలోచనలతో నిజంగా పనిచేసే మంచి ప్రత్యామ్నాయం, రాజకీయ విద్య కోసం చురుకుగా అన్ని వైపులా చూస్తున్న తరుణమిది. ఈ పుస్తకం ద్వారా నూతన మార్గాలను తిరిగి కనుగొనవచ్చు.’ అన్నారు. నూటొక్క పేజీలున్న ఈ పుస్తకంలో పిల్లలకు అర్ధమయ్యే భాషలో కమ్యూనిజం అంటే ఏమిటి ? పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి ? పెట్టుబడిదారీ విధానం ఎలా వునికిలోకి వచ్చింది? పని అంటే ఏమిటి ? మార్కెట్‌ అంటే ఏమిటి ? సంక్షోభం అంటే ఏమిటి? ఏం చేయాలి అనే శీర్షికల కింద వివరణలు ఇచ్చారు. ఎరుపంటే భయం వున్న వారు ఈ పిల్లల పుస్తకం చదివైనా దానిని పొగొట్టుకుంటారా ?