Tags

, , , ,

Image result for babri masjid demolition

ఎం కోటేశ్వరరావు

గడువు ప్రకారం 2019లో జరగాల్సిన మన లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందే జరుగుతాయా ? అన్న వూహాగానాలు చెలరేగుతున్న తరుణంలో బాబరీ మసీదు కూల్చివేత కుట్రకేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన కీలకమమైన తీర్పు మధ్యంతర ఎన్నికలను మరింత వేగిరం చేయనున్నాయా ? దీనికి తోడు బాబరీ మసీదు కూల్చివేత లో కుట్రపూరిత నేరారోపణ నుంచి ఎవరికీ మినహాయింపు ఇవ్వనవసరం లేదని, రెండు సంవత్సరాలలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అందువలన దాన్నింక వాయిదా వేయటానికి వీలులేదు. ఇప్పుడున్న స్ధితిలో ఆ కేసులో వచ్చే తీర్పు ఎలా వుంటుందనేదాని కంటే బిజెపి అగ్రనాయకులపై విచారణ జరపాలని కోర్టు చెప్పటమే రాజకీయంగా బిజెపికి తొలి చెంపపెట్టు. కరసేవపేరుతో బాబరీ మసీదు కూల్చివేత వాస్తవం. అందుకు పధకం రూపొందించిన వారి బండారాన్ని బయట పెట్టటం, కూల్చివేసిన వారిని శిక్షించటం రాజ్యధర్మం. వీటన్నింటి పూర్వరంగంలో తమ విధానాలను మరింత గట్టిగా అమలు జరపాలంటే మరింత బలం కావాలని, స్పష్టమైన తీర్పు ఇవ్వాలనో మరొక సాకుతోనో కమల దళపతులు కొత్త పల్లవి అందుకోనున్నారా ?

1971 పార్లమెంట్‌ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావటంతో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయాటానికి అనర్హురాలని 1975 జూన్‌ 12న అలహాబాద్‌ కోర్టు తీర్పు అదే నెల 26న దేశంలో అత్యవసర పరిస్ధితి విధింపునకు దారి తీసిన విషయం తెలిసిందే. బాబరీ మసీదు కూల్చివేత కుట్ర కేసు అలాంటి పరిణామానికి దారితీసే అవకాశం లేదు. అయితే సరిగ్గా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు గనుక కోర్టు తీర్పు వెలువడితే, అది బిజెపి నేతలను నిందితులుగా నిర్దారిస్తే పరిణామాలు ఎలా వుంటుంది అన్నది ఆసక్తికరం. దాని కంటే ముందు ప్రజాస్వామ్య విలువలకు పెద్ద పీట వేస్తానని చెప్పే నరేంద్రమోడీ తన రాజధర్మాన్ని ఎలా పాటిస్తారు అన్నది తేల నుంది. ఒక కేసులో నిందితులుగా విచారణ ఎదుర్కొనేవారు అధికార పదవులలో కొనసాగవచ్చా ? కేంద్ర మంత్రి వుమా భారతిని మంత్రిగా వుంచుతారా లేక తొలగిస్తారా ? ఒక వేళ కొనసాగిస్తే అలాంటి ఇతరుల గురించి బిజెపి నోరు మూతపడాల్సి వుంటుంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రచారంలోకి వచ్చిన లేదా తెచ్చిన అద్వానీకి కోర్టు నిర్ణయం పిడుగువంటిదే. బాబరీ మసీదు కూల్చివేత ఘటనతో తాత్కాలికంగా అయినా మధ్యతరగతిలో అనేక మంది బిజెపికి దూరమయ్యారు. పాతిక సంవత్సరాల తరువాత కేసు తీర్పు కుట్రను నిర్ధారిస్తే అదే పునరావృతం అవుతుందా అన్నది ప్రశ్న. అదే మధ్యతరగతి ఇటీవలి కాలంలో మోడీ మోజుతో తిరిగి బిజెపి వైపు చేరింది. కుట్ర నిజమే అని ఒక వేళ కోర్టు నిర్ధారిస్తే ఇప్పుడున్న స్ధితిలో హిందూత్వ శక్తులు మరింతగా రెచ్చిపోవచ్చు. లేదని వస్తే చూశారా మేము ఎలాంటి కుట్ర చేయలేదు, ప్రజలే కూల్చి వేశారని అమాయకపు ఫోజు పెట్టవచ్చు. కాంగ్రెస్‌తో సహా అన్ని పాలకవర్గ పార్టీలు ఓట్ల కోసం మతోన్మాదంపై అంత కరకుగా వుండటం లేదు. బిజెపి మాదిరి మెజారిటీ, మైనారిటీ మత ప్రభావిత ఓట్ల కోసం సంతుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నాయి. బిజెపికి బీ టీములుగా తయారవుతున్నాయి.అయితే దేశ వ్యాపితంగా తమ పాలన సాగాలని కోరుకుంటున్న బిజెపి కోర్టు తీర్పు ఎలా వచ్చినా నిండా మునిగిన తమకు ఇంకా చలేమిటనే వైఖరితో రిస్కు తీసుకుంటుందా ? అది చెప్పే హిందూత్వలో ఇమడలేని వారు మన దేశంలో మైనారిటీలు, దళితులు, గిరిజనులు 40 కోట్ల మంది వరకు వున్నారు. అంత మంది ఓట్లు లేకుండా ఏ పార్టీ అయినా దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాలలో అధికారాన్ని ఎలా సాధించగలుగుతుంది.

రాజకీయ నాయకుల మాటలకు అరా&థలే వేరులే అని బ్రిటన్‌ ప్రధాని థెరేసా మే రుజువు చేశారు. 2020 వరకు గడువున్న తమ పార్లమెంట్‌ను రద్దు చేయాల్సిన అగత్యం లేదంటూ నమ్మబలికిన థెరెస్సా మే ఆకస్మికంగా జూన్‌ ఎనిమిదిన ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం నిర్ణీత గడువులోపల పార్లమెంట్‌ను రద్దు చేయటానికి వీలులేదు. ఏదో ఒక ప్రభుత్వం కొనసాగాల్సిందే. అయితేనేం చట్టమన్నతరువాత లొసుగు లేకుండా వుండదన్నట్లు మూడింట రెండు వంతుల మంది ఎంపీల మద్దతు వుంటే రద్దు చేయవచ్చన్న అవకాశాన్ని వుపయోగించుకొని ఆమేరకు పార్లమెంట్‌లో ఒక తీర్మానం చేయనున్నారు. పోయేదేముంది అవకాశం వుస్తుందేమో అని ఎదురు చూసే ప్రతిపక్షం లేబర్‌ పార్టీ కూడా అందుకు సై అంది. అందువలన లాంఛనంగా పార్లమెంట్‌ రద్దు, ఎన్నికలు జరగాల్సి వుంది. నిజానికి బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ ప్రభుత్వానికి ఆకస్మికంగా వచ్చిన ముప్పేమీ లేదు, నాయకత్వాన్ని సవాలు చేసే వారు కూడా లేరు. బ్రెక్సిట్‌ కారణంగా తన విధానాలను పక్కాగా అమలు జరపాలంటే తాజా ప్రజాతీర్పు కోరటం అవసరమని ప్రధాని థెరెస్సా ప్రకటించారు. ఏ వంకా లేకపోతే డొంకట్టుకు ఏడ్చారన్న సామెత వూరికే పుట్టలేదు. బ్రిటన్‌ ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్ధితినుంచి తప్పించుకొనేందుకు ఇదొక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఆమె ఏ విధానాలను అమలు జరిపినా మద్దతు ఇచ్చే పాలక పార్టీకి సంపూర్ణ మద్దతు వున్నప్పటికీ ఎన్నికలకు తెరతీశారు.

మన దేశంలో కూడా గడువు ప్రకారమే ఎన్నికలంటూ గంభీరంగా నేతలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా అధికారంలో వున్న పార్టీలలో కనిపిస్తున్న పరిణామాలు, ఇతర అంశాలను చూస్తే జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏ అంశాలు ఇటువంటి వూహాగానాలకు తావిస్తున్నాయో చూద్దాం. తెలంగాణాలో చంద్రశేఖర రావు వివిధ కార్పొరేషన్లకు, ఇతర పదవులను తన పార్టీవారితో నింపటం, వివిధ కులాల వారిని బుజ్జగించేందుకు తాయిలాలు ప్రకటించటం, రిజర్వేషన్ల పెంపుదలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశ నిర్వహణ, ప్రత్యర్ధి రాజకీయపార్టీలపై అధికారపక్ష దాడి తీవ్రతరం వంటి వన్నీ కొన్ని సూచనలు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది దెప్పి పొడుస్తున్నట్లుగా జయంతికి, వర్ధంతికి కూడా ఇంకా తేడా తెలియని కుమారుడికి చంద్రబాబు నాయుడు అమాత్యపదవి కట్టబెట్టటం, మంత్రివర్గ విస్తరణ ఎన్నికల కోసమే అన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ఇటీవలనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి.వాటిలో బిజెపి, దాని మిత్రపక్షం అకాలీదళ్‌ పంజాబ్‌లో ఘోరపరాజయాన్ని చవిచూశాయి. గోవాలో అధికారంలో వున్న బిజెపి ఓడిపోయింది. వుత్తరాఖండ్‌లో మాత్రమే బిజెపి విజయం సాధించింది. వుత్తర ప్రదేశ్‌లో విజయం సాధించింది, మణిపూర్‌లో ఓడిపోయింది. సాంకేతికంగా 2017లో గడువు ముగిసే అసెంబ్లీలు లేనప్పటికీ 2018లో ఏడు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడాల్సి వుంది. వాటిలో హిమచల్‌ ప్రదేశ్‌లో జనవరి ఏడు, గుజరాత్‌లో జనవరి 22, మేఘాలయలో మార్చి ఆరు, నాగాలాండ్‌లో మార్చి 13, త్రిపురలో మార్చి 14, మిజోరంలో మార్చి 15, కర్ణాటకలో మే 28వ తేదీతో అసెంబ్లీల గడువు ముగుస్తుంది కనుక ముందుగానే ఎన్నికలు జరగాలి. మరుసటి ఏడాది లోక్‌సభ ఎన్నికలు, మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి వుంది. ఈ పూర్వరంగంలో అన్ని రాష్ట్రాల అధికారంలో పాగావేయాలన్నది బిజెపి ఎత్తుగడ. అయితే గత ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలను చూసినపుడు బిజెపి పరిస్థితి నల్లేరు మీద బండిలా సాగుతుందా అన్నది చూడాల్సి వుంది.

దేశ ఆర్ధిక స్ధితిని చూస్తే మోడీ సర్కార్‌ మూడు సంవత్సరాలలో సాధించినదాని గురించి అధికార, ప్రయివేటు మీడియా దన్నుతో సంబరాలు చేసుకోవచ్చుగాని సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసిన ఒక్క అంశం కూడా లేదన్నది విశ్లేకుల అభిప్రాయం. ధరల పెరుగుదలలో మార్పు లేదు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో పురోగతి లేదు, ఎగుమతులు పడిపోయాయి, దిగుమతులు పెరిగాయి. సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లు గత మూడు సంవత్సరాలుగా కేంద్రీకరించిన వస్తు, సేవల పన్ను చట్టం జూలై నుంచి అమలులోకి రానుంది. దాంతో మొదట ధరలు పెరుగుతాయని, తరువాత జనానికి ఫలితాలు అందుతాయని పాలకపార్టీతో పాటు, దాని సమర్ధకులు వూదరగొడుతున్నారు. అంటే మొరటుగా చెప్పాలంటే ముందు నీ గోచి పాతను కూడా పోగొట్టుకుంటావు తరువాత పట్టుపంచలు పొందుతావు అన్నట్లుగా వుంది. ముందు ధరలు పెరగటం ఏమిటో తరువాత తగ్గటం ఏమిటో, ఇది ఏ పాఠశాల ఆర్ధశాస్త్రపాఠమో ఎవరూ చెప్పరు. ఒకసారి పెరగటం ఎందుకు తరువాత తగ్గటం ఎందుకు ? మానవ జాతి చరిత్రలో ఏ దేశంలో అయినా ఒకసారి పెరిగిన ధరలు తగ్గిన వుదాహరణ వుందా ? అందువలన అధికారం తప్ప మరొకటి పట్టని బిజెపి పెరిగిన ధరల మధ్య మోడీ పాలనలో దేశం వెలిగిపోతోంది అని చెప్పుకోజాలదు. కనుక ధరల సెగ జనానికి పూర్తిగా సోకక ముందే మరోసారి నాకు ఓటేస్తే ఇంకా మంచి రోజులు తెస్తానని గడువుకు ముందే ఎన్నికల ప్రకటన చేసి నరేంద్రమోడీ జనం ముందుకు వెళతారన్నది ఒక విశ్లేషణ.

పూర్వసామెత ప్రకారం ఆరునెలలు సాము గరిడీలు చేసి కనీసం ఓటి కుండలు పగలగొట్టిన ‘ప్రతిభావంతుల’ గురించి మాత్రమే విన్నాం. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తీస్తానని చెప్పిన నరేంద్రమోడీ ఆరునెలలు గడిచిపోతున్నా రద్దు చేసిన పెద్ద నోట్లలో ఎంత మొత్తం తిరిగి వచ్చిందీ, ఎంత డబ్బు రాలేదు, ప్రభుత్వానికి ఎంత లబ్ది కలిగిందీ అన్న విషయాలేవీ ఇంతవరకు చెప్పలేదు. నరేంద్రమోడీకి నల్లధనం తేలు కుట్టింది కనుక మిన్నకున్నారా ? పెద్ద నోట్ల రద్దుతో కాశ్మీరుతో సహా దేశమంతటా తీవ్రవాద వెన్ను విరిచామని చెప్పారు. రాళ్లు విసురుతున్న ఘటనలు ఆ కారణంగానే తగ్గాయన్నారు. అన్ని చెప్పిన ఐదు నెలల తరువాత తమ రక్షణ వలయంగా ఒక యువకుడిని జీపుకు కట్టి వీధులలో రక్షణ పొందిన మిలిటరీ వుదంతం గతంలో ఎన్నడూ లేదంటే బిజెపి విధానాలు విజయవంతమైనట్లా కాశ్మీరులో పరిస్థితులను మరింత దిగజార్చి నట్లా ? ఎన్నికలలో చెప్పిన గుజరాతు నమూనా పాలన, ప్రగతి ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో వున్నాయి. ఇవి జనంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీయక ముందే ఓట్లను కొల్లగొట్టే పని పూర్తి చేసుకోబోతున్నారా ?

పార్లమెంటు ఎన్నికల తరువాత ఢిల్లీ, బీహారులో సంభవించిన పరాభవం తరువాత జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి బిజెపి ఎన్నో గొప్పలు చెప్పుకోవచ్చు. 2012 పంజాబు అసెంబ్లీ ఎన్నికలలో అకాలీదళ్‌-బిజెపి కూటమికి 34.59,7.15 చొప్పున మొత్తం 41.64 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెసుకు 39.92 శాతం వచ్చాయి. 2014 పార్లమెంటు ఎన్నికలలో అకాలీ-బిజెపి కూటమికి 26.3, కాంగ్రెసుకు 33.1, కొత్తగా వచ్చిన ఆమాద్మీ పార్టీకి 24.4 శాతం వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీలకు వరుసగా 25.2, 38.5, 23.7 శాతం చొప్పున వచ్చాయి. మోడీ మాయలు, మంత్రాలు ఇక్కడ పని చేయలేదు.

ఘనవిజయం సాధించామని చెప్పుకుంటున్న వుత్తర ప్రదేశ్‌ వివరాలు చూద్దాము. 2012 ఎన్నికలలో అధికారానికి వచ్చిన సమాజవాది పార్టీకి 29.15, రెండో స్ధానంలో వున్న బిఎస్‌పికి 25.91, బిజెపికి 15, కాంగ్రెస్‌కు 11.63 శాతం ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో వరుసగా ఈ పార్టీలకు 22.2, 19.6, 42.3, 7.5 చొప్పున వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిపి ఎస్‌పి కూటమికి 28, బిఎస్‌పి 22.2, బిజెపి కూటమికి 41.4శాతం వచ్చాయి. ప్రతిపక్ష ఓట్ల చీలిక కారణంగా పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. నిజంగా దేశంలో మోడీ గాలి వీస్తుంటే పెద్ద నోట్ల రద్దు వంటి ప్రయోగం అంతగా విజయవంతమైతే బిజెపి ఓట్లెందుకు తగ్గినట్లు ? గోవాలో బిజెపి అధికారంలో వుండి ఓడిపోయింది. తనపై గెలిచిన కొందరు ఎంఎల్‌ఏలకు ఎర చూపి తిరిగి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటం వేరే విషయం. అక్కడ ఎంజిపితో కలసి 2012లో పోటీ చేసిన బిజెపి కూటమికి 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 30.78 శాతం ఓట్లు వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం 32.5, కాంగ్రెస్‌ ఓట్లు 28.4 శాతానికి తగ్గినా బిజెపి సీట్లు కోల్పోగా కాంగ్రెస్‌ పెంచుకుంది. విడిగా పోటీ చేసి పదకొండుశాతం ఓట్లు తెచ్చుకున్న ఎంజిపికి మూడు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ఎంఎల్‌ఏలను ఫిరాయింప చేసి మిగిలిన చిన్న పార్టీలన్నింటినీ కూడగట్టి బిజెపి అడ్డదారిలో అధికారాన్ని పొందింది.

అందువలన పైకి ఎంత గంభీరంగా మాట్లాడినా ఓట్ల లెక్కలు బిజెపికి అనుకూలంగా లేవన్నది స్పష్టం. ఈ ఏడాది చివరిలో జరగాల్సిన గుజరాత్‌ ఎన్నికలు బిజెపికి ఒక పరీక్ష వంటివి. ఎందుకంటే అక్కడ ఓట్లు చీలే అవకాశం లేదు. మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత అక్కడ జరిగిన స్ధానిక సంస్ధ ఎన్నికలలో పట్టణాలలో బిజెపి గెలిచినా గ్రామీణ జిల్లా పంచాయతీలలో బోర్లా పడింది. కాంగ్రెస్‌ అనేక విజయాలు సాధించింది. అందువలన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయినా లేక ఇప్పుడున్నదాని కంటే సీట్లు తగ్గినా నరేంద్రమోడీ గాలి తుస్సుమనటం ఖాయం. అందువలన గుజరాత్‌తో పాటే లోక్‌సభ ఎన్నికలను రుద్దే అవకాశాలే ఎక్కువగా వున్నాయి.

బిజెపి సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మేకిన్‌ ఇండియా, ఐదు సంవత్సరాలలో రైతుల ఆదాయాల రెట్టింపు వంటివి నినాదాలుగానే మిగిలిపోయాయి. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురు దెబ్బలు తప్ప సానుకూల పరిణామాలు లేని స్ధితిలో ఐదేండ్లూ కొనసాగితే ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగటం అని వార్యం. అందుకే ఏదో ఒకసాకుతో మధ్యంతర ఎన్నికలను దేశం మీద రుద్దనున్నారనే అభిప్రాయం కలుగుతోంది.