Tags

, , , ,

నాటికలో యువ మార్క్స్‌ పాత్రధారి రోరీ కిన్నియర్‌

ఎం కోటేశ్వరరావు

కారల్‌ మార్క్స్‌ ! 1848లో స్నేహితుడు ఫెడరిక్‌ ఎంగెల్స్‌తో కలసి కమ్యూనిస్టు ప్రణాళికను రచించి, విడుదల చేసిన నాటి నుంచి ప్రపంచంలో ప్రతి మూలా ప్రతి రోజూ వ్యతిరేకులో, సమర్ధకులో వారి పేర్లు, వాటితో విడదీయరాని కమ్యూనిస్టు భావజాలం గురించి చర్చించని, ప్రస్తావించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. మానవ జాతి చరిత్రలో ఒక పెద్ద మలుపుకు కారణమైన ‘యువ కారల్‌ మార్క్స్‌ ‘ లండన్‌లో గడిపిన జీవితం గురించి ఒక నాటికను అక్టోబరు నుంచి ప్రదర్శించనున్నారనేది తాజా వార్త. నూతనంగా ప్రారంభమైన బ్రిడ్జి ధియేటర్‌ నుంచి వెలువడుతున్న తొలి ప్రదర్శన ఇది. థేమ్స్‌ నదిపై వున్న న్యూ బ్రిడ్జి ప్రాంతంలో 900 సీట్లతో కొత్తగా నిర్మించిన వాణిజ్య ప్రదర్శనశాల ఇది. గత పదిహేను సంవత్సరాలలో లండన్‌లో ధియేటర్లకు వచ్చి నాటకాలు చూసే ప్రేక్షకులు 25శాతం పెరిగినట్లు ఒక సర్వేలో తేలింది.

Nick Starr and Nicholas Hytner.

బ్రిడ్జి ధియేటర్‌ వ్యవస్ధాపకులు నిక్‌స్టార్‌, నికొలస్‌ హిట్నర్‌

నాటిక, నాటక, సినిమా తదితర కళారూపాల నిర్మాణానికి వృత్తాంతంగా మార్క్సు-ఎంగెల్స్‌లను ఎంచుకోవటమే ఒక ప్రత్యేకత. వారి గంభీర జీవితాలను, రచనల ద్వారా ప్రపంచానికి అందచేసిన సందేశాన్ని టిక్కెట్లు కొని చూసే వీక్షకుల ముందు రక్తి కట్టించటం సాహసం, పెద్ద ప్రయోగమే. లండన్‌లో మార్క్సు కుటుంబం అష్టకష్టాలు పడిందన్నది లోకవిదితం. అలాంటి జీవితం 1850 తొలిరోజుల గురించి ప్రేక్షకులను ఎలా మెప్పించనున్నారన్నదే ఆసక్తికరం. కుటుంబ జీవనం ఇబ్బందుల్లో పడింది, అప్పటికే జర్మనీ నుంచి అనేక ప్రాంతాలు తిరిగి అలసిపోయి కాళ్లు, చేతులు కాయలు కాచిన విప్లవకారుడు.నాటి పాలకవర్గాలు అత్యంత భయంకరమైన తీవ్రవాదిగా పరిగణించిన మార్క్స్‌ పశ్చిమ లండన్‌లోని సోహో ప్రాంతంలోని డీన్‌ వీధిలో ఎవరికీ తెలియకుండా జీవించిన రైల్వేలో వుద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు, తదితర అంశాలను ఈ నాటికలో ప్రదర్శించనున్నారు. వ్యంగ్య, హాస్య రచనలు చేసే రిచర్డ్‌ బీన్‌, క్లైవ్‌ కోల్‌మెన్‌ ద్వయం గంభీరమైన కారల్‌మార్క్సు జీవితంలో వాటిని ఎలా చొప్పించారో చూడాల్సి వుంది. లండన్‌లోని ప్రఖ్యాత నేషనల్‌ ధియేటర్‌లో మాజీ డైరెక్టర్‌గా వున్న సర్‌ నికోలస్‌ హిట్నర్‌ ఈ నాటిక దర్శకుడు, బ్రిడ్జి ధియేటర్‌ సహ వ్యవస్దాపకుడు. రోరీ కిన్నియర్‌ మార్క్స్‌గా ఎంగెల్స్‌గా ఆలివర్‌ క్రిస్‌ నటిస్తున్నారు.

The Bridge theatre will open in October 2017

ప్రారంభానికి సిద్ధమైన బ్రిడ్జి ధియేటర్‌

ఏడాదికి కనీసంగా నాటకాలను ప్రదర్శించటం తమ లక్ష్యమని ‘యువ మార్క్స్‌’ తరువాత ప్రదర్శనకు సిద్దం చేస్తున్న ఎనిమిది నాటకాల పేర్లను కూడా నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. వీటిలో షేక్సిపియర్‌ రచన జూలియస్‌ సీజర్‌ తప్ప మిగిలిన వన్నీ కొత్త రచనలే. వాటిలో నాలుగింటిలో మహిళలే నటిస్తున్నారు. లండన్‌కు కొత్త నాటక సంస్ధల అవసరం వుందని, తాము ప్రజాకర్షకమైన,సాహసవంతమైన ఇతివృత్తాలతో వీక్షకులను వుద్వేగ భరితులను చేసే విధంగా, నిజంగా ఒక రాత్రిని మంచిగా గడిపామనుకొనే విధంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం లండన్‌లో వాణిజ్య తరహా నాటక ధియేటర్లు తొమ్మిది వున్నాయి. కొత్త ధియేటర్‌ కొత్త ప్రాంతంలో రాకతో వాటి మధ్య పోటీ పెరగవచ్చని భావిస్తున్నారు.