Tags

, , , , , ,

Image result for controversial cartoon, inturi ravikiran

ఎం కోటేశ్వరరావు

పెద్దలకు మాత్రమే అనే కాప్షన్‌తో ఒక ‘ముదురు’ సినిమా పోస్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి భవనపు ముందుభాగం ఫొటో, నాన్నారూ నేను పెద్దల సభకే వెళతా అనే కాష్షన్‌తో నారా లోకేష్‌, ఆయన తండ్రి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడి ఫొటోలతో కూడిన ఒక చిత్రం సామాజిక మాధ్యమంలో పెద్ద ప్రాచుర్యం పొందింది. ఇదెలాంటి ప్రభావం చూపిందంటే వంద మంది వంది మాగధుల కొలువు మధ్య ఒక్క విమర్శకుడు నోరు విప్పితే రాజో, యువరాజో, యువరాణికో ఎలా వుంటుంది ? నూరు కాకుల కావ్‌ కావ్‌లే మధురగీతాలుగా తన్మయత్వంతో అప్పటికే వూగిపోతున్న వారి మధ్యలో ఒక్క కోయిల చేరి పాడితే ఎలా కర్ణకఠోరంగా వుంటుందో అలా !

కొన్ని మినహా అన్ని అగ్రశ్రేణి సాంప్రదాయక మాధ్యమాలన్నీ ఆహా ఓహో అంటూ పొగుడుతుంటే సామాజిక మాధ్యమంలో వచ్చిన పై చిత్రం కొంతమందికి అభ్యంతరగా కనిపించటంతో వివాదాస్పదమై, చట్టపరమైన చర్యలకు దారి తీసింది. ఇంటూరి రవికిరణ్‌ వేసిన కార్టూన్‌ ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి భవనాన్ని కించపరిచేదిగా వుందంటూ వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి, బెయిలుపై విడుదల చేయటం రెండు తెలుగు రాష్ట్రాలు, జాతీయ మీడియాలో కూడా ఒక సంచలన వార్తగా మారింది. మీడియాలో వచ్చిన ఏదైనా అంశంపై ఎవరికైనా అభ్యంతరం అనిపించినపుడు ఇప్పుడేం జరుగుతోంది. సంబంధిత చట్టపరమైన సంస్ధలకు ఫిర్యాదు చేయటం అవి తీసుకొనే చర్యల కోసం కాలయాపన చేయటం కంటే అసలు చట్టాన్నే తమ చేతుల్లోకి తీసుకుంటే పోలా అన్నట్లు అనేక సందర్భాలలో ప్రత్యక్షంగా తేల్చుకొనేందుకు సిద్ధపడుతున్నారు.

రవికిరణ్‌ తయారు చేసిన చిత్రం విషయంలో ముందుగా చేయాల్సింది. ఏ సామాజిక మాధ్యమంలో అయితే అది తిరుగాడుతోందో దాని యజమానులకు ఫిర్యాదు చేసి దానిని ముందుగా వుపసంహరింప చేయించాలి. అదేమీ జరిగినట్లు లేదు. ఎందుకంటే రవికిరణ్‌ అరెస్టు, విడుదల తరువాత కూడా ఆ చిత్రాన్ని చూపమ్మా అని గూగులమ్మ తల్లిని ప్రార్ధిస్తే అంతకంటేనా నీ కోరిక తీరుతుంది భక్తా అన్నట్లు శనివారం సాయంత్రం మూడు గంటల సమయంలో చూపింది. దానిని పాఠకుల సౌకర్యార్ధం  ఇస్తున్నాం.

మీడియాలో సంచలనాన్ని చూసిన తరువాత ఈ చిత్రం ఇంకా అనేక మందిలో ఆసక్తిని రేకెత్తించి సామాజిక మాధ్యమానికి దూరంగా వున్న వారిలో కూడా ఆసక్తిని రేపి మరింత ప్రాచుర్యం పొందింది. ఆ విధంగా నారా లోకేష్‌, నారా చంద్రబాబు నాయుడి ప్రచార గ్రాఫ్‌లు పెరిగాయంటే అతిశయోక్తి కాదు. పైసా ఖర్చు లేకుండా వచ్చిన ఈ ప్రచారానికి ముందుగా ఆ చిత్రం అభ్యంతరంగా వుందని అనిపించిన పెద్దలకు, , రవి కిరణ్‌ను హైదరాబాదులో అరెస్టు చేసి తుళ్లూరుకు తీసుకురావటంలో ఆలశ్యం చేసి ఆసక్తి పెంచిన పోలీసులకు, దీన్నొక సమస్యగా చేసి సామాజిక మాధ్యమంలో చినబాబు, పెదబాబులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారికి ఒక గుణపాఠం చెప్పాలన్న ఆలోచన ముందుగా వచ్చిన వారికి, మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసి కిసుక్కున నవ్వినందుకు అన్నట్లుగా మా బాబులపై వ్యంగ్యాస్త్రం వేసినందుకు కాదు, శాసనమండలిని కించపరిచినందుకు అన్న ఒక తెలివైన పాయింటును ముందుకు తెచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయించిన, చేసిన వారికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వుదంతంతో ప్రమేయం వున్నవారందరికీ ఎవరెన్ని అభ్యంతరాలు పెట్టినా అభినందనలు చెప్పక తప్పదు.

ఇదే జరిగి వుండకపోతే ప్రపంచానికి అనేక విషయాలు మరుగునపడి తెలియకుండా వుండేవి.భావ ప్రకటనా స్వేచ్చ గురించి అన్ని రకాల మీడియాల్లో నలుగురి నోళ్లలో నాని వుండేది కాదు. కొంత మంది గురించి కొందరు చేసిన పప్పు, సుద్ద పప్పు అన్న వ్యాఖ్యలు వారికి తగవు, పప్పులాగా వున్నా వుప్పు, నిప్పుగా నిరూపించుకొనే సందర్భాలు వస్తాయి అని రుజువైంది. ఏ మీడియా అయినా తమ రేటింగ్‌ను పెంచాలి తప్ప మరొక విధంగా చేయకూడదని రాజకీయ నేతలు కోరుకుంటారు తప్ప విమర్శిస్తే వూరుకోరని గతంలోనే మమతా బెనర్జీతో అనేక మంది నిరూపించారు. తెలుగు దేశం పార్టీ కూడా అందుకు మినహాయింపు కాదని రుజువైంది. సరే ఒక పార్టీకి చెందిన మరుగుజ్జు సేన(ట్రోల్స్‌) తమ నేతలపై విమర్శలు చేసిన వారి పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తిస్తుందో సామాజిక మీడియాలో విమర్శనాత్మకంగా పరిశీలించే వారందరికీ తెలిసిందే.

చట్టపరంగా రవి కిరణ్‌ రూపొందించిన చిత్రం శిక్షార్హమైనదా, కాదా, ఆ చిత్రాన్ని ఎవరు ఎవరికోసం వేయించారు, ఎందుకు వేశారు, జరిగిన నష్టం ఏమిటి, అందుకు శిక్ష వుంటుందా, తప్పేమీ లేదని కొట్టి వేస్తారా అన్న అంశాలలో కొన్ని వూహా జనితమైనవి. కేసు దాఖలు చేశారు గనుక చట్టం తనపని తాను చేసుకుపోతుంది. ఆయేషా మీరా హత్య కేసులో పోలీసులు ప్రవేశపెట్టిన సత్యం బాబు నేరం చేయలేదని స్వయంగా ఆయేషా తల్లితండ్రులు కేసు విచారణ రోజు నుంచి ఎంత మొత్తుకున్నప్పటికీ పట్టించుకోకుండా చట్టం తనపని తాను చేసి నిర్దోషి అయిన సత్యంబాబును అన్యాయంగా జైలుపాలు చేసిందని తాజా కోర్టు తీర్పుతో వెల్లడైన విషయం తెలిసిందే. అందువలన కొన్ని సందర్భాలలో చట్టం తనపనే గాక అధికారంలో వున్నవారికి చుట్టంగా కూడా పని చేస్తుందని స్పష్టమైంది. సరే తాజా చిత్రం కేసులో ఏమౌతుందో తెలియదు.

ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో ప్రస్తావనకు వస్తున్న అంశాలేమిటంటే పేరుకు శాసన మండలిని కించపరిచారనేది సాంకేతికంగా కేసు బనాయించటానికి తప్ప వాస్తవానికి ఇద్దరు బాబుల ప్రస్తావన వున్నందుకు ఇది ప్రతీకారం అని ప్రజాభిప్రాయంగా వుంది. అనేక మంది రాజకీయ నాయకులు ఈ రోజుల్లో దేవతా వస్త్రాలు ధరించి రాజకీయాలు చేస్తున్నారు. పుణ్యం చేసుకున్న వారికే దేవతా వస్త్రాలు కనిపిస్తాయి అన్నట్లుగా వారి తీరు అందరికీ కనిపించదు. కొన్ని సందర్భాలలో ప్రజాభిప్రాయం కూడా తప్పు కావచ్చు. హిట్లర్‌ మంచివాడే, అతగాడిని బలపరచాలన్న అభిప్రాయం ప్రజలలో కలిగిన అంశం చరిత్రలో తెలిసిందే. అలాగే మన దేశంలో బాబరీ మసీదు కూల్చివేత కూడా ప్రజాభిప్రాయం, అభిష్టం మేరకే బహిరంగంగానే జరిగింది తప్ప దానిలో కుట్రేమీ లేదని చెబుతున్న విషయం తెలిసిందే. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా వినియోగపడతానని రామకృష్ణ కవిచేత చెప్పించారు. చట్టపరంగా ఓటింగ్‌ జరిపి తేలింది తప్ప మిగిలిన ప్రజాభిప్రాయాలన్నీ ఎలా కావాలంటే అలా వినియోగపడేవే.

ఒక చట్ట సభను కించపరచవచ్చా అంటే ఎవరూ సమర్ధించరు. కానీ చట్ట సభలలో జరుగుతున్న విషయాలను చూస్తే నేడు వాటి పట్ల ఎందరిలో సానుకూల వైఖరి వుంది. అనేక అవాంఛనీయ విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి, వుదంతాలు జరుగుతున్నాయి. సభాధ్యక్షుల నిర్ణయం మేరకు అనేక అంశాలు రికార్డుల నుంచి తొలగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్న కారణంగా అవన్నీ సమాజ రికార్డులలో నమోదు అవుతున్నాయి. వాటిని తొలగించే అవకాశం లేదు. అధికారాన్ని వుపయోగించలేరు. కర్ణాటక, గుజరాత్‌ అసెంబ్లీలలో ప్రజా ప్రతినిధులు, మంత్రులు సైతం తమ సెల్‌ఫోన్లలో బూతు చిత్రాలు చూస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వారిని అరెస్టు చేసి శిక్షించినట్లు వార్తలు లేవు. ఒక వీధిలో ఎ ఇద్దరు కొట్లాడుకున్నా చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవచ్చు. మన దేశంతో సహా అనేక దేశాలలో చట్ట సభలలో కొట్టుకున్న ప్రజాప్రతినిధులపై ఎక్కడా కేసులు నమోదు చేసినట్లు మనకు తెలియదు. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విషయాలు తెలిసిందే. అందుకనే ఒక గూండా బొమ్మ గీసి నా అడ్డా అసెంబ్లీలో వేయాలని వుంది అంటే అది అసెంబ్లీని కించపరిచినట్లు అవుతుందా ? అవదు, అయితే రవి కిరణ్‌ చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి అనే బోర్డుతో వున్న భవనపు బొమ్మ వుంది కనుకనే చట్టపరమైన సమస్యలు వచ్చాయి. ఐరోపాలోని ఐర్లండ్‌ పార్లమెంట్‌ భవనపు బొమ్మపై మార్ఫింగ్‌తో సర్కస్‌ టెంటు వేసి సర్కస్‌, ప్రవేశం అని రాశిన బొమ్మను ఎవరైనా చూడవచ్చు. పార్లమెంట్‌ను ఒక సర్కస్‌గా వర్ణించిన ఆ విమర్శకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ బొమ్మను దిగువ చూడండి.

Image result for derogatory jokes,cartoons on legislative buildings, ireland

ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్‌ నిర్మించిన ఒక సినిమాలో ఒక పాత్రను మరో పాత్ర దద్దోజనం అని హేళన చేస్తుంది. అలాగే మరో సినిమాలో పండూ అని పిలిస్తే హీరోయిన్‌ ఎంతలా రెచ్చి పోతుందో తెలిసిందే. ఇండ్లలో వున్నంత వరకు కుటుంబ సభ్యులు, బాగా సన్నిహితులైన ఇరుగుపొరుగు పిల్లలకు చిన్నతనంలో పెట్టిన కొన్ని ముద్దు పేర్లు పెద్దయిన తరువాత కూడా వారిని వదలి పెట్టవు. ఎండ పెరిగే కొద్దీ దున్నలు రెచ్చిపోయి పొలందున్నుతుంటాయి, అదే ఎద్దులు ఎండ పెరిగే కొద్దీ నీడలోకి జారుకొనేందుకు లాగుతాయి. రాజకీయాలలోకి అంటే బహిరంగ జీవనంలోకి వచ్చిన తరువాత ప్రత్యర్ధులు కొన్ని పేర్లు పెడుతూ వుంటారు. అలాంటపుడు ఎంత ప్రతికూల వాతావరణం వున్నా పోలిక కాస్త ఇబ్బంది పెట్టినా దున్నపోతుల మాదిరి వాటన్నింటినీ భరించే విధంగా తయారు కావాలి తప్ప ఎద్దుల్లా సున్నితంగా వ్యవహరించకూడదు. లేదంటే రాజకీయాలకు దూరంగా వుండాలి. అనేక దేశాలలో ప్రత్యర్ధుల మీద ఎన్నో జోకులు వేస్తుంటారు. సందర్భం వచ్చినపుడు ప్రత్యర్ధులు కూడా అదే ప్రయోగం చేస్తుంటారు. వాటిని తేలికగా తీసుకోవాలి తప్ప అంతకు మించి పోకూడదు. కెనడా పార్లమెంట్‌ బొమ్మ వేసి ఎంపీలు, స్పీకర్‌పై వేసిన జోకును చూడండి.

Image result for derogatory jokes,cartoons on legislative buildings

క్షమించాలి స్పీకర్‌ గారూ పరస్పరం గౌరవించుకొనే మన యత్నాలలో భాగంగా దానిని మరో రూపంలో నన్ను చెప్పనివ్వండి !

గౌరవ నీయులైన ప్రతిపక్ష సభ్యుడు దయచేసి సున్నితమైన నోటిలో వున్న వాటిని బయటకు రాకుండా మూస్తారా !

చట్ట సభలలో వుపయోగించే భాషపై వేసిన జోక్‌ ఇది. అంటే దాని అర్ధం మొత్తం సభ్యులందరూ అలా వున్నారంటూ మా మనోభావాలను కించపరిచారని ఎవరూ ఆ కార్టూనిస్టు మీద చర్య తీసుకోలేదు. తొలి ప్రధాని నెహ్రూ ప్రభుత్వం, మంత్రుల వ్యవహారశైలి గురించి ప్రముఖ కార్టూనిస్టు శంకర్‌ తన చిత్రాల ద్వారా ఏకి వదలి పెట్టేవారు. ఒక సందర్భంలో నెహ్రూ నన్ను కూడా వదలి పెట్టవద్దని శంకర్‌తో అన్నారని అందరం చదువుకున్నాం.పూటకో పార్టీ మారుతున్న, అలాంటి వారిని నిస్సంకోచంగా పార్టీలలో చేర్చుకుంటున్న నేటి రాజకీయ నాయకులు కూడా చదువుకోవటం అవసరం.

గీతలతో తమ భావాలను స్వేచ్చగా వెలిబుచ్చే వారికి చట్టపరమైన అవగాహన కూడా అవసరం అని గతంలో కూడా అనేక అనుభవాలు రుజువు చేశాయి. ఐరోపాలోనో మరొకచోటో అలాంటి కార్టూన్లు వేస్తే సహించారు కదా ఇక్కడెందుకు చేయరు అని వాదిస్తే లాభం లేదు. అక్కడా చట్టాలున్నాయి.మనం బూతు అనుకొనే పదాలతో మరింత పచ్చిగా విమర్శలు, వ్యాఖ్యలు చేయటాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకొనే దశను వారు దాటిపోయారు. పార్టీ మారిన వారు పూర్వపు పార్టీ పదవులకు రాజీనామా చేయాలన్నది ఒక నాటి నీతి. అలాంటిదేమీ లేదు ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా చివరకు మంత్రి పదవులు కూడా పుచ్చుకోవచ్చన్నది నేటి ఆచరణ. అంటే సిగ్గుపడే దశను దాటి ముందుకు పోయాం. అలాంటి వారిపై గౌరవనీయ చట్ట సభలు, వాటి అధిపతులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. రక్షిస్తున్నారనే ఫిర్యాదులు, విమర్శలున్నాయి. రాజ్యాంగాన్ని అమలు జరిపే గవర్నర్లు సైతం అలాంటి వారి చేత ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నారు. మన రాజ్యాంగం, చట్టాలు, నిబంధనలలో వున్న లొసుగుల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో దిగంబర కవులుగా పేరు పెట్టుకున్న వారు పార్లమెంటు, అసెంబ్లీలను ఎలా తిట్టిపోశారో తెలిసిందే. ఇప్పుడు చట్ట సభలు, వాటిలో జరుగుతున్న వాటి గురించి నైతికంగా ఆలోచించే వారందరూ దిగంబరు కవులు కాకుండానే వాటిని ఏవగించుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో సాంకేతికపరమైన, చట్టపర అంశాలకు అతీతంగా ఆలోచించి మందలింపుతోనో మరొక చర్యతోనో సరిపెట్టి కార్టూనిస్టు రవి కిరణ్‌పై క్రిమినల్‌ చర్యలను వుపసంహరిస్తే తెలుగు దేశం పార్టీకి సామాజిక మాధ్యమంలో జరిగిన నష్టం నివారించబడుతుంది. అటువంటి విశాల వైఖరిని వారు ప్రదర్శిస్తారా ?