Tags

, , , , ,

Image result

ఎం కోటేశ్వరరావు

మే డే, కార్మికుల దీక్షా దినం. ప్రపంచ వ్యాపితంగా కార్మికవర్గం తన హక్కుల సాధనకోసం పునరంకితమయ్యే అంతర్జాతీయ దినం. అంబేద్కర్‌ అంటే దళితుల నాయకుడని, ( మరీ కొంత మంది అయితే దళితులలో ఒక వుప కులానికే పరిమితం చేసే విచారకర ప్రయత్నం గురించి చెప్పనవసరం లేదు.) మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఓబిసిల నేతగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది.ఈ ఇద్దరికీ కమ్యూనిస్టులు వ్యతిరేకమనే తప్పుడు ప్రచారం కొందరు చేస్తున్నారు.మరికొందరు వారిని తమ మనువాద, తిరోగామి చట్రంలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది తెలిసి చేసినా తెలియక చేసినా చరిత్రలో వారి స్ధానాన్ని తక్కువ చేసి చూపటమే. ఈ ప్రచారానికి ప్రభావితమైన వారు మే డే సందర్భానికి పూలే,అంబేద్కర్‌లకు సంబంధం ఏమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చు.

Image result for narayan meghaji lokhande

మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు, కార్మిక, సామాజిక సమస్యలపై కేంద్రీకరించిన తొలి పత్రిక ‘దీన బంధు ‘ సంపాదకుడు నారాయణ్‌ మేఘాజీ లోఖండే అని, ఆయన మహాత్మా జ్యోతిబా పూలే ఏర్పాటు చేసిన సత్య శోధక సమాజ కార్యక్రమాల వుత్తేజంతోనే దేశంలోనే తొలి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లో జన్మించిన నారాయణ్‌ కేవలం 49 సంవత్సరాల కే ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవలందిస్తూ అనారోగ్యంతో మరణించారు. రైల్వే, తపాల శాఖలో పని చేసిన ఆయన 1870లో మాండవీ బట్టల మిల్లులో స్టోరు కీపరుగా చేరారు. ఆ సమయంలో మిల్లు కార్మికుల దయనీయ స్ధితిని ప్రత్యక్షంగా చూశారు. కార్మికుల పని పరిస్థితుల గురించి ఎలాంటి చట్టాలు లేవు. పొద్దు పొడవక ముందే మిల్లు పనిలోకి రావాలి.పొద్దు పోయేంత వరకు పని చేయాలి. ఇంటికి వెళ్లి రావటంలో అలస్యం అయితే యజమానులు అంగీకరించరు కనుక అనేక మంది రాత్రి డ్యూటీ దిగి గేటు దగ్గరే నిద్రపోయి తెల్లవారు ఝామున లేచి తిరిగి పనికి వెళ్లే వారు. మధ్యలో భోజనానికి పావు గంటా ఇరవై నిమిషాలు మాత్రమే అనుమతించేవారు. ఇక ఫ్యాక్టరీలలో కాలకృత్యాలు తీర్చుకొనే సౌకర్యాలు, తగిన గాలి, వెలుతురు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కొన్ని పండుగలకు ఇచ్చే సెలవులు తప్ప 365రోజులూ పని చేయాల్సిందే. దీనికి తోడు దాదాపు రోజంతా యంత్రాలు పని చేసిన కారణంగా వాటి రాపిడికి ఫ్యాక్టరీలో వేడి వాతావరణం వుండేది. దీంతో కార్మికులు అయిదారు సంవత్సరాలకు మించి పని చేయలేకపోయే వారు.1881 లెక్కల ప్రకారం బొంబాయి మిల్లులలో పని చేసే వారిలో 23శాతం మంది 15 ఏండ్ల లోపు బాల కార్మికులు వుండేవారు. రోజు పది నుంచి 14 గంటలు పని చేసేవారు.

వీటన్నింటినీ ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన నారాయణ్‌ ఆ పరిస్థితులు మారాలనే ప్రచారానికి పూనుకున్నారు.1877లో ప్రారంభమైన దీన బంధు పత్రిక ఆర్ధిక ఇబ్బందులతో వెంటనే మూత పడింది. దానిని తిరిగి పునరుద్ధరించి 1880లో సంపాదక బాధ్యతలు చేపట్టిన నారాయణ్‌ మరో నాలుగు సంవత్సరాలకే బాంబే మిల్‌ హాండ్స్‌ అసోసియేషన్‌ పేరుతో తొలి కార్మిక సంఘాన్ని 1884లో ఏర్పాటు చేశారు. అమెరికా, తదితర దేశాలలో జరుగుతున్న కార్మికోద్యమాలను చూసిన బ్రిటీష్‌ ప్రభుత్వం 1875లోనే ఒక కమిషన్‌ వేసి 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టాన్ని చేసింది. అయితే దానితో కార్మికుల పని పరిస్థితులలో పెద్దగా మార్పేమీ లేదు. అదెంత కంటి తుడుపు వ్యవహారమంటే ఏడు సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టరాదని, 7-12 ఏండ్ల బాల కార్మికులతో తొమ్మిది గంటలకు మించి పని చేయించరాదని, యంత్రాల చుట్టూ కంచెలు వేయించాలనే తరహా నిబంధనలు పెట్టింది. వీటిని కూడా యజమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. కనీసం దానిని కూడా అమలు జరిపే యంత్రాంగం, ఆసక్తి ప్రభుత్వానికి లేదు. నారాయణ్‌ మేఘాజీ తన పత్రిక ద్వారా, ఇతర పద్దతులలో దాని వలన పెద్ద కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదని ప్రచారం చేయటంతో పాటు, కార్యాచరణకు గాను ముందే చెప్పుకున్నట్లు 1884లో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అదే ఏడాది ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్మికుల సంక్షేమ చర్యలలో భాగంగా ప్రమాదానికి గురైనపుడు సాయం, మరణించినపుడు గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్‌ వంటి వాటిని అమలు జరపాలని కోరుతూ మిల్లు కార్మిక సంఘ అధ్యక్షుడి హోదాలో ఆ కమిషన్‌కు ఒక పిటీషన్‌ అందచేశారు.దానిపై వేలాది మంది కార్మికుల సంతకాలను సేకరించారు. ఒకవైపు వాటితో పాటు 1884 సెప్టెంబరు 23న తొలిసారిగా కార్మికుల సభను ఏర్పాటు చేసి అవే డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ వారానికి ఒక రోజు ఆదివారం సెలవు ఇవ్వాలని, వుదయం ఆరున్నర నుంచి సాయంత్రం పొద్దుగూకే వరకు మాత్రమే పని చేయించాలని, మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి ఇవ్వాలని కూడా సభ ఒక తీర్మానం చేసింది.అయితే వాటిని యజమానులు అంగీకరించలేదు.

1890 నాటికి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఒక సంక్షోభం వచ్చింది. వస్త్రాలకు డిమాండ్‌ లేని కారణంగా మిల్లులను మూసివేస్తున్నామని యజమానులు ఏకపక్ష చర్యలకు పూనుకున్నారు. దానికి నిరసనగా 1890 ఏప్రిల్‌ 24న లోఖండే ఒక పెద్ద కార్మిక సభను నిర్వహించారు. అదే ఏడాది జూన్‌ పదిన యజమానుల సమావేశంలో ఆదివారం రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. దీన్ని రెండు రకాలుగా వ్యాఖ్యానించవచ్చు. సంఘటిత కార్మికవుద్యమానికి లభించిన విజయంగా ఒకటి. మార్కెట్‌లో వున్న మాంద్యం ఎంతకాల కొనసాగుతుందో తెలియదు కనుక ఒక రోజు సెలవు ఇస్తే వచ్చే నష్టం కంటే పని చేస్తే తమపై పడే భారం ఎక్కువ కనుక యజమానులు సెలవుకు అంగీకరించారన్నది మరొకటి.

అంతకు ముందు ఆమోదించిన ఫ్యాక్టరీ చట్టం కార్మికులను సంతృప్తి పరచకపోవటం, ఆందోళనలు పెరిగి పోవటంతో ప్రభుత్వం 1890లో ఫ్యాక్టరీ లేబర్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది.దానిలో లోఖండేను సహ సభ్యునిగా నియమించింది. దాని సిఫార్సుల మేరకు 1891లో ఆమోదం పొంది మరుసటి ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం పది మంది వున్న ఫ్యాక్టరీలన్నింటికీ వర్తించింది. తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలతో పనిపై నిషేధం, 14 ఏండ్ల లోపు వారికి, మహిళల చేత 9,11 గంటలు మాత్రమే పని చేయించాలని, వారికి నెలకు నాలుగు రోజులు సెలవులు ఇవ్వాలని దానిలో పేర్కొన్నారు.

Image result for jyothi rao pule

జ్యోతిబా పూలే తిరుగులేని అనుచరుడిగా వున్న లోఖాండే కార్మికనేతగా పని చేయటానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి సంస్కర్తగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటంతో పాటు అమానుష దోపిడీ, దుర్భర పని పరిస్ధితులలో కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి ప్రతిఘటన పోరాట యోధుడు. నాటి పరిస్థితులలో మహజర్లు సమర్పించటం, సభలు జరపటం వంటి రూపాలనే ఎంచుకోవటం సహజం. తన పత్రికలో రాసిన సంపాదకీయాలను చూస్తే ఈ రెండు అంశాలతో పాటు 1893లో జరిగిన మత ఘర్షణల సందర్భంగా హిందూ-ముస్లిం ఐక్యత అవసరం గురించి ఆయన రాసిన సంపాదకీయాలు మతశక్తుల పట్ల వైఖరిని వెల్లడించాయి. అన్ని మతాల వారితో ఏర్పాటు చేసిన సమ్మేళనానికి 60వేల మంది హాజరయ్యారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలను ఆయన నిరసించాడు.కార్మిక నేతగా ప్రత్యేకంగా మహిళాకార్మికులను సమీకరించి కూడా సభలు జరిపారు. భర్త మరణించినపుడు స్త్రీల తలలు గొరిగి గుండ్లు చేయటాన్ని ఆయన వ్యతిరేకించారు.1890 మార్చినెలలో దాదాపు ఐదు వందల మంది క్షురకులను సమీకరించి ఏర్పాటు చేసిన సభలో మహిళలకు గుండ్లు చేయబోమని వారిచేత ప్రతిజ్ఞ చేయించటం ఒక అపూర్వ ఘట్టం. పేదలకు సేవ చేసేందుకు ఆయన ఒక ఆసుపత్రిని కూడా ప్రారంభించారు.1886లో బొంబాయి, పరిసరాలలో వ్యాపించిన ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవ చేస్తూనే 1887 ఫిబ్రవరి తొమ్మిదిన ఆయన మరణించారు.

2005లో ఆయన స్మారకార్ధం పోస్టల్‌ స్టాంపును విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ లోంఖడేలో జ్యోతిబా పూలే సామాజిక సంస్కరణ, మహిళాభ్యుదయంతో పాటు కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కార్మిక పక్షపాతం కూడా మిళితమై వుందని చెప్పారు. మొత్తం మీద చూసినపుడు లోఖండేలో సంఘసంస్కర్త పాలు ఎక్కువా లేక కార్మికోద్యమ నేత పాలు ఎక్కువగా అన్నది పక్కన పెడితే బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు రావు బహద్దూర్‌ బిరుదును ప్రకటించటాన్ని బట్టి ఒక సంస్కర్తగానే చూసిందన్నది స్పష్టం. ఒక కార్మిక నేతకు అలాంటి బిరుదులను వూహించలేము. అంతమాత్రాన కార్మికోద్యమానికి ఆయన వేసిన బలమైన పునాదిని విస్మంరించకూడదు.

Image result for ambedkar

భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌ జీవితాన్ని పరిశీలించినపుడు ఆయనలో వున్నన్ని భిన్న పార్శ్వాలు మరే నాయకుడిలోనూ లేవంటే అతిశయోక్తి కాదు. అటువంటి మహానుభావుడిని కొందరు నేడు దళితులలో ఒక వుప కుల ప్రతినిధిగా చూస్తూ కొందరు ఆరాధిస్తుంటే అదే కారణంతో మరికొందరు ఆయనను విస్మరిస్తున్నారు. రెండు వైఖరులూ సరైనవి కావు. అంబేద్కర్‌ రాజ్యాంగ పద్దతులలో కార్మికవర్గానికి చేసిన మేలు తక్కువేమీ కాదు. ఆయన ఇండియన్‌ లేబర్‌ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా రైతాంగ సమస్యలపై కూడా పని చేశారు. మొత్తం మీద చూసినపుడు మొగ్గు రాజ్యాంగం, చట్టాలు, దళితుల అభ్యుదయానికి ఆయన మారుపేరుగా మారారు.

Image result for may day

మే డే సందర్భంగా పూలే, అంబేద్కర్‌లను విస్మరించలేము. పూలే, ఆయన సత్యశోధక సమాజం, సంస్కరణలకోసం కృషే నారాయణ మేఘజీ లోఖండేను కార్మిక పక్షపాతిగా కూడా మార్చిందన్నది స్పష్టం.ఈ సందర్భంగా పూలే, లోఖండే, అంబేద్కర్‌లను వామపక్ష వుద్యమం విస్మరించిందనే ఒక విమర్శ వుంది. దాని మంచి చెడ్డల విషయానికి వస్తే అది గత చరిత్ర. నేడు వామపక్షాలు గతం కంటే వారి కృషిని గుర్తించిన మాట వాస్తవం. కార్మిక, కర్షక వుద్యమాలు, సంఘాల నిర్మాణాలతో పాటు దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులు, మహిళల ప్రత్యేక సమస్యలు, హక్కుల గురించి పోరాడేందుకు ఏర్పాటు చేస్తున్న సంఘాలు, వాటి కార్యకలాపాలే అందుకు నిదర్శనం. వాటిని గుర్తించేందుకు కొంతకాలం పట్టవచ్చు. గతంలో పూలే, అంబేద్కర్‌లను వామపక్షాలు సముచిత స్ధానంతో గౌరవించలేదని విమర్శించే వారు తాజా వైఖరిలో వచ్చిన మార్పును గమనించ వచ్చు. లేదూ అది చాలదు అనుకుంటే తమ అభిప్రాయాలను తాము అట్టి పెట్టుకోవచ్చు. ఈ సందర్భంగానే పూలే-అంబేద్కరిస్టులుగా ముద్రపడిన వారి గురించి కూడా కొన్ని విమర్శలున్నాయనే అంశాన్ని మరచి పోకూడదు. కార్మిక, కర్షక సమస్యలకు ఇచ్చిన ప్రాధాన్యతను కమ్యూనిస్టులు కుల వివక్ష సమస్యకు ఇవ్వలేదని ఎలా విమర్శలు వచ్చాయో, పూలే-అంబేద్కరిస్టులు కుల వివక్ష సమస్యకే పరిమితమై కార్మికవర్గ పోరాటాలను విస్మరిస్తున్నారనే ఆ విమర్శ. అందువలన ఇద్దరు మిత్రులూ ఎవరి వైఖరికి వారు కట్టుబడి వున్నప్పటికీ రెండు సమస్యల మీద ఐక్య వుద్యమాలు చేయటానికి అవి ఆటంకం కానవసరం లేదు. అవి మిత్ర వైరుధ్యాలు తప్ప శత్రువైరుధ్యాలు కావు. అందువలన ఇప్పుడు రెండు వైపుల నుంచీ వినిపిస్తున్న లాల్‌ -నీల్‌ ఐక్యతను పెంపొందించేందుకు చిత్తశుద్దితో కృషి చేయటం అవసరం. ఈ మేడే సందర్భంగా రెండు శక్తులూ కర్తవ్యానికి పునరంకితం కావటమే చికాగో అమర జీవులు, పూలే-అంబేద్కర్‌లకు నిజమైన నివాళి.