Tags

, , , , ,

Image result for anti communist

ఎం కోటేశ్వరరావు

మొన్ననే మహాకవి శ్రీశ్రీ జయంతి జరుపుకున్నాం. అనేక అంశాలను విస్మరిస్తున్నట్లుగానే ఆయన చేసిన రచనలను కూడా చదవటం తగ్గిపోతోంది. ఆయన రచనలలో ఒకదానిలో ఎంత వున్నతమైన సందేశం దాగి వుందో చూడండి.

కుక్క పిల్లా / అగ్గిపుల్లా/ సబ్బు బిళ్లా

హీనంగాచూడకుదేన్నీ/కవిత్వమేనోయ్‌ అన్నీ

రొట్టె ముక్కా/అరటి తొక్కా/బల్లచెక్కా

నీ వైపే చూస్తుంటాయ్‌/ తమ లోతు కనుక్కో మంటాయ్‌

ఇక శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌ భాషలో చెప్పాలంటే ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది. రోజులన్నీ ఒకే విధంగా వుండవు. అంటే ప్రతి వారికీ ఏదో ఒక రోజు తామేమిటో నిరూపించుకొనే అవకాశం వస్తుంది. దానికి కమ్యూనిస్టులు మినహాయింపు ఎలా అవుతారు ? ఎరుపంటే భయం భయంగా చూసే అనేక మందికి ఈ చిన్న లాజిక్కు ఎందుకు అర్ధం కాదో తెలియదు. సినిమా వారు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన పదాలలో ‘గీకటం లేదా గోకటం ‘ ఒకటి. ఇష్టం వున్న వారు ఆ పని చేస్తే కథ సుఖాంతం అవుతుంది. లేకపోతే ఏం జరిగేదీ మనం రోజూ చూస్తున్నదే. బెంగాల్‌లో కమ్యూనిస్టులు అధికారాన్ని కోల్పోయిన చాలా సంవత్సరాల తరువాత ఈ మధ్య ఒక కుటుంబం తమ అమ్మాయికి కమ్యూనిస్టు రాజకీయాలు వున్న వరుడు కావాలని ఒక ప్రకటనలో కోరినట్లు వార్తలు వచ్చాయి. అంటే కమ్యూనిస్టు అబ్బాయి చాలా మంచోడు ( సమాజ దుష్ట ప్రభావం పడో, మరొకటో జరిగో మిగతావారి మాదిరి భార్యలను వేధించే వారు లేరని కాదు) అన్నది వారి అనుభవం. చాలా మంది దృష్టిలో కమ్యూనిస్టులు ఈ కాలానికి పనికిరాని మంచి వారు. వారి వలన ముప్పు లేదని ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేక అధిపతి అమెరికా పాలకులే పాతికేండ్ల క్రితం ప్రకటించారు. అలాంటపుడు వారి మానాన వారిని వదిలేయాలి కదా !

ఆ పని చేయకుండా అనవసరంగా కొంత మంది వ్యతిరేకులు కమ్యూనిస్టులను గోకుతున్నారు. అమెరికాలోని సియాటిల్‌ మరికొన్ని చోట్ల మేడే రోజున కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రదర్శనలు జరటం, ఆ సందర్భంగా మీడియా నిండా చెడరాయటం, చూపటం దానిలో భాగమే. వామపక్షం, సోషలిజం, కమ్యూనిజం భావజాలానికి దూరంగా వున్న యువతలో కూడా ఇదేమిటి అన్న ఆసక్తి కలిగించి కొంత మందిని అయినా ఆ వైపు నెడుతున్నందుకు అలాంటి వారిని సహజంగానే కమ్యూనిస్టులు అభినందిస్తారు. అలా వచ్చిన వారు మరింత గట్టిగా తయారు కావటం తెలిసిందే.

మే ఒకటవ తేదీన ప్రపంచ వ్యాపితంగా కార్మికదినాన్ని పాటించారు. ఈ సందర్బంగా ఇష్టం వున్న, లేని మీడియా పెద్దలు కూడా ఆరోజు గురించి చెప్పక తప్పలేదు. ‘అమెరికన్‌ స్పెక్టేటర్‌ ‘ అనే ఒక పత్రికలో ‘ డియర్‌ కామ్రేడ్‌ ఏ ట్రంప్‌డ్‌ అప్‌ మే డే ‘ అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశారు. దీనిలో రెండు అర్ధాలున్నాయి. ప్రియమైన కామ్రేడ్‌ మేడే నగారా వూరించిన ‘ట్రంప్‌ ‘ అని ఒకటైతే ప్రియమైన కామ్రేడ్‌ మే డే నగరా అన్నది మరొకటి. ‘ విధిగా కూలదోయాల్సిన జారు చక్రవర్తి మాదిరి మన అధ్యక్షుడిని చూస్తున్నారు’ అంటూ వుక్రోషంతో తొలి వ్యాక్యంతో ఆ వ్యాసాన్ని ప్రారంభించారు. (అమెరికాలో సామాన్య జనం అధ్యక్ష ఎన్నిక సందర్భంగా నిజంగా అమెరికా అభినవ జారు చక్రవర్తిగా భావించే మెజారిటీ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అయితే అక్కడున్న అప్రజాస్వామిక ఎన్నికల విధానం వలన ప్రత్యక్ష ఓట్లకు బదులు ఎలక్టొరల్‌ కాలేజీలో ట్రంప్‌ను బలపరిచేవారు మెజారిటీ తెచ్చుకొని అతగాడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.)https://spectator.org/a-trumped-up-may-day/ దీనిని జోష్‌ డెక్‌, పాల్‌ కెంగర్‌ అనే ఇద్దరు రాశారు. దీనిలో కమ్యూనిస్టు వ్యతిరేకతకు, వుక్రోషం, వ్యంగ్యానికి, ఆరోపణలకు కొదవ లేదు. డ్రడ్జ్‌ రిపోర్ట్‌ అనే బహుళాదరణ గల వెబ్‌ సైట్‌లో గతంలో తామెన్నడూ చూడని ఒక ప్రత్యేక అంశం అమెరికా కమ్యూనిస్టు పార్టీ వెబ్‌ పత్రిక పీపుల్స్‌ వరల్డ్‌లో ప్రచురితమైన ఒక వ్యాసపు లింక్‌ను చూశామని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే మంటే అమెరికా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ విభాగపు కార్యదర్శి ఎమిలీ షెపర్స్‌ క్యూబా కమ్యూనిస్టు పార్టీ పత్రిక గ్రాన్మాకు ఇచ్చిన ఇంటర్వ్యూ. దానిలో http://www.peoplesworld.org/article/communist-party-membership-numbers-climbing-in-the-trump-era/ అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన తరువాత కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం గురించి అభ్యర్ధనలు పెద్ద ఎత్తున పెరిగాయని, అయితే అమెరికా అంతటా ఇప్పటికీ మెకార్ధీ కాలం నాటి భూతం(కమ్యూనిస్టు వ్యతిరేక) ఇప్పటికీ కనిపిస్తున్నప్పటికీ కమ్యూనిస్టు భావజాల గురించి ఆసక్తి పెరుగుతోందని చెప్పటాన్ని వారు నొక్కి వక్కాణించారు. వారు కమ్యూనిస్టు పార్టీతో పాటు డిఎస్‌ఏ అనే ఒక వామపక్ష పార్టీ గురించి కూడా తమ వ్యాసంలో వ్యాఖ్యానించారు. వాటిని పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన వారు పైన ఇచ్చిన లింక్‌ ద్వారా చదువు కోవచ్చు. అయితే వ్యాసాన్ని ముగిస్తూ వారు చెప్పిన మాటలను మననం చేసుకోవటం అవసరం.

Image result for anti communist

‘ అందరికీ కొంత ప్రత్యేకమైనది వుంది ప్రియమైన కామ్రేడ్‌, అది నిజమైన కమ్యూనిస్టు పూలు, పండ్లతో నిండి వున్న కల్పవృక్షం’. దేశ వ్యాపితంగా మేడేను నిర్వహించటం ద్వారా వలస వచ్చిన వారు, మహిళలు, కార్మికులు, నల్లజాతి జీవన్మరణ వుద్యమం, పర్యావరణవేత్తలు, మరియు ట్రంప్‌ ముప్పు ఎదుర్కొంటున్న అందరూ ఐక్యం కావటానికి మంచి అవకాశమని జాకోబిన్‌ పత్రిక రచయిత్రి కష్మా సావంత్‌ వివరించినట్లుగా పెద్ద బృందాలైన ప్లానెడ్‌ పేరెంట్‌ హుడ్‌ ( ఏంజెలా డేవిస్‌ సహ అధ్యక్షురాలితో పాటు మహిళా ప్రదర్శన నిర్వహించినవారు) వంటి పెద్ద బృందాల మద్దతు పొందటం ద్వారా మేడే ట్రంప్‌ వ్యతిరేక ప్రతిఘటనలో అది అంతర్బాగం అవుతుందనే ఆశాభావాన్ని సావంత్‌ వ్యక్తం చేశారు. విస్తృతమైన వామపక్షం -దీనిలో డెమోక్రటిక్‌ పార్టీ వుంటుందని చెప్పనవసరం లేదు- అణచివేత, దోపిడీ, వివక్ష రూపాలు, వ్యవస్ధల గురించి వాటికి గురైన శక్తులు తరచుగా పరస్పరం తమ అనుభవాలను కలబోసుకుంటూ వుమ్మడి సామాజిక అస్తిత్వాన్ని పంచుకొనే నూతన అవగాహనను(ఇంటర్‌ సెక్షనాలిటీ) అనుసరించటం ఇటీవల వామపక్ష శక్తుల మధ్య ప్రారంభమైంది. దీనిని ప్రముఖంగా ప్రస్తావించటం ద్వారా పలు బాధిత బృందాలను కలుపుకొంటూ వారి అణచివేతకు మూలం ట్రంప్‌ మరియు రిపబ్లికన్‌ పార్టీ అని స్పష్టం చేయటం ద్వారా కొత్త ప్రాంతాలకు విస్తరించటం , కొత్త వారిని ఆకర్షించటం సమరశీల వామపక్ష లక్ష్యంగా వుంది. ఈ 2017 మేడే ఒక పెద్ద ప్రచారం, ఐక్యతను పెంపొందించే అవకాశం.ఈ ఏడాది అంతర్జాతీయ మేడేను పాటించటానికి ఒక ప్రత్యేకత వుంది. ఇది రష్యన్‌ విప్లవ శతవార్షిక సందర్బం.’

ఇలా చెబుతూనే చివరికి తమ వుక్రోషాన్ని కూడా ఎలా వెలిబుచ్చారో చూడండి.’ బోల్షివిక్‌లు తమ చారిత్రాత్మక హింస, అణచివేత ప్రారంభించిన వంద సంవత్సరాల తరువాత కూడా నూతన అధ్యక్షుడికి వ్యతిరేకంగా ‘భిన్నత్వం, ఏకీకరణ,’ప్రతిఘటన పేరుతో పెద్ద సంఖ్యలో అమెరికన్‌ వామపక్ష వాదులు తమకు తెలియకుండానే లెనిన్‌ చెప్పినట్లు ప్రయోజనకరమైన బుద్ధి హీనుల( యూజ్‌ఫుల్‌ ఇడియట్స్‌) మాదిరి ఒక అణచివేత భావజాలానికి విశ్వాసపాత్రులుగా మారుతున్నారు.’ ముందే చెప్పినట్లు ‘పీపుల్స్‌ వరల్డ్‌ ‘లోని కమ్యూనిస్టు ఇంటర్వ్యూను గోకటం ద్వారా స్పెక్టేటర్‌ పత్రిక తన పాఠకులందరికీ దాని మీద ఆసక్తి రేకెత్తించింది. అంతకు ముందు వినని వారు తప్పకుండా ఏం చెప్పారో, లెనిన్‌ ఆ పదాన్ని ఏ సందర్భంగా వాడారో, దాని మీద ఈ వ్యాస రచయితలు ఎందుకు విరుచుకుపడుతున్నారో అనే వుత్సుకత కలుగుతుంది. వానపడుతున్నా కదలని…… మాదిరి ఏమీ పట్టని వారికి ఇది వర్తించదని మనవి.

అమెరికన్‌ మేథావులు తాజాగా మార్క్సిజం లెనినిజం పట్ల ఆకర్షితులు కావటంపై కొందరు వుక్రోషం వెలి బుచ్చటం అర్దం చేసుకోగలిగినదే. పెట్టుబడిదారీ విధానం ఎందుకు విఫలం అవుతున్నదో, ఆర్ధిక అసమానతలు ఎందుకు పెరుగుతున్నాయో ఆ విధాన సమర్ద పండితులు చెప్పలేకపోతున్నారు. సోషలిస్టు, కమ్యూనిస్టు సమాజాల విశ్లేషకులు వాటికి కారణాలు చెబుతున్నపుడు యువతరం, మేథావులు ఆకర్షించటం సహజం. లెనిన్‌ వుపయోగించిన పదాన్ని అసందర్బంగా వుపయోగించటం రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. అందువల పై వ్యాస కర్తలు పేర్కొన్న గ్రాన్మా పత్రికలో అమెరికా కమ్యూనిస్టు నేత ఏం చెప్పారో చూద్దాం. సెర్గియో అలెగ్జాండరో గోమెజ్‌ స్పానిష్‌ భాషలో వున్న ఇంటర్యూను ఆంగ్లంలో సంక్షిప్తీకరించారు. దానిని గ్రాన్మాతో పాటు పీపుల్స్‌ వరల్డ్‌ వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించారు. ‘ అమెరికాలో అంతర్ధానం అయ్యేందుకు తిరస్కరిస్తున్న కమ్యూనిజం ‘ అనే శీర్షికతో గ్రాన్మా ప్రచురించింది. http://en.granma.cu/mundo/2017-04-17/communism-refuses-to-disappear-in-the-united-states

‘డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని దాని కంటే అమెరికన్‌ కమ్యూనిస్టు పార్టీకి సభ్యత్వ అభ్యర్దనలు అందుతున్నాయి. 1919లో వారి పార్టీ ఏర్పడినప్పటికీ 1917లో అక్టోబర్‌ విప్లవం సంభవించినపుడు తొలిసారిగా మార్క్సిస్టు భావజాలంతో సంఘటితమైన వారిలో అమెరికన్‌ పౌరులు కూడా వున్నారు, త్వరలో శత వార్షికోత్సవం జరుపుకోనున్నారు. పార్టీ ఏర్పాటయిన నాటి నుంచి రెండు యుద్దాల మధ్యకాలం, ప్రచ్చన్న యుద్ద అణచివేతలో, దీనిలో వాస్తవంగా రహస్య సంస్దగా పని చేయాల్సి వచ్చింది. ముఫ్పై కోట్ల మంది జనం వున్న దేశంలో ప్రస్తుతం ఐదువేల మంది సభ్యులు వున్నారు. మెకార్ధీ కాలం నాటి భూతం అమెరికా అంతటా ఇప్పటికీ వున్నప్పటికీ కమ్యూనిస్టు భావజాలం పట్ల అమెరికాలో ఆసక్తి పెరుగుతోంది.

ఎమిలీ షెపర్స్‌ వృత్తి రీత్యా మానవశాస్త్రవేత్త, దక్షిణాఫ్రికాలో జన్మించారు. జాత్యహంకార వ్యవస్దను తప్పించుకొనేందుకు ఆయన తలిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు. ఎమిలీ 1987లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. అయితే మార్క్సిస్టు భావజాలం ఆయన చిన్నతనంలోనే మేరీ లాండ్‌, చికాగో సమీపంలోనిఒక పోర్టారికో నివాస ప్రాంతంలోనే అబ్బింది. ‘ కమ్యూనిస్టు పరిభాషలో చెప్పాలంటే అమెరికాలో ఏ రీత్యా చూసినా విప్లవానికి ముందుండే పరిస్ధితి లేనప్పటికీ ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ విధానం అంత్య దశలో వున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ద్రవ్య సంక్షోభం అనేక మందిని ప్రభావితం చేసింది. వామపక్షాలుగా చెప్పాలంటే తలిదండ్రుల కంటే వారి పిల్లలు అత్యంత హీన స్ధితిలో వున్నారు. దేశంలోని మెజారిటీ పౌరులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ఇటీవలి డెమోక్రటిక్‌ లేదా రిపబ్లికన్‌ పార్టీల ప్రభుత్వాలు పరిష్కరించగలిగిన స్ధితిలో లేవు. జనంలో వున్న అసంతృప్తి అన్ని వేళలా సరైన పురోగమన బాట పట్టదు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికలలో సైద్ధాంతిక పరమైన తిమ్మినిబమ్మిని కారణంగా ఒక మితవాద వైఖరికి దారితీసింది. మా స్వంత రాష్ట్రమైన వర్జీనియా కేవలం ధనవంతమైనదే కాదు, ఎందరో తెల్లవారైన పేదలు కూడా వున్నారు. వారంతా ట్రంప్‌కు ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు. బొగ్గు తవ్వకం ఆప్రాంతంలో ప్రధాన వుపాధి వనరు. ఇటీవలి సంవత్సరాలలో వేలాది మంది కార్మికులను పనుల నుంచి తొలగించారు. రిపబ్లికన్లు దీనంతటికీ బరాక్‌ ఒబామా పర్యావరణ విధానాలు కారణమని ప్రచారం చేశారు.

డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి ఎన్నిక ప్రచారం సందర్బంగా మిలియన్ల మంది యువత బెర్నిశాండర్స్‌ పురోగామి భావజాలం వైపు సమీకృతమయ్యారు.శాండర్స్‌ కనుక ట్రంప్‌ ప్రత్యర్ధి అయి వుంటే ఆయన గెలిచి వుండేవారు.ఈ నేపధ్యంలోనే షెపర్స్‌ ప్రస్తావించిన ‘కుహనా వర్గ చైతన్యం ‘ మరియు తిమ్మిని బమ్మిని చేయటాన్ని వ్యతిరేకించటానికి వామపక్షం ఇవ్వాల్సిన ప్రాధాన్యతను అమెరికా కమ్యూనిస్టు పార్టీ ఎత్తి చూపింది.’ మీడియాను కార్పొరేషన్లు అదుపు చేసిన స్ధితిలో స్ధానిక న్యూస్‌ ఛానల్స్‌లో ప్రసార బోధకులు ప్రపంచం అంతం కావటం గురించి చెబుతున్నపుడు ఇది చాలా కష్టం ‘అని షెపర్స్‌ చెప్పారు. అందుకే అన్ని రకాల పద్దతులలో సాధ్యమైనంత మేరకు తన భావజాలాన్ని జనంతో పంచుకోవటానికి, వారిని చైతన్యవంతులను చేయటాన్ని కమ్యూనిస్టు పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. ఆ రీత్యానే కమ్యూనిస్టు పార్టీ వెబ్‌సైట్‌లో కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమం, పార్టీలో ఎలా చేరాలనే సమాచారాన్ని పొందుపరిచారు. అయినప్పటికీ కార్మికుల హక్కులను రక్షించుకుంటూ వారి అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా కార్మికులు, కార్మిక సంఘాలను సంఘటితపరచటం ఒక పెద్ద సవాలే అన్నారు.

అమెరికా కమ్యూనిస్టు పార్టీ పాలస్తీనాను సమర్ధిస్తుంది మరియు అమెరికా మిలిటిరిజాన్ని వ్యతిరేకిస్తుంది. అనేక సంవత్సరాలుగా క్యూబా విప్లవాన్ని మరియు ఇటీవల బొలివేరియన్‌ రిపబ్లిక్‌ వెనెజులాను సమర్ధిస్తున్నది. క్యూబాతో సాధారణ సంబంధాలను పునరుద్దరించుకోవాలని అమెరికా ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం చేసిన ప్రకటనను కమ్యూనిస్టు స్వాగతించింది.’2014 డిసెంబరు 17వ తేదీ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది,అయితే అది మంచి వార్త. కొన్ని విషయాలలో ముందుకు పోయినప్పటికీ ఒబామా తాను చేయగలిగినదంతా చేయలేదు’ అని షెపర్స్‌ చెప్పారు. అయినప్పటికీ క్యూబాపై దిగ్బంధనాన్ని ఎత్తివేయాలనేందుకు పార్లమెంట్‌లోని డెమోక్రటిక్‌ మరియు రిపబ్లికన్‌ పార్టీలు రెండింటిలోనూ పెరుగుతోంది.’దీనికి మానవతాపూర్వకమైన మనోభావాలతో కొందరు ఇతరులు ఆర్ధిక ప్రయోజనాలకోసం ఇద్దరూ దిగ్బంధం విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. దిగ్బంధనాన్ని కొనసాగించాలని కోరుతున్న ఏకైక తరగతులెవరంటే ప్రత్యేకించి ఫ్లోరిడాలోని క్యూబన్‌-అమెరికన్లు మాత్రమే ‘ అన్నారు. రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవాలని తాజా సర్వేలో మెజారిటీ అమెరికన్‌ పౌరులు వెల్లడించారు. ట్రంప్‌ ఏం చేస్తాడో మాకు తెలియదు, జనం మాట వింటారా సిద్ధాంతవేత్తల మాట వింటారో తెలియదు. అయితే మొత్తంగా చెప్పాలంటే అమెరికన్‌ కమ్యూనిస్టులు ఆశాభావంతో వున్నారు ‘ అని చెప్పారు.

Image result for pope francis communist

మే డే రోజునే ‘పోప్‌ ఫ్రాన్సిస్‌ కమ్యూనిస్టు గురువు’ అనే శీర్షికతో స్పెక్టేకర్‌ పత్రికే మరో వ్యాసాన్ని కూడా ప్రచురించింది. ‘ రాజకీయ పోప్‌ ‘ అనే పేరుతో జార్జి న్యూమర్‌ రాసిన పుస్తకంలోని కొన్ని భాగాలను దానిలో వుటంకించారు.https://spectator.org/pope-franciss-communist-mentor/ ‘ పోప్‌ నోటి నుంచి వెలువడిన స్వచ్చమైన మార్క్సిజం ఇది ‘ అని రేడియో వ్యాఖ్యాత రష్‌ లింబా, ‘ లెనిన్‌ గారి పోప్‌ ‘ అని మరో వ్యాఖ్యాత మైఖేల్‌ శావేజ్‌ నోరు పారవేసుకున్నారు. వాటి గురించి ఇటాలియన్‌ మీడియాతో మాట్లాడిన సందర్భంగా పోప్‌ తోసి పుచ్చారు.’ నా జీవితంలో నేను ఎందరో మంచి వారైన మార్క్సిస్టులను కలుసుకున్నాను. అందువలన అలాంటి మాటలకు నేను బాధపడటం లేదు’ అన్నారు. మొదటి-రెండవ ప్రపంచ యుద్ధ మధ్యకాలం 1922-39 మధ్య పని చేసిన పోప్‌ పదకొండవ పయస్‌ కమ్యూనిస్టు వ్యతిక ప్రకటన చేశారు.’ ఒకే సారి మంచి కాథలిక్‌గానూ నిజమైన సోషలిస్టుగానూ ఎవరూ వుండలేరు’ అని పయస్‌ ప్రకటిస్తే దానికి విరుద్దంగా ఈ రోజు పోప్‌ ఫ్రాన్సిస్‌ చెబుతున్నది వింటే ‘ ఒక మంచి కాథలిక్‌ సోషలిజం వ్యతిరేకిగా వుండజాలరు అని ఎవరైనా అర్ధం చేసుకుంటారు అని సదరు రచయిత వ్యాఖ్యానించారు.

‘పోప్‌ రెండవ జాన్‌ పాల్‌ మరియు పోప్‌ 16వ బెండిక్ట్‌ శిలువతో అసహజంగా ప్రవర్తించారా వారు దానిని తమ మోకాళ్ల ముందు వుంచుకొని వుండవచ్చు, పోప్‌ ఫ్రాన్సిస్‌ అలా కాదు. సుత్తీ కొడవలి చిహ్నంగా వున్న శిలువను ఎంతో సాదరంగా స్వీకరించారు. విమానంలో రోమ్‌కు తిరిగి వస్తూ విలేకర్లతో మాట్లాడుతూ ‘ఈ పనిని నేను అర్ధం చేసుకోగలను, నా వరకు ఇదేమీ ఒక అపరాధం కాదు’ అన్నారు. పోప్‌ పర్యటన తరువాత నాకు ఒక పోప్‌ వున్నారనే భావన నాకు ఇప్పుడు కలిగింది. ఇంతకు ముందు నాకు ఆభావన కలగలేదు ‘ అని బొలీవియా అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.ఈ రెండు వ్యాసాలలోని అంశాలను చూసినపుడు సోషలిజం, కమ్యూనిజంపై అటు రాజకీయంగానూ ఇటు మతపరంగానూ దాడి ఎలా జరుగుతోందో, పేదలకు మంచి జరగాలి, దోపిడీ వుండకూడదని చెప్పిన జీసస్‌ తొలి కమ్యూనిస్టు అని చెప్పిన పోప్‌ ఫ్రాన్సిస్‌ వంటి వారి మీద ఎలా వ్యతిరేకత రెచ్చగొడుతున్నారో చూడవచ్చు. పాడిందే పాడరా పాచి పళ్ల పాటగాడా అన్నట్లుగా కమ్యూనిస్టు మానిఫెస్టోను రాయక ముందే ప్రారంభమైన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం కమ్యూనిస్టు భావజాల ప్రచారం, ప్రభావం, విస్తరణను అడ్డుకోలేకపోయింది. ఇంకా ఆ తుప్పు పట్టిన ఆయుధంతోనే ఈ ఇంటర్నెట్‌ యుగంలో కూడా ప్రయత్నిస్తున్నారు.

నాజీజం మాదిరి ఎందుకు కమ్యూనిజాన్ని ద్వేషించటం లేదు అనే శీర్షికతో ఒక వ్యాఖ్యాత మరో పత్రికలో రాశాడు. http://www.theblaze.com/news/2017/05/01/watch-why-isnt-communism-as-hated-as-nazism/ . దానిలో ఏం చెప్పినప్పటికీ నాజీజం అన్నది లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నదని, అంతర్జాతీయ న్యాయస్ధానంలో అందుకు బాధ్యులైన వారిని విచారించిన విషయం దాస్తే దాగేది కాదు. కమ్యూనిజం గురించి జరిపిన వ్యతిరేక ప్రచారం అక్కడ అంత మందిని చంపారు ఇక్కడ ఇంత మందిని చంపారు అంటూ తప్పుడు లెక్కలు, కట్టుకధలు ప్రచారం చేయటం తప్ప రుజువులను జనం ముందుంచలేకపోయారు. సిద్ధాంత పరంగా కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వారందరూ కమ్యూనిస్టులు హంతకులు అనే కట్టుకధలను నమ్మరు. తెలంగాణా సాయుధ పోరాటంలో ప్రాణత్యాగాలు చేసింది కమ్యూనిస్టులు అనేది కళ్ల ముందున్న వాస్తవం. ఆ సందర్భంగా కమ్యూనిస్టు గెరిల్లాల చేతిలో హతమైన వారందరూ దోపిడీదారులు, వారికి ఏజంట్లుగా, గూండాలుగా, జనంపై దాడులు చేసిన పోలీసులు, రజాకార్లు తప్ప సామాన్యులను కమ్యూనిస్టులు చంపలేదనే విషయం జనానికి తెలుసు. అందుకే కమ్యూనిస్టులపై నాటి నిజాం, కాంగ్రెస్‌, నెహ్రూ ప్రభుత్వం, మీడియా చేసిన ప్రచారాన్ని తోసిరాజని తొలి ఎన్నికలలో వుద్యమం జరిగిన, దాని ప్రభావం వున్న ప్రాంతాలన్నింటా కమ్యూనిస్టులనే జనం గెలిపించారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలలో కమ్యూనిస్టుల గురించి చేసిన తప్పుడు ప్రచారం ఎల్లకాలం జనాన్ని మోసం చేయలేదు. చైనాలో నానాటికీ దారిద్య్రం తగ్గుతోందని ప్రపంచబ్యాంకే చెబుతోంది, అదే సమయంలో అమెరికాలో దారిద్య్రంలోకి చేరే వారి సంఖ్య పెరుగుతోంది. సోషలిస్టు దేశమైన చైనా ఎన్నో విజయాలు సాధిస్తున్నపుడు అదే మాదిరి మన దేశంలో కూడా సోషలిస్టు వ్యవస్ధను నెలకొల్పుకుంటే నిరుద్యోగం, దారిద్య్రాల నుంచి బయటపడవచ్చు కదా అన్న ఆలోచన రాకుండా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల యువత మెదళ్లను ఎవరైనా ఎలా కట్టడి చేయగలరు?