Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

అపర ప్రజాస్వామిక దేశంగా, ఎలాంటి పరిమితులు లేని స్వేచ్ఛా ప్రపంచంగా కీర్తి ప్రతిష్టలతో అలరారుతోంది అమెరికా. తమకు నిధులు కేటాయించటంలో వివక్ష చూపారని ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వ్యాఖ్యానించటమే అక్కడ నేరమైంది.ఇంకే ముంది, రంగంలోకి దిగిన విద్యాశాఖ అబ్బే దానితో సంబంధం లేదు ఆమె కమ్యూనిస్టు కార్యకలాపాలలో పాల్గొన్నారా లేదా అనేది మాత్రమే విచారణ చేస్తున్నామని చెబుతోంది. అమెరికాలో కమ్యూనిస్టు పార్టీ బహిరంగంగా పని చేస్తోంది. దాని ప్రతినిధులు ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం వుంది. అయినా ఒక టీచరు రాజకీయ కార్యకలాపాల గురించి, అందునా ఆమె కమ్యూనిస్టు అని ఆరోపిస్తూ విచారణ జరపటం గమనించాల్సిన అంశం. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ? బ్రూక్లిన్‌ ప్రాంతంలోని పార్క్‌ స్లోప్‌ కాలేజియేట్‌ స్కూలు ప్రధానోపాధ్యుయురాలు జిల్‌ బ్లూమ్‌ బెర్గ్‌ ఆ విచారణను సవాలు చేస్తూ తన రాజకీయ కార్యకలాపాల గురించి ఎలాంటి రుజువులు లేవని, నిధుల కేటాయింపు గురించి తాను చేసిన బహిరంగ వ్యాఖ్యలకు కక్ష సాధింపు చర్యగా జరుపుతున్న విచారణను నిలిపివేయలసిందిగా ఆమె చేసిన విన్నపాన్ని న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ ప్రాంత కోర్టు ఈనెల మూడున తిరస్కరించింది.

మార్చినెల మొదటి వారంలో న్యూయార్క్‌ నగర విద్యాశాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగ ప్రతినిధి ఒకరు వచ్చి ప్రధానోపాధ్యాయురాలు బ్లూమ్‌బెర్గ్‌పై విచారణ జరుపుతున్నట్లు ఆమెకు తెలియచేశారు. ఏ అంశం గురించి విచారణ జరుపుతున్నదీ, వాటి స్వభావం గురించి కూడా తాము చెప్పకూడదని, సిబ్బందితో మాట్లాడాల్సి వుందని మాత్రమే తెలిపారు. ఆ తతంగం ముగిసిన తరువాత కమ్యూనిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపించి విచారణ జరుపుతున్నారని సిబ్బందిలో ఒకరు బ్లూమ్‌బెర్గ్‌కు తెలిపారు. పరిహాసానికి అలా చెప్పారేమోనని తొలుత భావించిన ఆమె తరువాత ఇలాంటిదేదో జరుగుతుందని తాను చాలాకాలంగా వూహిస్తున్నానని చెప్పారు.

న్యూయార్క్‌ నగర ప్రభుత్వ స్కూళ్ల తీరుతెన్నులు, విద్యాశాఖ వున్నతాధికారుల గురించి గత కొన్ని సంవత్సరాలుగా ఆమె విమర్శనాత్మకంగా మాట్లాడటం, ఆ విషయాలు మీడియాలో రావటం బహిరంగ రహస్యమే. నల్లజాతీయులు, లాటినోల పిల్లల విషయంలో వివక్ష పాటిస్తున్నారని ఆమె విమర్శించేవారు. తమ పాఠశాల ప్రాంగణంలోనే నిర్వహిస్తున్న మరొక పాఠశాలలో ఆ ప్రాంతంలో మైనారిటీలుగా వున్న శ్వేతజాతీయుల పిల్లలు చదువుతున్నారు. క్రీడలకు నిధుల కేటాయింపులో ఒకే దగ్గర వున్న రెండు స్కూళ్లలో తమ స్కూలు పట్ల వివక్షతో తక్కువ నిధులు కేటాయించారన్నది ఆమె తాజా విమర్శ. ఇలాంటి వాటిపైనే గత కొంత కొన్ని సంవత్సరాలుగా ఆ స్కూలు విద్యార్ధులు, తలిదండ్రులు చేస్తున్న ఆందోళన, సమీకరణల పట్ల ఆమె సానుకూలంగా వుండటం అందరికీ తెలిసిన అంశమే.

విద్యాశాఖ దర్యాప్తు విషయం వెల్లడైన తరువాత తనపై తప్పుడు ఆరోపణలతో విచారణ జరుపుతున్నారని అది తన వ్యక్తిగత, భావ ప్రకటనా స్వేచ్చ, పౌరహక్కుల రక్షణ చట్టానికి విరుద్దం కనుక తాను దాఖలు చేసిన పిటీషన్‌పై తీర్పు వెలువడే వరకు దర్యాప్తు నిలిపివేయాలని ఆమె కోర్టుకు విన్నవించారు. విచారణ నిలిపివేయలేమని కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా బ్లూమ్‌బెర్గ్‌పై దర్యాప్తు గురించి ఆమె న్యాయవాదికి విద్యాశాఖ ఆరోపణలను అందచేశారు. పాఠశాల పని వేళల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించటం, ఎలాంటి నిధి వసూలు చేయటం నిషేధమని, అయితే ఆమె, మరో ఇద్దరు టీచర్లు ఒక కమ్యూనిస్టు సంస్ధ అయిన ప్రోగ్రెసివ్‌ లేబర్‌ పార్టీ కార్యకర్తలని, పార్టీ నిర్వహించే ప్రదర్శనలతో సహా దాని కార్యకలాపాలలో పాల్గొనేందుకు విద్యార్ధులను సమీకరిస్తున్నారని, ఆ పార్టీకి నిధులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

న్యూయార్క్‌లో టీచర్‌గా పనిచేయటానికి ముందు చికాగాలో పని చేసిన ఆమె 2004లో బ్రూక్లిన్‌ పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలిగా వచ్చారు. ఆ సమయంలో ఒక భవనంలో మూడు చిన్న హైస్కూళ్లు వున్నాయి. అందులో ఒక దానికి ఆమె ప్రధానోపాధ్యాయురాలు. ఆ భవనం ఎలా వుందంటే పై కప్పు నుంచి వర్షపునీరు కారుతుంది. మరుగుదొడ్ల గురించి చెప్పాల్సిన పని లేదు. తరగతి గదుల గోడలు బూజుపట్టి వున్నాయి. తలుపులు, కిటికీలు మామూలుగా తెరుచుకొనే స్ధితిలో లేవు. ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసేందుకు పొమ్మునకుండానే పొగబెడుతున్న అమెరికా సర్కార్‌ నిధుల కేటాయింపులో వివక్ష పాటిస్తున్నట్లు ఆ సమయంలో ఆమెకు ఊహకు అందలేదు. అనేక మంది మాదిరి దాన్నే వున్నంతలో బాగు పరిచేందుకు పూనుకొని పని చేశారు. అయితే 2010లో జరిగిన పరిణామాలు ఆమె ఆలోచనలో మార్పు తెచ్చాయి. తమ భవనంలో వున్న స్కూళ్లకు తోడు అదనంగా తెల్లవారి పిల్లల కోసమంటూ ప్రత్యేకంగా ఒక స్కూలును ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. వున్న స్కూళ్లలో అదనంగా చేర్చేందుకు అవకాశం వుండగా కొత్త స్కూలు ఎందుకని ఆమె ఆమాయకంగా ప్రశ్నించారు. ఆ స్కూలును సదరు భవనంలో ఏర్పాటు చేస్తే శిధిలావస్తలో వున్న మిగతా స్కూళ్లకు కూడా నిధులు వస్తాయని నమ్మబలుకుతూనే అసలు విషయం చెప్పారు. తెల్లపిల్లలకు విడిగా స్కూలు ఏర్పాటు చేస్తే వారి ప్రతిభ, మరియు ప్రవర్తనను విడిగా పర్యవేక్షించటానికి అవకాశం వుంటుందని కూడా తెలిపారు. అది వివక్ష తప్ప మరొకటి కాదని ఆమెకు అప్పుడు అర్ధమైంది. కొత్త స్కూలు అయితే పెట్టారు గాని పాత స్కూళ్ల మెరుగుదలకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. తెల్లవారి పిల్లలకు ఏర్పాటు చేసిన స్కూళ్లకు ఎలాంటి కొరత లేకుండా నిధులు మంజూరు చేస్తున్నపుడు తమ వరకు వచ్చే సరికి ఎలా లేకుండా పోతాయని ఆమె ప్రశ్నించటం ప్రారంభించారు. పిల్లలు, తలిదండ్రులు కూడా నిరసన తెలిపినా ఫలితం లేకపోయింది.

తమ పాఠశాలలో మెటల్‌ డిటెక్టర్‌ను ఏర్పాటు చేయాలన్న విద్యార్ధుల ఆందోళనకు బ్లూమ్‌బెర్గ్‌ మద్దతు తెలిపారు. స్కూలు అసెంబ్లీలో పోలీసుల హింస, వివక్ష, జాత్యహంకారంతో కూడిన విద్యాశాఖ విధానాల గురించి ఆమె మాట్లాడటమేగాక ఇతరులను ప్రోత్సహించారు. అదే స్కూలులోని కొందరు టీచర్లు ఈ ధోరణిని వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో ప్రధానోపాధ్యాయురాలిగా విద్యాశాఖకు ఒక మెయిల్‌ పంపారు. ఒకే భవనంలోని మిగతా స్కూళ్లలో వున్న క్రీడా బృందాల కంటే తక్కువ వున్న తెల్లవారి పిల్లల స్కూలుకు రెండింతలు ఎక్కువగా నిధులు మంజూరు చేయటాన్ని దానిలో అభ్యంతర పెట్టారు.మెయిల్‌ చేరిన వెంటనే దర్యాప్తు సిబ్బంది ఆమె స్కూలుకు వచ్చారు. టీచర్లలో విభజన ఏర్పడింది. వారిలోని కొంత మంది ఆమెను కమ్యూనిస్టుగా చిత్రిస్తూ ఫిర్యాదు చేసినట్లు కూడా తేలింది. బ్లూమ్‌బెర్గ్‌ భర్త నిర్వహించే ఒక సంస్ధ నిధుల సేకరణలో భాగంగా స్కూలులో ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారని, దానికి గాను ఒక్కొక్కరి నుంచి 20 డాలర్లు సేకరించారని, తద్వారా బ్లూమ్‌ బెర్గ్‌కు కూడా లబ్ది చేకూరిందని, ఈ కార్యక్రమానికి సిబ్బంది, విద్యార్దుల అంగీకారం తీసుకోలేదన్నది ఒక ఆరోపణ ప్రోగ్రెసివ్‌ లేబర్‌ పార్టీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నదాని ప్రకారం బ్లూమ్‌బెర్గ్‌ పని చేస్తున్న స్కూలులోని కొందరు విద్యార్ధులు ఆ పార్టీ నిర్వహించే అధ్యయన బృందాలలో చేరారని, వర్గ చైతన్యాన్ని కలిగించేందుకు సదరు స్కూలును వినియోగించుకుంటున్నారని, దానికి ఆమే కారణమని చేసిన ఆరోపణను బ్లూమ్‌బెర్గ్‌ తిరస్కరించారు. ఆ పార్టీ తమ పాఠశాలలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని, పిల్లలు లేదా వారి తలిదండ్రులు బయటి కార్యక్రమాలలో పొల్గొంటే తానెలా బాధ్యురాలినౌతానని ఆమె ప్రశ్నించారు.

తనపై జరుపుతున్న విచారణను నిలిపివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ విచారణ సందర్భంగా కొందరు టీచర్లు, ప్రస్తుత, పూర్వ విద్యార్ధులు, తలిదండ్రులు ఎందరో బ్లూమ్‌బెర్గ్‌కు మద్దతుగా కోర్టు హాలుకు వచ్చారు.విద్యాశాఖ విచారణ తన భావ ప్రకటనా స్వేచ్చకు ఎలా ఆటంకం కలిగించిందో స్పష్టం చేయలేకపోయారని జడ్డి వ్యాఖ్యానించారు. విచారణ తీరు, దానిలో వాడిన భాష కమ్యూనిస్టు వ్యతిరేక మెకార్ధీ కాలాన్ని గుర్తుకు తెస్తోందని న్యూయార్క్‌ సిటీ పౌరహక్కుల సంఘం డైరెక్టర్‌ డోనా లైబర్‌మన్‌ వ్యాఖ్యానించారు.

ప్రధానోపాధ్యాయురాలు కమ్యూనిస్టా లేక కమ్యూనిస్టు కార్యకలాపాలను ప్రోత్సహించారా లేదా అన్నది ఒక అంశం. తమ స్కూలులో అలాంటి కార్యకలాపాలేవీ నిర్వహించలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూళ్లలో అధికారికంగా కమ్యూనిస్టు వ్యతిరేక, అనుకూల కార్యకలాపాలతో బాటు, ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకూడదు. తమ స్కూలు పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ప్రధానోపాధ్యాయురాలిగా వ్యాఖ్యానించటం లేదా విమర్శించటం సమర్ధనీయమే. ఆ కారణంగానే ఆమెకు కమ్యూనిస్టు అని ముద్రవేయటం నిజంగా కమ్యూనిస్టులు గర్వించదగిన అంశం. వివక్ష, జాత్యహంకారం వంటి వాటిని ప్రశ్నించేవారందరినీ కమ్యూనిస్టులు అని పిలిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. కమ్యూనిజానికి దూరంగా వున్న వారిలో కనీసం ఒక్కరిని ఆ శిబిరంలోకి నెట్టేందుకు ఎవరు పూనుకున్నా వారందరూ అభినందనీయులే. న్యూయార్క్‌ నగర మేయర్‌గా వున్న డి బ్లాసియో డెమోక్రటిక్‌ పార్టీలోని వామపక్ష వాదిగా పేరుంది. అయినప్పటికీ యంత్రాంగం కమ్యూనిస్టు వ్యతిరేకులతో నిండి వున్నపుడు, ఆ పార్టీలో కూడా పుష్కలంగా కమ్యూనిస్టు వ్యతిరేకులు వున్నపుడు ఒక్క మేయర్‌ ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను అడ్డుకోలేరని ఈ వుదంతం స్పష్టం చేసింది. తన పెరటి తోటగా భావించే లాటిన్‌ అమెరికాలోనే వామపక్ష, సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తుల వ్యాప్తిని అడ్డుకోవటంలో విఫలమైన అమెరికా యంత్రాంగం తమ స్వంత దేశంలో అలాంటి ప్రతి ప్రయత్నంతో తమ ప్రజాస్వామ్య బండారాన్ని బయటపెట్టి ఆచరణలో మేడి పండు చూడ మేలిమై వుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్లుగా నిరూపించుకుంటోంది.

ప్రతి నిరంకుశ వ్యవస్ధ తనను నాశనం చేసే శక్తులను తానే చేసుకుంటుంది, బయటి నుంచి ఎవరూ రానవసరం లేదన్నది చరిత్ర చెప్పిన సత్యం. అది అమెరికన్లకు ఎలా వర్తించకుండా వుంటుంది? వారేమైనా పరలోక జీవులా ? పవిత్ర మూర్తులా ? వంద డిగ్రీలు దాటి మరిగితేనే నీరు రూపం మార్చుకొని ఆవిరిగా మారుతుంది. దేనికైనా సమయం రావాలి. అమెరికాలోని సామాన్యులు పెట్టుబడిదారీ వ్యవస్ధ విఫలమైందనే విషయం గుర్తించటం నానాటికీ పెరుగుతోంది. దాని స్ధానంలో అంతకంటే మెరుగైన వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన మొగ్గతొడగటం తదనంతర సహజ పరిణామం. అది సోషలిజమా మరొకటా అన్నది నిర్ణయించుకోవాల్సింది వారే.