ఎం కోటేశ్వరరావు
పాలకవర్గాలు కోరుకున్న, పచ్చి మితవాద మారినె లీపెన్ ఓడిపోవాలంటే అని వార్యంగా ఓటు చేయటం తప్ప అక్కడి మితవాద వ్యతిరేక శక్తులకు మరొక ప్రత్యామ్నాయం లేని కారణంగా బాంకరు అయిన ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ఆదివారం నాడు జరిగిన తుది ఎన్నికలలో భారీ మెజారిటీతో ఫ్రెంచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సాంప్రదాయ గాలిస్టు, సోషలిస్టు పార్టీలను పక్కన పెట్టి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా ఫ్రెంచి ఓటర్లు మూడో పార్టీకి అవకాశమిచ్చారు. నువ్వుగాకపోతే నేను, నేను గాకపోతే నువ్వు అందుకే ఎవరు అధికారంలోకి వచ్చినా నీకిది, నాకది అన్నట్లుగా పంచుకొనే రాజకీయాలకు కాలం చెల్లనుందా అనే ఆలోచనకు ఈ ఎన్నికలు తావిచ్చాయి. ఇదొక మంచి పరిణామమే తప్ప అలాంటిదేదో జరనుందని ముందే కోయిల రాగాలు కూయనవసరం లేదు.
ఫ్రాన్స్‌లో పచ్చి మితవాద నాజీశక్తులకు ప్రాతినిధ్యం వహించే మారినె లీపెన్ ఓడిపోయినంత మాత్రాన జనాకర్షక నినాదాలకు కాలం చెల్లినట్లు కాదు. గత ఆరునెలల్లో ఐరోపాలో జరిగిన ఎన్నికలలో పచ్చి మితవాదులుగా వర్ణితమైన శక్తులు ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌లో ఓడిపోయాయి. ఇది సంతోషకరమే అయినప్పటికీ అసలు అలాంటి శక్తులు అధికారానికి పోటీ పడేంతగా బలం ఎలా సంపాదించుకోగలిగాయి అన్నది ఆందోళన కలిగించే అంశం. అమెరికా నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కోవాలంటే వుమ్మడిగా వుండటం తప్ప మరొక మార్గం లేదనే ఆలోచన నుంచి పుట్టిందే ఐరోపా యూనియన్. దానిలో వుండి నలుగురితో లాభాలను పంచుకోవటం కంటే విడిగా వుండి ఎక్కువ లబ్ది పొందవచ్చనే అభిప్రాయం వున్న పాలకవర్గ శక్తులు తొలి నుంచీ ఏదో ఒక రూపంలో వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే వున్నాయి. ఐరోపా యూనియన్ నుంచి బయటకు రావాలా లేదా అనే అంశంపై బ్రిటన్‌లో ప్రజాభిప్రాయసేకరణ జరిపితే 52శాతం మంది అనుకూలంగా ఓటు చేసిన విషయం తెలిసిందే. సకలరోగ నివారిణి జిందాతిలిస్మాత్ అన్నట్లుగా ఐరోపా యూనియన్‌తో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చేసిన ప్రచారం వాస్తవం కాదని తేలిపోయింది. ప్రపంచ ధనిక దేశాలలో 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం, గ్రీసు వంటి దేశాలు రుణ వూబిలో కూరుకుపోవటం, ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడాలంటే పొదుపు చర్యలే మార్గమనే పేరుతో ఎప్పటి నుంచో కొనసాగుతున్న అనేక సంక్షేమ పధకాల కుదింపు, రద్దు, అదనపు భారాలను మోపటం వంటి చర్యలతో కార్మికవర్గానికి ఐరోపా యూనియన్ ప్రయోగంపై విశ్వాసం తగ్గటం ప్రారంభమైంది. యూనియన్ కొనసాగాలనే శక్తులు జనానికి భరోసా కల్పించే పరిస్ధితి లేదు.ఐరోపా యూనియన్ నుంచి బయటకు వచ్చింతరువాత మరింత సమర్ధవంతంగా తమ విధానాలను అమలు జరపాలంటే తిరిగి ప్రజల మద్దతు కోరటం అవసరమనే పేరుతో పార్లమెంటులో తిరుగులేని మెజారిటీ వున్నప్పటికీ బ్రిటన్ మితవాద టోరీ పార్టీ మధ్యంతర ఎన్నికలకు గాను పార్లమెంట్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పూర్వరంగంలోనే అనేక దేశాలలో ఐరోపా యూనియన్ నుంచి బయటకు రావటమే తమ దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం అనే శక్తులు బలం పుంజుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో మరింతగా బలపడతాయనే ధోరణి వ్యక్తమౌతోంది.
ఫ్రాన్స్‌లో ఒక నాడు రాజకీయ పండితులు కొట్టిపారవేసిన నేషనల్ ఫ్రంట్ అనే పచ్చిమితవాద నాజీశక్తి అధ్యక్ష పదవికి పోటీపడటమే కాదు 34శాతం వరకు ఓట్లు తెచ్చుకొనే శక్తిగా ఎదిగింది. నాజీశక్తి అని ప్రచారం కావటం వలన ఓటర్లను అంతగా ఆకట్టుకోవటం లేదని గ్రహించి తాము మారామని చెప్పుకొనేందుకు ప్రయత్నించింది, దాని స్ధాపకుడైన మారిన్ లీపెన్‌ను ఆయన కుమార్తె అయిన మారినే స్వయంగా పార్టీ నుంచి బహిష్కరించింది. ఆదివారం నాడు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత ఓటమని అంగీకరిస్తూ నేషనల్ ఫ్రంట్‌ను మరింత బలమైన శక్తిగా తిరిగి రూపొందించేందుకు ప్రయత్నించాలని మద్దతుదార్లకు పిలుపు నిచ్చింది. అమెరికా, ఐరోపాలోని ధనిక దేశాలు ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం, తదితర సమస్యలకు వలస వస్తున్న కార్మికులు, ముస్లింలు కారణమనే ప్రచారం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది.
అనేక దేశాలలో పొదుపు, సంస్కరణల పేరుతో సంక్షేమ చర్యలకు కోత, కార్మికవర్గంపై భారాలను మోపుతున్న పూర్వరంగంలో అనేక దేశాలలో వామపక్ష శక్తులు ఐరోపా యూనియన్ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. నేతి బీరలో నెయ్యి వంటి ఐరోపాలోని సోషలిస్టు పార్టీలు 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభ సమస్యలను పరిష్కరించటంలో మిగతా మితవాద పార్టీలకంటే తామేమీ ప్రత్యేకం కాదని రుజువు చేసుకున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌లో తుది విడత పోటీకే అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. గతేడాది హార్వర్డ్ కెన్నడీ స్కూలు వెల్లడించిన ఒక అధ్యయనం ప్రకారం 1960 దశకంలో ఆరుశాతానికి అటూ ఇటూగా ఓట్లు తెచ్చుకున్న ఐరోపా జనాకర్షక నినాద మితవాద పార్టీలు వర్తమాన దశాబ్దంలో 13శాతానికి పెంచుకున్నాయి. ఇదే కాలంలో కొన్ని ఓట్లు తప్ప సీట్లు ఏమీ లేని వామపక్ష పార్టీలు దాదాపు పదిశాతం లోపుగా ఓట్లను పెంచుకున్నాయని పేర్కొన్నది. ఫ్రాన్స్ తొలివిడత పోటీలో వామపక్ష అభ్యర్ధి మెలంచన్ 20శాతం వరకు ఓట్లు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
నాది మితవాదం, వామపక్ష మార్గం కాదు మూడవ మార్గం అని చెప్పుకున్న ఇమ్మాన్యుయేలన మక్రాను ముందు తీవ్రమైన సవాళ్లే వున్నాయి. ఎవరికి వారు తమ దేశ ప్రయోజనాలకే పెద్ద పీట అనే ధోరణిలో ధనిక దేశాలన్నీ వ్యవహరిస్తున్నాయి. అందరికంటే పెద్దన్న అమెరికా అయితే ఐరోపాలో పెద్దన్న జర్మనీని దాటి ప్రపంచమార్కెట్లో ఫ్రెంచి కంపెనీలు తమ వాటా సంగతి తేల్చుకోవాల్సి వుంది. రాజకీయంగా అటు నాజీలు, సాంప్రదాయ మితవాదులు, ఆచరణలో వారి కంటే భిన్నమైన విధానాలు లేని సోషలిస్టు పార్టీ, వాటి రెండింటికీ ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న కమ్యూనిస్టు పార్టీతో కూడిన వామపక్ష సంఘటన నుంచి సవాళ్లను ఎదుర్కోవాల్సి వుంది.గతానికి భిన్నంగా తన మూడవ మార్గం ఏమిటో రుజువు చేసుకోవాలి. ఫ్రెంచి పాలకవర్గం ఎదుర్కొంటున్న సంక్షోభం వ్యవస్తాపరమైంది తప్ప కార్పొరేటు కంపెనీల అంతర్గత సమస్య కాదు.
పెట్టుబడిదారీ విధానం తన సంక్షోభాల నుంచి బయట పడేందుకు ఎప్పటికప్పుడు అనేక కొత్త మార్గాలను వెతుకుతోంది.ప్రస్తుతం నయా వుదారవాద విధానం అమలు చేస్తోంది. అది ఇంత త్వరగా విఫలం అవుతుందని ఎవరూ వూహించలేదు. ప్రత్యామ్నాయ మార్గాన్ని పెట్టుబడిదారులు ఇంకా తయారు చేసుకోలేదు, ప్రస్తుతం అదే వారి పెద్ద సమస్య. నూతన అధ్యక్షుడు, ఆయన ఏడాది వయస్సున్న ఎన్ మార్చ్, ఫార్వర్డు, ముందుకు పోదాం, ఆగే చలో పార్టీకి తొలి సవాలు వచ్చే నెలలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు. తుది విడత అధ్యక్ష ఎన్నికలలో 1969 తరువాత రికార్డు స్ధాయిలో నాలుగో వంతు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా దూరంగా వున్నారు. వీరుగాక ఖాళీ ఓట్లు, ఇద్దరికీ వేసి చెల్లకుండా చేసిన ఓట్లు మరో తొమ్మిది శాతం వున్నాయి. తొలి విడతలో ఇలాంటి ఓట్లు కేవలం రెండు శాతం మాత్రమే. అంటే మొత్తంగా చూస్తే ప్రతి ముగ్గురిలో ఒకరు మక్రాన్ లేదా మారీ లీపెన్ అంటే వ్యతిరేకత కలిగి వున్నట్లు చెప్పవచ్చు. వీరంతా పార్లమెంట్ ఎన్నికలలో ఎలా ప్రవర్తిస్తారో చూడాల్సి వుంది.
ఆదివారం నాటి వరకు అధికారంలో వున్న సోషలిస్టు పార్టీ ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలు సామాన్యమైనవి కాదు. లక్షా 20వేల ప్రభుత్వ రంగ వుద్యోగాల రద్దు, 70శాతం మంది వ్యతిరేకించిన కార్మిక చట్టాల సవరణ బిల్లు ప్రభుత్వం, పార్లమెంట్ ముందు వున్నాయి. పార్లమెంట్ ఓటింగ్‌తో నిమిత్తం లేకుండా అధ్యక్షుడిగా తన అధికారాన్ని వుపయోగించి నిరంకుశంగా అమలు జరుపుతారా ఏం చేస్తారు అన్నది చూడాల్సి వుంది.
ఆర్ధిక మాంద్యాన్ని, పదిశాతం నిరుద్యోగులను గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా తెచ్చుకున్నారు. వుపాధి వున్నవారిలో 85శాతం మంది తాత్కాలిక వుద్యోగులే. యువతలో 23శాతం నిరుద్యోగులు. అన్నింటికీ మించి ప్రధాన ప్రత్యర్దిగా వున్న ఫాసిస్టు నేషనల్ ఫ్రంట్ రాబోయే రోజుల్లో మరింతగా రెచ్చిపోవటం ఖాయం. ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత అసంతృప్తికి గురైతే మరోసారి యువజన, విద్యార్ధి వుద్యమాలకు ఫ్రాన్స్ కేంద్రంగా మారనుంది. అవి ఏశక్తుల చేతుల్లోకి పోతాయనేది చూడాల్సి వుంది.