Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్‌ బలంగా వున్నచోట దానిని దెబ్బతీసేందుకు ప్రాంతీయ పార్టీలతో జత కట్టిన బిజెపి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాంతీయ పార్టీతో బంధం వుండగానే మరొక పార్టీకి కన్నుగీటుతూ సరికొత్త రాజకీయానికి తెరలేపిందా ? బ్రహ్మంగారు మరి ఈ విషయంలో ఏం చెప్పారో తెలియదు. నిజానికి వైఎస్‌ఆర్‌సిపి ఎందుకోసం ప్రధాన మంత్రి దర్శన భాగ్యం కోరిందో, ప్రధాని ఎందుకు జగన్‌ పరివారంతో కలిశారో అధికారికంగా తెలియదు. ప్రధానిని కలిసి బయటకు వచ్చిన తరువాత జగన్‌మోహనరెడ్డి బృందం ప్రధానికి ఇచ్చినట్లు చెప్పిన మెమోరాండం, మీడియాతో మాట్లాడినదాని ప్రకారమే ఎవరైనా వ్యాఖ్యానించగలరు. పరకాయ ప్రవేశ విద్యతో కథనాలు రాసే విలేకర్ల నుంచి ఇంకా ఏమీ వెలువడలేదు కనుక వాటిని నమ్ముకున్న పాఠకులు నిరాశ చెందివుంటారు. కొద్ది వారాల క్రితమే చంద్రబాబు నాయుడు ప్రధానిని కలసి ఆంధ్రప్రదేశ్‌లో మునిగినా తేలినా రెండు పార్టీలు కట్టకట్టుకు వుండాలని నిర్ణయించుకున్నట్లుగా పరకాయ విలేకర్లు వార్తలు రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలపరుస్తానంటే ఎవరైనా వద్దన్నారా అంటూ వెంకయ్య నాయుడు బిజెపిలో తలెత్తిన సందేహాలను తీర్చిన విషయం బహిరంగమే. దానిలో భాగంగానే విశాఖలో బిజెపి పెద్ద ఎత్తున సభ జరిపేందుకు పూనుకుందని వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఇపుడు జగన్‌ పరిణామాలను నిస్సందేహంగా మరో మలుపు తిప్పారు. బిత్తర పోయిన తెలుగు తమ్ముళ్లు కొందరు ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నాయుళ్లు విదేశాల్లో వున్న సమయంలో జగన్‌ ప్రధాన మంత్రిని కలిశారు అనేకంటే ప్రధాని కార్యాలయం అవకాశం కల్పించింది అని చెప్పటం సబబుగా వుంటుందేమో ?

ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నది పాత సామెత, పాత టెక్నాలజీ. ఇప్పుడు ఒక అర గురించి మరొక అరకు తెలియకుండా పక్క పక్కనే అనేక కత్తులకు స్ధానం కల్పించటం కొత్త టెక్నాలజీ. ఎన్ని సినిమాలలో చూడటం లేదూ ! పార్టీలో, ప్రత్యర్ధులలో ముఠాలుగా, ఒకరి పొడ మరొకరికి గిట్ట మట్టుపెట్టే వారిని కూడా పార్టీలోని ఒకే వరలో ఇమిడ్చే నేర్పు చంద్రబాబుకు – రెండు రెళ్లు నాలుగు అన్నట్లు శాస్త్రీయంగా చెప్పాలంటే పాలకవర్గ రాజకీయ పార్టీ ప్రతిదానికీ – వున్నట్లే రెండు పార్టీలను కూడా పక్క పక్కనే వుంచేందుకు , ఆంధ్రప్రదేశ్‌ పౌరులను కొత్త బాటలో నడిపించేందుకు బిజెపి నేతలు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి ఇప్పటికిప్పుడు అంత సీను లేదు కనుక తమకు మద్దతు విషయంలో ఎవరు ఎంతగా వంగి విధేయత చూపుతారా అన్నదే వారికి ఇప్పుడు ముఖ్యం. కాల క్రమంలో పరిణామాలు ఎలా వుంటాయన్నది ఇప్పుడే చెప్పలేము. కాంగ్రెస్‌ అయినా తెలుగుదేశం అయినా ఎవరు అధికారంలో వుంటే వారి పంచనచేరి తమ వాటాలను రాబట్టుకొనేందుకు రాయలసీమ మొరటు ప్రత్యర్ధి ఫ్యాక్షనిస్టులే ఒకే పార్టీలో సర్దుకుపోదాం అన్నట్లుగా వుండటం చూశాం, చూస్తున్నాం. అలాగే అనేక చోట్ల రింగురోడ్లు, విమానాశ్రయాలు అటూ ఇటూ, అక్కడా ఇక్కడా అని ప్రచారం చేసి చివరికి తమకు గరిష్ట ప్రయోజనం చేకూరే విధంగా వాటి నిర్మాణాలు చేయటాన్ని చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయబాట విషయంలో కూడా అదేవిధంగా జరగబోతోందా ? మేథావులు, వుడుకురక్తంతో వుండే యువతీ యువకులే అలాంటి తప్పుడు రాజకీయాలకు సలాం కొడుతుంటే ఇక సామాన్యుల సంగతి చెప్పనవసరం లేదు. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే.

రాష్ట్రానికి వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, ప్రత్యేక పాకేజీ పేరుతో మోసం చేసినా ఫర్లేదు, వాటి గురించి అడగకుండా వుంటాం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో మాత్రం ఎలాంటి రాజకీయ అనుబంధం పెట్టుకోకూడదని చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని ,చాణక్యనీతిని వుపయోగించి ఇంతకాలం అడ్డుకున్నారన్నది ఒక అభిప్రాయం. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్దులెవరో తేలలేదు, నోటిఫికేషన్‌ ఇంకా వెలువడలేదు, మీడియాలో ఎలాంటి వూహాగానాలు రాయలేదు. ఆకస్మికంగా పిడుగులు పడినట్లుగా వైఎస్‌ఆర్‌సిపి ప్రతినిధి వర్గాన్ని కలుసుకొనేందుకు నరేంద్రమోడీ సిద్ధంగా వున్నారంటూ పిలుపు రావటం పొలోమంటూ జగన్‌ పరివారం ఢిల్లీ వెళ్లి కలవటం, రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ప్రకటించటం అంతా కల మాదిరి జరిగిపోయింది. అదీ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలను రప్పించేందుకు అమెరికా వీధులలో కాలి నడకన తిరుగుతున్న సమయంలో జరగటం అనేక మందికి మింగుడు పడని అంశం. చంద్రబాబు నాయుడే కాదు వెంకయ్య నాయుడు కూడా దేశంలో లేనపుడు అని ఎవరైనా ముక్తాయింపు ఇవ్వవచ్చు.

మిగతా పత్రికలు ఏమి రాసినా సాక్షి పత్రికలో వక్రీకరణకు అవకాశాలు వుండవు. అదేమి రాసిందో చూడండి

‘ మీడియా : ప్రధాన మంత్రి వద్ద ఏదైనా ప్రస్తావన వచ్చిందా ?

జగన్‌ : రాష్ట్రపతి ఎన్నికలలో వారు పెట్టే అభ్యర్ధికి సంపూర&ణ మద్దతు ఇస్తామని ప్రధాన మంత్రిగారికి చెప్పాం.వైఎసనఆరన కాంగ్రెసు నుంచి సంపూర&ణ మద్దతు వుంటుంది. మాటల సందర&భంలో వారు తప్పనిసరిగా ప్రస్తావిస్తారు. మద్దతు కూడా ఇస్తాం. ఎలాగూ వాళ్లు పెట్టిన వ్యక్తే గెలుస్తారు. ఆ పదవికి పోటీ పెట్టడం కూడా తప్పే అని గట్టిగా నమ్ముతున్నాం. బిజెపికి సంబధించినంతవరకు మేం అన్ని వేళలా మద్దతు ఇచ్చాం. వారితో మాకు ఎప్పుడైనా వ్యతిరేకత వుందీ అంటే అది ప్రత్యేక హోదా విషయంలో, భూ సేకరణ బిల్లు విషయంలో మాత్రమే.అంటే ప్రజలకు మంచి జరుగుతుందంటే ప్రతి విషయంలో అధికార పార్టీకి తోడుగా నిలిచాం. వుంటాం కూడా. ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లు విషయంలోనే మేం బిజెపిని వ్యతిరేేకించాం. ‘

దీనిని చదివిన తరువాత తెలుగులో భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల గురించి మరోసారి వెనక్కు చూసుకోవాల్సి వచ్చింది. మాటల సందర్భంగా వారు తప్పనిసరిగా ప్రస్తావిస్తారు, మేం ఇస్తాం అంటే భవిష్యత్‌లో అని అర్ధం. మరోవైపున మేం మద్దతు ఇస్తామని చెప్పాం అన్నారు. ప్రధానితో కలిసేందుకు వెళ్లగానే పాహిమాం అంటూ కాళ్లమీద పడినట్లు, విధేయులమై వుంటామని అడగకుండానే మద్దతు ప్రకటించారని అనుకోవాల్సి వస్తుంది. అయితే అది వారి అంతర్గత వ్యవహారం అనుకోండి. ఇక్కడ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్య ఏమంటే అనేక ఓదార్పు యాత్రలు చేసిన జగన్‌ ప్రత్యేక హోదా గురించి కంటి తుడుపు విమర్శలు తప్ప పొలో మంటూ జెపికి మద్దతు ప్రకటించి వచ్చారు. ఎలాగూ బిజెపి అభ్యర్ధి గెలుస్తారని చెబుతున్నారు. అంటే మీ మద్దతు ఆరోవేలు వంటిదే. మరో వైపు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ప్రధానికి విన్నవించిన వైసిపి పెద్దలు హోదా విషయంలో అడ్డంగా మాట తప్పి ఇచ్చేందుకు తిరస్కరించిన బిజెపి విషయంలో కనీసం తటస్థంగా వుంటామని చెప్పి వుంటే కాస్త బెట్టుగా వుండేది. కేసుల నుంచి బయట పడవేయించుకొనేందుకే ఆరాటపడ్డారనే విమర్శ వచ్చి వుండేది కాదు. అయినా బిజెపి అభ్యర్ధి రాష్ట్రపతి అయితే మన రాష్ట్రానికేమి ఒరుగుతుంది, దీనిలో బిజెపి మనకు చేసే మంచేమిటి ? హోదా బదులు ప్రకటించిన ప్యాకేజీ కూడా వట్టిస్తరి మంచినీళ్లే అని తేలిపోయింది. ఏ రకంగానూ మనకు ఒరిగేదేమీ లేనపుడు, గడచిన మూడు సంవత్సరాలలో చేసిందేమీ లేనపుడు, రాబోయే రోజుల్లో ఏం చేస్తారో తెలియనపుడు అడగకుండానే దాని అభ్యర్ధికి మద్దతు అని ప్రకటించటం ఎందుకు ?ఎవరిని మోసం చేద్దామని ? అలాగాక మేం బిజెపితో వూరేగదలచుకున్నాం, కేసుల మీద కేంద్ర సంస్ధలు చూసీచూడనట్లు, వీలైతే బయటపడవేయించమని కోరాం అని చెప్పి వుంటే నిజాయితీగా వుండేది. నరేంద్రమోడీ అంటే అంటరాని వ్యక్తి కాదని 2013లోనే జగన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తరువాత ఎక్కడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడిన దాఖలాలు లేవు. మోడీ-జగన్‌ కలయికపై తెలుగుదేశ వారి తొలి వ్యాఖ్యానాలు చూస్తే అనుకుంటున్నదొకటీ అయ్యింది ఒకటీ అన్నట్లుగా కనిపిస్తోంది. నూతన పరిస్థితిలో నూతన ఎత్తుగడలకు అగ్రనాయకత్వం బహుశా సమయం తీసుకోవచ్చు. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదని పక్కన పెట్టిన పెద్దలు- జగన్‌ దొందూ దొందే అయినపుడు ఒకరి గురించి మరొకరు విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది.

ఇక రాష్ట్ర రాజకీయ అవనిక ఎలా వుండబోతోందో చూద్దాం. హోదా, పాకేజీలంటూ ఆంధ్రప్రదేశ్‌ పౌరులను మోసం చేసిన తెలుగుదేశం-బిజెపి కూటమి ఇతర అన్ని రంగాలలో కూడా విఫలబాటలోనే నడుస్తోంది. చెప్పుకొనేందుకు పట్టుమని పది మంచి పధకాలు కూడా లేవు.అందువలన ఈ కూటమి సర్కారుపై జనంలో వ్యతిరేకత పెరగటం ఖాయం. 2014లో వారికి కలసి వచ్చిన సానుకూల అంశాలు వచ్చే ఎన్నికలలో వుండవు. అందువలన ఇప్పుడున్న రాజకీయాన్ని ఇలాగే కొనసాగిస్తే రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు తెలుగుదేశంతో పాటు బిజెపి కూడా బంగాళాఖాతంలో కలవటం ఖాయం. అందుకే తాము స్వంతంగా బలపడాలనే ఆరాటం బిజెపిలో రోజు రోజుకూ పెరుగుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ లోగా ఒంటరిగా బిజెపి స్వంతంగా పోటీచేసే సీన్‌ లేదు. జనంలో గబ్బు పడుతున్న తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్‌ఆర్‌సిపితో వెళితే ఎలా వుంటుంది అని నాడి పరీక్షించేందుకే తొలి చర్యగా జగన్‌కు ప్రధాని ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. జగన్‌తోనే వాటంగా వుంటే ఏదో ఒక రూపంలో తెలుగుదేశం పార్టీని ఒదిలించుకుంటుంది. రాజకీయ పార్టీలకు సాకులు దొరక్కపోవు. పార్లమెంట్‌ సీట్లు తాను తీసుకొని అసెంబ్లీలో మెజారిటీ జగన్‌కు వదల వచ్చు. వరుస కుదిరితే సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేయవచ్చు. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి వంటి పార్టీలకు వాటి నేతల ప్రయోజనాలు తప్ప మిగతావన్నీ పట్టవు. ఒకవేళ బిజెపితో కలిస్తే వైఎస్‌ఆర్‌సిపికి మద్దతు ఇచ్చిన దళితులు, ముస్లింలు ఎలా స్పందిస్తారన్నది ఒక ప్రశ్న. కొంత ఓటింగ్‌ను అనివార్యంగా కోల్పోవాల్సి వుంటుంది. ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లుల విషయంలో బిజెపిని వ్యతిరేకిస్తున్నామని చెప్పిన జగన్‌ ఒక వేళ సయోధ్య కుదిరితే వాటిని తూనాబొడ్డుబాలు అనటం పెద్ద సమస్య కాదు. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదని తరువాత తమకు అర్ధమైందని తెలుగుదేశం సమర్ధించుకున్న మాదిరి జగన్‌ మాట మార్చలేరా ? భూ సేకరణ విషయంలో మడమ తిప్పలేరా ? ఎందరిని చూడలేదు !

తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఒంటరిగా లోకేష్‌ నాయకత్వాన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. లోకేష్‌ను ముందు పెట్టి ఓడిపోతే చెప్పుకొనేందుకు వైసిపి రోజా చెప్పిన ముద్దపప్పు అనే ఒక సాకు అయినా వుంటుంది. అదే చంద్రబాబు నాయకత్వాన అయితే అలాంటిదేమీ వుండదు. బిజెపి-వైఎస్‌ఆర్‌సిపి అవకాశాలు కనిపిస్తే అసలు తెలుగుదేశంలో ఎందరు మిగులుతారనేది ఒక పెద్ద ప్రశ్న. ఆయారాం గయారాంలకు కమ్యూనిస్టులు తప్ప అన్ని పార్టీలు పెద్ద పీట వేస్తున్నపుడు ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు అన్నట్లుగా చేరేవారు, చేర్చుకొనే వారూ ఎలాగూ వుంటారు. పార్టీ కార్యాలయాల ఆస్ధులను కబ్జా చేసేందుకు తెలుగుదేశం నామమాత్రంగా వుండవచ్చు.

అత్తారింటికి దారి చూసుకోవటంలో విజయం సాధించిన పవన కల్యాణ్‌ అధికారానికి దారి వెతుక్కోవటం అంత సులభం కాదు. సినిమా పేరును ముందుగా రిజిస్టరు చేసుకున్న మాదిరి పార్టీ పేరును నమోదు చేశారు తప్ప నిర్మాణం లేదు. జనతా మాదిరి అధికారానికి వచ్చిన తరువాత పార్టీ పెట్టిన లేదా, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారానికి వచ్చిన ఎన్టీరామారావు నాటి రోజులు కావివి. గత ఎన్నికల్లో కాంగ్రెసు తాట తీసినట్లుగా ఈ ఎన్నికల్లో గతంలో బిజెపితో కలిసిన లేదా వచ్చే ఎన్నికలలో ఏదైనా కొత్తగా కలిస్తే వాటి తాటతీయాలి. ఈ నేపధ్యంలో వున్నంతలో వామపక్షాలతో కలసి ఎన్నికలలో పోటీ చేయటం తప్ప మరొక దారి లేదు. లేదా ఏదో ఒక పార్టీతో ఒప్పందం చేసుకొని అందరూ అనుకుంటున్నట్లుగా దానికి లేదా వాటికి కాలీ&షట్లు ఇచ్చి ఎన్నికల ప్రచారంలో నటించాల్సి వుంటుంది. వామపక్షాల విషయానికి వస్తే అవి గతం మాదిరి జనాన్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. వివిధ తరగతుల ప్రయోజనాల కోసం అవి తప్ప మిగతా ఏ పార్టీలు గత మూడు సంవత్సరాలలో వుద్యమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా వుద్యమాలు ఆగలేదు. ఎన్నికలలో గెలవటానికి అవి మాత్రమే చాలవన్నది గత అనుభవం.గత ఎన్నికలలో వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అనే విమర్శలకు గురయ్యాయి. అందువలన అవి కొత్తగా పొగొట్టుకొనేదేమీ లేదు. కమ్యూనిస్టులకు దగ్గరదారులు లేవు, తెలియవు కనుక తమ సైద్ధాంతిక నిబద్దతకు కట్టుబడి, తమతో కలసి వచ్చే శక్తులు, వ్యక్తులతో కలసి మరోసారి ఒంటరి పోరాటం చేయటం తప్ప పెను మార్పులు వచ్చే సూచనలు ఇప్పటికైతే లేవు.