Tags

, , , , , , ,

‘సిరా’ వినియోగంపై సుప్రసిద్ధ జర్నలిస్టు రవీష్‌ కుమార్‌ వ్యంగ్యాస్త్రం

జర్నలిజంలో విశిష్ట స్ధానం సంపాదించిన ఎన్‌డిటివీ యాంకర్‌ రవీష్‌ కుమార్‌కు కులదీప్‌ నయ్యర్‌ జర్నలిజం అవార్డు ప్రదానం సందర్భంగా మార్చి 19న చేసిన ప్రసంగ అనువాదమిది. జర్నలిస్టులలో ఆలోచన పాదుకొల్పేదిగా వున్నందున పాఠకుల కోసం దీనిని అందచేస్తున్నాం

ప్రపంచ వ్యాపితంగా చులకనగా చూస్తున్న తరుణంలో సత్కారం పొందటం ఒక విధంగా వినోదంగా వుంది. అలారం కొట్టే గడియారాలు కొన్ని దశాబ్దాల క్రితమే మూగపోయినప్పటికీ ఇంకా అలారం కొడుతున్న గడియారాన్ని చూస్తున్నట్లుగా ఇది వుంది. అంటే మనం అప్పటి నుంచి మెల్లగా చేసే శబ్దాలను బట్టి సమయాన్ని గ్రహించే ఇంద్రియ సామర్ధ్యాన్ని మనం కోల్పోయాం. నుక మనం వర్తమాన కాల న్యాయా అన్యాయాలను మదింపు చేయటంలో కూడా విఫలమౌతున్నాం.ఈ రోజులు ఎలా వున్నాయనే భావన కలుగుతోందంటే మనం ఒక పరీక్ష హాలులో వున్నట్లు మనలో వున్న తప్ప చేసే వారిని ప్రత్యక్షంగా పట్టుకోవాలని పిలుస్తున్నట్లు, ధృడ నిశ్చయంతో దాడి చేసే నిఘా బృందాలు, ఆకస్మిక దాడుల దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయన్నట్లుగా వుంది. మనం పదే పదే శోధించబడుతున్నాం. ఎవరైతే తమ మనసులోని మాటలను స్వేచ్చగా వెల్లడిస్తామో వారిపై మరుగుజ్జు భూతాలు (ట్రోల్స్‌) తమ లక్ష్యంగా చేసుకుంటాయి.

కొత్త దాడి బృందం వచ్చి నపుడల్లా ‘పరీక్ష హాలులో ‘ వున్న వారి వెన్నులో వణుకుపుడుతోంది. ఏ నేరమూ చేయకుండానే భయం కొల్పుతున్నాయి. తప్పు చేసిన వారిని పట్టుకోవటం గాక అమాయకులను ఎక్కువగా భయకంపితులు గావిస్తున్నాయి. ఇది నకిలీ డిగ్రీలు-నిజమైన డిగ్రీల గురించి చర్చలు చేస్తున్న ఈ కాలంలో వివిధ రూపాలలో ధర్డ్‌ డిగ్రీ( సాధారణంగా పోలీసుల చిత్ర హింసలను ఆంగ్లంలో అలా సంబోధిస్తారు, టీవీ చర్చలు కూడా అంతే చిత్రహింసలు పెడుతున్నాయన్నది ప్రసంగకర్త విరుపు ) తిరిగి వచ్చింది. ఈ కాలంలో న్యూస్‌ యాంకర్‌ నూతన అధికార కేంద్రంగా మారారు. తాను కోరుకున్నదానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే హఠాత్తుగా విరుచుకుపడతారు. వ్యతిరేక అభిప్రాయం కలిగి వుండటం నేరం. ప్రత్యామ్నాయ అభిప్రాయం కలిగి వుండటం ఒక తీవ్రమైన నేరం, వాస్తవాలను ముందుంచటం అశ్లీల చర్య, నిజాయితీగా వుండటం పాపం. తొలుత టీవీలు మన సాయంత్రాలను మాత్రమే బందీలుగా చేశాయి. ఇప్పుడు ఈ ‘పోలీస్‌ స్టేషన్లు ‘ రోజంతా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మీరు తొలి అవార్డుకు ఒక న్యూస్‌ యాంకర్‌ను ఎంపిక చేశారు.అంటే ఇంకా బతికుండేందుకు మీరు సాహసం చేస్తున్నారనేందుకు ఈ రుజువు చాలు. వారి బ్రతుకు ఒక భ్రమ అయినప్పటికీ మరో ఓటమిని ఎదుర్కొనే సాహసం చేయటానికి సిద్ధంగా వుండే జనాలు ఇంకా వున్నారు. నేను కృతజ్ఞుడనై వున్నాను.

గాంధీ పీస్‌ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు.ఈ అవార్డును చెమటోడ్చిన జర్నలిస్టులు ఏర్పాటు చేశారనే స్పృహ వున్న వాడిని. ఈ వృత్తిలో నాకంటే పెద్ద వారి నుంచి ఏది తీసుకున్నప్పటికీ దానినొక బహుమానంగా నేను భావిస్తాను. నా ప్రార్ధనలకు సమాధానం వంటిది. మన మందరం కులదీప్‌ నయ్యర్‌గారిని గౌరవిస్తాము. మీరు రాసిన వాటిని మిలియన్ల మంది చదివారు. ప్రతి రోజు ఎవరి పేరునైతే ద్వేషించారో, విషం చిమ్మారో వారి ఎల్లలలో మీరు జ్యోతులను వెలిగించారు. వాస్తవానికి మనలో ఎంత మందిమి కనీసం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం, జనం ప్రేమ గురించి ఆలోచిస్తున్నారా అన్నది నాకు సందేహమే. మనం ఇంకేమాత్రం రోజూ వుషోదయాలతో లేవటం లేదు, దానికి బదులు వాట్సాప్‌లో మనకు శుభోదయాలు చెప్పారా అనే వెతుకులాటతో రోజును ప్రారంభిస్తున్నాం. దీనిని చూస్తుంటే వాట్సాప్‌లతో సూర్యుడు వుదయించటంతో ప్రపంచం ప్రారంభమౌతుందా అని పిస్తోంది. త్వరలో మనం గెలీలియోను మరోసారి శిక్షించబోతున్నాం, ఈ సారి దానిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తాం.

అవకాశాలను కనుగొనే దశ ఇది. నూతన, మిగిలిపోయిన అవకాశాలకోసం మనం నిరంతరం చూస్తున్నాము, ఆ నూతన ఆశలు, అవకాశాలను రక్షించే, పెంచి పోషించే జనం కోసం కూడా చూస్తున్నాము. అయినప్పటికీ ఈ ఆశలు, అవకాశాలు నేడు సన్నగిల్లుతున్నాయి. వీటి మధ్య మన ఆశలు ఏకాంతంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మనం ఎంతకాలం బతికి వుంటామనేది మనందరినీ వేధిస్తున్నది. మన చుట్టూ ఎలా వున్నప్పటికీ అర్ధవంతంగా ఎలా జీవించాలనే అంశాన్ని మనం మరచిపోయాము. ఇటువంటి పరిస్ధితిలో మన శక్తిని, ఆవేశాన్ని తిరిగి రగిలించుకోవాల్సి వుంది. మీ ప్రశ్నలను సానపెట్టండి, మీరు నమ్మిన రాజకీయ బృందాలను ప్రశ్నించండి. ఆ బృందాలు మన విశ్వాసాన్ని దెబ్బతీశాయి. మీకు విశ్వాసం లేని వారిని కూడా ప్రశ్నించండి. మన సమాజంలో ఇతరులతో మాటా మంతీ పూర్తిగా నిలిచిపోయింది. నేడు సమాజం తన ఆశలన్నింటినీ మార్పు తెచ్చే రాజకీయ పార్టీలపై పెట్టుకుంది.రాజకీయంగా శక్తి వంతులైన వారు మాత్రమే ప్రమోదం లేదా ప్రమాదకరమైన మార్పులను గానీ తేగలరని సమాజానికి ఇప్పుడు తెలుసు. ఈ కారణంగానే రాజకీయపార్టీలపై పెట్టుకున్న ఆశలనుంచి వెనక్కు పోవటం లేదు. జనం ఈ సాహసం చేయటాన్ని కొనసాగిస్తారు. రాజకీయపార్టీలు ప్రతిసారీ వారిని విఫలం చేస్తాయి, అయినప్పటికీ మరోసారి వాటిపై నమ్మకం పెట్టుకుంటారు.

తమ సభ్యులు వివిధ మార్గాలను వెతుక్కొనేందుకు నిరంతరం తమ నుంచి వెళ్లిపోవటాన్ని రాజకీయపార్టీలు గమనించాయి. అలా వెళ్లేవారు సామాజిక మార్పునకు రాజకీయాలను ఒక సాధనంగా ఇంకే మాత్రం పరిగణించటం లేదు. అటువంటి వారు తగ్గిపోతున్న కారణంగా రాజకీయపార్టీలు నైతికంగా పతనం అవుతున్నాయి. రాజకీయ పార్టీలకు కొత్త రూపునిచ్చి పున:నిర్మాణం చేయాల్సి వుంది. దయచేసి మీ అంతర్గత వైరుధ్యాలను పక్కన పెట్టండి. గత 30,40 సంవత్సరాలుగా వాటిని చూస్తున్నాము. వామపక్షవాదులు, గాంధీవాదులు, అంబేద్కరిస్టులు మరియు సోషలిస్టులు వారి ప్రధాన రాజకీయ నిర్మాణాల నుంచి వైదొలిగారు. దీంతో ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయ రాజకీయాల ఆశయాలను కోల్పోయాయి. అటువంటి పార్టీలలోకి తిరిగి రండి, వాటి బాధ్యతలను స్వీకరించండి. గతాన్ని మరచిపోండి. నూతన రాజకీయాల కోసం కష్టపడండి. మన అసహాయత, పిరికితనాన్ని గుర్తించటానికి ఇది మంచి సమయం. మనల్ని మనం నిజాయితీతో విశ్లేషించుకోవటానికి ఈ చీకటి సమయాలు సరైన అవకాశం.

నా జర్నలిజం కారణంగా నాకు ఈ అవార్డునిచ్చారు. మీరు ఏదైనా వుందని ఆలోచిస్తున్నట్లయితే ఆ సంక్షోభం నేడు జర్నలిజంలో లేదని చెప్పటానికి ఇది నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. రాజధాని నుంచి చిన్న జిల్లా కేంద్రాల వరకు వున్న సంపాదకులందరూ ఒక రాజకీయపార్టీ సైద్ధాంతిక తుపానులో కొట్టుకుపోవటానికి సంతోషంగా వున్నారు. అయినప్పటికీ మనం వారిని విమర్శిస్తున్నాము. వారు ఎంతో సంతోషంగా వున్నారని మనం అంగీకరించాల్సి వుంది. తాము నేర్పుగల జర్నలిస్టులుగా వున్నామని ఈ కారణంగానే వారు భావించగలుగుతున్నారు. గత యాభై అరవై సంవత్సరాలుగా రాజకీయ వస్తువుతో మిళితం చేసేందుకు మీడియా నిరంతర ప్రయత్నాలు చేసింది. హోటళ్లు, దుకాణ సముదాయాలు, గనుల కౌలు మరియు ఇతర లైసన్సులు పొందటంద్వారా వారి ఆకలి తీరలేదు. వారి ఆత్మలింకా అసంతృతోనే వున్నాయి. ఇప్పుడు అవి శాంతిని పొందాయి. అంతిమంగా అధికార రాజకీయాలతో భాగంగా వుండాలన్న మీడియా కల నెరవేరింది.

భారతీయ మీడియా నేడు పారవశ్య స్ధితిలో వుంది. స్వర్గానికి చేరుకోవాలంటే మెట్లను కనుక్కోవాల్సి వుందని జనాలు మాట్లాడుకున్న రోజులున్నాయి. నేడు అలాంటి వారు భూమి మీదనే స్వర్గాన్ని కనుగొన్నారు.వారికి మెట్లదారి ఇంకేమాత్రం అవసరం లేదు. మీరు నా మాటలను విశ్వసించకపోయినట్లయితే మీరు ఏ వార్తా పత్రికనైనా చదవండి లేదా న్యూస్‌ ఛానల్‌ను అయినా చూడండి. ఒక ప్రత్యేక రాజకీయ అజెండాకు విశ్వాసపాత్రులుగా వుండేందుకు మీడియా తహతహలాడుతున్నట్లు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దశాబ్దాల నిరాశా నిస్పృల తరువాత మాత్రమే మీరు ఈ బ్రహ్మానందాన్ని చూడగలరు, ఎంతటి బాధనైనా తేలికగా తీసుకుంటారు. అలంకరించుకున్న ఈ యాంకర్లు మీకు ఇంతకు ముందెన్నడూ ఇంత అందంగా కనిపించి వుండరు. లేదా ఒక మహిళా యాంకర్‌ ప్రభుత్వాన్ని ఎంతో అందంగా పొగడటాన్ని చూసి వుండరు. ఇప్పుడు ప్రభుత్వం ఎలా వుందో జర్నలిస్టులు కూడా అలాగే వున్నారు.

మీకు పోరాడాలని వుంటే వార్తా పత్రిక, టెలివిజన్‌తో పోరాడండి. మునిగిపోతున్న జర్నలిజం గురించి మీ ధృడ వైఖరిని కోల్పోకండి. జర్నలిస్టులు సైతం కాపాడాలని కోరుకోవటం లేదు. మిగిలి వున్న వారెవరైనా వుంటే వారిని కూడా సులభంగా తొలగించి వేస్తారు.ఏ ఒక్కరినైనా బతికిస్తే పరిస్ధితికి అది ఎలా తోడ్పడగలదు. సంస్ధలు మొత్తంగా మతపూరితం గావించబడ్డాయి. భారత్‌లో జర్నలిజం మతోన్మాదాన్ని వ్యాపింప చేస్తోంది.అది రక్తదాహంతో వుంది. ఏదో ఒక రోజు జాతి మొత్తాన్ని రక్తసిక్తం గావించనుంది. తన అజెండాను విజయవంతంగా ముందుకు తీసుకుపోయినట్లు ఈ రోజు కనిపించకపోవచ్చు. కానీ దాని ప్రయత్నాలను మనం విస్మరించకూడదు. అందువలన మనకు ఎదురైన వాటి గురించి ఎవరైనా, ప్రతివారూ దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. వార్తా పత్రికలు, టీవీ ఛానల్స్‌ రాజకీయ పార్టీల శాఖలుగా తయారయ్యాయి. రాజకీయ పార్టీల ప్రధాన కార్యదర్శుల కంటే యాంకర్లు ఇప్పుడు ఎక్కువ అధికారం కలిగి వున్నారు. ఈ నూతన నిర్మాణాలపై ప్రతి ఒక్కరూ పోరాడకుండా నూతన రాజకీయ ఆలోచనలు ఒక రూపం తీసుకోవు. జరుగుతున్న వాటిని నేనెందుకు ప్రశ్నించాలి అనే విధంగా ప్రతి వారి బుర్రలను తయారు చేసే విధంగా ఆధిపత్యం వహించటంలో వారు కృతకృత్యులయ్యారు. ఎవరైతే సిరా చల్లుతారో వారిని పార్టీ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నారు. ఎవరైతే సిరాతో రాస్తారో వారు కేవలం ప్రచారంలో మాత్రమే పొల్గొంటున్నారు. వర్తమాన జర్నలిజం వర్తమాన ప్రచారంగా మారింది.

అయితే సాధ్యమయ్యేవాటిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులను మనం ఎలా విస్మరించగలం? ఈ అవకాశాలు చివరికి అంతరించుతాయి కానీ వారి వారసత్వ సొత్తు మాత్రం భవిష్యత్‌లో మనకు సాధికారతనిస్తుంది. ఈ జర్నలిస్టులు ఎప్పుడైతే ఇచ్చకాలమారితనంతో అలసి పోతారో లేదా వంచన ద్వారా ఓడిపోతారో అప్పుడు తమ గాఢనిద్ర నుంచి మేలుకుంటారు. ఈ అశాభావాలు మరియు అవకాశాలే వారిని రక్షిస్తాయి. అందుకే మన ఆశలను, అవకాశాలను కొనసాగించాలని నేను అంటాను. ఈ రోజులను ఇంద్ర ధనుస్సు వంటి ఆశలతోనో లేదా వైఫల్య దృష్టితోనో చూడవద్దు. మనం ఒక పెద్ద ఇంజను వస్తున్న రైల్వే లైనుపై వున్నాం, పారిపోవటానికి లేదా మనల్ని మనం రక్షించుకోవటానికి గాని సమయంలేని స్ధితిలో వున్నాము. ఆశ లేదా వైఫల్యానికి గాని అవకాశం లేదు. మనం స్వయంగా రంగంలోకి దిగాలి. మనకు సమయం తక్కువగా వుంది దాని వేగం ఎక్కువగా వుండాలి.