Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రభుత్వ వుద్యోగాలలో కమ్యూనిస్టులు పని చేయటంపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ మేనెల ఎనిమిదవ తేదీన ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తదుపరి శాసన మండలి ఆమోదం పొందితే అది అమలులోకి వస్తుంది. కమ్యూనిస్టులకు ఇది సంతోషకరమైన వార్త అయితే మింగుడుపడని వ్యతిరేకులు గుండెలు బాదుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచాన్ని కమ్యూనిజం ఆవహిస్తోందంటూ భయపడిన అమెరికన్‌ పాలకవర్గం కమ్యూనిస్టు వ్యతిరేక, నిషేధ చట్టాలను చేసింది. వుద్యోగం, వుపాధి, కార్మిక, కళా ఇలా ఒకటేమిటి అన్ని జీవన రంగాలలో అనేక లక్షల మందిని కమ్యూనిస్టులు అన్న అనుమానాలతో వెంటాడి వేధించింది. ఇప్పటికీ వేధిస్తోంది, న్యూయార్క్‌ నగరంలో ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమ్యూనిస్టు కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణతో అక్కడి విద్యాశాఖ విచారణ చేపట్టిన విషయం, దానిని ఆపాలని కోరితే కోర్టు తిరస్కరించిన వుదంతం ఇదే సమయంలో జరిగింది.

మరోవైపున అమెరికాలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు తమ ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా ఫ్రీడం ఫెస్టివల్‌ పేరుతో జరిపే కార్యక్రమాలలో భాగంగా ఈ ఏడాది ‘వందేళ్ల భావజాల పోరులో పెట్టుబడిదారీ విధానమా ? మ్యూనిజమా ఎవరు గెలిచారు?’ అనేపేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తూర్పు ఐరోపా, సోవియట్‌లో సోషలిజాన్ని కూల్చివేసిన సమయంలో రాబర్ట్‌ హెయిల్‌బర్టన్‌ అనే అమెరికన్‌ ఆర్ధికవేత్త న్యూయార్కర్‌ అనే పత్రికలో రాసిన వ్యాసంలో ‘పెట్టుబడిదారీ విధానం-సోషలిజం మధ్య యుద్ధం ముగిసింది. సోషలిజం విఫలమైంది, పెట్టుబడిదారీ విధానం విజయం సాధించింది. దీంతో చరిత్ర ముగసింది ‘ అని రాశాడు. ఆ పెద్దమనిషి 2005లో 85 ఏండ్ల వయస్సులో వృద్ధాప్యంతో మరణించాడు. ఇన్ని సంవత్సరాల తరువాత ఎవరు విజయం సాధించారు అనే చర్చకు ఆ పెద్దమనిషి వారసులైన కమ్యూనిస్టు వ్యతిరేకులు తెరతీశారంటే అనుకున్న, ఆశించిన దానికి భిన్నంగా జరుగుతోందనే అనుమానం వారిలో తలెత్తినట్లే !

కాలిఫోర్నియా అసెంబ్లీలోని డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడు రోబ్‌ బోంటా గతేడాది డిసెంబరులో కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేయాలనే బిల్లును ప్రవేశపెట్టాడు. కమ్యూనిస్టు అనే ముద్ర పాతదైన పుక్కిటి పురాణ ప్రస్తావన వంటిది. దానిని దుర్వినియోగం చేసే అవకాశం వుంది, నిర్మొగమాటంగా చెప్పాలంటే గతంలో మన చరిత్రలోని కొన్ని చీకటి అధ్యాయాలలో అది జరిగింది, అందువలన సాంకేతికంగా దానిని తీసివేయాల్సి వుంది అని తన బిల్లు వుద్దేశ్యాన్ని వివరించాడు. ఈ సవరణ ప్రకారం కమ్యూనిస్టు పార్టీ సభ్యులు అనే పదాన్ని మాత్రమే తొలగిస్తారు. హింసా మార్గాల ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసే ఏ సంస్ధ సభ్యుల నైనా ప్రభుత్వ వుద్యోగాల నుంచి తొలగించ వచ్చు అనే నిబంధన ఇక ముందు కూడా కొనసాగుతుంది. కమ్యూనిస్టుల నుంచి ఇప్పటికీ ముప్పు వుందని ఆ పదాన్ని తొలగించటం మొత్తం కాలిఫోర్నియన్లను అవమానించటమే అని రెచ్చగొట్టే విధంగా కొందరు రిపబ్లికన్‌ సభ్యులు వ్యాఖ్యానించారు.

ఆండ్రూ మిల్లర్‌ అనే వ్యాఖ్యాత ఒక పత్రికలో ఇలా గగ్గోలు పెట్టాడు. ‘1991లో సోవియట్‌ యూనియన్‌ కూలిపోయినపుడు అమెరికా విశ్వవిద్యాలయాలలో తప్ప ప్రతి చోటా మార్క్సిజం చచ్చిపోయింది అని కొంత మంది జోకు వేశారు. ఇరవైఆరు సంవత్సరాల తరువాత విద్యావేత్తల వలయం నుంచి ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. కాలిఫోర్నియా సెనెట్‌(మన శాసనమండలి మాదిరి)లో ఈ బిల్లు విజయవంతంగా ఆమోదించబడుతుందా లేదా అన్నది తార్కికాంశం. ఒక వాస్తవం ఏమంటే త్వరలో కమ్యూనిస్టులు త్వరలో అధికారానికి వస్తారా అన్నది రాజకీయాలలో గొప్ప ప్రాధాన్యత వున్న అంశం కాదు. ఎన్నికలలో మార్క్సిజాన్ని కూడా సాధ్యమైన అంశంగానే పరిగణిచాలని నమ్మేంత వరకు అమెరికా సంస్కృతి రావటమే భయంగొలుపుతున్న వాస్తవం. 2006లో జరిగిన ఒక సర్వే ప్రకారం అమెరికన్‌ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లలో మూడు శాతం మంది స్వయంగా తాము మార్క్సిస్టులమని చెప్పుకున్నారు. హ్యుమానిటీస్‌ ప్రొఫెసర్లలో ఐదుశాతం, సామాజిక శాస్త్రాల వారిలో 18శాతం వున్నారు. మితవాదులతో పోల్చితే ఒక సామాజిక శాస్త్ర ప్రొఫెసర్‌ తాను మార్క్సిస్టును అని మూడు రెట్లు ఎక్కువగా స్పష్టంగా చెబుతారని ఈ సర్వేలో తేలింది.2011లో రాస్‌ముసేన్‌ నివేదిక ప్రకారం వర్తమాన అమెరికా రాజకీయ, ఆర్ధిక వ్యవస్ధల కంటే నైతికంగా కమ్యూనిజం వున్నతమైందని అమెరికన్‌ ఓటర్లలో 11శాతం మంది భావించటం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించదు………..అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్‌ దిగువ సభ)లో 14శాతం మంది అభ్యుదయగామి సభ్యులున్నారని డెమోక్రటిక్‌ సోషలిస్టులు కనుగొన్నారు. మార్క్సిజం మరణించలేదు అనటానికి ఇది పెరుగుతున్న సాక్ష్యం. అది అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో సజీవంగా వుంది సమాజంలోని ఇతర చోట్లకు విస్తరిస్తోంది…..1960 దశకపు ‘నూతన వామపక్ష విద్యార్ధి విప్లవకారులు’ ఇప్పుడు ఆధునిక డెమోక్రటిక్‌ పార్టీ నాయకులుగా వున్నారు. కాలిఫోర్నియాలోని అలంకార ప్రాయమైన రాజకీయ నేతల గురించే మనం మాట్లాడటం లేదు. ఈ విప్లవ నాయకులు నూతన సహ్రాబ్ది యువతరాన్ని ఆకర్షించేందుకు తమ పార్టీని మరింతగా వామపక్షం వైపునకు తీసుకుపోతున్నారు. ఈ సంఖ్య ఎక్కువగా డెమోక్రటిక్‌ మరియు చివరికి సోషలిస్టులవైపు మొగ్గితే ఈ వ్యూహం చివరికి పౌర అశాంతి మరియు హింసాత్మక విప్లవానికి దారితీస్తుంది.’అని మిల్లర్‌ హెచ్చరిక చేశాడు.https://www.thetrumpet.com/15791-california-mulls-communists-in-government

మరో కమ్యూనిస్టు వ్యతిరేకి మార్క్‌ స్కౌసెన్‌ ‘మ్యూనిజం ఎందుకు పని చేయదు, అయినా ఇప్పటికీ ఆకర్షిస్తోంది’ అనే శీర్షికతో ఒక పత్రికలో వ్యాసం రాశాడు. తాను మార్క్సిజం గురించి జీవిత కాలంలో ఎక్కువగా చదివానని చెప్పుకున్న ఆ పెద్దమనిషి తన తండ్రి కమ్యూనిస్టు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే ఎఫ్‌బిఐ ఏజంట్‌ లియోరీ స్కౌసెన్‌ అని, పినతండ్రి ది నేకెడ్‌ కమ్యూనిస్టు అనే పుస్తకం రాసిన క్లియోన్‌ స్కౌసెన్‌ అని స్వయంగా చెప్పుకున్నాడు కనుక అతనేమిటో చెప్పనవసరం లేదు. అనేక విషయాలను ఏకరువు పెడుతూ అయినప్పటికీ ఇంకా విప్లవకారులు ఆకర్షణీయంగానే వున్నారని అనేక విశ్వవిద్యాలయాలలో &ద్యార్ధులు చే గువేరా టీ షర్టులు ధరించటం, ప్రొఫెసర్లు మార్క్సిజం గురించి చెబుతున్నారని వాపోయాడు. ఫ్లోరిడాలోని రోలిన్స్‌ కాలేజీకి వెళ్లినపుడు ఎదురైన తన స్వంత అనుభవాన్ని ఇలా వివరించాడు. అక్కడి ఒక మార్క్సిస్టు ప్రొఫెసర్‌ను గుర్తించి నేను నీకు 1883 నాటి ఒక వెండి డాలర్‌ ఇస్తాను, అయితే దానిని ముద్రించిన సంవత్సరంలో మరణించిన ఒక ఆర్ధికవేత్త పేరు చెప్పాలి అని షరతు పెట్టాడట. వెంటనే ఓ అదెంతో సులభం, ఆయన కారల్‌ మార్క్స్‌ అని జవాబు వచ్చిందట. సరైనదే, ఎప్పుడూ మరచి పోవద్దు ఆయన మరణించాడు అన్నాడట.దానికి ఠకీమని ఆ ప్రొఫెసర్‌ ఇలా జవాబు చెప్పాడట.’ అవును మీరు చెప్పింది కరేక్టే, ఆయన మరణించాడు కానీ నేను బతికి వున్నాను, మార్క్సిజం లోని శక్తి, ప్రభావం వంటి గురించి మీ విద్యార్దులకు నేను బోధిస్తున్నాను ‘ అన్నాడట. అడిగిన పెద్దమనిషికి ఏమై వుంటుందో చెప్పనవసరం లేదు. వ్యక్తులు మరణించినంత మాత్రాన శాస్త్రీయ భావజాలాలు మరణిస్తాయి, వుద్యమాలు అంతరిస్తాయని భ్రమపడే చరిత్ర జ్ఞానం లేని లేదా తెలిసీ అడ్డంగా వాదించే వారికి ఇంతకంటే జవాబు అనవసరం.

మార్క్‌ స్కౌసెన్‌ ఇంకా ఇలా రాశాడు.’ పిల్లలకు కమ్యూనిజం’ పేరుతో రాసిన ఒక చిన్న పుస్తకాన్ని ఇటీవలే మిట్‌ ప్రెస్‌ ముద్రించటాన్ని చూశాను. అది రాసిన ఓ జర్మన్‌ కమ్యూనిస్టు పెట్టుబడిదారీ విధాన లోపాలను మాత్రమే చూశారు, కమ్యూనిజం లోపాల గురించి ఏమీ చెప్పలేదు.అది ఇరవయ్య శతాబద్దంలో పదికోట్ల మందిని చంపింది, ఇప్పటికీ కోట్ల మందికి క్యూబా,వెనెజులా, వుత్తర కొరియాలో జీవితం, స్వేచ్చ,ఆస్ధిని మరియు సంతోషంగా వుండటాన్ని నిరాకరిస్తోంది. ఈ రోజు విద్యార్ధులు మరియు అనేక మంది పౌరులు కమ్యూనిస్టు లేదా సోషలిస్టు తత్వశాస్త్ర ప్రయోజనాలకు ఆకర్షితులౌతున్నారు, ప్రత్యేకించి విద్య, వైద్యం మరియు ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు వుచితంగా అందచేయాలనే దానికి ఆకర్షితులౌతున్నారు.’

అతి సర్వత్ర వర్జయేత్‌ అని పెద్దలు చెప్పారు, ఎంత ఎత్తు పెరిగితే అంత త్వరగా కూలిపోయే అవకాశం వుంటుంది. బొల్లు బొల్లరా ఎంకన్నా అంటే మా వూళ్లో మిరియాలు తాటికాయలంత వుంటాయి దొరా అన్నట్లు కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి అతిశయోక్తులతో ఎంతో చెత్తరాశారు. ఇప్పటికీ కిరాయి రచయితలు రాస్తూనే వున్నారు. చైనాలో చర్చిలను కూల్చివేస్తున్నారని, క్రైస్తవుల సమావేశాలను అడ్డుకుంటున్నారని మీడియాలో ప్రతి రోజూ ఒక పధకం ప్రకారం వార్తలు వస్తుంటాయి. గతంలో సోవియట్‌లో చర్చిలన్నింటినీ కూల్చివేశారని చేసిన ప్రచారం తెలిసిందే. నిజానికి ఏ ఒక్క చర్చిని కూడా కూల్చివేయలేదు. యథాతధంగా వున్నాయని ఇప్పుడందరూ చెబుతున్నారు. చైనాలోని హోనాన్‌ రాష్ట్రంలో మావో పుట్టారు. ఆయన పెరిగిన చాంగ్‌షా పరిసరాలన్నీ క్రైస్తవులు ఎక్కువగా వుండేవి. అక్కడే స్కూలులో మావో కమ్యూనిస్టు పాఠాలు నేర్చుకున్నాడు. అలాంటి పట్టణంలో మావో విగ్రహం కంటే ఎత్తైన 260 అడుగుల చర్చి భవనాన్ని నిర్మిస్తున్నారని, దానికి ప్రభుత్వ సబ్సిడీ కూడా వుందని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రాసింది. మావో కమ్యూనిస్టు పాఠాలు నేర్చుకున్న చోట చర్చికి అనుమతించటం, దానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం ఏమిటని కొందరు అభ్యంతర పెట్టినప్పటికీ ప్రభుత్వం అనుమతించింది.అయితే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే మతశక్తులు ఎవరైనా అలాంటి వారిపై చైనా సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. అంతే తప్ప మత స్వేచ్చను అణచటం లేదు.http://www.gospelherald.com/articles/70424/20170511/massive-church-being-built-city-where-mao-zedong-first-embraced.htm  కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి నూరిపోసిన వారి మాటలకు ఇప్పుడు విశ్వసనీయత సమస్య ఎదురవుతోంది. పెట్టుబడిదారీ దేశాలలో తలెత్తిన తీవ్ర సమస్యలు, సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసి పెట్టుబడిదారీ వ్యవస్దలను తిరిగి రుద్దిన చోట జనం అనుభవిస్తున్న జీవితాన్ని చూసిన తరువాత కమ్యూనిస్టు వ్యతిరేకత ఇప్పుడు పశ్చిమ దేశాలలో అంత ఆకర్షణీయంగా లేదు. అయినా చరిత్రను వెనక్కు తిప్పాలని చూసే తిరోగమన వాదులు తమ ప్రయత్నాలను మానుకోవటం లేదు.