Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలన్న ఆసక్తి జనాలలో కలగటంపై సామాజిక మీడియాలో కొందరు వ్యంగ్యంతో సహా తమకు నచ్చిన రూపాలలో స్పందించారు. ఈ రెండు అంశాలూ చైతన్య సూచికకు సంబంధించినవి. నిరాశా జీవికి గ్లాసులో నీళ్లు సగమే అనిపిస్తాయి. ఆశాజీవికి ఆ సగమే ధైర్యాన్నిస్తాయి. కట్టప్ప-బాహుబలికి సంబంధించి రాజమౌళి ఆసక్తి రేపి దాన్ని సొమ్ము చేసుకోవటంలో కొత్త రికార్డు సాధించాడు. మూడు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ అంతకంటే పెద్ద ప్రచార వ్యూహంతో, కట్టుకధలతో న్యూఢిల్లీ బాహుబలి బిగినింగు (ప్రారంభం) విజయం సాధించింది. మైనారిటీ ఓట్లా మెజారిటీ ఓట్లతోనా అన్న విషయాన్ని పక్కన పెడితే మైనారిటీ ఓట్లతోనే అయినప్పటికీ గత మూడు దశాబ్దాల దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ స్వంతంగా లోక్‌సభలో మెజారిటీ సాధించింది బిజెపి, దానికి సారధిగా మోడీ అన్నది తెలిసిందే. రాజమౌళి రెండో భాగాన్ని కూడా విజయవంతం చేశారు. ఒక కల్పిత కథతో నిర్మించిన సినిమా గురించి ఇంత ఆసక్తి పెంచుకున్న జనాలు తమ జీవితాలను ప్రభావితం చేస్తున్న వాస్తవ అంశాలపై ఎందుకు ఆసక్తి చూపటం లేదు అన్నది కాస్త బుర్రలో గుంజు వున్నవారికి కలగటం సహజం. వారికి ఒక దండవేస్తే అలాంటి ఆలోచనలను దరిదాపులలోకి రానివ్వని వారికి వంద దండలు వేద్దాం. తన సినిమా గురించి ఆసక్తి కలిగించటానికి రాజమౌళికి మీడియా ఇచ్చిన ప్రచారానికి ప్రతిఫలంగా ఆయన కూడా తనవంతు చేయాల్సింది చేశారు. న్యూఢిల్లీ బాహుబలి ఏం చేస్తున్నారు అని జనాలు ఆలోచించకుండా ఆసక్తిని వేరే వైపు మళ్లించటానికి మీడియా చేయాల్సిందంతా చేస్తోంది. అందుకు ఎన్నో రెట్ల ప్రతిఫలం కూడా అందుకుంటోంది. అదే రాజమౌళి-నరేంద్రమోడీకి వున్న తేడా అనిపిస్తోంది. మోడీ బాహుబలి కంక్లూషన్‌( ముగింపు) ఎలా వుండబోతోంది అన్నది ఆసక్తికరం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో పాలకులు మీడియాను నయానో భయానో తమ చేతుల్లోకి తీసుకున్నారు. స్త్రోత్ర పాఠాలు, విజయగానాలు తప్ప మరొకటి వినిపించటం లేదు.

మోడీ మూడు సంవత్సరాల పాలన గురించి సర్వేలు వెలువడుతున్నాయి.చరిత్రలో హిట్లర్‌ను ఇప్పటికీ అభిమానించే వారు, అసహ్యించుకొనే వారు ఎలా వుంటారో చరిత్రలో పేరుమోసిన ప్రతివారికీ అభిమానులు, వ్యతిరేకులు ఎప్పుడూ వుంటారు.తన తండ్రిని స్మగ్లర్‌గా, అధోజగత్తు నేతగా చిత్రిస్తూ సినిమా తీస్తే వూరుకోబోనని, అటువంటి కార్యకలాపాలకు ఏ కోర్టూ అతనిని శిక్షించలేదని గుర్తు చేస్తూ హాజీ మస్తాన్‌ అనే మస్తాన్‌ మీర్జా పెంపుడు కొడుకుగా చెప్పుకున్న ఒక వ్యక్తి రజనీకాంత్‌ను హెచ్చరిస్తూ లేఖ రాసిన వార్తలను చదివాం. గుజరాత్‌ మారణకాండకు నరేంద్రమోడీ కారకుడని వూరూ వాడా కోడై కూసిన విషయం, అమెరికా తన గడ్డమీద అడుగు పెట్టనివ్వని విషయం తెలిసిందే. హాజీ మస్తాన్‌ కొడుకు మాదిరే తాము మోడీ పెంపుడు కొడుకులం అని చెప్పుకోకపోయినా సరిగ్గా ఇదే మాదిరి నరేంద్రమోడీని ఏ కోర్టూ తప్పు పట్టలేదు కనుక గుజరాత్‌ మారణకాండకు బాధ్యుడు అంటే సహించబోమని సామాజిక మీడియాలో ఇప్పటికీ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. అంటే చట్టం-అభిమానుల దృష్టిలో ఇద్దరూ మచ్చ లేనివారే !

మూడు సంవత్సరాల క్రితం అటు కేంద్రంలో నరేంద్రమోడీ, ఇటు తెలుగురాష్ట్రాలలో ఇద్దరు చంద్రులు అల్లావుద్దీను కంటే ఎక్కువగా రాజకీయ రంగంలో అద్బుతాలు చూపుతామని వాగ్దానాలు చేశారు. అవేమయ్యాయి, వారు దీపాన్ని రుద్దినట్లు జనం ముందు చూపటం తప్ప అద్బుతాలు కనిపించటం లేదు. నిజం మాట్లాడాల్సి వస్తే అసలు అద్బుతాలు చూపమని వారిని ఎవరు అడిగారు. చెప్పారు పో, ఎందుకు చూపటం లేదని అడిగేందుకు ముందుకు రాలేనంతగా మన జనం ఎందుకు నీరసించి పోతున్నారు అన్నది ఒక ప్రశ్న. దానికి ఈ మధ్య కొందరు చెబుతున్న సమాధానం ఏమంటే మన దేశంలో ‘వుత్తమ సంతతి’ తగ్గిపోయింది, అందువలన అలాంటి వారిని పుట్టించేందుకు ‘గర్భ సంస్కారం’ చేయాలి అంటూ కొందరు తయారయ్యారు, మనల్నందరినీ పనికిరాని వారిగా చిత్రిస్తున్న వారి గురించి తరువాత చూద్దాం.

మోడీ హయాంలో జనాన్ని బాగా ఆకట్టుకున్నదీ, అతి పెద్ద సంస్కరణగా చిత్రించినదీ, చర్చ జరిగిన అంశం పెద్ద నోట్ల రద్దు. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దు ద్వారా దేశంలో అవినీతిని అరికడతామని, నల్లధనాన్ని బయట పెడతామని చెప్పారు. నల్లధనం రద్దుతో పాటు ధరలు తగ్గుతాయి, కార్డులను గీకటం ద్వారా పన్ను వసూలు పెరుగుతుంది, కాశ్మీరులో రాళ్లు వేయటం ఆగిపోయింది, నక్సలైట్లకు డబ్లు ఇచ్చే మార్గాలు బందు అయిపోయాయి. అన్ని రకాల వుగ్రదాడులు తగ్గుతాయి వంటి కబుర్లన్నీ విన్నత తరువాత పాఠశాల రోజుల్లో అశోకుడి చెట్లు, ఆవు-ప్రయోజనాలేమిటి అంటే టీచర్లను మెప్పించేందుకు ఠావుల కొద్దీ రాసిన వ్యాసాలు మరోసారి గుర్తుకు వచ్చాయి. ఇవేమీ జరగవు, నోట్ల రద్దు వలన జనానికి ఇబ్బందులు, కొత్త నోట్ల ముద్రణకు చేతి చమురు వదలటం తప్ప ఒరిగేదేమీ వుండదు అని చెప్పిన వారిని నల్ల ధన కుబేరులకు మద్దతు పలికేవారుగానూ, నల్లధనంతో లబ్ది పోతోందనే వుక్రోషంతో చెబుతున్న మాటలుగానో చెప్పటంతో పాటు నోట్ల రద్దుకు మద్దతు ఇవ్వటం దేశ భక్తి అని చెప్పారు.

ఇంకేముంది బ్యాంకుల ముందు క్యూలలో నిలబడుతూ పొరపాటున ఎవరైనా నోట్ల రద్దును తప్పుపడితే వారిపై జనం విరుచుకుపడ్డారు. ఏం కొద్ది రోజులు ఇబ్బంది పడలేరా, ఓపిక పట్టలేరా అంటూ మందలించారు. అయినా తప్పన్న వారిని ఎయిడ్స్‌ వ్యాధి వచ్చిన వారి మాదిరి చీదరించుకున్నారు. సినిమాలో మంచి వాడనుకున్న బాహుబలిని కట్టప్ప చంపాడు. నిజ జీవితంలో వెంకయ్య నాయుడి మాటల్లో చెప్పాలంటే భారతీయుల బతుకులు బాగు చేసేందుకు వచ్చిన దేవదూత నరేంద్రమోడీ అనే బాహుబలి పెద్ద నోట్లు అనే శత్రువును సంహరించి దేశానికి దీపావళిని తెచ్చాడు. మంచిదే !

పాత నోట్ల మార్పిడి గడువు వరకు వాటి ప్రయోజనాల గురించి మాట్లాడిన మోడీ తరువాత ఒక్క మాట చెబితే ఒట్టు ! ఎందుకు మాట్లాడటం లేదు? రిజర్వుబ్యాంకు దగ్గరకు వచ్చిన పాత నోట్ల విలువ ఎంత? నల్లధనం ఎంత బయట పడింది? దానిని ఏ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు? కొత్త నోట్ల ముద్రణ ఎంతకాలం పడుతుంది? నోట్ల రద్దుకు ముందు మాదిరి ఎటిఎంలలో సరిపడా నోట్లు పెట్టటానికి ఎంతకాలం పడుతుంది? ఇవేవీ జాతీయ లేదా ప్రాంతీయ మీడియాకు పట్టలేదు.అసలేమీ జరగనట్లే, అంతా బాగున్నట్లే అన్నట్లుగా మోడీ భజనలో మునిగిపోయింది. నవంబరులో జరిగే నోట్ల రద్దు తొలి వార్షికోత్సవం నాటికి అవసరమైన నోట్లు అందుబాటులో వుంటాయని సం’ తృప్తి చెందుదాం. తెలివయ్య అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడు అన్నట్లుగా ప్రధాని చర్యను చూద్దాం !

రైతే రాజు, దేశానికి వెన్నెముక అనే నినాదాలు పాత బడ్డాయి. ఎందుకంటే రైతుల వెన్నెముకలు విరిగాయని గత ఏడు దశాబ్దాలలో తేలిపోయింది. అందువలన 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని నరేంద్రమోడీ కొత్త పల్లవి అందుకున్నారు. గుడ్డి కంటే మెల్ల ఎన్నో రెట్లు అన్న వేదాంతులం మనం. గత సంవత్సరాల గుడ్డి కంటే ముగిసిన పత్తి సీజన్‌లో ధరలు కొంత మెరుగ్గా వున్నాయని రైతులు సంతోషం వెలిబుచ్చారు. అయితే ఆ మేరకు మిర్చి రైతులకు ఆత్మహత్యల దారి చూపారనుకోండి. పత్తి ధర విషయానికి వస్తే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం 2010-11 జె 4 అనే పొట్టి పింజరకం వార్షిక సగటు క్వింటాలు రు.5,771 వుంటే తెలుగు రాష్ట్రాలలో సాగు చేసే పొడవు పింజరకాలకు సమానమైన ఎస్‌ 6 రు.5,271 వుంది. అప్పటికీ ఇప్పటికీ పెరిగిన ఖర్చులు, రైతాంగ అవసరాలను చూసుకుంటే కనీసం ఏడెనిమిది వేల రూపాయలైనా రావాల్సి వుంది. అయితే సీజన్‌లో బాగా తగ్గి తరువాత ఐదున్నరవేలకు పెరిగి కొంత మంది రైతులను సంతోష పెట్టి తరువాత తగ్గిందనుకోండి. ఇంకాస్త పెరగటానికి వున్న అవకాశాలను నరేంద్రమోడీ సర్కార్‌ దెబ్బతీసింది అనే విషయం మన రైతు బిడ్డలు వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు మనకు చెప్పటం లేదు. దేశంలో పత్తి ధరలు పెరుగుతున్నప్పడల్లా దిగుమతులకు అనుమతించి రైతులను ఏడిపించి, మిల్లర్లను సంతోషపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది.అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు నరేంద్రమోడీ సర్కార్‌ ఎంత గుండెలు తీసిన బంటు అంటే పత్తి దిగుమతులలో గత వాజ్‌పేయి సర్కార్‌ 2001-02లో 25లక్షల బేళ్లతో రికార్డు దిగుమతులు చేసుకుంది. ఇప్పుడు 30లక్షలతో నరేంద్రమోడీ తన గురువు రికార్డును బద్దలు కొట్టారు.ఎవరికైనా అనుమానం వుంటే దిగువ లింక్‌లోని వార్త చదవండి.http://www.yarnsandfibers.com/news/textile-news/cotton-imports-touch-all-time-high-30-lakh-bales-season#.WRpwfcYlE2w అందువలన రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని అంటే నమ్మాలో లేదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

లోకల్‌ సర్కిల్స్‌ అనే ఒక వేదిక రెండు లక్షల మంది ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయ సేకరణ ఫలితాలంటూ ఒక నివేదికను నరేంద్రమోడీ మూడు సంవత్సరాల పాలనపై తాజాగా విడుదల చేసింది. దానికి ఎలాంటి దురుద్ధేశ్యాలను, సదుద్ధేశ్యాలను అంట కట్టటం లేదు. ఇంకా ఇలాంటివి ఎన్నో రావచ్చు. దాని వివరాల ప్రకారం జనం ఎలా వున్నారో చూద్దాం. ద్రవ్యోల్బణం మూడుశాతానికి తగ్గినప్పటికీ ధరలు పెరుగుతున్నాయని 66శాతం మంది చెప్పారు, గతేడాది కంటే 11శాతం వీరి సంఖ్య పెరిగింది. వుపాధి కల్పన గురించి అసంతృప్తి చెందిన వారి సంఖ్య 43నుంచి 63శాతానికి పెరిగింది. అవునని చెప్పిన వారు 35 నుంచి కేవలం 21శాతానికి తగ్గారు. నోట్ల రద్దు వలన అవినీతి తగ్గిందని చెప్పిన వారు 39శాతం కాగా, సరైన చర్య అని చెప్పిన వారు 51శాతం మాత్రమే వున్నారు. మోడీ హయాంలో ప్రపంచంలో భారత ప్రతిష్ట పెరిగింది అని నమ్మిన వారు 90 నుంచి 81కి తగ్గగా లేదు, చెప్పలేము అన్నవారు 10 నుంచి 19శాతానికి పెరిగారు.పాకిస్ధాన్‌తో వ్యహరించిన తీరు బాగుంది అన్న వారు గతేడాది 34శాతం కాగా సర్జికల్‌ దాడుల తరువాత ప్రస్తుతం ఆ సంఖ్య 64శాతానికి పెరిగింది.దేశంలో అసహనం పెరుగుతోందా అన్న ప్రశ్నకు గతేడాది లేదని చెప్పిన 74శాతం తాజాగా 69కు పడిపోయింది. మొత్తం మీద 61శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆశాభంగం చెందిన వారి సంఖ్య గతేడాదితో పోల్చితే 36 నుంచి 39కి పెరిగింది. వాగ్దానాలను నెరవేర్చగలరని నమ్ముతున్నవారు 59శాతం వున్నారు.

ఈ సర్వే వెల్లడించిన అంశాలను మొత్తంగా చూస్తే నరేంద్రమోడీ మీద ఇంకా విశ్వాసం వున్న వారు గణనీయంగా వున్నారు. ఇదే సమయంలో భ్రమలు కోల్పోతున్నవారు పెరుగుతున్నారు.అందుకు వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో సీట్లు దండిగా వచ్చినప్పటికీ ఓట్లు 2014 కంటే తక్కువ రావటం, గోవా, పంజాబులలో వున్న అధికారాన్ని కోల్పోవటం ఒక రుజువు. పైన పేర్కొన్న సర్వే ప్రకారం పాకనతో వ్యవహరిస్తున్న తీరును జనం మెచ్చుకుంటున్నారని తేలింది.అందువలన మిగతా రంగాలలో వైఫల్యాలు లేదా ముందుకు పోలేని స్ధితిలో పాకిస్ధాన్‌, కాశ్మీరు పరిస్ధితులను ముందుకు తెచ్చి మధ్యంతర ఎన్నికలలో ఓట్లను కొల్లగొట్టే పధకం వేస్తున్నట్లు కొందరు పరిశీలకులు ఇలాంటి సర్వేల వివరాలు వెల్లడి కాక ముందే అంచనావేశారు. పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. పాక్‌ రెచ్చగొట్టే చర్యలను ఎప్పటికప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాలనటం, తగిన బుద్ధి చెప్పాలనటంలో రెండో మాట లేదు.అదే సందర్భంలో వారి మాదిరి మన విశ్వహిందూ పరిషత్‌ తొగాడియా లాంటి వారు రెచ్చగొట్టే ప్రసంగాలు పరిస్థితిని మరింతగా దిగజార్చుతాయి తప్ప మెరుగుపరచవు. ఏదేశంతో అయినా సరిహద్దులలో ప్రశాంతత నెల కొల్పటంలోనే అసలైన రాజనీతి వుంటుంది. తగాదాలు పెట్టుకోవటం ఎంతసేపో పట్టదు. గతంలో కార్గిల్‌ యుద్ధాన్ని చూపి ఓట్లను కొల్లగొట్టిన అనుభవంతో అలాంటి వాటినే పునరావృతం చేయాలనే తప్పుడు ఎత్తుగడలకు ఎవరైనా పాల్పడితే అది దేశ ద్రోహం అవుతుంది తప్ప దేశ భక్తి కాదు. సరిహద్దులలో వుద్రిక్తతలు కొనసాగితే నష్టపోయేది మన సైన్యం, పంజాబ్‌, కాశ్మీరు పౌరులు, అమెరికా నుంచి కొనే ఆయుధాలకు ఖజానా ఖాళీ తప్ప తొగాడియాలు, సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయే వారు కాదు. మన దగ్గర వున్న మాదిరే అణ్వాయుధాలు, క్షిపణులు వారి దగ్గరా పుష్కలంగా వున్నాయి. ఏ పొరుగుదేశాన్నీ ఆయుధాలను చూపి, ప్రయోగించి అదుపు చేయలేరన్నది మన కంటే ఎన్నో రెట్లు పెద్దదైన అమెరికా అనుభవం.

పెద్ద నోట్ల సందర్భంగా వుగ్రవాదులు అంటే కాశ్మీరులో, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటు వాదులు, మిగతా చోట్ల నక్సల్‌ వుగ్రవాదుల చర్యలు తగ్గకపోగా అంతకు ముందు మాదిరిగానే జరుగుతున్నాయి. కాశ్మీరులో నోట్ల రద్దుకు ముందు కాలేజీ విద్యార్ధులే రాళ్లు విసిరితే ఇప్పుడు హైస్కూలు పిల్లలు కూడా అదే పని చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. భద్రతా దళాలు తమ జీపు మీద ఒక యువకుడిని కట్టివేసి అతనిని రక్షణగా చేసుకొని ప్రయాణించిన వీడియోను ప్రపంచం యావత్తూ చూసింది. బహుశా ఎక్కడా ఇలాంటివి జరిగి వుండవు. వుగ్రవాద చర్యలు తగ్గిన దాఖలాలేమీ లేవు. ఎక్కడ అణచివేత పెరుగుతుందో అక్కడి జనం అంతగా వేరు పడిపోతారు, స్వార్దపరశక్తుల చేతులలో పావులుగా మారతారు. ఆఫ్‌ఘనిస్తాన్‌ అనుభవం అదే చెబుతోంది.తాలిబాన్లను అణచే పేరుతో అమెరికా, పాక్‌ దళాలు సామాన్య జనంపై దాడులు చేసిన కారణంగా అక్కడ తాలిబాన్లు తగ్గకపోగా పెరిగారు. విదేశాలకు విస్తరిస్తున్నారు.

నోట్ల రద్దుకు-వుగ్రవాదులకు సంబంధం లేదు, మోడీ బుర్ర నుంచి పుట్టింది తప్ప ఏ దేశంలోనూ అలా చెప్పలేదు. మోడీ చెప్పినట్లు డబ్బు అందటం ఆగిపోతే వారి కార్యకలాపాలన్నీ ఎలా సాగుతున్నాయి, పరిస్థితి మరింతగా ఎందుకు దిగజారింది అనే ప్రశ్నలు అడగలా వద్దా ? మన్‌కీ బాతంటూ తాను చెప్పదలచుకున్నదేదో చెప్పటం తప్ప దమ్మున్న కొద్ది మంది విలేకరులు అయినా అడిగేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రధాని పత్రికా గోష్టులు ఎందుకు పెట్టటం లేదు? నిజానికి వుగ్రవాద కార్యకలపాలు జరగటానికి పాలకులు కల్పించిన అనువైన పరిస్థితులే సగం వూతమిస్తున్నాయి. వాటిని విదేశాలు, విచ్చిన్న శక్తులు వుపయోగించుకుంటున్నాయి. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటును కోరుతున్నవారందరినీ వుగ్రవాద శక్తుల కింద జమకట్టి బలప్రయోగం చేస్తే ఫలితం కంటే జరిగే నష్టమే ఎక్కువ.రాళ్లు వేసే ప్రతివారూ దేశ ద్రోహులు అనుకుంటే అంతకంటే పిచ్చిపని మరొకటి లేదు.చేతులారా వుగ్రవాదాన్ని, వుగ్రవాదాన్ని పెంచి పోషించటం తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా వుగ్రవాద ప్రభావ ప్రాంతాలలో జనాన్ని విశ్వాసంలోకి తీసుకొని వుగ్రవాదుల నిజస్వరూపాన్ని ఎండగట్టాలి. త్రిపురలో వామపక్ష ప్రభుత్వం అక్కడి వేర్పాటు, వుగ్రవాదులను శాంతి భద్రతల సమస్యగా చూడకుండా రాజకీయ వైఖరితో తీసుకున్న చర్యలు వారిని అదుపులోకి తెచ్చాయన్నది తెలిసిందే. అటువంటి చర్యలు మిగతా ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, కాశ్మీరులో లేని కారణంగానే అవాంఛనీయ శక్తులు చెలరేగుతున్నాయి.అమాయక యువత బలౌతోంది.

పైన పేర్కొన్న సర్వే వెలుగులో చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో విజయాలు చెప్పుకొనేందుకేమీ కనిపించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతసేపూ నూతన రాజధాని నిర్మాణం, పోలవరం చుట్టూ, తెలంగాణాలో మిషన్‌ కాకతీయ, భగీరధో అంటూ ప్రాజక్టుల అంచనాలు పెంచటం తప్ప మరొకటి పట్టలేదు. ఇవన్నీ కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల మధ్య పంపకాలకు తెరతీసే మెగా ప్రాజక్టులు తప్ప వేరు కాదు. ఐటి రంగంలో దాదాపు అన్ని కంపెనీలు వయసుపై బడిన వుద్యోగులను వూడబెరికే పనిలో పడినట్లు, రానున్న రోజుల్లో అది మరింతగా పెరగనున్నదని వార్తలు వస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఐటి కంపెనీల సృష్టి జరుగుతోందన్నట్లు , దానికి చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడు లోకేష్‌ నడుం కట్టినట్లు చూపేందుకు పెద్ద ప్రయత్నం జరుగుతోంది. లక్షల కోట్ల మేరకు కుదుర్చుకున్నట్లు చెబుతున్న అవగాహనా ఒప్పందాలేమయ్యాయో, వుద్యోగాలెక్కడున్నాయో తెలియదు. వాటన్నింటి గురించి చెప్పకుండా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో అమెరికా పర్యటనలో తెలుసుకున్న సరికొత్త సాంకేతిక అంశాల గురించి జనానికి చెబుతున్నారు. అవి ఆయన కొత్తగా తెలుసుకున్నారేమో తప్ప జనానికి పాతవే. అవన్నీ వుపాధి రహిత వుత్పిత్తికి తోడ్పడేవే.ఆ కారణంగానే అమెరికాలో ట్రంప్‌ కొత్త వుద్యోగాలు ఇవ్వలేక విదేశీయుల రాకపై ఆంక్షలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడికి మూడవ సంవత్సర కానుకగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు జగన్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీని బిజెపి ఇచ్చింది. నరేంద్రమోడీ ఎవరు ఎపుడు అడిగినా ఇంటర్వ్యూలు ఇస్తూ వున్నట్లయితే దానికి పెద్ద ప్రాధాన్యత వుండేది కాదు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ఒక సంచలనం. అది ఎటువైపు పయనిస్తుందన్నది చూడాల్సి వుంది. పైకి ఏమి చెప్పినా ప్రధాన రాజకీయపార్టీలన్నీ రాజకీయ లాభ నష్టాల లెక్కలలో వున్నాయి. అవి ఒక కొలిక్కి వస్తే రాజకీయాలలో కిక్కు ఎక్కుతుంది.

తెలంగాణా విషయానికి వస్తే గత ప్రభుత్వాలు లేదా అనుకూల పరిస్ధితుల కారణంగా హైదరాబాదులో అభివృద్ధి చెందిన ఐటి, ఐటి అనుబంధ పరిశ్రమలు, సహజంగానే వున్న అభివృద్ధి చెందిన ఫార్మా, ఇతర పరిశ్రమల కారణంగా చంద్రశేఖరరావు సర్కారు గత మూడు సంవత్సరాలుగా నెట్టుకు వచ్చింది. చేసిన వాగ్దానాలు గాలికిపోయాయి. దళితులకు భూమి, రెండు పడకగదుల ఇళ్లు, ప్రాజక్టుల నిర్మాణం, నీళ్లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా వున్నాయి.వుద్యోగాల విషయానికి వస్తే మూడు నోటిఫికేషన్ల విడుదల ఆరునోటిఫికేషన్ల రద్దు మాదిరి వుంది. మిర్చి ధర పతనం గురించి ఆందోళనకు దిగిన రైతుల చేతికి బేడీలు వేసి నిరసన తెలిపిన వారికి ఇదే గతి అన్నట్లుగా అవమానకరంగా పోలీసులు వీధులలో తిప్పిన వుదంతం చంద్రశేఖరరావు సర్కార్‌ రైతులకు చేసిన వాగ్దానలన్నింటినీ తుడిచిపెట్టింది. ఇదేమని అన్యాయం అని అడగటానికి, నోరెత్తటానికి వీలు లేకుండా ఇందిరా పార్కువద్ద వున్న ఏర్పాటు చేసిన ధర్నా చౌక్‌ను ఎత్తివేసి నిరసన గళం విప్పటానికి వీలు లేకుండా చేసేందుకు ఆంక్షలు జారీ చేశారు. ధర్నా చౌకు తమకు ఆటంకంగా వుందంటూ కాలనీ వాసుల పేరుతో ఒక మహిళా సిఐ, కానిస్టేబుళ్లతో సాధారణ దుస్తులు వేయించి పోటీ ధర్నా చేయించటం గమనించాల్సిన అంశం. నగర పోలీసు అధికారులు అంత బుర్రతక్కువ పధకాలు ఎలా వేసినట్లు ? అసలు ధర్నాలకు అనుమతి ఇవ్వని పోలీసులు పోటీ ధర్నాను ఎందుకు అనుమతించినట్లు ? రాజకీయంగా టిఆర్‌ఎస్‌ నాయకత్వం సంతృప్తి చెందే అంశం ప్రతిపక్షాలలో చీలిక. తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు పూనుకున్న బిజెపి పెద్దన్న పాత్ర వహించి అనుచర పార్టీగా తెలుగుదేశం పార్టీని తయారు చేసుకోవచ్చు.ఈ క్రమంలోనే కేంద్రంలో బిజెపికి దగ్గర కావాలని చూస్తున్న తెరాసను దరి చేరనివ్వటం లేదు. పోయిన ప్రాభవాన్ని తెచ్చుకొనేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించవచ్చు. కాన్ని ప్రాంతాలకు పరిమితమైన వామపక్షాలు తమ బలాన్ని కాపాడుకొనేందుకు పూనుకుంటే మైనారిటీ ఓట్లతో తిరిగి అధికారానికి రాగలమన్నది తెరాస ధీమా. అందుకే ఆ పార్టీ చుట్టూ రాజకీయ తూనీగలు చేరుతున్నాయి. రెండు రాష్ట్రాలలోనూ ప్రజాందోళనలను అణచటం ఒకే విధంగా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ఎక్కడ పర్యటనకు పోతే అక్కడ వామపక్షాలు, వైఎస్‌ఆర్‌సిపి నేతలను ముందుగానే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దానికి ఎలాంటి కారణాలు వుండటం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇతర మంత్రులను డమ్మీలుగా చేసి తమ కుమారులను యువరాజుల మాదిరి తిప్పుతున్నారు. ఒక పధకం ప్రకారం వారి ప్రతిష్టను పెంచేందుకు పూనుకున్నారు. కేంద్రంలోని బిజెపికి రాజకీయంగా లొంగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

జిఎస్‌టితో ప్రారంభంలో రేట్లు పెరుగుతాయని ముందే చెబుతున్నారు. మేకిన్‌ ఇండియా, వుపాధి కల్పన, నోట్ల రద్దు బండారం వంటి అన్ని అంశాలు మరింత వేగంగా బహిర్గతం గాక తప్పదు. నరేంద్రమోడీ, తెలుగు రాష్ట్రాల ఇద్దరు చంద్రుల మూడు సంవత్సరాల పాలనను మొత్తంగా చూస్తే భ్రమలు కోల్పోయే రేటు వేగం అందుకునే స్పష్టంగా కనిపిస్తోంది.అందుకే అంతటా మధ్యంతర ఎన్నికల ఎత్తులు, జిత్తులతో పాలకులు, పార్టీల నేతలూ వున్నారు.

గమనిక : ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాసిన వ్యాసమిది.