Tags
Arogya Bharati, ‘customised’ babies, best off- springs, Garbh Vigyan Sanskar, Hitler, Nazi Racist project, RSS, RSS ‘customised’ babies, samarth Bharat, uttam santati
ఎం కోటేశ్వరరావు
‘పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నపుడు ది ఎలవెన్ కాజెస్ ఫర్ది డీ జెనరేషన్ ఆఫ్ ఇండియా గురించి మూడు ఘంటలు ఒక్కబిగిని లెక్చర్ ఇచ్చేప్పటికి ప్రొఫెసర్లు డంగై పోయినారు. మొన్న బంగాళీ వాడు ఈ వూళ్లో లెక్చర్ ఇచ్చినపుడు ఒక్కడికైనా నోరు పెగిలిందీ ! మన వాళ్లు వట్టి వెధవాయ్‌లోయ్ ‘ అన్న గురజాడ గిరీశాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదో, ఏది దేశ భక్తి ఏది కాదో , ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదో చెప్పే వారు , వినకపోతే బలవంతంగా తన్ని మరీ చేయించే వారు నానాటికీ పెరిగిపోవటాన్ని చూస్తున్నాం. బహుశా ప్రశ్నించటానికి ముందుకు రాని వారి గురించే వెధవాయ్‌లోయ్ అని మహాకవి గురజాడ వ్యంగ్యాస్త్రం వదిలాడనిపిస్తోంది.
అన్నీ వేదాల్లోనే వున్నాయ్ ! శాస్త్రకారుడు అలా చెప్పాడు !! అంటే నోరు మూసుకొని చెప్పింది చేస్తున్నాం. మానవ జాతి మనుగడ, నూతన ఆవిష్కరణలకు మూలమైన ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు వేయటాన్ని మనం ఎప్పుడైతే మరచిపోయామో అప్పుడే మన జాతి పురోగతి ఆగిపోయింది. ఎవరైనా అలా ప్రశ్నిస్తే నీకు తెలియదని నోర్మూయిస్తున్నాం. ఈ మధ్య ప్రశ్నించటాన్ని దేశద్రోహంగా, గొర్రెల మాదిరి చెప్పింది వినటం, చేయటమే దేశభక్తిగా భాష్యం చెప్పేవారు తయారయ్యారు. ఈ నయా దేశ భక్తులు చివరకు పరిశుద్ధులైన పిల్లలను పుట్టించేందుకు ఇప్పుడు పడకగదులలో కూడా జోక్యం చేసుకొనేందుకు తయారయ్యారంటే అతిశయోక్తి కాదు.
ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ప్రధాని నరేంద్రమోడీ మేకిన్ ఇండియా పిలుపు ద్వారా ఇక్కడ వస్తువులను వుత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయాలని చెప్పారు. ప్రధాని మాతృ సంస్ధ వుత్తమ సంతతిని పుట్టించి లేదా వుత్పత్తి చేసి పటిష్ట (స్మార్టు ) భారత దేశాన్ని తయారు చేస్తామని చెబుతోంది. ఎలా ? ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు ఆర్‌ఎస్‌ఎస్ సంస్ధల ప్రతినిధులు ఇచ్చిన ఇంటర్వ్యూ లేదా సమాచారాన్ని బట్టి ఎలా చేస్తారో తరువాత చూద్దాం. అంతకంటే ముందు వారి ఆరాధ్యదైవం హిట్లర్ ఎలా ప్రయత్నించారో చూడకపోతే దానికి సమగ్రత రాదు. కావాలంటే ఏం చేశాడో ఈ లింక్‌లో చదవండి.http://historacle.org/hitlers_supermen.html తాను నికార్సయిన ఆర్య జాతికి చెందిన వాడినని చెప్పుకున్న హిట్లర్ 5 అడుగుల ఎనిమిది అంగుళాల పొట్టి వాడు. తన కంటే పొడవైన, బలిష్ఠులైన శుద్దమైన ఆర్యజాతిని శుద్ధి చేసే, కొత్తగా పుట్టించే కార్యక్రమంలో భాగంగానే దాదాపు అరవైలక్షల మంది యూదులను, భారతీయ మూలాలున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పే ఐదు లక్షల మంది ‘రోమా’ సంచార తెగవారిని వూచకోత కోయించాడు. నాశిరకం పిల్లలను కనకుండా నాలుగు లక్షల మంది జర్మన్లకు ఆపరేషన్లు చేయించాడు. 1932లో వుత్తమ సంతతి కార్య క్రమాన్ని ప్రారంభించాడు. దానిలో భాగంగా పిల్లల వుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశాడు. వాటిలో పరిపూర్ణమైన మహిళలను, పురుషులను నాజీ పార్టీ ఎస్‌ఎస్ సైనికుల ద్వారా చేర్చారు. వారు 1750 నుంచి జాతి పరంగా ఎలాంటి కల్తీకి గురై వుండకూడదని షరతు పెట్టారు. హిట్లర్ చచ్చేంత వరకు ఆ కార్యక్రమం కొనసాగి 42వేల మంది పిల్లలను పుట్టించారు. అంతే కాదు, హిట్లర్ ఆక్రమణకు గురైన దేశాలలో ఆర్య సంతతికి చెందిన వారిగా భావించిన మహిళలను, పిల్లలను జర్మన్ సైన్యం కిడ్నాప్ చేసింది. ఒక్క పోలాండ్‌లోనే రెండు లక్షల మంది అలాంటి వారున్నారంటే ఎంత పెద్ద స్ధాయిలో జరిగిందో చూడవచ్చు. అది జర్మనీకే పరిమితం కాలేదు, 1974లో అక్కడి సుప్రీం కోర్టు రద్దు చేసే వరకు అమెరికాలో కూడా అరవై వేల మంది మహిళలకు అలాంటి ఆపరేషన్లే చేశారని, అమెరికా వలస విధానంలో ఐరిష్, తూర్పు ఐరోపా యూదులు, ఆసియన్లు, ఆఫ్రికన్లు నీచజాతుల వారని వర్ణించినట్లు ప్రముఖ విశ్లేషకుడు ప్రబీర్ పురకాయస్ధ తన విశ్లేషణలో పేర్కొన్నారు.http://newsclick.in/rss-marketing-illegal-mumbo-jumbo-science-making-superbabies
అలాంటి కార్యక్రమ ప్రారంభం గుజరాతులో జరిగింది.ఆరోగ్య భారతి పేరుతో గత పది సంవత్సరాలుగా అక్కడ ప్రయోగాలు జరుపుతూ 2015 నుంచి దేశమంతటికీ విస్తరించాలని నిర&ణయించారు. ఇందుకు అవసరమైన నిధులను విద్యాభారతి అనే సంస&ధ ద్వారా సమకూర్చుతున్నారు. గుజరాతు, మధ్యప్రదేశ్‌లో పది కేంద్రాలు ఏర్పాటు చేశారు, వుత్తర ప్రదేశ్, బెంగాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వీరు ఇలాంటి ‘సంస్కారం ద్వారా 450 మంది వున్నత లక్షణాలు గల పిల్లలను పుట్టించారు. 2020 నాటికి పతి రాష్ట్రంలో ఇలాంటి వారిని పుట్టించేందుకు ‘గర్భ విజా&క్షన అనుసంధాన కేంద్రాలను’ ఏర్పాటు చేయనున్నారు. వీరంతా ఎవరు ? ఇంకెవరు ఆర్‌ఎస్‌ఎస్ వారే. వారు నడిపే అనేక సంస్ధలలో ఒకటి ఆరోగ్యభారతి. దానికీ వారికి వున్న సంబంధం గురించి దిగువ లింక్‌లో వున్న సమాచారాన్ని ఆసక్తి వున్న వారు చదువుకోవచ్చు.https://www.altnews.in/link-arogya-bharati-promises-genius-babies-rashtriya-swayamsevak-sangh-rss-opindia-couldnt-find/ సైన్సు పేరుతో చేస్తున్న ఈ కార్యకలాపాలను ప్రశ్నించకపోతే ఏం జరుగుతుంది? ఈ శక్తులు ఆరాధించే హిట్లర్ జర్మనీలో ఏం చేయించాడో తెలుసుకున్న తరువాత అయినా ప్రశ్నిస్తారా ? గిరీశం చెప్పిన దాన్ని నిజం చేస్తారా ?
ప్రస్తుతం ఆధునిక ఆవిష్కరణలుగా పరిగణిస్తున్న టెస్టు ట్యూబ్ బేబీల మొదలు పెట్రోలుతో పని లేకుండా ఎటు కావాలంటే అటు తిరిగే, ఎంత మంది ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే ఖండాంతర విమానాలు, ఆయుధాల సమాచారం అంతా వేదాల్లోనే అన్నీ వున్నాయష అని చెప్పటమే తప్ప ఎందుకు వెలికి తీయలేదు అన్న హేతువాదుల ప్రశ్నకు సమాధానమా అన్నట్లు వాటి బదులు ‘నమ్మకం తప్ప’ ఆధారాలు చూపనవసరం లేని వుత్తమ పిల్లలను పుట్టించే ప్రయత్నాలు వున్నాయి. అయితే ఇవి నాజీల బాటలో వున్నాయి. దానికి భారతీయత రంగు అద్దే క్రమంలో ఆయుర్వేదం, పురాతన విజా&క్షనం ఆధారం అని చెబుతున్నారు. బిజెపి నేత తరుణ్ విజయ్ నల్లగా వుండే దక్షిణ భారతీయులతో మేము సామరస్యంగా కలసి వుండటం లేదా అంటూ ఆఫ్రికన్లపై న్యూఢిల్లీ సమీపంలో జరిగిన దాడి సందర్భంగా తన అంతరంగాన్ని వెల్లడించారు.బహుశా అలా ఎక్కువ కాలం కలసి జీవించలేరు కనుకనే ముందుగా పొడవైన, తెల్ల పిల్లల కోసం ఆర్‌ఎస్‌ఎస్ ప్రయోగాలు చేపట్టింది అనుకోవాలి.
మే నెల ఆరు, ఏడు తేదీలలో ఆరోగ్యభారతి కొల్‌కతాలో గర్భ సంస్కార కార్యక్రమాన్ని తలపెట్టింది. దాన్ని అభ్యంతర పెట్టిన ఆ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ వినతిని స్వీకరించిన హైకోర్టు ఆ కార్యక్రమాన్ని వుపన్యాసాలకే పరిమితం చేసి వాటిని వీడియో తీసి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. మిగతా విషయాలను తరువాత విచారిస్తామని తెలిపింది. ఆరోగ్య భారతి సంస్ధ కార్యకలాపాలు, ప్రచారం చట్టవిరుద్దమైనవి. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కూడా గర్భసంస్కారం చేయవచ్చని చెబుతూ తాము చెబుతున్న దానికి శాస్త్రీయ ముసుగువేసుకొనే ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు. ‘ కొడుకు పుట్టాల ‘ అని కోరుకొనే వారు తామర తంపరగా వున్న మన దేశంలో ఆ వ్యామోహం లేదా బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించే యత్నం జరుగుతోంది. ఆరోగ్యభారతి ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ కూడా అలాంటి కోరికలు వున్నవారిని ప్రోత్సహించటం తప్ప ఇది మరొకటి కాదు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, ఒకసారి ప్రయత్నం చేసి చూస్తే పోలా పోయేదేముంది అనే తత్వం మన నరనరాన జీర్ణించి వుంది. అందుకే రోడ్డు మీద పోయే వారు కనిపించిన ప్రతి రాయికీ ఒక నమస్కారం పడవేసి పోతుంటారు. మేము పక్కా లోకల్ అని చెప్పుకొనే వారు ప్రతిదానికీ ఏదో ఒక పశ్చిమ దేశాన్నో, వ్యక్తులనో వుదాహరిస్తుంటారు. దానికీ ఒక లాజిక్కు వుంది. మన వేద, శాస్త్రవిజా&క్షనాన్ని పశ్చిమ దేశాల వారు ముఖ్యంగా జర్మన్లు గ్రహించారని చెబుతుంటారు. గర్భ సంస్కారానికి కూడా అదే చెబుతున్నారు.
ఆరోగ్య భారతి జాతీయ కన్వీనర్ డాక్టర్ హితేష్ జానీ చెప్పినదాని ప్రకారం తలిదండ్రులకు ఐక్యూ (తెలివితేటలు) తక్కువగా వున్నా, చదువు సంధ్యలు లేకపోయినా గర్భ శుద్ధి చేయించుకుంటే పొట్టిగా, నల్లగా వున్న తలిదండ్రులకు కూడా తెల్లగా, పొడవుగా వుండే పిల్లలు పుడతారు. ఈ ప్రక్రియను హిందూ శాస్త్రాలు చెప్పాయి. రెండు దశలలో తలిదండ్రులు కాదలచుకున్న వారిని శుద్ధీకరణ చేస్తారు. వుత్తమ సంతతిని పుట్టించే ఈ పధకానికి జాతీయ కన్వీనర్‌గా వున్న డాక్టర్ కరీష్మా నర్వానీ చెప్పినదాని ప్రకారం ఇప్పటికే అలాంటి పిల్లలను పుట్టించేందుకు విశాఖ, విజయవాడలలో కూడా కార్యక్రమాలను నిర్వహించారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీలో ఈ ఆయుర్వేద పద్దతి ద్వారా వుత్తమ సంతతిని పుట్టిస్తున్నారు. హోమియో పతి వైద్యాన్ని తొలుత ప్రతిపాదించిందీ లేదా దాని గురించి రాసింది జర్మన్ భాషలో, రోమ్ సామ్రాజ్యంలో, ప్రస్తుతం జర్మనీలో భాగంగా వున్న శాగ్జనీ ప్రాంతంలోనే హోమియో పతికి మారుపేరైన హనిమన్ పుట్టాడు, వైద్యం చేశాడు. అయినప్పటికీ జర్మన్లు మన ఆయుర్వేదంతో వుత్తేజం పొందారని ప్రచారకులు చెప్పిందాన్ని మనం నమ్మాలి. సహజ పద్దతులలో జోక్యం చేసుకోవటంగా గర్భశుద్ధిని పరిగణించరాదని, ఆయుర్వేద పద్దతి ప్రకారం దాన్ని చేస్తున్నామని, మనకు కావలసిన బలిష్టులైన, తెలివి తేటలు గల పిల్లలను ఎలా పుట్టించవచ్చో ఆయుర్వేదంలో వుందంటూ, ఆరో నెలలో ఐక్యూ (తెలివితేటలు) అభివృద్ధి అవుతుందని, అయితే అందుకు తల్లులు నిర్ధేశిత పద్దతి ప్రకారం చెప్పిన దాని ప్రకారం తినటం, వినటం, చదవటం వంటివి చేయాలని కరిష్మా చెప్పారు. ఇలా చేస్తే జన్యుపరమైన లోపాలను మరమ్మతు చేసి బిడ్డలకు రాకుండా చేయవచ్చట. దానికి గాను మూడు నెలల్లో శుద్ధి ప్రక్రియను రెండు దశలలో చేయాలట. ఒకటి నాడీ శుద్ధి, రెండవది దేహశుద్ధి. వాటి ప్రకారం పురుషుడి వీర్యం, స్త్రీ అండాన్ని ముందుగా శుద్ధి చేసి జన్యుపరమైన లోపాలేమైనా వుంటే సరి చేసి బిడ్డకు రాకుండా చేస్తారు. తరువాత శాస్త్రాలలో పేర్కొన్నదాని ప్రకారం జాతకాలు, గ్రహాల స్ధితి గతులను బట్టి భార్యా భర్తలు ఏ సమయంలో కలవాలో వుత్తమ సంతతి ప్రాజెక్టు వైద్యులు నిర్ణయిస్తారట. దాని ప్రకారం వారు కలవాలి. గర్భధారణ నిర్ధారణ అయిన తరువాత ఏ ఆహారం తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో నిర్ధేశిస్తారు. ఆ ప్రకారం చేస్తే ఆ మహిళ వుత్తమ సంతితికి జన్మనిస్తుంది. అశోక్ కుమార్ వర్షనే అనే ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినదాని ప్రకారం గర్భ సమయంలో మహిళ శ్లోకాలు, మంత్రాలను జపిస్తే అది బిడ్డ మానసిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆమె అలాంటి జీవితాన్ని ఆ సమయంలో గడిపిత పిల్లలు అదనంగా మూడు వందల గ్రాములు పెరుగుతారు, పురుటి నొప్పులు రాకుండా ప్రసతవం అవుతుందట. ఇంతకూ ఈ ప్రక్రియ ఎలా వెలుగులోకి వచ్చిందీ ?. గర్భ సంస్కారాన్ని నలభై సంవత్సరాల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ సిద్ధాంత వేత్త ఒకరు జర్మనీ మాతృమూర్తిగా పరిగణించబడే ఒక మహిళను కలసినపుడు ఆమె వివరించిందట.మీరు భారత్ నుంచి వచ్చారు కదా అభిమన్యుడి గురించి వినలేదా అని అడిగి తమ దేశంలోని నూతన తరం గర్భ సంస్కారం ద్వారా పుట్టిన కారణంగానే తమ దేశం ఇంతగా అభివృద్ధి చెందిందని చెప్పిందట. అయితే ఆమె ఎవరో లేదా ఆమెను కలిసిన ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడి పేరు అశోక్ కుమార్ చెప్పలేదు. గర్భంలో వుండగానే అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించటం గురించి వినటానికి కారణం గర్భ సంస్కారమే అని అందువలన దానిని పాటిస్తే పుట్టక ముందే పిల్లలకు ముందే అన్నీ నేర్పవచ్చన్నది అంతరార్ధం.ఈ విషయం సదరు ప్రచారకుడికి జర్మనీ వెళితే కాని ‘జ్ఞానోదయం’ కాలేదన్నమాట!
బుర్ర శుద్ధి చేసుకుంటే ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. హిందువుగా పుట్టు హిందువుగా జీవించు అన్న నినాదం ఇటుకల గోడలతో పాటు ఫేస్‌బుక్ గోడల నిండా సంఘపరివార్ సంస్ధలు చెడరాశాయి. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గర్భ శుద్ధి కార్యక్రమం ఒక్క హిందువులకేనా, ఇతర మతాల వారికి కూడా విస్తరిస్తారా ? శ్లోకాలు, మంత్రాలు పలకటం రాని వారి సంగతి ఏమిటి ? హిందువులలోనే తమ కులం, గోత్రం కాని వారితో వివాహాలు చేసుకుంటే అమ్మాయిలు, అబ్బాయిలను పట్టుకొని హతమారుస్తున్న పరిస్ధితులు వున్నపుడు తమ కంటే తక్కువ అని భావించే కులాల వారికి కూడా వుత్తమ సంతతిని పుట్టించటాన్ని అగ్రకులాలనుకొనే వారు సహిస్తారా ? ఆర్‌ఎస్‌ఎస్ దాని రాజకీయ సంస్ధ అయిన పూర్వపు జన సంఘం, తరువాత జనతా పార్టీలో విలీనమైన ఆ భాగం, తరువాత దాని నుంచి బయటకు వచ్చి బిజెపిగా ఏర్పడిన వారు కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి చేయాలని చెబుతున్నారు. తామే అసలు సిసలు అయిన దేశ భక్తులమని నొక్కివక్కాణిస్తున్నారు. తమది నిర్మాణాత్మక కార్యక్రమం అని కూడా చెప్పుకుంటారు. అలాంటి వారికి వుత్తమ సంతతి ద్వారా జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అభివృద్ధి చెందిన విషయం 40 ఏండ్ల నాడే తెలిసినపుడు వెంటనే ఎందుకు ప్రారంభించలేదు? ప్రారంభించి వుంటే ఇప్పటికి నలభై సంవత్సరాల వయస్సున్న వారందరిలో కనీసం సగం మంది అయినా వుత్తమ సంతతిగా తయారై దేశానికి ఎంతో మేలు జరిగి వుండేది. ప్రపంచంలో అగ్రస్ధానంలో వుండే అవకాశాలను ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు దెబ్బతీశారు.తమ స్వంత పాలకుడు ప్రధాని అయిన తరువాతనే తమ వద్ద వున్న పురాతన పరిజ్ఞానాన్ని బయటకు తీయాలనే సంకుచిత ధోరణులకు గురైనట్లు కనిపిస్తోంది. జపాన్ కూడా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఎలక్ట్రానిక్స్, ఆటో, నిర్మాణం వంటి అనేక రంగాలలో అభివృద్ధి చెందింది. మరి వారు ఏ ప్రక్రియతో వుత్తమ సంతతిని పుట్టించారు. ఐటిని అభివృద్ధి చేసిన అమెరికన్లు వుత్తమ సంతతిని ఎలా పొందారు. ఆర్ధికంగా రెండో స్ధానంలో వున్న జపాన్‌ను వెనక్కు నెట్టటానికి చైనీయులు ప్రత్యేకంగా వుత్తమ సంతతిని పుట్టించినట్లు మనం ఎక్కడా చదవలేదు.
చరిత్రలో ఏ దేశం కూడా పటిష్టంగా వుండటానికి ఇలాంటి వుత్తమ సంతతిని పుట్టించే కార్యక్రమం చేపట్ట లేదు. అలాంటపుడు ఇదేమి వెర్రి ! గర్భ సంస్కారం ద్వారా వున్నత సంతతిని పుట్టిస్తామని చెప్పటమే ఆశాస్త్రీయం. మన పురాతన గ్రంధాలలో వున్నదానినే తాము బయటకు తీస్తున్నామని చెప్పే నకిలీ శాస్త్రవేత్తల బండారాన్ని శాస్త్రీయ జ్ఞానంపై ఆధారపడిన వారు బయటపెట్టాల్సిన అవసరం వుందో లేక గిరీశం తరగతిలో చేరిపోవాలో తేల్చుకోవాలి. ఆమెగానో అతడిగానో వుండాలి తప్ప దాన్నీ నమ్ముతాము, దీన్నీ నమ్ముతాము అంటూ అటూ ఇటూ గాకుండా వుంటే ప్రయోజనం లేదు.