ఎం కోటేశ్వరరావు
అమెరికాతో సహా అనేక దేశాలలో మరోసారి ఇప్పుడు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇందుకు గాను గతంలో చెప్పిన వాటికి భిన్నమైన కారణాలను చూపుతున్నప్పటికీ పూసల్లో దారంలా వున్న ఏకైక అంశం కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకోవటమే. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రష్యాలో తొలి శ్రామిక రాజ్య ఆవిర్భావం, రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ హిట్లర్‌ను కమ్యూనిస్టులు మట్టి కరిపించటం, వలసరాజ్యాలకు జాతీయోద్యమాలు మంగళం పాడటం, చైనాతో సహా సోషలిస్టు శిబిర విస్తరణ వంటి పరిణామాలు అమెరికా నాయకత్వాన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి నాంది పలికాయి. స్వయంకృత వైఫల్యాలు కొన్ని వున్నప్పటికీ పాతికేండ్ల క్రితం తొలి సోషలిస్టు రాజ్యం, దాని అండతో ఏర్పడిన తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాలను సామ్రాజ్యవాదులు పతనం కావించారు. సోషలిజం, కమ్యూనిజం వెనుక పట్టు పట్టిందనే వాతావరణం ఎల్లెడలా ఏర్పడింది. తాము విజయం సాధించామని కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రకటించుకున్నారు. అయినా సరే ప్రస్తుతం ప్రపంచంలో మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. ఎందుకు ?
కొద్ది రోజుల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రజాప్రతినిధుల సభ కమ్యూనిస్టులు ప్రభుత్వ వుద్యోగాలలో చేరటంపై వున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అది ఎగువ సభ ఆమోదం పొందితే అది అమలులోకి వస్తుందని వచ్చిన వార్తలపై రాసిన ఒక విశ్లేషణను మీరు చదివారు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభ్యుడిపై వచ్చిన తీవ్ర వత్తిడి కారణంగా ఎగువ సభ ఆమోదానికి పెట్టకుండానే దానిని వుపసంహరించుకున్నాడు.1950 దశకంలో ఒక అసెంబ్లీలో అలాంటి నిబంధనకు వ్యతిరేకంగా మాట్లాడటమే అనూహ్యం, అలాంటిది 2017లో ఒక ప్రముఖ రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీ సభ్యుడైన రోబ్ బంటా ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టటం తీవ్ర చర్చ, వాదోపవాదాల మధ్య అది ఆమోదం పొందటమే ఆశ్చర్యం. విజయం కమ్యూనిస్టు శక్తులకు వుత్తేజం కలిగించినప్పటికీ దాంతో అంతా అయిపోయిందని, కమ్యూనిస్టు వ్యతిరేకత అంతరించిందని ఎవరూ భావించలేదు, కనుకనే బిల్లు వుపసంహరణ నిరుత్సాహకారణం కాలేదు.
తీర్మానం పెట్టినందుకు నన్ను కమ్యూనిస్టు అన్నారు, చైనా వెళ్లమన్నారు, హత్య చేస్తామని బెదిరించారు. ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేదని భావించి నేను ఇప్పటికీ భావిస్తున్నప్పటికీ ఈ సమస్య లేవనెత్తిన మనోభావాల కారణంగా ఆ ప్రతిపాదనతో ముందుకు పోరాదని నిర్ణయించుకున్నానని రోబ్ చెప్పాడు. నిజానికి అవి ప్రధాన కారణాలుగా కనిపించటం లేదు. గతేడాది ఎన్నికలలో తాను సోషలిస్టును అని బహిరంగంగా చెప్పుకున్న బెర్నీశాండర్స్‌కు పెద్ద ఎత్తున యువత మద్దతు తెలపటం, అమెరికా ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందని, కొంత మంది రష్యాతో కుమ్మక్కయ్యారంటూ రోజూ వస్తున్న వార్తా కథనాలు, అక్కడ కూడా పెట్టుబడిదారీవిధానమే వున్నప్పటికీ ప్రచ్చన్న యుద్ధకాలం నాటి మనోభావాలు ఇంకా అమెరికన్లలో బలంగానే వున్న కారణంగా రోబ్‌పై వత్తిడి అధికమైందని చెప్పవచ్చు.
నిజానికి కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేయాలన్న ప్రతిపాదన ఇదే మొదటిది కాదు. అన్ని రాష్ట్రాలూ ఏదో ఒక రూపంలో కమ్యూనిస్టు వ్యతిరేక చట్టాలను చేశాయి. అయితే సుప్రీం కోర్టు అలాంటివి చెల్లవు అని చెప్పటంతో అమలు చేయకుండా అలాగే వుంచేశారు. అరిజోనా రాష్ట్రంలో వున్న చట్టాన్ని 2003లో కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడను కాను అని ప్రమాణం చేయటానికి బదులు ఏ వుగ్రవాద సంస్ధలోనూ సభ్యుడను కాను అని సవరించారు. కొన్ని చోట్ల విధేయత ప్రమాణాన్ని స్వచ్చందం చేశారు. అదే కాలిఫోర్నియా రాష్ట్రంలో 2008లో అలాంటి తీర్మానం లేదా బిల్లు ఆమోదం పొందిన తరువాత ఆ రాష్ట్ర గవర్నర్‌గా వున్న సినీ నటుడు ష్కావర్జ్‌నెగ్గర్ దానిని వీటో చేశాడు. ‘చట్టాన్ని మార్చాల్సినంత తప్పనిసరి కారణం నాకు కనిపించటం లేదు, అమెరికా లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసే కమ్యూనిస్టు కార్యకలాపాలకు ప్రభుత్వ వనరులను వినియోగించరాదన్న చట్టాన్ని కొనసాగించాల్సి వుంది ‘ అని కారణం చెప్పాడు. 2012 నుంచి ఇప్పటికి మూడు సార్లు జో ఇట్జ్‌గిబ్బన్ అనే డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి అలాంటి చట్టాన్ని సవరించాలని వాషింగ్టన్‌లో ప్రయత్నించి రిపబ్లికన్ల వ్యతిరేకత కారణంగా విఫలమయ్యాడు. అయితే తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వుంటానని, రిపబ్లికన్లు తమ వైఖరిని మార్చుకోవాలని, వారి రష్యన్ స్నేహితులతో సంప్రదింపులు జరుపుకోవచ్చని జో చెప్పాడు.
అమెరికా ఇలా జరుగుతోంటే దాని కుట్రలో భాగంగా కమ్యూనిస్టులను వూచకోత కోసిన ఇండోనేషియాలో అక్కడి పాలకవర్గం తన నీడను తానే నమ్మలేనంతగా అదిగో కమ్యూనిస్టుల పునరుజ్జీవనం, ఇదిగో కమ్యూనిస్టు చిహ్నం అంటూ వులికి పడుతోంది. ఇండోనేషియాలో కమ్యూనిజ పునరుద్ధరణ గురించి భయపడాల్సిందేమీ లేదంటూనే ఈ సమస్యను అధిగమించాల్సి వుందని ఇండోనేషియా మంత్రి లుహుట్ పాండ్ జైతాన్ తన గోల్కార్ పార్టీ జాతీయ నాయకుల సమావేశంలో చెప్పారు.’ సిద్దాంతాన్ని మనం పాతి పెట్టలేము, అది వునికిలోనే వుంటుంది, అయితే దేశ సిద్ధాంతమైన పంచశీలను మార్చేందుకు ప్రయత్నించే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించే వారిని మనం ఎదుర్కోవాలి, ఈ సమస్యను పరిష్కరించేందుకు గోల్కార్ పార్టీ సభ్యులందరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి, కమ్యూనిజం పెరగటానికి వీలు లేకుండా చూడాలి అని లుహుట్ చెప్పాడు. సుత్తీ, కొడవలి చిహ్నాలున్న టీ షర్టులు అమ్మేవారిని, వేసుకొనే వారిని కమ్యూనిస్టులుగా అనుమానించి అరెస్టులు చేస్తోంది. అక్కడి పాలకవర్గం ఎంతగా వులిక్కి పడుతోందంటే ఇండోనేషియా రిజర్వుబ్యాంకు నకిలీ నోట్లను గుర్తించేందుకు వీలుగా కాపీ చేయటానికి వీల్లేకుండా కొత్తగా ముద్రించిన నోట్లలో అంతర్గతంగా ఏర్పాటు చేసిన లోగో కమ్యూనిస్టు చిహ్నాలను పోలి వుందంటూ అక్కడి ముస్లింమతోన్మాద శక్తులు నానా యాగీ చేశాయి. దాంతో అదేమీ లేదని బ్యాంకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఆ రాణీ ప్రేమ పురాణం, ఈ ముట్టడికైన ఖర్చులు ఇవి కాదోయ్ చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ . తర తరాలుగా దోపిడీదార్లపై జరిగిన ప్రజా ప్రతిఘటనలో ధీరోదాత్తుల కథలు వుత్తేజాన్ని కలిగిస్తాయి. చారిత్రాత్మక తెలంగాణా ప్రజాప్రతిఘటనలో విసునూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి గడీ, నైజాం నవాబు రాజ్యం ఎలా ధ్వంసమైందీ ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడిచే విధంగా జనం చెప్పుకుంటారు. కానీ ఆ దేశముఖ్, నిజాం వారసులు ఇప్పుడు వచ్చి కమ్యూనిస్టుల చేతిలో తమ కుటుంబాలు బాధపడిన చరిత్రను నమోదు చేయాలని, తమ ప్రతిఘటనను వీరోచితంగా చిత్రించాలని కోరితే ఎలా వుంటుంది? తూర్పు ఐరోపాలో అదే జరుగుతోంది. సోషలిస్టు వ్యవస్దలను కూల్చివేసిన తూర్పు ఐరోపా దేశాలలో జనాన్ని సంతృప్తి పరచటంలో విఫలమైన పాలకవర్గం రెచ్చగొట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకతను సజీవంగా వుంచేందుకు నానా గడ్డీ కరుస్తోంది. సోషలిస్టు వ్యవస్ధ ఏర్పాటు సమయంలో తిరుగుబాటు చేసిన భూస్వామిక, పెట్టుబడిదారీ, వాణిజ్యవేత్తల కుటుంబాలకు చెందిన వారి కథలతో దోపిడీ వర్గ చరిత్రను సమాజంపై రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక చోట్ల కమ్యూనిస్టు వ్యతిరేక చిహ్నాల ఏర్పాటు, అణచివేతకు గురైన వారి పేరుతో స్మారక కేంద్రాల నిర్మాణాలు చేస్తున్నారు.
ఇలాంటి చరిత్రకు గతంలో స్ధానం ఇవ్వలేదు, భవిష్యత్‌లో వుండదన్నది వేరే చెప్పనవసరం లేదు. ఎక్కడ సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాలం వ్యాపించినా అమెరికాలో అందుకు స్ధానం లేదన్నది అనేక మంది భావన. ఎవరి నమ్మకం వారిది, వారి విశ్వాసాన్ని అంగీకరించకపోయినా భావ స్వాతంత్య్రంలో భాగంగా గౌరవిద్దాం. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను సంఘర్షించనివ్వండి. అంతా అయిపోయింది, ఇక భవిష్యత్ లేదు అని మెజారిటీ అనుకుంటున్న సమయంలో కమ్యూనిజం గురించి భయపడేవారు వున్నారనే విషయం కూడా ఆ మెజారిటీకి తెలియటం అవసరం. అమెరికాలోని పాలకవర్గ డెమోక్రటిక్ పార్టీలో బెర్నీ శాండర్స్ అనే ఒక ఎంపీ తాను సోషలిస్టును అని బహిరంగంగా ప్రకటించుకొని ఆ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధిగా ఎన్నుకోవాలని పోటీకి దిగి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
అమెరికాలోని క్రిస్టియన్ లీగల్ సొసైటీ అనే ఒక సంస్ధ సిఇఓ డేవిడ్ నమో అనే పెద్దమనిషి నేషనల్ రివ్యూ అనే పత్రిక మార్చినెల సంచికలో ఒక వ్యాసం రాసి అమెరికా భవిష్యత్‌కు సోషలిస్టు భావజాలం ముప్పు తెస్తున్నది గమనించండి అంటూ మొర పెట్టుకున్నాడు. ఓ సర్వే ప్రకారం పది మందిలో నలుగురు పెట్టుబడిదారీ విధానానికి బదులు సోషలిజానికి ప్రాధాన్యత ఇస్త్నుట్లు తేలిందని హెచ్చరించాడు. బెర్నీ శాండర్సు పలుకుబడి వలన ఈ వుద్యమం ఆదరణ పొందిందని భావించటం గాక అసలు వుద్యమానికి అదొక సూచికగా పరిగణించాలని పేర్కొన్నాడు. అంటే శాండర్స్ గాక పోతే మరొకరిని ఆ వుద్యమం ముందుకు తెచ్చేది. సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులు భయపడుతున్నది అందుకే.అనేక అనుభవాల తరువాత దోపిడీ వర్గంతో పాటు దానిని వ్యతిరేకించే వారు కూడా తమ ఎత్తుగడలు, భాషకు నగిషీ పెడుతున్నారు. దోపిడీ వర్గం తన అధికారాన్ని కాపాడుకొనేందుకు సాయుధ శక్తులను నిరంతరం పెంచిపోషిస్తుంది. ఏ దేశ చరిత్ర చూసినా పోలీసు, పారామిలిటరీ, మిలిటరీ దోపిడీ వర్గాల ప్రతినిధిగా పని చేయటం తప్ప వారికి వ్యతిరేకంగా ఒక్క వుదంతంలో కూడా వ్యతిరేకంగా వ్యవహరించిన వుదంతం మనకు కనపడదు. దోపిడీ, దోపిడీ శక్తులను ఎదుర్కోవటానికి కార్మికవర్గం శాంతియుత మార్గాన్నే ఎంచుకుంటుంది, అనివార్యమైతేనే ఆయుధాల ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది.ఈ విషయాన్ని కమ్యూనిస్టులు ఎన్నడూ దాచుకోలేదు. తుపాకీ గొట్టం ద్వారానే ఆధికారం తప్ప ఇతర పద్దతులలో రాదంటూ కొందరు హింసాత్మక పద్దతులతో సోషలిజాన్ని సాధిస్తామని పిలుపులు ఇవ్వటం, శ్రామికవర్గ నియంతృత్వాన్ని అమలు చేస్తామనే పదజాలాన్ని వినియోగించటం, అన్ని దేశాలలో దోపిడీ శక్తుల నిర్మూలనకు ఆయుధాలు పట్టిన వుదంతాలను చూపి కమ్యూనిస్టు వ్యతిరేకులు చేయని తప్పుడు ప్రచారం లేదు.
నైజాం నవాబు, అతగాడికి వెన్నుదన్నుగా వున్న దేశముఖులు, జాగీర్దార్లు కోరిన వెంటనే వెట్టి చాకిరీ రద్దు, భూములను దున్నేవారికే అప్పగించి వుంటే తెలంగాణా రైతాంగం ఆయుధాలను పట్టాల్సిన అవసరం వచ్చేదే కాదు. నిర్బంధం పెరిగిన కొద్దీ వడిసెలలతో ప్రారంభించిన దళాలు తుపాకులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కోరిన వెంటనే బ్రిటీషు వారు స్వాతంత్య్రం ఇచ్చి వుంటే భగత్ సింగుకు బాంబులతో, సుభాష్ చంద్రబోస్‌కు విముక్తి దళాల నిర్మాణం అవసరమయ్యేది కాదు. వినతి పత్రాలతో ప్రారంభమైన స్వాతంత్య్ర వుద్యమం అల్లూరి సీతారామరాజు కాలం నాటికి విల్లంబులు, తుపాకులు పట్టాల్సి వచ్చింది. స్వపరిపాలన, సంపూర్ణ స్వాతంత్య్రం వంటి నినాదాలను క్రమంగా ఇచ్చిన కాంగ్రెస్ ప్రారంభంలో విద్యావంతులైన భారతీయులకు ప్రభుత్వంలో మరింత భాగస్వామ్యం కల్పించాలని మాత్రమే కోరింది.
ప్రస్తుతం అమెరికాలో సోషలిస్టులుగా సగర్వంగా చెప్పుకుంటున్న బెర్నీ శాండర్స్ వంటి వారు ప్రజాస్వామిక సోషలిజం గురించి మాట్లాడుతున్నారు తప్ప అమెరికా దోపిడీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామనో, సాయుధపోరాటం చేస్తామనో చెప్పటం లేదు. ఆర్ధిక సంక్షోభం, అసమానతలు, దారిద్య్రం, సంక్షేమ పధకాలకు కోత వంటి వాటిని వ్యతిరేకిస్తున్నారు తప్ప మరొకటి కాదు. వారు కూడా తుపాకి గొట్టం ద్వారానే అధికారం వంటి నినాదాలు ఇచ్చి వుంటే అణచివేత సులభమై వుండేది. తాము కోరుతున్న ప్రజాస్వామిక సోషలిజాన్ని, సంక్షేమ చర్యలను అమలు జరిపేందుకు నిరాకరించినపుడు ఏం చేయాలో అమెరికన్లే నిర్ణయించుకుంటారు. కమ్యూనిస్టు వ్యతిరేకులు భయపడుతున్న అంశమిదే.అందుకే మొగ్గలోనే సోషలిజం కోరుకొనే వారిని తుంచి వేయాలని కోరటంలో అంతరార్ధమిదే. అమెరికాలో కమ్యూ నిస్టు పార్టీ వున్నప్పటికీ ప్రజాస్వామిక సోషలిస్టు పార్టీ(డిఎస్‌ఏ) కూడా ఎన్నో దశాబ్దాల నుంచి నామ మాత్రంగా వుంది. అలాంటి పార్టీలో గతేడాది ఎన్నికల నాటికి 8,500 సభ్యత్వం వుంటే మే నాటికి 21వేలకు చేరిందని అఫింగ్టన్ పోస్టు పత్రిక తాజాగా రాసింది. దశాబ్దాలుగా సోషలిజం అనే పదం గిట్టనివారు నేడు దాన్ని వదిలించుకుంటున్నారన్నది స్పష్టం. ఎందుకు ?
అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్ధాయిలో యువత విద్యకోసం తీసుకున్న అప్పులపాలై వున్నారు. రానున్న రెండు దశాబ్దాలలో మరింత యాంత్రీకరణ కారణంగా అమెరికాలో ప్రభుత్వ వుద్యోగాలతో సహా మొత్తం యాభై శాతం వుద్యోగాలు రద్దవుతాయని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తమ తలిదండ్రుల కంటే దుర్భర పరిస్థితులను అనుభవించే తొలి తరంగా యువత జీవనం గడపబోతున్నది. పర్యావరణ ముప్పు సరేసరి. ఇంతకాలం తాము బలపరిచిన పెట్టుబడిదారీ విధానం ఇంతకంటే తమకు మెరుగైన జీవితాన్ని ఇవ్వదనే విషయాన్ని యువత క్రమంగా గ్రహిస్తున్నది. అందుకే దాని బదులు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు.
గతంలో సోషలిజం ఆకర్షణీయంగా వుండటం కారణమైతే, ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభంలో పడటం, అనేక భ్రమలతో సోషలిజాన్ని వదులుకున్న దేశాలు పెట్టుబడిదారీ విధానం గురించి పునరాలోచించటం, అంతకు మించి సోషలిస్టు విధానంలో వున్న వాటి కంటే పరిస్ధితులు దిగజారటం గురించి జనంలో చర్చ జరగటం, ప్రపంచ ఆర్ధిక సంక్షోభం చైనా తదితర సోషలిస్టు దేశాలను అంతగా ప్రభావితం చేయకపోవటం వంటి కారణాలు మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు, జనం ఆ వైపు ఆలోచించకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది.
ఇంటర్నెట్ యుగంలో సమాచారాన్ని వక్రీకరించవచ్చు తప్ప వాస్తవ సమాచారాన్ని కోరుకొనే వారిని నిరోధించటం సాధ్యం కాదు. సోషలిజం, కమ్యూనిజం గురించి గతంలో మాదిరి కట్టుకధలు చెబితే యువత బుర్ర ఆడించే పరిస్ధితి లేదు. ఆస్ట్రేలియాలో ఒక హైస్కూలు విద్యార్ధిని ఆ స్కూలు నిరంకుశ యాజమాన్యం రెచ్చగొట్టి దేనికి పురికొల్పిందో చూడండి.
స్వేచ్చా ప్రపంచంగా వర్ణితమయ్యే దేశాలలో ఆస్ట్రేలియా ఒకటి. మేనెల ఏడవ తేదీన సిడ్నీ నగరంలో జరిగిన ఒక మేడే ప్రదర్శనకు జస్సీ అనే 16 సంవత్సరాల హైస్కూలు విద్యార్ధి హాజరయ్యాడు. అది అతనికి తొలి మేడే ప్రదర్శన. అదే రోజు అతని స్కూలు స్ధాపకుడి సంస్మరణార్దం నిర్వహించే కార్యక్రమానికి వెళ్లకుండా జెస్సీ మేడే ప్రదర్శనకు వెళ్లాడు. అందుకు గాను శనివారం నిర్బంధ శిక్ష విధించినట్లు స్కూలు యాజమాన్యం తెలిపింది. తలిదండ్రులకు పంపిన లేఖలో స్కూలు కార్యక్రమానికి బదులు మేడే ప్రదర్శనకు వెళ్లినట్లు, శనివారపు శిక్షలు ఎక్కువగా వుంటే స్కూలు నుంచి బయటకు పంపే విషయాన్ని ఆలోచించాల్సి వుంటుందని హెచ్చరించారు.
గతేడాది స్కూలు స్ధాపకుడి సంస్మరణ కార్యక్రమానికి వెళ్లిన తనకు అక్కడి తంతు విసుగు పుట్టించిందని జెస్సీ చెప్పాడు. మరి మేడే ప్రదర్శనకు ఎందుకు వెళ్లావు అనిఅడిగితే మేడే గురించి ట్విటర్‌లో అమెరికన్ల మరియు ప్రపంచమంతటి నుంచీ జరిగిన రచ్చ గురించి నేను ఎంతో తెలుసుకున్నాను. హాజరైతే ఎలా వుంటుందో తెలుసుకోవాలనే వుబలాటంతో వెళితే నిజంగానే ఎంతో వుద్వేగం కలిగింది అని చెప్పాడు. శనివారం నాడు విధించిన శిక్షా సమయంలో మౌనంగా వుండకుండా స్కూలు చర్యను నిరసిస్తూ అణచివేత గురించి తాను రాసుకు వచ్చిన మార్క్సిజం విశ్లేషణను చదివాడు. వచ్చే ఏడాది మేడే ప్రదర్శనకు హాజరయ్యేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తాను. ఒక వేళ ఇవ్వకపోతే ఎలాగైనా సరే మేడే ప్రదర్శనకు వెళతా. స్కూలు విధించే శిక్ష నన్ను నిరసన తెలపకుండా ఆపలేదు అని చెప్పాడు. అంతే కాదు ఆరోజు స్కూలు ప్రారంభానికి ముందు వుదయం, స్కూలు తరువాత సాయంత్రం రెండు నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నాడు జెస్సీ. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత తెలిసిందే. అమెరికా, ఇతర దాని వుపగ్రహ దేశాల పాలకవర్గ కమ్యూనిస్టు వ్యతిరేకత కూడా చివరికి దానికే దారి తీస్తుందా ? అవును అని చెప్పటానికి సందేహించనవసరం లేదు, చరిత్ర చెప్పిన సత్యమది.