Tags

, , , , , ,

ఎంకెఆర్‌

ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా పండే రొయ్య మీసాల పొడవు- విస్తృత ప్రచారం పొందిన చంద్రబాబు నాయుడి సీనియారిటీ గురించి ఎవరైనా విబేధిస్తే అంతకంటే అమాయకులు మరొకరు వుండరు. అయితే ఎవరూ వివాదం చేయకపోయినా ఈ మధ్యకాలంలో, తాజాగా తన సీనియారిటీ గురించి తానే చెప్పుకుంటున్న చంద్రబాబు గురించి ప్రస్తావన రాకుండా ఎలా వుంటుంది? అసలా అవసరం ఏమొచ్చిందన్నదే ప్రశ్న. తాను మారానని మూడో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో, అంతకు ముందు చంద్రబాబు చెప్పారు. చూస్తుంటే ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సమతీ అన్న నీతి బాగా వంట పట్టించుకున్నట్లు తేలిపోయింది.

గుంటూరు సభలో రాహుల్‌ గాంధీ రాజకీయాల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు మోడీ భయం పట్టుకుందని విమర్శించారు. ఆ మాటకు వస్తే నరేంద్రమోడీ, చంద్రబాబు కూడా సభలలో తాము చెప్పదలచుకున్నవి చెప్పారు, అతి వినయం ప్రదర్శించి చేయాల్సిన నటన చేయలేదా, ఎవరు తక్కువ ? అలాగే రాహుల్‌ చెప్పిన మాటలు వినటమా లేదా, చేసిన విమర్శలను పట్టించుకోవటమా లేదా సూచనలను పాటించటమా లేదా అన్నది వేరే విషయం. తాను ఎవరికీ భయపడటం లేదని, దేశంలోనే సీనియర్‌ రాజకీయవేత్తను కనుక ఇప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్న వారు చెబితే వినేది లేదని చంద్రబాబు చెప్పాల్సిన పనేముంది. నిజానికి అది నరేంద్రమోడీకి ఎక్కడో మండే మాట. మరో విధంగా అలా అనటం అంటే జ్ఞాన ద్వారాన్ని మూసుకోవటమే. ఆ మాట అన్న తరువాత ఈగలు, చీమలు, దోమల మాదిరి అధికారం చుట్టూ మూగే ఇతర పార్టీల వారూ, తెలుగుదేశం పార్టీలోని సహచరులు, జూనియర్లు చెప్పిందానిని కూడా చంద్రబాబు ఎలా వింటారు. ఇప్పటికే ‘సీతయ్య నివాస్‌’ మాదిరి తెలుగు దేశం పార్టీలో అసలు అలా చెప్పే వాతావరణం ఎక్కడుంది. గతంలో ఒక్క పెదబాబే అనుకుంటే తండ్రికి తగ్గ తనయుడు చినబాబు కూడా తోడయ్యారు. దీంతో చంద్రబాబు తప్ప తెలుగుదేశంలోని సీనియర్లందరూ నారావారి కుటుంబంలో పుట్టబోయే వారికి అన్నలుగానూ పుట్టిన వారికి తమ్ములుగానూ మారిపోయారు. గతంలో పది సంవత్సరాలు ముఖ్య మంత్రిగా, మరో పది సంవత్సరాలు ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబు శైలిని దగ్గరగా చూసిన వారికి ఆయనకు సీనియారిటీతో నిమిత్తం లేకుండానే ఇతరులు చెప్పేదానిని పరిగణనలోకి తీసుకొనే తత్వం లేదన్నది బాగా తెలిసిందే. ఈ సందర్భంగా ప్రచారంలో వున్న మహాకవి కాళిదాసు గర్వభంగం కథను గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. సరస్వతి దేవి పెట్టిన పరీక్షలో సున్నా మార్కులు తెచ్చుకున్న కాళిదాసుకు కనువిప్పు కలగగానే విద్యతో వినయం వృద్ధి చెందాలి గాని అహంకారం కాదు నాయనా కీర్తి ప్రతిష్టల మాయలో పడిన నీ బుద్ధిని మార్చటానికే ఈ పరీక్ష అని దాహంతో వచ్చిన కాళిదాసుకు మంచినీరు ఇచ్చి అనుగ్రహిస్తుంది.

అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ, బయట ప్రతిపక్షాలకు తాను చెప్పటం తప్ప ఇతరులు చెప్పింది వినే అలవాటు లేదనే విమర్శలు వున్న చంద్రబాబు ఎవరూ చూడకుండా అయినా వేమన, సుమతీ శతకాలు ఒక్కసారి తిరగేసుకుంటే మంచిది.

వినదగు నెవ్వరు చెప్పిన,

వినినంతనే వేగపడక వివరింపదగున్‌,

గని కల్లనిజము లెరిగిన,

మనుజుడే పో నీతిపరుడుడు మహిలో సుమతీ

అన్న ప్రబోధ పద్యాన్ని చంద్రబాబు మరిచి పోయి వుంటారు.

మూడు సంవత్సరాల పాలనలో సున్నా మార్కులు తెచ్చుకున్న చంద్రబాబు వైఫల్యాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే మండిపడుతున్నారు. తానే చెప్పుకున్నట్లు ఒక సీనియర్‌గా గోబెల్స్‌ ప్రచారంలో కూడా ఆయనను మించిన వారు లేరు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్నది హిట్లర్‌ ప్రచార మంత్రి గోబెల్స్‌ సూత్రం. చంద్రబాబుకు గోబెల్స్‌ను మించిన బిజెపి తోడు కావటంతో ఇక చెప్పాల్సిందేముంది.

రాష్ట్ర విభజన సమయంలో వ్యతిరేకించింది ఒక్క సిపిఎం తప్ప మరొకపార్టీ లేదు.అందుకే ఆ పార్టీ దానికి ప్రత్యామ్నాయంగా ఫలాన వరం ఇవ్వాలని కోరలేదు. గతంలో అలా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అలా అడగటం అంటే విభజనను అంగీకరించినట్లే. ఆసుపత్రులలో పెద్ద ఆపరేషన్లు చేయాల్సి వచ్చినపుడు సంభవించే పర్యవసానాలకు అంగీకారం తెలుపుతూ రోగి లేదా సమీప బంధువుల సంతకాలతో లేఖలు తీసుకుంటారు. రెండు కళ్ల సిద్ధాంతం చెప్పి ఆంధ్రప్రదేశ్‌ కన్ను పొడవటానికి ఆమోదం తెలిపి ఒకటికి రెండు లేఖలు ఇచ్చింది చంద్రబాబు. ఆపరేషన్‌ చేసే వైద్యుడు కోరిన కత్తులు, కటార్లు అందించి సహకరించే సిబ్బంది మాదిరి ఆంధ్రప్రదేశ్‌ కన్ను పొడిచే సమయంలో పెద్ద ఎత్తున హడావుడి చేసి కాంగ్రెస్‌కు అన్ని విధాలుగా సహాయపడింది బిజెపి. తిరుపతి సభలో ప్రత్యేక హోదా గురించి వెంకన్న సాక్షిగా వాగ్దానం చేసింది నరేంద్రమోడీ. తరువాత దానిని తిరస్కరించిందీ ఆ పెద్ద మనిషే. మూడు సంవత్సరాల కాలంలో ఇన్ని జరిగితే వాటన్నింటినీ వదలి పెట్టి చంద్రబాబు నాయుడు కేవలం కాంగ్రెస్‌ మీదే ఎదురుదాడులకు దిగారు. రాష్ట్రానికి హాని చేయటంలో కాంగ్రెస్‌ పాత్ర ఎంతో బిజెపిదీ అంతే. హోదా బదులు ప్రత్యేక పాకేజీ ఇచ్చారని, దాని కంటే హోదా వలన అదనంగా వచ్చే ప్రయోజనమేమిటో చెప్పాలని కూడా చంద్రబాబు సవాలు విసురుతున్నారు. ఇప్పుడు సమస్య పాకేజి వలన కలిగిన ప్రయోజనం ఏమిటన్నదే, ఆ ప్రశ్నకు ఇంతవరకు ఆ పెద్ద మనిషి లేదా బిజెపి నేతలు గానీ నోరు విప్పటం లేదు.

ఏ పార్టీలో ఎంతకాలం వుంటారో, ఎప్పుడు ఏ పార్టీ మారతారో తెలియని విశ్వసనీయతలేని నాయకులతో తెలుగుదేశం పడవ నడుస్తోంది. అలాంటి పార్టీ నేతగా దానిని నిరూపించుకోవాలంటే ఇప్పటికైనా ఆయన చెప్పే కాంగ్రెస్‌ అడ్డగోలు రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఎలా నష్టపోయిందో, ఆ నష్టాన్ని పూడ్చేందుకు మిత్రపక్షం బిజెపి ఇచ్చిన ప్రత్యేక పాకేజి కారణంగా వచ్చే లాభాలు ఏమిటో, తెలుగుదేశం పార్టీ చెప్పే న్యాయబద్ద విభజన కోసం తాము చెప్పిందేమిటో, చేసిందేమిటో ప్రభుత్వం తరఫున ఒక శ్వేత పత్రం ప్రకటించి వాస్తవాలు చెప్పటం తప్ప మరొక మార్గం లేదు. అదేమీ లేకుండా అడ్డగోలు రాజకీయాలు, దాడులు చేస్తే రాష్ట్ర ప్రజలకు పూచికపుల్ల ప్రయోజనం కూడా వుండదు. క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఆ కాంగ్రెస్‌లో చివరి వరకు వుండి తెలుగు దేశం పడవలోకి ఎక్కిన నేతలను మాత్రం ఎలాంటి క్షమాపణ అడగకుండానే పార్టీలో చేర్చుకొని పదవులు ఇచ్చి అందలమెక్కించారు. అదే కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో కూడా చేరి దానిని కూడా పునీతం చేశారు. తెలుగుదేశం సరసన కూర్చొని వారిపుడు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపికి కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా వున్నామని చంద్రబాబు చెబుతున్నారు. ఆ విషయాన్ని నొక్కి వక్కాణిస్తే ఆయనకే నష్టం. ఒక రాజకీయపార్టీ పట్ల మరొక రాజకీయ పార్టీ ఎలా వ్యవహరించాలనేది అది వారిష్టం.కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆని చెబుతున్నారు కనుక సాధించిన అదనపు ప్రయోజనాలేమిటో కూడా చెప్పాలి.ప్రతి ఏటా నవనిర్మాణ దీక్షలంటూ ప్రత్యర్ధులపై ఎదురుదాడులు తప్ప జనానికి సానుకూల అంశాలను వివరించిన పాపాన పోలేదు. కులం, మతం, ప్రాంతీయ భావనలను తలకెక్కించుకున్న జనంలోని ఒక తరగతి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర వైఫల్యాల గురించి పట్టించుకోకపోవచ్చు. ఎల్లకాలం ఇదే పరిస్ధితి వుండదు. అటు బిజెపి తెలుగుదేశం పార్టీని ముందుగదిలో కూర్చో పెట్టి దాని ప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు వెనుక ద్వారం తెరిచింది. శ్రీకృష్డుడి రాజకీయం మాదిరి ముందుగ వచ్చితీవు, మున్ముందుగ అర్జునుడిని చూచితి నేను అన్నట్లుగా బిజెపి తనకు ఏది వాటంగా వుంటే అది చేసేందుకు పావులు కదుపుతోంది. చంద్రబాబు అస్త్రాలు తుప్పు పట్టటం లేదా ఒక్కొక్కటిగా మొద్దుబారి పనికి రాకుండా పోతున్నాయి. అవ్వతో వసంతమాడినట్లు కాంగ్రెస్‌ క్షమాపణలతో కాలక్షేపం చేస్తే కుదురుతుందనుకుంటే పొరపాటు.