ఎం కోటేశ్వరరావు
శాస్త్రీయ సూత్రాలను నిరాకరించటం ద్వారా ఎవరైనా విరుద్ధ భావాలను వ్యాపింపచేయగలరు అని ఇటాలియన్ శాస్త్రవేత గెలీలియో ఐదు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ప్రపంచంలో రెండే అనంతమైనవి. ఒకటి విశ్వం, రెండవది మానవుల బుద్దిహీనత, అయితే మొదటిదాని గురించి నేను అంత ఖాయంగా చెప్పలేను అని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐనిస్టీన్ అన్నాడు.లోకం పోకడలను కాచి వడపోసిన వారే ఇలాంటి తిరుగులేని అంశాలను గతంలో చెప్పారు. ఇప్పుడు ఎలాంటి అనుభవం లేకుండానే ‘ఆణిముత్యాలను’ ప్రవచించటానికి అనంతమైన బుద్ధి హీనులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. మనకు కావాల్సింది కాస్త బుర్రకు పని పెట్టి వారి లోకాన్ని విమర్శనాత్మకంగా చూడటమే !
భూమి చుట్టూ సూర్యుడు తిరగటం కాదు, భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతోందని తొలిసారిగా చెప్పింది గెలీలియో. అప్పటివరకు వేల సంవత్సరాలుగా వున్న విశ్వాసాలను పటాపంచలు చేశాడు. అయితే బైబిల్ చెప్పిందానికి భిన్నంగా తమ మనోభావాలను గాయపరిచాడంటూ నాటి క్రైస్తవ మతోన్మాదులు గెలీలియోను గృహనిర్బంధం కావించారు. చివరికి కళ్లు పోయిన స్ధితిలో కూడా ఆ కరుణామయులు ఆయనను విడుదల చేయలేదు. ఆయనను తరువాతి తరాల వారు ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడిగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో శాస్త్రీయంగా రుజువైన వాటిని కూడా తిరస్కరించే వున్మాదం క్రమంగా వ్యాపిస్తోంది. అది ఆవు ఆక్సిజన్ గ్రహించి దాన్నే విడుదల చేస్తుందని చెప్పటం కావచ్చు, వేదాల్లోనే అన్నీ వున్నాయట అనే రుజువు కాని శాస్త్రీయ భావాలు, విమానాలు,టెస్టుట్యూబ్ బేబీలు, ప్లాస్టిక్ సర్జరీ వంటి ఆధునిక ఆవిష్కరణలన్నీ వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో వున్నాయని చెప్పటం కావచ్చు. ఈ అశాస్త్రీయ వాదనలను సవాలు చేసే, వ్యతిరేకించే వారు తమ మనోభావాలను గాయపరుస్తున్నారంటూ వసుధైక కుటుంబం, సర్వేజనాసుఖినో భవంతు, నీవు ఎవరు నేను ఎవరు సర్వం నేనే అని సుభాషితాలు పలికే కొందరు దాడులు, హత్యలకు దిగుతున్నారు.
అలాంటి వారిని పాలకులు ప్రోత్సహిస్తున్నారు, రక్షణ కల్పిస్తున్నారు. గెలీలియో కొత్త విషయాన్ని చెప్పినందుకు అక్కడి మతవాదులు భగ్గుమంటే, రుజువులున్నా పాత విషయాన్నే ఆమోదించాలంటూ ఇక్కడి మతవాదులు దాడులు చేస్తున్నారు. మన సమాజం ముందుకు పోతోందా? తిరోగమనంలో వుందా? నూతన ఆవిష్కరణలను నిరుత్సాహపరిచే ఇలాంటి ధోరణులతో ఇప్పటికే మనం ఎంతో నష్టపోయిన విషయాన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా ? విషాదం ఏమంటే శాస్త్రీయ అంశాలను చదువుకొని వాటి ఆధారంగా పని చేస్తున్న పెద్దలు ఎక్కడో ఒకరో అరా తప్ప మనకెందుకులే అన్నట్లుగా ఇలాంటి శక్తుల పట్ల మౌనం దాలుస్తున్నారు. బుద్ది హీనత మనలో పెరుగుతోందా ? ఇవన్నీ వేదాల్లోనే వున్నాయా? పోతులూరి వీరబ్రహ్మంగారు దీని గురించి ఏం చెప్పారు ?
గతంలో పది సంవత్సరాలు అధికారంలో వున్న కాలంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ – కుప్పం ప్రాజెక్టు అంటూ వ్యవసాయం గురించి వూదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ఘోరంగా విఫలమైన ఆ పధకం, టెక్నాలజీ వూసే ఎత్తటం లేదు. సూక్ష్మంలో మోక్షం మాదిరి ఇప్పుడు ఆవు పేడ వ్యవసాయ టెక్నాలజీ గురించి రైతులకు చెప్పేందుకు కాబినెటు హోదా ఇచ్చి ఒక సలహాదారును నియమించేశారు. కేంద్రంలోని పాలకులు ఆవు రాజకీయం చేస్తున్నారు గనుక వారితో స్నేహం కారణంగా చంద్రబాబు సరికొత్త పల్లవి అందుకున్నారు. అదే మంటే ఆవు మూత్రం, ఆవు పేడతో ప్రకృతి వ్యవసాయం చేయిస్తానంటూ ముందుకు వచ్చిన సుభాష్ పాలేకర్ అనే పెద్ద మనిషికి వంద ఎకరాలు, వంద కోట్ల రూపాయలు ఇస్తానంటూ ప్రకటించారు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా మార్చిన రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను అవమానించటం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప మరొకటి కాదు. తమకు డబ్బులిస్తే బంగారం తయారు చేసే చిట్కాలు చెబుతామని, లంకె బిందెలను చూపిస్తామంటూ మోసాలకు పాల్పడే దొంగబాబాలను చంద్రబాబు గుర్తుకు తెస్తున్నారు. చివరికి ఈ పిచ్చి ముదిరి వేదాల్లోనే అన్నీ వున్నాయి, విమానాలు, క్షిపణులు తయారు చేసే పరిజ్ఞానం మన దగ్గరే వుంది అని చెబుతున్నవారికి కూడా భూములు, డబ్బు ఇచ్చి అమరావతిలో తిష్ట వేయించినా ఆశ్చర్యం లేదు.
అనేక అశాస్త్రీయ అంశాలను ప్రచారంలోకి పెట్టటంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారందరికీ పెద్ద దిక్కుగా వుంది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రచురించిన ఒక ప్రచార కరపత్రం. జూన్ 21న యోగా దినం సందర్బంగా మాతాశిశు సంరక్షణ కోసమంటూ రాసిన దానిని మంత్రి శ్రీపాద నాయక్ విడుదల చేశారు. గర్భం దాల్చిన తరువాత మాంసం తినవద్దు, శృంగారానికి దూరంగా వుండాలి. దుష్టులను దూరంగా వుంచాలి, దైవపరమైన ఆలోచనలతో వుండాలి, గదులలో మంచి, అందమైన బొమ్మలను అలంకరిస్తే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు అన్నది ఆ కరపత్ర సారాంశం. ఈ వార్తలను చదివిన వారు కొందరు నిషేధిత జాబితాకు ఖర్జూరాలను, మరికొన్నింటిని కూడా చేర్చి ప్రచారం చేస్తున్నారు. ఇదెక్కడి విపరీతం ? అనేక పేద దేశాలతో పోల్చితే మన దేశంలో రక్తహీనత సమస్య అధికంగా వుంది. దానిని అధిగమించేందుకు అవసరమైన ప్రొటీన్లు, ఇనుము మాంసంలో లభిస్తాయి. అలాంటి మాంసాన్ని గర్భిణులు తినకూడదన్నది ఒక అశాస్త్రీయ సలహా. అనేక మూఢనమ్మకాలకు నిలయమైన మన దేశంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా అలా చెబుతుంటే దానిని పాటిస్తే ప్రసూతి మరణాలు ఇంకా పెరగటం తప్ప తగ్గవు. ఆరోగ్యవంతులైన తల్లీ పిల్లల కోసం ప్రభుత్వాలు చేయాల్సిందెంతో వుంది. వాటిన్నింటినీ వదలి పెట్టి శాస్త్రీయంగా రుజువు కాని, అశాస్త్రీయ అంశాలను ప్రచారం చేయటం గర్హనీయం. ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రచురించిన కరపత్రంలోని అంశాలపై తీవ్ర విమర్శలు రావటంతో తమ కరపత్రలో కామాన్ని(లస్ట్) అదుపు చేసుకోవాలని పేర్కొన్నామే తప్ప శృంగారం( సెక్స్) అనే పదం వాడలేదని సదరుశాఖ ఒక వివరణ ఇచ్చింది. ఇది చిల్లు కాదు తూటు అని సమర్ధించుకొనే అతి తెలివి తప్ప మరొకటి కాదు. సమస్యాత్మక కేసులలో గర్భిణులే కాదు సాధారణ మహిళలను కూడా కొన్ని సందర్భాలలో శృంగారానికి దూరంగా వుండాలని నిపుణులు చెప్పటం వేరు, కానీ కేంద్ర ప్రభుత్వ కరపత్రంలో దానిని సాధారణీకరించటమే విమర్శలకు గురైంది.
ఇటీవలి కాలంలో ముఖ్యంగా కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇలాంటి పనికిరాని అంశాలను ప్రచారం చేయటం ఎక్కువైంది. సమాజంలో శాస్త్రీయ దృష్టి, ఆసక్తిని పెంచటంపై దాని పురోభివృద్ధి ఆధారపడి వుంటుంది. దానికి బదులు అన్నీ వేదాల్లోనే వున్నాయంటూ మెదళ్లను కలుషితం చేయటంలో తిరోగమన వాదం జయప్రదమైంది. మన దేశానికి అది చేసిన హాని అంతా ఇంతా కాదు. ఆధునిక ఆవిష్కరణలకు మన యువతను దూరం చేశారు.ఎందుకు అనే ప్రశ్నను వేయనివ్వకుండా నోళ్లను మూయించారు ఇప్పుడు మరోసారి అలాంటి శక్తులు చెలరేగిపోతున్నాయి. అధికారంలో వున్నవారే వాటికి సాధికారత చేకూర్చేందుకు పూనుకున్నారు.
గతంలో కాంగ్రెస్ ఒక తరహా ఓట్ల రాజకీయాలకు పాల్పడితే, ఇప్పుడు దాని స్ధానాన్ని ఆక్రమించిన బిజెపి హిందూత్వ, రామాలయం, గోమూత్రం, పేడ, గొడ్డు మాంస రాజకీయాలతో లబ్ది పొందాలని చూస్తోంది. దానిలో భాగంగానే బిజెపిని బలపరిచే సంస్ధలు,శక్తులు, వ్యక్తులు ఆవుకు లేని ప్రాధాన్యత, పవిత్రత, మహత్తులను ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారు. వారి చర్యలు, వాదనలను చూస్తే చీకటి యుగాల రోజులను గుర్తుకు తెస్తున్నారు. వారి ప్రచారాంశాల శాస్త్రీయత,అధారాలను ప్రశ్నించే, విబేధించేవారు తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ అనేక రకాల దాడులకు తెగబడుతున్నారు. సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీయే 2016 ఆగస్టులో గో సంరక్షకుల మంటూ తెగబడుతున్నవారి గురించి ఇలా చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవటం అవసరం. ‘ గో సంరక్షణ పేరుతో జనాలు దుకాణాలు నడపటం నాకు ఆగ్రహం తెప్పిస్తోంది. కొంత మంది పగలు గో రక్షకులుగా ముసుగు వేసుకొని రాత్రుళ్లు సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.’ అన్నారు. చిత్రం ఏమంటే బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా అలాంటి ఒక్క దుకాణదారును శిక్షించిన దాఖలాలు లేవు. దాంతో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆవులను రవాణా చేస్తున్న లారీలపై కూడా గో గూండాలు దాడి చేస్తే వాటిని పోలీసు రక్షణతో రాజస్ధాన్ బిజెపి సర్కార్ రాష్ట్ర సరిహద్దులను దాటించాల్సిన తీవ్ర పరిస్ధితులు అక్కడ నెలకొన్నాయి. స్వయంగా ప్రధాని, ఆయన అనుచరగణం నిరూపితం కాని, శాస్త్రవిరుద్దమన, అతిశయోక్తులను ప్రచారం చేయటం వారి ద్వంద్వ ప్రవృత్తి, చతురతకు నిదర్శనం.
మన కేంద్రమంత్రి రాజనాధ్ సింగ్ గారు ఒక సందర్భంలో అమెరికా వ్యవసాయశాఖ నివేదికను వుటంకిస్తూ దాని ప్రకారం ఆవులో కనుగొన్న జీన్స్‌లో 80శాతం మానవులలో కూడా వున్నాయని అందువలన ఆవును రక్షించి పూజించాలని చెప్పారు. పొద్దున లేస్తే ముస్లిం, క్రైస్తవ మతాలను, వాటిని అవలంభించే వారికి వ్యతిరేకంగా ప్రచారం, దాడులు చేస్తున్నారు. వారిలో కూడా అదే మోతాదులో ఆవు జీన్సు వున్నాయని అందువలన వారికి వ్యతిరేకంగా వున్మాదాన్ని రెచ్చగొట్టం గోవును అవమానించటమే అని గుర్తించటం అవసరం. సరే వున్మాదాన్ని రెచ్చగొట్టటం కూడా ఓటు బ్యాంకు రాజకీయాలనుకోండి. ఇక్కడ మెదళ్లను వుపయోగించాల్సిన అవసరం వుంది. అందరికీ సుపరిచితమైన సైన్సు అనే పత్రికలో వెల్లడించినదాని ప్రకారం మానవులలో వుండే జీన్సును పోలినవి చింపాంజీలు, పిల్లులు, ఎలుకలు, కుక్కలలో వరుసగా 96,90,85,84 శాతాల చొప్పున వున్నాయట. అంటే అవు కంటే ఎక్కువ శాతం. అరటి వంటి అనేక పండ్లలో కూడా అలాంటి జీన్సు వున్నాయి, మరి వాటికి లేని పవిత్రత ఆవు కెందుకు అంటే సమాధానం వుండదు. ఆవు పేడ, మూత్రం, అది పీల్చే, విడిచే వాయువుల గురించి కూడా అతిశయోక్తులు, కట్టుకధలను ప్రచారం చేస్తున్నారు. ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిదని పేరు పెట్టాలన్నట్లుగా ఓట్లు దండుకొనేందుకు ఆవుకు లేని పవిత్రతను ఆపాదించటం కూడా అలాంటిదే.
దాని కొనసాగింపులో భాగంగా రాజస్ధాన్ హైకోర్టు జడ్జి ఒకరు ఇటీవలనే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దానిని చంపితే మరణశిక్ష విధించాలని చెప్పారు. న్యాయమూర్తులు చట్టంలో వున్నదానికి భాష్యం చెప్పటానికి తప్ప లేని దానిని, తమ స్వంత బుర్రలలో వున్నవాటిని న్యాయ పీఠాలపై కూర్చొని చెప్పటానికి వీలులేదు. దేశమంతా ఆవు రాజకీయం నడుస్తోంది, ఆ పేరుతో కొందరు చట్టవిరుద్దమైన గూండాయిజానికి పాల్పడుతున్నారు. సదరు న్యాయమూర్తి చర్య గూండాయిజం కాకపోవచ్చుగాని చట్టవిరుద్దమైనదే. ఇదే న్యాయమూర్తి మగనెమలి కంటి నీటిని తాగిన ఆడ నెమళ్లలో పునరుత్పత్తి ప్రక్రియ ప్రారంభమౌతుందని,మగ నెమళ్లు ఆజన్మ బ్రహ్మచారులని కూడా సెలవిచ్చారు. ఇలాంటి పోసుకోలు కబుర్లు చెప్పటానికి గెలీలియో చెప్పినట్లు శాస్త్రీయ సూత్రాలను నిరాకరించటమే అర్హత. వాటికి చదువులతో పని లేదు. ఇందుకు కొన్ని వుదాహరణలను చూద్దాం. మనం కొద్దిగా ఆలోచిస్తే కర్ణుడి జన్మను చూస్తే ఆరోజుల్లోనే మనకు జన్యుశాస్త్రం, వినాయకుడికి ఏనుగుతలను అతికించటాన్ని బట్టి ప్లాస్టిక్ సర్జరీ తెలుసని అర్ధం అవుతుందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. బిజెపికి చెందిన వుత్తరాఖండ్ మాజీ ముఖ్య మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఎంపీగా పార్లమెంట్‌లో మాట్లాడుతూ పదిలక్షల సంవత్సరాల నాడే రుషి కణాదుడు అణుపరీక్షలను నిర్వహించాడని చెప్పాడు.పైథాగరస్ కంటే మూడువందల సంవత్సరాల ముందే ఆ సూత్రాన్ని మన వారు కనుగొన్నారని ముంబై విశ్వవిద్యాలయ సంస్కృత విభాగ అధిపతి గౌరీ మహిలీకర్ సెలవిచ్చాడు. విమానాలు, మోటారు కార్లు, అంతరిక్ష ప్రయాణాల వంటి వన్నీ మన పూర్వీకులెప్పుడో ఆచరించి వదలివేసినవే అని చెప్పేవారికి కొదవ లేదు.
తినే తిండిని బట్టి కొంతమంది మానభంగాలకు పాల్పడుతున్నారని ఒకడు, చికెన్, చేపలు తిన్నవారే ఎక్కువగా రేపులు చేస్తున్నారని ఒక బీహార్ మంత్రి, దక్షిణాది స్త్రీలు అందంగా వుండటానికి కారణ వారికి డ్యాన్సు తెలిసి వుండటమే అని ఒక రాజకీయనేత, హిందువుల జనాభాను పెంచేందుకు ప్రతి మహిళ కనీసం నలుగుర్ని కనాలని బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్, రాసిఫలాలను బట్టి ఏ మహిళ అత్యాచారానికి గురవుతుందో తాను చెప్పగలనని ఒక జ్యోతిష్కుడు, ఒక లీటరు ఆవు మూత్రంలో మూడు నుంచి పది మిల్లీ గ్రాముల బంగారం లభించిందని చెప్పే విశ్వవిద్యాలయ పరిశోధకులు, తమ వుత్పత్తులు చక్కెర వ్యాధిని సహజంగానే నయం చేస్తాయని పతంజలి సంస్ధ ప్రచారం, యజ్ఞం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని, కొన్ని పరీక్షల ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వారిని తిరిగి బ్రతికించగలనని ఒక వైద్యుడు, ఐనిస్టీన్ సిద్ధాంతం పరీక్షకు నిలవదని చెప్పే మేథావులు మనకు ఎక్కడబడితే అక్కడ కలుపు మొక్కల్లా పెరిగిపోయారు.
గో లేదా పశు మాంసం తినటం విదేశీ ముఖ్యంగా ముస్లింలు మన దేశం మీద దండయాత్రలు చేసిన తరువాతే ప్రారంభమైందన్నది ఒక తప్పుడు ప్రచారం. దీనిని కూడా గుడ్డిగా నమ్ముతున్నవారు లేకపోలేదు. పండ్ల అమరిక తీరుతెన్నులను చూస్తే మాంసాహార జీవుల కోవకే మానవులు చెందుతారన్నది తిరుగులేని సాక్ష్యం. వివేకానందుడు హిందూమతావలంబకుడు అనటంలో సందేహం లేదు, అది తప్పు కూడా కాదు. కానీ నేడు కాషాయ వేషాలు వేసుకు తిరిగే అనేక మంది స్వామీజీలు, వారిలో కనిపించే పరమత ద్వేషం ఎక్కడా ఆయన వుపన్యాసాలలో కనపడదు. కాలిఫోర్నియాలోని షేక్స్పియర్ క్లబ్బులో 1900 ఫిబ్రవరి రెండున చేసిన ప్రసంగంలో ఆయన ఇలా చెప్పారు.’నేను దాని గురించి చెబితే మీరు ఆశ్చర్యపోతారు, పురాతన క్రతువుల ప్రకారం గొడ్డు మాంసం(బీఫ్) తినకపోతే అతను మంచి హిందువు కాడు.కొన్ని సందర్భాలలో అతను విధిగా ఎద్దును బలిచ్చి తినాల్సిందే.’ అంతే కాదు వేదకాలం గురించి పరిశోధన చేసిన చరిత్రకారుడు సి.కున్హన్ రాజా ఇలా చెప్పారు.’బ్రాహ్మణులతో సహా వేదకాలపు ఆర్యన్లు చేపలు, మాంసం చివరికి గొడ్డు మాంసం కూడా తిన్నారు.ప్రముఖులు వచ్చినపుడు వారి గౌరవార్ధం గొడ్డు మాంసం వడ్డించేవారు. వేదకాలపు ఆర్యులు గొడ్డు మాంసం తిన్నప్పటికీ పాలిచ్చే ఆవులను తినేవారు కాదు. ఒక వేళ గొడ్డు మాంసం పెట్టాల్సి వస్తే ఎద్దులు, వట్టిపోయిన ఆవులు, దూడలను మాత్రమే వధించాలనే నిబంధనలు వుండేవి ‘ అని చెప్పారు.
నాజీ జర్మనీ కాలంలో జైలు పాలైన ప్రొటెస్టెంట్ క్రైస్తవ మతాధికారి మార్టిన్ నియోమిల్లర్ హిట్లర్ చర్యలను వ్యతిరేకించినందుకు జైలు పాలు చేశారు. అక్కడ నాజీల ఎత్తుగడలు, నాటి జనం వాటిని వుపేక్షించి చివరికి ఎలాంటి దుస్ధితికి లోనయ్యిందీ వివరిస్తూ ఒక కవితను రాశాడు. ఆ కవిత ఇలా సాగుతుంది. ఆరోజుల్లో జర్మన్ కమ్యూనిస్టులను సోషలిస్టులని పిలిచారు.
తొలుత వారు సోషలిస్టుల కోసం వచ్చారు
నేను సోషలిస్టును కాదు కనుక మిన్నకుండి పోయాను
తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు
నేను కార్మికుడిని కాదు కనుక పట్టించుకోలేదు
తరువాత వారు యూదుల కోసం వచ్చారు
నేను యూదును కాదు కనుక మాట్లాడలేదు
తరువాత వారు నాకోసం వచ్చారు
తీరా చూస్తే నాకోసం ఎవరూ మిగలలేదు
ముస్లింలు మాత్రమే ఆవు మాంసం తింటారని ప్రచారం చేసిన మతశక్తులు గోవధ నిషేధం గురించి చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. వారి వత్తిడికి లొంగి రాజ్యాంగంలో దానిని ప్రస్తావించినప్పటికీ నిషేధ అంశాన్ని రాష్ట్రాలకు వదలివేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా మొదలైన ప్రచారం తరువాత అన్ని మతాలవారు తినే పశుమాంసానికి కూడా వర్తింప చేశారు. దేశమంతటా గోవధ, పశుమాంస నిషేధం గురించి చెప్పే బిజెపి గోవా, కేరళ, గిరిజనులు ఎక్కువగా వున్న ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం ఓట్ల కోసం భిన్న గళం వినిపిస్తోంది. పశు విక్రయాలపై కేంద్రం విధించిన ఆంక్షలు గొడ్డు మాంసం తినే అన్ని మతాల వారికే గాక మెజారిటీ హిందూమతం వారికి, జీవన భృతికోసం పశుపాలన చేసే పేదవారికి అందరికీ నష్టదాయకంగా మారాయి. అందువలన మతశక్తులకు కావాల్సింది సెంటిమెంట్ల ద్వారా కొల్లగొట్టే ఓట్ల కోసం ఎవరినీ వదలవు అని గుర్తించటం అవసరం. గతంలో రాజులు, రంగప్పలు యజ్ఞ, యాగాదుల పేరుతో ప్రజాధనాన్ని ఎంతగా తగలేసిందీ చదువుకున్నాం. ఇప్పుడు నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి పాలకులు కూడా మరో రూపంలో అదే చేస్తున్నారు. ఆశాస్త్రీయమైన వాటిని నిరూపించేందుకు పరిశోధనల పేరుతో జనం సొమ్మును వుదారంగా ఖర్చు చేస్తున్నారు.
రామాయణంలో చెప్పిన సంజీవని మొక్కలను కనుగొనేందుకు వుత్తరాఖండ్ సర్కార్ 25 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇలాగే అనేక విశ్వవిద్యాలయాలలో సంస్కృతంలో నిక్షిప్తమైన పరిజ్ఞానాన్ని వెలికితీసే పేరుతో డబ్బు, మానవ శ్రమ, మేధస్సును కూడా దుర్వినియోగపరిచేందుకు పూనుకున్నారు. చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతున్న సుభాష్ పాలేకర్ చెబుతున్నట్లు ఎలాంటి ఎరవులు, పురుగుమందులు వేయకుండా ఆవు పేడ, మూత్రంతో సాగు చేస్తే ఎకరానికి పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. నరేంద్రమోడీ వాగ్దానం చేసిన ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షల రూపాయల నల్లధనం సొమ్ము బదిలీకోసం ఎవరూ ఎదురు చూడరు. చంద్రబాబు చెప్పే ఐటి వుద్యోగాల జోలికి యువత అసలే పోదు. ఆవు మూత్రాన్ని సేకరించి బంగారాన్ని, పేడను వాడి వ్యవసాయం చేస్తారు. చంద్రబాబు హెరిటేజ్ కంటే ఎక్కువ లాభాలు పొంది ఆయనకంటే ఎక్కువగానే సంపాదించగలరు.సుభాష్ పాలేకర్ మాటలను చూస్తుంటే నాకు లక్ష రూపాయలిస్తే మీకు కోట్ల రూపాయల బంగారాన్ని తెచ్చిపెట్టే ఫార్ములా చెబుతా అనే మాయగాళ్లను గుర్తుకు తెస్తున్నారు. వారికి ఆ ఫార్ములా తెలిస్తే ఆ బంగారమేదో వారే సంపాదించుకోవచ్చు. పశువుల పేడ, మూత్రంతో కూడిన ఎరువులను పొలాల్లో చల్లటం రైతాంగానికి కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు. కేవలం దానితోనే పంటలు పండుతాయని చెప్పటమే అభ్యంతరకరం. అలాగే ప్రకృతి సాగు చేస్తున్నా అంటున్న పాలేకర్ చెప్పేది నిజమైతై ఆయన వ్యవసాయం చేశానంటున్న మహారాష్ట్రలో రైతులు అప్పులపాలై ఆత్మహత్య లెందుకు చేసుకుంటున్నట్లు ? ఆవు పేడ వ్యవసాయాన్ని వారెందుకు చేయటం లేదు, అసలు పాలేకర్ చెప్పేదానికి రుజువులేమున్నాయి అని అడగాల్సిన అవసరం లేదా ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ రూపంలో అయినా కనీసం ఒక రూపాయి అయినా చెల్లించే ప్రతి ఒక్కరికీ పాలేకర్‌కు చేసే ఖర్చు గురించి అతని చర్యల శాస్త్రీయత గురించి ప్రశ్నించే హక్కు వుందా లేదా ?