Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ఎందుకిలా జరుగుతోంది ? రాబోయే (ముందస్తు లేదా నిర్ణీత గడువు ప్రకారం జరిగే) ఎన్నికలలో కూడా తమదే అధికారం అని కలల పడవలో ప్రశాంత అలల మధ్య తేలి పోతున్న బిజెపి నేతలకు అనుకోని రీతిలో రైతుల ఆందోళనలనే కుదుపులు ఎందుకు తగులున్నాయి? అవీ మూడేండ్ల సంబరాల సమయంలో అని ప్రతిపక్షాల కంటే బిజెపి అభిమానులు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం వుంది.

జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలు నిలదీసి ఎందుకు అని ప్రశ్నించకుండా మనకెందుకులే అని తప్పుకోవటాన్నే మన పురాతన నాగరికత, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర నేర్పాయా ? మన వివేచనను నీరుగార్చాయా అన్న అనుమానం కలుగుతోంది. తమ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా సమృద్ధిగా పంటలు పండాయని మూడు సంవత్సరాల విజయ గాధలలో మోడీ సర్కార్‌ పేర్కొన్నది. వ్యవసాయం వుమ్మడి జాబితాలో వుంది. ప్రధానంగా రాష్ట్రాల అంశం, అయినప్పటికీ ఘనత తనదే అని మోడీ చెప్పుకున్నారు. మరి అలాంటి ఘనత సాధించిన వారి హయాంలో రైతులు రోడ్లెక్కటం ఏమిటి? దానికి ఎవరు బాధ్యత వహించాలి. ఆకాశాన్ని అంటిన పప్పుల ధరలు తగ్గగానే సామాజిక మాధ్యమాలలోని మోడీ భక్తులు ఆ ఘనత తమ నేతదే అని ప్రచారం చేశారు. ఆ తగ్గుదలకు మూల్యం చెల్లించింది ఎవరు ? ధరలు పతనమై నష్టాలు వచ్చాయని ఒక్క వ్యాపారీ దివాళా ప్రకటించలేదు, ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు లేవు.ఆ దుర్గతి రైతులకే ఎందుకు పట్టింది. పప్పు ధాన్యాల ధర తమకు గిట్టుబాటు కాని రీతిలో పతనమైందనే కదా మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ రైతులు ఆందోళనకు దిగింది. పప్పుల ధరలు పెరగగానే వాటిని తగ్గించే పేరుతో బిజెపికి అన్ని విధాలుగా సాయపడిన పారిశ్రామిక, వాణిజ్యవేత్త అదానీ కంపెనీలకు పప్పుల దిగుమతికి, వాటిని అధిక ధరలకు అమ్ముకొని విపరీత లాభాలు సంపాదించేందుకు అవకాశం కల్పించింది ఎవరు ? రైతులకు గిట్టుబాటు కాని రీతిలో ధరలు పతనమైతే మోడీ సర్కార్‌ లేదా బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆదుకోలేదు ? ఎవరు ఆదుకోవాలి? తాజా రైతు ఆందోళన ఏమి తెలియ చేస్తున్నది? అతివృష్టి, అనావృష్టికి బలయ్యేది రైతులే, అలాగే పంటలు బాగా పండినా, పండకపోయినా ప్రభావితులవుతున్నదీ రైతులే. ఏది జరిగినా నష్టాలే వస్తున్నాయి.

ఖమ్మంలో పతనమైన ధర గురించి ఆందోళన చేసిన మిర్చి రైతులు సంఘవ్యతిరేశక్తులని మంత్రులు, వారి వంది మాగధులు ప్రకటించారు. తీరా సామాన్య రైతులకు బేడీలు వేసి వీధులలో తిప్పి జైలుకు పంపారు. మధ్య ప్రదేశ్‌ పాలకులు మరొక అడుగు ముందుకు వేసి రైతులు పోలీసులు కాల్పులలో మరణించలేదన్నారు, వారసలు రైతులే కాదు పొమ్మన్నారు, మరణించిన వారిలో గంజాయి స్మగ్లింగ్‌ కేసులున్న నేరగాళ్లున్నారని ప్రచారం చేశారు. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి తరువాత మరణించిన ప్రతి రైతు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? రైతులను కాల్చి చంపించటమే గాక ఎదురుదాడి వ్యూహంలో భాగంగా రైతులు హింసాకాండకు స్వస్ధి చెప్పాలని ఒక బిజెపి ముఖ్య మంత్రి స్వయంగా నిరాహార దీక్ష చేస్తారని పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పారో లేదో తెలియదు గానీ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆపని చేశారు. అంతకంటే విచిత్రం, విపరీతం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్‌ రైతు విభాగం భారతీయ కిసాన్‌ సంఘ్‌ తాము కూడా రైతు సమస్యలపై ఆందోళన జరపనున్నట్లు ప్రకటించింది. అంతరించిపోగా అవశేషాలు మిగిలినట్లు ఇంకా బుర్రలు మిగిలిన వారికి ఎందుకిలా జరుగుతోంది ? అనే ప్రశ్న ఎదురవుతోంది.

2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది బిజెపి. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ కిసాన్‌ సంఘ్‌ వుపాధ్యక్షుడు ప్రభాకర్‌ కేల్కర్‌ ఫస్ట్‌ పోస్ట్‌ అనే వెబ్‌ పత్రికతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను అమలు జరపని కారణంగా రైతులలో ఆగ్రహం పేరుకుపోయినందున ఆందోళన అనివార్యమని అయితే హింసా పద్దతులకు తాము వ్యతిరేకమని చెప్పుకున్నారు. రైతులు కనీస మద్దతు ధరలను పొందటం లేదని, తదుపరి సాగునిమిత్తం పెట్టుబడుల కోసం తమ వుత్పత్తులను తెగనమ్ముకోవటం వంటి పరిణామాలు రైతుల ఆందోళనకు కారణాలని ఆ పెద్దమనిషి చెప్పాడు. అయినా బిజెపి సర్కార్‌ వాటిని పట్టించుకోలేదు. తొలుత రైతుల ఆందోళనలో భాగమైన ఆర్‌ఎస్‌ఎస్‌ రైతు సంఘం మధ్యలో చర్చల పేరుతో శకుని పాత్ర పోషించి వైదొలిగింది. వాస్తవాలు ఇలా వుంటే కాంగ్రెస్‌ను భూస్తాపితం చేశామని, వామపక్షాలు వునికి కోల్పోయాయని ఒకవైపు ఇప్పటికే ప్రకటించేసి, అదే నోటితో రైతుల ఆందోళనల వెను వారున్నారని బిజెపినేతలు ఆరోపించారు. అవి నోళ్లా లేక మరేవైనానా ?

వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోయాయి. అవి సబ్సిడీలు కావచ్చు, మరొక సేవ రూపంలోని కావచ్చు. అదే సమయంలో నియంత్రణలు ఎత్తివేసిన కారణంగా ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. రెండో వైపు మార్కెట్‌ను ప్రయివేటు వ్యాపారులు అదుపు చేస్తున్న కారణంగా రైతాంగానికి ఒక స్ధిరమైన ఆదాయాలు వుండటం లేదు. పంటలు దెబ్బతినటంతో పాటు విద్య, వైద్యం వలన కూడా అన్ని తరగతుల వారితో పాటు రైతాంగం అదనంగా అప్పులపాలవుతున్నారు.ఈ ఏడాది రైతులకు పత్తి ధరలు గతేడాది కంటే కాస్త మెరుగ్గా వున్నాయి.దాంతో నూలు, వస్త్ర మిల్లు యజమానుల లాభాలకు ఎక్కడ దెబ్బతగులుతుందో అని భయపడిన నరేంద్రమోడీ సర్కార్‌ గత కాంగ్రెస్‌ పాలకులను పక్కకు తోసి పత్తి దిగుమతులలో సరికొత్త రికార్డును సాధించింది. గత మూడు సంవత్సరాలలో(2013-14 నుంచి 2016-17) మన దేశం నుంచి జరిగిన పత్తి ఎగుమతులు 363.75 నుంచి 162.71 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఇదే సమయంలో దిగుమతులు 39.44 నుంచి 94.66 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఒక్క పత్తి విషయంలోనే కాదు ఇదే కాలంలో మొత్తం మన వ్యవసాయ, అనుబంధ వుత్పత్తుల ఎగుమతులు 4236.26 నుంచి 3382.14 కోట్ల డాలర్లకు పడిపోగా దిగుమతులు 1552.89 నుంచి 2563.64 కోట్ల డాలర్లకు పెరిగాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో రైతుల వుద్యమం తలెత్తిన ప్రాంతాలు పప్పుధాన్యాల సాగుకు ప్రసిద్ది. ఈ మూడు సంవత్సరాలలో వాటి దిగుమతి 182.81 నుంచి 424.42 కోట్ల డాలర్లకు పెరిగాయి. అంటే ప్రభుత్వ దిగుమతి విధానాలు ఈ రెండు రాష్ట్రాల పప్పుధాన్యాల రైతుల నడ్డి విరిచాయి. అందుకే గత ఎన్నికలలో బిజెపికి పూర్తి మద్దతు ఇచ్చిన రైతాంగం నేడు విధిలేక రోడ్డెక్క వలసి వచ్చింది. ఇదంతా వ్యవసాయ రంగంలో ఘనవిజయాలు సాధించామని, వుత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయంటూ కేంద్ర ప్రభుత్వ విజయగానాలు చేస్తున్న సమయంలోనే జరిగింది. ఇటువంటి విధానాలతో బిజెపి 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు మాటేమోగాని రుణభారం, ఆత్మహత్యలను రెట్టింపు చేసేదిగా కనిపిస్తోంది.

వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే మొత్తం వుత్పత్తి ఖర్చుపై 50శాతం అదనంగా ఆదాయం వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రఖ్యాత వ్యవసాయశాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌ 2008లోనే రైతులపై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌ నివేదికలో చెప్పారు. దానికి అనుగుణంగా కనీస మద్దతు ధరల ప్రకటన లేకపోగా ఈ ఏడాది ప్రకటించిన ధరలకంటే పతనమైనా ప్రభుత్వాలు ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోలేదు. తాజా రైతుల ఆందోళన వెనుక పెద్ద నోట్ల రద్దు ప్రభావం కూడా వుందని, దాని గురించి సరైన అధ్యయనం లేదని స్వామినాధన్‌ క్వింట్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా చెప్పారు. ఇప్పుడు ఏర్పడిన పరిస్ధితుల కారణంగా రైతుల రుణాలను ప్రస్తుతానికి రద్దు చేసినప్పటికీ వ్యవసాయం గిట్టుబాటు కావటానికి దాన్నొక పద్దతిగా మార్చరాదని, రైతుల ఆదాయాలను స్ధిరపరచటానికి పద్దతులను రూపొందించాలని, రుణాల రద్దు వలన పేదల కంటే ధనిక రైతులే ఎక్కువ లబ్దిపొందుతున్నారని ఆయన చెప్పారు. సామాజిక రక్షణలు లేని కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వ్యవసాయం జీవితాన్ని ఇవ్వాలే తప్ప ప్రాణాలు తీసేదిగా వుండకూడదని ప్రస్తుతం లండన్‌లో వున్న 92 సంవత్సరాల స్వామినాధన్‌ చెప్పారు.

ఆవును వధిస్తే జీవితకాల జైలు లేదా మరణశిక్ష విధించాలన్నట్లుగా తమ పాలిత రాష్ట్రాల శాసనసభలన్నీ (ఒక పధకం ప్రకారం) తీర్మానాలు చేస్తున్నాయి తప్ప ఆ ఆవులను సాకే రైతుల గురించి ఎందుకు ఆలోచించటం లేదని బిజెపి వారు తమ తలలు తామే పట్టుకోవటం అవసరం. మాంసం కోసం ఆవులను వధిస్తున్నారంటూ జై భజరంగ ‘బలీ’ అని(ముస్లింలపై) దాడులకు తెగబడుతున్న హిందూత్వ ‘కారుణ్యమూర్తులు’ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, వారిపై కాల్పులు జరుగుతుంటే ఒక్క వీధిలో కూడా వారి జాడలేదేం? నిజానికి ఈ ప్రశ్నలు అటు బిజెపి అనుకూలురు లేదా వ్యతిరేకులే కాదు మేం ఎటు న్యాయం వుంటే అటు వుంటాం అనే తటస్ధులు కూడా తీవ్రంగా ఆలోచించాల్సినవి కాదా. వాటి గురించి తమలో తాము తర్కించుకొనేందుకు, ఎవరినైనా ప్రశ్నించేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు ?