Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

తప్పుడు సంకేతాల గురించి చెప్పిన చంద్రబాబు షేక్స్పియర్‌ ప్రఖ్యాత నాటకం జూలియస్‌ సీజర్‌లో బ్రూటస్‌ పాత్రధారిని గుర్తుకు తెచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారుల వుపాధికి, అంతకు మించి అనేక గ్రామాలను కాలుష్యానికి గురి చేసే తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీని తరలిస్తే ‘తప్పుడు’ సంకేతాలు వెళతాయి గనుక తరలించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. ఈ ప్రకటన ద్వారా అలాంటి హానికరమైన పరిశ్రమలను చివరకు ప్రజల పడక గదుల్లో పెట్టినా తమకు మద్దతు ఇస్తారని పౌరుల ఆరోగ్యాలు, ప్రాణాల నుంచి కూడా లాభాలు పిండుకోవాలనే పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లయింది. అందువలన తేల్చుకోవాల్సింది జనమే. చంద్రబాబుకు, అలాంటి కాలుష్యకారక, ప్రమాదకర పరిశ్రమలకు మద్దతు తెలిపే వారికి ఎలాంటి సంకేతాలు పంపాలో తేల్చుకోవాలి. ఫ్యాక్టరీని తరలించేది లేదన్న ముఖ్యమంత్రి, అధికార పార్టీ నేతల, ప్రభుత్వ యంత్రాంగ మొండి వైఖరి సంకేతాలను గత మూడు సంవత్సరాలుగా జనం చూస్తూనే వున్నారు. అయినను పోయి రావలె అమరావతికి అన్నట్లుగా ఆ ప్రాంత జనం వెళ్లారు.ఐదూళ్లు కాదు సూది మోపినంత కూడా స్ధలం ఇచ్చేది లేదన్న కౌరవుల మాదిరి చంద్రబాబు ఇచ్చిన సందేశం స్వయంగా విన్నారు. ఇప్పటివరకు సాగించిన పోరాటాన్ని మరో రూపంలో సాగించటమా ఆ కాలుష్యానికి తామే గాక తమ ముందు తరాల వారిని కూడా బలి చేయటానికి ఫ్యాక్టరీ యాజమాన్యం, వారికి మద్దతు పలుకుతున్న పాలకులు, పార్టీల ముందు సాగిల పడటమా అన్నది జనం ముందున్న ప్రశ్న. ఈ సమస్య పరిష్కారానికి దగ్గర దారులు లేవు అని గ్రహించటం అవసరం.

స్వాతంత్య్ర పోరాటం మనకు అనేక అనుభవాలు నేర్పింది. తెల్లవారికి తొత్తులుగా, జనానికి నష్టం చేకూర్చే శక్తులు, వ్యక్తులకు సహాయ నిరాకరణ ఒక మార్గం. ఫ్యాక్టరీ యాజమాన్యానికి, ప్రజల వాంఛలకు వ్యతిరేకంగా దానిలో పని చేసేందుకు ఎవరైనా వెళితే వారి గురించి ఆలోచించాల్సి వుంటుంది. మనల్ని చంపటానికి ఎవరైనా పూనుకున్నపుడు ఆత్మరక్షణ కొరకు అలాంటివారి ప్రాణాలు తీసినా అది నేరం కాదు. తుందుర్రు ఫ్యాక్టరీ కూడా అలాంటిదే అని భావించుతున్నారు నుకనే మూడున్నర సంవత్సరాలుగా అనేక అక్రమ కేసులు, జైళ్లకు వెళ్లటానికి అలవాటు పడ్డారు. లొంగిపోయి అనారోగ్యాలతో ఆ ప్రాంతంలో ఈసురో మంటూ గడిపే కంటే దూరంగా వున్న జైళ్లే నయం కదా ! అంతకంటే పాలకులు ఏం చేస్తారు. లేదా పాలకుల మద్దతు వుంది కనుక యాజమానులు గూండాలను పంపి కొంత మందిని హత్య చేయిస్తారు. వుపాధిపోయి, రోగాలపాలై, నిత్యం బతుకు భయంతో చచ్చే కంటే అది నయం. ఇతర ప్రాంతాలలో అలాంటి ఫ్యాక్టరీలు రాకుండా జనం ముందే మేలుకొనేందుకు ధృవతారలుగా మారతారు.

చంద్రబాబు వైఖరిని అర్ధం చేసుకొని తుందుర్రు ప్రాంతం వారే కాదు, ఆ జిల్లా, యావత్‌ రాష్ట్ర ప్రజలు నిరసన తెలపాల్సిన అవసరం వుంది. నిరంకుశత్వానికి బలి అయిన సందర్భంగా జనం జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ చర్యలను పట్టించుకోని పర్యవసాల గురించి ఒక జర్మన్‌ కవి రాసిన కవితను గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.

వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు

నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికుడిని కాదు కనుక పట్టించుకోలేదు

ఆ తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు కనుక మౌనంగా వున్నారు

తరువాత నా కోసం వచ్చారు

తీరా చూస్తే నా గురించి మాట్లాడేవారు ఎవరూ లేరు

అందువలన తుందుర్రు ఫ్యాక్టరీ వలన మనకేం నష్టం అని ఎవరైనా అనుకుంటే వారి చైతన్యస్ధాయి గురించి విచారపడటం తప్ప చేసేదేమీ లేదు. ప్రతి ప్రాంతంలోనూ ఆక్వా గాకపోతే మరో ఫ్యాక్టరీ తుందుర్రు రూపంలో వస్తుంది. అయ్యో పాపం అనేవారు మిగలరు.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో నీరు, చెట్టు, పేరుతో అధికారపక్షం, వారితో చేతులు కలిపిన శక్తులు దళితుల భూములను తవ్వి మట్టిని డబ్బుగా మార్చుకుంటున్న , భూములను ఆక్రమించుకుంటున్న వుదంతాలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా దేవరాపల్లి, గుంటూరు జిల్లా వేలూరు, గొరిజవోలు ఇలా ప్రతిఘటించిన గ్రామాలే కాదు, వెలుగులోకి రానివి, పెత్తందార్లకు భయపడి చేతులు మూడుచుకొని చేతలుడిగి కూర్చున్నవి చాలా వున్నాయి. తుందుర్రు పక్కనే వున్న గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహం పెట్టటాన్ని వ్యతిరేకించటమే గాక, ఇదేమని ప్రశ్నించిన దళితులపై సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చర్య తీసుకొనేందుకు చంద్రబాబు సర్కార్‌ మీన మేషాలు లెక్కించటమే కాదు, అన్యాయం అన్నవారిని అరెస్టులు చేయిస్తోంది. ఈ వైఖరి ఎలాంటి ‘సంకేతాలు, సందేశాలను ‘ పంపుతోందో తెలుగుదేశం నేతకు తెలియదనుకుంటే పొరపాటు. ఓట్ల జాతర సమయంలో ఐదువేలయినా ఇవ్వగలమని స్వయంగా చంద్రబాబే నంద్యాలలో సెలవిచ్చిన సంగతి తెలిసిందే. నిద్రపోయేవారిని లేపగలం గాని నటించేవారిని లేపటం సాధ్యం కాదు. గరగపర్రు వుదంతం గురించి తాము ఇప్పుడే మేలుకున్నట్లు, మేలుకోగానే తెలిసినట్లు అధికార పార్టీకి చెందిన దళితనేతలు కొత్త పాట పాడుతున్నారు. ఇదే సమయంలో అనేక దళిత సంస్ధలు, వ్యక్తులు ఇంతకాలంగా దళితులను చైతన్య పరిచేందుకు చేసిన యత్నాలు మరోదారి తొక్కాల్సి వుంది. దళితుల సమస్యలను దళితులే పరిష్కరించుకోవాలని, మరొకరు జోక్యం చేసుకోకూడదని, రిజర్వేషన్ల సమస్యపై చీలిపోయి గిరిగీసుకుంటే నష్టపోయేది దళితులే. ఇలాంటి పరిస్ధితులు వున్నాయి గనుకనే గ్రామాలలో పెత్తందారీ శక్తులు చెలరేగుతున్నాయి.

ఇక చంద్రబాబు స్వంత రాష్ట్రం, పొరుగు తెలంగాణా, యావత్తు దేశానికి పంపిన ‘సంకేతాలు, సందేశాలు’ ఎలాంటివో తెలిసిందే. నోట్లతో ఓట్లు, అధికారాన్ని ఎరచూపి ఫిరాయింపులు, ఫిరాయింపు చట్టాన్ని ఎలా వుల్లంఘించవచ్చో మొదలైన ఎన్నో ‘ఆదర్శనీయ’ చర్యలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజి ప్రహసనం ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణ, మహాభారతాలు, పురాణాలు, వేదాలను మించిపోతాయి. నవ్వటానికి జనానికి నోళ్లు చాలవు. తన స్నేహితుల బృందంలో వున్న బ్రూటస్‌ తన హంతకులతో చేతులు కలిపిన వైనాన్ని తెలుసుకొని హతాశుడైన జూలియస్‌ సీజర్‌ యూ టూ బ్రూస్‌ (బ్రూటస్‌ చివరికి నువ్వుకూడా !) అంటాడు. ఇందులేడని అందుకలడని సందేహము వలదు ఎందెందు చూసినా అందందు కలడు చక్రి సర్వోపగతుడున్‌ అన్నట్లు తప్పుడు సంకేతాలు, సందేశాలను పంపటంలో, అన్ని రకాల అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటంలో దేన్నీ వదలలేదని విమర్శకులు చంద్రబాబు నాయుడు గురించి చెబుతారు. అలాంటి పెద్ద మనిషి ప్రాణాంతక తుందుర్రు ఫ్యాక్టరీని తరలిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని సుభాషితం చెప్పటాన్ని చూస్తే కొందరి విశ్వాసం ప్రకారం పైన వున్నాయని చెబుతున్న స్వర్గంలోనో నరకంలోనో వున్న జూలియస్‌ సీజర్‌ చివరికి చంద్రబాబూ నువ్వు కూడా సుభాషితాలు పలుకుతున్నావా అని ఆశ్చర్యపోతాడు.దీని కంటే బ్రూటస్‌ చేసిన ద్రోహం పెద్దది కాదని క్షమించేసి వుంటాడు.