Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే అదే నిజమై కూర్చుంటుంది అన్న నాజీ గోబెల్స్‌ జర్మనీలో అదేపని చేశాడు. వాడి నాయకుడైన హిట్లర్‌ జర్మనీ ఔన్నత్యాన్ని పునరుద్ధరించే పేరుతో జర్మనీలో, ప్రపంచంలో ఎంతటి మారణకాండకు కారకుడయ్యాడో తెలిసిందే. ప్రపంచమంతా అసహ్యించుకోవటంతో జర్మన్లు హిట్లర్‌ పేరును వుచ్చరించటానికే ఇష్టపడరు. చెప్పాల్సి వస్తే ఆ కుక్క అన్నట్లుగా సంబోధిస్తారు. ఇప్పుడు మన దేశంలో కూడా అలాంటి శక్తులు తామరతంపరగా పెరుగుతున్నాయి. వారిని ఎలా సంబోధించాలో వాటి దుష్ఫలితాన్ని అనుభవించబోయే తరాల నిర్ణయానికి వదలివేద్దాం.

ఏ మతాన్ని అవలంభించాలో, మత రహితంగా వుండాలో నిర్ణయించుకొనే హక్కు ఎవరికైనా వుంటుంది. ఇక్కడ పుట్టావుగనుక హిందువుగానే వుండాలనే నిరంకుశ భావం పెరుగుతోంది కనుకనే సమస్య వస్తోంది. సహజంగానే తాము నమ్మిన మతం గొప్పతనం గురించి చెప్పుకోవటానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఇబ్బంది లేదు. తమ మతానికి లేని గొప్పలను ఆపాదించి, ఇతర మతాలను ద్వేషించే వున్మాదానికి గురైతే మాత్రం సహించకూడదు. ప్రపంచంలో అనేక అభూతకల్పనలు, అవాస్తవాలను ప్రచారంలోకి తెచ్చారు. వాటంతటవే పుట్టవు. హిందూ మతం సహనశీలి, హిందువులకు సహనం పుట్టుకతో వస్తుంది అన్నది అలాంటి వాటిలో పెద్దది.

కర్ణాటక వుడిపిలోని పెజావర్‌ మఠాధిపతి శ్రీ విశ్వేష తీర్ధ స్వామీజీ రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు మఠ ప్రాంగణంలో ఇప్తార్‌ విందు ఏర్పాటు, వారి ప్రార్ధనలకు అనుమతివ్వటం మతోన్మాద శక్తులకు మింగుడుపడటం లేదు. అది హిందూమత గొప్పతనానికి చిహ్నం అంటూనే కొందరు ఇతర మతాలకు లేని సహనం మనకెందుకు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి కొందరు మింగలేక కక్క లేక తేలు కుట్టిన దొంగల మాదిరి వున్నారు. వుమ్మెత్త కాయలు తిన్నవారు ఆ చర్య హిందూమతానికి అవమానం అంటున్నారనుకోండి. ముస్లింలను మఠానికి ఆహ్వానించటం, వారికి భోజనం పెట్టటాన్ని ఒక సమస్యగా చేయవద్దని, ఇదేమీ కొత్తగా జరిగింది కాదని ఆ స్వామీజీ తన చర్యను సమర్ధించుకున్నారు. మఠంలో అందరికీ భోజనాలు పెడతారు, ఈసారి ప్రత్యేకతేమంటే నేనే ముస్లింలను ఆహ్వానించాను అని స్పష్టం చేశారు. అన్ని సందర్భాలలో తనకు వారు సహకరించారని, మఠానికి మద్దతుగా నిలిచారని చెప్పారు. భక్తల్‌,గంగావతి వంటి చోట్ల ముస్లింలు తమ ఇండ్లకు తనను ఆహ్వానించటంతో పాటు మసీదుల ప్రారంభానికి పిలిచారని కూడా చెప్పారు. ఆలయ ప్రాంగణంలో ప్రార్ధనలను ఎలా అనుమతించారన్న ప్రశ్నకు ముస్లింలు తమ దేవుడిని ప్రార్ధించేందుకు నమాజ్‌ చేశారు, దానిలో హిందూమతాన్ని కించపరచలేదన్నారు. గొడ్డు మాంసం తినేవారిని ఎలా ఆహ్వానించారన్న ప్రశ్నకు ముస్లింలే కాదు అనేక మంది హిందువులు గొడ్డు మాంసం తినటం లేదా అని ఎదురు ప్రశ్నించి హిందువులైనా ముస్లింలనైనా గొడ్డు మాంసం తినవద్దని శాంతియుత పద్దతులలో ఒప్పించాలని అన్నారు.

ఇతర సందర్భాలలో ముఖ్యంగా దళితుల పట్ల, బ్రాహ్మణులకు ప్రత్యేక పంక్తులు ఏర్పాటు చేసి భోజనాలు పెట్టటం వంటి విషయాలలో పెజావర్‌ మఠనిర్వాహకుల వైఖరిని సమర్ధించకూడదు కానీ ప్రస్తుతం దేశంలో వున్న పరిస్ధితులలో హిందూ మతోన్మాదులు రెచ్చిపోతారని తెలిసి కూడా ఇప్తార్‌ విందు ఇవ్వటం, ప్రాంగణంలో ప్రార్ధనలను అనుమతించటం అభినందనీయమే. ఇదే సమయంలో ఈ చర్యను సమర్ధిస్తున్నట్లు కనిపిస్తూ కొందరు చేస్తున్న వాదనలు, ప్రచారాన్ని ఎండగట్టక తప్పదు.

ముఖం మీదే పచ్చబొట్టు పొడిపించుకొని ప్రదర్శించుకున్నట్లు ఏ మాత్రం సిగ్గుపడకుండా తాము భారతీయ మితవాదులమని రాసుకొనే ‘స్వరాజ్య’ పత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ ఆర్‌ జగన్నాధన్‌ సదరు మఠ స్వామీజీ తానేమిటో, ఎటువైపో తేల్చుకోవాలని సవాల్‌ విసిరారు ‘ కులంతో సహా హిందూయిజంలో అనేక బేధాలున్నాయి. దౌర్జన్యపూర్వక మతమార్పిడి అజెండాలతో వున్న చర్చి, మసీదులతో సహా అనేకం నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నది. వాటిపై కేంద్రీకరించి, హిందూయిజాన్ని అంతర్గతంగా పట్టిష్టపరచటమా లేక తన లౌకికవాదాన్ని ప్రదర్శించేందుకు మసీదులను ప్రారంభించటమో తేల్చుకోవాలి’ అంటూ ఎద్దేవా చేస్తూ తన వ్యాసాన్ని ప్రారంభించారు. ఇస్లాం, క్రైస్తవం ఇతర విశ్వాసాలలోని నిజాన్ని అంగీకరించవని, హిందూమతం దేవుళ్లను నమ్మటాన్ని నమ్మకపోవటాన్ని కూడా అంగీకరించే వుదారత్వం కలిగి వుందని, స్వామీజీ మసీదులకు వెళ్లి భగవద్గీత, వేదాలను చదవటాన్ని అంగీకరిస్తే అది ముస్లిం సమాజపు వుదారత్వానికి చిహ్నం అవుతుందని, ఒక్కరిని అయినా హిందూమతంలోకి మార్చగలిగితే స్వామీజి పెద్ద విజయం సాధించినట్లేనని ఎద్దేవా చేశారు. ఇంకా తన పాండిత్యాన్నంతటినీ ప్రదర్శించి స్వామీజీని హిందూమతావలంబకుల ముందు దోషిగా నిలబెట్టేందుకు చాలా కష్టపడ్డారు.

హిందూ మత పునరుద్ధరణ, దాని పెత్తనాన్ని రుద్దాలనే శక్తులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి. అందుకు సామాజిక మీడియాను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇతర అన్ని వనరులను వాడుకుంటున్నాయి. ఏ మతమైనా సామాన్యులకు దూరమైందంటే దానిలోని తిరోగామి లక్షణాలే కారణం. ఒకవైపు హిందూమత పెత్తన పునరుద్ధరణకు కొందరు పూనుకుంటే దానిలోని తిరోగామి ధోరణులను, కులాల కుంపట్లను సజీవంగా వుంచే ధోరణులు కూడా సమాజంలో పెరుగుతున్నాయి.మన దేశానికే పరిమితం కాకుండా ఏ దేశం వెళితే ఆ దేశానికి కూడా కుల గజ్జి, మతోన్మాదాన్ని తీసుకుపోతున్నారు. ఇంతకాలంగా ఇతర మతాలవారితో సంబంధాలను వ్యతిరేకించిన ఫ్యూడల్‌ శక్తులు ఇప్పుడు కుల, కుటుంబ మర్యాదలను కాపాడే పేరుతో హిందూ మతంలోని అంతర కుల వివాహాలను అంగీకరించటం లేదు. ఎవరైనా ముందడుగేస్తే అలాంటి యువతీ యువకులను అత్యంత కిరాతకంగా చంపివేస్తున్న దుర్మార్గ పరిస్ధితులు నేడున్నాయి. ఒక ముస్లిం, క్రైస్తవుడు మతం మారితే హిందూ మతంలో వారికి ఏ కులాన్ని కేటాయిస్తారు? అన్న చిన్న ప్రశ్నకు ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పటం లేదు. ఇంకా ఇలాంటివే ఎన్నో వున్నాయి.

పెజావర్‌ స్వామీజీ ముస్లింలను మఠానికి పిలిచి వుపవాస దీక్ష విరమణ తరువాత భోజనం లేదా పండ్లు పలహారాలు పెట్టారు. దాన్ని ముస్లింలు ఇప్తార్‌ అంటారు. గొడ్డు మాంసం పెట్టలేదు. హలీం రుచి చూపించలేదు. మఠ ప్రాంగణంలో అల్లా గురించి ప్రార్ధన చేసుకోమన్నారు తప్ప ఖురాన్‌ పఠనం చేయించలేదు. ఈ మాత్రం కూడా సహించని మతోన్మాదులు నిజంగా గొడ్డుమాంసం, ఖురాన్‌ పఠనాన్ని అనుమతిస్తే స్వామీజీని ఏం చేసి వుండేవారో ?

ఇతర మతాలకు లేదని, తమకు మాత్రమే వుదారత్వం వుందని చెప్పుకొనే హిందూత్వ వాదులు దాన్ని రుజువు చేసుకోవాలంటే దేవాలయాల్లో బైబిలు, ఖురాన్‌ పఠనాలను అనుమతించిన తరువాత భగవద్గీత గురించి ఆ మతాల వారికి, ఇతరులకు అడ్డు సవాళ్లు విసరాలి. ఒక మత ప్రార్ధనలు, ప్రవచనాలు మరొక మత కేంద్రం నుంచి చేయటం లేదనే చిన్న సాంకేతికాంశం తప్ప ఆచరణలో జరుగుతున్నదేమిటి ? పొద్దున లేస్తే రాత్రి పొద్దు పోయే వరకు, దేవాలయాలు, మసీదులు, చర్చీల నుంచి చెవులు చిల్లులు పడేలా వినిపించే వాటిని, వీధుల్లో చేసే భజనలు, ఇతర హంగామాలను అన్ని మతాల వారు, మతాలను విశ్వసించని వారు కూడా సహించటం లేదా ? దేవాలయాల నుంచి వినిపించేవి మసీదులు, చర్చీలలో వుండేవారికి వినిపించటం లేదా, వారివి వీరికి వినిపించటం లేదా ? ఈ గోల భరించలేకపోతున్నామని మొత్తుకొనే అన్ని మతాలకు చెందిన రోగులు, చెప్పలేని పసి పిల్లలు, ఇతర సమస్యలున్న వారి గోడు ఏ ప్రార్ధనా స్ధలమైనా, మతమైనా పట్టించుకొంటోందా ? మైకుల సౌండ్‌ తగ్గిస్తోందా ? ఎందుకీ ఆత్మవంచన? ఓట్ల కోసం గతంలో ఒక రాజకీయం నడిస్తే ఇప్పుడు సులభంగా ఓటు బ్యాంకులు ఏర్పాటు చేసుకొనేందుకు మత రాజకీయాలను ముందుకు తెస్తున్నారు తప్ప ప్రస్తుతం జనానికి కావాల్సింది మతమా ? మానవత్వమా, గౌరవప్రదమైన జీవనమా ?

ఇక హిందూమత విశాల, వుదారత్వం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అనేక మంది మన దేశంలో మసీదులు, చర్చిల నిర్మాణాల గురించి చెబుతారు. వాటికి వెళ్లే జనాభా పదుల కోట్లలో వున్నారు. కొన్ని లక్షల మంది హిందువులు నివశించే లేదా పనులకోసం వలస వెళ్లే పశ్చిమాసియా , ఐరోపా, అమెరికాలలో హిందూ దేవాలయాల నిర్మాణాలను అక్కడ కూడా అనుమతిస్తూనే వున్నారుగా అది విశాల, వుదారత్వం కాదా ? http://www.catchnews.com/world-news/west-asia-temples-hindu-1439789867.html బౌద్దమతాన్ని అవలంభించే తూర్పు ఆసియా, ఇస్లాం దేశమైన ఇండోనేషియాలో పురాతన హిందూ దేవాలయాలు ఇప్పటికీ భద్రంగానే వున్నాయిగా ! అది ఆయా దేశాల మెజారిటీ మతాల విశాల వైఖరికి చిహ్నం కాదా ?

ఎంతో విశాలమైనది అని చెప్పుకొనే మన దేశ చరిత్రను చూస్తే అనేక జైన, బౌద్ధ ఆలయాలను శైవ, వైష్ణవ దేవాలయాలుగా మార్చిన విశాల వైఖరి మనకు కనిపిస్తూనే వుంది.మన కళ్ల ముందే బాబరీ మసీదును కూల్చిన వుదారత్వం గురించి చెప్పాల్సిన పనిలేదు.http://bapumraut.blogspot.in/2013/02/how-adi-shankara-destroyed-buddhism-and.html ,
http://rupeenews.com/2010/10/how-adi-shankara-destroyed-buddhism-and-founded-hinduism-in-the-8th-century/  శంకరాచార్యుడు బౌద్దాన్ని నాశనం చేసి హిందూయిజాన్ని ముందుకు తెచ్చిన చరిత్రను విశాల హృదయులైన హిందువులకు వేరుగా చెప్పనవసరం లేదు. ఆ ‘ఘన ‘చరిత్రలను కమ్యూనిస్టులు రాయలేదు.

మానవ సమాజాలు ఎక్కడ వునికిలోకి వస్తే అక్కడ ఆయా కాలాల్లో ఏదో ఒక తత్వశాస్త్రం దానిని అనుసరించి ఏదో ఒక మతం వునికిలోకి వచ్చింది. సామాజిక అభివృద్ధి క్రమంలో ఆదిమ కమ్యూనిజం అంతరించిన తరువాత వునికిలోకి వచ్చిన ప్రతి దోపిడీ వ్యవస్ధ అంతకు ముందున్న వ్యవస్ధ కంటే పురోగామి లక్షణాలతోనే ప్రారంభమైంది. దానితో పాటు ఒక దశలో అది సమాజపురోగతికి ఆటంకమైనపుడు దానిని కూల్చివేసే శక్తులను కూడా అదే వ్యవస్ధ తయారు చేసిందన్నది చరిత్ర చెప్పిన సత్యం. బానిసలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు ఆ కోవకు చెందినవారే. అక్రమంలోనే వునికిలోకి వచ్చిన మతాలు కూడా ఒక దశలో అవి సమాజ పురోగతికి అడ్డుపడినపుడు వాటిపై తిరుగుబాటుగా కొత్త తత్వశాస్త్రాలు వాటికి అనుగుణంగా చిన్నవో పెద్దవో కొత్త మతాలు వచ్చాయి. అనేక మతాలు ప్రారంభమైన చోట అంతరించి కొత్త చోట్ల మెజారిటీ మతాలుగా మారాయి. కొన్ని ప్రాంతాలలో అంతరించాయి, పరిమితంగా మారాయి. యూదు మతంపై తిరుగుబాటుగా క్రైస్తవం, క్రైస్తవంలోనే అంతర్గతంగా ప్రొటెస్టెంట్‌ వంటి కొన్ని అంశాలపై ఏకీభవించే శాఖలు, మొత్తంగా క్రైస్తవంపై తిరుగుబాటుగా ఇస్లాం వునికిలోకి వచ్చింది. కొత్త మతాలన్నీ పాతమతాలతో ఘర్షణ పడ్డాయి. ఒకదానినొకటి అంతం చేసుకొనేందుకు ప్రయత్నించాయి. అయితే ఇవి అన్ని చోట్లా ఒకే విధంగా జరగలేదు.

మన దేశంలో కూడా మత చరిత్ర అదే చెబుతోంది. క్రైస్తవానికి ఏసు క్రీస్తు-బైబిల్‌, ఇస్లాముకు మహమ్మద్‌ ప్రవక్త-ఖురాన్‌ మాదిరి హిందూ మతం అని పిలుస్తున్నదానికి ఆద్యుడునదగిన పేరు గాని, నిర్ధిష్ట గ్రంధంగానీ లేదు. వేదాలు, వుపనిషత్తులు, రామాయణ, మహాభాగవతాల వంటివెన్నింటినో హిందూ మత గ్రంధాలుగా చెబుతున్నారు. వేదాలను ప్రమాణంగా పరిగణించిన వేదమతం, తరువాత వునికిలోకి వచ్చిన జైన, బౌద్ధ మతాలు, వాటిలో శాఖోపశాఖలు, వాటి మధ్య జరిగిన ఘర్షణలు, రక్తపాత చరిత్రను చూస్తే ఈనాడు చెబుతున్న హిందూమతం పరమతాలను సహించిన వుదారవాది అన్నది వాస్తవం కాదన్నది స్పష్టం. క్రీస్తుశకం 788లో పుట్టి 820లో మరణించారని చరిత్ర చెబుతున్న శంకరాచార్య గురించి కంచి మఠ వెబ్‌ సైట్‌ పేజీలలో ఫ్రొఫెసర్‌ పి సూర్యనారాయణ తన వ్యాసంలో ఇలా రాశారు. ఆయనేమీ విదేశీయుడు కాదు, కమ్యూనిస్టు అంతకంటే కాదు. ‘వేద మతం మరియు తత్వశాస్త్రం,దేవుడు, ఆత్మలను వ్యతిరేకించిన తిరుగుబాటు బిడ్డే బుద్ధిజం. వేదాల ఆలోచన మూలాలకే అది గొడ్డలిపెట్టుగా తయారై దాని వునికికే పెద్ద ప్రమాదకారిగా మారింది. ఈ దాడిని వీలైనపుడల్లా ఎదుర్కొని కట్టడి చేయటం వల్లనేే బుద్ధిజం ఇతర ప్రాంతాలలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఈ ఖ్యాతి ప్రాధమికంగా మీమాంసక, కుమారిల భట్టులకు చెందాలి. దానికి కారణం శ్రీ శంకరాచార్య తార్కిక పద్దతి, తిరుగులేని వాదనలు, అవి వేద మత వారసుల మనస్సులను ఆకట్టుకొని వూగిసలాటలను పోగొట్టాయి.’ మన దేశంలో బౌద్దాన్ని నాశనం చేయటంలో శంకరాచార్య బోధనలను అనుసరించిన వారితో పాటు అదే సమయంలో మన దేశంపై దండయాత్రలు చేసిన ముస్లిం పాలకులు కూడా బౌద్ధంపై దాడి చేశారన్నది ఒక అభిప్రాయం. శైవుడైన బెంగాల్‌ రాజు శశాంకుడు బౌద్దాన్ని నాశనం చేయటంలో భాగంగా బుద్ద గయలోని బోధి చెట్టును కొట్టి వేయించాడని, అనేక బౌద్దారామాలను ధ్వంసం చేయించటంతో పాటు చివరి బౌద్ద రాజును హత్య చేయించాడని కూడా చరిత్రలో వుంది.

ముస్లిం దండయాత్రలకు ముందు మన దేశంలో శివ, వైష్ణవ మతాలను అవలంభించిన రాజులు, వారు రెచ్చగొట్టిన మతోన్మాదం, జరిగిన రక్తపాత చరిత్ర దాస్తే దాగని సత్యం. అశోకుడు బౌద్ద మతాన్ని అనుసరించాడు కనుక ఆయన కాలంలో బౌద్ద పరిఢవిల్లింది, విదేశాలకూ వ్యాపించింది. ఇప్పుడు ఇస్లామిక్‌ దేశంగా వున్న ఇండోనేషియాలో, బౌద్ధమతం అవలంభించే ధాయ్‌లాండ్‌ వంటి దేశాలలో ఇప్పటికీ హిందూ పురాణాలు, ఇతి హాసాలలో కనిపించే పేర్లను పెట్టుకోవటం చూస్తున్నాం. ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో(సుకర్ణుడు) ఆయన ఒక భార్య పేరు పట్మావతి(పద్మావతి) కుమార్తె పేరు మేఘావతి పుత్రి కూడా దేశాధ్యక్షురాలిగా పని చేశారు. ఇది విశాల దృక్పధమా, సంకుచితమా ?

మన దేశంపై ముస్లింలకు ముందు ఇతర దేశాల నుంచి వచ్చిన వారి దండయాత్రలు జరిగాయి. ఒక దేశంపై మరొక పెద్ద రాజ్యం దండయాత్రలు చేయటం రాజరిక లక్షణాలలో ఒకటిగా పరిగణించటమే కాదు, మహా సామ్రాజ్యాలను నెలకొల్పటం గొప్పగా భావించిన చరిత్ర ప్రపంచమంతటా కనిపిస్తుంది. ముస్లిం దండయాత్రలు, తరువాత వారి స్ధానాన్ని ఆక్రమించిన ఆంగ్లేయుల పాలనలో వారి మతాలైన ఇస్లాం, క్రైస్తవాన్ని వ్యాపింప చేసేందుకు ప్రయత్నం జరిగింది. హిందూ మతాలను అవలంభించే రాజులు తమ రాజ్యాలను కాపాడుకొనేందుకే ప్రాధాన్యత ఇచ్చారు గనుక కాల క్రమంలో ఇస్లాం, క్రైస్తవ మతాల ధాటిని తట్టుకోవటానికి శైవులు, వైష్ణవులు అందరూ రాజీపడ్డారు. ఈ మతాలకు మూలమైన మనువాదం సమాజాన్ని కులాల వారీగా చీల్చటమే గాక గణనీయ సంఖ్యలో వున్న అణగారిన వర్గాలను అంటరాని వారిగా మార్చి గ్రామాలకు దూరంగా పంపింది. అలాంటి సామాజిక అణచివేత పీడితులు అనేక మంది ఇస్లాం, క్రైస్తవ మతాలను ఆశ్రయించి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించారు. ఇలాంటి పరిణామం ఎంతో విశాలమైదని చెప్పుకొనే హిందూ మతం వ్యాపించిన మన దేశంలో తప్ప మరెక్కడా కనపడదు.

ప్రలోభాలు పెట్టి క్రైస్తవం మతమార్పిడులు చేయించిందని అనేక మంది గుండెలు బాదుకొనే వారు అంటరానితనం గురించి మాట్లాడరు. ఇప్పటికీ దానిని పాటిస్తూనే వున్నారు. తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో సామాన్య దళితులతో పాటు అగ్రవర్ణాలుగా పరిగణించబడే వారు కూడా క్రైస్తవ మతంలోకి మారారు. నిజానికి వారికి సామాజిక అణచివేత లేదా అంటరానితనం సమస్య లేదు. వారెందుకు మారినట్లు ? ఎలాంటి మార్పు లేకుండా, అన్నీ వేదాల్లోనే వున్నాయష అని చెప్పేవారి ప్రభావానికిలోనై నూతన ఆవిష్కరణలకు దూరమైన వారు ఆంగ్ల విద్య, పారిశ్రామిక విప్లవ ఫలాలను చూసి క్రైస్తవ మతం, అది ఏర్పాటు చేసిన ఆధునిక విద్యా సంస్ధలకు ఆకర్షితులయ్యారు. అనేక ప్రాంతాలలో క్రైస్తవ విద్యా సంస్ధల పేరుతో ప్రఖ్యాతి గాంచిన వన్నీ వారి వారసులు ఏర్పాటు చేసినవే. అంటే ఆ మార్పిడి ద్వారా కూడా ఆర్దికంగా లబ్దిపొందవచ్చని గ్రహించటం తప్ప మరొకటి కాదు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవమతంలోని ప్రధాన అధికారులుగా అగ్రవర్ణాలనుంచి మతం మారిన వారే కనిపిస్తారు. వారి వివాహాలు కూడా అదే తరగతులకు చెందిన వారి మధ్య జరుగుతాయి.

హిందూమతం గత ఘనతను చూడండి, దాన్ని పునరుద్దరించండి అంటూ మతరాజకీయాలు చేయటంలో భాగంగానే పెజావర్‌ మఠ స్వామిని కొందరు విమర్శించుతున్నారు.హిందూమతానికి లేని విశాల దృక్పధాన్ని ఆపాదిస్తున్నారు.ఆత్మవంచన, పరవంచనకు పాల్పడుతున్నారు.