Tags
Acharya Vinoba Bhave, bjp cow politics, cow goondas, cow protectors, gandhi good words, Mahatma Gandhi, Narendra Modi, narendra modi cock and bull stories
నరేంద్రమోడీ చెప్పిన సరికొత్త ఆవు పశ్చాత్తాప కథ మా దొరగారి పొలంలో పండే మిరియాలు తాటి కాయలంతుంటాయి బాబయ్యా అని చెప్పినట్లుగా వుంది.
ఎం కోటేశ్వరరావు
భూమ్మీద మే నెలలో మాత్రమే పుష్పించే మొక్కలున్నాయి. అందుకే వాటిని వాడుక భాషలో మే పుష్పాలు అన్నారు. అది ప్రకృతి ధర్మం. మన ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడు నోరు విప్పుతారో తెలియదు.దీన్ని వికృతి ధర్మం అనవచ్చా. ఏ గొప్ప సందేశమిచ్చారన్నదానితో నిమిత్తం లేకుండా తాము నమ్మే మౌన బాబా నోరు విప్పటమే భక్తులకు పరమానందం. నరేంద్రమోడీ కూడా భక్తులకు అలాంటి అనూహ్య సందేశం వినిపించారు. తిరిగి ఎపుడు నోరు విప్పుతారో తెలియదు. ఆయన నోటి ముత్యాల కోసం దేశం యావత్తూ ఎదురు చూడాల్సిందే తప్పదు మరి !
గతేడాది అంటే 2016 ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని అమెరికా నేతలను అనుకరిస్తూ కొత్తగా ప్రారంభించిన ‘టౌన్ హాల్ ‘ కార్యక్రమంలో మాట్లాడుతూ (తరువాత అలాంటి కార్యక్రమాలు జరిగినట్లు, మాట్లాడినట్లు వార్తలేమీ లేవు) గో రక్షణ పేరుతో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నవారిపై రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కోరారు.( ఒక్క రాష్ట్రమైనా ప్రధాని వినతిని పట్టించుకొని తీసుకున్న చర్యల గురించి తెలిసిన వారు ఎవరైనా వివరాలు అంద చేయాలని మనవి) ‘ గో రక్షణ వ్యాపారానికి పూనుకున్న వారిని చూసి నాకు తీవ్ర కోపం వస్తోంది. గో భక్తి వేరు, గో రక్షణ వేరు. పగలు గో రక్షకుల ముసుగులు వేసుకొని రాత్రంతా నేరాలు చేస్తున్న కొంత మందిని నేను చూశాను. గో రక్షకుల అవతారమెత్తిన వారిలో 70-80శాతం మంది సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, వారి తప్పులను కప్పి పుచ్చుకొనేందుకు గో రక్షకులుగా నటిస్తున్నారు. వారు నిజమైన రక్షకులైతే అత్యధిక ఆవులు ప్లాస్టిక్ కారణంగా మరణిస్తున్నాయి తప్ప వధించటం వలన కాదని తెలుసుకోవాలి. ఆవులు ప్లాస్టిక్‌ను తినకుండా వారు నిరోధించాలి.’ అని ఎంతో స్పష్టంగా చెప్పారు. తన స్వంత రాష్ట్రమైన గుజరాత్లో ఒక చచ్చిన ఆవుతోలు తీసినందుకు నలుగురు దళితులపై జరిపిన దాడిపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లడైన పూర్వరంగంలో వారిని బుజ్జగించే యత్నంలో భాగంగా ప్రధాని నోటి వెంట ఆ సుభాషితాలు వెలువడ్డాయి.
ఆ తరువాత మోడీ చెప్పినట్లు గో రక్షకుల ముసుగులో వున్న వారి ఆగడాలు ఆగలేదు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి నిత్యకృత్యంగా మారాయి. ఎప్పుడు, ఎక్కడేం జరుగుతుందో తెలియదు. తరువాత జూన్ 29 గురువారం నాడు రెండు రోజుల గుజరాత్ పర్యటనలో మరోసారి నోరు విప్పి ‘ఆవు పేరుతో చేసే హత్యలను మహాత్మా గాంధీ అంగీకరించరు, అవి ఆయన సిద్దాంతాలకు వ్యతిరేకం ‘ అని సెలవిచ్చారు. రంజాన్ సందర్భంగా వస్తువులను కొనుగోలు చేసి దేశ రాజధాని ఢిల్లీ నుంచి రైలులో హర్యానాలోని స్వగ్రామానికి ప్రయాణిస్తున్న ముస్లిం కుటుంబంపై ముస్లిం వ్యతిరేక వున్మాదులు దాడి చేసి వారిని కొట్టి రైలులో నుంచి తోసివేసిన దుర్మార్గ వుదంతంలో పదిహేనేండ్ల ఒక యువకుడు మరణించిన విషయం తెలిసిందే. దానికి నిరసనగా దేశ వ్యాపితంగా అనేక నగరాలలో తీవ్ర నిరసన ప్రదర్శనలు వ్యక్తమైన ఒక రోజు తరువాత నరేంద్రమోడీ నోరు విప్పారు. అంటే తీవ్ర ఘటనలు, వాటిపై వ్యతిరేకత వ్యక్తమై అధికారపక్షం గబ్బు పట్టే పరిస్ధితులు తలెత్తినపుడే ప్రధాని నోరు విప్పుతారన్నది స్పష్టమైంది. అంతకు ముందే జరిపిన విదేశీ పర్యటన వార్తల కంటే ఎక్కువగా నిరసన ప్రదర్శనల గురించి అంతర్జాతీయ మీడియా స్పందించిన తీరు కూడా నరేంద్రమోడీని కలవరపరచి వుంటుంది.
‘ గోరక్షణ, గో ఆరాధన గురించి మహాత్మాగాంధీ, వినోభా భావే కొన్ని విషయాలు చెప్పారు. అవెలా చేయాలో వారు మనకు చూపారు.దేశానికి, ప్రగతికి అది మార్గం. గో భక్తి పేరుతో జనాన్ని చంపటం ఆమోదయోగ్యం కాదు, మనకు వినోభా భావే జీవితం అలాంటి సందేశం ఇవ్వదు. ఒకసారి వినోభానే కలిసే అదృష్టం నాకు కలిగింది. ఆయన నన్ను చూసి మరణించు, మరణించు అన్నారు. ఇదేమిటి ఇలా అంటారు అని దిగ్భ్రాంతి చెందాను. ఆవు కోసం మరణించు అని ఆ తరువాత ఆయనే చెప్పారు.మా గ్రామంలో నా చిన్నతనంలో ఒక ఆవు ప్రమాదవశాత్తూ ఐదు సంవత్సరాల బాలుడిని చంపింది. తరువాత అది మేతమేయటం మానుకొని ఆ బాలుడి తలిదండ్రుల ఇంటి ముందే పశ్చాత్తాపంతో మరణించింది. http://indianexpress.com/article/india/killing-in-name-of-cow-unacceptable-its-not-something-mahatma-gandhi-would-approve-pm-modi-4728580/ గాంధీ గురువుగా తెలిసిన జైన ఆధ్యాత్మికవేత్త శ్రీమద్ రాజచంద్ర 150వ జయంతి,ఆశ్రమ శతవార్షికోత్సవం జరుగుతున్నది, ఈ సందర్భంగా ఒకటి చెప్పదలచుకున్నాను, మనది అహింసాత్మక భూమి, మహాత్మాగాంధీ పుట్టిన నేల, ఏ సమస్యను కూడా ఎన్నడూ హింస పరిష్కరించజాలదు.నేను సబర్మతి ఆశ్రమంలో వున్నాను, ప్రస్తుతం దేశంలో వున్న పరిస్ధితి గురించి నా ఆగ్రహం, విచారం, బాధను వ్యక్తం చేయదలచుకున్నాను. చీమలకు కూడా తినబెట్టాలని నమ్మేదేశం మనది, వుదయమే చెరువుల దగ్గరకు వెళ్లి చేపలకు మేత వేసేటువంటి సంస్కృతి కలిగినట్టి ఒక దేశం, దానిలో మహాత్ముడు మనకు అహింస గురించి పాఠాలు చెప్పారు. అలాంటిది ఏమైంది మనకు ? విఫలమైన ఆపరేషన్ కారణంగా రోగి మరణిస్తే బంధువులు ఆసుపత్రులను తగులబెడుతున్నారు. ప్రమాదమంటే ప్రమాదమే. ప్రమాదాలలో ఎవరైనా మరణించినా లేక గాయపడినా జనం వచ్చి వాహనాలను తగులబెడుతున్నారు. మనమందరం కలసి కట్టుగా పని చేయాలి, గాంధీ కలలను నిజం చేయాలి. మన స్వాతంత్య్ర సమర యోధులు గర్వపడేట్లు చేయాలి.’ అని నరేంద్రమోడీ తన సందేశంలో చెప్పారు.
మోడీగారి ఈ మాటలు విన్న, చదివిన తరువాత చెవుల్లో పూలేమన్నా మొలిచాయా అని ఎవరైనా తడిమి చూసుకోవాల్సి వుంటుంది. ఆవు పేరుతో జరిగే హత్యలను మహాత్మాగాంధీ సహించరు అని నరేంద్రమోడీ ఎవరికి చెబుతున్నట్లు ? గాంధీ పేరు చెప్పుకొని ఎవరైనా అలాంటి దుర్మార్గానికి పాల్పడుతుంటే అలా చెబితే అర్ధం వుంటుంది. సాధు జంతువైన ఆవు రక్షణ పేరుతో చెలరేగుతున్న సాయుధ వున్మాదులకు ఆవు కోసం చంపు,చంపు అన్నవి తప్ప చావు, చావు అన్నవి రుచిస్తాయా ? అయినా విపరీతం గాకపోతే ఆవు కోసం మరణించటం ఏమిటి? సంఘపరివార్ లేదా అది ఏర్పాటు చేసిన ప్రత్యక్ష బిజెపి వంటి రాజకీయ పార్టీలు, సంస్ధలు లేదా పరోక్షంగా వేరే ముసుగులతో పని చేస్తున్న సంస్ధల వారు గానీ ఇంతవరకు గాంధీని జాతిపితగా గుర్తించలేదు. ప్రధాని నరేంద్రమోడీ- బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ద్వయపు శరీరాలు వేరు తప్ప ఆత్మలు, ఆలోచనలు ఒక్కటే అని అందరికీ తెలుసు. అలాంటి ఒక ఆత్మ అయిన అమిత్ షా మహాత్ముడిని ఒక చతురుడైన కోమటిగా వర్ణించటాన్ని తన మౌనం ద్వారా మరో ఆత్మ అయిన నరేంద్రమోడీ సమర్ధించారు. అదే పెద్దమనిషి ఆవు పేరుతో జరిగే వాటిని మహాత్ముడు అంగీకరించడు అంటున్నారు. ఇలాంటివి ఆత్మను చంపుకొని లేదా వంచనలో భాగంగా మాట్లాడేవి తప్ప మరొకటి కాదు. హిందూ-ముస్లిం మతసామరస్యతను దెబ్బతీయటమే పరమ ధర్మంగా పెట్టుకున్న పరివార సంతతి సామరస్యత కోసం తన ప్రాణాలనే బలి ఇచ్చిన ఆయన కలలను నిజం చేయాలి అని చెబితే చెవుల్లో పూలు పెట్టుకున్నవారు తప్ప అన్యులెవరూ ఆవగింజంతైనా విలువ ఇవ్వరు. అమిత్ షా నాయకత్వంలోని బిజెపి అనుయాయులు, ఆర్ఎస్ఎస్లో కొంతకాలం పని చేసి ఆ మహాత్ముడిన చంపిన గాడ్సేకు గుడులు, గోపురాలు కట్టాలంటూ కీర్తిస్తున్న శక్తుల చెవులకు అవి ఇంపుగా వుంటాయా ? ఎందుకీ రెండు నాలుకల వైఖరీ, ఎందుకీ వంచన ? మనుషులను చంపితేనే వురి శిక్షలు వద్దని సభ్య సమాజం ఒకవైపు కోరుతుంటే ఆవును చంపిన వారిని వురితీసే విధంగా చట్టాలను సవరించాలని బిజెపి, దాని ప్రత్యక్ష, పరోక్ష అనుబంధ సంఘాల వారు చెలరేగుతున్న స్ధితి. అరవై ఆరు సంవత్సరాల నరేంద్రమోడీ, 87 సంవత్సరాల వయస్సులో 1982లో మరణించిన వినోభావేను ఎప్పుడు, ఎక్కడ కలిశారో, ఈయనను చూసి అవు కోసం చావు చావు అని తన మౌనవ్రతం వీడి ఆయనెందుకు చెప్పారో, దానిలో అంత సుగుణం ఏమి వుందని ఆవుకోసం హత్యలకు సైతం వెనకాడని వున్మాదం ప్రబలిన స్ధితిలో మోడీ ఎందుకు ప్రత్యేకించి చెప్పారో అని ఆలోచిస్తే అనేక కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మహాత్ము డు ఆవు గురించి ఏం చెప్పినా గొడ్డు మాంస నిషేధం గురించి చెప్పలేదు.https://thewire.in/12170/what-mahatma-gandhi-said-to-those-who-wanted-beef-banned-in-india/ పశు విక్రయాలపై కేంద్రం చేసిన నిర్ణయం పరోక్షంగా గొడ్డు మాంసాన్ని నిషేధించే దిశగా వుంది తప్ప వేరొకటి కాదు. ‘ఎవరికి వారికి బుద్ధి పుట్టకుండా ఆవును చంప వద్దని నేను బలవంతం ఎలా చేయగలను ? దేశంలో హిందువులు మాత్రమే లేరు. ముస్లింలు, పార్సీలు, క్రిస్టియన్లు, ఇతర మతాల వారు వున్నారు’ అని చెప్పారు. అయినప్పటికీ దేశంలో బిజెపి నేతలు గొడ్డు మాంసానికి వ్యతిరేకంగా మాట్లాడటం, రెచ్చగొట్టటాన్ని గాంధీ అంగీకరిస్తారా ? గాంధీని పొగుడుతూ అపహాస్యం చేయటమే ఇది. ఇక వినోభా భావే గో రక్షణ గురించి చెప్పారు తప్ప అందుకోసం చావు లేదా చంపు అన్న తీవ్రవాది మాదిరిగా మాట్లాడినట్లు, రాసినట్లు ఇంటర్నెట్లో నాకు దొరకలేదు. ఎవరైనా వాటి గురించి శోధించి చెప్పవచ్చు. తమ బుర్రల్లో వున్నవాటిని ఇతరుల పేర్లతో ప్రచారం చేస్తున్న వర్తమానంలో నరేంద్రమోడీ ఒక ప్రధానిగా వుంటూ తననెప్పుడో ఆవు కోసం ప్రాణాలిమ్మని కోరినట్లు చెప్పటం గో రక్షణ పేరుతో చెలరేగుతున్నవారికి రివర్సులో అర్ధమై ప్రాణాలు ఇవ్వటానికి బదులు ప్రాణాలు తీయమని మరింత ప్రోత్సాహమిస్తుంది తప్ప వారిని దాడుల నుంచి, హత్యలు చేయటం నుంచి వెనక్కు మరల్చదు.
నరేంద్రమోడీ చెప్పిన సరికొత్త ఆవు పశ్చాత్తాప కథ మా దొరగారి పొలంలో పండే మిరియాలు తాటి కాయలంతుంటాయి బాబయ్యా అని చెప్పినట్లుగా వుంది. ఆవులు, ఎద్దులు, దున్నలు, గేదెలు(బర్రెలు) కొన్ని సందర్భాలలో వాటి దగ్గరకు వెళ్లిన మనుషులను పొడుస్తాయి, తంతాయి. గాయాలు తీవ్రమైనవి లేదా ఆయువు పట్టులో తగిలితే ఎవరైనా మరణించ వచ్చు. ఆవుకు లేని లక్షణాలను ఆపాదించే వారి కోవలో భాగంగా మోడీ ఈ కథను వినిపించారన్నది స్పష్టం. బహుశా గుజరాత్ గోవులకు అంతటి మహత్తర గుణం వుందనుకుందాం. మోడీ చెప్పారు కనుక ‘పక్కా నిజం’ కూడా అయి వుంటుందనుకుందాం. గోధ్రా రైలు ఘటన అనంతరం జరిగిన ముస్లింల వూచకోతలో పాల్గొన్నవారు మోడీ గారి వూరి ఆవు మాదిరి ఆప్తులను కోల్పోయిన వారి ఇళ్ల ముందు తిండి మానుకొని మరణించకపోయినా కనీసం మోడీతో సహా ఒక్కరంటే ఒక్కరు కూడా పశ్చాత్తాపం తెలిపిన వుదంతం మనకు కనపడదు. మెదడు అంతగా ఎదగని, తింటున్నది ప్లాస్టిక్కో కాదో కూడా తెలియని ఆవు పశ్చాత్తాప గుణం మెదడు బాగా ఎదిగిన వారిలో మృగ్యమైంది. సిగ్గు పడాల్సిన విషయం కదా ! ప్రపంచంలో రెండో పెద్ద దేశానికి ప్రధానిగా వున్న ఒక వ్యక్తి ఇలాంటి కాకమ్మ కథలు వినిపిస్తున్నారంటే ప్రపంచంలో మన పరువేంగాను? ఇప్పటికే కొన్ని వేల సంవత్సరాల నాడే ఎలాంటి పెట్రోలు లేకుండా, పైకీ కిందికీ, వెనక్కు ముందుకు ఎటు కావాలంటే అటు, ఎంత మంది ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే విమానాలను భారతీయులు తయారు చేశారని, టెస్ట్ ట్యూబ్ బేబీలను మహాభారత కాలంలోనే పుట్టించారని, మనిషికి ఎనుగు తలను అతికించి ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ చేశారని, ఇవన్నీ సంస్కృత గ్రంధాలు,వేదాలలో వున్నాయని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పుకుంటుంటే విదేశాల్లో భారతీయలు తలెత్తుకోలేకుండా వున్నారు. ఇప్పుడు మోడీ వాటికి మరో ఆవు కథను తోడు చేశారు.
ఒకవైపు నరేంద్రమోడీ ఆవు పశ్చాత్తాప కథలు, గోవు పేరుతో హత్యలను గాంధీ సహించరని చెబుతున్న సమయంలోనే బిజెపి పాలిత రాష్ట్రమైన ఝర్ఖండ్‌లో ఒక ముస్లిం ఒక వాహనంలో నిషేధిత గొడ్డు మాంసాన్ని తరలిస్తున్నాడంటూ ఒక గుంపు దాడి చేసి చచ్చేట్లు కొట్టటమే గాక ఆ వాహనాన్ని కూడా తగుల బెట్టారు. అంతకు ముందు ఒక ముస్లిం ఇంటి ముందు ఆవు తల కనిపించిందంటూ అతడిపై దాడి చేయటమే గాక ఆ ఇంటిని గో గూండాలు తగుల బెట్టారు. ఆవు పేరుతో ముస్లింలు, దళితులను ఏం చేసినా తమనేం చేసే వారుండరనే భరోసా పెరగటమే ఇలాంటి దుర్మార్గులు రెచ్చిపోవటానికి కారణం. గత మూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రులతో సహా బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, వారి అనుయాయుల చర్యలకు, నరేంద్రమోడీ సుభాషితాలకు ఎక్కడా పొంతన కుదరటం లేదు.https://thewire.in/152839/modi-cow-violence-gap-words-bjps-deeds/
గత ఏడు సంవత్సరాలలో (2010-17జూన్ 25వరకు) దేశంలో జరిగిన పశు సంబంధ హింసాకాండలో 51శాతం ముస్లింలే లక్ష్యంగా జరిగాయని ఇండియా స్పెండ్ విశ్లేషణ తెలిపింది. అరవై మూడు సంఘటనలలో28 మంది మరణించగా 124 మంది గాయపడ్డారు, మరణించిన వారిలో ముస్లింలు 86శాతం వున్నారు.ఈ మొత్తం వుదంతాలలో నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక జరిగినవి 97శాతం వున్నాయి. ఎనిమిది సంవత్సరాలలో 63 జరగ్గా 2014-17లో 61 వున్నాయి, 2016లో 25 జరగ్గా, ఈ ఏడాది ఆరునెలల్లోనే 20 జరిగాయి. అరవై మూడు సంఘటనల్లో 32 బిజెపి పాలిత రాష్ట్రాలలో జరిగాయి. యాభై రెండు శాతం దాడులకు పుకార్లే ప్రాతిపదిక. 2016 మొత్తంలో నమోదైన ఘటనల సంఖ్యలో 2017 తొలి ఆరునెలల్లోనే 75శాతం జరిగాయని ఆ విశ్లేషణ తెలిపింది. ఇదంతా గతేడాది ఆగస్టులో నాకు కోపం వస్తోంది, చర్యలు తీసుకోండంటూ గో గూండాలపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత నెలకొన్న పరిస్ధితి ఇది. గో గూండాయిజం ఘటనలు వుత్తర ప్రదేశ్‌లో 10, హర్యానా 9, గుజరాత్ 6, కర్ణాటక 6, మధ్య ప్రదేశ్, రాజస్ధాన్, ఢిల్లీలలో నాలుగేసి చొప్పున జరిగాయి. దక్షిణాది, బెంగాల్, ఒడిషాతో సహా ఈశాన్య రాష్ట్రాలలో 13 సంఘటనలు జరిగితే ఒక్క కర్ణాటకలోనే ఆరున్నాయి.63 వుదంతాలలో 32 బిజెపి పాలిత రాష్ట్రాలలో జరగ్గా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎనిమిది, మిగతావి ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలలో జరిగాయి.
ఇండియా స్పెండ్ విశ్లేషణలోని మిగతా వివరాల ప్రకారం జరిగిన ఘటనలలో 50.8శాతం ముస్లింలు లక్ష్యంగా జరిగితే 7.9శాతం దళితులు, 4.8శాతం సిక్కులు లేదా హిందువులు, 1.6శాతం క్రైస్తవుల లక్ష్యంగా జరిగాయి. 20.6శాతం కేసులలో మతం ఏమిటో పేర్కొనలేదు. మన శిక్షా స్మృతిలో గుంపులు చేసే లించింగ్ అంటే చిత్రవధ చేయటం లేదా విచారణ లేకుండా చంపటం, చంపించటం అనే అంశాల ప్రస్తావన లేదు. ఐదుశాతం వుదంతాలలో దాడి చేసిన వారి అరెస్టుల వివరాలు లేవు, 21శాతం కేసులలో దాడులకు పాల్పడిన వారితో పాటు బాధితులపై కూడా కేసులు నమోదు చేశారు. 36శాతం కేసులలో గుంపులుగా పాల్గొన్న వారు భజరంగదళ్, విశ్వహిందూపరిషత్ లేదా స్ధానిక గోరక్షణ దళాల పేరుతో వున్నవారే వున్నారు.
హింసాకాండ తీరు తెన్నులు ఎలా వున్నాయంటే, 2012 జూన్ 10 పంజాబ్‌లోని జోగా పట్టణంలోని ఒక ఫ్యాక్టరీ సమీపంలో 25 ఆవు కళేబరాలు కనిపించాయి. విశ్వహిందూ పరిషత్, గోశాల సంఘాల నాయకత్వంలో ఒక గుంపు ఆ ఫ్యాక్టరీలో ప్రవేశించి దానిని ధ్వంసం చేశారు. ఆ ఫ్యాక్టరీని నడుపుతున్నవారిలో ఇద్దరి ఇండ్లను తగుల బెట్టారు, ఈ వుదంతంలో నలుగురు గాయపడ్డారు. గతేడాది ఆగస్టులో గొడ్డు మాంసం తింటున్నారనే పేరుతో హర్యానాలోని మేవాట్‌లో ఒక మహిళ, 14 ఏండ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టటంతో పాటు ఇద్దరు బంధువులను హత్య చేశారు.
ఈ పూర్వరంగంలో నరేంద్రమోడీ చెప్పిన సుభాషితాలు, కట్టుకథలు, పిట్ట కథలు ఇంటా బయటా వెల్లువెత్తుతున్న విమర్శలను తప్పించుకోవటానికి తప్ప నిజంగా దోషులను అదుపు చేసేందుకు కాదన్నది స్పష్టం. ఢిల్లీ నుంచి హర్యానా వెళ్లే రైలులో ముస్లిం కుటుంబంపై దాడి చేసి వారిని రైలు నుంచి తోసివేసిన వున్మాద చర్యలో ఒక యువకుడు మరణించిన వుదంతంపై అనేక చోట్ల ‘నాట్ ఇన్ మై నేమ్ ‘పేరుతో జరిగిన నిరసన ప్రదర్శనలలో అనేక సంస్ధలు, పార్టీలకు చెందిన వారు పాల్గొన్నారు. నిజంగా ఆ వుదంతాన్ని బిజెపి ఖండిస్తున్నట్లయితే వారు కూడా వాటిలో పాల్గొని తమ వైఖరిని వెల్లడించి వుండాల్సింది. కానీ అందుకు భిన్నంగా రైలులో కూర్చునే దగ్గర తలెత్తిన గొడవలో ఆ యువకుడు మరణించాడని బిజెపి చెప్పింది, నిరసనలలో పాల్గొన్నవారంతా నరేంద్రమోడీ వ్యతిరేకులని ఆరోపించింది. రైళ్లలో సీట్ల దగ్గర గొడవలు జరగటం మన దేశంలో సర్వసామాన్యమే. అవి దాడులు, హత్యలు, రైళ్ల నుంచి తోసివేయటానికి దారితీస్తే ప్రతి రోజూ ప్రతి సాధారణ ప్రయాణీకుల రైళ్లలో అలాంటి వుదంతాలు అసంఖ్యాకంగా నమోదయ్యేవి. సమస్య తీవ్రతను, దేశంలో పెంచుతున్న ముస్లిం వ్యతిరేకత తీవ్రతను తగ్గించటానికి ‘సీటు దగ్గర గొడవని’ పోలీసులు, ఇతరులు సృష్టించిన కట్టుకధ తప్ప మరొకటి కాదు. ఢిల్లీ, హర్యానా, వుత్తర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు రైల్వే పోలీసులు కూడా బిజెపి పాలిత అధికార యంత్రాంగం కింద పని చేసే వారే. ఆ దాడికి పాల్పడ్డ నిందితులెవరో, వారిని అరెస్టు చేశారో లేదో ఇంతవరకు బయట పెట్టలేదు. ఇలాటి వుదంతాలను, గొడ్డు మాంసం, గోవుల పేరుతో చేస్తున్న వున్మాద చర్యలను అడ్డుకోకపోతే వారి దాడులు ఒక్క ముస్లింలు, దళితులకు మాత్రమే పరిమితం గావు. ఇస్లామిక్ దేశాలలో అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు సృష్టించి వదిలిన ఇస్లామిక్ తాలిబాన్లు అన్ని జీవన రంగాలలోకి, అందరి జీవితాలలో జోక్యం చేసుకొని నియంత్రించేందుకు పూనుకొని యావత్ సమాజానికే ముప్పుగా తయారు కావటాన్ని చూస్తున్నాము. మన దేశంలో హిందూత్వ శక్తులు తయారు చేస్తున్న కాషాయతాలిబాన్లు వారి కంటే తీసిపోరు. అందుకే హిట్లర్ పాలనా కాలంలో నాజీల చేతులలో జైలు పాలైన ఒక ప్రొటెస్టెంట్ మతాధికారి రాసిన కవితను పదే పదే గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.
వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు
నేను కమ్యూనిస్టును కాదు కనుక మౌనం దాల్చాను
తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు
నేను కార్మికుడిని కాదు కనుక మిన్నకున్నాను
తరువాత వారు యూదుల కోసం వచ్చారు
నేను యూదును కాదు కనుక పట్టించుకోలేదు
చివరికి వారు నా కోసం వచ్చారు
పట్టించుకొనేందుకు నా వెనుక ఎవరూ మిగల్లేదు.