Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

వర్తమాన ప్రపంచంలో జరిగే యుద్ధాలలో జనాలకు నష్టాలు, కష్టాలే తప్ప విజయాలు ఎక్కడా కనిపించటం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో అంత పెద్ద అమెరికా పెద్ద సంఖ్యలో సైన్యాన్ని ఆయుధాలు కుమ్మరించి కూడా తాను పెంచి పెద్ద చేసిన తాలిబాన్లు చివరకు ఏకు మేకైనట్లుగా మారటంతో వారిని అణచలేక అలసిపోయి వెనుదిరిగి వచ్చింది. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు తోటి తోడేలు రాజ్యాలైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి అనేక దేశాలను కూడా ఏదో రూపంలో ఆ యుద్ధంలో దించి వాటి చేత కూడా భారీగా ఖర్చు చేయించిన విషయం తెలిసిందే. క్యూబా, వుత్తర కొరియా, వియత్నాం ఇలా ఏ చిన్న దేశం కూడా అమెరికా సైనిక పాటవాన్ని చూసి భయపడలేదు, భవిష్యత్‌లో భయపడవు. తాజాగా వుత్తర కొరియా పరీక్షించిన ఖండాంతర క్షిపణిని నిజంగా గురి పెడితే వేల కిలోమీటర్ల దూరంలోని అమెరికాలోని ఒక ప్రాంతంలో కావాల్సినంత విధ్వంసం సృష్టించగలదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మీకు మా వూరెంత దూరమో మాకు మీ వూరూ అంతే దూరం అన్నది వుత్తర కొరియా ప్రయోగ సందేశం. ఇటు వంటి పరిస్ధితులలో ఇక్కడి కోడి కూస్తే అక్కడకు, అక్కడి కోడి కూత ఇక్కడకు వినిపించే దూరంలో వున్న చైనా-మన దేశం మధ్య తలెత్తిన వివాదం ఎంత వరకు దారితీస్తుందన్నది దేశంలో ఒక పెద్ద చర్చగా వుంది. నిజానికి ఇది చైనా-భూటాన్‌ మధ్యలో భారత్‌ దూరటం అంటే సముచితంగా వుంటుంది.అందుకు గాను http://thebhutanese.bt/understanding-the-doklam-border-issue/  ది భూటానీస్‌ పత్రిక సంపాదకుడు టెన్సింగ్‌ లామ్‌సాంగ్‌ రాసిన పై వ్యాఖ్య పూర్తి పాఠాన్ని ఆసక్తి వున్నవారు చదువుకోవచ్చు.

తాజా వివాదంపై చైనా-భారత మీడియా వార్తల తీరు తెన్నులు, సామాజిక మీడియాలో వుభయ దేశాల మధ్య మైత్రిని గాక శతృత్వాన్ని కోరుకొనే వారి పోస్టులు, వ్యాఖ్యలను కాసేపు పక్కన పెట్టి వివాద పూర్వరంగాన్ని చూడటం అవసరం. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరేవారు దేశద్రోహులు కాదు, అవకాశం వచ్చినపుడు అమీ తుమీ తేల్చుకోవాలని చెప్పే వారు దేశ భక్తులు అంతకంటే కారు. మన సైనికుల ప్రాణాలు, వారి కుటుంబాల వేదన, రోదనలు, యుద్ధాలు జరిగితే మన జనంపై పడే భారాల వంటి అనేక విషయాలను ఆలోచించాల్సి వుంటుంది. దీని అర్ధం మన జాగ్రత్తలు మనం తీసుకోవద్దని, వివాదం లేని మన భూభాగాన్ని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవద్దని కాదు. వివాదాలు లేని రోజుల్లో కూడా మన రక్షణ యంత్రాంగం నిరంతరం అదే పనిలో నిమగ్నమై వుంటుంది.

అనేక వుదంతాలను చూసిన తరువాత యుద్ధాలు వద్దు, శాంతి కావాలి, ఆయుధాలకు తగలేసే ఖర్చును అభివృద్ధికి వినియోగించాలి అన్న భావం ప్రపంచ వ్యాపితంగా ఏదో ఒక మూల రోజూ వినిపిస్తూనే వుంది. అదే విధంగా చంపు, కొట్టు, నరుకు అనే వున్మాదం తలకెక్కిన వారు కూడా గణనీయంగా వున్నారు గనుకే హిట్లర్‌ వంటి నరహంతకులు తయారవుతున్నారు. ఆ కారణంగానే లాభాల కోసం పని చేసే ప్రపంచ యుద్ధ పరిశ్రమలలో ఎలాంటి సంక్షోభం కనిపించటం లేదు. వాటికోసం అమెరికా సామ్రాజ్యవాదులు ప్రపంచంలో ఏదో ఒకచోట నిత్యం యుద్ధాలను కొనసాగిస్తూనే వున్నారు. తిరుగుబాట్లను రెచ్చగొడుతూ అటు తీవ్రవాదులు-ప్రభుత్వాలకు కూడా ఆయుధాలు విక్రయిస్తూ లాభాలు పోగేసుకుంటున్నారు. ఆయుధ వుత్పత్తి సంస్ధలలో అత్యధికం సామ్రాజ్యవాదుల వెన్నుదన్ను వున్న కార్పొరేట్ల చేతులలో వున్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు మన దేశంలో వున్న పరిస్ధితులలో చైనా లేదా పాకిస్ధాన్‌తో యుద్ధం, యూదు మత దురహంకారి అయిన ఇజ్రాయెల్‌తో సంబంధాలు వద్దు అని చెప్పేవారిని దేశ ద్రోహులుగా చిత్రిస్తారని, వెంటాడి వేధిస్తారని తెలుసు. నేనయితే రక్తం ఏరులై పారాలని, యుద్ధం కావాలని కోరుకొనే పని పాటలు లేని దేశ భక్తుడిని కాదు. మీడియాలో రాస్తున్న వార్తలలో తమకు అనుకూలంగా వున్న వాటిని చూసి ఆవేశం తెచ్చుకొనే రకాన్ని అంతకంటే కాదు. సామాజిక మీడియాలో వీరావేశం ప్రదర్శించేవారందరూ సరిహద్దులకు కాదు కదా ఫేస్బుక్‌ దాటి బయట కాలు పెట్టరు. యుద్ధానికి ముందు సమాధి అయ్యేది నిజం. ఏదేశానికి ఆదేశ పాలకులు, అధికార యంత్రాంగం తమకు అనుకూలమైన సమాచారాన్ని, టీకాతాత్పర్యాలను మాత్రమే జనం ముందుంచుతుంది.

వుదాహరణకు జూన్‌ 19న వాతావరణం సరిగా లేని కారణంగా మన దేశంలోని సిక్కిం నుంచి బయలు దేరాల్సిన మానస సరోవర యాత్రికులు నిలిచిపోయారని తొలి వార్తలు వచ్చాయి. తరువాత 23న రోడ్డు మార్గం సరిగా లేని కారణంగా చైనా వారు నాథూలా కనుమ గేట్లు తెరవలేదని, తరువాత యాత్రికులను వారు అనుమతించటం లేదని వార్తలు వచ్చాయి. ఎందుకిలా జరిగిందో తెలియదని మన విదేశాంగశాఖ అధికారులు వ్యాఖ్యానించారు. అసలు విషయాన్ని చైనా లేదా మన ప్రభుత్వం గానీ 30వ తేదీ వరకు వెల్లడించలేదు. తన ఆధీనంలో వున్న డోక్లాం ప్రాంతంలోని డోక్లాలో చైనా రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించింది. అది తమ ప్రాంతమని భూటాన్‌ వాదిస్తోంది. అయితే అది చైనా ఆధీనంలో వుంది. రోడ్డు నిర్మాణంపై భూటాన్‌ అభ్యంతరాలను చైనా ఖాతరు చేయలేదు. దాంతో భూటాన్‌ అధికారులు మన దేశానికి నివేదించారు. భూటాన్‌తో మనకు రక్షణ ఒప్పందం వుంది కనుక వివాదాస్పద భూటాన్‌ ప్రాంతాన్ని రక్షించే పేరుతో మన సేనలు డోక్లాం ప్రాంతంలో వ్రవేశించి చైనా సిబ్బంది వేస్తున్న రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నాయి. దానికి ప్రతిగా మానస సరోవర యాత్రను చైనా నిరాకరించింది. నాథులా కనుమ మానస సరోవరానికి దగ్గరి దారి, దీనిని రెండు సంవత్సరాల క్రితం చైనా అనుమతించింది. సరిహద్దులలోని ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన వివాదం దృష్ట్యా భద్రతాపరమైన కారణాలతో ఈ మార్గాన్ని మూసివేశామని, ఇతర మార్గాల ద్వారా అనుమతిస్తున్నామని చైనా ప్రకటించింది. తమ భూ భాగంలో తాము నిర్మించుకుంటున్న రోడ్డును భారత బలగాలు అడ్డుకోవటమేగాక, బంకర్లు కూడా నిర్మించాయని, తమ ప్రాంతంలో తిష్ట వేశాయని చైనా ప్రకటించింది. చైనా సైనికులే మన భూ భాగంలో ప్రవేశించి మప బంకర్లను కూల్చివేశారని మన దేశంలోని మీడియా వార్తలను అందించింది.

భారత్‌-చైనా- భూటాన్‌ సరిహద్దు మూడు ప్రాంతాల కూడలి కోడి మెడ ఆకారంలో వుంటుంది. ఆ ప్రాంతంలోని సిక్కిం దగ్గరి సరిహద్దుతో మనకూ చైనాకు వివాదాలు లేవు. అయితే భూటాన్‌- చైనాల మధ్య ప్రాంతాల విభజనపై ఆ రెండు దేశాల మధ్య వివాదం వుంది. ప్రస్తుతం మన సేనలు ప్రవేశించినట్లు చెబుతున్న ప్రాంతం తనదని భూటాన్‌ వాదిస్తుండగా తమ ఆధీనంలో వున్న తమ ప్రాంతమని చైనా చెబుతున్నది. దానిని భూటాన్‌ గుర్తించలేదు. ఈ వివాదానికి సంబంధించి భూటానీస్‌ పత్రిక సంపాదకుడు రాసిన వ్యాఖ్య సారాంశం ఇలా వుంది.’ సరిహద్దు గురించి అంతిమ పరిష్కారం జరిగే వరకు యథాతధ స్ధితితో పాటు ఆ ప్రాంతంలో శాంతి, సామరస్యాలను పాటించాలని 1988,1998లో వుభయ(చైనా-భూటాన్‌) దేశాలు చేసుకున్న రాతపూర్వక ఒప్పందాలను భూటాన్‌ ప్రాంతంలో రోడ్డు నిర్మించటం ద్వారా చైనా అతిక్రమించిందని భూటాన్‌ విదేశాంగశాఖ జూన్‌ 29న ప్రకటించింది. భూటాన్‌ సైనిక శిబిరం వున్న జొంపెలిరీ వైపునకు దారితీసే విధంగా డోక్లా ప్రాంతంలో చైనా జూన్‌ 16న రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించింది. ఢిల్లీలో వున్న భూటాన్‌ రాయబారి ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయానికి దీనిపై అభ్యంతరం తెలిపారు. ఈ పరిణామాల గురించి ఎప్పటికప్పుడు భారత్‌కు భూటాన్‌ తెలియచేస్తున్నది. డోక్లా సాధారణ ప్రాంతంలో వున్న భారత సైన్యం భూటాన్‌ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని రోడ్డు నిర్మాణం జరుపుతున్న చైనా సిబ్బంది వద్దకు వెళ్లి నిర్మాణం నిలిపివేసి యథాతధ స్ధితిని కొనసాగించాలని కోరింది. ఆ నిర్మాణం యథాతధ స్దితిలో గమనించదగిన మార్పునకు దారితీయటమే గాక భారత్‌ రక్షణకు తీవ్రమైన పర్యవసానాలు ఎదురవుతాయని చైనాకు తెలియచేసింది. 2012లో భారత్‌-చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మూడు దేశాల కూడలి సరిహద్దులపై వుభయ దేశాలతో పాటూ మూడవ పక్ష దేశాలతో కూడా సంప్రదించి ఖరారు చేసుకోవాల్సి వుండగా ఈ అవగానకు విరుద్దంగా చైనా రోడ్డు నిర్మాణం చేపట్టిందని భారత్‌ అభ్యంతరం తెలిపింది. ఆ ప్రాంతం తమదే అంటూ చైనా తన చర్యను సమర్ధించుకుంది.

సంఘటన జరిగిన ప్రాంతం గురించి గందరగోళం వున్నట్లు కనిపిస్తోంది. అది మూడు దేశాల కూడలి. కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే మూడు దేశాలు కలుసుకోగలిగిన ఇరుకైన ప్రాంతం. ఎవరికి వారు తమ దైన పేరుతో దానిని సాధారణ ప్రాంతంగా పిలుస్తున్నారు. సంఘటన జరిగిన డోక్లాంలో పెద్ద ప్రాంతం భూటాన్‌దే. సామాజిక మీడియాను అనుసరిస్తున్న కొందరు భూటానీయులు మరో వివాదాస్పదమైన ఫూటెగాంగ్‌ ప్రాంత రోడ్డుపై వివాదం జరిగినట్లు గందరగోళపరుస్తున్నారు. దానికి ఒకవైపు చైనా మరోవైపు భూటాన్‌ అవుట్‌పోస్టులున్నాయి. అక్కడెలాంటి సంఘటన జరగలేదు.డోక్లాం ప్రాంతంలో నిర్మిస్తున్న రోడ్డును నిలిపివేయాలని భూటాన్‌ సైన్యం చేసిన ప్రయత్నానికి చైనా నిరాకరించింది. తరువాత ఆ ప్రాంతానికి వచ్చిన భారతీయ సైన్యం రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేసింది. దానికి ప్రతిగా తరువాత వచ్చిన చైనా సైన్యం ఇరుకుగా వున్న ఆప్రాంతంలో భారత సైనికులు నిర్మించిన చిన్న మిలిటరీ అవుట్‌పోస్టులను ధ్వంసం చేసింది.

చైనా విషయానికి వస్తే చుంబీ లోయలోని యాడోంగ్‌ పట్టణం వరకు పెద్ద రోడ్డు నిర్మాణం జరిపింది. భూటాన్‌, భారతవైపు అనేక రోడ్ల నిర్మాణానికి పూనుకుంది. అయినప్పటికీ ముఖ్యంగా భారత్‌కు కోడి మెడ కూడలి ప్రాంతంవైపు దక్షిణదిశగా నిర్మించే రోడ్డు దాని భద్రతకు హాని కలిగిస్తుందని భావిస్తోంది. ఆ ప్రాంతం దాని ఏడు ఈశాన్య రాష్ట్రాలను కలుపుతుంది.వాటిలో కొన్నింటిలో తీవ్రవాద సమస్యలున్నాయి. చుంబీలోయలో చైనా ప్రాంతం వున్నప్పటికీ ఇరుకుగా వుండటంతో చైనాకు స్ట్రాటజిక్‌ షోల్డర్స్‌ (భుజంతో కాచుకొనే, మార్చుకొనే వీలు) లేవు. అందుకే అది భూటాన్‌కు చెందిన 269 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కావాలని, దానిలో సులభంగా మసల వచ్చని చైనా భావిస్తోంది. అదే జరిగితే తనకు పెద్ద ముప్పని భారత్‌ భావిస్తోంది. భూటాన్‌ విషయానికి వస్తే ఏ ప్రాంతాన్ని కోల్పోవటానికి, చొరబాట్లను అంగీకరించటానికి సిద్దంగా లేదు. వ్యూహాత్మక ప్రాధాన్యత రీత్యా 1996లో చైనా ఒకప్యాకేజ్‌ను ప్రతిపాదించింది. దాని ప్రకారం డోక్లాంలో తనకు 269 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని వదిలితే భూటాన్‌ వుత్తర ప్రాంతంలో తమదిగా వున్న 495 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని భూటాన్‌కు బదలాయిస్తామని చైనా ప్రతిపాదించింది.

భూటాన్‌-చైనా సరిహద్దు వివాదం 1959లో చైనా సైన్యం టిబెట్‌, భూటాన్‌లో ప్రవేశించి తదుపరి భూటాన్‌ వుత్తర సరిహద్దులను మూసివేసినప్పటి నుంచి ప్రారంభమైంది. అప్పటి పరిణామాలలో భారత్‌కు భూటాన్‌ చేరువైంది. భూటాన్‌-టిబెట్‌ మధ్య పారేనీటి వాలును బట్టి సరిహద్దులనిర్ణయం జరగాలన్న సాంప్రదాయ పద్దతిని చైనా అంగీకరించటం లేదు. తొలుత సరిహద్దు సమస్యను భారత్‌తో సంప్రదించి, దాని ద్వారా చైనాతో భూటాన్‌ చర్చలు జరిపింది. 1984 నుంచి చైనాతో నేరుగా భూటానే చర్చలను ప్రారంభించింది. అప్పటి నుంచి 2016 వరకు 24సార్లు వుభయ దేశాల మధ్య చర్చలు జరిగాయి.’

చైనా నిర్మిస్తున్న రోడ్డు భూటాన్‌ -చైనా మధ్య వున్న వివాదాస్పద ప్రాంతమైనప్పటికీ మూడు దేశాల సరిహద్దు కూడలికి దగ్గరగా రోడ్డు వున్నందున, అది మిలిటరీ రీత్యా కీలక ప్రాంతమైనందున మన దేశం ఆందోళన వెలిబుచ్చటం సహేతుకమే. అలాంటి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సి వుంది. భూటాన్‌ తరఫున మన సైన్యం రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవటమే మన దేశం-చైనా మధ్య వివాదానికి కారణంగా కనిపిస్తోంది. రెండు దేశాల ప్రతినిధులు పరిమితులకు మించి చేసిన వ్యాఖ్యలు దానిని మరింత పెంచాయి. తమ భూ భాగం నుంచి భారత సైనికులు వైదొలిగితేనే తాము చర్చలు జరుపుతామని చైనా షరతు విధించింది.

గత కొంత కాలంగా చైనా పట్ల మనం, దానికి ప్రతిగా చైనా మనపట్ల అనుసరిస్తున్న వైఖరి రెండు దేశాల మధ్య పరస్పర అనుమానాలను పెంచుతున్నది. మనకు ప్రత్యక్షంగా సంబంధంలేని దక్షిణ చైనా సముద్ర వివాదం వంటి విషయాలలో కూడా మన దేశం అనుసరిస్తున్న వైఖరి చైనాకు మింగుడు పడటం లేదు. అందుకే అది మన దేశానికి సంబంధించిన కొన్ని విషయాలలో వేరే విధంగా స్పందిస్తున్నది. తమ చుట్టూ అమెరికన్లు బిగిస్తున్న మిలిటరీ వ్యూహానికి ప్రతిగా స్వయం రక్షణ చర్యలలో భాగంగా చైనా కూడా తనదైన పద్దతులలో ముందుకు పోతున్నది. ఈ పూర్వరంగంలోనే తాజా సమస్యను చూడాల్సి వుంది. ప్రపంచంలో ఏ దేశానికి ఆదేశం తన ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకొనేందుకు అనేక చర్యలను తీసుకొంటోంది. వాటిలో రాజకీయ కోణాన్ని చొప్పిస్తేనే సమస్యలు సంక్లిష్టంగా మారతాయి.

దలైలామా చైనాపై తిరుగుబాటు చేసి మన దేశానికి వచ్చి ఇక్కడ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టిబెట్‌పై చైనా అధికారాన్ని సవాలు చేస్తున్నాడు. టిబెట్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగంగా మన దేశం గుర్తిస్తూనే దలైలామాకు ఆశ్రయం కల్పించటం, చైనా వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించటాన్ని చైనా అభ్యంతర పెడుతున్నది. తమ టిబెట్టులోని దక్షిణ ప్రాంత మంటూ మన ఆధీనంలో వున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ను గుర్తించేందుకు చైనా నిరాకరిస్తున్నది. అక్కడ పర్యటించటానికి దలైలామాను అనుమతించవద్దని అభ్యంతరం చెప్పింది. అరుణాచల్‌ మన భూ భాగమని దానిలో ఎవరు పర్యటించాలో వద్దో చెప్పే అధికారం చైనాకు లేదంటూ మన సార్వభౌమత్వాన్ని వెల్లడించే చర్యలో భాగంగా మన ప్రభుత్వం దలైలామా పర్యటనకు ఏర్పాట్లు చేసింది. అంతే కాదు దాని రక్షణకు అవసరమైతే సత్వరం సైన్యాన్ని, ఇతర సామాగ్రిని తరలించేందుకు వీలుగా అరుణాచల్‌ తూర్పు ప్రాంతానికి వెళ్లేందుకు మన ప్రభుత్వం పొడవైన వంతెనను కూడా నిర్మించింది. ఇది చైనా సరిహద్దులకు చేరువలో వుంది. అదే విధంగా రైలు మార్గ నిర్మాణానికి కూడా తలపెట్టింది. చైనా కూడా మన సరిహద్దులకు దగ్గరగా సైనిక రవాణాకు వీలు కల్పించే ఒక ముఖ్యమైన రైలు మార్గాన్ని టిటెట్‌లో నిర్మించిన విషయం బహిరంగమే. అందువలన ఎవరి రక్షణ చర్యలు వారు తీసుకోవటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. వుదాహరణకు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయాలని మన దేశంపై పశ్చిమ దేశాలు ఎప్పటి నుంచో వత్తిడి చేస్తున్నాయి. ప్రపంచశాంతి కావాలని మన దేశంలో కోరుకొనే శక్తులు కూడా ఆ ఒప్పందంపై సంతకం మన దేశం చేయవద్దనే చెబుతున్నాయి. మన సార్వభౌమత్వ రక్షణకు అణ్వాయుధాలను తయారు చేసుకొనే హక్కును మనం అట్టిపెట్టుకోవాలని తప్ప ఆయుధాలు తయారు చేసి అమెరికా మాదిరి మిగతా దేశాల మీద ప్రయోగించాలని కాదు. అణుయుద్దమే వస్తే ఏ ఒక్కదేశమూ మిగలదు. మిగతా దేశాలు కూడా అణ్వాయుధాలు తయారు చేశాయి గనుకనే అమెరికా ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తోంది.

చైనాతో సంబంధాల విషయాన్ని కూడా మన ప్రయోజనాలను కాపాడుకొంటూ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటూ ముందుకు పోవటం ప్రయోజనదాయకమని గత అనుభవాలు నిరూపించాయి.1962లో రెండు దేశాల మధ్య జరిగిన యుద్దం సందర్భంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే వైఖరిని వెల్లడించినందుకు నాటి ప్రభుత్వం వుమ్మడి కమ్యూనిస్టుపార్టీ నుంచి ఆతరువాత సిపిఎంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసిన నాయకత్వాన్ని నాటి ప్రభుత్వం అరెస్టు చేసింది. సిపిఎంను చైనా అనుకూల పార్టీగా ముద్రవేశాయి. ఇప్పటికీ రాజకీయ ఓనమాలు తెలియని వారు అదే విధంగా నిందలు వేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తదితర సంస్ధలు దేశభక్తి పేరుతో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టాయి. తరువాత జరిగిన పరిణామాలలో సిపిఎం నాయకత్వం చెప్పినట్లు వుభయ దేశాలు సరిహద్దు సమస్యపై సామరస్యపూర్వక చర్చలను ప్రారంభించటంతో పాటు సంబంధాలను మెరుగుపరచుకోవటం చూశాము. చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వాజ్‌పేయి జనతాపార్టీ హయాంలో విదేశాంగ మంత్రిగా, తరువాత ప్రధానిగా పని చేసినప్పటికీ చైనాతో సంబంధాల మెరుగుదలకే కృషి చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ అదే ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతూనే వుంది. ఇప్పుడూ దాని శ్రేణులు అదే చేస్తున్నాయి. తాజా వివాదాన్ని కూడా పరస్పర విశ్వాసం పాదుకొల్పే చర్యలతో పరిష్కరించుకోవటం తప్ప ఆయుధాలతో పరిష్కారమయ్యేది కాదు.