Tags

, , , , , , , ,

ఎక్కడో దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షను ఒక విధానంగా పాటించిన సమయంలో గాంధీ మొదటి తరగతి బోగీలో ప్రయాణించటానికి వీలు లేదంటూ 19వ శతాబ్దంలో రైలు నుంచి తోసి వేస్తే ఔరా తెల్లవారికి అంత కండకావరమా అనుకొని మన రక్తం వుడికి పోయింది. అదే మన ఢిల్లీ రైలులో 21వ శతాబ్దంలో అంతకంటే దారుణంగా జరిగిన దానిపై మనం అంతగా ఎందుకు స్పందించలేకపోతున్నాం? అలాంటిది ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు, మొత్తంగా జనం ఏది తినాలో ఏది తినకూడదో ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్దేశించే శక్తులు యధేచ్చగా చెలరేగుతున్న ‘స్వేచ్ఛా భారతాన్నా’ మన పెద్దలు కోరుకున్నది, త్యాగాలు చేసింది ?

ఎం కోటేశ్వరరావు

ఆగస్టు 15 సందర్భంగా మరోసారి టీవీలు, వీధులన్నీ దేశ భక్తి గీతాలతో మార్మోగనున్నాయి. జాతర్లలో పూనకం వచ్చినట్లుగా కొందరు దేశ భక్తితో వూగిపోతారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సాంప్రదాయ గూండాలు, రౌడీలు, కొత్తగా వునికిలోకి వచ్చిన కాషాయ గో గూండాలు, కాషాయ, ఆకుపచ్చ తాలిబాన్లు, మనువాదులు, మెజారిటీ, మైనారిటీ మతవాదులు, భావ ప్రకటనా స్వేచ్చా, ప్రజాస్వామ్య వ్యతిరేకులు, స్వాతంత్య్ర వుద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన వారి అన్ని రకాల వారసులు, రాజకీయ ప్రవేశానికి సోపానంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రయత్నించే సకల అవాంఛనీయ శక్తులు ఆరోజున వీధుల్లో దర్శనమివ్వబోతున్నాయి. నిజమైన స్వాతంత్య్రపోరాటానికి, స్వాతంత్య్ర భావనలకు వారసులుగా వున్నవారు కూడా అక్కడక్కడా బిక్కుబిక్కు మంటున్నట్లుగా జెండా పండగలను నిర్వహిస్తారు. అవాంఛనీయ శక్తులను వ్యతిరేకించే లేదా ఇష్టపడని వారు వారితో మనకెందుకు గొడవ అనుకుంటూ వారి ఆధీనంలో జండా కార్యక్రమం జరిగే ప్రాంతం నుంచి తప్పుకొని వెళ్లిపోయే దృశ్యాలు మరోసారి చూడబోతున్నాం.

వందల సంవత్సరాల పాటు బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఆక్రమించుకొని తమ వలసగా చేసుకున్నారని, వారికి వ్యతిరేకంగా పోరాడి అశేష త్యాగాలు చేసిన ఫలితంగానే ఇప్పుడు సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా మన పాలన మనమే చేసుకుంటున్నాం అనే విషయం ఎంత మందికి తెలుసు ? అసలు ఏదేశానికైనా స్వాతంత్య్రం ఎందుకు ? ఎవరినైనా ఈప్రశ్న అడిగితే, స్వాతంత్య్రమా చట్టుబండలా 70 ఏండ్ల క్రితం మనం తెచ్చుకున్న స్వాతంత్య్రం కూడు పెట్టిందా, నీడ నిచ్చిందా అని నిట్టూర్పు లేదా ఈసడించుకోవటం కనిపిస్తుంది. ఇలాంటి భావం సమాజంలో వుండటం అంటే నిరంకుశత్వం పెరగటానికి అనువైన పరిస్థితులు ఏర్పడినట్లుగా భావించాల్సి వుంటుంది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం, సోషలిస్టు చైతన్యం కలిగించటంలో చేసిన తప్పిదాలు లేదా లోపాల కారణంగా అంతకు ముందు తమ పూర్వీకులు కూల్చివేసిన పెట్టుబడిదారీ వ్యవస్ధను అక్కడి జనాలు కోరి పున: ప్రతిష్టించుకున్నారు. మొత్తంగా చూసినపుడు చరిత్ర ముందుకు పోయినప్పటికీ ఇలాంటి తిరోగమన వుదంతాలు కూడా జరుగుతాయని మన కళ్ల ముందు కనిపించిన పరిణామమిది. సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేస్తుంటే దాని వలన లబ్ది పొందిన జనం కూడా ప్రేక్షక పాత్ర వహించారు. నియంతృత్వశక్తులు ప్రజాస్వామిక, ప్రగతిశీల అవతారాలెత్తితే గుడ్డిగా నెత్తినెక్కించుకున్నారు. మబ్బులను చూసి చేతుల్లో వున్న ముంత నీళ్లు పారబోసుకున్నారు.

సోషలిజమే కాదు, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, భావ ప్రకటన, జీవన స్వేచ్చలకు సైతం అలాంటి ముప్పే ముంచుకు వస్తోంది. అనేక దేశాలలో పచ్చి మితవాద శక్తులు ప్రజాకర్షక నినాదాలతో ఎన్నికలలో విజయాలు సాధిస్తున్నాయి. నిప్పును ముట్టుకుంటే కాలుతుందని తెలియని పసివారి సంగతి అటుంచుదాం. తెలిసిన వారు కూడా ఒకసారి పట్టుకొని చూద్దాం అన్నట్లుగా ఒక విధమైన వున్మాద స్ధితిలో వ్యవహరిస్తున్నారు. అదానీ, అంబానీల వంటి లాభాలే పరమావధిగా వున్న వారికి ఎవరైనా ఒకటే అనుకోండి. మంచి వాళ్లనుకున్నవారు ఏం ఒరగబెట్టారని, వీరికి కూడా ఒక అవకాశం ఇచ్చి చూస్తే పోయేదేముంది అన్నట్లుగా మితవాద, తిరోగామి శక్తుల గురించి తెలిసిన మేథావులు, సామాన్యులు కూడా వుదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

చరిత్ర పునరావృతం అవుతుంది. అంటే దాని అర్ధం హిట్లర్‌ లాంటి వాడే తిరిగి జర్మనీలోనే పుట్టి ఫాసిజాన్ని అమలు జరపనవసరం లేదు. ప్రతి చోటా కొత్త రూపాల్లో కొత్త శక్తులు పెరిగేందుకు ప్రయత్నిస్తాయి. ప్రపంచాన్ని ఆక్రమించుకోవటంలో జర్మన్లు వెనుకబడ్డారు కనుక తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు హిట్లర్‌ ప్రయత్నించాడు. ప్రపంచంలో వలసరాజ్యాలు అంతరిస్తున్న దశలో చరిత్ర గతికి విరుద్దమది. అయినా అలా మొరటు పద్దతులలో నడపాలని చూసి ప్రపంచంలో అనేక కోట్ల మంది ప్రాణాలు పోవటానికి, జీవితాలు నాశనం కావటానికి కారకుడయ్యాడు. ఇప్పుడు అమెరికా తన కార్పొరేట్‌ శక్తులకు మార్కెట్‌ కోసం కొత్త పద్దతులు, కొత్త రూపాలలో యుద్ధాలు, అంతర్యుద్ధాలను, వుగ్రవాదం, వుగ్రవాదులను సృష్టించి మార్కెట్లను హస్తగతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచంలో తమతో కలసి వచ్చే దేశాలను కూడగట్టి ప్రతి అమెరికా అధ్యక్షుడు నిత్యం ఏదో ఒక మూలన యుద్ధాలు చేస్తూ జనం ప్రాణాలను బలిగొంటూ, జీవితాలను నాశనం చేస్తూనే వున్నాడు. దీన్ని చరిత్ర పునరావృతం కావటం అనిగాక మరేమనాలి ?

మన ఏడుపదుల స్వాతంత్య్రాన్ని కూడా ఈ నేపధ్యంలోనే అవలోకించాలి. బ్రిటీష్‌ వారు మన దేశం నుంచి తప్పుకున్న సమయంలో మన నేతలు ఏం చెప్పారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించటం అవసరం. మన స్వాతంత్య్రానికి ముందే మన దేశంలో వుట్టిన అనేక సంస్ధలలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒకటి. వారేమి చెప్పుకున్నప్పటికీ స్వాతంత్య్ర వుద్యమానికి దాని నేతలు, అనుచరులు వ్యతిరేకంగా, దూరంగా వున్నారు. సావర్కర్‌ వంటి నాయకుడు బ్రిటీష్‌ వారికి లొంగిపోయి సేవలు చేసుకుంటానని లేఖలు రాశాడు.

సరిగా నిర్వహించారా లేదా అన్న చర్చ ఎలా వున్నప్పటికీ గాంధీ, నెహ్రూ వారి అనుచరులు స్వాతంత్య్ర వుద్యమానికి ప్రధానంగా నాయకత్వం వహించారు. వారి విధానాలతో ఏకీభవించని వారు కమ్యూనిస్టులుగా మారారు తప్ప కాషాయ శక్తుల మాదిరి బ్రిటీష్‌ వారి చంకనెక్కలేదు. మన పాలనను మనం చేపట్టిన తరువాత వారి నాయకత్వంలోని కాంగ్రెస్‌ అధికారంలో వుంది, అనేక అక్రమాలకు పాల్పడింది, స్వాతంత్య్ర లక్ష్యాలకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఒక బిడ్డ పుట్టిన తరువాత బతికి వయస్సు వచ్చిందా లేదా అంటే రాకుండా ఎలా వుంటుంది. అలాగే కాంగ్రెస్‌ వారు మా పాలనలో అసలేమీ అభివృద్ధి జరగలేదా అని అడ్డు సవాళ్లు విసురుతారు. పుట్టిన తరువాత బతికి వుంటే వయస్సు రావటానికి ఎవరూ తోడ్పడనవసరం లేదు. ఆ బతికిన బిడ్డ ఆఫ్రికాలో అకలితో మాడే జీవచ్చంలా వుందా ఆరోగ్యంగా పెరిగిందా లేదా అన్నది చూడాలి. అలా చూసినపుడు ఆఫ్రికా అంతగాక పోయినా మన దేశంలో మెజారిటీ జనజీవితాలు జీవచ్చవాలకు దగ్గరగానే వున్నాయి. పోషకాహారలేమితో గిడసబారిపోవటం, ఇరవైల్లోనే అరవై లక్షణాలు రావటం, శరీరాన్ని కప్పుకొనేందుకు తగినన్ని బట్టలు లేకపోవటం, వుండటానికి ఇళ్లు లేకపోవటం వంటి అనేక సమస్యలు ఏడుపదుల స్వాతంత్య్రం తరువాత కూడా వుండబట్టే అనేక మంది దానిని అభివృద్ధిగా చూడటం లేదు, అందుకే స్వాతంత్య్రం మనకేమి తెచ్చింది, మాకేమిచ్చింది అని అడుగుతున్నారు.

ఇన్ని అనర్ధాలకు కారణం కాంగ్రెస్‌, దానికి నాయకత్వం వహించిన గాంధీ, నెహ్రూ వారి అనుచరులే కారణమని ఆరోపించే బిజెపి దేశ చరిత్రలో వారి పాత్రను పూర్తిగా చెరిపివేసే లేదా వక్రీకరించేందుకు పూనుకుంది. తమకెలాగూ మంచి చరిత్ర లేదు కనుక వున్నవారిపై బురదజల్లి తమ నిజస్వరూపాన్ని కప్పిపుచ్చుకొనే యత్నమిదని విమర్శకులు భావిస్తున్నారు. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు ఆర్‌ఎస్‌ఎస్‌తో వున్న సంబంధాల గురించి తెలిసిందే. ఒకవైపు మహాత్ముడిని పొగుడుతూనే మరోవైపు ఆయన ఒక చతురుడైన కోమటి అని సాక్షాత్తూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా చేసి వ్యాఖ్యను నరేంద్రమోడీతో సహా ఏ బిజెపి సీనియర్‌ నేతా తప్పు పట్టలేదు, గడ్డి పెట్టలేదు, ముసి ముసి నవ్వులతో చోద్యం చూశారు. ఇక నెహ్రూ గురించి చేస్తున్న ప్రచారం గురించి చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలు, అసమానతలు,అవినీతి, నిరుద్యోగం, దారిద్య్రం, సామాజిక న్యాయలేమి వంటి సకల అవలక్షణాలకు మహాత్ముడు అధికారంలో ఎన్నడూ భాగస్వామి కాలేదు కనుక, నెహ్రూ నుంచి మన్మోహన్‌ సింగ్‌ వరకు అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్‌ విధానాలు, వ్యవహరించిన తీరే కారణం అనటంలో ఎలాంటి పేచీ లేదు. అవన్నీ విధానాల కారణంగా వచ్చాయి తప్ప మరొకటి కాదు. వాటిని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న, ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తున్న వామపక్షాలు, శక్తులు నెహ్రూ లేదా ఆయన వారసుల విధానాలను విమర్శిస్తే అర్ధం వుంటుంది.అధికారం కోసం ఆరాటం తప్ప ఏనాడూ ప్రత్యామ్నాయ విధానాల వూసులేని, ఏ కాంగ్రెస్‌నైతే విమర్శిస్తున్నారో దాని విధానాలనే మక్కీకి మక్కీ అనుసరిస్తున్న బిజెపి,ఎన్‌డిఏ పక్షాలకు అర్హత ఏమిటి అన్నది ప్రశ్న.

స్వాతంత్య్రం సందర్భంగా 1947 ఆగస్టు 14 రాత్రి నెహ్రూ చేసిన ప్రసంగంలో ‘ఆమె బిడ్డలందరూ నివశించాల్సిన స్వేచ్చా భారతాన్ని మనం నిర్మించాల్సి వుంది’ అని చెప్పారు. ఏడు పదుల స్వాతంత్య్రం తరువాత రాజధాని ఢిల్లీ రైలులో గడ్డం, టోపీ పెట్టుకోవటాన్ని చూసి నువ్వు ముస్లిం, గొడ్డు మాంసం తింటావు, పాకిస్ధాన్‌ వెళ్లిపో అంటూ ఒక కుటుంబ సభ్యులపై వున్మాదంతో కొందరు దాడి చేసి రైలు నుంచి తోసి వేస్తుంటే దానిని అడ్డుకొనేందుకు ఒక్కరు కూడా ముందుకురాని ‘సహనపరుల’ సేచ్చా భారతంలో నేడు మనం వున్నాం. ఆ దాడిలో జునైద్‌ అనే 15 ఏండ్ల యువకుడు కత్తిపోట్లతో సోదరుడి ఒడిలో రైల్వే ఫ్లాట్‌ఫారంపై మరణించాడు. మతోన్మాద కోణాన్ని మూసి పెట్టేందుకు దాన్ని సీట్ల గొడవగా చిత్రించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తే దున్న ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా మన మీడియా దానిని జనానికి అందించిందంటే ఏమనుకోవాలి?

ఎక్కడో దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షను ఒక విధానంగా పాటించిన సమయంలో గాంధీ మొదటి తరగతి బోగీలో ప్రయాణించటానికి వీలు లేదంటూ 19వ శతాబ్దంలో రైలు నుంచి తోసి వేస్తే ఔరా తెల్లవారికి అంత కండకావరమా అనుకొని మన రక్తం వుడికి పోయింది. అదే మన ఢిల్లీ రైలులో 21వ శతాబ్దంలో అంతకంటే దారుణంగా జరిగిన దానిపై మనం అంతగా ఎందుకు స్పందించలేకపోతున్నాం? అలాంటిది ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు, మొత్తంగా జనం ఏది తినాలో ఏది తినకూడదో ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్దేశించే శక్తులు యధేచ్చగా చెలరేగుతున్న ‘స్వేచ్ఛా భారతాన్నా’ మన పెద్దలు కోరుకున్నది, త్యాగాలు చేసింది ? మన నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్నామనుకుంటున్న ప్రతివారూ కింది మెట్టులోని వారిని తక్కువగా చూస్తున్న స్ధితిలో పేరు,వేష భాషలను బట్టి అణచివేతకు పూనుకోరన్న గ్యారంటీ ఏమిటి ?

ఆధునికత విలసిల్లే ప్రాంతాలలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఒకటి. అలాంటి చోట గరగపర్రు అనే గ్రామంలో మిగతా నేతల విగ్రహాల సరసన అంబేద్కర్‌ విగ్రహాన్ని అనుమతించం వేరే చోట పెట్టుకోండి అంటూ కొంత మంది అడ్డుకోవటంలో అర్ధం ఏమిటి? అంబేద్కర్‌ విగ్రహాన్ని వేరే చోట పెట్టుకోమనటానికి ముస్లింలను చూసి పాకిస్ధాన్‌ పొమ్మనటానికి తేడా ఏముంది. ఈ రోజు ముస్లింలు అయితే రేపు దళితులు,గిరిజనులు, వెనుక బడిన వారూ, మహిళలకూ అదే గతి పడుతుంది. వూరి మధ్యలో ఎవరైనా దళితులు, గిరిజనులు వుంటే గొడ్డు మాంసం తినేవారు మీరు, ఖాళీ చేసి మీ వాడలకు పోండి అనరన్న గ్యారంటీ ఏముంది ?(గొడ్డు మాంసం తినని దళితులు, గిరిజనులను కూడా సహించరని మనవి) విగ్రహాన్ని అడ్డుకోవటాన్ని ప్రశ్నించినందుకు దళితులను సాంఘిక బహిష్కరణ చేయటమే గాక అందుకు పాల్పడిన వారే తమకు న్యాయం చేయండి అంటూ గరగపర్రులో మాదిరి పోటీ దీక్షలకు దిగే పరిస్దితికి, దానిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించే పరిస్ధితికి కారకులెవరు ?నాడు అంబేద్కర్‌ అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడినపుడు దానిని పాటించే హిందువులలోని అనేకశక్తులు ఆ అనాచారానికి వ్యతిరేకంగా మద్దతుగా నిలిచాయి కనుకనే మనువాదులు మౌనంగా వున్నారు. అదే అంబేద్కర్‌ ఈ రోజు గరగపర్రులో అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడి వుంటే పోటీ దీక్షలకు దిగిన వారు సహించి వుండేవారా ? ఇలాంటి వుదంతాలు, ప్రశ్నలను 70 ఏండ్ల స్వాతంత్య్రం తరువాత చర్చించుకోవాల్సి రావటం గురించి ఆవేదన చెందటం కాదు, రానున్న ముప్పు గురించి ఆందోళనపడాలి. ఎదుర్కోవటానికి కార్యాచరణకు దిగాల్సిన తరుణం ఆసన్నం కాలేదా ?

దక్షిణాఫ్రికాలో ఎక్కడైతే రైలు నుంచి తోసివేశారో ఆ పట్టణ కేంద్రంలో అక్కడి ప్రభుత్వం మహ్మాతుడి విగ్రహాన్ని ప్రతిష్టించి వివక్షకు వ్యతిరేకంగా పోరాడినందుకు నివాళి అర్పించింది. మన రాజ్యాంగ నిర్మాతగా కీర్తించబడే అంబేద్కర్‌ విగ్రహాన్ని వూరి మధ్యలో ప్రతిష్టించి తెలుగుదేశం ప్రభుత్వం, దాడి అనంతరం రైలు నుంచి తోసివేతకు గురై మరణించిన జునైద్‌ విగ్రహం లేదా చిహ్నాలను రైల్వే ఫ్లాట్‌ఫారంపై ప్రతిష్టించి నరేంద్రమోడీ సర్కార్‌ తమకు కులం, మత వివక్ష లేదని ప్రదర్శించుకుంటాయా ?

ఆవు, పంది కొవ్వులను తుపాకి తూటాల తొడుగులకు(కాట్‌రిడ్జ్‌) పూసిన బ్రిటీష్‌ వారి చర్య హిందూ-ముస్లింలను ఏకం చేసి 1857లో ప్రధమ స్వాతంత్య్ర యుద్దానికి తిరుగుబాటు కారణాలలో ఒకటని చరిత్రలో చదువుకున్నాం. తూటాలను తుపాకిలో నింపాలంటే నోటితో తొడుగులను కొరికి తొలగించాల్సి వచ్చేది. అణుబాంబును కనిపెట్టాం, అంతరిక్షంలో జయప్రదంగా వుపగ్రహాలను ప్రయోగిస్తున్నాం, క్షిపణులను తయారు చేశాం, అయితేనేం

నూట అరవై సంవత్సరాల తరువాత కూడా అదే ఆవు, పంది సమస్యలను డెబ్బయి సంవత్సరాల స్వతంత్రభారతంలో పరిష్కరించుకోలేక వుద్రిక్తతలు, మారణకాండకు కారణం అవుతున్నాయి. అన్ని మతాలవారూ గొడ్డు మాసం తింటున్నది వాస్తవం, అయినా కొన్ని శక్తులు ఒక మతం వారిని వెంటాడి తరిమి దాడులు, హత్యలు చేస్తుంటే మనం చోద్యం చూస్తున్నామంటే ముందుకు పోతున్నట్లా తిరోగమిస్తున్నట్లా ? దేశంలోని అన్ని రాష్ట్రాలలో ముస్లింలు విదేశీయులు, విదేశీ మతం అంటూ ప్రచారం, దాడులు చేస్తున్న కాషాయ దళాల గురించి తెలియందెవరికి ? అదే ప్రచారం, దాడులు కాశ్మీరులో చేయగలరా ? గొడ్డుమాంసం, అలాగే క్రైస్తవ మతవ్యాప్తి గురించి రెచ్చగొట్టే ప్రచారం చేస్తున్న వారు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి అదే చేయగలరా ? నాడు బ్రిటీషు వాడిది రాజకీయం అన్నాం మరి నేడు చేస్తున్నదానినేమనాలి ?

బ్లాక్‌ మార్కెటీర్లను లైటు స్ధంభాలకు కట్టి వురి తీయాలని ఒక సందర్భంగా స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రధాని నెహ్రూ చెప్పారు. ఆయన లేదా వారసుల హయాంలో ఒక్క బ్లాక్‌ మార్కెటీరుకు కూడా ఆ గతి పట్టలేదు. ఆ నెహ్రూను నిత్యం విమర్శించే బిజెపి నేతల పాలనలో జరిగిందేమిటి ? 2015లో పప్పుల ధరలు ఆకాశానికి అంటినపుడు ఎవరూ నియంత్రించలేకపోయారు. ఆకస్మికంగా ధరలు రెట్టింపు కావటం గురించి ఆదాయపన్నుశాఖ చేపట్టిన దర్యాప్తులో విదేశీ-స్వదేశీ పప్పుధాన్యాల వ్యాపారులు, దిగుమతిదారుల కుమ్మక్కు ఇందుకు దారితీసినట్లు రెండువేల పేజీల నివేదిక వెల్లడించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పప్పులను ముంబై, చెన్నయ్‌ రేవుల్లో దొంగనిల్వలు చేసినట్లు తేలింది. అందుకు బాధ్యులపై ఇంతవరకు నరేంద్రమోడీ సర్కార్‌ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆయన హయాంలో జరిగిన అతి పెద్ద కుంభకోణమిది. పోనీ కాంగ్రెస్‌ హయాంలో జరిగిన కుంభకోణాలపై ఇంతవరకు తీసుకున్న చర్యలేమిటో కూడా మనకు తెలియదు.ఎవరు ఎవరిని రక్షిస్తున్నట్లు ?

1991లో కాంగ్రెస్‌ పాలనా కాలంలో ప్రవేశ పెట్టిన నూతన ఆర్ధిక విధానాలు అనేక అక్రమాలకు తెరతీశాయి. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారు. శతకోటీశ్వరులు పెరిగారు, అదాయ అసమానతలు పెరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత వుంటాయి. ఇవన్నీ మన స్వాతంత్య్ర వుద్యమ ఆకాంక్షలకు విరుద్ధం. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వ్యవస్ధను అమలులోకి తీసుకు రావటం మరొక స్వాతంత్య్రం అన్నట్లుగా పాలకపక్ష నేతలు చిత్రిస్తున్నారు. గతంలో కూడా రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, గరీబీ హఠావో, భూసంస్కరణల బిల్లుల సందర్భంగా కూడా నాటి పాలకులు జనంలో ఇలాంటి ఆశలనే కల్పించారు. ఆ కోవకు చెందిందే ఇది తప్ప మరొకటి కాదు. విదేశీ, స్వదేశీ కంపెనీలు రాష్ట్రానికొక పన్ను చెల్లింపు విధానం లేకుండా వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు తీసుకున్న చర్య ఇది. ఏ విధానం అయినా జనానికి చేసే మేలు ఏమిటన్నదే గీటురాయి. జిఎస్‌టి వ్యాపారులకు వుద్ధేశించింది తప్ప జనంపై భారాలు తగ్గించేది కాదు.నిజానికి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్దే వుంటే పెట్రోలియం వుత్పత్తులను కూడా దాని పరిధిలో చేర్చి వుండాల్సింది. కనీసం గత మూడు సంవత్సరాలలో పెట్రోలియం వుత్పత్తులపై అదనంగా పెంచిన పన్ను మొత్తాన్ని తగ్గించినా ఎంతో మేలు జరిగేది. జిఎస్‌టి వలన సామాన్య మానవుడి కుటుంబ బడ్జెట్‌లో పెద్ద మార్పులేమీ లేవన్నది ప్రాధమిక పరిశీలన.వ్యాపారం చేసుకొనేందుకు అనుమతి పేరుతో మన గడ్డపై కాలు పెట్టి క్రమంగా రాజకీయ అధికారాన్నే తెల్లవారు స్వాధీనం చేసుకున్నారు. మన సంపదలను కొల్లగొట్టారు. సారం వారు పీల్చుకొని మనకు పిప్పి మిగిల్చారు. ఇప్పుడు ప్రపంచంలోని కార్పొరేట్‌ శక్తులన్నీ మనదేశంలో కాలు పెట్టేందుకు కాంగ్రెస్‌ పాలకులు తలుపులను కొద్దిగా తెరిస్తే బిజెపి పాలకులు బార్లా తెరిచి ఎర్రతివాచీ పరచి స్వాగతాలు పలుకుతున్నారు. ఇది తిరోగమనం తప్ప పురోగమనం కాదు. మన షరతులపై విదేశీ పెట్టుబడులను అనుమతిస్తే అది మన అధికారానికి చిహ్నం, అదే వారి షరతులకు అంగీకరిస్తే స్వాతంత్య్రాన్ని వారి కాళ్ల ముందు పెట్టటం తప్ప వేరు కాదు.

దీర్ఘకాలం పాటు అటు సోవియట్‌ కూటమిలోనూ ఇటు అమెరికా కూటమిలో చేరకుండా మన దేశం అవలంభించిన అలీన విధానం నుంచి మన ప్రభుత్వం క్రమంగా వైదొలుగుతూ క్రమంగా అమెరికా కౌగిట్లోకి చేరుతోంది. శకుని రాజకీయానికి కౌరవులు బలైనట్లుగా అమెరికాతో చేతులు కలిపిన ఏదేశం కూడా బాగుపడలేదు. మన పక్కనే వున్న పాకిస్ధాన్‌ ఎలా నియంతలపాలనలో మగ్గిందీ చూశాం, అప్పుడప్పుడు పౌరపాలకులు అధికారానికి వచ్చినా సైన్యం కనుసన్నలలోనే వారు పని చేయాలి. ఏడుపదుల స్వాతంత్య్రం తరువాత పాకిస్ధాన్‌ ఎంత దుస్ధితిలో వుందో చూశాము. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండాలలో అమెరికాతో చేతులు కలిపిన దేశాలన్నింటా సైనిక నియంతలు, ప్రజాద్రోహులు తప్ప మంచివారెవరినీ అధికారంలోకి రానీయలేదు. పాలస్తీనాను ఆక్రమించి అరబ్బులను వారి ప్రాంతాల నుంచి తరమివేసిన ఇజ్రాయెల్‌ను ఇప్పటికీ ప్రపంచమంతా చీదరించుకొంటోంది, అధికారికంగా ఐక్యరాజ్యసమితిలో దానిని వ్యతిరేకిస్తోంది. అలాంటి దేశంతో తొలిసారిగా మన ప్రధాని నరేంద్రమోడీ చేతులు కలపటం అంటే అమెరికాతో మన స్నేహం ఎక్కడికి దారితీయించిందో అర్ధం అవుతోంది. నువ్వు ఎలాంటి వాడివో చెప్పాలంటే నీ స్నేహితులను చూస్తే చాలు అన్న విషయం తెలిసిందే.

డెబ్బయి ఒకటవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గతాన్ని నెమరు వేసుకొంటే మన మహత్తర లక్ష్యాల నుంచి ఎలా వైదొలిగామో, దాని పర్యవసానాలేమిటో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. వాటిని చూసి గుండెలు బాదుకోవటం గాక వర్తమానంలో కర్తవ్యాలను గుర్తెరగటం, అందుకోసం పని చేయటమే స్వాతంత్య్ర వుద్యమంలో అశేష త్యాగాలు చేసిన వారికి సరైన నివాళి.