Tags
cow, cow dung, cow sciences, Gujarat model, Narendra Modi, narendra modi bhakts, Science, Vedic sciences
ఎం కోటేశ్వరరావు
ఎందరో యువత, మధ్యతరగతి మేథావులు బిజెపి అంటే ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ మీద కోపంతో నరేంద్రమోడీ గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయనను చూసి చెప్పినవారికల్లా ఓటు వేశారు. ఆ బలహీన క్షణంలో అలా జరిగింది అన్నట్లుగా ఓటింగ్ రోజు జరిగిందేదో జరిగిపోయింది. తరువాత ఆ ప్రభుత్వం ఏమి చేస్తుందో, ఆ పార్టీ వారు, వారికి వెన్నుదన్నుగా వున్న సంస్ధలకు చెందిన వారు ఏమి చేస్తున్నారో అని ఒక్క క్షణమైనా వెనుదిరిగి చూశామా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మూడు సంవత్సరాలు గడిచాయి. ఎన్నో విజయాలు సాధించామని ఇప్పటికే వూదరగొడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎన్నికల ప్రణాళిక, ప్రచారంలో చెప్పినవి మినహా ఇతర అనేక వివాదాస్పద, రెచ్చగొట్టే, సమాజాన్ని చీల్చే అంశాలను బిజెపి, దాని చుట్టూ వుండే శక్తులు ముందుకు తెస్తున్నాయి. ఆ గోమాత సాక్షిగా మూడు సంవత్సరాలకు ముందున్నదాని కంటే దేశం ఏ రంగంలో ముందుకు పోయిందో ఆధార సహితంగా ఎవరైనా చెబితే సంతోషం. అంతరిక్షంలోకి అత్యధిక వుపగ్రహాలను పంపి విజయం సాధించిన శాస్త్రవేత్తలు ఒకవైపు మరోవైపు ఆవు పేడ, మూత్రంలో ఏముందో తెలుసుకొనేందుకు కాలం వృధా చేసే శాస్త్రవేత్తలు. మొదటి వారిని చూసి గర్వపడాలా రెండో వారిని చూసి సిగ్గుతో తలవంచుకోవాలా? యధారాజా తధా శాస్త్రవేత్త !
వాట్సాప్ గ్రూపులలో ఆ మధ్య గుజరాత్‌లోని రాజ్‌కోటలో అంతర్జాతీయ విమానాశ్రయం స్ధాయిలో ఒక బస్టాండ్ నిర్మించారంటూ ఏప్రిల్ నెలలో ఫొటోలతో సహా సమాచారం తిరిగింది. బాబూలాల్ సుప్రియ అనే కేంద్ర మంత్రి ఆ బస్టాండ్‌ను ప్రారంభించారంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటి ? ఇప్పటి వరకు ఆ బస్టాండ్ నిర్మాణమే జరగలేదు. ప్రతిపాదిత కట్టడటం గురించి తయారు చేసిన నమూనా ఫొటో అది. పోనీ అది దేశంలో పెద్ద బస్టాండా అంటే కానే కాదు. దానికంటే మూడు నాలుగు రెట్లు పెద్దవి మన హైదరాబాదు, విజయవాడ, గుంటూరుల్లో ఇప్పటికే నిర్మితమై వున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వ అభివృద్ధి గురించి కూడా ఇలాంటివే అనేకం ప్రచారంలో వున్నాయని తెలుసుకోవాలి.
గోరక్షణ, గోమాంసం తింటున్నారనే పేరుతో మైనారిటీలు, దళితులను మూకుమ్మడిగా హత్యలు చేయటం వెనుక తమ ప్రభుత్వ అభివృద్ధి అజెండాను పక్కదారి పట్టించే కుట్ర వుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మరత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ బుధవారం నాడు రాజ్యసభలో చెప్పారు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్న జర్మన్ నాజీ మంత్రి గోబెల్స్ ఆయనను ఆవహించినట్లుగా కనిపిస్తోంది. గో రక్షకుల ముసుగులో సంఘవ్యతిరేకశక్తులు దుకాణాలు తెరిచారనో, వారి చర్యలను సహించరాదనో, కఠిన చర్యలు తీసుకుంటామనో కోహినూరు వజ్రం వంటి మాటలతో మౌనబాబా ప్రధాని నరేంద్రమోడీ వుత్తరాయణానికో దక్షిణాయానానికో సెలవిస్తుంటారు. ఆయన శిష్యులు మరోవైపు ఇలా నోరు పారవేసుకుంటారు. అసలు అభివృద్దే బూటకం అయితే దానిని అడ్డుకొనేందుకు గోరక్షకుల పేరుతో ఎవరో దాడులు చేస్తున్నారని చెప్పటం అంతకంటే దారుణం. ఆ దాడులు ఎక్కడైతే జరిగాయో, జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలన్నింటా అధికారంలో వున్నది బిజెపి ప్రభుత్వమే. తమ ప్రభుత్వ అభివృద్దిని అడ్డుకొనే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. దాదాపు అన్ని వుదంతాలలో బాధితులు, వారి కుటుంబాలపైనే తప్పుడు కేసులు బనాయించిన ఘనుల ప్రతినిధి అయిన కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో అలా మాట్లాడారంటే గుండెలు తీసిన బంట్లకే సాధ్యం అని స్పష్టం కావటం లేదూ ?
ముఖ్యమంత్రిగా తాను అభివృద్ధి చేసిన గుజరాత్ నమూనాను దేశమంతటికీ విస్తరిస్తానని నరేంద్రమోడీ ఎన్నికలకు ముందు ఊరూ వాడా ప్రచారం చేశారు. తరువాత విలేకర్లు ప్రశ్నించటానికి వీలులేకుండా ఇంతవరకు ప్రధాని హోదాలో ఒక్కటంటే ఒక్క పత్రికా గోష్టి కూడా నిర్వహించకుండా ఒక రికార్డు సృష్టించారు. అసలా గుజరాత్ అభివృద్ధి అనేదే పెద్ద బూటకం. అందుకే చివరికి మన్‌కీ బాత్‌లో కూడా దాని ప్రస్తావన తేవటం లేదు.2003 నుంచి అంటే గుజరాత్‌లో నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల నుంచి గుజరాత్ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం అది కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాల సంఖ్య 51,378, అమలు జరిగినవీ, అమలులో వున్న పధకాల పెట్టుబడుల విలువ రు. 84లక్షల కోట్లని చెప్పారు. ప్రస్తుతం మన దేశ మొత్తం స్ధూలాదాయం రు.170లక్షల కోట్లరూపాయలని అంచనా. అంటే ఒక్క గుజరాత్‌కు వచ్చిన పెట్టుబడులే 84లక్షల కోట్లంటే మొత్తం జిడిపిలో గుజరాత్ విలువ ఎంతో లెక్కవేసుకోవాల్సింది.ఇవన్నీ చెప్పింది మూడు సంవత్సరాల క్రితం వరకు నరేంద్రమోడీ, తరువాత ఆయన వారసులు అని తెలిసిందే. కానీ అసలు వాస్తవం ఏమంటే 1983 నుంచీ అంటే మోడీ కంటే రెండు దశాబ్దాల ముందునుంచీ 2016 సెప్టెంబరు వరకు గుజరాత్‌లో అమలయిన పధకాలు 6,251 వచ్చిన పెట్టుబడుల విలువ రు.2.76లక్షల కోట్లు, కల్పించిన వుపాధి 10.67లక్షల మందికి, ఇవిగాక మరో 4033 పధకాలు మధ్యలో వున్నాయి, వాటి మొత్తం పెట్టుబడి రు.9.52లక్షల కోట్లని, మరో 9.3లక్షల మందికి వుపాధి కల్పించబడుతుందని సాక్షాత్తూ గుజరాత్ అధికారిక సమాచారమే వెల్లడించింది. మోడీ భక్తులు నిజాలను తట్టుకొనే ధైర్యం వుంటే దిగువ లింక్‌లోని వివరాలు చదివి, వాస్తవం కాదని గోమాత సాక్షిగా నిరూపిస్తే సంతోషం.http://www.moneylife.in/article/the-gujarat-model-ndash-some-facts/51106.html ఈ వివరాలు సేకరించింది కమ్యూనిస్టులు కాదు, సీతారాం ఏచూరి అంతకంటే కాదు.
గోవాలో గొడ్డు మాంసానికి కొరత లేదని, అటువంటి పరిస్ధితే వస్తే పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి దిగుమతికి ఏర్పాట్లు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మనోహర్ పారికర్ ఏకంగా అసెంబ్లీలోనే చెప్పారు. ఇలా మాట్లాడిన ముఖ్యమంత్రి బిజెపి పరువు తీశారని, రాజీనామా చేయాలని, బిజెపి అంటే బీఫ్ జాయ్ పార్టీ అని విశ్వహిందూ పరిషత్ నేత డాక్టర్ సురేంద్ర జైన్ ఎద్దేవా చేశారు.
గోరక్షకులకు ఆయుధాలు, శిక్షణ ఇస్తామని విశ్వహిందూపరిషత్ నేతలు ప్రకటించారు. కాబోయే గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రచారంలో వున్న ఆ సంస్ధ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా గోరక్షకులను సాయుధులను చేస్తామని అలీఘర్‌లో చెప్పారు. తాము ఇప్పటికే తమ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చామని, గుంపులతో ప్రతికూల పరిస్ధితులు ఎదురైతే ఎలా వ్యవహరించాలో కూడా దానిలో నేర్పించామని ఒక నేత చెప్పినట్లు టెలిగ్రాఫ్ పత్రిక రాసింది.
ఆవుల దొంగ రవాణాను అరికట్టేందుకు, లవ్ జీహాద్ నిరోధానికి ఒక్క ఆలీఘర్ జిల్లాలోనే ఐదువేల మంది ‘మత సైనికుల’ ను తయారు చేయాలని అలీఘర్‌లో ఈనెల 14-16 తేదీలలో అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది.భజరంగదళ్ కార్యకర్తలు మాత్రమే ఈ సైనికుల్లో చేరటానికి అర్హులట. ఈ సైనికులు ఆవుల దొంగరవాణాతో పాటు లవ్ జీహాద్ నిరోధం, హిందూ యువకులు, యువతులు, మఠాలు, దేవాలయాలు, సంత్ సమాజం, దేశాన్ని కూడా రక్షిస్తారట.
గత పది సంవత్సరాలలో 50 మందికి పైగా పోలీసులు, గోరక్షకులను గోహంతకులు చంపివేశారని విహెచ్‌పి అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. గోరక్షకులు బాధితులు తప్ప ప్రజా పీడకులు కాదని, గో రక్షకులకు కూడా ఆత్మరక్షణ హక్కుందని కూడా అన్నారు.
వేదాల్లోనే అన్నీ వున్నాయని చెప్పే మనువాదులు, వాటిని సమర్ధించే వారు గాని వాటి నుంచి పెట్రోలు, పైలట్లతో పనిలేని, ఎంత మంది ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే పుష్పక విమాన, కార్ల, ఎన్ని ప్రయోగించినా తరగతని అస్త్రాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర వాటిని గానీ ఇంతవరకు బయటకు తీయలేదంటే వారి దేశ భక్తిని అనుమానించాల్సి వస్తోంది. మనమే వాటిని తయారు చేసి ఎగుమతి చేసి ప్రపంచంలో మన దేశాన్ని మొదటి స్ధానంలో నిలబెట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకొనేందుకు బడా కార్పొరేట్ల కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారా అన్నది సందేహం. మరోవైపు కౌపతి లేదా గో వేదం. లాభాల వేటలోని కార్పొరేట్ సంస్ధలు ఇప్పటికే ఆవు పేడ, మూత్రంతో వ్యాపారం చేస్తున్నాయి. వాటి మార్కెట్‌ను మరింత పెంచేందుకు మోడీ సర్కార్ చర్యలు తీసుకుంది. బహుశా అది మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగం కావచ్చు.
ప్రస్తుతం మన దేశ జిడిపిలో 0.8శాతం సైన్సు కోసం ఖర్చు చేస్తున్నారు. దానిని మూడుశాతానికి పెంచాలన్నది మన శాస్త్రవేత్తల చిరకాల డిమాండ్. సైన్సు పరిశోధనల మీద ఖర్చు పెట్టని, యువత నైపుణ్యాన్ని పెంచని ఏదేశమైనా పరాధీనంగా వుంటుంది తప్ప పురోగమించలేదు. సైన్సుకోసం భారత్ పురోగతి పేరుతో ఆగస్టు తొమ్మిదిన దేశ వ్యాప్తంగా నిరసన,డిమాండ్లతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మరోవైపున కేంద్ర ప్రభుత్వం ఏ చేయబోతోంది.
పంచగవ్యం(ఆవు పేడ, మూత్రం, పాలు, పాలనుంచి వచ్చే పెరుగు, వెన్న లేదా నెయ్యి)లోని సుగుణాలను నిర్ధారించేందుకు అవసరమైన పరిశోధనలు చేయాలంటూ పందొమ్మిది మంది ప్రముఖులతో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే ఇప్పటికే అరకొరగా వున్న నిధులను వీటికోసం మళ్లించనుంది అన్నది వేరే చెప్పనవసరం లేదు. సంస్కృత గ్రంధాలలో వున్న విజ్ఞానాన్ని దాన్ని వెలికి తీసేందుకు ఆ భాష తెలిసిన పండితులుండగా వాటిపై పరిశోధనలు చేసేందుకు మరొక కమిటీ, శాస్త్రవేత్తలు ఎందుకు ? ఇప్పటికే మార్కెట్లో సర్వరోగనివారిణి పేరుతో జిందాతిలిస్మాత్‌ను విక్రయిస్తున్నారు. దానికి పోటీ లేదా దాని స్ధానంలో కొత్తదానిని తయారు చేస్తే ఎలా వుంటుందన్నట్లుగా పంచగవ్యాలకు బెల్లం, అరటి పండ్లు, లేత కొబ్బరినీరు, చెరకు రసాలను తగు మోతాదులో కలిపి ఆరోగ్యం నుంచి పంటల సాగుకు అవసరమైన ఎరువుల వరకు ఒకే మాత్రలో వుండే విధంగా ఆ పరిశోధనలు చేస్తారట. ఇలాంటి చర్యలతో దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెబుతుంటే చెవుల్లో పూలు పెట్టుకొని తలాడిస్తే అంతకంటే దేశద్రోహం, నగుబాట్ల వ్యవహారం మరొకటి వుండదు.