Tags

, , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

2017 జూలై 28వ తేదీ ప్రజాశక్తిలో అరుణ గోగులమండ గారు ఆలోచనలు కలిగించటమే నా లక్ష్యం అని ముందే ప్రకటించుకొని కొన్ని ఆలోచనల పేరుతో కొన్ని అంశాలను పాఠకుల ముందుంచారు.http://www.prajasakti.com/Article/Prajagalam/1949493 అసలు బుర్రలకు పని పెట్టటమే మరచిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రయత్నం చేయటం అభినందనీయం. వాటిపై అవలోకన గురించి కూడా ఆలోచించాలని మనవి.

ప్రపంచంలో అనేక ఆలోచనా విధానాలున్నాయి. నూరు పువ్వులు పూయనివ్వండి వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్న లోకోక్తి తెలిసిందే. దళితుల పట్ల సామాజిక వివక్షను అంతం చేసేందుకు, వారిని దోపిడీ నుంచి విముక్తి చేసేందుకు అంబేద్కర్‌ ఆలోచనా విధానమొక్కటే చాలదు, అందువలన సకల పీడితుల విముక్తికి చెబుతున్న ఇతర ఆలోచనా విధానాలను కూడా ప్రజల్లోకి వీలైనంతగా చేరవెయ్యాలేమో ?

మన విధి(డెస్టినీ)ని మనమే నిర్ణయించుకోవాలి అని చెప్పారు. ఇది సాధారణ అర్ధంలో అయితే అభ్యంతరం, ఇబ్బంది లేదు. దళితుల విధిని దళితులే నిర్ణయించుకోవాలి అనే ఒక పరిధి అర్ధంలో అయితే ఆలోచనలకు అడ్డుకట్ట వేయటమే. సంపదలకు మూలమైన వారిలో దళితులు కూడా ఒక భాగమే తప్ప దళితులే సర్వస్వం కాదు. సామాజికంగా వివక్ష లేకపోవటం లేదా అంత తీవ్రంగా లేకపోవచ్చు గాని దళితేతర కులాల్లోని పేదలందరూ సంపదలకు మూలమైన వారిలో భాగమే. సంఖ్యాపరంగా చూస్తే దోపిడీకి గురవుతున్నవారిలో వారే అధికులు. మెట్ల కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్న కులాల్లో కూడా దళితులతో కలసి గని,వని,ఖార్ఖానాలో పని చేసే వారు వున్నారు. వారికి వూరడింపు సామాజిక వివక్ష లేకపోవటం, వూరి మధ్యలో కూడా వుండనివ్వటం తప్ప మిగతా వన్నీ సేమ్‌ టు సేమ్‌. అరుణగారు చెప్పినట్లు ఆధిపత్య కులాల ఫ్యాక్టరీలు, గనులు, పొలాల్లో పని చేసే దళితులే కాదు, ఆధిపత్య కులాల్లోని పేదలు కూడా తమకూ హక్కులున్నాయన్న సంగతే తెలియక బలౌతూనే వున్నారా లేదా ? దళిత కులానికి చెందిన వారు కూడా పెట్టుబడిదారులుగా వున్నారు. వారి సంస్ధలలో దళితుల పరిస్ధితి ఏమైనా మెరుగ్గా వుందా? సామాజిక వివక్ష తప్ప దోపిడీ సేమ్‌ టు సేమ్‌ కాదా ?

ఆధిపత్య వాదులందరికీ కుల గోడలను కూల్చటం సుతరామూ ఇష్టం లేదన్నారు. కులాల హెచ్చు తగ్గుల వల్ల వచ్చే ఆడంబరాలను, ఐశ్వర్యాలను ఎప్పటికీ వారే అనుభవించాలనే దుర్బుద్ధి అందుకు కారణం అని అరుణగారు చెప్పారు. కులాన్ని బట్టి ఐశ్వర్యాలు వచ్చి వుంటే స్వాతంత్య్రానికి ముందు తెలంగాణా, ఆంధ్రా ప్రాంతంలో వేలు, లక్షల యకరాలపై ఆధిపత్యం కలిగిన భూస్వాములు, జాగీర్దార్లు, దేశ ముఖులు, జమిందార్లు కేవలం వేళ్లమీద లెక్కించదగిన వారు మాత్రమే ఎందుకున్నారు.ఆ కులాలో పుట్టిన వారందరికీ అదే మాదిరి సంపదలు ఎందుకు దక్కలేదు. దొరలు, జమిందార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారితో కలసి అదే ఆధిపత్య కులాలకు చెందిన వారు ఎందుకు పోరాడినట్లు ? అలా పోరాడిన వారిలో ఆధిపత్య కులాలని పిలిచే వాటిలో వారి ప్రమేయం లేకుండా పుట్టిన ఎందరో భూస్వామిక కుటుంబాలకు చెందిన వారు కూడా వున్నారు. అలాగే క్రైస్తవం, ఇస్లాం ఇతర మతాలు మెజారిటీగా వున్న దేశాలలో ఆ మతాలలోని కొద్ది మందే దేశాలను సైతం శాసించగలిగిన కార్పొరేట్‌ సంస్ధల అధిపతులుగా వుండగా మెజారిటీ పౌరులు వాటిలో పని చేసే కార్మికులు, లేదా వుద్యోగులుగా ఎందుకున్నారు. రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఆధిపత్యం వహించింది క్రైస్తవులు, వారిని కూల్చి వేసిందీ క్రైస్తవులే కదా ? అంతెందుకు క్రైస్తవుడైన హిట్లర్‌ ఫాసిస్టుగా మారితే వాడిని సమర్ధించింది ఎవరు, వాడిని, వాడి ముష్కర మూకలను హతమార్చింది ఎవరు ? క్రైస్తవులే కదా ? అందువలన అరుణ గారు, ఆమె మాదిరి అభిప్రాయం కలిగిన వారందరూ కుల, మత పరిధి దాటి ఆలోచించటం అవసరం.

సామాజిక వివక్షకు గురవుతున్న కులాల జాబితాల్లో వున్నవారికి రిజర్వేషన్లు ఇస్తూ వారు మతం మారితే రద్దు చేయటం అన్యాయం అనటంలో ఎలాంటి పేచీ లేదు. ఎందుకంటే మతం మారినా వారి సామాజిక స్ధితిలో మార్పుండటం లేదు. కానీ అరుణగారు క్రైస్తవం పుచ్చుకున్న ఆధిపత్య కులాల వారు కూడా తమ కులం కోల్పోయి దళితులుగా మారిపోవాలి కదా అంటున్నారు. మతం మారినా దళితుల రిజర్వేషన్లు కొనసాగాలి, కుల విభజన గోడలు కూలిపోవాలని ఒకవైపు చెబుతూనే మరోవైపు ఇలాంటి వాదనలు చేయటం గందరగోళ ఆలోచనకు నిదర్శనం. ఇక్కడ క్రైస్తవం దళితుల మతం కాదని గ్రహించటం అవసరం. హిందూమతంలో శైవులు, వైష్ణవులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల వంటి వివిధ తాత్విక విభజనలు వున్నట్లే ఇస్లాం, క్రైస్తవంలో కూడా ప్రబోధకులను బట్టి కొన్ని రకాల విభజనలు వున్నాయి తప్ప కులాల ప్రస్తావన, విభజన లేదు.

దళితుల సాధికారత కోసం, రిజర్వేషన్ల కల్పనలో అంబేద్కర్‌ చేసిన కృషిని ఎవరైనా తక్కువ చేసే చూస్తే అది పాక్షిక దృష్టి తప్ప వేరు కాదు. అనేక మంది రిజర్వేషన్లు అనే భావన అంబేద్కర్‌తోనే ప్రారంభమైందనే అభిప్రాయంతో వున్నారు. ఇది కూడా పాక్షిక దృష్టే. అంబేద్కర్‌ కంటే ముందే కొల్లాపూర్‌ సంస్ధాన అధిపతి సాహు మహరాజ్‌ 1882,1891లోనే బ్రాహ్మణేతరులు, వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టారు. తరువాత కాలంలో అంబేద్కర్‌ మరింత నిర్ధిష్టంగా దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుతో సహా అనేక ప్రతిపాదనలపై కృషి చేశారు. దళితులు మతం మారితే వెనుకబడిన తరగతిగా పరిగణించబడటానికి కూడా ఆ అంబేద్కర్‌ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగమే వీలు కల్పించిందని గుర్తించటం అవసరం. ఇదొక సంక్లిష్ట సమస్య. అందువలన ఆరుణగారు చెబుతున్నట్లు అది కుట్రే అయితే అందుకు వీలు కల్పించిన అంశాలేమిటి ? రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దమే అయినప్పటికీ అవి శాశ్వతం కాదు, అంబేద్కర్‌ కూడా రిజర్వేషన్లును పది సంవత్సరాలు అమలు చేసిన సమీక్షించి మరో పదిసంవత్సరాలు పొడిగించమని చెప్పారు తప్ప శాశ్వతంగా వుంచాలని అభిప్రాయపడలేదు. అందువలనే ఎంతకాలమనే ప్రశ్న పదే పదే తలెత్తుతున్నది. సామాజిక వివక్ష అంతమయ్యే వరకు వాటిని కొనసాగించాలనటం న్యాయబద్దం. ఎంత త్వరగా దానిని అంతం చేస్తే అంత త్వరగా రిజర్వేషన్లను ముగించ వచ్చు.

ఇక మతం మారిన హిందూ దళితులకు రిజర్వేషన్లు వర్తించపోవటం సమస్య. దీన్ని కుట్రగా అభివర్ణించవచ్చునా ? రాజ్యాంగం అమలులోకి రాకముందే దీనిపై చర్చ జరిగింది. సిక్కు మతంలో కూడా దళితులు వున్నందున వారికి కూడా హిందూ దళితులకు వర్తించే సౌకర్యాలను వర్తింప చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. సిక్కు మతంలోకి మారేందుకు ఎవరూ ఎవనీ బలవంత పెట్టలేదని, సిక్కు మతం అంటరాని తనాన్ని గుర్తించలేదని, అందువలన సిక్కు మతాన్ని అవలంభించాలంటే రిజర్వేషన్లు వదులు కోవాలి, రిజర్వేషన్లు కావాలంటే సిక్కు మతాన్ని వదులుకోవాల్సి వుంటుందన్న వాదనలు వచ్చాయి. క్రైస్తవం, ఇస్లాం కూడా అలాంటివే. అవేవీ అంటరానితనాన్ని గుర్తించలేదు. అందువలన రిజర్వేషన్‌ అవసరం లేదనుకున్న వారు హిందూ మతం నుంచి మారవచ్చు లేదా కావాలనుకున్నవారు అదే మతంలో వుండాలన్నది లాజిక్కు. అయితే మతం మారినా వివక్ష కొనసాగుతున్నందున వారికి కూడా హిందూ దళిత రిజర్వేషన్లే అమలు జరపాలన్న వాదన ముందుకు వచ్చిందని గమనించాలి. అందువలన ఆలోచనకు చర్చ పెట్టే ముందు పూర్వపరాలను కూడా సమగ్రంగా వివరించకపోయినా ప్రస్తావించటం అవసరం? కాదంటారా ?

కుల వివక్ష, అంటరానితనం వంటి మాయని మచ్చలను సహించిందీ, అమలు జరిపిందీ హిందూమతం లేదా దాని పరిరక్షకులమని చెప్పుకొనే వారు. దానికి ప్రాతిపదిక మనువాదం. ఇప్పటికీ దానిలో ఎలాంటి సంస్కరణలు లేవు. అందువలన హిందూమతంలో వుండాలా లేదా అన్నది ఎవరికి వారు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాల్సిన అంశం. మతం అన్నది మత్తు మందు. అది ఏమతానికైనా వర్తించే సాధారణ సూత్రం. మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టాలని చూసేవారు, మత విభజనతో సమాజాన్ని వెనక్కు తిప్పాలని చూసే వారు అది మెజారిటీ అయినా మైనారిటీ అయినా సమాజానికి వ్యతిరేకులే. ప్రతి మతం తన మత్తు మందును తీసుకొనే జనాలు తగ్గకుండా చూసుకోవాలని చూస్తుంది. రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని హిందూమత శక్తులు దళితుల మతమార్పిడికి ఎలా అడ్డంపడుతున్నాయో, మతం మారినా దళితులకు రిజర్వేషన్లు అమలు జరపాలని క్రైస్తవమత శక్తులు తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవటానికి చూస్తున్నాయి.

చివరిగా ఒక్క మాట. దళితుల అభ్యున్నతికి అంబేద్కర్‌ కృషి అమోఘం. ఇదే సమయంలో ఆయన ఆధ్వర్యాన ఏర్పాటయిన రాజ్యాంగం దళితుల సమస్యలకు జిందా తిలిస్మాత్‌ కాదని ఇప్పటికే రుజువైంది. స్వాతంత్య్రవుద్యమ ఆకాంక్షలను ఇంతవరకు అమలు జరపలేదు, అనేకానికి తూట్లు పొడిచారు. అందువలన ఈ రాజ్యాంగం జనానికి, ప్రత్యేకించి దళితులకు కల్పించిన రక్షణలను కాపాడుకొంటూనే వారితో పాటు ఇతర కష్టజీవుల విముక్తికి అవసరమైన ఆలోచనలు చేయటం అవసరం.