Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

మరో ఏడాదిలో దేశంలో అత్యవసర పరిస్ధితి ప్రకటించటానికి ముందు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభ వెలిగిపోతుందగా1974లో దేవకాంత బారువా అనే అసోం నాయకుడు ఇందిరే ఇండియా-ఇండియా అంటే ఇందిరే అని వర్ణించాడు. భజనపరుల్లో అగ్రగణ్యుడిగా ప్రాచుర్యం పొందాడు. దేశంలో ఇప్పుడు అత్యవసర పరిస్ధితి కంటే కొన్ని దారుణమైన పరిస్ధితులు వున్నాయన్నది కొందరి అభిప్రాయం. సరే వాటిని పాఠకులకు వదలివేస్తా. తాజాగా లోక్‌సభలో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజ్జు ఆటవిక చిత్ర వధ లేదా హత్యాకాండ(లించింగ్‌) గురించి చర్చ సందర్భంగా ప్రతిపక్షాలను బెదిరించి అత్యవసర పరిస్ధితి రోజులను గుర్తుకు తెచ్చారంటే అతిశయోక్తి కాదు. ఆటవిక హత్యాకాండ వుదంతాల సందర్భంగా ప్రధాన మంత్రి, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయటమంటే దేశ ప్రతిష్టనే దెబ్బతీసినట్లుగా భావించాలని కిరెన్‌ రిజ్జు మహాశయుడు దేవకాంత బారువాను మరోసారి గుర్తుకు తెచ్చారు.

గోరక్షణ ముసుగులో చెలరేగుతున్న గూండాలు బిజెపి పాలిత రాష్ట్రాలలో చెలరేగిపోతూ దాడులు, హత్యాకాండకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అరుదుగా నోరు విప్పే ప్రధాని నరేంద్రమోడీ కూడా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తీసుకోవాలని చెప్పిన సంగతి మరోసారి గుర్తు చేయనవసరం లేదు. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా సహజంగానే ప్రతిపక్షాలు దేశాన్ని లించిస్ధాన్‌గా మార్చవద్దని హెచ్చరించాయి.గోరక్షకుల ఆటవిక చర్యలను తాము సమర్ధించటం లేదంటూనే బిజెపి సభ్యులు వ్యవహరించిన తీరు రానున్న రోజుల్లో గో గూండాలు మరింతగా రెచ్చిపోయేందుకు దారితీసేదిగా వుందంటే అతిశయోక్తి కాదు.

గోరక్షణ, గొడ్డు మాంసం తింటున్నారంటూ దాడులకు దిగుతున్న గూండాలను అదుపు చేయాలని ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంటే ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు బిజెపి సభ్యులు బ్రాందీ, వీస్కీ సీసాలపై హిందూ దేవుళ్ల చిత్రాలను ముద్రిస్తున్నారని అది కూడా ఆటవిక చిత్రవధతో సమానమే అని వాదనకు దిగారని వార్తలు వచ్చాయి. ఒకవైపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి గో రక్షకుల చిత్రవధలతో నిమిత్తం లేదని ఆ పార్టీ వారు చెబుతారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే కావాలని హత్యాకాండకు పాల్పడుతున్నారని హుకుందేవ్‌ నారాయణ యాదవ్‌ అనే బిజెపి సభ్యుడు లోక్‌సభలో చెప్పారు. ఆటవిక హత్యా కాండ అనే పద అర్ధాన్ని మరింత విస్తృతపరచాల్సి వుందని భాషా చర్చకు సైతం ఆ పెద్దమనిషి తెరతీశారు. హిందూ పండగల సందర్భంగా కొన్ని బహిరంగ రోడ్లలో ప్ర దర్శనలకు అనుమతివ్వకపోవటాన్ని కూడా ఆటవిక హత్యాకాండగానే పరిగణించాలని డిమాండ్‌ చేశారు. గో రక్షణ పేరుతో జరుగుతున్న హత్యాకాండలో మరణిస్తున్నవారెవరు అనే అంశాన్ని పక్కన పెట్టి మంత్రి రిజు తన తెలివితేటలను పూర్తిగా ప్రదర్శించారు.ఆయన చేసిన వాదన సారాంశం ఇలా వుంది. ముందుగా చెప్పాల్సిందేమంటే ఇది రాష్ట్రాల సమస్య. ఒక వుదంతం( గో గూండాల దాడులు) ఆధారంగా ప్రధాని లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పాలనాధికారాలను చేపట్టటం వూహించలేము.కేవలం రాజకీయం చేయటం కోసమే వారు ఈ సమస్యను ముందుకు తెచ్చారు.నిజానికి ఆ దాడుల గురించి వారికి ఆసక్తి లేదు.ప్రధాని నరేంద్రమోడీని బదనాం చేసేందుకు ఈ విధంగా చేస్తున్నారు, దేశవ్యాపితంగా మాపై ప్రచారం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. మాపై దాడి చేసేందుకు ఒక సాకుకోసం చూస్తున్నారు.దేశంలో జరగకూడని పనులు జరిగినపుడు వాటిని మనమందరం ఖండించాలి.దీనిలో పార్టీ సమస్యలేదు.పార్టీ రాజకీయాలు వుండకూడదు. నేడు ప్రపంచమంతటా మన ప్రధాన మంత్రిని పొగుడుతూ స్త్రోత్ర, గానాలు చేస్తున్నారు. ఇటువంటి ప్రధాని ఒక దేశానికి ఇలాంటి సమసయంలో దొరకటం అరుదైన విషయం. మనకు దొరికిన అదృష్టం మిగతా దేశాలకు అరుదుగా లభిస్తుంది. ఇవి మన రోజులు. ప్రపంచ దృష్టిలో భారత్‌ పేరు వెలిగిపోతోంది. మన ప్రధానిని ప్రపంచమంతా గౌరవిస్తున్నపుడు ఆయన ప్రతిష్ట, మా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయటం దేశ ప్రతిష్టను దెబ్బతీయటంతో సమానం అని మీరు మరచిపోవద్దు. మీరు ఎన్నిసార్లు ఈ సమస్యను లేవనెత్తితే జనం అన్నిసార్లు మీ బండారం బయటపెడతారు.ఇలాంటి కల్పిత అంశాలను సమస్యలుగా చేసిన ప్రతిసారీ బిజెపి మరింత బలపడుతుంది.ఇది నేను చేస్తున్నది కాదు ప్రజల హెచ్చరిక.

ఇటువంటి వారి భజన తీవ్రత పెరిగే కొద్దీ నరేంద్రమోడీ ప్రతిష్ట తరగిపోతుందని, దేశజనం చెవుల్లో పూలు పెట్టుకొని లేరని ఆయన భక్తులు గ్రహించటం అవసరం.