Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

దేశంలో జరుగుతున్న వాటి గురించి నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే నరేంద్రమోడీ భక్త జనాలకు కోపం రావచ్చు. ఇప్పుడు దేశానికి కావాల్సింది ఎవరు? కాషాయ కూటమి అసలైన అజెండాను జయప్రదంగా అమలు చేసేందుకు కండలు తిరిగి పేరు మోసిన గో గూండాలు, సామాజిక మాధ్యమంలో దాడులు చేసే మరుగుజ్జు యోధులా(ట్రోల్స్‌) ? బిజెపి కూటమి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలను, మేకిన్‌ ఇండియా అన్న నరేంద్రమోడీ పిలుపు నిజం చేసేందుకు కావాల్సిన పేరు ప్రఖ్యాతులున్న ఆర్ధికవేత్తలా ? ఆవులకోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు గురించి పరిశీలిస్తున్నట్లు స్వయంగా మోడీ అంతరాత్మ అమిత్‌ షా లక్నోలో ఈ మధ్య విలేకర్లకు చెప్పారు. సరే ఆ సమయంలో ఆయన పక్కనే కూర్చున్న వుత్తర ప్ర దేశ్‌ ముఖ్య మంత్రి ఆదిత్యనాధ్‌ ఆవుల రక్షణకు కేంద్రాల ఏర్పాటు గురించి చెప్పారనుకోండి.

ఎన్నడూ ఎరగనోడికి ఏగానీ దొరికితే దానిని అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా అని తేల్చుకోలేక ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదన్నది ఒక సామెత. నరేంద్రమోడీ విదేశీ పర్యటనల గురించి అనేక మంది ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆచరణ ఏమిటో జనానికి తెలిసిందే. ఎవరేమి విమర్శించినా ఖాతరు చేయకుండా పెట్టుబడులను రాబట్టేందుంటూ నరేంద్రమోడీ తిరగని దేశం, తొక్కని గడపలేదు. పదవీ కాలంలో మిగిలిన దేశాలను కూడా చుట్టి వచ్చి రికార్డు సృష్టిస్తారేమో ! అమెరికా, చైనాలను పక్కకు నెట్టి విదేశీ పెట్టుబడులను రాబట్టి తెల్లవారేసరికి ప్రపంచం మొత్తానికి అవసరమైన వస్తువులను వుత్పత్తి చేసి ఎగుమతులు చేసేందుంటూ ప్రధాని మేకిన్‌ ఇండియా అని నినాదం కూడా ఇచ్చారు. మూడు సంవత్సరాల కాలంలో నరేంద్రమోడడీ సర్కార్‌ ఎన్నికలకు ముందు జనానికి చెప్పిన వాటి కంటే చెప్పని వాటినే ఎక్కువగా అమలు చేసింది. మేకిన్‌ ఇండియా పిలుపు తప్ప దానికి ఒక మంత్రి లేడు. చిన్న ప్రభుత్వం-పెద్ద పాలన అంటూ కబుర్లు చెప్పిన పెద్దమనిషి చివరకు ఆవులకోసం కూడా ఒక మంత్రిత్వశాఖ ఏర్పాటు గురించి పరిశీలిస్తున్నట్లు అమిత్‌ షాయే చెప్పారు గనుక నమ్మక తప్పదు.

ఈ మధ్య నరేంద్రమోడీ సర్కార్‌ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలను నిరుత్సాహపరిచే విధంగా ఒకవైపు చర్యలు మరోవైపు పురాతన సంస్కృత గ్రంధాలలో దాగున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికి తీసేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే ఈ మధ్యనే పంచగవ్యాల సుగుణాల గురించి పరిశోధనలు చేసేందుకు నిర్ణయం. యధారాజా తధా ప్రజా అన్నట్లు ఆవు పేడ, మూత్రాలపై ఐఐటిలలో రోజుల తరబడి సెమినార్లు, వాటిపై పరిశోధనలకు 50వరకు ప్రతిపాదనలు వచ్చినట్లు వార్తలు. ఆసుపత్రి వార్డులను ఆవు మూత్రంతో కడగాలని నితిన్‌ గడ్గరీ వంటి వారి సుభాషితాలు. ఆవు మూత్రంతో తనకు తెలిసిన ఒకరి అంతుబట్టని వ్యాధి నయమైందని బిజెపి అధికార ప్రతినిధులలో ఒకరైన మీనాక్షి లేఖీ కూడా చెప్పారు. నా చిన్నతనంలో గుంటూరు పక్కనే వున్న పలలూరు భావిలో నీరు తాగితే జబ్బులు నయమయ్యాయని జనాలు బారులు తీరటాన్ని లేఖీ గారు గుర్తుకు తెచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే లొట్టలు వేసుకుంటూ వినటానికి ఎన్ని కబుర్లో ! ఇప్పటికే బిజెపి పాలనలోని రాజస్ధాన్‌లో ఆవు సంక్షేమ మంత్రిత్వ శాఖ వుంది కనుక త్వరలో కేంద్రంలో, ఇతర రాష్ట్రాలలో ఆవు మంత్రిత్వశాఖ, దానికి సలహాదారులు, ఆవులు వేసే పేడ, పోసే మూత్రం ఎగుమతికి రామ్‌దేవ్‌ బాబా పతంజలి సంస్ధకు అనుమతి, వాటిని రవాణాచేసేందుకు అదానీ ఓడలకు పని చెప్పటం ఖాయంగా కనిపిస్తోంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఇ కామర్స్‌ సంస్ధలు ఇప్పటికే పేడ, మూత్రాలను కొరియర్‌ సేవల ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే.మన దేశానికి ఇలాంటి వాటి ఎగుమతులలో మరే నాగరిక దేశమూ సాటి రాదని స్టాంప్‌ పేపర్లపై రాసి ఇవ్వవచ్చు. మోడీ బ్యాండ్‌ ఏ పద్దతులలో అమెరికా, చైనాలను అధిగమించేందుకు దేశ రూపు రేఖలు ఎలా మార్చబోతున్నారో అనేందుకు సూచికలివి.

బహుశా ఈ పరిణామాలను వూహించి లేదా సర్వం ప్రయివేటీకరణ, సకల సబ్సిడీలకు మంగళం పాడాలన్న తన సలహాలను మోడీ సర్కార్‌ తు.చ తప్పకుండా అమలు జరుపుతోందనే సంతోషం లేదా ఇతర అంశాలేమిటో తెలియదు గానీ నీతి ఆయోగ్‌ అని పిలుస్తున్న ‘భారత్‌ రూపురేఖలు మార్చే జాతీయ సంస్ధ'(నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా) వుపాధ్యక్షుడిగా వున్న అరవింద్‌ పంగారియా ఆగస్టు 31తరువాత సేవలను అందించేది లేదంటూ ఆకస్మికంగా రాజీనామా ప్రకటించారు. దీనికెవరూ చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ జిందాతిలిస్మాత్‌ అని ఆకాశానికి ఎత్తిన దేశ భక్తుడు అరవింద్‌ పంగారియా. దాన్నే దేశమంతటికీ రాసి లేదా పూసి గుజరాత్‌ మాదిరి అభివృద్ధి చేస్తానని గత ఎన్నికల ప్రచారంలో మోడీ నమ్మబలికారు. అదెంత బూటకమో ఈ దిగువ లింక్‌లోని సమాచారాన్ని బట్టి ఎవరైనా తెలుసుకోవచ్చు.http://www.moneylife.in/article/the-gujarat-model-ndash-some-facts/51106.html

నరేంద్రమోడీ 2014 మే 26న గద్దెనెక్కారు. స్వతంత్ర మూల్యాంకన లేదా విలువ కట్టే కార్యాలయం మే 29న నరేంద్రమోడీకి ఒక నివేదిక సమర్పించి వెంటనే ప్రణాళికా సంఘం అనే ఇంటిని కూల గొట్టించాలని సూచించింది. ఎందుకటా బిజెపి నేతలు వివరించినదాని ప్రకారం ‘బొమ్మరిల్లు’ నాన్న మాదిరి పిల్లలనే రాష్ట్రాలకు ఒకే కొలతలు, ఒకే బట్టతో యూనిఫారాలను కుట్టించేదిగా ప్రణాళికా సంఘం వుంది. ఎవరికిష్టమైన దుస్తులు వారి సైజుల్లో కుట్టించుకోవాలన్నట్లుగా ఏ రాష్ట్రానికా ఆ రాష్ట్రం తన స్వంత అభివృద్దికి చర్యలు తీసుకోవాలంటే ప్రణాళికా సంఘం పనికిరాదు. ఆ మేరకు ఆగస్టు 13న ఆమేరకు కాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దాని స్ధానంలో2015 జనవరి ఒకటిన నీతి అయోగ్‌ వునికిలోకి వచ్చింది. ప్రధాని దానికి అధ్యక్షుడు. అమెరికాలో పాఠాలు చెప్పుకుంటున్న అరవింద్‌ను రప్పించి వుపాధ్యక్షుడిగా నియమించారు. అన్ని రాష్ట్రాలకు ఒకే అభివృద్ధి నమూనా పనికిరాదని చెప్పిన పెద్దలే అన్ని రాష్ట్రాలకు ఒకే పన్ను విధానం కావాలనటం, తీసుకు రావటం, దాన్ని మరొక స్వాతంత్య్రంగా వర్ణించుకోవటం విశేషం.

ఏడు సంవత్సరాలకు ఒక కార్యక్రమం, 15 సంవత్సరాలకు మరొకదాన్ని రూపొందించటం నీతి ఆయోగ్‌ కార్యక్రమం. అంటే ఐదు సంవత్సరాలకు బదులు పేరేం పెట్టినా పదిహేను సంవత్సరాలకు రెండు ప్రణాళికలన్నమాట. అందుకే నరేంద్రమోడీ 2022 నాటికి నేనేం చేస్తానో చూడండి అంటున్నారు.(2015-2022 మధ్య వ్యవధి ఏడు సంవత్సరాలు). అయితే మూడు సంవత్సరాలు గడిచినా కొత్త ఇల్లు ఎలా కట్టుకోవాలో కూడా నిర్ణయించుకోక ముందే వున్న ఇంటిని కూలగొట్టుకున్న వారు పడే ఇబ్బందుల మాదిరి ఏ ఏటికాయేడు ఏదో విధంగా నెట్టుకు వస్తున్నారు. ఒక నిర్ధిష్ట రూపు రేఖలు ఇంతవరకు లేవు. ఈ లోగా దాని శిల్పి అరవింద్‌ పంగారియా జంప్‌. ఆ పెద్ద మనిషి ఎందుకు రాజీనామా చేశారో తెలియదు. దున్న ఈనిందంటే రోజంతా బ్రేకింగ్‌ న్యూస్‌ ఇచ్చే మీడియా అదో సాధారణ విషయం అన్నట్లుగా మూసిపెట్టేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు కాకపోతే తరువాత వెల్లడికాక మానదు.

కాకపోతే తన రాజీనామాకు పద్మభూషణుడిగా మనం సన్మానించిన అరవిందుడు ఇచ్చిన వివరణ తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా వుంది. నా రాజీనామా నా ఇష్టం అంటే అడిగే వారే వుండరు. ఆగస్టు 31 తరువాత సెలవును పొడిగించేందుకు తాను వుద్యోగం చేస్తున్న కొలంబియా విశ్వవిద్యాలయం అంగీకరించలేదు కనుక రాజీనామా అన్నారు.’అదే నేను 40వ పడిలో వున్నట్లయితే నాకు ఎక్కడయినా వుద్యోగం దొరికేది, ఈ వయస్సు(64)లో కొలంబియాలో మాదిరి వుద్యోగం దొరకటం దాదాపు అసాధ్యం’ కనుక తిరిగి టీచరు వుద్యోగంలో చేరుతున్నట్లు చెప్పారు. నరేంద్రమోడీకి పంపిన రాజీనామా పత్రంలో పిల్లలకు దగ్గరగా వుండాలని తన భార్య గట్టిగా కోరుతున్నదని పేర్కొనటం గమనించాల్సిన అంశం. ఆయన ఇరవైల్లోనో ముప్ఫైల్లోనే వుండి వుంటే భార్య అలా కోరటం సహజం, కానీ 64 ఏండ్ల వయస్సులో అందునా భారత్‌లో ఒక వున్నతమైన స్ధానాన్ని వదులుకొని పిల్లల కోసం అమెరికా రమ్మని కోరటం అంటే నమ్మేట్లుగా లేదు. నీతి ఆయోగ్‌ బాధ్యతలను స్వీకరించే సమయంలోనే తాను ఫలనాతేదీ వరకు మాత్రమే సెలవు పెట్టానని లేదా రెండున్నర సంవత్సరాలు మాత్రమే తాను పదవిలో వుంటానని అప్పుడు చెప్పలేదు. ఒక వేళ అలా చెప్పి వుంటే మోడీ ముందుగానే మరొక ప్రముఖుడిని సిద్దంగా పెట్టుకొని వుండేవారు. అయినా అరవింద్‌కు వుద్యోగం లేకపోతే గడవదు అంటే నమ్మశక్యం కాదు. దేశ రూపురేఖలనే ఏడు సంవత్సరాలలో మార్చే మహత్తర మంత్రదండాన్ని నడుంకు కట్టుకున్న పెద్ద మనిషిని ఈ దేశం ముసలితనంలో వదలి వేస్తుందా? అవసరమైతే భార్యా బిడ్డలను అమెరికా నుంచి ఇక్కడికి రప్పించుకోవటం అంత కష్టమా ? ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్ధ, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐరాస వాణిజ్య విభాగం వంటి వాటిలో యుక్త వయస్సులో వుద్యోగాలు చేసి ముసలి తనంలో ఇబ్బందులు లేకుండా గడపటానికి అవసరమైన మొత్తాన్ని వెనకేసుకోలేనంత అమాయకుడా ఆ పెద్దమనిషి. అయినా పుట్టిన గడ్డమీద ఎంత అవిశ్వాసం ? ఇలాంటి వ్యక్తినా మనం పద్మభూషణుడని గౌరవించుకుంది ?

నరేంద్రమోడీ భక్తులు, ఆయన పెరటి మీడియా ఎన్ని విజయగానాలు చేసినా మాటలు కోటలు దాటటం తప్ప ఆచరణ గడపదాటటం లేదు. ఆర్ధిక రంగంలో అన్నీ అధోముఖ సూచికలే దర్శనమిస్తున్నాయి. 2016 అక్టోబరులో 25శాతం సంస్ధలు భవిష్యత్‌ గురించి ఆశాభావం వ్యక్తం చేస్తే 2017 మార్చినాటికి 16శాతానికి పడిపోయిందని, కేవలం ఆరుశాతం సంస్ధలే అదనపు సిబ్బందిని తీసుకొనేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపాయని http://economictimes.indiatimes.com/news/company/corporate-trends/indian-companies-least-confident-worldwide-markit-survey/articleshow/57616150.cms వార్తలు వచ్చాయి. దేశ వుత్పాదక రంగ సూచిక (పిఎంఐ) జూన్‌లో 52.7 వున్నది కాస్తా జూలైలో 46కు అంటే 2009 కనిష్ట స్ధాయికి, సేవారంగం 53.1 నుంచి 45.9కి దిగజారిందని తాజాగా వార్తలు వచ్చాయి. ఈ కాలంలో అన్ని అభివృద్ధి సూచికలు పడిపోతుండగా దేశంలో గో గూండాల దాడుల గ్రాఫ్‌ మాత్రమే రోజు రోజుకూ పెరుగుతోంది. అదీ కఠిన చర్యలు తీసుకోవాలని తిరుగులేని నరేంద్రమోడీ కోరిన తరువాత. ఆశ్చర్యంగా వుంది కదూ !

తాను రాజీనామా చేయబోతున్న విషయం నరేంద్రమోడీకి రెండు నెలల ముందుగానే అరవింద్‌ పంగారియా చెప్పారట. మరొకరిని ఎవరిని తీసుకువస్తారో ఇంతవరకు తెలియదు. రాజీనామా వ్యవహారం బయటకు వచ్చిన తరువాతే కొన్ని పేర్లు పరిశీలనలో వున్నట్లు వార్తలు వచ్చాయి. అసలు సమస్య ఏమంటే ఎవరు వచ్చినా దేశం ఇప్పుడున్న స్ధితిలో ఏం పొడుస్తారు ? పొడిచేదేమీ లేదని అర్ధం అయిన కారణంగానే అరవింద్‌ సెలవు పొడిగింపు లేదనే సాకుతో మర్యాదగా తప్పుకున్నారా ?

వుత్పత్తి లేదు, ఎగుమతులు పడిపోతున్నాయి, వుద్యోగాల కల్పన అసలే లేదు. కాస్త ఆశాజనంగా వున్న ఐటి రంగం రూపాయి బలహీనం కావటంతో ఏం చేయాలో దిక్కుతోచటం లేదు, కొత్త వుద్యోగాలు లేవు. డిగ్రీ చేతబట్టుకొని వుద్యోగాల కోసం కావాలంటే ముందు వుద్యోగంలో చేరు కొన్ని నెలలపాటు జీతం భత్యం అడగవద్దు, ఖర్చుల మేరకు ఇస్తాం అంటున్నారు. ఆవులకు ఆధార్‌ కార్డులు, ఆవులను చంపితే మరణశిక్ష విధించే విధంగా చట్టసవరణలు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్ధల స్ధానంలో గోశాలలు, వస్తూత్పిత్తికి బదులు ఆవు పేడ, మూత్ర సేకరణ వంటి కార్యక్రమాలు అమలు జరపటానికి, ఆవు, గొడ్డు మాంస రాజకీయాలు చేయటానికి మరో కోణం నుంచి ఆలోచిస్తే అరవింద్‌ వంటి ఆర్ధికవేత్తలు అవసరమా ? గుజరాత్‌ నమూనా అభివృద్ధి అంటూ నరేంద్రమోడీ పాలనకు విశ్వసనీయత కలిగించిన వారిలో అరవింద్‌ పంగారియా ఒకరు. అందుకే నరేంద్రమోడీ ఆయనను ఎంచుకోవటానికి ఒక కారణం. ప్రచార హోరు తప్ప చెప్పిన విధంగా అక్కడకు పెట్టుబడులు రాలేదన్నది నమ్మలేని నిజం. అందువలన గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా దాని బండారం ఏమిటో నరేంద్రమోడీకి బాగా తెలుసుగనుకనే గత మూడు సంవత్సరాలలో దాని గురించి మాట్లాడితే ఒట్టు. రెండవది అరవింద్‌ ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ బడిలో చదువుకున్నాడు. అన్నీ ప్రయివేటీకరణ, ప్రభుత్వ జోక్యం పరిమితంగా వుండాలి, సబ్సిడీలన్నీ ఎత్తివేయాలన్నది ఆయన ప్రిస్క్రిప్షన్‌. వాటిని అమలు జరిపితే తమ పని ఖాళీ అని బిజెపి నేతలకు తెలుసు. అందుకే జనం నుంచి వెలికాకుండా వుండటానికి స్వదేశీ జాగరణ మంచ్‌, బిఎంఎస్‌ వంటి సంస్ధలతో కొన్ని విమర్శల నాటకం ఆడిస్తూ వుంటారు. వైఫల్యాల నుంచి జన దృష్టిని మళ్లించాలంటే ఎప్పుడూ ఏదో ఒక జిమ్మిక్కు చేస్తూ వుండాలి. అరవింద్‌ పంగారియాకు పోటీగా నీతి ఆయోగ్‌లో మరో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఒక వార్త. కొన్ని అంశాలపై ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడించి మోడీ ఆగ్రహానికి గురయ్యారని మరొక సమాచారం.

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ 2008 నుంచి తీవ్ర ఆర్ధిక మాంద్యంతో సాగుతున్న స్ధితిలో దానిని గట్టెక్కించే అస్త్రాలు అరవింద్‌ వంటి పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తల అంబుల పొదిలో లేవు. ప్రయోగించినవన్నీ తుస్సు మంటున్నాయి. ధనిక దేశాల మార్కెట్లు మందగించటం, అనేక దేశాలు తమ దేశాల పరిశ్రమలు, వ్యాపారాలకు రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్న స్ధితిలో మన పెట్టుబడిదారులకు విదేశీ మార్కెట్లను సంపాదించటం అంత తేలిక కాదని గత మూడు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌కు బాగా తెలిసి వచ్చింది. మరోవైపున ప్రపంచ ఆర్ధిక సంస్ధ, ఇతర వేదికలు మన వంటి మార్కెట్లను మరింతగా తెరవాలని, దిగుమతి పన్నులను తగ్గించాలని రోజు రోజుకూ వత్తిడి తెస్తున్నాయి. మోడీ ఏ దేశ పర్యటనకు వెళ్లినా మా ఇంటికొస్తూ మాకేం తెచ్చావ్‌, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ అన్నట్లుగా అక్కడ పరిస్ధితి వుంది తప్ప మనకు అనుకూలంగా ఏదీ లేదు. పంచవర్ష ప్రణాళిక విధానం పాతబడితే అవసరాలకు తగిన విధంగా మార్పులు చేసుకోవాలి. ప్రాధాన్యత క్రమాన్ని సవరించుకోవాలి. లేదూ అంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయాన్ని నిర్ణయించుకొని ఆ తరువాత ఆ విధానాన్ని రద్దు చేయవచ్చు. కానీ నరేంద్రమోడీ సర్కార్‌ మబ్బులను చూపి చేతిలోని ముంతలో నీళ్లు పారబోయటమే కాదు, ముంతనే పగలగొట్టినట్లుగా ప్రణాళికా సంఘాన్నే రద్దు చేసింది.నీతి ఆయోగ్‌లో అరవింద్‌ కొనసాగినా, మరొక వుపాధ్యక్షుడు వచ్చినా చేసేదేమీ కనిపించటం లేదు. అయితే ఒకటి మాత్రం స్పష్టం. ఎవరు వచ్చినా కొంత మంది వర్ణిస్తున్నట్లు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాలు లేదా ఆదేశిత విధానాలు అమలు జరపాల్సిందే తప్ప అందుకు భిన్నంగా జరగదన్నది స్పష్టం.