Tags
Amarthya sen, attack on journalists, Attack on media, ‘Argumentative Indian’, cbfc, cow politics, History, Intolerance, NCERT, Ravindranath Tagore, RSS, six words censor
సత్య
దేశంలో వాక్సభా స్వాతంత్య్రాలకు ముప్పు వస్తోందా అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అనేక మంది తమకు సంబంధించినవి కావన్నట్లుగా అసలు వాటి గురించి పట్టించుకోవటమే మానుకున్నారు. వీరిలో రెండు రకాలు అణచివేత, వివక్ష, విద్వేషానికి బలౌతున్నవారు ఒక తరగతి అయితే మేథావులం అనుకునే వారు రెండో తరగతి. మొదటి వారితో ఇబ్బంది లేదు, సమయం, సందర్భం వచ్చినపుడు తమ సత్తా ఏమిటో చూపుతారు. గడియారంలోని లోలకం మాదిరి అటో ఇటో వూగటం తప్ప నిలబడి తమ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు ముందుకు రాని మేథావులతోనే అసలు సమస్య. వంది మాగధులు పొగడ్తలకు రాజులు, రంగప్పలు ఎలా పొంగిపోయేవారో, తమను విమర్శించేవారిని ఏం చేశారో చూశాము. ఆ రాజరికాలు, జమిందారీ వ్యవస్ధ పోయినా ఆ స్వభావం మాత్రం పాలకులలో ఇంకా సజీవంగానే కొనసాగుతోండటమే ప్రమాదకరం.
మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న చోట గుజరాత్, ఆవు, హిందు, హిందూత్వ,ఈ రోజుల్లో, ఇండియాలో అనే పదాలు వినిపించకూడదు, వాడకూడదు.పాఠ్య పుస్తకాలలో అరబ్బీ, ఆంగ్లం, వుర్దు పదాలను తీసివేయాలి. రవీంద్రనాధఠాగూరు ఆలోచనలు, ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ ఆత్మకధ వుండకూడదు, మొఘల్ చక్రవర్తుల దయాగుణం కలవారని, బిజెపి హిందూ పార్టీ అని, నేషనల్ కాన్ఫరెన్సు లౌకికవాద పార్టీ అన్న వర్ణలు వుండకూడదు.1984 దాడులపై మన్మోహన్ సింగ్ చెప్పిన క్షమాపణ, గుజరాత్‌లో దాదాపు రెండువేల మంది ముస్లింలను చంపివేశారనే వ్యాక్యాలను పాఠ్యపుస్తకాలను తొలగించాలి. ఇలా రోజు రోజుకూ నిషేధిత పదాలు, భావనలు, ఆలోచనలు కొండవీటి చాంతాడులా పెరిగిపోతున్నాయి. ఇలాంటివాటన్నింటినీ బయటకు తెలియనివ్వకుండా సంబంధిత సంస్ధలు తమంతట తామే చేసినట్లుగా బయటకు కనిపించాలని కోరుకొనే శక్తులు తమ బండారం బయట పెట్టిన మీడియా గురించి రెచ్చిపోతున్నారు.
సుమన్ ఘోష్, అమర్త్యసేన్ పహ్లజ్ నిహ్లానీ
ముందుగా ఆరు మాటలపై ఆంక్షల గురించి చూద్దాం. వీటిపై ఆంక్షలు విధించిన కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు అధిపతి పహ్లజ్ నిహ్లానీ పదవీకాల గడువు ముగియక ముందే కేంద్ర ప్రభుత్వం తొలగించి ప్రసూన్ జోషి అనే రచయితను నియమించింది. తన పదవీ నియామకంతో పాటు తొలగింపు కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నానని నిహ్లానీ వ్యాఖ్యానించాడు. ఇక నేరుగా సాధారణ సినిమాల్లోనే అశ్లీల, అసభ్య దృశ్యాలను చూడవచ్చని వుక్రోషం వెలిబుచ్చారు. అసాంస్కృతిక లేదా మర్యాద తెలియని సేన చేతిలో కాలం చెల్లిన ఆయుధంగా వుపయోగపడిన వ్యక్తికి కేంద్రం ముగింపు పలికిందని ఒక పత్రిక వ్యాఖ్యాన శీర్షికలో పేర్కొన్నారు. చరిత్రను వెనక్కు నడపాలని చూస్తున్న, ఏది తినకూడదో, ఏ డ్రస్సు వేసుకోకూడదో, ఎప్పుడు బయట తిరగాలో ఇలా ప్రతి జీవన రంగంలో కాలం చెల్లిన ఆయుధాలతో ‘స్వయంసేవకులు’ మూలమూలనా రెచ్చిపోతున్న స్ధితిలో నూతన అధిపతి ఎలా పని చేయగలరో చూడాల్సి వుంది.
నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ గురించి సుమన్ ఘోష్ అనే ఒక దర్శకుడు ‘భారతీయ తార్కికుడు ‘ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. దానికి కేంద్ర ఫిలింసెన్సార్ బోర్డు తాము చెప్పిన ఆరు పదాల కోతలకు అంగీకరిస్తేనే ప్రదర్శనకు అనుమతి సర్టిఫికెట్ ఇస్తామని చెప్పింది.పైన పేర్కొన్న మొదటి ఆరుపదాలు, వాటితో కూడిన వ్యాక్యాలను ఆ డాక్యుమెంటరీలో వినిపించకుండా చేయాలని జూలై 11న కోరింది. ఒక్క కోతకు కూడా తాను అంగీకరించటం లేదని ఒక నెల రోజుల తరువాత దర్శకుడు తిరస్కారాన్ని తెలిపాడు. తరువాత ఆ చిత్రాన్ని పునర్విచారణ కమిటీకి పంపుతారు. అదొక తతంగం, ఇంత జరిగాక దానిని ఏమి చేస్తారో వూహించనవసరం లేదు. కుక్క మనిషిని కరవటం సాధారణ విషయం. కానీ మనిషే కుక్కను కరవటం సంచలన వార్త. దేశంలో నేడున్న స్ధితిలో ఆరు పదాలపై ఆంక్షలు పెట్టటం సాధారణం.ఇంత రాద్ధాంతం జరిగాక వాటిని అంగీకరించి అనుమతిస్తేనే అది అసలైన వార్త అవుతుంది. చివరికి అదేమైనా అసలు ఆ పదాలపై ఎందుకు అభ్యంతర పెడుతున్నారన్నదే తెలుసుకోవాల్సిన, తేలాల్సిన అంశం.
సెన్సార్ బోర్డు అభ్యంతరాలపై దేశమంతటి నుంచి అనేక మంది మేథావులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో బోర్డు అధిపతి పహ్లజ్ నిహ్లానీ తమ చర్యను సమర్ధించుకున్నారు. ఆ పదాలకు కోత పెట్టినందువలన దర్శకుడి సృజనాత్మకతకు, అమర్త్యసేన్ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లదన్నారు. ఆ పదాలు భారతీయ సంస్కృతి, ప్రజాస్వామ్యాన్ని విస్పష్టంగా తిరస్కరించేవిగా వున్నాయని, నోబెల్ బహుమతి గ్రహీత అయిన ఒక భారతీయుడిపై నిర్మించిన డాక్యుమెంటరీలో రాజకీయాలు, మతం గురించి మందబుద్దితో చేసిన వ్యాఖ్యలను అనుమతిస్తే శాంతి, సామరస్యాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని భావించామని వాదించారు. ఒక సందర్భంలో భారతీయ ప్రజాస్వామ్యం గురించి చేసిన ప్రస్తావనలో గుజరాత్ నేరాల గురించి పేర్కొన్నారని, దానిలో గుజరాత్ అనే పదం తీసివేయమని కోరామన్నారు. మరొక సందర్భంలో ఇండియాలో శత్రువు మతనాయకత్వమని చేసిన ప్రస్తావనలో ఇండియా అనే పదం వాడవద్దన్నామని, ఇండియాను హిందు అని భాష్యం చెప్పినందున హిందూ అనే పదాన్ని తొలగించాలని కోరామన్నారు. ఆవు గురించి మతానికి ముడిపెడుతూ నిరర్ధకమైన ప్రస్తావన చేసినందున ఆవు పదాన్ని వాడవద్దని కోరామని, ఈ రోజుల్లో వేదాలను దురభిమాన పద్దతిలో వినియోగిస్తున్నారని చేసిన వ్యాఖ్యలో ఈ రోజుల్లో, వినియోగిస్తున్నారు అనే పదాలను తొలగించాలని కోరినట్లు నిహలానీ చెప్పారు. భారత హిందుత్వ వైఖరి నకిలీదని ఆగ్రహం కలిగించే విశేషణం వాడినందున దానిని కూడా తొలగించాలని కోరినట్లు తెలిపారు. ఈ పదాలను తొలగించాలని ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వత్తిడి లేదని, అలా కోరటాన్ని ప్రభుత్వ అనుకూల చెంచాగిరి చేసినట్లుగా చూశారని వ్యాఖ్యానించారు. ఆవు, హిందూత్వ గురించి చేసిన వ్యాఖ్యలు దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీస్తాయని, చిత్ర నిర్మాతలు భావ ప్రకటనా స్వేచ్చ గురించి మాట్లాడుతున్నారు, అలాంటి స్వేచ్చ బాధ్యతతో కూడినదై వుండాలని కూడా వారు తెలుసుకోవాలని నిహ్లానీ అన్నారు. మీరు నోబెల్ బహుమతి గ్రహీత కావచ్చు జనం పవిత్రమైనవిగా భావిస్తున్న వాటిని తృణీకారంతో మాట్లాడితే మీపై దాడులు జరిగే అవకాశాలున్నాయని కూడా సెన్సార్ బోర్డు అధిపతి వ్యాఖ్యానించారు. సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా పలు బహిరంగ స్ధలాల్లో డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు, అది చట్టవిరుద్దం, భావ ప్రకటనా స్వేచ్చ మంచిదే చట్ట వుల్లంఘన మాటేమిటని నిహ్లానీ ప్రశ్నించారు.
సెన్సార్ బోర్డు అధిపతి ప్రస్తుతం దేశంలో మనువాద, సంఘపరివార్ శక్తులు చేస్తున్న వాదనలను అధికారికంగా వ్యక్తం చేయటం తప్ప మరొకటి కాదు. ఆ భావజాలంతో ఆయన ప్రభావితులయ్యారా లేక అధికారం ఆయనను ప్రభావితం చేసిందా అన్నది సమస్య. మొదటిదే వాస్తవమైతే అన్ని రంగాలలో తిరోగమనవాదులతో నింపే ప్రప్రకియలో భాగంగానే ఆయనను అక్కడ నియమించారని, లేకపోతే ఆయనపై వత్తిడి తెచ్చారని నిర్ధారించుకోవాల్సి వుంటుంది. కొంత మంది పవిత్రంగా చూస్తున్నదానిని జనం మొత్తం చూస్తున్నారని చిత్రించటం, వాటితో విబేధించి వర్ణనలు చేస్తే దాడులు జరుగుతాయని చెప్పటమంటే పరోక్షంగా అదే చేయమన్న సందేశం తప్ప మరొకటి కనిపించటం లేదు. మతోన్మాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టుల తరగతికి చెందిన వారు చేస్తున్న దుర్మార్గాలన్నీ దేవుళ్లు, దేవదూతలు, దేవుని బిడ్డలో, ఆయా మతాల గ్రంధాలు చెప్పాయనో, శాశించాయనో, జనాభిప్రాయమనో, కోరారనో పేరుతో చేస్తున్నవే అని గమనించాలి.
ఆవు, వేదాలు, హిందూత్వల గురించి భిన్న అభిప్రాయాలు వెలువరించటం ఈ రోజు కొత్తగా జరుగుతున్నది కాదు, లేదూ కొత్తగా ప్రారంభించినా తప్పేమీ కాదు. తమ వ్యాఖ్యానాలకు భిన్నంగా ఎవరూ మాట్లాడకూడదని కొన్ని శక్తులు తమ అభిప్రాయాన్ని దేశం మొత్తం మీద రుద్దటం గతంలో నడవ లేదు, ఇప్పుడూ కుదరదు, అది ఏ రీత్యా చూసినా ప్రజాస్వామ్య వైఖరి కాదు. చర్చోపచర్చలు చేయవచ్చు, ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చు. ఏ వైఖరిని కలిగి వుండాలనేది లేదా ఏ వైఖరికీ బద్దులం కాకూడదనో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇవ్వాలితప్ప భిన్నాభిప్రాయం, భిన్న వ్యాఖ్యానం వినిపించకూడదని చెప్పటం ఏమిటి ? ఇక పహ్లజ్ నిహ్లానీ నియామకం, తొలగింపు ఏమి సూచిస్తున్నది. తన తిరోగమన భావాలను సమాజంపై రుద్ధితే వాటి ప్రభావం ఎలా వుంటుందో సంఘపరివార్ పరీక్షిస్తున్నది. రాజకీయంగా నష్టం జరుగుతుందనుకుంటే తమ మనసెరిగి నడుచుకున్నప్పటికీ నిహ్లానీని కొనసాగించటం నష్టదాయకం అని గ్రహించినట్లుగా కనిపిస్తున్నది. అన్ని రంగాలలో ఒకేసారి తమ అజెండాను రుద్దితే నష్టం కనుక బ్రిటీష్ వారి సేవలో నేర్చుకున్న విభజించి పాలించే ఎత్తుగడలలో భాగంగా కాషాయ పరివారం కొంతకాలమైనా సినీరంగాన్ని సంతుష్టీకరించేందుకు పూనుకుందా అన్నది చూడాల్సి వుంది.
ఇక పాఠ్యపుస్తకాల నుంచి విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూరు అభిప్రాయాలు, కొన్ని భాషా పదాలు, ఇంకా ఏమేమి తొలగించాలో సూచిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్ధ శిక్షా సంస్కృతి వుత్తన్ న్యాస్ రూపొందించిన డిమాండ్ల జాబితాను ఆ సంస్ధ నేత దీనా నాధ్ బాత్ర నాయకత్వంలో ఎన్‌సిఇఆర్‌టికి సమర్పించారు. వాటిని ప్రముఖంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇతర అనేక పత్రికలు ప్రచురించాయి. వాటిని చూసిన వారు ఇదేమి వైఖరని ఆగ్రహం, విమర్శలు వ్యక్తం చేయటంతో ఆర్‌ఎస్‌ఎస్ నేతలు మీడియాపై చిందులు తొక్కుతున్నారు.
మీడియా సైద్ధాంతికంగా, వివక్షతో కూడినదే గాక దేశాన్ని విభజించేందుకు కుట్రపన్నుతోందని, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని పైన పేర్కొన్న సంస్ధ న్యాస్ జాతీయకార్యదర్శి అతుల్ కొథారీ ఆరోపిస్తే, మాజీ జర్నలిస్టయిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్‌కమ్యూనిసకేషన్ డైరెక్టర్ జనరల్ అయిన కెజి సురేష్ దాడి చేశారు. దొంగే దొంగని అరచినట్లుగా ఆర్‌ఎస్‌ఎస్ నేతల వ్యవహారం వుంది. రవీంద్రుని భావాలను తొలగిస్తున్నారా అని పార్లమెంట్‌లో సభ్యులు అడిగిన దానికి ఒక స్వతంత్ర సంస్ధ అయిన ఎన్‌సిఇఆర్‌టి తరఫున తాను వకాల్తా పుచ్చుకున్నట్లుగా అలాంటిదేమీ జరగబోవటం లేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ చెప్పటం గమనించాల్సిన అంశం. ఆ సంస్ధ ప్రతినిధులెవరూ ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు.ఎన్‌సిఇఆర్‌టికి తాము సమర్పించిన పత్రంలో రవీంద్రుని గురించిన ప్రస్తావన లేదని, కొన్ని పత్రికలు ముఖ్యంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అవాస్తవ వార్తలు ప్రచురించాయని, ఎక్స్‌ప్రెస్‌కు లీగల్ నోటీసు పంపుతామని న్యాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
తమ పత్రంలో లేని అంశాలను మీడియా పేర్కొన్నదని ఆరోపిస్తున్న పెద్దలు అసలు తాము సమర్పించిన దానిని బహిరంగపరిచి మీడియా చేసిన వక్రీకరణలను లోకానికి తెలియచేయవచ్చు. కానీ వారా పని చేయలేదు. అదేమీ రహస్యం కాదు, అయినా ఇంతవరకు దానిని అధికారికంగా బహిరంగపరచలేదు.ఎన్‌సిఇఆర్‌టికి తాము సమర్పించిన పత్రాన్ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు అందచేసినట్లు న్యాస్ ప్రతినిధులు అంగీకరించారు.దాని కాపీలను మిగతా వారికి అందచేస్తే ఏది వాస్తవమో తేలిపోతుంది. తాను రాసిన వార్తలపై ఎక్స్‌ప్రెస్ పత్రిక కట్టుబడి వుంది కనుకనే వారికి లీగల్ నోటీసు ఇస్తామని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ప్రకటించారు. కనుక పత్రికా వార్తలు లేదా వ్యాఖ్యానాలతో విబేధిస్తున్న న్యాస్ తన పత్రంలో ఏం వుందో వెల్లడించాల్సిన బాధ్యత దాని మీదే వుంది.
తమ సంస్ధను ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్ధ అని పేర్కొనటాన్ని కూడా న్యాస్ అభ్యంతర పెట్టింది. అసలు ఆర్‌ఎస్‌ఎస్సే నమోదిత సంస్ధ కాదు.జనాన్ని మభ్యపెట్టేందుకు లేదా వేరే ప్రయోజనంతో కావచ్చు, దానిలో పని చేసే ప్రముఖుల ఆధ్వర్యంలో అనేక సంస్ధలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. అవన్నీ వాస్తవానికి దాని కనుసన్నలలో పని చేసేవే అన్నది అందరికీ తెలిసిన సత్యం.ఆర్‌ఎస్‌ఎస్‌కు బిజెపి అనుబంధ సంస్ధ అని ఎక్కడా వుండదు. కానీ దాని నాయకులందరూ ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులే. దానిలో సభ్యత్వాన్ని వదులుకోవాలని గతంలో జనతా పార్టీలో ఒక డిమాండ్ వచ్చినపుడు దానిలో విలీనమైన పూర్వపు జనసంఘనేతలెవరూ అంగీకరించలేదు. తరువాత వారంతా బిజెపిని ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. సాంకేతికంగా అనుబంధం వుంటుందా అంటే వుండదు.
కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్‌ఎస్, డిఎంకె వంటి పార్టీలన్నీ తమ అనుబంధ సంస్ధలనాయకత్వాన్ని నియమిస్తూ బహిరంగంగానే ప్రకటిస్తాయి. కమ్యూనిస్టు పార్టీలలో నాయకులుగా వున్న వారు అనేక ప్రజా సంస్ధలలో కూడా పని చేస్తూ వాటికి నాయకులుగా కూడా వుంటారు. అవి నిజానికి పార్టీ అనుబంధ సంస్ధలు కావు, పార్టీ సభ్యులు కాని వారు కూడా వాటిల్లో నాయకులుగా వుంటారు వాటిని అనుబంధ సంస్ధలని నిరూపించే ఆధారాలను ఎవరూ చూపలేరు. అయినా సిపిఎం అనుబంధ రైతు సంఘమనో, సిపిఐ అనుబంధ కార్మిక సంఘమనో మీడియాలో ప్రస్తావించటం చూస్తున్నాము. అయితే తమ అనుబంధ సంస్ధలు కాదని ఆర్‌ఎస్‌ఎస్ చెప్పుకొనే వాటికి ఆర్‌ఎస్‌ఎస్‌కు వున్న సంబంధాల గురించి అంజలీ మోడీ అనే జర్నలిస్టు స్క్రోల్ అనే వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో ఆధారాలతో వివరించారు. అలాంటి వాటిలో ఒకటైన న్యాస్ ఎన్‌సిఇఆర్‌టికి సమర్పించిన ఐదు పేజీల పత్రంలో రవీంద్రుని పేరు ప్రస్తావించటాన్ని తాను చూశానని పేర్కొన్నారు. ఆ పత్రపు ఐదవ పేజీలో’ రవీంద్రనాధ్ ఆలోచనా ధోరణిలో జాతీయవాదం-మానవతా వాదం మధ్య వైరుధ్యం వున్నట్లు చూపేందుకు ఒక ప్రయత్నం జరిగిందని ‘ న్యాస్ పేర్కొన్నది.
” ఎక్కడ ఆత్మ భయరహితంగా వుంటుందో ‘ అనే రవీంద్రుని కవిత, ఇతర అంశాలు ‘ జాతీయ సమగ్రతకు సవాళ్లు ‘ అనే శీర్షిక కింద సిబిఎస్‌యి ప్రచురించిన పదవ తరగతి ఆరవ యూనిట్ వర్క్‌బుక్‌లో వున్నాయి తప్ప ఎన్‌సిఇఆర్‌టి పుస్తకంలో కాదు. అయితే ఆర్‌ఎసెస్ సంస్ధ న్యాస్ ఎన్‌సిఇఆర్‌టికి ఇచ్చిన పత్రంలో తొలగించాలని లేదా సవరించాలని చెప్పింది వీటి గురించే. ఆ పాఠంలో చెప్పిందేమిటి ? ‘ మానవత్వం అన్నింటికంటే వున్నతమైనదని రవీంద్రనాధ్ ఠాగూర్ అభిప్రాయపడ్డారు. మతం ఒక ప్రమాదకర అంశంగా తయారైంది. అయితే స్ధిరత్వాన్ని సాధించాలంటే మత మౌఢ్యం,తీవ్రవాదాలను తొలగించాల్సి వుంది.’ అన్న వ్యాక్యం ఆ పాఠంలో వుంది.
పదకొండవ తరగతికి ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన ‘రాజకీయ సిద్ధాంతం ‘ అనే పాఠ్యపుస్తకంలో దేశ భక్తికి వున్న పరిమితుల గురించి రవీంద్రనాధ్ ఠాగూర్ అభిప్రాయాలను పొందుపరిచారు. ఎఎం బోస్‌కు ఠాగూరు రాసిన లేఖలోని అంశాలను దానిలో వుటంకించారు.’దేశభక్తి అంతిమ ఆశ్రయం దేవతలు(లేదా ఆధ్యాత్మికం) కారాదు, నేను మానవత్వాన్నే ఆశ్ర యిస్తాను.’ అని ఠాగూరు చెప్పారు. హిందీ అనువాదంలో దేశభక్తి అంటే జాతీయవాదం(రాష్ట్రవాద) అని, మానవత్వం అంటే మానవత అని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొనే ఠాగూరు ఆలోచనల్లో వైరుధ్యం వుందని ఆర్‌ఎస్‌ఎస్ సంస్ధ భావించి వుండవచ్చన్నది ఒక అభిప్రాయం.
ఈ వుదంతంలో ఒకటి మాత్రం స్పష్టం. ఆర్‌ఎస్‌ఎస్ చెబుతున్నదానికి ఠాగూరు ఆలోచనా ధోరణి పొసగదు. తాము చేప్పిన దేశభక్తి, జాతీయవాదం ప్రశ్నించవీలులేనివి అన్నట్లుగా వాటితో విబేధించేవారిని దేశద్రోహులుగానూ, పాకిస్ధాన్ లేదా చైనా అనుకూలురుగానో ముద్రవేసి దాడులు చేస్తున్నారు. ఆ పదాలకు సంఘపరివార్ లేదా దాని సమర్ధకులు చెబుతున్న భాష్యాలు వివాదాస్పదం, అభ్యంతరకరమైనవి.హిట్లర్ దృష్టిలో లేదా అనేక మంది ఐరోపా మితవాదుల దృష్టిలో ఇతర దేశాలపై రాజకీయంగా, ఆర్ధికంగా, మిలిటరీ తదతర అన్ని రంగాలలో జర్మనీ లేదా తమ దేశాల ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు పూనుకోవటమే జాతీయవాదం, దేశభక్తి. అందుకే జర్మనీ ఔన్నత్యాన్ని కాపాడేందుకంటూ వున్మాదాన్ని రెచ్చగొట్టిన హిట్లర్ ప్రపంచానికి ఎలా ముప్పుగా తయారైందీ చూశాము. అదే సమయంలో మన దేశంలో దేశభక్తి, జాతీయవాదం అంటే బ్రిటీష్ వారి వ్యతిరేకత, సర్వసత్తాక స్వతంత్ర ప్రభుత్వస్ధాపన. ఈ అవగాహనతో ఆర్‌ఎస్‌ఎస్ ఏకీభవించలేదు కనుకనే అది స్వాతంత్య్రానికి దూరంగా వుండిపోయింది. దాని నాయకులుగా వున్న సావర్కర్ వంటి వారు చివరికి బ్రిటీష్ వారికి లంగిపోయి, సేవలు అందించిన విషయం తెలిసిందే. అలాంటి శక్తుల ప్రతినిధులే నేడు దేశభక్తి, జాతీయవాదానికి భిన్న భాష్యాలు చెబుతూ వాటిని అంగీకరించని వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న ప్రమాదకర పరిస్ధితి దేశంలో నేడు పెరిగిపోతోంది. తాము చెబుతున్న జాతీయవాదమే మానవత్వమని అంగీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్ చెబుతోంది.
దేశ చరిత్ర, వ్యక్తులు, భావజాలం వంటి సకల సామాజిక అంశాల గురించి ఆర్‌ఎస్‌ఎస్ టీకా తాత్పర్యాలతో విబేధించే హక్కు ఇతరులకు ఎలా వుందో, ఇతరులు చెప్పిన వాటిపై భిన్నాభిప్రాయం వెలిబుచ్చే హక్కు వారికీ వుంది. వాటి గురించి బహిరంగ చర్చ జరపాలి భిన్న పక్షాలు తమ వాదనలకు అవసరమైన రుజువులను చూపాలి. కానీ ఆర్‌ఎస్‌ఎస్ అనేక అంశాలలో అది మానమ్మకం, మా మనోభావం, తరతరాల నుంచీ వస్తున్నదానిని ఎవరూ తిరస్కరించకూడదనే పేరుతో చర్చ నుంచి పారిపోతోంది. తన అజెండాను రహస్య పద్దతుల్లో అమలు జరిపేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే రాజ్యాంగ వ్యవస్ధలో తన భావజాలాన్ని ఏదో ఒక విధంగా అమలు జరిపే శక్తులతో నింపుతూ వారితో తన కార్యక్రమాన్ని అమలు చేయిస్తోంది.పైకి తాము జోక్యం చేసుకోవటం లేదని, తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తోంది.
ఎన్‌సిఇఆర్‌టికి సూచనలు, సిఫార్సులను సమర్పించిన న్యాస్ విషయమే చూద్దాం.దాని అధినేత తమ సంస్ధను ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధం అని పేర్కొనటాన్ని విలేకర్ల సమావేశంలో తప్పు పట్టారు. పోనీ రెండు సంస్ధల మధ్య వున్న సంబంధం ఏమిటో సెలవివ్వండి అంటే ఆర్‌ఎస్‌ఎస్, తమదీ వేర్వేరు స్వతంత్ర సంస్ధలని మాత్రమే చెప్పారు. శిక్షా సంస్కృతి వుత్తాన్ న్యాస్ అనే సంస్ధ రిజిస్టర్డు ఆఫీసు చిరునామా ఢిల్లీలోని నారాయణ విహార్‌లోని సరస్వతీ బాల మందిర్. ఆ పాఠశాలను నడుపుతున్నది విద్యాభారతి అనే మరొక సంస్ద. దాని వెబ్‌సైట్‌లో జీవితంలో ఒక లక్ష్యం వుండాలనే భావనతో 1952లో కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పిల్లల విద్యను చేపట్టినట్లు స్పష్టంగా రాసుకున్నారు. అంతే కాదు హిందుత్వకు కట్టుబడి ూండే, దేశభక్తిని చొప్పించే ఒక జాతీయ విద్యా వ్యవస్ధను కూడా అభివృద్ధి చేయటం తమ లక్ష్యంగా కూడా దానిలో చెప్పుకున్నారు. విద్యా భారతి మాజీ అధిపతి దీనా నాధ్ బాత్రా న్యాస్ స్ధాపకులలో ఒకరు. వీరందరికీ ఆర్‌ఎస్‌ఎస్‌తో వున్న సంబంధాల గురించి ఆ సంస్ధ పత్రిక ఆర్గనైజర్‌లో 2008లో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం బృందావన్‌లో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ సమావేశంలో కొంతమంది అధికారుల బాధ్యతలలో మార్పులు చేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్ సరకార్యవాహక్ శ్రీ మోహన్ భగవత్ దిగువ మార్పులను ప్రకటించినట్లు దానిలో వుంది. ఆ జాబితాలో శిక్షా బచావో ఆందోళన్ నూతన అధిపతిగా అతుల్ కొథారీని నియమిస్తున్నట్లు వుంది. ఆయనే తరువాత ప్రస్తుత న్యాస్ బాధ్యతలు చూస్తున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా నష్టం కలిగిస్తుందనుకుంటే ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ఏమి చెప్పటానికైనా వెనుతీయరు. న్యాస్ పత్రంపై చర్చ జరిగితే ఆర్‌ఎస్‌ఎస్ నిజరూపం మరింతగా బహిర్గతం అవుతుంది, అది నష్టదాయకం కనుక ఈ వివాదానికి ముగింపు పలకాలని వారు తొందరపడుతున్నారు, దానిలో భాగమే రవీంద్రుని భావజాలాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించబోవటం లేదని రాజ్యసభలో ప్రకాష్ జవదేకర్ చేత చెప్పించటం. ఎన్‌సిఇఆర్‌టి దాని గురించి అధికారికంగా చెప్పేంత వరకు ఎవరేమి చెప్పినా దానికి విలువ లేదు. తన పత్రాన్ని వుపసంహరించుకున్నట్లు లేదా సవరించుకున్నట్లు న్యాస్ చెప్పేంత వరకు దీని గురించి ఎవరైనా చర్చించవచ్చు, ఆ తరువాత కూడా జరిగిందానిని ప్రస్తావించవచ్చు. తమను ప్రశ్నించే మీడియాను బిజెపి మంత్రులు, అనుయాయులు ప్రెస్టిట్యూట్స్ అంటూ కించపరుస్తున్న విషయం తెలిసిందే.(వళ్లమ్ముకొనే వారిని ఆంగ్లంలో ప్రాస్టిట్యూట్స్ అంటున్నారు, తమను ప్రశ్నించే మీడియా వారు కూడా వారితో సమానం అంటూ ప్రెస్టిట్యూట్స్ అని దాడి చేస్తున్నారు)
ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ న్యాస్ విషయానికి వస్తే తమ భావజాలానికి వ్యతిరేకమైనవి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వాటిని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలని నిరంతర కార్యక్రమంగా పెట్టుకున్నాయి. వుదాహరణకు ‘ మూడు వందల రామాయణాలు: ఐదు వుదాహరణలు, అనువాదంపై మూడు ఆలోచనలు ‘ అనే ఏకె రామానుజం వ్యాసాన్ని ఢిల్లీ విశ్వవిద్యాలయ సిలబస్ నుంచి తొలగించాలని, వెండీ డోనిగర్ రాసిన ది హిందూస్ అనే పుస్తకాన్ని వుపసంహరించాలని న్యాస్ ఆందోళన చేసింది, కోర్టులకు ఎక్కింది. రామానుజన్ వ్యాసాన్ని తొలగించారు, రెండో పుస్తకాన్ని తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేశారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన దాని ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్ వారు పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాల్సిన అంశాలుగా పేర్కొన్న వాటి సారాంశం ఇలా వుంది.
పన్నెండవ తరగతి రాజకీయ శాస్త్రం
1984 ఘర్షణల గురించిన పేరా ఇలా అంతమౌతుంది.’ 2005లో పార్లమెంట్‌లో వుపన్యాసం సందర్భంగా సిక్కు వ్యతిరేక హింసాకాండలో రక్తపాతం జరగటం దానికి దేశం క్షమాపణలు చెప్పాలనటంపై ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.
రామాలయ ఆందోళనకు బిజెపి మరియు హిందుత్వ రాజకీయాల ఎదుగులకు సంబంధం వుందని ఒక పేరా చెబుతోంది. ఒక చోట బిజెపి ఒక హిందుత్వ పార్టీ అని మరొక చోట హిందుత్వ, హిందుపన్‌లు విడి సావర్కర్ కల్పితమని పేర్కొన్నారు. మరొక చోట బాబరీ మసీదును మీర్ బక్షి నిర్మించాడని….రాముడి జన్మస్ధలంలోని రామాలయాన్ని ధ్వంసం చేసి దానిని నిర్మించారని కొందరు హిందువులు విశ్వసిస్తారని వుంది. గోద్రాలో 2002లో జరిగిన వుదంతం గురించిన చోట ఒక రైలుకు నిప్పంటుకుందని…. దానికి ముస్లింలో కారణమనే అనుమానంతో’ అనే వ్యాక్యంలో నిప్పుంటుకుంది అనే పదాన్ని తగులబెట్టారు అని సవరించాలని, అనుమానం అనే పదాన్ని తొలగించాలని న్యాస్ కోరింది. మరొక చోట ‘ అటువంటి మారణకాండకు పధకాలు వేసిన వారికి కనీసం రాజకీయ పద్దతులలో(ఓటింగ్) ద్వారా ఒక పాఠం చెప్పేట్లు మనం చూడగలమా అని వుంది.
తొలగించాల్సిన భాషా పదాల జాబితాలో ఆంగ్లంలో వైస్ ఛాన్సలర్,వర్కర్, మార్జిన్, బిజినెస్,బాక్‌బోన్, స్టాంజా, రాయల్ అకాడమీ, వుర్దు లేదా అరబిక్ భాషలోని బేటార్‌టిబ్, పోషక్, తాకత్, ఇలాకా, అక్సర్, ఇమాన్, జోకిహిమ్,మెహమాన్-నవాజీ, చమర్, సారే ఆమ్, ఇవిగాక భ్రష్టపదాలుగా వుల్లు కహిన్‌కా, కాంబఖత్, బద్మాష్, లుచ్చే-లఫంగే, బహంగియోన్ వున్నాయి.
తొమ్మిదవ తరగతిలో రామధరీ సింగ్ దినకర్ ఒక ప్రేమికుని వాంఛలు అనే కవిత వలన పిల్లలు తప్పుదారి పడతారు,శీలాన్ని కోల్పోతారు కనుక, కేంద్ర ప్రభుత్వం చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ కార్యకలాపాలు దేశ ఐక్యతం, గణతంత్రానికి ముప్పు అని భావిస్తున్నందున పదకొండవ తరగతిలో ఆయన ఆత్మకథను తొలగించాలని కోరారు. కన్నడ కవయిత్రి అక్క మహా దేవి ఒక సంఘటనను పేర్కొంటూ దానికి నిరనగా తన దుస్తులను తొలగించినట్లు ఒక పాఠంలో వుంది. ఒక నగ్న మహిళను వర్ణించటం మహిళల స్వేచ్చ పేరుతో హిందూ సంస్కృతిని కించపరచటమే అని న్యాస్ వాదించింది.
చరిత్ర పాఠ్యాంశాలకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాల సారం ఇలా వుంది. వేదాల అనంతర కాలంలో సాధారణంగా మహిళలను సూద్రులతో సమంగా పరిగణించారు. దేవుడి ముందు అన్ని మతాల వారు సమానమే అనే సులహ్ ఏ కుల్ విధానాన్ని అక్బర్ ప్రవేశపెట్టారు. వితంతువుల దురదృష్టాలు, సామాజిక బహిష్కరణల గురించి 19వ శతాబ్ది మహిళా వుద్యమకారిణి తారాబాయ్ షిండే రాసిన పుస్తకంలో పితృస్వామ్య వ్యవస్ధపై తీవ్ర విమర్శ వుంది. దానిని కూడా తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్ సంస్ధ కోరింది. మరొక పుస్తకంలో వర్ణాశ్రమ వ్యవస్ధ గురించిన ప్రస్తావన ఇలా వుంది. ‘పుట్టుకతోనే హోదా నిర్ణయమౌతుంది. వారు(బ్రాహ్మలు) జనం ప్రతిష్ట పుట్టుక మీదే ఆధారపడి వుందని గుర్తించేందుకు ప్రయత్నించారు… అలాంటి అర్హతల గురించి మహాభారతం వంటి అనేక పుస్తకాలలోని కధలతో పటిష్టపరిచారు.’ ఆర్యుల యుద్ధ దేవుడు ఇంద్రుడిపై మొహంజదారో చివరి దశలో స్త్రీ పురుషులను వూచకోత కోశాడనే ఆరోపణలున్నాయి. ఒక చోట మొగల్ కాలంలో పాలకులు జనం పట్ల ఎంతో వుదారంగా వుండేవారు, మొగలాయీ పాలకులందరూ ప్రార్ధనా మందిరాల నిర్మాణం, నిర్వహణకు నిధులు ఇచ్చారు. యుద్ధాల సందర్భంగా దేవాలయాలు నాశనమైతే తరువాత వాటి మరమ్మతులకు నిధులు విడుదల చేసేవారు.అని వుంది. ఇలాంటి వాటన్నింటినీ తొలగించాలి, సవరించాలి అని న్యాస్ పేర్కొన్నది.
ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటం, మనువాద వ్యవస్ధను పరిరక్షించటం, తమ భావజాలానికి తగిన విధంగా లేక వ్యతిరేకంగా వుంటే రవీంద్రుని వంటి వారి ఆలోచనలను కూడా నూతన తరాలకు అందకుండా చూడటం, తమ దుష్ట చరిత్రను మరుగుపరచటానికి విద్యారంగాన్ని వినియోగించుకోవాలని కాషాయ దళాలు చూస్తున్నాయన్నది స్పష్టం.