Tags
Attack on media, attacks on journalists, bully, defamation cases on media, EPW, free speech, journalism, Media, Samiksha trust, silence, SLAP
ఎం కోటేశ్వరరావు
భావ ప్రకటనా స్వేచ్చ మానవులకు పుట్టుకతో వచ్చిన హక్కు. భూమ్మీద పడగానే గాలి పీల్చుకోవటంతో కేరు మంటూ ప్రారంభమయ్యే స్వేచ్చా గళం తిరిగి అంతిమంగా శ్వాస తీసుకోవటం ఆగినపుడే మూతపడుతుంది. అలాంటి పుట్టుకతో వచ్చిన హక్కును హరించేందుకు మధ్యలో ఎవరు ప్రయత్నించినా దానిని ఏదో ఒక రూపంలో ప్రతిఘటించటమే సజీవ మానవ లక్షణం.
కుక్క పిల్లా, సబ్బు బిళ్లా, తలుపు గొళ్లెం, హారతి పళ్లెం కాదేదీ కవిత కనర్హం……… హీనంగా చూడకు దేన్నీ కవితామయమేనోయ్ అన్నీ అని మహాకవి శ్రీశ్రీ చెప్పారు. అలాగే భావ ప్రకటనా స్వేచ్చను హరించటానికి నియంతలు,పోలీసులు, గూండాలు, కార్పొరేట్లు కావేవీ మినహాయింపు, ఏదీ తక్కువ కాదు అని చెప్పుకోవాల్సిన రోజులచ్చాయి. నియంతలు ఏదో ఒకసాకుతో లంగని మీడియా సంస్ధలను పూర్తిగా మూతవేయించటానికి ప్రయత్నిస్తారు. గూండాలు పశుబలాన్ని వుపయోగిస్తే, పోలీసులు, కార్పొరేట్లు చట్టాలను రక్షణగా తీసుకొని స్వేచ్చ, ప్రజాస్వామ్యాన్ని హరించటానికి ప్రయత్నిస్తాయి.
ఇటీవలి కాలంలో అధికార రాజకీయాలు నడిపే శక్తులు తమకు లంగని రాజకీయ ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం ద్వారా వారిని తమ దారికి దారికి తెచ్చుకోవటం ఒక ముఖ్యపరిణామం. దాని ఫలితమే ఎవరు ఏ పార్టీ తరఫున ఎన్నికవుతారో, ఏక్షణంలో పార్టీ మారతారో తెలియని స్ధితి. కార్పొరేట్ సంస్ధలు ఒక దశలో స్వయంగా మీడియా సంస్ధలను ప్రారంభించటం ఒక పరిణామమైతే, తమ ప్రయోజనాలకు సహకరించని ఇతర వాటిని ఆర్ధికంగా దెబ్బతీయటం రాజకీయాలలో మాదిరి మరో సరికొత్త కొత్త ధోరణి. అది సంస్ధలకే పరిమితం కాలేదు, వ్యక్తులకు, శక్తులకు, మీడియాయేతర సంస్ధలను కూడా తమ దారికి తెచ్చుకొనేందుకు పైన పేర్కొన్న శక్తులన్నీ పూనుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో వుపాధి,వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణాన్ని దెబ్బతీసే రొయ్యల ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆ గ్రామం, పరిసర ప్రాంతాల జనం వుద్యమిస్తే వారిని అణచివేసేందుకు సంబంధిత పారిశ్రామికవేత్తలు గూండాలు, పోలీసులు, అధికారయంత్రాంగం, మంత్రులు, వాణిజ్యమీడియాను ఎలా వుపయోగించుకున్నదీ ప్రత్యక్షంగా చూశాము. వారి కుమ్మక్కును బహిర్గతం చేసేందుకు కొందరు జర్నలిస్టులు సిద్ధంగా వున్నా మీడియా యాజమాన్యాలు వారి నోరు నొక్కుతున్నాయి. వాస్తవాలకు మీడియాలో చోటు కల్పించటం లేదు.
వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు లాభం కలిగించేందుకుాతద్వారా తాము లబ్ది పొందేందుకు అధికారంలో వున్న పార్టీలు, వారి చెప్పుచేతల్లో పనిచేసే అధికార గణం నిబంధనలను ఎలా కావాలనుకుంటే అలా మార్చటం, తమకు అనువైన టీకాతాత్పర్యాలు చెప్పటం చూశాము. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో చెరువులు తవ్వాలనే పేరుతో తమకు ఓటు వేయని దళితుల భూములను ఆక్రమించేందుకు, వ్యవసాయానికి పనికిరాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి ఒక శత్రుదేశంపై దాడి మాదిరి జనాన్ని బయటకు రానివ్వకుండా చేసి, పెద్ద సంఖ్యలో యంత్రాలను ప్రయోగించి ఎలా తవ్వించిందీ లోకం చూసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో !
ప్రధాని నరేంద్రమోడీ, బిజెపికి అత్యంత సన్నిహితుడైన వాణిజ్య, పారిశ్రామికవేత్త అదానీ. అతని గ్రూపు కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు మార్చిన నిబంధనలు, పన్నుఎగవేత తీరుతెన్నుల గురించి ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (ఇపిడబ్ల్యు) జూన్ నెలలో రెండు పరిశోధనాత్మక విశ్లేషణలను ప్రచురించింది. వాటిని వెబ్ నుంచి వెంటనే వుపసంహరించని పక్షంలో తాము పరువు నష్టం దావా వేస్తామని అదానీ గ్రూపు లాయర్ నోటీసులు జారీ చేసింది. దానికి సమాధానంగా సంపాదకుడు పరంజయ గుహ థాకూర్దా ఒక లాయర్‌ను ఏర్పాటు చేసి సమాధానం పంపారు. ఈలోగా ఆ పత్రికను నడుపుతున్న సమీక్షా ట్రస్టు పాలకవర్గం వెంటనే ఆవిశ్లేషణలను తొలగించాలని ఆదేశించటంతో దానికి నిరసనగా పరంజయ్ రాజీనామా చేశారు. ఈ పరిణామంతో ఆ పత్రిక యాజమాన్య ట్రస్టు గురించి ఎంతో వున్నతంగా వూహించుకున్న అనేక మంది హతాశులై పత్రిక ప్రతిష్టను పునరుద్దరించాలని ఒక బహిరంగ లేఖ రాశారు. భారతీయ మీడియాలో ఇలాంటి పరిణామం బహుశా ఇదే ప్రధమం. అనేక సంస్ధల యాజమాన్యాలు పాలేర్లను మార్చినట్లు సంపాదకులను మార్చటం చూశాము. అయితే అవన్నీ తెరవెనుక పరిణామాలకే పరిమితం అయ్యాయి. కానీ ఇపిడబ్ల్యు వుదంతం అలాంటి కాదు, అలా జరగలేదు.
కార్పొరేట్ల అక్రమాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా వుద్యమించిన సంస్ధలు, వ్యక్తులు, శక్తులు, వాటిని బయట పెట్టిన జర్నలిస్టులను కేసులు ముఖ్యంగా భారీ మొత్తాల ప్రమేయం వున్న పరువు నష్టం, తదితర కేసులతో వేధించటం ప్రపంచవ్యాపితంగా జరుగుతోంది. కార్పొరేట్ సంస్ధలు ఎప్పుడైతే దేశ రాజకీయాలను శాసించేంత బలంగా తయారయ్యాయో ఆ పరిణామం మన దేశంలో కూడా వేగవంతమైంది. ఆంగ్లంలో స్ట్రాటజిక్ లా సూట్ ఎగైనెస్ట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అనేదాన్ని పొట్టిగా ‘స్లాప్’ అంటున్నారు. జన భాగస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక న్యాయపరమైన దావా అని తెలుగులో చెప్పవచ్చు. ఇలాంటి దావాలు కోర్టు విచారణలో నిలుస్తాయా లేదా అన్నదానిని కార్పొరేట్ సంస్ధలు పట్టించుకోవు. తమను వుతికి ఆరవేస్తున్నవారిని ముందుకు పోకుండా చేయటమే ప్రధాన లక్ష్యం. అందుకు గాను పెద్ద మొత్తం పరువు పరిహారాన్ని కోరటం, క్రిమినల్ కేసులు పెట్టటం ప్రధానంగా జరుగుతుంది. వాటిని ఎదుర్కొనేందుకు పెద్ద మొత్తంలో న్యాయవాదులకు డబ్బులిచ్చి కోర్టులలో పోరాడటం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు కనుక ఇలాంటి బెదిరింపులు ప్రతి దేశంలో సర్వసాధారణమయ్యాయి. గ్రీన్‌పీస్ అనే సంస్ధ నోరు మూయించటానికి ఒక కేసులో 30కోట్లు, మరోకేసులో 70లక్షల డాలర్ల పరిహారానికి కేసులు నమోదు చేశారు. ‘స్లాప్’ కేసులు బనాయించకుండా చూసేందుకు పరిమిత దేశాలు మాత్రమే ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ కేసులు పెరిగిపోతూనే వున్నాయి.
పశ్చిమ గోదావరిలో ఒక నాడు ఒక సన్నకారు రైతుగా వుండి తరువాత కాలంలో ఆఫ్రికాలో, మన దేశంలోని బెంగళూరులో ఒక పెద్ద వ్యాపార సంస్ధగా ఎదిగిన కరుటూరి గ్లోబల్ యాజమాన్య కార్యకలాపాల గురించి కేయ ఆచార్య అనే ఒక పర్యావరణ జర్నలిస్టు రాసిన వ్యాసాన్ని ఇంటర్ ప్రెస్ సర్వీసు(ఐపిఎస్) ప్రచురించింది. దాని వలన కలిగిన తమ పరువు నష్టంగా వందకోట్ల రూపాయలు చెల్లించాలని 2014 ఆగస్టు ఐదున ఆ సంస్ధ ఎండీ శాయి రామకృష్ణ కరటూరి ఒక నోటీసు పంపారు. కంపెనీ తూర్పు ఆఫ్రికాలో నిర్వహిస్తున్న కార్యకలాపాలు భారత్‌లోని గులాబి సాగుపై ఎలాంటి ప్రభావం చూపిందో ఆ జర్నలిస్టు తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఆమెకు నోటీసు అందగానే ఆ విశ్లేషణను తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఐపిఎస్ సంస్ధ వెంటనే ఒక ప్రకటన చేసింది. జర్నలిస్టు రాసిన విశ్లేషణలోని అంశాలను, వార్తా వనరు గురించి నిర్ధారించుకొనేందుకు గాను ఆ వ్యాసాన్ని పక్కన పెడుతున్నామని, తమ సంస్ధ నుంచి వార్తలను కొనుగోలు చేస్తున్న ఖాతాదారులు దానిని ఏ రూపంలోనూ తిరిగి ప్రచురించవద్దని దానిలో పేర్కొన్నది. ఈ నోటీసు తనను బెదిరించేందుకు మాత్రమే కాదని భవిష్యత్‌లో ఆఫ్రికాలో కరుటూరి కంపెనీ కార్యకలాపాల జోలికి పోకుండా మౌనం వహించేందుకు కూడా వుద్దేశించిందని శ్రేయ ఆచార్య పేర్కొన్నారు.
కాలం చెల్లిన పరువు నష్టం చట్టాలను ఇంకా మన దేశంలో కొనసాగించటం స్వేచ్చా గళాలను అణచివేయటానికి సాధనాలుగా చేసుకొనేందుకు అనుమతించటం దారుణం. పరువు నష్టం కేసుల వివరాలను పరిశీలిస్తే బెదిరించటానికే వాటిని వుపయోగిస్తున్నట్లు వెల్లడి అయింది. పెద్ద మొత్తం పరిహారం కోరుతూ జర్నలిస్టులకు నోటీసు పంపితే రాసిన వాటిని వెనక్కు తీసుకోవటమో లేదా తదుపరి రాయకుండా చేయటమో జరుగుతోందని తేలింది. తాజా వుదంతం ఇపిడబ్ల్యు సంపాదకుడు పరంజయ గుహ థాకూర్ధా విషయంలో కూడా దీన్ని గమనించవచ్చు. పరంజయ్ గుహ, సుబీర్ ఘోష్, జ్యోతిర్మయ్ చౌదరి ‘గ్యాస్ వార్స్-క్రోనీ కాపిటలిజం అండ్ అంబానీస్’ అనే పేరుతో పుస్తకం రాశారు. దానిలో సహజవాయు ధర నిర్ణయంలో జరిగిన అక్రమాలను వివరించారు. ఆ పుస్తకం వెలువడగానే ఆ పుస్తకాన్ని రాసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, దానిని వెబ్‌సైట్‌నుంచి తొలగించాలని, విక్రయాలు, ముద్రణలను నిలిపివేయాలని లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అంబానీ సోదరులు నోటీసులు జారీ చేశారు. రచయితలు కూడా వాటికి లీగల్‌గానే సమాధానాలు పంపారు. తరువాత అంబానీల వైపు నుంచి ఎలాంటి కదలికలు లేవు. ఇలాంటి వాటికి తాము భయపడలేదని రచయితలలో ఒకరైన ఘోష్ వ్యాఖ్యానించారు.తమను బెదిరించటానికి, వేధించటానికే ఈ నోటీసులు జారీ చేశారని థాకూర్ధా వ్యాఖ్యానించారు.
సహారా గ్రూపు అధిపతి సుబ్రతారాయ్ కూడా సహారా: అన్ టోల్డ్ స్టోరీ పేరుతో మింట్ పత్రిక డిప్యూటీ మేనేజింగ్ ఎడిటర్‌గా వున్న తమల్ బందోపాధ్యాయ, పుస్తక ప్రచురణ సంస్ధ జైకో పబ్లిషింగ్ హౌస్‌పై రెండువందల కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం దావా వేశాడు. సహారా సంస్ధ లావాదేవీలు, అది ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యల గురించి దానిలో వివరించారు. దాని విడుదలపై కొల్‌కతా హైకోర్టు స్టే విధించింది. తరువాత వుభయ పక్షాలూ కోర్టు వెలుపల వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. ఆపుస్తకంలో పరువుకు భంగం కలిగించే అంశాలున్నాయని, సహారా సంస్ధ వాటి గురించి సంతోషంగా లేదనే ప్రకటన కూడా పుస్తకంలో ప్రచురించేట్లు, పుస్తక ప్రచురణ, విడుదలకు అంగీకరిస్తూ ఒప్పందం కుదిరింది. ఒక వ్యక్తిగా అలాంటి పెద్ద సంస్ధలతో పోరాడటం కష్టమని, తనకు మింట్ యాజమాన్య మద్దతు వున్న కారణంగానే పోరాడగలిగానని, అన్నింటికంటే తనకు మీడియా ఎంతగానో మద్దతు ఇచ్చిందని, అయినా తన ఆరోగ్యం దెబ్బతిన్నదని రచయిత తమల్ బందోపాధ్యాయ చెప్పారు. ఇలాంటి నోటీసులు నిజాయితీగా వార్తలు అందించటాన్ని అడ్డుకొనేందుకే అన్నది వాస్తవం అన్నారు. మింట్ పత్రికను ప్రచురిస్తున్న హిందుస్తాన్ టైమ్స్ సంస్ధపై రిలయన్స్ పవర్ కూడా మింట్ ప్రచురించిన వార్తపై దావా వేసింది. సెబీతో సహారా కంపెనీ వివాదంపై వార్తలు రాసినందుకు మింట్ పత్రిక సంపాదకుడిపై ఆ కంపెనీ పాట్నాలో ఒక పరువు నష్టం దావా వేసింది.
ఒక సంస్ధ లేదా ఒక వ్యక్తికి సంబంధించిన వార్త లేదా వ్యాఖ్య ప్రచురితం లేదా ప్రసారమైనపుడు అభ్యంతరకరమైన అంశాలుంటే ముందుగా వాటికి సంబంధించిన వివరణలు లేదా ఖండనలు ఇవ్వాలి. వాటిని మీడియా విస్మరించినపుడు ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలి అక్కడ కూడా న్యాయం జరగలేదని అనిపిస్తే తదుపరి న్యాయపరమైన చర్యలకు పూనుకొనేందుకు ఎవరికైనా హక్కుంటుంది. అయితే దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అందుకు భిన్నంగా జరుగుతోంది. గూండాలు, మాఫియా, ప్రజాప్రతినిధులు లేదా వారి అనుయాయులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని భౌతికదాడులకు పాల్పడుతున్నారు. హత్యలకు కూడా వెనుతీయటం లేదు. పోలీసులు కూడా అత్యధిక సందర్భాలలో వారితో కుమ్మక్కయి జర్నలిస్టులపై ప్రతి కేసులు బనాయించటం లేదా కొన్ని సందర్భాలలో అయితే రౌడీషీట్లను కూడా తెరిచే విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. కార్పొరేట్ శక్తులు తమ డబ్బు మదంతో భారీ మొత్తాలకు పరువు నష్టం కేసులు వేస్తూ మీడియా సంస్ధలు, జర్నలిస్టుల నోరు నొక్కేందుకు పూనుకోవటం ఏడుపదుల మన ప్రజాస్వామ్య వ్యవస్ధకు పట్టిన దుర్గతి. ఈ స్ధితిలో ఏం చెయ్యాలి అనే సమస్య ఒక్క జర్నలిస్టులకే కాదు యావత్ సమాజం ముందున్నది.
ఇపిడబ్ల్యు వుదంతానికి వస్తే అసలు వాస్తవాలేమిటన్నది బయటకు రావాల్సి వుంది. కేవలం ఒక లాయర్ నోటీసుకే యాజమాన్యం ఇలాంటి చర్యలకు పూనుకోవటం అనూహ్యం. ఇప్పటి వరకు వెల్లడైన అభిప్రాయాలు, చేసిన ప్రకటనలు అనేక కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. అదానీ లీగల్ నోటీసు ట్రస్టును వుద్ధేశించిందని అయితే దాని గురించి తమకు తెలపకుండానే ట్రస్టు తరఫున సమాధానం ఇస్తున్నట్లు పేర్కొన్నారని, అది ఏకపక్షంగా నిర్ణయమని విశ్వాసాన్ని వుల్లంఘించారని సమీక్ష ట్రస్టు ప్రకటించింది. జరిగిందేమిటో తమకు తెలపకుండానే లీగల్ నోటీసు, సమాధాన వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పెట్టారని తెలిపింది. వాటితో పాటు అదానీ కంపెనీల గురించిన రాసిన ఆర్టికల్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించాలని కోరినట్లు తెలిపింది. ఆ తరువాత పరంజయ్ రాజీనామా చేశారని, దానిని ట్రస్టు సమావేశం అంగీకరించినట్లు తెలిపారు. లీగల్ నోటీసు గురించి అనుమతి తీసుకోకుండా సమాధానం ఇవ్వటం తన పొరపాటేనని అంగీకరించానని, జరిగిందానిని పూర్తిగా ట్రస్టు సభ్యులు వెల్లడించటం లేదని రాజీనామా చేసిన పరంజయ్ చెబుతున్నారు.
జరిగిందాని గురించి అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అదానీ గ్రూపు లాయర్లు పేర్కొన్న వ్యాసాన్ని తొలగించాలని ట్రస్టు కోరిందీ లేనిదీ స్పష్టం కావాల్సి వుంది. అదానీ కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల పన్ను ఎగవేసిందా అన్నదొక వ్యాసం, అదానీ కంపెనీకి ఐదువందల కోట్ల రూపాయలను అప్పనంగా ప్రభుత్వం కట్టబెట్టిన విధాన లోపం గురించి మరొక వ్యాసంలో పేర్కొన్నారు.రెండవ వ్యాసాన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించాలని ట్రస్టు సభ్యులు కోరారన్న అంశంపై తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. తొలగించమని కోరటానికి గల కారణాలను ట్రస్టు వెల్లడించలేదు.అదే సమయంలో తామెవరి వత్తిడికి ఎన్నడూ లంగలేదని పేర్కొన్నారు. పరంజయ్ రాసిన వ్యాసంలో గుర్తుతెలియని వనరులు చెప్పిన ఆధారాలు లేని అనేక కట్టుకథలు వున్నాయని, వాటి ఆధారంగా నిర్ధారణలు చేశారని ట్రస్టు సభ్యులు ఆరోపించారు. కొద్ది రోజుల తరువాత ట్రస్టు సభ్యుల పేరుతో వెలువడిన ప్రకటనలో ఇపిడబ్ల్యు ప్రమాణాలకు అనుగుణ్యంగా ఆ వ్యాసాలు లేవని, వాటిపై సమీక్ష కూడా సవ్యంగా జరగలేదని పేర్కొనటం గమనించాల్సిన అంశం.
ట్రస్టు సభ్యులతో జరిగిన సమావేశంలో లీగల్ నోటీసు అంటే ఒక లాయర్ నుంచి వచ్చిందే తప్ప కోర్టులో క్రిమినల్ కేసు నుంచి కాదని తాను వివరించానని, దానికి కూడా ట్రస్టు అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా లీగల్ నోటీసుకు సమాధానం పంపటం పొరపాటేనని గ్రహించానని అందుకు క్షమాపణ కూడా చెప్పానని పరంజయ్ చెప్పారు. అయితే ఆ రోజు జరిగిన దానిని పూర్తిగా వెల్లడించలేదని పేర్కొన్నారు. తన పేరుతో వ్యాసాలు రాయవద్దని ట్రస్టీ సభ్యులు చెప్పారని, ఏవైతే సంపాదకుడి విధులు, పాత్ర వుంటుందో అవే వుండే విధంగా ఒక సహసంపాదకుడిని కూడా నియమిస్తామని చెప్పారని, తక్షణమే వెబ్‌సైట్ నుంచి ఆర్టికల్స్ తొలగించి వెళ్లాలని కోరినట్లు చెప్పారు. తాను ఇతరులతో కలసి రాసిన విశ్లేషణలో ప్రతి వ్యాక్యానికి కట్టుబడి వుంటానని, అందుకు తగిన ఆధార పత్రాలు తన వద్ద వున్నాయని చెప్పానని, తాను రాసిన దానికి సాక్ష్యాల గురించి ట్రస్టీలు అసలు అడగలేదనిఅయినప్పటికీ వెబ్‌సైట్ నుంచి తొలగించాల్సిందేనంటూ తాను చెప్పిందానిని పట్టించుకోలేదన్నారు. ట్రస్టీలకు ఆధారాలపై ఆసక్తి లేదన్నారు. ఒక ట్రస్టీ అయితే ఆ వ్యాసాన్ని తానింకా చదవలేదని కూడా చెప్పారని, వెబ్‌సైట్ నుంచి ఆర్టికల్స్‌ను తొలగించిన తరువాతే బయటకు వెళ్లాలని తనతో చెప్పారని కూడా పరంజయ్ చెబుతున్నారు. దాంతో తాను ు రాజీనామా చేస్తానని చెప్పానని, ముంబైలో సంపాదకుడికి ఇచ్చే ఫ్లాట్‌ను ఖాళీ చేయటానికి కొద్ది రోజులు గడువిస్తారా అని అడగ్గా జూలై ఆఖరు నుంచి రాజీనామా అమలులోకి వస్తున్నట్లు పరిగణిస్తామని ట్రస్టు సభ్యులు చెప్పారని అయితే తక్షణమే తాను రాజీనామా చేసినట్లు పరిగణించాలని కోరినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు ఆ పత్రిక తీరు తెన్నులను పరిశీలించినపుడు దాని సంపాదకుడి ఎన్నిక మిగతా వాణిజ్య పత్రికల మాదిరిగా జరగదని తెలిసిందే. వివిధ రంగాలలో పరిణితులైన ట్రస్టు సభ్యులు పూర్వపరాలను ఒకటికి రెండుమార్లు పరిశీలించి నిపుణులు, నిబద్ధత కలిగిన వారినే సంపాదకులుగా ఎంపిక చేశారు. గతంలో పని చేసిన వారందరూ వున్నంతలో వున్నత ప్రమాణాలు, విలువలను కాపాడారు కనుకనే ఆ పత్రికకు ఒక విస్వసనీయత ఏర్పడింది.ఆ రీత్యా చూసినపుడు పరంజయ్ గుహ థాకూర్ధాను కూడా ఆ ప్రమాణాల మేరకే ఎంపిక చేశారు. పరిశోధనాత్మక జర్నలిజంలో ముందే చెప్పుకున్నట్లు రిలయన్స్ వంటి దిగ్గజ సంస్ధకు సైతం వెరవ కుండా దాని అక్రమాలను బయట పెట్టిన చరిత్ర వుంది. అలాంటి వ్యక్తి అదానీ సంస్ధల గురించి అదీ అదానీకి నరేంద్రమోడీతో వున్న సంబంధాలు తెలిసి కూడా ఆషామాషీగా గాలి వార్తలను పోగేసి కధనాలు రాశారని, తమ విశ్వాసాన్ని వమ్ము చేశారని అంటే నమ్మటం కష్టం. ఒక అంశంపై పరిశోధన చేసిన జర్నలిస్టుకు కొన్ని సందర్భాలలో తప్పుడు సమాచారం కూడా వచ్చి వుండవచ్చు. ఇపిడబ్ల్యు పత్రికలో అటువంటి వార్తలు రాశారంటే ఎవరూ నమ్మటం లేదు. అసలు ఆ వార్తల గురించి అదానీ సంస్ధ లేదా ప్రభుత్వ ప్రమేయం కూడా వుంది కనుక ఆయా శాఖల స్పందన ఏమిటన్నది కూడా పరిశీలించకుండానే పరంజయ్ ఇతరులతో కలసి రాసిన వార్తలను వెబ్‌సైట్ నుంచి తొలగించాలని పేర్కొనటం ట్రస్టు సభ్యులపై అనుమానాలను పెంచేదే తప్ప వేరు కాదు. ప్రజల ఖజానాకు చేరవలసిన వందల కోట్ల రూపాయలను ఒక సంస్ధ అక్రమపద్దతుల్లో ఎగవేసిందని రాస్తే దానికి తగిన ఆధారాలను చూపాల్సిన బాధ్యత ఆ జర్నలిస్టుకు వుంటుంది. అది వాస్తవం కాదని అనే వారు సంస్ధ అయినా ప్రభుత్వశాఖలైనా అది ఎలా అవాస్తవమో జనానికి తెలియచేయాల్సిన బాధ్యత వారిపై కూడా వుంది. పరంజయ్, ఆయన సహరచయితలు రాసిన అంశాలు ప్రయివేటు లావాదేవీలకు సంబంధించినవి కావు. చట్ట సమీక్షకు లోబడినవే.
చట్ట సభలలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నందున ఒకసారి జనంలోకి వెళ్లిన అంశాన్ని స్పీకర్ తన విచక్షణాధికారాన్ని వుపయోగించి రికార్డుల నుంచి తొలగించవచ్చు. అంతే తప్ప దాన్ని జనంలో ప్రచారం చేయకుండా నిరోధించలేరు.అలాగే ఇపిడబ్ల్యు పత్రికలో ఆ వ్యాసాలు ప్రచురితమై పాఠకులకు చేరాయి. వెబ్‌సైట్‌లో తొలగించినంత మాత్రాన జనానికి అందకుండా పోవు. వైర్ వంటి వెబ్‌సైట్లు వెంటనే ఆ వ్యాసాలను పునర్ముద్రించాయి. వాటికి కూడా ఇపిడబ్ల్యుకు ఇచ్చిన మాదిరే నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వాటిని చట్టపరంగా ఎదుర్కొంటామంటూ సదరు వెబ్‌సైట్ ఆ రెండు విశ్లేషణలను ఇప్పటికీ పాఠకులకు అందుబాటులో వుంచింది. సమీక్ష ట్రస్టు చర్యతో ఆ వ్యాసాల్లో అసలేమి వున్నదనే ఆసక్తి పాఠకుల్లో మరింతగా పెరిగి వాటికి ప్రాచుర్యాన్ని పెంచాయి. అనేక మీడియా సంస్ధలు అదానీకి భయపడుతూనే రేఖా మాత్రంగా అయినా వాటిల్లో ఏముందో చెప్పకుండా వార్తలను ఇవ్వలేవు. జరిగిన అక్రమాల సారాన్ని కొద్ది వాక్యాలలో అయినా చెప్పాల్సి వుంటుంది. ఒక వేళ తమ ఆదాయానికి ఎక్కడ గండిపడుతుందో అని ఆ వార్తలను నిషేధించినా సామాజిక మాధ్యమంలో అందుబాటులో వున్నాయి. ఫేస్‌బుక్, గూగుల్ కంపెనీలను కూడా ఆదాని మేనేజ్ చేసి వారిని సంతృప్తి పరిస్తే తప్ప చర్చించేందుకు అవకాశాలు ఎన్నో వున్నాయి.
ఈ పరిణామం నిస్సందేహంగా దేశంలోని జర్నలిస్టుల ముందు ఒక సవాలు విసురుతోంది. ఎంతో శ్రమకోర్చి పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చిన అంశాలు జనానికి తెలియకుండా అడ్డుకోవటాన్ని సహిస్తే అసలు జర్నలిజానికి అర్ధం ఏమిటి? అలాంటి వాటిని ఎలా జనానికి తెలియచెప్పాలి. బ్రిటీష్ వారి కాలంలో వారికి వ్యతిరేకంగా పని చేసిన పత్రికలను ఎలా అణచివేసిందీ, ఒక పేరుతో వున్న దానిని అచ్చుకాకుండా చేస్తే మరొక పేరుతో ఎలా జనంలోకి తెచ్చిందీ మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పరిస్ధితులు పునరావృతం కానున్నాయా అనిపిస్తోంది. ఇప్పటికే వాణిజ్య మీడియాపై జనంలో విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతున్నప్పటికీ నిజం కాకపోతే ఎలా అచ్చువేస్తారులే అనుకునే జనం ఇంకా వున్నారు. అందుకే వాస్తవాలను మరుగుపరచి కట్టుకథలు పిట్టకధలతో జనాన్ని నమ్మించగలుగుతున్నాయి.
ఇపిడబ్ల్యు వంటి ట్రస్టు మీద మేధావి వర్గంలో ఇప్పటి వరకు వున్న అభిప్రాయం వేరు ఇక ముందు అలాంటిది వుండదనే విషయాన్ని సమీక్ష ట్రస్టు గుర్తించాలి. పూర్వపు విశ్వాసాన్ని తిరిగి పొందాలంటే అసలు వాస్తవాలేమిటనే విషయాన్ని అది జనం ముందుంచాలి. తన సంపాదకుడు రాసిన విశ్లేషణకు ఆధారాలు చూపలేకపోతే అప్పుడు అతన్ని రాజీనామా చేయమనటమో లేకపోతే ఏకపక్షంగా తొలగించటమో చేసి తమ పత్రిక చేసిన తప్పిదాన్ని నిజాయితీగా అంగీకరించి వుంటే ఇపిడబ్ల్యు గౌరవం మరింత పెరిగి వుండేది. సంపాదకుడు చెప్పిన అంశాలపై ముందుగా ట్రస్టు అంతర్గత విచారణ జరిపి, పరి శోధనాత్మక వార్తకు వున్న ఆధారాలేమిటో అంతర్గతంగా పరిశీలించిన తరువాత చర్య తీసుకోవటం ఒక పద్దతి అదేమీ లేదు, ఆ వ్యాసాలను ఎందుకు వుపసంహరించారో అధికారికంగా వివరణ లేదు కనుకనే యాజమాన్యం బయటివారి వత్తిడికి లంగిపోయినట్లు భావించాల్సి వస్తోంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. అనేక మంది మేధావుల అభిప్రాయాలు, మనోభావాలను మన్నించి పారదర్శకంగా వ్యవహరిస్తే నీలినీడలు పటాపంచలవుతాయి. ఒక విస్వసనీయ పత్రికగా ఇపిడబ్ల్యు ముందుకు పోతుంది. లేకుంటే ఏం జరిగేది చెప్పాల్సిన పని లేదు. అమెరికాలో బడా మీడియా పాలవర్గతొత్తుగా మారి వాటి భజన చేస్తున్న సమయంలో వికీలీక్స్ వునికిలోకి వచ్చిన అమెరికా సామ్రాజ్యవాదుల బండారాన్ని వుతికి ఆరేస్తుందని, దాని గుట్టుమట్టులన్నీ బయటపెడుతుందని ఎవరైనా వూహించారా? ఆ సంస్ధ నిర్వాహకులకు అమెరికా ప్రభుత్వంలో ఎవరో ఒకరు ఆధారాలు అందించబట్టే అది సాధ్యమైంది. అలాంటి వారు ప్రతి దేశంలోనూ వుంటారు. చరిత్రలో హేతుబద్దంగా ప్రశ్నించిన చార్వాకులను నాటి పాలకవర్గం నాశనం చేసింది. వారిని భౌతికంగా అంతమొందించారు తప్ప వారి భావజాలాన్ని అణచివేయలేకపోయారు. అలాగే ఇప్పటి వరకు ఇపిడబ్ల్యు నిర్వహించిన పాత్రను కొనసాగించేందుకు మరొక పత్రిక ఆవిర్భవించకుండా వుంటుందా ? ఏటికి ఎదురీదటమే బతికి వున్న చేపల స్వభావం. చచ్చిన చేపలే వాలునబడి కొట్టుకుపోతాయి. దేశంలో జర్నలిజం, జర్నలిస్టుల కర్తవ్యం కూడా బతికిన చేపల మాదిరి ఎదురీదటమే !