Tags

, , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

గత కొద్ది రోజులుగా వుత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన వార్తలు ఇంతవరకు కొన్ని అంశాలను నిర్ధారించాయి. నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయంగా బిజెపి తరఫున రాబోయే రోజులలో కాబోయే ప్రధానిగా ప్రచారంలో వున్న యోగి ఆదిత్యనాధ్‌ పాలనకు ఇతరులకు పెద్ద తేడా లేదు. వైఫల్యాలను కప్పి పుచ్చుకోవటం, ఇతరుల మీద నెట్టటంలో ఎవరికీ తీసిపోరు. ప్రజల పట్ల జవాబుదారీ తనం లేదు. కొద్ది రోజుల క్రితం ఆదిత్యనాధ్‌ సోదరి సామాన్యుల మాదిరే ఒక టీ దుకాణం నడుపుకొంటోందని ఈ వుదంతం యోగికి బంధుప్రీతి లేదని చెప్పేందుకు పక్కా నిదర్శనం అని ప్రచారం జరిగింది. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు స్వయం సేవకుడిగా వున్నపుడు పారిశుధ్య పని చేసిన నిగర్వి అంటూ ఒక ఫొటోను ఆయన భక్తులు సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున తిప్పారు. గతంలో ఏ కాంగ్రెస్‌ లేదా ఇతర పార్టీల నాయకులకు లేని వ్యక్తిత్వాన్ని, గతాన్ని సృష్టించేందుకు ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఒక వేళ అలాంటివి వుంటే కాషాయ తాలిబాన్లు, మరుగుజ్జుయోధులు(ట్రోల్స్‌) బయట పెడితే లోకానికి మేలు చేసిన వారవుతారు. కాషాయ పరివారం వీరుడు, శూరుడు అని పొగిడే విడి సావర్కర్‌ చరిత్రను చూస్తే ఆయన బ్రిటీష్‌ వారికి విధేయుడిగా వుంటానని ప్రేమ లేఖలు రాసిన విషయం తెలిసిందే. అంతే కాదు, బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక హీరోగా, వీరుడిగా వర్ణించటానికి తగిన వ్యక్తి సావర్కర్‌ అన్నట్లుగా తనకు తానే చిత్రగుప్తుడనే మారుపేరుతో రాసిన పుస్తకంలో రాసుకున్న ఘనుడు. అందువలన ఆయన పరంపరలో ముందుకు వస్తున్నవారికి లేని గొప్పలను ఆపాదించటంలో విశేషం ఏముంది. మహా అయితే ఎవరన్నా ‘దేశద్రోహులు’ ఈ విషయాన్ని ప్రస్తావిస్తే అది మా విశ్వాసం, మా మనోభావాలను దెబ్బతీశారంటూ దాడులకు దిగుతారు.https://thewire.in/140172/veer-savarkar-the-staunchest-advocate-of-loyalty-to-the-english-government/

అందువలన యోగి గారి సోదరి కథను నమ్మటమా లేదా అన్నది పక్కన పెడదాం. ఆయన మఠానికి దగ్గరలో వున్న గోరఖ్‌పూర్‌ బిఆర్‌డి ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో పిల్లలు మరణిస్తున్నారనేది ఎవరూ కాదనలేని నిజం. అక్కడ చనిపోవటం కొత్తగా జరుగుతున్నదేమీ కాదని సాక్షాత్తూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా మహాశయుడే నిర్ధారించారు. అలాంటి దాని గురించి సామాజిక, సాంప్రదాయక మీడియాలో పెద్ద చర్చ, ఆరోపణలు, ప్రత్యాపరోపణలు ఇప్పటికీ వస్తుంటే భవ బంధాలు, రాగ ద్వేషాలు వుండకూడని, నిజం తప్ప అబద్దాలు చెప్పకూడని ఒక యోగి చిల్లర రాజకీయాలు తప్ప నిజాయితీతో కూడిన ఒక ప్రకటన చేసి దానికి స్వస్తి వాక్యం పలకలేదేం ? ఇదేమి జవాబుదారీతనం. లేదూ విచారణకు ఆదేశించాం అప్పటి వరకు మాట్లాడకూడదు అంటే విచారణ నివేదికలు నిర్ధారించేంత వరకు ఆగకుండా కొందరు వైద్యులపై చర్యలెందుకు తీసుకున్నట్లు ?

గత కొద్ది రోజులుగా మీడియాలో రాసిన వార్తలు, రాయించిన వార్తలను చదివిన వారికి, టీవీలలో చూసిన వారికి ‘మెదడు వాపు ‘ వ్యాధి వచ్చేట్లుగా వుంది. గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో మెదడువాపు వ్యాధి విభాగపు అధిపతిగా పని చేస్తున్న డాక్టర్‌ కఫీల్‌ అహమ్మద్‌ సదరు ఆసుపత్రికి అనుబంధంగా వున్న మెడికల్‌ కాలేజీలో పిల్లల వైద్య సహాయ ఫ్రొఫెసర్‌గా బోధన కూడా చేస్తున్నారు.అందువలన ఆయన ఆక్సిజన్‌ కొరత గురించి తెలుసుకొని ఇతర స్నేహితుల నుంచి అరువుగా లేదా కొనుగోలు చేసి సిలిండర్లను తెచ్చి ఎందరో పిల్లలను కాపాడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.ఆయన ఆక్సిజన్‌ తెప్పించిన విషయాన్ని అభినందించకపోతే పోయే వాటి గురించి తన ప్రతిష్టను పెంచుకొనేందుకు మీడియాలో ఆయన అలా రాయించుకున్నాడని కొంత మంది చెబుతున్నారు.ఆ వార్తలు వచ్చిన వెంటనే బహుశా వాటిని రాయటంలో వెనుకబడిన కొన్ని మీడియా సంస్ధలు చద్ది వార్తలే ఇస్తే తమకు ‘లాభం’ ఏముంటుంది అనుకున్నాయోమో ఆయన తాను పని చేస్తున్న ఆసుపత్రి నుంచి సిలిండర్లను దొంగతనం చేశాడని, అలా తస్కరించిన వాటిని తన, ఇతర ఆసుపత్రుల నుంచి తిరిగి తెప్పించాడు తప్ప అందరూ అనుకున్నట్లు ప్రాణదాతేమీ కాదని మరుసటి రోజునే ప్రచురించాయి. ఒక బిజెపి మహిళా నాయకురాలు ఆయన అత్యాచారాలు చేశాడన్న ప్రచారం మొదలెట్టింది. విద్యార్ధిగా వుండగా ఒకరి బదులు మరొకరికి పరీక్ష రాసిన కేసులో అరెస్టయ్యాడని మరొక వార్త.ఆయనపై క్రిమినల్‌ కేసు వున్న కారణంగా మణిపాల్‌ విశ్వవిశ్వవిద్యాలయం ఆయనను సస్పెండ్‌ చేసిందని మరొక వార్త. ఇలా ఇంకా రాబోయే రోజుల్లో ఏమేమి ఆపాదిస్తారో తెలియదు.సదరు వైద్యుడు ఎందరినో కాపాడారని రాసిన వార్తలను సహించలేక ఆయనపై ఇన్ని ఆరోపణలు లేదా పాత విషయాలను( ఎంతవరకు నిజమో తెలియదు) తవ్వి సామాజిక మాధ్యమంలోపరువు తీయటం అవసరమా ? వారికి దురుద్ధేశ్యం తప్ప మరొకటి కనపడటం లేదు.

సదరు డాక్టర్‌పై తీసుకున్న చర్య గురించి కూడా మీడియాలో వార్తలు తప్పుదారి పట్టించేవిగా వున్నాయి. జాతీయ ఆరోగ్య కార్యక్రమ నోడల్‌ అధికార బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. మెదడువాపు వ్యాధి నివారణకు సదరు సంస్ధ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని పని చేస్తున్నది. రెండు సంవత్సరాల క్రితం ఆయనపై నమోదు చేసిన అత్యాచార ఆరోపణలో వాస్తవం లేదని ఆ కేసును పోలీసులు మూసివేశారు. అయినా ఆయనొక రేపిస్టు అని నేను విన్నా అని బిజెపి నాయకురాలు ట్వీట్‌ చేసింది. సినిమా నటుడైన బిజెపి ఎంపీ పరేష్‌ రావల్‌ దానిని సమర్ధిస్తూ చెద పురుగుల తెగ దృష్టిలో హీరో అని పేర్కొన్నాడు. డాక్టర్‌ ఖాన్‌ను బలిపశువును చేశారని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఒక ప్రకటనలో విమర్శించింది. ప్రజారోగ్యాన్ని యోగి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నది.వైద్య విద్య డైరెక్టర్‌ జనరల్‌ చేసిన మౌలిక ఆరోపణ ప్రకారం ఆక్సిజస్‌ సిలిండర్లను తన ఆసుపత్రి నుంచి సేకరించటం అని న్యూస్‌18 వార్త పేర్కొంటే ప్రయివేటు ప్రాక్టీస్‌ చేయటం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా చర్య తీసుకున్నట్లు హిందుస్తాన్‌ టైమ్స్‌ పేర్కొన్నది. గతేడాది సెప్టెంబరు ఎనిమిది నుంచి డాక్టర్‌ ఖాన్‌ ప్రయివేటు ప్రాక్టీస్‌ చేయటం లేదని చెబుతున్నారు.

నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌తో వున్న మన దేశ సరిహద్దులను కాపాడే సహస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బి) ప్రజాసంబంధాల అధికారి ఓపి సాహు ఇలా చెప్పారు.’ ఆగస్టు పదిన బిఆర్‌డి మెడికల్‌ కాలేజీలో అసాధారణ సంక్షోభ పరిస్ధితి ఏర్పడింది. డాక్టర్‌ కఫిల్‌ ఖాన్‌ ఎస్‌ఎస్‌బి డిఐజి వద్దకు వచ్చి వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లను సేకరించి మెడికల్‌ కాలేజీకి తరలించేందుకు ఒక ట్రక్కు కావాలని అడిగారు.బిఆర్‌డి మెడికల్‌ కాలేజీ సిబ్బందికి సహకరించేందుకు డిఐజి పదకొండు మంది జవాన్లను కూడా ట్రక్కుతో పాటు పంపారు. మా క్క్రు కొద్దిగంటల్లోనే వివిధ ప్రాంతాల నుంచి ఖలీలాబాద్‌లోని ఒక గోడౌన్‌ నుంచి కూడా సిలిండర్లను సేకరించి తీవ్ర సంక్షోభం వున్న మెడికల్‌ కాలేజికి తరలించారు.’

పిల్లల మరణాల వార్తలు వెలువడగానే ఆక్సిజన్‌ సరఫరా లేక మరణించారనటాన్ని యోగి సర్కార్‌ తోసి పుచ్చింది. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ రౌటెల ఒక ప్రకటన చేసి ఇతర కారణాలతో మరణించినట్లు చెప్పిన దాన్ని ఆరోగ్య మంత్రి కూడా చిలుక పలుకుల్లా వల్లించాడు. తొమ్మిదవ తేదీన ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి నాలుగవ తేదీ వరకు ఆక్సిజన్‌ కొరత గురించి తన కార్యాలయానికి తెలియదని, అందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకుంటానని దానికి ప్రిన్సిపల్‌, ఇతరులే కారణమని ఆరోపించారు.

మార్చి 22నే ప్రిన్సిపల్‌ రాజీవ్‌ మిశ్రా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌కు ఆక్సిజన్‌ సరఫరాదారు పుష్పా సేల్స్‌ వారి లేఖను కూడా జతపరచి చెల్లింపుల గురించి తెలిపారు. తిరిగి ఏప్రిల్‌ మూడున అదనపు ఛీఫ్‌ సెక్రటరీకి పుష్సా సేల్స్‌ తాజా లేఖను జతపరచి మరోసారి రాశారు. రెండు లేఖలకూ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.ఆగస్టు ఒకటిన మరోసారి అదనపు చీఫ్‌ సెక్రటరీకి రాసి దాని కాపీని మంత్రికి పంపారు. తొమ్మిదవ తేదీన ఆసుపత్రిలో సమీక్ష సందర్భంగా ఆరోజు వుదయం బిల్లుల చెల్లింపు గురించి ఆరోగ్యశాఖ మంత్రికి స్వయంగా తాము లేఖను అంద చేశామని, ఆరోజు సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తేగా ఏమిటి అన్నట్లు ప్రశ్నార్ధకంగా యోగి మంత్రివైపు చూసి తరువాత మౌనంగా వుండిపోయినట్లు తమకు తెలిసిందని పుష్పా సేల్స్‌ ప్రతినిధులు టెలిగ్రాఫ్‌ పత్రికతో చెప్పారు. యోగి కాలేజీ నుంచి వెళ్లిపోయిన తరువాత ఆ సాయంత్రమే సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. అంటే ఒక చిన్న వ్యాపార సంస్ధ కూడా యోగి పని తీరు మీద విశ్వాసం కోల్పోయిందన్నది స్పష్టం.

మరణాలకు బాధ్యత వహిస్తూ ఆగస్టు 12న రాజీనామా చేసిన మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజీవ్‌ మిశ్రా మరుసటి రోజు చేసిన ఓ ప్రకటనలో ఆక్సిజన్‌ సరఫరాదారుకు డబ్బు చెల్లించటంలో బ్యూరాక్రటిక్‌ పద్దతులు, ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ పర్యటనే కారణమని విమర్శించారు. ఆక్సిజన్‌ సరఫరాదారుకు చెల్లించేందుకు తాము ఐదవ తేదీనే నిధులు విడుదల చేశామని, సకాలంలో ప్రిన్సిపల్‌ చెల్లించలేదని వైద్య విద్య శాఖ మంత్రి అశుతోష్‌ టాండన్‌ చెప్పారు. రెండు కోట్ల రూపాయలు విడుదల చేయాలని జూలై నెలలోనే మూడు నాలుగు లేఖలు రాశానని ఐదవ తేదీన నిధులు విడుదల చేశారని డాక్టర్‌ మిశ్రా చెప్పారు. ఆగస్టు ఐదవ తేదీ శనివారం, నిధుల విడుదల ఆదేశాలు మాకు ఏడవ తేదీన అందాయి. బిల్లు ఓచర్‌ను ఏడవ తేదీన ట్రెజరీకి పంపాము, వారు ఎనిమిదవ తేదీన టోకెన్‌ విడుదల చేశారు.తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ ఆసుపత్రి సందర్శనకు వచ్చిన కారణంగా ఆసుపత్రి యంత్రాంగమంతా తీరికలేకుండా వుంది.పదవ తేదీన మాత్రమే 52లక్షల రూపాయలను ఆక్సిజన్‌ సరఫరాదారు ఖాతాకు బదిలీ చేయాల్సిందిగా కోరుతూ బ్యాంకుకు పంపగలిగాము.మెడికల్‌ కాలేజీ, ఆక్సిజన్‌ సరఫరాదారు బ్యాంకు ఖాతాలు వేర్వేరు చోట్ల వున్నందున బ్యాంకు బదిలీ చేసే అవకా శం లేదు, రెండు బ్యాంకుల మధ్య నగదు బదిలీకి ఒక రోజు వ్యవధి పడుతుంది. అని మిశ్రా చెప్పారు. పదవ తేదీ మధ్యాహ్నం ఆక్సిజన్‌ సరఫరాదారు నుంచి ఫోన్‌ వచ్చింది, తదుపరి ట్రక్కు సిలిండర్లను పంపే అవకా శం లేదని వారు చెప్పారు. నిధులు విడుదల చేశామని బ్యాంకులో ఆలశ్యం అవుతున్నదని, మీ ఖాతాకు నిధులు అందుతాయని చెప్పానని, అయితే సిలిండర్ల సరఫరా నిలిపివేస్తారని తాను ఊహించలేదని డాక్టర్‌ మిశ్రా అన్నారు.

యోగులు మఠాలకే పరిమితం అయితే ఒక తీరు, అలాగాక ప్రజాజీవనంలోకి వచ్చి, అధికారపదవులు కూడా స్వీకరించిన తరువాత వారినేమీ ప్రశ్నించకూడదు అంటే కుదరదు. పెద్ద సంఖ్యలో పిల్లలు మరణించటం వాస్తవం. ఆ సంబంధిత వార్తలతో పాటు ఆసుపత్రి, దాని పరిసరాలు, అసలు మొత్తంగా గోరఖ్‌పూర్‌ పరిసరాలన్నీ ఆశుభ్రత నిలయాలుగా వున్నాయని కూడా వార్తలు వచ్చాయి. మెదడు వాపు వ్యాధి కారణంగా ఆ ప్రాంతంలో పిల్లలు, ఇతరులు మరణించటం కూడా ఎక్కువగానే వుందని వెల్లడైంది. సరే ఎవరైనా మూడు నెలల్లోనో, ఆరునెలల్లోనే అద్భుతాలు చేయగలరని ఎవరూ అనుకోరు. యోగులైనా అంతే.మరణించిన పిల్లల తలిదండ్రులను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గోరఖ్‌ పూర్‌ వెళతానని ప్రకటించటంతో యోగికి పూనకం వచ్చింది. ఆగ్రహంతో వూగిపోయారు. గోరఖ్‌పూర్‌ను ఒక విహార కేంద్రంగా మార్చవద్దని ఎదురుదాడి ప్రారంభించారు.(కేరళలో వ్యక్తిగత కక్షలు లేదా కారణాలతో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యకు గురైతే కేంద్ర మంత్రి పరామర్శకు వెళ్లటం సరైనదే అయితే 70 మందికి పైగా పిల్లలు మరణించిన వుదంతంలో రాహుల్‌ గాంధీ పరామర్శించటం తప్పెలా అవుతుందో మరి) స్వచ్చ వుత్తర ప్రదేశ్‌ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరే షరా మామూలుగా గత ప్రభుత్వాలు కనీస సదుపాయలు కల్పించలేదని చెప్పారనుకోండి.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మన యోగి గారు పాతికేండ్లుగా, అంతకు ముందు ఆయన సీనియర్‌ యోగి గోరఖపూర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతినిధిగా వున్నారు. ప్రతి ఏటా తమ కనుసన్నలలో వుండే బిఆర్‌డి ఆసుపత్రిలో పిల్లలు చని పోతుంటే, ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా తయారైతే, మెదడు వాపు వ్యాధి ప్రబలంగా వుంటే ఎంపీగా ఆయన లేదా స్ధానిక బిజెపి ఎంఎల్‌ఏలు ఏం చేస్తున్నారు. ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నారు. మూడు సంవత్సరాలుగా నరేంద్రమోడీ స్వచ్చ భారత్‌ కార్యక్రమంలో కనీసం ఆసుపత్రి పరిసరాలను అయినా బాగు చేసేందుకు తీసుకున్న చర్యలేమిటి?ఎంపీగా ఏం పట్టించుకున్నట్లు ? తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి కేరళ ఆసుపత్రులలో చేర్చుకోని కారణంగా మరణించాడు. ఆ ఘటన మీద కేరళ ముఖ్యమంత్రి విచారం వెలిబుచ్చారు. రాగ ద్వేషాలకు అతీతంగా వుండే, వుండాల్సిన యోగి బిఆర్‌డి ఆసుపత్రికి నిధులు సకాలంలో విడుదల కాలేదన్న విమర్శలు తలెత్తినపుడు వాస్తవాలను వెల్లడించి భవిష్యత్‌లో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా చూస్తామని చెబితే ఆయన గౌరవం మరింత పెరిగి వుండేది. ఇంత రాద్దాంతం జరిగేది కాదు.కానీ చేసిందీ, జరిగిందేమిటి? ముందసలు తనకు తెలియదన్నారు ముఖ్యమంత్రి. ఇలాంటివి కొత్తగా జరగటం లేదని తేల్చిపారేశారు అమిత్‌ షా. యోగి ప్రభుత్వం, బిజెపి మరుగుజ్జు యోధులు, బిజెపి మెప్పుపొందేందుకు తహతహలాడిన మీడియా చౌకబారు రాజకీయాలకు పాల్పడింది. విమర్శకులపై ఎదురుదాడికి దిగింది. యోగి సర్కార్‌ పని తీరును బజారుకు ఈడ్చింది.

యోగి ఆదిత్యనాధ్‌ ఒక పర్యటన సందర్భంగా దళితులు శుభ్రంగా లేరని వారికి సబ్బులు, షాంపూలు ఇచ్చి స్నానాలు చేయించి, వారెక్కడ యోగిని ముట్టుకుంటారో అని లేవకుండా చేసేందుకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇపుడు ప్రజల ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్న సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న అధికార యంత్రంగాన్ని మొత్తంగా శుద్ధి చేయటానికి ఎన్ని సబ్బులు వాడాలో తెలియదు. మొత్తం మీద ఈ వుదంతం బిజెపి, యోగి సర్కార్‌, యోగికి వ్యక్తిగతంగా చెప్పుకోలేని చోట దెబ్బ కొట్టిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు కావాల్సింది చిల్లర రాజకీయాలు కాదు, చిన్న పిల్లల ప్రాణాలు కాపాడండి యోగి మహాశయా !