Tags

, , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

విగ్రహాలు మాట్లాడతాయా ! ఏం వినాయకుడి విగ్రహం పాలు తాగిందంటే నమ్మినపుడు మాట్లాడతాయంటే ఎందుకు నమ్మరు ? ఒక దేవుడు లేక దేవత, దేవదూత, దేవుని బిడ్డ, ఇలా వివిధ మతాలకు ప్రతీకలుగా మన ముందున్న వారు పాలు తాగటం, కన్నీరు, రక్తాలను కార్చటం వంటి మహిమల గురించి ప్రచారం చేయటానికి ఈ సందర్భాన్ని వినియోగించుకోవటం లేదు. మేకిన్‌ ఇండియా పిలుపులతో స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేసిన వారు, ఇప్పటికే అలాంటి పరిశ్రమలలో దిగ్గజాలుగా వున్న వారు తమ ప్రచార, ప్రబోధ సైనికులకు నైపుణ్య శిక్షణ ఇస్తూ పుష్కలంగా దేశం మీదకు వదులుతున్నారు. ఆ కంపెనీలకు ఎలాంటి సంక్షోభం వుండదు, లేఆఫ్‌లు, మూసివేతలు వుండవు. ఏ సందులో చూసినా వారు మనకు దర్శనమిస్తారు.

విగ్రహాలు మాట్లాడవు గానీ మాట్లాడిస్తున్నాయి, ప్రశ్నించేట్లు చేస్తున్నాయి, వుద్యమాలకు పురికొల్పుతున్నాయి, రచ్చ, రగడలు సృష్టిస్తున్నాయి, రాజకీయ, ప్రతిరాజకీయాలు చేయిస్తున్నాయి,కదనాలను రెచ్చగొడుతున్నాయి, కత్తులు దూయిస్తున్నాయి. కన్నీళ్లు పెట్టిస్తున్నాయి, కష్టాల పాలు చేస్తున్నాయి. వాగ్దానాలను కుమ్మరింప చేస్తున్నాయి. ఏటికేడాది ఎంత ఎత్తు పెంచితే అంతగా లాభాలను కురిపిస్తున్నాయి. శ్రీశ్రీ అన్నట్లు ముందు దగా వెనుక దగా కుడిఎడమల దగా. విగ్రహాల రాజకీయాలను జనం అర్ధం చేసుకోలేకపోతే ఇంకా ఏం జరుగుతాయో తెలియదు.

పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహ ప్రతిష్ట ఎంతటి సమస్యను సృష్టించిందో మనకు తెలిసిందే. పెత్తందారులకు ఆగ్రహం కలగకుండా వుండేందుకు, వారి మద్దతు కోసం చివరి వరకు పని చేసిన తెలుగుదేశం పాలకులు తాము చేసిన తప్పిదానికి, దళితులను ఇబ్బంది పెట్టి నష్టపరిచినందుకు గాను పెత్తందారుల లేదా పాలకపార్టీ లేదా వారి అడుగులకు మడుగులత్తిన దళిత నేతల నుంచి సామూహిక జరిమానాలు వసూలు చేసి సాంఘిక బహిష్కరణకు గురైన వారికి నష్టపరిహారం చెల్లించి వుంటే అలాంటి ఆలోచనలున్న మిగతా వారికి హెచ్చరికగా వుండేది. అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని చార్లెటోసివిలే పట్టణంలో శ్వేతజాతీయులు, వారి దురహంకారాన్ని వ్యతిరేకిస్తున్న వారి మధ్య జరిగిన వివాదంలో ఒక నల్లజాతి మహిళ మరణించింది. ఇప్పుడు అనేక నగరాలు, ప్రాంతాలలో విగ్రహాలు, చిహ్నాల తొలగింపుపై అనుకూల, వ్యతిరేక ఆందోళనలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి.గరగపర్రులో బహిరంగ ప్రదేశంలో ఇతర విగ్రహాల పక్కనే అంబేద్కర్‌ను వుంచటాన్ని అంతరించిపోతున్న ఫ్యూడల్‌ భావజాల శక్తులు వ్యతిరేకించాయి.(వీరిలో రోజువారీ ఏదో ఒక పని చేస్తే తప్ప గడవని దళితేతరులు కూడా వుండటం విచారకరం.) అంబేద్కర్‌ దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక. తరతరాలుగా తమ దయాదాక్షిణ్యాలతో బతికిన వారు ఆత్మగౌరవాన్ని అంబేద్కర్‌ విగ్రహ ప్రతిష్ట రూపంలో ప్రదర్శించటాన్ని సహించలేని పెత్తందారీ శక్తుల ప్రభావానికి లోనైన వారు దళితుల మీద కత్తి గట్టి చివరికి తమకు తెలియకుండానే సాంఘిక బహిష్కరణ నేరానికి కూడా ఒడిగట్టారు.

అమెరికా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో బానిసత్వాన్ని కొనసాగించాలని తిరుగుబాటు చేసిన శ్వేతజాతి దురహంకారులు, దోపిడీ శక్తుల ప్రతినిధి రాబర్ట్‌ ఇ లీ. అతగాడి లేదా అంతర్యుద్ధంలో అతని నాయకత్వంలో పని చేసిన వారి విగ్రహాలు, చిహ్నాలను బహిరంగ ప్రదేశాల నుంచి తొలగించాలని జాత్యంహంకార వ్యతిరేక శక్తులు వుద్యమిస్తున్నాయి. వాటిని కాన్ఫెడరేట్‌ చిహ్నాలు అని పిలుస్తున్నారు. విద్య, వుద్యోగాలలో రిజర్వేషన్లు అంబేద్కర్‌ చలవే అని దళితులు, దళిత సంఘాలు ప్రచారం చేస్తుండటం, రిజర్వేషన్లే తమ అవకాశాలను దెబ్బతీస్తున్నాయని వాటికి అర్హత లేని కులాల వారిలో అసంతృప్తి పెరుగుతున్న నేపధ్యంలో అనేక చోట్ల అంబేద్కర్‌ విగ్రహాలను పెట్టటం ఎక్కువకావటంతో పాటు వాటికి వ్యతిరేకత, అవమానపరిచే శక్తులు కూడా చెలరేగుతున్నాయి.

అమెరికాను ఆక్రమించిన ఐరోపా శ్వేతజాతి వలస వాదులు తమ గనులు, వనులలో పని చేసేందుకు ఆఫ్రికా ఖండం నుంచి బలవంతంగా బానిసలుగా అక్కడి వారిని తీసుకు వచ్చిన దుర్మార్గం గురించి తెలిసిందే. అమెరికా ఖండాలను ముందుగా ఆక్రమించిన స్పెయిన్‌, పోర్చుగీసు జాతుల వారసులు హిస్పానిక్‌ లేదా లాటినోలుగా పిలవబడుతున్న వారు 13,17శాతం చొప్పున జనాభాలో వున్నారు. పెట్టుబడిదారీ అర్ధశాస్త్రవేత్త థామస్‌ పికెట్టీ చెప్పినట్లు అమెరికాలో ఆర్ధిక అసమానతలు విపరీతంగా పెరగటం, గత శతాబ్దిలో సంభవించిన ఆర్ధిక సంక్షోభాలు, వర్తమాన శతాబ్దిలో 2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక సమస్యల కారణంగా అమెరికాలోని పేద, మధ్యతరగతుల జీవితాలు దిగజారుతున్నాయి. ఈ పరిస్ధితిని మిగతా దేశాలలో మాదిరి అమెరికాలో కూడా మితవాద శక్తులు వుపయోగించుకుంటున్నాయి. గత వారసత్వంగా వచ్చిన శ్వేత జాత్యంహంకారం ఇటీవలి కాలంలో పెరుగుతోంది.అలాంటి శక్తులు వాటికి ప్రతీకలైన వారిని ఆరాధించటం, అనుకరించటం పెరుగుతోంది.మన దేశంలో త్వరలో ముస్లింల జనాభా మెజారిటీగా మారనుందని హిందుత్వ శక్తులు ప్రచారం చేస్తున్న మాదిరే అమెరికాలో ప్రస్తుతం 77 శాతంగా వున్న శ్వేతజాతీయులు 2042నాటికి మైనారిటీలుగా మారనున్నారనే ప్రచార ఈ నేపధ్యంలో అక్కడి పరిణామాలను చూడాల్సి వుంది.

ముస్లింలు ఈద్‌ రోజున రోడ్లపై నమాజు చేయటాన్ని నేను ప్రశ్నించలేనపుడు పోలీసు స్టేషన్లలో కృష్ణాష్టమి వేడుకులను నిలిపివేయాలని నేనెలా చెప్పగలను అని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ చేసిన వ్యాఖ్యల మాదిరే చార్లెటోసివిలే పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా శ్వేత దురహంకారుల చర్యను సమర్ధిస్తూ మాట్లాడారు.దీంతో దేశవ్యాపితంగా అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. బోస్టన్‌ నగరంలో నలభైవేల మందితో జరిగినది అలాంటి వాటిలో ఒకటి. చార్లెటిసివిలే పరిణామాలను చూసిన తరువాత బానిసత్వ పరిరక్షకుల తరఫున పని చేసిన వారి విగ్రహాలు, చిహ్నాలు తొలగించాలని చేసిన నిర్ణయాలను సత్వరం అమలు జరిపేందుకు పలు చోట్ల చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ తాజా పరిణామానికి నాంది ఏమిటి? అంటరాని తనాన్ని సమర్ధించే మనుస్మృతిని దగ్దం చేసి వ్యతిరేకత తెలిపేందుకు 1927 డిసెంబరు 25న వేలాది మందితో ఆ పుస్తక ప్రతులను దగ్దం చేసేందుకు నాయకత్వం వహించిన అంబేద్కర్‌ గురించి తెలిసిందే. అలాగే అమెరికాలో బానిసత్వ చిహ్నాలను అనుమతించకూడదని ఎప్పటి నుంచో అభ్యుదయ వాదులు డిమాండ్‌ చేస్తున్నారు. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత కమ్యూనిస్టు వ్యతిరేకులు లెనిన్‌, స్టాలిన్‌ విగ్రహాలతో పాటు సోషలిస్టు చిహ్నాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. అమెరికన్లు ఇరాక్‌ను ఆక్రమించి తమను వ్యతిరేకించే శక్తులకు ప్రతినిధిగా వున్న సద్దాం హుస్సేన్‌ను వురితీసి, ఆయన విగ్రహాలను కూల్చివేయటాన్ని మనమందరం చూశాం. ఇలాంటివన్నీ భావజాల పోరులో భాగం.సమాజంలో అనేక వైరుధ్యాలు, డిమాండ్లు వుంటాయి. వాటిలో ఏది ఎప్పుడు, ఎలా ముందుకు వస్తుందో వూహించలేము.

చార్లెటెసివిలే నగర పాలక సంస్ధ కాన్ఫెడరేట్‌ చిహ్నాలను తొలగించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక తీర్మానం చేసింది. దానికి అనుగుణ్యంగా రాబర్ట్‌ లీ పార్కు పేరును ‘దాస్య విమోచన పార్కు’ గా మార్చాలని దానిలోని జనరల్‌ రాబర్ట్‌ ఇ లీ విగ్రహాన్ని, నగరంలోని ఇతర చిహ్నాలను కూల్చివేసేందుకు వుపక్రమించింది. దానికి నిరసనగా శ్వేతజాతి దురహంకారులు కోర్టులో కేసు దాఖలు చేశారు. మే 13వ తేదీన కొంత మంది విగ్రహాల కూల్చివేతకు నిరసనగా కొందరు నగరంలో ప్రదర్శన చేశారు. జూన్‌ ఐదున నగర మేయర్‌ పార్కు పేరు మార్పును అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 11న శ్వేతజాతీయులు వర్జీనియా విశ్వవిద్యాలయంలో దివిటీలతో నిరసన ప్రదర్శన చేశారు. శ్వేతజాతీయుల జీవిత సమస్య, మమ్మల్ని తొలగించలేరు, ఇతర నాజీ నాజీనినాదాలు చేశారు.పోలీసులు వచ్చి ఆ ప్రదర్శనకు అనుమతి లేదని అడ్డుకున్నారు. శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా ఇతరులు పోటీ ప్రదర్శన చేయటంతో వారితో గొడవ పడ్డారు. మరుసటి రోజు ‘మితవాదులు ఏకం కావాలి’ అనే నినాదంతో చార్లొటెసివిలే నగరంలో మధ్యాహ్నం ప్రదర్శనకు శ్వేతజాతీయులు పిలుపునిచ్చారు. అయితే వుదయాన్నే పలుచోట్ల ప్రదర్శనను వ్యతిరేకించేవారు ప్రదర్శకులను అడ్డుకున్నారు.పోలీసులతో సహా కొందరికి గాయాలయ్యాయి. ప్రదర్శనలను నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. వర్జీనియా గవర్నర్‌ అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు. అదే రోజు మధ్యాహ్నం శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తున్నవారిపై ఒక శ్వేతజాతీయుడు కారునడపటంతో ఒక మహిళ మరణించగా 19 మంది గాయపడ్డారు. రెచ్చగొట్టే ప్రదర్శనలకు పిలుపు ఇచ్చి ఒకరి మరణానికి, అనేక మంది గాయాలకు కారకులైన శ్వేత జాతీయులతో పాటు వారిని వ్యతిరేకించిన వారు కూడా హింసాకాండకు కారకులే అని అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్‌ చేసి మరింత రెచ్చగొట్టారు. హింసాకాండను అదుపు చేసేందుకు వినియోగిస్తున్న హెలికాప్టర్‌ కూలి ఇద్దరు పోలీసులు మరణించారు. మరణించిన మహిళకు సంతాపంగా, శ్వేతజాతీయుల హింసాకాండకు వ్యతిరేకంగా 12వ తేదీ నుంచి దేశంలో అనేక చోట్ల ప్రదర్శనలు జరుగుతున్నాయి. కొన్ని విగ్రహాలను కూల్చివేశారు.

ఈ పరిణామాలకు 2015లోజరిగిన వుదంతం ఒక కారణంగా కొందరు విశ్లేషిస్తున్నారు. స్వయంగా తాను శ్వేత జాతి దురహంకారినని ప్రకటించుకున్న డైలాన్‌ రూఫ్‌ 2015జూన్‌ 17న దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్‌ అనే పట్టణంలో నల్లజాతీయులు ఎక్కువగా వుండే ఒక చర్చిలోకి వెళ్లి తుపాకితో కాల్పులు జరిపి తొమ్మిది ప్రాణాలను బలిగొన్నాడు.కాల్పులు జరిపిన తరువాత కాన్ఫెడరేట్‌ పతాకం పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చాడు. వాటిని చూసిన జనం దక్షిణ కరోలినా రాజధానిలో ఎగురుతున్న కాన్ఫెడరేట్‌ పతాకాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. అధికారయుతంగా తొలగించేందుకు అంగీకరించే లోపే కొంత మంది దానిని తీసివేశారు. పతాకంతో పాటు కాన్ఫెడరేట్‌ విగ్రహాలు, చిహ్నాలను కూడా తొలగించాలనే డిమాండ్‌ దేశవ్యాపితంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ముందుకు వచ్చింది. కాన్ఫెడరేట్స్‌ బానిసత్వం కొనసాగాలని పని చేయటం, శ్వేతజాతి దురహంకారానికి ప్రాతినిధ్యం వహించినందున వారి గౌరవార్ధం ఏర్పాటు చేసిన విగ్రహాలు, చిహ్నాలను గౌరవించి పరిరక్షించాల్సిన అవసరం లేదనే వాదనలు ముందుకు వచ్చాయి.

చార్లెటోసెవిలే వుదంతం తరువాత అధ్యక్షుడు ట్రంప్‌ తన అవివేకాన్ని, అహంకారాన్ని మరోసారి బయట పెట్టుకున్నాడు. శ్వేతజాతీయులకే అధ్యక్షుడు అన్నట్లుగా వ్యవహరించాడు. పరిస్ధితిని మరింత సంక్లిష్టంగా మార్చివేశాడు. అన్ని వైపుల నుంచి ఘర్షణలు జరిగాయని తొలుత ట్వీట్‌ చేశాడు. తరువాత ‘ఈ వారంలో రాబర్ట్‌ ఇ లీ, మరోవారం స్టోన్‌ వాల్‌ జాక్సన్‌ అంటారు, తరువాత జార్జి వాషింగ్టన్‌ వంతు వస్తుంది, మీరే ఆలోచించండి దీనికి అంతం ఎక్కడ ‘ అని ప్రశ్నించాడు. తరువాత కాన్ఫెడరేట్‌ చిహ్నాలను కూల్చివేయటం బుద్దితక్కువతనం అని మరో ట్వీట్‌ చేశాడు.

దక్షిణ కరోలినా రాష్ట్రం అధికారికంగా కాన్ఫెడరేట్‌ పతాకాన్ని తొలగించిన తరువాత అనేక రాష్ట్రాలు, నగరాలలో అలాంటి చర్యలనే చేపట్టారు. ఒక సర్వే ప్రకారం దేశంలోని 1500బహిరంగ స్ధలాలలో కాన్ఫెడరేట్‌ చిహ్నాలు వున్నట్లు తేలింది. ఇంకా ఎక్కువే వుండవచ్చు కూడా. అమెరికాలో సాగిన అంతర్యుద్దంలో కాన్ఫెడరేట్స్‌ యూనియన్‌కు (అమెరికా సంయుక్త రాష్ట్రాలకు) వ్యతిరేకంగా బానిసత్వం కొనసాగాలని కోరుకొనే శక్తులవైపు నిలిచారు. అందువలన వారిని అమెరికన్‌ దేశభక్తులుగా పరిగణించకూడదని జాత్యంహకారం, బానిసత్వ వ్యతిరేకులు డిమాండ్‌ చేస్తున్నారు.

మన స్వాతంత్య్ర వుద్యమంలో దేశ ప్రజలకు వ్యతిరేకంగా బ్రిటీషు వారి సేవలో మునిగిన కాషాయ, హిందూత్వ శక్తులు దేశవ్యాపితంగా స్వాతంత్య్రవుద్యమం, చరిత్రకారులు విస్మరించిన కొందరిని సమరయోధులుగా చిత్రించేందుకు ప్రయత్నించటం, హిందువులు మైనారిటీలుగా మారే ప్రమాదం వుందని ప్రచారం చేయటం, మనువాదం మనుగడ సాగించేందుకు చేయాల్సిందంతా చేస్తున్నాయి. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లుగా డోనాల్డ్‌ ట్రంప్‌- నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహించేశక్తుల మధ్య సైద్ధాంతిక బంధం కూడా వుండటం చిత్రంగా వుంది కదూ !