Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

ప్చ్‌ ! కమ్యూనిస్టుల పని అయిపోయింది, కమ్యూనిజానికి కాలం చెల్లింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు విన్న పాత తరంలో కొందరికి నిజమేనేమో అని పిస్తోంది. అసలు కమ్యూనిజం గురించి తెలియని కొత్త తరంలో కాస్త బుర్రవున్న వారికి అసలు కమ్యూనిజం అంటే ఏమిటి, అదేమి చెప్పింది అనే కొత్త ఆలోచన కలుగుతోంది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపాలోని సోషలిస్టు దేశాలను కూల్చివేసిన తరువాతే కదా లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలలో, దక్షిణాఫ్రికా, నేపాల్‌లో వామపక్షాలు, కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ 2008 నుంచి తీవ్ర సంక్షోభంలో మునిగి ఎప్పుడు ఒడ్డుకు చేరుతుందో ఇంకా తెలియని స్ధితిలో చైనా సోషలిస్టు వ్యవస్ధకు అలాంటి దెబ్బ తగలలేదేం? నూరు పూవులు పూయనివ్వండి వేయి ఆలోచనలను వికసించనివ్వండి !

కమ్యూనిస్టులను అణగదొక్కాం, సోషలిజంపై విజయం సాధించాం అని చెప్పుకున్నది అమెరికా. కొలంబియా దాని వుపగ్రహ దేశంగా వుంది. తాము గతంలో అనుసరించింది, భవిష్యత్‌ మార్గదర్శి మార్క్సిజం అని బహిరంగంగా చెప్పుకొనే గెరిల్లా సంస్ధ కొలంబియాలోని ఎఫ్‌ఏఆర్‌సి. అలాంటి దానితో ప్రభుత్వం రాజీకి ఎందుకు వచ్చిందో ఎవరైనా చెప్పగలరా? ఐదు కోట్ల జనాభా వున్న ఆ దేశంలో గత ఐదున్నర దశాబ్దాలుగా సాయుధ పోరాట పంధాలో సాగిన కొలంబియా విప్లవ సాయుధ శక్తులు(ఎఫ్‌ఏఆర్‌సి) సెప్టెంబరు ఒకటవ తేదీన ‘కొలంబియా విప్లవ ప్రత్యామ్నాయ శక్తి ‘ పేరుతో నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నాయి. ఇంతకాలం వారికి అనేక విధాలుగా మద్దతు ఇచ్చిన క్యూబా,వెనెజులా తదితర దేశాల మధ్యవర్తిత్వంలో కుదిరిన హవానా ఒప్పందం ప్రకారం కొలంబియా పార్లమెంట్‌ ఎఫ్‌ఏఆర్‌సిని ఒక రాజకీయ పార్టీగా గుర్తించటం, అదే సమయంలో ఆ సంస్ధ ఆయుధాలను విసర్జించి రాజకీయ రంగంలోకి రావటం ఒకేసారి జరిగాయి. గెరిల్లాలు తమ వద్ద వున్న ఆయుధాలను అప్పగించి గతవారంలో సాధారణ జీవితంలో ప్రవేశించారు. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలలో ఇలాంటి గెరిల్లా సంస్ధలు సాయుధబాటను వీడి పార్లమెంటరీ రాజకీయాలలో ప్రవేశించి అధికారానికి వచ్చిన పూర్వరంగంలో కొలంబియా పరిణామాలను చూడాల్సి వుంది.

ఇప్పటికీ లాటిన్‌ అమెరికాలో విప్లవశక్తులకు స్ఫూర్తినిస్తున్న సైమన్‌ బొలివర్‌ అవిభక్త స్వతంత్ర కొలంబియా తొలి అధ్యక్షుడు. స్పెయిన్‌ వలస పాలకుల నుంచి స్వాతంత్య్రం పొందేందుకు ఆయన నాయకత్వంలో సాగిన కృషి ఈనగాచి నక్కల పాలైనట్లు తరువాత కాలంలో మితవాద, మిలిటరీశక్తుల పరమైంది. అవి భక్త కొలంబియా నుంచి కొలంబియా, వెనెజులా, ఈక్వెడోర్‌, పెరు, పనామా ఏర్పడ్డాయి. కొలంబస్‌ కనుగొన్న ప్రాంతం కనుక కొలంబియా అని పిలిచారు. పోరు వారసత్వం కలిగిన కొలంబియాలో 1950 దశకంలో గ్రామీణ ప్రాంతాలలో రైతాంగాన్ని భూములనుంచి బలవంతంగా వెళ్లగొట్టి అమెరికన్‌ కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు పూనుకున్న ప్రభుత్వ, కార్పొరేట్‌ గూండాల దాడులను అడ్డుకున్నారు. అందుకోసం కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మరక్షణ దళ వ్యవస్ధ 1960 దశకంలో ఒక సంఘటిత సాయుధ గెరిల్లా దళ సంస్ధ ఎఫ్‌ఏఆర్‌సి ఆవిర్భావానికి దారితీసింది. అప్పటి నుంచి మిలిటరీ, మాదక ద్రవ్యాల మాఫియాలు, అన్ని రకాల సంఘవ్యతిరేకశక్తుల దాడుల నుంచి తట్టుకొని నిలవటమేగాక పటిష్టం కావటం, లాటిన్‌ అమెరికాలో ప్రజావ్యతిరేక మితవాద పాలకపార్టీలన్నీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పూర్వరంగంలో అక్కడి పాలకవర్గం విప్లవ సంస్ధతో రాజీకి అంగీకరించాల్సి వచ్చింది. అనివార్యమై ఆయుధాలు పట్టిన ఎఫ్‌ఏఆర్‌సి సాయుధ కార్యకలాపాలతో పాటు బహిరంగ రాజకీయ కార్యకలాపాలలో పాల్గనేందుకు గతంలో కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపింది. మూడు దశాబ్దాల క్రితం ఆయుధాలను విసర్జించకుండానే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని దేశ భక్త ఫ్రంట్‌ పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేసి చట్టబద్దంగా పని చేస్తున్న కమ్యూనిస్టుపార్టీతో 1984-87 మధ్య ఎన్నికలలో పాల్గని అనేక విజయాలు కూడా సాధించింది. అయితే బహిరంగ కార్యకలాపాలలో వున్న అనేక మంది కార్యకర్తలను ప్రభుత్వం, దాని కనుసన్నలలో మెలిగే మాఫియా శక్తులు హతమార్చటంతో ఆ విధానానికి స్వస్ది చెప్పి తిరిగి సాయుధ చర్యలను ప్రారంభించింది. క్యూబా, వెనెజులా వంటి దేశాలు, కమ్యూనిస్టు, వామపక్ష పార్టీల మద్దతు వున్నప్పటికీ కొలంబియాలో వున్న పరిస్ధితుల నేపధ్యంలో సాయుధ పోరాట మార్గానికి స్వస్తి చెప్పాలని ఎఫ్‌ఏఆర్‌సి నాయకత్వంలో వచ్చిన ఆలోచన, పాలకవర్గాలు దిగివచ్చిన కారణంగానే గత నాలుగు సంవత్సరాలుగా సాగిన శాంతి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని చెప్పవచ్చు.

ఎఫ్‌ఏఆర్‌సి ఒక రాజకీయ పార్టీగా ఏర్పడి ఎన్నికలలో పాల్గనేంతవరకు పార్లమెంట్‌ వుభయ సభలలో ఐదుగురి చొప్పున 2023వరకు ఎన్నికతో పని లేకుండా ఆ పార్టీ ప్రతినిధులు వుంటారు. ఆ లోగా జరిగే ఎన్నికలలో అంటే 2018లో అది సాధించుకొనే సీట్లు అదనం. త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు మహాసభను జరిపి లాంఛనంగా ‘కొలంబియన్‌ రివల్యూషనరీ ఆల్టర్‌నేటివ్‌ ఫోర్సెస్‌'(కొలంబియా ప్రత్యామ్నాయ విప్లవ శక్తి) అని పార్టీకి నామకరణం చేయనున్నట్లు శాంతి చర్చలలో ప్రధాన పాత్ర పోషించిన ఇవాన్‌ మార్క్వెజ్‌ ప్రకటించారు. గతంతో తాము తెగతెంపులు చేసుకోబోవటం లేదని, ఎల్లపుడూ విప్లవ శక్తులుగానే వుంటామని చెప్పారు.

కొద్ది రోజుల క్రితం జరిగిన కొలంబియా కమ్యూనిస్టుపార్టీ 22వ మహాసభలో అనేక మంది ఎఫ్‌ఏఆర్‌సి నేతలు పాల్గన్నారని, వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో రెండు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని ప్రతిపాదించినట్లు టెలిసుర్‌ టీవీ వెల్లడించింది. దేశంలో శాంతిని పరిరక్షించే క్రమంలో వామపక్షాల తరఫున ఒక నియోజకవర్గంలో ఒకే అభ్యర్ధిని నిలుపుతామని కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు జైమే కేసెడో టురియాగో చెప్పినట్లు వార్తా సంస్ధలు పేర్కొన్నాయి.’ వామపక్షం విస్తరిస్తోంది, నూతన శక్తులు వునికిలోకి వస్తున్నందున మరింతగా విస్తరిస్తూనే వుంటుంది. దానిని మరింత విస్తరింప చేసి ఐక్యతా సృహను పెంచటమే మేము ఇప్పుడు చేయాల్సింది’ అని కెసెడో వ్యాఖ్యానించారు. మహాసభకు గెరిల్లా సంస్ధ ప్రతినిధులుతో పాటు అనేక సామాజిక వుద్యమాలకు చెందిన ప్రతినిధులు కూడా హాజరయ్యారు. కొలంబియా కమ్యూనిస్టులు, గెరిల్లా సంస్ధలపై గత యాభై సంవత్సరాలలో స్ధానిక పాలకులు, అమెరికా కనుసన్నలలో పని చేసే మీడియా, అనేక సంస్ధలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశాయి. వారిని టెర్రరిస్టులుగా చిత్రించారు, పోలీసు, మిలిటరీ బలగాలతో పాటు మాదక ద్రవ్యాల మాఫియా, ఇతర సంఘవ్యతిరేక శక్తులు, కమ్యూనిస్టు వ్యతిరేకులను వుపయోగించుకొని దాడులు చేశారు. వేలాది మంది కార్యకర్తలు,నేతలను బలితీసుకున్నారు. మాఫియా సంస్ధలు చేసిన దాడులు,హత్యాకాండను కూడా గెరిల్లాలు, కమ్యూనిస్టులకు అంటగట్టారు. వేలాది కుటుంబాలు అనేక అగచాట్లకు గురయ్యాయి. ఈ పూర్వరంగంలో ఎఫ్‌ఏఆర్‌సితో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై దేశంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఓటింగ్‌లో పాల్గన్న సగం మంది శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించారంటే అక్కడి ప్రజల్లో వున్న కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించే శక్తులు ఎఫ్‌ఏఆర్‌సిని రెచ్చగొట్టేందుకు శాంతి ఒప్పందం కుదిరిన నాటి నుంచి ఆయుధాలు అప్పగించే ముందు రోజు వరకు ఎనిమిది మంది గెరిల్లా దళ సభ్యులను హత్య చేశాయి. గెరిల్లాలకు పట్టున్న ప్రాంతాల నుంచి వారు నిరాయుధులుగా బయటకు వస్తుండటంతో ఆ ప్రాంతాలకు మితవాద సాయుధ శక్తులు చేరుతున్నాయి. స్ధానిక కార్యకర్తలు, జనాలను భయభ్రాంతులకు గురిచేసి దాడులకు పాల్పడుతున్నట్లు వార్తలు వచ్చాయి.ఈ శక్తులకు గతంలో ప్రభుత్వమే గెరిల్లాలపై దాడులకు శిక్షణ ఇచ్చి పెంచి పోషించింది. అధికారిక గణాంకాల ప్రకారమే 2016 జనవరి నుంచి 2017 మార్చి ఒకటవ తేదీ వరకు 156 మంది సామాజిక, మానవ హక్కుల నేతలకు హత్యకు గురయ్యారు. గత సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాదిలో మే నెల వరకు 41 మంది హత్యకు గురికావటం ఎక్కువ, ఆందోళనకరం అని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంస్ధ పేర్కొన్నది. శాంతి ఒప్పందంలో పేర్కొన్న సదుద్ధేశ్యాలను ఆచరణలోకి తీసుకురావటం అతి పెద్ద సవాలని, దానిని ఎదుర్కోవటంలో విఫలమై సమర్ధవంతంగా అమలు జరపకపోతే ఒక దేశంగా కొలంబియా మనుగడే ప్రమాదంలో పడుతుందని ఎఫ్‌ఏఆర్‌సి సభ్యుడు లూకాస్‌ కార్వజెల్‌ చేసిన వ్యాఖ్యకు ఎంతో ప్రాధాన్యత వుంది.కొన్ని మీడియా సంస్ధల అధిపతులు, ప్రజాభిప్రాయాన్ని మలిచేవారిగా పాత్ర పోషిస్తున్న కొందయి తమకు వ్యతిరేకంగా వ్యవహరించటాన్ని స్పష్టంగా గమనించవచ్చని లూకాస్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వ్యవసాయ అభివృద్ధి గురించి మేము చర్చ ప్రారంభిస్తే వెంటనే దేశంలో మీరే పెద్ద భూ ఆక్రమణదారులని చెబుతారు, మాదకద్రవ్యాల గురించి మాట్లాడితే మీరే ప్రధాన వుత్పత్తిదారులంటారన్నారు. ఈ పూర్వరంగంలో కొలంబియా శాంతి పరిణామాలు, పరిమితులను చూడాల్సి వుంది.

 

.