Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

డేరా సచ్చా సౌదా ఆశ్రమాల అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఇద్దరు భక్తురాండ్రపై జరిపిన అత్యాచారం కేసులలో నేరగాడని వినాయకచవితి రోజున పంచకుల సిబిఐ కోర్టు నిర్ధారించింది. శిక్ష ఎంత అనేది సోమవారం నాడు ప్రకటించనున్నారు. కోర్టు తీర్పు వెలువడగానే నిరసిస్తూ గుర్మీత్‌ అనుచరులు పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, వుత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హత్య, హింసాకాండకు పాల్పడ్దారు. పంచకుల నగరం తీవ్రంగా ప్రభావితమైంది.కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్‌కు ఒక వైపున క్రికెట్‌ అభిమానులందరికీ తెలిసిన మొహాలీ లేదా ఎస్‌ఎఎస్‌ నగర్‌ మరోవైపు పంచకుల వుంది. వీటిని త్రినగరాలు అంటారు. చండీఘర్‌ కేంద్రపాలనలో మొహాలీ పంజాబ్‌, పంచకుల హర్యానాపాలనలో వుంటాయి. మూడూ ఆధునిక నగరాలే. గుర్మీత్‌ అత్యాచార నిర్ధారణ తీర్పు పర్యావసానం అనేక అంశాలను జనం ముందుంచింది.

ఢిల్లీలో ఒక నిర్భయపై జరిపిన అత్యాచార వుదంతానికి నిరసనగా నిందితుడిని శిక్షించాలని వేలాది మందిని వీధుల్లోకి రప్పించింది. తన ఆశ్రమంలో సేవ చేసేందుకు వచ్చిన ఇద్దరు నిర్భయలపై గుర్మీత్‌ జరిపిన అత్యాచార వుదంతంలో అతగాడిని శిక్షించకూడదంటూ లక్షలాది మంది వీధుల్లోకి రావటం, వున్మాదంతో హింసాకాండకు పాల్పడటం దేశాన్ని విస్మయపరుస్తోంది. ఢిల్లీ నిర్భయ వుదంతంపై దేశమంతా ఏకతాటిగా నిలిచింది. కానీ ఒక బాబా ముసుగులో గుర్మీత్‌ జరిపిన అత్యాచారంపై పరిమితంగా అయినా భిన్న స్వరాలు వినిపించటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో గుజరాత్‌లో గోధ్రాపేరుతో జరిపిన మారణకాండతో పోలిస్తే ఇదెంత హ ! హ !! అనుకున్నారో ఏమో ప్రధాని నరేంద్రమోడీ షరా మామూలుగా ఇంతవరకు నోరు విప్పలేదు. ఈ వుదంతం సందర్భంగా మీడియాలో పరిమితంగానే అయినప్పటికీ వెలుగులోకి వచ్చిన అనేక అంశాలు మన రాజకీయ వ్యవస్ధ ముఖ్యంగా అధికారమే పరమావధిగా ఎంత గడ్డికరవటానికైనా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలు(వామపక్షాలకు ఇటు వంటి మరక లేదు) పూనుకుంటాయో అనేక మంది కళ్లు తెరిపిస్తున్నాయి.

గుర్మీత్‌ వంటి శక్తులు తెరముందు ఎలా వున్నా తెరవెనుక నేర,దేశద్రోహ చరిత్రలుంటాయని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొత్తగా పుట్టుకువచ్చే యోగులు, యోగినులు, బాబాల చుట్టూ నిరక్షరాస్యులతో పాటు వున్నత విద్యావంతులు కూడా అనేక కారణాలతో తిరగటం, వారికి విశ్వసనీయత కలిగించటం మన దౌర్భాగ్యం. ఎవరిపై అయినా ఒక ఆరోపణ వచ్చినపుడు దానిలో వాస్తవాలు తేలేంత వరకు వారికి కితాబు ఇవ్వకుండా వుండటం కనీస విధి. కానీ అనేక మంది బాబాల మాదిరి ఇతగాడి విషయంలో కూడా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీల నేతలు అతడిని ప్రసన్నం చేసుకొని వెనుక వున్న అనుచరుల ఓట్లను రాబట్టుకొనేందుకు కరవని గడ్డి లేదు. ఇప్పుడు ఆ పార్టీల వారు, ఇతరులు త్వశుంఠ, త్వశుంఠ అంటూ ఎవరెంత వెధవాయలో ఒకరి గురించి ఒకరు, స్వయంగా బయట పెట్టుకుంటున్నారు. అవాంఛనీయ సమర్ధనలకు పూనుకుంటున్నారు. ఈ వుదంతంలో కూడా రాజకీయ లబ్ది పొందేందుకు పూనుకున్నారు. ఇలాంటి వారిని అచ్చ తెలుగులో వుచ్చల గుంటలో చేపలు పట్టేరకం అంటారు. కొంత మంది ఈ వుదంతాన్ని దళిత బాబా- అగ్రకుల కుట్ర కోణంలో చూసేందుకు ప్రయత్నించటం గర్హనీయం. డేరా ఆశ్రమాల్లో చేరుతున్నది దళితులు, ఇతర బలహీనవర్గాలే అనుకుంటే అత్యాచారాలు, హత్యలకు గురైంది కూడా ఆ తరగతులకు చెందిన వారే కదా అనే సృహ కనిపించటం లేదు. ఎవరికి చెందిన వారి ఆశ్రమాల్లో ఏ నేరం, అత్యాచారం జరిగినా పట్టించుకోకూడదు అని చెప్నే ప్రమాదకరపోకడ ఇది. మరో విధంగా చెప్పాలంటే మా మనోభావాలను దెబ్బతీస్తే సహించం అ నే వున్మాద లక్షణం తప్ప మరొకటి కాదు.

తన ఓటు బ్యాంకుకు వ్యతిరేకంగా తొలుత ఆశారాంబాపు, తరువాత రాంపాల్‌, ఇప్పుడు గుర్మీత్‌ సింగ్‌ను కనీసం బిజెపి అరెస్టు చేసింది అని చెట్టుకింది ప్లీడరు పాయింట్‌ను బిజెపి అభిమానులు ముందుకు తెచ్చారు. కోర్టుల తీర్పులు లేదా ఇతర అనివార్య పరిస్ధితులలో అధికారంలో ఏ పార్టీ వున్నా ఆపని చేయటం విధి. ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ఇలాంటి బాబాలకు అంటకాగిన వారు వ్యవహరిస్తారు. ఎక్కడిదాకో ఎందుకు గుర్మీత్‌ విషయమే తీసుకుంటే కోర్టు నిర్ణయం వెలువడగానే ప్రముఖులు బసచేసే ఒక వసతి గృహానికి తీసుకు వెళ్లి, దాన్నే జైలుగా మార్చేందుకు హర్యానా బిజెపి పభుత్వ యంత్రాంగం ప్రయత్నించింది. అయితే దాని గురించి మీడియాలో వార్తలు గుప్పుమనటంతో సాధారణ ఖైదీ మాదిరే రోహతక్‌ జైలుకు తరలించాల్సి వచ్చింది. దాన్ని కూడా తమ ప్రభుత్వ ప్రత్యేకతగా చెప్పుకొనేందుకు బిజెపి సేనలు ప్రయత్నించాయి. గుర్మీత్‌కు జడ్‌ తరహా భద్రత కల్పించింది ఎవరు-కాంగ్రెస్‌, గుర్మీత్‌ సింగ్‌ కుమారుడు వివాహం చేసుకున్నది ఎవరిని-పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత కూతురిని అంటూ మరొక ప్రచారం. ఇలాంటి సందర్భాలలో బిజెపి మేథావులు అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తారు. హర్యానా బిజెపి అధ్యక్షుడి కుమారుడు ఒక యువతిని వెంటాటి కిడ్నాపో, అత్యాచారమో ఏదో చేయటానికి ప్రయత్నించిన వుదంతం తెలిసిందే. ఆ సందర్భంగా ఆ యువతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అసలు విషయాన్ని పక్కదారి పట్టించే చౌకబారు ఎత్తుగడలు కాకపోతే గుర్మీత్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన జడ్‌ భద్రతను బిజెపి ఎందుకు కొనసాగించినట్లు? కాంగ్రెస్‌ నేత కూతుర్ని కోడలుగా చేసుకున్న గుర్మీత్‌తో బిజెపి నేతలు ఆయన అనుగ్రహం కోసం ఎందుకు పడిగాపులు పడ్డారు, ఎందుకు రాసుకొని పూసుకొని తిరిగినట్లు ? ఒక కాంగ్రెస్‌ నేత కూతుర్ని తన కోడలుగా చేసుకున్నందుకు గుర్మీత్‌ను తప్పుపట్టనవసరం లేదు. తద్వారా కాంగ్రెస్‌ పాలకుల నుంచి పొందిన లబ్ది ఏదైనా వుంటే దాన్ని తప్పుపట్టాలి. ఇదే ప్రమాణాన్ని బిజెపికి వర్తింప చేస్తే …… సంజయగాందీ భార్య మేనకా గాంధీని,ó కుమారుడు ఫిరోజ్‌ గాంధీని, గబ్బుపట్టిన ఇంకా ఎందరో కాంగ్రెస్‌ నేతలను బిజెపిలో ఎందుకు చేర్చుకున్నట్లు ? స్వయంగా నరేంద్రమోడీ ప్రధాని హోదాలో గుర్మీత్‌కు ప్రణామం చేస్తున్నట్లు చేసిన ప్రకటన మాటేమిటి? ఇది గుర్మీత్‌పై కేసు విచారణలో వుండగానే కదా ! ఒక నిందితుడికి ప్రణామం చేస్తున్నానని ప్రధాని హోదాలో వున్న వ్యక్తి చెప్పటం దేనికి నిదర్శనం, దేశానికి ఎలాంటి సందేశం ఇచ్చినట్లు? ఇలాంటి బాబాలను వెనకేసుకు రావటంలో, వారి నుంచి లబ్ది రాజకీయంతో సహా అన్ని రకాల లబ్దులు పొందటంలో కాంగ్రెస్‌,బిజెపిలు, వాటికి అంటకాగే ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీలు పడ్డాయి తప్ప వారికి దూరంగా వుండేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.

ఇతరుల మీద బురద జల్లేందుకు పూనుకున్న బిజెపి పరివారం, వారి మరుగుజ్జుయోధులు(ట్రోల్స్‌) పాలు తాగుతున్న పిల్లి చందం మాదిరి ఎవరూ తమను గమనించటం లేదని అనుకుంటున్నాయి. సాక్షి మహరాజ్‌ అనే ఒక పేరుమోసిన బిజెపి ఎంపీ గుర్మీత్‌ నేరాన్ని కోర్టు తీర్మానించిన వెంటనే స్పందించిన తీరు దేశాన్ని విస్మయపరిచింది, దాంతో నష్టనివారణ చర్యగా అతని మాటలతో మాకు సంబంధం లేదని బిజెపి నక్కజిత్తు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అది కూడా కేంద్ర బిజెపి నుంచి రాలేదు. ఈ పెద్దమనిషి కూడా మత బాబాయే, ఆశ్రమాల వ్యాపారం చేస్తాడు, నోటి తుత్తర మనిషి. ఇతగాడేమన్నాడు ‘ దివ్యాత్మ గలిగిన రామ్‌ రహీమ్‌ వంటి వారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు చెబుతున్నది సరైనది? రామ్‌ రహీమ్‌ సింగ్‌లో దేవుడిని చూస్తున్న కోట్లాది మంది చెబుతున్నదా లేక ఫిర్యాదు చేసిన ఆ యువతిదా ? దీని మీద పెద్ద గొడవ జరుగుతున్నది, శాంతి భద్రతలు చిన్నాభిన్నమయ్యాయి, జనం చనిపోతున్నారు… దీన్ని గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? సుప్రీం కోర్టు లేదా హైకోర్టు జమా మసీదు అధిపతి షాహీ ఇమామ్‌ను ఈ విధంగా సంబోధించగలదా ? అతని మీద కూడా అనేక కేసులున్నాయి, అతనే మన్నా వారి బంధువా ? రామ్‌ రహీమ్‌ ఎంతో సాదాసీదాగా వుంటాడు కనుక అతన్ని వేధిస్తున్నారు.’ అని సాక్షి మహరాజ్‌ సెలవిచ్చారు. సాక్షి మహరాజ్‌ చెప్పిందాన్ని పార్టీ ఆమోదించటం లేదని దేశానికి అంతగా తెలియని కైలాష్‌ విజయవర్గీయ అనే నేత చేత బిజెపి చెప్పించింది.

మూడు రాష్ట్రాలలో హింస చెలరేగి అనేక మంది మరణించి ఎందరో గాయపడి ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లుగా పరిస్ధితులు వుంటే ఇల్లు కాలుతుంటే బగ్గులేరుకొనే బాపతు మాదిరి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి తన సహజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు.’ సాధువులకు కొత్త ముప్పు వచ్చింది. స్వామీజీలను జైళ్లకు పంపి రాజకీయ నేతలు, ఆశ్రమాలలో వున్నవారు ఆశ్ర మ ఆస్తులను ఆక్రమించుకోవాలనుకుంటున్నారు.’ అని ట్వీట్‌ చేశాడు. అత్యాచారం కేసులో నిందితుడైన ఆశారాంబాపును సమర్ధించిన ఈ స్వామి గారు అంతటితో ఆగలేదు. తాను సాధారణ పరిభాషలో చేసిన వ్యాఖ్యను రావణ రహీమ్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లుగా కాంగ్రెస్‌ చిత్రించిందని ఆరోపిస్తూ ప్రతి విరాట్‌ హిందూ ప్రముఖుడిపైన తప్పుడు కేసులు పెట్టారంటూ కంచి శంకరాచార్య, రామ్‌దేవ్‌ బాబా, శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్లను మరో ట్వీట్‌లో స్వామి వుటంకించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒక ట్వీట్‌లో మీడియాపైన, ఆస్తినష్టం జరగటాన్ని ఖండించారు తప్ప గుర్మీత్‌ అనుచరుల హత్యాకాండ, మరణించిన వారి ప్రస్తావన లేదు.

కోర్టు తీర్పుతో గుర్మీత్‌ను బహిరంగంగా సమర్ధించలేని స్ధితిలో పడింది తప్ప అతనితో బిజెపి సంబంధాలు దాస్తే దాగేవి కాదు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం 47 మంది హర్యానా బిజెపి సభ్యులలో 19తో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుభాష్‌ బరాలా 2014 ఎన్నికల తరువాత గుర్మీత్‌ను కలిశారు. వారిలో దాదాపు అందరూ మంత్రులయ్యారు.కోర్టు నిర్ణయం వెలువడగానే మొదలైన హింసాకాండను ప్రభుత్వ నివారించలేకపోవటం గురించి అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ స్పీకర్‌ కన్వర్‌ పాల్‌ గుజ్జార్‌ సమాధానం ఇచ్చిన తీరు గమనించాల్సిన అంశం.’ మేము ఒక్కరిమే ఈ డేరాలకు వెళ్లలేదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా వెళ్లాయి. రాజకీయవేత్తలుగా మేం అనేక మందిని కలుస్తుంటాం, వారిలో ఎవరైనా తరువాత కాలంలో తప్పుచేసిన వారిగా రుజువు అవుతారని ఎలా అనుకుంటాం, తాను చట్టాన్ని గౌరవిస్తానని గురూజీ చెప్పినట్లు ఇతరులు కూడా దాన్ని గౌరవించాలి. ఎగువ కోర్టులకు వెళ్లటానికి అవకాశాలున్నాయి, హింసాకాండ అన్నింటికీ సమాధానం కాదు,డేరా అనుచరులు శాంతిని పాటించాలి’ అన్నారు తప్ప ఖండన మాట ఒక్కటి కూడా లేదు.

 

డేరా ఆశ్రమాలను కాంగ్రెస్‌, ఇండియన్‌ లోక్‌దళ్‌ వంటి ఇతర పార్టీల నాయకులు కూడా సందర్శించారు. గతంలో కాంగ్రెస్‌కు గుర్మీత్‌ మద్దతు ప్రకటించాడు. అయితే 2014 ఎన్నికలలో డేరా సచ్చా సౌదా బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించింది. దాని పధకాలకు హర్యానా బిజెపి ప్రభుత్వం ఆర్ధిక తోడ్పాటును కూడా అందించింది. గుర్మీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రధారిగా నిర్మించిన సినిమాలకు ఆరునెలల పాటు వినోదపన్ను కూడా మినహాయింపు ఇచ్చింది. డేరా సంస్ధ 2016లో నిర్వహించిన గ్రామీణ క్రీడలకు రాష్ట్రమంత్రి తన విచక్షణా కేటాయింపు నిధి నుంచి 50లక్షలు విరాళంగా ఇచ్చాడు. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆశ్రమాన్ని సందర్శించి మరో 51లక్షలు ఇస్తానని ప్రకటించాడు. గుర్మీత్‌తో బిజెపి నేతలకు వున్న ఇన్ని సంబంధాలను వదలి పెట్టి కాంగ్రెస్‌ జడ్‌కేటగిరి భద్రత కేటాయించిందని, కొడుక్కి పిల్లనిచ్చిందని బిజెపి సామాజిక మీడియాలో ప్రచారం ప్రారంభించింది.

గుర్మీత్‌ సింగ్‌ వ్యవహారశైలి, అతని మీద వున్న కేసుల గురించి తెలియజూకుండానే బిజెపి నేతలు ఇవన్నీ చేశారా? బుర్రలో గుంజున్నవారెవరూ నమ్మరు. డేరా ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన ఒక మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ 2002 జూలైలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో గుర్మీత్‌ నిందితుడు, విచారణ చివరి దశలో వుంది. భక్తురాండ్రపై గుర్మీత్‌ అత్యాచారాల వేధింపుల గురించి మేనేజర్‌ రంజింత్‌ సింగ్‌ ఆకాశరామన్న లేఖలను ప్రచారంలో పెట్టిన కారణంగానే హత్యకు గురయ్యాడని చెబుతారు.సిర్సాలోని డేరా ఆశ్రమ ప్రధాన కేంద్రంలో జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి రాసినందుకు చట్టర్‌పతి అనే జర్నలిస్టు 2002 అక్టోబరు 23న హత్యకు గురయ్యాడు. ఆ హత్య కుట్రలో గుర్మీత్‌ భాగస్వామిగా కేసు నమోదైంది.సిబిఐ దర్యాప్తు చేసింది. పంచకుల కోర్టులోనే విచారణ చివరి దశలో వుంది.

గురువుగారి(గుర్మీత్‌) మార్గదర్శకత్వలో దేవుడిని చేరాలంటే పురుష భక్తులు తమ జననాంగాలను తొలగించుకోవాలని చెప్పి సిర్సా ఆశ్రమంలో దాదాపు నాలుగు వందల మందికి ఆపరేషన్లు చేశారనే ఆరోపణలు రావటంతో వాటిపై సిబిఐ దర్యాప్తు జరపాలని 2014 డిసెంబరు 23న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసు దర్యాప్తులో వుంది. తాను దేవుడిని అని చెప్పుకొనే గుర్మీత్‌ సింగ్‌ 2007లో సిక్కుల గురు గోవింద్‌ సింగ్‌ మాదిరి వస్త్రాలను ధరించి కనిపించటంతో హర్యానా, పంజాబ్‌లో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. భటిండా పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ఆకేసును 2014లో పంజాబ్‌ అకాలీ-బిజెపి ప్రభుత్వం కేసును వుపసంహరించుకుంది. సిర్సాలోని డేరా ఆశ్రమంలో కార్యకర్తలకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారని సైన్యం 2010 డిసెంబరులో తెలియచేసింది. అక్రమ ఆయుధాలు, శిక్షణ గురించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు కోరగా అబ్బే అలాంటిదేమీ లేదంటూ హర్యానా ప్రభుత్వం పేర్కొన్నది. తాజా హింసాకాండలో ఆయుధాలు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి.

గుర్మీత్‌పై ఆత్యాచారం కేసుల విషయానికి వస్తే అత్యాచారాలు జరిగిన పది సంవత్సరాల తరువాత 2009,10 సంవత్సరాలలో నమోదయ్యాయి. ఇద్దరు భక్తురాండ్ర ప్రత్యక్ష వాంగ్మూలాలు గుర్మీత్‌ను దోషిగా నిలిపాయి. సిబిఐ న్యాయమూర్తుల ముందు వారుచెప్పిన అంశాలు బాబా భయంకర రూపాన్ని వెల్లడించాయి. సిర్సా ఆశ్రమంలోని భూగర్భంలో గుర్మీత్‌ వ్యక్తిగత నివాసం వుంది. దాని రక్షణకు ఎల్లవేళలా యువతులనే నియమిస్తారు. గుర్మీత్‌ను గుడ్డిగా నమ్మే విశ్వాసపరుల కుటుంబాలకు చెందిన యువతులను ఎంపిక చేసి వారు కూడా గుర్మీత్‌ను ఆధ్యాత్మిక గురువుగా నిజంగా నమ్ముతున్నారా లేదా అని నిర్ధారణ చేసుకున్న తరువాత నియామకాలు జరుపుతారట. అత్యాచారాలు చేసే సమయంలో గుర్మీత్‌ తానొక దేవుడినని ఫోజు పెట్టేవాడట. హర్యానాలోని యమునా నగర్‌కు చెందిన ఒక యువతి తనపై అత్యాచారం ఎలా జరిగిందో 2009 ఫిబ్రవరి 28న సిబిఐ న్యాయమూర్తి ఎకె వర్మ ముందు వివరించింది. తన సోదరుడి కారణంగా తాను 1999 జూలైలో డేరాలో భక్తురాలిగా చేరానని, పితాజీ నిన్ను క్షమించాడా అని అని  భక్తులు అడగుతుంటేే తొలుత తనకు అర్ధం కాలేదని, 1999 ఆగస్టు28/29 తేదీన తనను గుర్మీత్‌ నివాసంలోకి పిలిచించి అత్యాచారం చేసిన తరువాత ఆ మాటలకు అర్ధం స్పష్టమైందని వివరించింది. తన సోదరికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తరువాత ఆమె సోదరుడు హత్యకు గురయ్యాడు. సిర్సాకు చెందిన మరొక భక్తురాలు 2010 సెప్టెంబరు తొమ్మిదిన తన వాంగ్మూలమిచ్చింది. ఆమె తలిదండ్రులు డేరా గురించి చేసిన బోధల కారణంగా తాను భక్తురాలిగా మారానని, 1998 జూన్‌లో ఆశ్ర మంలో చేరిన తనకు నజం అని గుర్మీత్‌ నామకరణం చేశాడని, 1999 సెప్టెంబరులో గుర్మీత్‌ నివాసకాపలాదారుగా వుండగా లోపలికి పిలిచి తనపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లుగా పేర్కొన్నది.

గుర్మీత్‌ మద్దతుదారులు పంచకుల నగరాన్ని తగులబెడుతుంటే హర్యానా బిజెపి సర్కార్‌ నీరోలా వ్యవహరించింది. సాక్షాత్తూ పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఆ రాష్ట్ర సర్కార్‌ను బహిరంగంగానే అభిశంచింది. హింసాకాండకు సంఘవ్యతిరేకశక్తులు కారణమని చెప్పటాన్ని ఎండగట్టింది.గుర్మీత్‌కు శిక్ష ఖరారు తేదీని ఎంతో ముందుగానే ప్రకటించారు. ఆ కేసులో అతగాడికి శిక్ష పడనుందని అనుచరులకు కూడా అనిపించిన కారణంగానే వారం రోజుల ముందు నుంచే పంచకుల, తదితర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెట్రోలు, పెట్రోలు బాంబులు, ఇతర మారణాయుధాలను సమీకరించారని వార్తలు ముందే వచ్చినా హర్యానా సర్కార్‌ తీసుకున్న ముందుస్తు చర్యలేమీ లేవు. గుర్మీత్‌ మద్దతుదారులు స్వేచ్చగా గుమికూడటానికి అన్ని అవకాశాలను ఇచ్చింది. ముఖ్యమంత్రి చెప్పినట్లు సంఘవ్యతిరేకశక్తులే హింసాకాండకు పాల్పడితే అది తెలిసి కూడా ఏడు రోజుల పాటు ఎలాంటి వారి ప్రవేశానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది.శాంతి భద్రతల అంశం రాష్ట్రాలదని అదనపు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సత్యపాల్‌ జైన్‌ చెప్పటాన్ని కోర్టు తప్పుపట్టింది.’ ప్రధాన మంత్రి దేశం మొత్తానికి ప్రధాని తప్ప ఒక పార్టీకి కాదు…హర్యానా, పంజాబ్‌ దే శంలో భాగం కాదా అని ప్రశ్నించింది. అంతే కాదు, హింసాకాండలో నష్టపడిన వారు అధికారయంత్రాంగానికి దరఖాస్తు చేసుకోవాలని, వాటిని తనిఖీ చేసి కోర్టుకు నివేదించాలని, ఈ నష్టాన్ని దానికి బాధ్యులైన వారి నుంచి రాబట్టాలని కూడా కోర్టు పేర్కొన్నది.

కేరళలోని తిరువనంతపురంలో వ్యక్తిగత వివాదంలో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యకు గురైతే న్యూఢిల్లీ నుంచి కేంద్రమంత్రి అరుణ్‌జెట్లీ పర్యటించటం, గవర్నర్‌ జోక్యం చేసుకోవటం వంటి చర్యలతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు నానా యాగీచేశారు. గుర్మీత్‌ మద్దతుదార్ల చేతుల్లో 31 మంది హత్యకు గురికావటం, 250 మందికిపైగా గాయపడటం, పెద్ద సంఖ్యలో ఆస్తినష్టం. రైళ్లు, బస్సులు రద్దయి, కొన్ని చోట్ల కర్ఫ్యూవిధించటంతో లక్షలాది ప్రయాణీకులు, సామాన్య నానా ఇబ్బందులు పడితే, పడుతుంటే బిజెపి నేతలకు చీమైనా కుట్టకపోగా నెపాన్ని సంఘవ్యతిరేక శక్తుల మీదకు నెడతారా ? గుండెలు తీసిన బంట్లు వీరని అనిపించటం లేదా !