వాడ్రేవు చిన వీర భద్రుడు
మృత్యువును చూసి కాదు నేను
జీవితాన్ని చూసి జంకుతున్నాను
హంతకుని కత్తి చూసి కాదు, కనుల ద్వేషం
చూసి జంకుతున్నాను
మనసులోని క్రౌర్యం చూసి జంకుతున్నాను
బైరాగి ( ఆగమగీతి:నాకు చావులేదు)
గౌరీ లంకేష్ హత్య ఒక విషయాన్ని చాలా బిగ్గరగా, మనం ఎక్కడ వినకుండా పోతామో అన్నంత బిగ్గరగా, మన చెవులు చిల్లులు పడేట్లుగా, భరించలేనంతగా ఘోషిస్తోంది. అదేమంటే: మనం రాజకీయంగా సరే, సాంస్కృతికంగా కూడా పతనం అంచులకు చేరుకున్నామని.
రెండవ ప్రపంచ యుద్ధం అయిన తరువాత ఇంటికి వస్తున్న జర్మన్ సైనికులకు( ఇంటికి తిరిగి రాగల అదృష్టం నోచుకున్నవాళ్లు) తమ పదజాలమంతా హఠాత్తుగా మాయమైనట్లు అనిపించిందట.’దేశం’, ‘కుటుంబం’, ‘మనిషి’, ‘ప్రేమ’, ‘మానవ సంబంధాలు’ ఈ మాటలకు అర్ధం లేదని అనిపించిందట.
గౌరిని హత్య చేసిన మర్నాడే హత్యను ఖండించకపోగా, మరణానికి చింతించకపోగా, ఈ అమానుషాన్ని ప్రతి ఒక్కరూ తమ మీద తీసుకొని ఎంతో కొంత ప్రాయచిత్తం ప్రకటించకపోగా, సోషల్ మీడియాలో నడచిన, నడుస్తున్న కొన్ని వ్యాఖ్యలు నన్ను బాధిస్తున్నాయి, భయపెడుతున్నాయి. మనం ఏ దేశంలో వున్నాం ? ఏ విలువల గురించి ఇంతకాలం గర్విస్తూ వచ్చాం? ప్రాచీన కాలం నుంచి ఎవరిని ఆదర్శాలుగా ప్రకటించుకుంటూ వచ్చాం? నిర్ధాక్షిణ్యంగానూ, నిస్సిగ్గుగానూ చేసిన హత్యకన్నా, నిర్ధాక్షిణ్యంగానూ, నిస్సిగ్గుగానూ మాట్లాడుతున్న ఈ మాటలు నన్నెక్కువ కలవరపెడుతున్నాయి.
దుర్మార్గమైన ఈ రాతలు చదివి ఎందరో యువతీ యువకులు, ముక్కుపచ్చలారని పిల్లలు తామేదో మహత్తర హిందూ సంస్కృకి వారసులమని, తమ మతానికి సంస్కృతికి ఏదో పెద్ద ప్రమాదం వాటిల్లుతోందని, అలాంటి ఒక ప్రమాదకరమైన మనిషిని చంపేస్తే వీళ్లంతా ఎందుకిట్లా ఖండిస్తున్నారని, దు:ఖిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. ఎవరు చెప్తారు వీళ్లకి ? ఈ రాజకీయ శక్తులు మాట్లాడుతున్న హిందుత్వానికి, అనాది కాలంగా ఈ దేశంలో కొనసాగుతున్న హిందూ జీవన విధానానికి సంబంధమే లేదని, అసలు ‘హిందుత్వం’ వేరు, హిందూ జీవన విధానం వేరని, అసలు హిందూ మతమంటూ ఒకటి లేనే లేదని, అసలు అటువంటి మతమంటూ ఒకటుందని అనుకున్నా ఇలాంటి అమానవీయ మిలిటెంట్ ధోరణుల్ని అది గతంలో ఇంత నిస్సిగ్గుగా చూపించి వుండలేదని, ఇప్పటి ఈ దుర్మార్గ స్వరూపం గ్లోబల్ పెట్టుబడికి, రాజకీయ కట్టుకథకి పుట్టిన విష పుత్రిక అని ఎప్పుడు గుర్తిస్తారు !
మరొక మాట కూడా చెప్పాలి. నేను కూడా హిందువునే, కానీ నా మతానికి బయటి మతాల వలన ప్రమాదం వుందని నాకెప్పుడూ అనిపించలేదు. ఏమతమైనా ఆ మతం పేరు చెప్పకుండా దాన్ని అనుసరించలేని ఆత్మవంచన వల్ల, కాలక్రమంలో సంతరించుకొనే దురాచారం వల్ల ప్రమాదంలో పడుతుంది తప్ప బయటివాళ్ల వల్ల కాదు. ఏమతాన్నయినా కాపాడగలిగేది ఆ మతం ప్రబోధించే మంచి విషయాల్ని అనుసరించగలిగే వాళ్లేతప్ప రాజకీయ నాయకులు, గూండాలు కాదు.
నేనీ మాటలు రాస్తే నేను ఎదుర్కోబోయే ప్రశ్నలేమిటో కూడా నాకు తెలుసు. అన్నింటికన్నా ముందు అడిగే ప్రశ్న: మరి వామపక్ష తీవ్రవాదులు అమాయకుల్ని చంపితే నువ్వెందుకు మాట్లాడలేదు అని, కేరళలోనో మరోచోటనో ఎవరో ఎవరినో చంపుతుంటే నువ్వెందుకు మాట్లాడలేదని. హింస ఎక్కడైనా హింసే, ఎవరు చేసినా హింసనే. కత్తితో కుడివైపు నుంచి పొడిచినా, ఎడమవైపు నుంచి పొడిచినా కారేది రక్తమే, దు:ఖమే. కానీ నేను ఈ దేశంలో ఇంతదాకా చూసిన హింసకి, ఈ హింసకీ పోలికనే లేదు. గతంలో ఎవరైనా ఎవరినైనా చంపితే ఎంతో కొంత పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసేవారు, చివరికి గాడ్సే కూడా తన వాంజ్మూలంలో గాంధీ పట్ల ఎంతో కొంత సానుభూతి చూపకుండా వుండలేకపోయాడు. కానీ ఈ హత్యని ఇట్లా సెలబ్రేట్(పండుగ) చేసుకుంటున్న హీన సందర్భాన్ని ఇప్పుడే చూస్తున్నాను. అది కూడా హిందూత్వం పేరిట.
ఆమె హత్యను ఎవరు ఖండించారన్నది కాదు, ఎవరు ఖండించలేదన్నది నన్నెక్కువ బాధ పెడుతున్నది. బహుశ చిదానంద రాజఘట రాసుకున్న జ్ఞాపకాలు చదివి వుండకపోతే ఈ నాలుగు మాటలు మాట్లాడటానికి కూడా నా గొంతు పెగిలి వుండేది కాదు. మరీ ముఖ్యంగా ఈ వాక్యాలు ‘మరణం ఒక అనుకోని ఘటన. మంచి వ్యక్తులు చేసిన దానికి, వారు దేనికోసం నిలబడ్డారనేదానికి గౌరవం, ప్రేమ మరియు ప్రశంస ముఖ్యం. వామపక్షవాది, తీవ్రవాది, హిందుత్వ వ్యతిరేకి, లౌకిక వాది తదితర ముద్రలన్నింటినీ మరచిపోండి, నావరకైతే అబ్బురమైన కారుణ్యం, హుందాతనాల సారం’.
పిల్లలూ చదవండి, మీకు నచ్చని ప్రతి ఒక్కరినీ నిర్మూలించుకుంటూ పోనక్కరలేదని తెలుస్తుంది. విబేధాలతో విడిపోయినా, స్నేహితులుగా కొనసాగటమెలానో తెలుస్తుంది.మనుషులుగా మిగలటం అన్నింటికన్నా ముఖ్యమని తెలుస్తుంది.
(ఫేస్బుక్ పోస్టింగ్ సౌజన్యంతో)
” ప్రాచీన కాలం ఆదర్శాలు , హిందుత్వం ., అనాది కాలంగా ఈ దేశంలో కొనసాగుతున్న హిందూ జీవన విధానం ” ఇవి ఇప్పుడు మీకు గుర్తు రావడం దురదృష్టకరం . అసలు అటువంటి మతమంటూ ఒకటుందని అనుకోవడం ఏంటి అని అంటారా ? అది కోట్ల ప్రజల అస్తిత్వం,,, ఇది అమానవీయ మిలిటెంట్ ధోరణుకాదు .పరాయీకరణ భావాల అణిచివేతల పై తిరుగుబాటు మాత్రమే. నేను కూడా హిందువునే, అని చెప్పుకునే వాళ్ళ వల్లనే దేశానికి ఈ దౌర్భాగ పు స్థితి దాపురించింది . మతం ప్రబోధించే మంచి విషయాల్ని అనుసరించగలిగే బుద్ది కేవలం ఓకే వర్గానికే పరిమితం కారాదు తురుకోడి రాజ్యకాంక్ష కు, తెల్లొడి బానిసత్వానికి ,మతాంతీకరణ నరమేధానికి ఈ దేశం ఇంత కాలం దాకా చూసిన హింసకి ఈ సంఘటనకి ఎలాంటి పోలిక లేనే లేదు. ఇలాంటి సంఘటనకి సెలబ్రేట్(పండుగ) చేసుకొమ్మని చెప్పే హీన సంస్కృతి హిందూత్వం ఎన్నడూ నేర్పలేదు నేర్పదు కూడా, నచ్చని ప్రతి ఒక్కరినీ నిర్మూలించుకుంటూ పోనక్కరలేదని చెప్పాల్సింది కుడి ఎడమ భుజాలకు ,కుటిల లౌకిక వాదులకు . విదేశీ సరుకులతో మెరుపులతో బానిసబతుకులు బతికేవాళ్లకు .రాజకీయం కోసం రాజ్యాధికారం కోసం దేశాన్నే తాక్కట్టు పెట్టేవాళ్లకు . దేశద్రోహులకు ఇలాంటి వివక్షత పూరితపు మాటలు రాస్తే ఎదుర్కోబోయే ప్రశ్నలేమిటో కూడా తెలుసు. కాబట్టే ” నేను కూడా హిందువునే “అనే ముసుగు అవసరమైంది, మనుషులుగా మిగలటం అన్నింటికన్నా ముఖ్యమని అందరికి తెలుసు .కానీ దాన్నిచెప్పాల్సింది మత వ్యాప్తి కోసం మారణ హోమం సృష్టించే వాళ్ళకి , తుపాకీ ద్వారానే రాజ్యాధికారం సిద్దిస్తుందన్న వారికి ..ధన్యవాదాలు
LikeLike