Tags

, , ,

గౌరీ లంకేష్‌

ఈ వారం సంచికలో దేశంలోని నకిలీ వార్తల ఫ్యాక్టరీల గురించి నా స్నేహితుడు వాసు ఓ వ్యాసం రాశారు. గోబెల్స్‌దారిలో వెళుతున్న ఆ అబద్దాల పత్రికల్లో ఎక్కువ భాగం మోడీ భక్తులు నడిపిస్తున్నవే. వాటి వల్ల జరిగే నష్టం గురించి నా సంపాదకీయంలో వివరించేందుకు ప్రయత్నిస్తాను.

కొన్ని రోజుల క్రితం గణేశ్‌ చతుర్ధి సందర్భంగా సామాజిక మీడియా ద్వారా సంఘపరివార్‌ ఓ పుకారును ప్రచారంలోకి తెచ్చింది. గణేష్‌ విగ్రహాలను ఎక్కెడెక్కడ ప్రతిష్టించాలో కర్ణాటక(కాంగ్రెస్‌) సర్కారే నిర్ణయిస్తుందన్నది ఆ వార్త. ఒక్కో విగ్రహం కోసం రు.పదిలక్షలు చెల్లించాలి. ఎత్తు విషయంలోనూ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇతర మతస్తుల నివాసాలు లేని దారిలోనే నిమజ్జన యాత్ర సాగాలి. టపాసులు కాల్చేందుకు అనుమతించరు. ఈ తప్పుడు వార్తల్ని ప్రచారంలోకి తెచ్చింది ఆర్‌ఎస్‌ఎస్‌. కర్ణాటక డిజిపి ఆర్‌కె దత్తా ఈ వార్తపై వివరణ ఇవ్వక తప్పని పరిస్దితి. అటువంటి నిబంధనలేమీ ప్రభుత్వం విధించలేదని స్పష్టం చేశారు. దాంతో అది పచ్చి అబద్దమని తేలిపోయింది. ఈ పుకారుకు ఆధారమేమిటని వెతికితే ‘పోస్టు కార్డు న్యూస్‌’ వెబ్‌సైట్‌ అని తేలింది. అది హిందూత్వ వాదులు నడిపిస్తున్న వెబ్‌సైట్‌. సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజు ఇలాంటి వార్తలను ఆ వెబ్‌సైట్‌ సృష్టిస్తుంది.

ఆగస్టు 11వ తేదీన ‘పోస్టు కార్డు న్యూస్‌’ వెబ్‌సైట్‌ కర్ణాటకలో తాలిబన్‌ పాలన పేరుతో ఒక అబద్దపు వార్తను సృష్టించింది. గణేష్‌ చతుర్ధి సందర్భంగా ప్రభుత్వం అనుచిత నియమాలను పెట్టిందన్నది సారాంశం. ఈ అబద్దాన్ని రాష్ట్రమంతటా ప్రచారం చేయటంలో సంఘీయులు విజయం సాధించారు. వేరే కారణాలతో సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలతో వున్నవారు ఈ అబద్దపు వార్తను తమ ఆయుధంగా చేసుకున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన, విచారకరమైన విషయం ఏమంటే జనం తమ కళ్లు, చెవులు మూసుకొని బుర్రకు ఏమాత్రం పని పెట్టకుండా, ఆలోచించకుండానే అదే నిజమని భావించారు.

అత్యాచారం కేసులో రామ్‌ రహీమ్‌ గుర్మీత్‌ సింగ్‌ను దోషిగా తేలుస్తూ గతవారం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనతో చాలా మంది బిజెపి నేతలు అంతకు ముందు దిగిన ఫొటోలు ఈ సందర్బంగా సామాజిక మీడియాలో వైరస్‌ మాదిరి వ్యాపించాయి. ప్రధాని మోడీతో సహా హర్యానాకు చెందిన బిజెపి మంత్రుల ఫొటోలు కూడా అందులో వున్నాయి. దీంతో బిజెపి, సంఘపరివార్‌ ఇరకాటంలో పడ్డాయి. దానికి పోటీగా సిపిఐ(ఎం)నేత, కేరళ ముఖ్య మంత్రి పినరయ్‌ విజయన్‌ గుర్మీత్‌తో కలిసిన ఫొటో అంటూ ఒక దానిని ప్రచారంలో పెట్టారు. వాస్తవాన్ని వెలికి తీయగా అది కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ గుర్మీత్‌తో దిగిన ఫొటో అని తేలింది. ఫొటోషాప్‌ ద్వారా చాందీ తల స్ధానంలో విజయన్‌ది వుంచి సృష్టించిన నకిలీ ఫొటో అని స్పష్టమైంది. హిందూత్వవాదులకు చెందిన సామాజిక మీడియా నిపుణులు చాందీ ఫొటో స్ధానంలో విజయన్‌ది చేర్చి ప్రచారంలో పెట్టారు. అసలు ఫొటోను కొందరు వెలుగులోకి తేవటంతో సంఘపరివార్‌ బండారం బయటపడింది.

హిందుత్వ వాదులు సాగిస్తున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలకు గతేడాది వరకు సరైన ప్రతిస్పందన వ్యక్తం చేసిన వారు లేరు. ఇప్పుడు చాలామంది అందుకు నడుంబిగించారు. స్వాగతించదగిన పరిణామం. ఇప్పటిదాకా నకిలీ వార్తలే రాజ్యమేలగా ఇప్పుడు వాస్తవ వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. వుదాహరణకు ఆగస్టు 17న ధృవ్‌ రాధీ సామాజిక మీడియాలో ఒక వీడియోను పెట్టారు. ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్న అబద్దాలను ఎత్తి చూపే వీడియో ఇది. మోడీ చెబుతున్న అబద్దాలను రాధీ గతకొద్ది మాసాలుగా బహిర్గతం చేస్తున్నారు. ప్రారంభంలో కొద్ది మంది మాత్రమే ఆ వీడియోలను వీక్షించేవారు. అయితే ఈ వీడియోకి బాగా ప్రచారం లభించింది. యూ ట్యూబ్‌లో లక్షమందికి పైగా చూశారు.

రాధీ పేర్కొన్న వివరాల ప్రకారం నెల రోజుల కిందట ‘బుజి బుజియా’ (అబద్దాల కోరు-మోడీకి గౌరీ పెట్టిన పేరు) ప్రభుత్వం రాజ్యసభలో ఓ విషయం వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం 30లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారని చెప్పింది. అయితే నోట్ల రద్దు అనంతరం 91లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తున్నారని ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ అంతకు ముందు పేర్కొన్నారు. ఆర్ధిక సర్వే ప్రకారం కేవలం 5.4లక్షల మంది మాత్రమే పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారు. ఈ మూడింటిలో ఏవి సరైన అంకెలని రాధీ తన వీడియోలో ప్రశ్నించారు.

బిజెపి ప్రభుత్వం చెప్పిన అబద్దాలను, ఇచ్చిన సమాచారాన్ని ప్రధాన మీడియా అంగీకరిస్తోంది. ప్ర శ్నించేవారు, సవాల్‌ చేసే వారు లేకపోవటమే అందుకు కారణం. టీవీ వార్తా ఛానళ్ల విషయానికొసే రామనాధ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు అనేక ఆంగ్లవార్తా ఛానళ్లు ఒక కథనాన్ని ప్రసారం చేశాయి. కోవింద్‌ ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే ట్విటర్‌లో 30లక్షల మందికిపైగా అనుచరులను సంపాదించుకున్నారన్నది వార్త సారాంశం. కోవింద్‌కు ప్రజాదరణ ఏవిధంగా పెరిగిందో రోజంతా నొక్కి చెప్పాయి.

ఈ రోజుల్లో అనేక టీవీ వార్తా సంస్ధలు ఆర్‌ఎస్‌ఎస్‌తో జట్టుకట్టినట్లు కనిపిస్తోంది. కోవింద్‌ కథనం వెనుక వాస్తవం ఏమంటే పదవీ విరమణ చేసిన దేశాధ్యక్షుడు ప్రణబ్‌ ముఖర్జీ అధికారిక ట్విటర్‌ ఖాతాను కొత్తగా పదవిని చేపట్టిన కోవింద్‌కు కేటాయించారు. దాంతో సహజంగానే ఆయన అనుచరులందరూ కోవింద్‌కు బదిలీ ఆయ్యారు. మాజీ రాష్ట్రపతికి ట్విటర్‌లో 30లక్షల మందికి పైగా అనుచరులున్నారన్నది గమనించదగ్గ విషయం.

ఆర్‌ఎస్‌ఎస్‌ అబద్దపు ప్రచారాలకు ప్రతిగా సత్యాన్వేషకులు అనేక మంది వాస్తవమేంటో చెబుతున్నారు. దృవ్‌ రాధే తన వీడియోలతో ఆ పని చేస్తుంటే ప్రతీక్‌ సిన్హా ఒక వెబ్‌సైట్‌(ఆల్ట్‌న్యూస్‌.ఇన్‌), ది వైర్‌, స్క్రోల్‌, న్యూస్‌ లాండ్రి, క్వింట్‌ వంటి ఆన్‌లైన్‌ పత్రికలు వున్నాయి. ఇవి చాలా చురుగ్గా తప్పుడు కథనాల గుట్టు విప్పి చెబుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ కాషాయ దళం సాగిస్తున్న తప్పుడు ప్రచారాల్ని తిప్పి కొడుతున్న వారంతా ఎలాంటి ఆర్దిక ప్రయోజనాలనూ ఆశించకపోవటం గమనార్హం. వాళ్ల లక్ష్యం తప్పుడు వార్తలు ప్రచారంలోకి రాకుండా చూడటం, ఫాసిస్టుల బండారాన్ని బయటపెట్టటం. కొద్ది వారాల క్రితం భారీ వర్షాల కారణంగా బెంగళూరు నీట మునిగిపోయినపుడు బిజెపి కర్ణాటక ఐటి విభాగం ఒక ఫొటోను విడుదల చేసింది. ‘చంద్రుడి మీద నడుస్తున్న ప్రజలను నాసా కనిపెట్టింది, ఆ తరువాత బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ దానిని తన రోడ్డుగా ధృవీకరించింది.’ అంటూ ఫొటో కింద వ్యంగ్యోక్తులను కూడా జోడించింది.భారీ వర్షాలపుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సిద్దరామయ్యకు వ్యతిరేకంగా నకిలీ వార్తలను ప్రచారం చేసే యత్నమిదని స్పష్టమౌతోంది. వాస్తవానికి ఆ ఫొటో బిజిపి పాలిత మహారాష్ట్రకు చెందినదని, బెంగళూరుది కాదని బైటపడటంతో పధకం బెడిసి కొట్టింది.

అదే విధంగా ఇటీవల పశ్చిమబెంగాల్లో అల్లర్లు చెలరేగినపుడు మతతత్వశక్తులు సోషల్‌ మీడియాలో రెండు పోస్టర్లను ప్రచారంలో వుంచాయి. ఒకటి కాలిపోయిన ఇళ్ల ఫొటో. దాని కింద’బెంగాల్‌ తగులబడుతోంది’ అని రాసి వుంది. రెండవ ఫొటోలో అనేక మంది చూస్తుండగా ఒక పురుషుడు మహిళ చీరలాగుతున్నాడు. ఆ ఫొటో కింద ‘ బదూరియాలో హిందూ మహిళలపై దాడి ‘ అని రాసి వుంది. అయితే కొద్ది గంటలలోనే ఆ ఫొటో వెనుక దాగిన వాస్తవం బహిర్గతమైంది. మొదటి ఫొటో మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుండగా 2002లో అల్లర్లు చెలరేగినపుడు తీసింది. రెండవ ఫొటో ఒక భోజ్‌పురి సినిమాలోది. ఇప్పటికీ వుంది. ఈ ఫొటోను బిజెపి సీనియర్‌ నేత విజేత మాలిక్‌ షేర్‌ చేసుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే కాదు బిజెపి మంత్రులు కూడా నకిలీ వార్తలు, కథనాలను ప్రచారం చేస్తున్నారు.వుదాహరణకు ముస్లింలు మూడు రంగుల జెండాను తగులబెడుతున్న ఫొటోను నితిన్‌ గడ్కరీ షేర్‌ చేసుకున్నారు. ఆ ఫొటో కింద ‘ గణతంత్ర దినోత్సవం నాడు హైదరాబాదులో మూడు రంగుల జెండాను దగ్దం చేస్తున్నారు ‘ అని రాసి వుంది. గూగుల్‌లో కొత్తగా ఒక యాప్‌ వచ్చింది. దీని సాయంతో ఒక ఫొటోను ఎప్పుడు, ఎక్కడ రూపొందించారో తెలుసుకోవచ్చు. ప్రతీక్‌ సిన్హా దాన్ని ఎక్కడిదో తెలుసుకున్నారు. వాస్తవానికి పాకిస్తాన్లో నిషేధిత సంస్థలు నిరసన తెలుపుతున్న చిత్రమది. కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ ఓ ఫొటోను షేర్‌ చేశారు. దేశంలో 50వేల కిలోమీటర్ల రోడ్ల మీద 30లక్షల ఎల్‌యిడి లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నాయని ఆ ఫొటో శీర్షిక సారాంశం. అయితే అదీ బోగస్‌ అని తేలిపోయింది.జపానులోని ఒక వీధిలో 2009లో తీసిన చిత్రమది. చత్తీసుఘర్‌ బిజెపి ప్రభుత్వం నిర్మించిన వంతెన అంటూ ఆ రాష్ట్ర బిజెపి మంత్రి రాజేష్‌ మునాత్‌ ఓ ఫొటోను ప్రచారంలో పెట్టారు. వాస్తవానికది వియత్నాంలో నిర్మించిన వంతెన అది. కర్నాటక ఎంపీ ప్రతాప్‌ సిన్హా ప్రపంచానికి నీతి బోధ చేసే పనిలో పడ్డారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో ప్రచురితమైందంటూ ఒక నివేదికను షేర్‌ చేశారు. ఒక హిందూ బాలికను ముస్లిం పొడిచి చంపాడు అన్నది శీర్షిక. ఒక్క పత్రిక కూడా ఆ విధమైన వార్తను ప్రచురించలేదు.వార్తను కూడా మతపరమైన కోణంలో మలచారు. శీర్షికను ఫొటోషాప్‌లో మార్చి పెట్టారు.అయితే దీనిపై కలవరం చెలరేగటంతో ఎంపి ఆవార్తను తొలగించారు. మత విద్వేషాన్ని రగిల్చే అబద్దాన్ని ప్రచారం చేసినందుకు ఆయన క్షమాపణలు చెప్పలేదు. విచారం వెలిబుచ్చలేదు.

నా స్నేహితుడు వాసు గుర్తు చేసినట్లు నేను కూడా ఈ వారంలో ఒక నకిలీ ఫొటోను షేర్‌ చేశాను. అది పాట్నాలో ర్యాలీకి సంబంధించి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ షేర్‌ చేసినది. నా స్నేహితులు శశిధర్‌ హెమ్మాడి అది నకిలీ అని గుర్తు చేశారు. దాంతో గ్రహించుకొని వాస్తవ ఫొటోలను జతచేసి నా తప్పును సరిదిద్దుకున్నాను. ఇదంతా కేవలం ప్రచారం కోసం కాదు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించాలన్నదే నా ఆకాంక్ష, చివరి మాటగా తప్పుడు వార్తల్ని వెలికితీసే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. అటువంటి వారు చాలా మందే వున్నారని అనుకుంటున్నా.

( ఇది గౌరీ లంకేష్‌ రాసిన చివరి సంపాదకీయం)