Tags
Donald trump, he North Korea, Kim Jong-un, nuclear and missile tests, Rocket man, United Nations

ఐక్యరాజ్య సమితి సమావేశాలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డు ట్రంప్ మంగళవారం నాడు వుత్తర కొరియాను మరోసారి బెదిరించాడు. అణ్వాయుధ, ఖండాంతర క్షిపణి ప్రయోగాల నుంచి వెనక్కు తగ్గనట్లయితే కొరియాను పూర్తిగా నాశనం చేయటం తప్ప మరొక మార్గం లేదని మాట్లాడాడు. గత నలుగురు అమెరికా అధ్యక్షులు విఫలమైన తీరు, అమెరికా వైపు నుంచి చేసిన పిచ్చిపనులు ముది మది తప్పిన ఈ మనిషికి తెలిసినట్లు లేదు. గత కొద్ది వారాలుగా ఉత్తర కొరియా అమెరికా సంబంధాలు మీడియాలో ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లు ఉద్ధాన, పతనాలకు గురవుతున్నాయి. ఒక చిన్న ఉత్తర కొరియా అంత పెద్ద అమెరికా, జపాన్‌లను, ప్రపంచ స్టాక్ మార్కెట్‌ను ఎందుకు, ఎలా వణికిస్తోంది అని బుద్ధిజీవులు ఆలోచిస్తున్నారు. రెండున్నర కోట్ల జనాభాతో వున్న ఈ సోషలిస్టు దేశం గురించి మీడియాలో సానుకూలమైన వార్త ఒక్కటీ రావటం లేదు, దాన్నొక బూచిగా చూపుతున్నారు. దీపావళి సందర్భంగా ఎదురు బెదురు కుర్రకారు పోటా పోటీగా తారాజువ్వలను వదిలినట్టుగా ఉత్తర కొరియా, అమెరికా మద్దతుతో దక్షిణ కొరియా క్షిపణులను ప్రయోగిస్తున్నాయి. విత్తు ముందా చెట్టు ముందా అన్న తెగని చర్చలోకి పోకుండా చూస్తే ఇరు దేశాలూ సమాన స్ధాయిలోనే వదులుతున్నాయి. మీడియాలో మాత్రం ఏకపక్షంగా వార్తలు వస్తాయి. ఐరాస ఆంక్షలు విధించిన తరువాత ఇంతవరకు ఆరు అణు పరీక్షలు జరపగా వాటిలో 33ఏండ్ల కిమ్ జోంగ్ అన్ అధికారంలోకి వచ్చిన 2016 జూన్ నుంచి నాలుగు, 75 హ్రస్వ, దీర్ఘశ్రేణి క్షిపణి ప్రయోగాలు జరిపింది. కొన్ని జపాన్ మీదుగా ప్రయాణించి అమెరికా ప్రధాన భూ భాగానికి దగ్గరలోని లక్ష్యాలను తాకాయని వార్తలు వచ్చాయి. ఇవి పరీక్షలే కాదు, అవసరమైతే నిజంగానే ప్రయోగిస్తాం అని ఉత్తర కొరియా చెబుతోంది.
ఉత్తర కొరియా ప్రయోగాలను అవును అంటే దాన్ని అణురాజ్యంగా అంగీకరించినట్టు, కాదు అంటే తన రక్షణ ఛత్రం కింద వున్న జపాన్, దక్షిణ కొరియాల అనుమానాలను తీర్చలేక వాటికోసం కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో అమెరికన్లు బలప్రదర్శనలకు దిగి విమర్శలపాలు అవుతున్న స్ధితి. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గాలంటే దక్షిణ కొరియా నుంచి అమెరికా తన సైన్యాలను ఉపసంహరించి ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం ఉభయ కొరియాల విలీనానికి వీలు కల్పించాల్సి వుంది. అందుకు అమెరికన్లు సిద్ధం కాదు. చైనా, రష్యా, ఉత్తర కొరియాలను ఎప్పుడైనా దెబ్బతీయాలి లేదా తన దారికి తెచ్చుకోవాలనే లక్ష్యంతో అమెరికన్లు దక్షిణ కొరియాలో క్షిపణి వ్యవస్థ ఏర్పాటు చేశారు. జపాన్‌తో కలసి నిత్యం యుద్ధ విన్యాసాలకు దిగుతున్నారు. దానిని చూసి ఉత్తర కొరియా తన జాగ్రత్తలను తాను తీసుకొంటోంది. అణు కార్యక్రమం నుంచి వైదొలిగేందుకు చేసుకున్న పలు ఒప్పందాలకు అమెరికా తూట్లు పొడిచిన కారణంగా ఉత్తర కొరియా తన ప్రయోగాలను పునరుద్ధరించింది. పూర్తి స్ధాయి అణుదేశంగా మారేందుకు ఉత్తర కొరియా ముందుకు పోతోందన్నది స్పష్టం. దాన్ని ఆ బాట నుంచి మళ్లించాలంటే రెచ్చగొట్టటం కంటే ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా, చైనా, రష్యా, జపాన్ ఒక గట్టి నిర్ణయం తీసుకొని అమలు జరపాల్సి వుంది. గత శుక్రవారం నాడు స్వయంగా కిమ్ జోంగ్ అన్ పర్యవేక్షణలో ఒక క్షిపణి పరీక్ష జరిపినట్టు ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది. అది 770 కిలోమీటర్ల ఎత్తున 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకుంది. తమ అంతిమ లక్ష్యం అమెరికాతో వ్యూహాత్మక సమానత్వాన్ని సాధించేందుకు, ఉత్తర కొరియాపై సైనిక ప్రయోగం వంటి మాటలు అమెరికా నేతలు మాట్లాడకుండా వుండేందుకు ఈ ప్రయోగాలను జరుపుతున్నట్టు కిమ్ వ్యాఖ్యానించారు.
ఉత్తర కొరియా ఇటువంటి తీవ్ర చర్య తీసుకోవటానికి కారణం ఎవరు? అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)లో అది భాగస్వామి. రెండవ ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఉభయ కొరియాల విలీనానికి అడ్డుపడుతూ దక్షిణ కొరియాలో తిష్టవేసింది అమెరికా. నిత్యం ఉత్తర కొరియాపై కవ్వింపులు, అక్కడి నాయకత్వానికి వ్యతిరేకంగా కుట్రలు సాగించింది. చైనా, ఇండో చైనాలోని వియత్నాం, కంపూచియా, లావోస్ తదితర దేశాలకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో అమెరికా తన అణ్వాయుధాలను మోహరించింది. ఈ పూర్వరంగంలో ఉత్తర కొరియా అణు రియాక్టర్ల నిర్మాణానికి నాటి సోవియట్ యూనియన్ సహకరించింది. ఆ క్రమంలో 1985లో ఉత్తర కొరియా ఎన్పీటీపై సంతకం చేసింది. దక్షిణ కొరియా నుంచి అమెరికా అణ్వాయుధాలను వుపసంహరించాలని ఒక షరతు పెట్టింది. అయితే ఆ పని చేయకపోగా ఉత్తర కొరియా అందచేసిన సమచారాన్ని విశ్వసించటం లేదని ప్రత్యేక తనిఖీలకు అనుమతించాలని అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ ద్వారా అమెరికా వత్తిడి చేసింది. అందుకు అంగీకరించకపోవటంతో ఐరాసకు ఫిర్యాదు చేశారు. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ పూర్వరంగంలో 1994లో తాను ఎన్పీటీ నుంచి వైదొలగాలనుకుంటున్నట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. అమెరికా చేసుకున్న ఒప్పందం ప్రకారం కొరియా అణు కార్యక్రమం నిలిపివేస్తే దానికి ప్రతిగా ఆర్ధికసాయం చేయాలి. అయితే దీనికి అమెరికన్లు 2002లో తూట్లు పొడిచారు. కథ మళ్లీ మొదటికి రావటంతో ఈ సారి అమెరికా, ఉభయ కొరియాలు, చైనా, రష్యా, జపాన్ కలసి చర్చించి 2005లో ఒప్పందం చేసుకున్నాయి. దాన్ని కూడా అమెరికా 2009లో ఉల్లంఘించింది. దాంతో తాము మరోసారి చర్చలకు వచ్చేది లేదని, అమెరికా చిత్తశుద్ధి ప్రదర్శించటం లేదని ఉత్తర కొరియా ప్రకటించింది. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
తాజా క్షిపణి పరీక్షలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యక్ష చర్యలకు పూనుకోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. అలాంటి ఉడత ఊపులకు బెదిరేది లేదని కొరియా మరో క్షిపణి పరీక్ష జరిపింది. అమెరికా ప్రత్యక్ష చర్యల ప్రకటనలు మాని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా, రష్యా హితవు పలికాయి. ఐరాసలో రష్యా రాయబారి వాసిలీ నెబెన్‌జరు మాట్లాడుతూ భద్రతా మండలి విధించిన ఆంక్షలకు మించి అదనపు చర్యలకు తాము సుముఖం కాదని స్పష్టం చేశారు. ‘అమెరికా, ఇతర భాగస్వాములను మేము కోరేదేమంటే భద్రతా మండలి తీర్మానంలో అవకాశం కల్పించిన రాజకీయ, దౌత్యపరమైన పరిష్కారాలను ముందు అమలు జరపాలి, వాటిని అమలు జరపకపోవటం అంటే తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించటం లేదని మేము పరిగణించాల్సి వుంటుంది’ అని చెప్పారు. కొరియాతో తిరిగి ముఖాముఖి చర్చలు జరపాలన్న చైనా, రష్యా ప్రతిపాదనను గతంలో అమెరికా తిరస్కరించింది. అమెరికాలోని చైనా రాయబారి కురు టీయంకారు మాట్లాడుతూ గతం కంటే అమెరికాయే ఇప్పుడు ఎంతో చేయాల్సి వుంది. మరిన్ని బెదిరింపులకు పాల్పడకుండా నిగ్రహంతో వుండాలి. చర్చలు, సంప్రదింపులకు ప్రభావవంతమైన మార్గాలను వెతికేందుకు వారు ఎంతో చేయాల్సి వుంది’ అన్నారు.
గత కొన్నేండ్లుగా ఉత్తర కొరియా గురించి జరిగిన ప్రచారాలలో అక్కడ జనం ఆకలితో మాడిపోతున్నారు, కరవు తాండవిస్తోంది, వస్తు కొరత తీవ్రంగా వుంది. అభివృద్ధి లేదు. నిరంకుశత్వం రాజ్యమేలుతోంది. జనంలో అసంతృప్తి పెరుగుతోంది. ఇలా ఉంటోంది. నిజంగా అక్కడ అలాంటి పరిస్థితే ఉంటే దశాబ్దాల తరబడి జనం తిరుగుబాటు చేయకుండా వుంటారా? ఐరాస తాజాగా విధించిన ఆంక్షల ఫలితంగా చమురు, గ్యాస్ ఎగుమతులు పరిమితం అవుతాయి. అక్కడి నుంచి వస్త్రాల వంటి వస్తువుల దిగుమతులు తగ్గిపోతాయి. నిజానికి ఇలాంటి పరిస్ధితిని ఉత్తర కొరియా ఏదో ఒక రూపంలో గత కొద్ది దశాబ్దాలుగా ఎదుర్కొంటోంది. ఆ దేశమంటే ఏమాత్రం సానుకూల వైఖరి లేదా సోషలిజం అంటే అభిమానం లేని కొందరు వ్యాఖ్యాతలు ఏమంటున్నారో చూద్దాం.
సిల్వియా మెర్లెర్ ఐరోపా కమిషన్ విశ్లేషకురాలు, జర్నలిస్టు. ఆమె ఒక వ్యాసంలో వివిధ అభిప్రాయాలను ఉటంకించారు. వాటిలో కొన్నింటిని చూద్దాం. ‘ఎకనమిస్ట్’ పత్రిక వాదన ఇలా వుంది. ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ మీద పశ్చిమ దేశాల ఆంక్షలు పెద్దగా పని చేయలేదు. ఏటా ఒకటి-ఐదు శాతం మధ్య అది అభివృద్ధి సాధించి వుండవచ్చు. అక్కడి నుంచి బొగ్గు ఎగుమతులను నిలిపివేయాలని ఐరాస ప్రయత్నించింది. అక్కడి నుంచి 99శాతం బొగ్గు దిగుమతి చేసుకొనే చైనా వాటిని నిలిపివేస్తానని ప్రకటించింది. అయితే కొరియా బొగ్గు ఓడలు చైనా రేవులకు వెళుతూనే వున్నాయి. డెయిలీ ఎన్‌కె అనే పత్రిక ప్రచురించిన వార్తల ప్రకారం అధికారికంగా 387 మార్కెట్లను మంజూరు చేయగా వాటిలో ఆరు లక్షల దుకాణాలలో విక్రయాలు సాగుతున్నాయి. యాభైలక్షల మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాటిపై ఆధారపడి వున్నారు. కొత్తగా మధ్యతరగతి పెరుగుతోంది. ఆదాయ అసమానతలు తీవ్రం అవుతున్నాయి. ఈ వార్తకు ముందు రాసిన ముందు మాటలో స్టెఫాన్ హగ్గడ్ ఇలా వ్యాఖ్యానించారు. ‘ఆర్థిక ఆంక్షలు వారిని దెబ్బతీస్తున్నాయి. 2002 అణు సంక్షోభం తలెత్తిన తరువాత జపాన్, దక్షిణ కొరియా ఇతర దేశాలతో వాణిజ్యం దాదాపు సున్నా స్థాయికి చేరింది. మొత్తం చైనా పైనే ఆధారపడుతోంది. ఇటువంటి స్థితిలో 2017 ఆగస్టులో భద్రతా మండలి ఆంక్షలను చైనా ఆమోదించే విధంగా అమెరికా చేయగలిగింది.
అమెరికా కొరియా సంస్ధకు చెందిన హెన్రీ ఫెరాన్ 38 నార్త్ బ్లాగ్ అనే వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో ‘ప్రస్తుతం అమలు జరుగుతున్న ఆర్థిక ఆంక్షలు ఎలాంటి ప్రభావం చూపటం లేదని అక్కడ జరుగుతున్న నిర్మాణాలు, ఆహారధాన్యాల ఉత్పత్తి, విదేశీ వాణిజ్యం వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి పలువురు పలు కారణాలను విశ్వసిస్తున్నప్పటికీ ముఖ్యమైన ఒక అంశం ఏమంటే కొరియా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించగలిగే సామర్థ్యం దానికి వుండటమే.’ 2016లో కొరియా వాణిజ్యంలో చైనా వాటా 64 నుంచి 88కి పెరిగింది. దక్షిణ కొరియా వాటా 30 నుంచి 5కు తగ్గింది. రెచ్చగొట్టే చర్యల నుంచి ఉత్తర కొరియా వెనక్కు తగ్గదు అనుకుంటే ఆంక్షలు ఏమౌతాయన్నది ప్రశ్న అని మరొకరు పేర్కొన్నారు. దీనిని బట్టి సాంకేతికంగా ఐరాస ఆంక్షలను సమర్ధించినప్పటికీ ఉత్తర కొరియాకు చైనా, రష్యా అండదండల కారణంగానే అది నెట్టుకొస్తోందన్నది స్పష్టం. అణ్వాయుధాలు పలు దేశాల వద్ద వున్న కారణంగా వాటితో యుద్ధానికి ఎవరూ తలపడే లేదా, వాటిని చూసి లొంగిపోయే అవకాశాలు లేవు. ఈ కారణంగానే అనేకమంది ఉత్తర కొరియాతో సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలే తప్ప ఆయుధ ప్రయోగం వలన ఫలితం లేదని అంటున్నారు. అమెరికన్లకు ఈ మంచి మాటలు తలకెక్కుతాయా?
కొరియాపై యుద్దానికి దిగితే జరిగే నష్టం గురించి అమెరికా రక్షణ మంత్రి జేమ్సు మాటిస్ అనూహ్యమైన విషాదం చోటు చేసుకుంటుందని చెప్పాడు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ తదితర ప్రాంతాలను లక్ష్య ంగా చేసుకొని వుత్తర కొరియా 8000 ఫిరంగులను ఎక్కు పెట్టి వుంచింది. ఒక వేళ అమెరికా దాడులను ప్రారంభించి క్షిపణులను వదిలితే అవి ఆకాశంలో ప్రయాణించి వుత్తర కొరియాను చేరే లోపలే ఆ ఫిరంగులు తమపని కానిస్తాయి.తొలి కొద్ది గంటలలోనే లక్షల మంది దక్షిణ కొరియన్లు మరణిస్తారు. అక్కడ వున్న లక్షా 30వేల మంది అమెరికన్లు కూడా నాశనం అవుతారు.
రెండవ ప్రపంచ యుద్దం తరువాత, 1953లో వుత్తర కొరియాపై యుద్ధానికి దిగిన అమెరికా వైఖరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వుత్తర కొరియాను ఏ మాత్రం భయపెట్టక పోగా చివరికి అమెరికు సమీపంలోకి క్షిపణులను వదిలేంతగా కొరియా ఆయుధ సామర్ద్యాన్ని సముపార్జించుకుంది.తన అత్యంత ఆధునిక ఆయుధాల ప్రయోగశాలలుగా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లను వుపయోగించుకున్న అమెరికాకు అక్కడ తీవ్రనష్టాలు, ఎదురుదెబ్బలే తప్ప విజయాలు దక్కలేదు. అలాంటిది అమెరికాతో ఢీ అంటే ఢీ అనేంతగా ఎదిగిన చైనా పక్కన వుండగా వుత్తర కొరియాపై దాడి చేసి నాశనం చేస్తామని ట్రంప్ చెబితే నమ్మేవారెవరైనా వుంటారా ?