Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

అసలేమనుకుంటున్నారీ కాషాయ తాలిబాన్లు మన అమ్మాయిల గురించి ? అమ్మాయిలు చదువుకోవద్దా ? చెప్పండీ ఆ విషయం స్పష్టంగా. ఆకుపచ్చ తాలిబాన్లకున్న నిజాయితీ కూడా వీరికి లేదు. వారు అనుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. వీరు అడుగడుగునా ఆటంకాలు, అవమానాలు కలిగిస్తూ, వ్యక్తిత్వాలను దెబ్బతీస్తూ ఆడ పిల్లలను చదివించటం ఎందుకురా బాబూ అనుకునేట్లుగా తలిదండ్రులలో ఆలోచనలు కలగచేస్తున్నారు. పొమ్మన కుండానే పొగబెడుతున్నామని లోలోపల చంకలు కొట్టుకుంటున్నారా ? అసలేమనుకుంటున్నారు వీరు మన అమ్మాయిల గురించి?

గ్యాన్‌ దేవ్‌ ఆహుజా అనే రాజస్ధాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ గతేడాది ఫిబ్రవరిలో జవహర్‌లాల్‌ విశ్వవిద్యాలయం గురించి చేసిన నీచమైన వ్యాఖ్యలను మన సభ్య సమాజం ఎందుకు తీవ్రంగా పట్టించుకోలేకపోయింది అన్నది ప్రశ్న. ఏమన్నాడతడు ? అక్కడ రోజుకు మూడువేల కండోమ్‌లు, రెండు వేల మద్యం సీసాలు, 50వేల బొమికలు, నాలుగువేల బీడీలు, పదివేల సిగిరెట్‌ ముక్కలు పోగుపడతాయట. ప్రస్తుతం మన రక్షణ మంత్రిగా వున్న నిర్మలా సీతారామన్‌ కూడా అక్కడి విద్యార్ధినే, ఆమె కూడా బహిరంగంగా ఆ ఎంఎల్‌ఏ నోరు మూయించలేదు. ఇంకా ఎందరో అక్కడ చదివిన బిజెపి నేతలు అదే మౌనం పాటించారు, ఎందుకో తెలియదు. ఈ ఒక్క విద్యా సంస్ధలో చదివే వారి గురించే కాదు అనేక కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులను వ్యతిరేకించే ప్రతి చోటా ఇలాంటి చౌకబారు ప్రచారాలు, నిందలతో విద్యార్ధులను బెదిరించేందుకు ఇలాంటి ఎత్తుగడలు అనుసరిస్తున్నారు.

అది బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జాతీయ విద్యాలయాల ఏర్పాటులో పండిట్‌ మదన మోహన్‌ మాలవీయ నాయకత్వంలో 1916లో ఏర్పడిన విశ్వవిద్యాలయం ఇది. జాతీయోద్యమ స్ఫూర్తితో తెలుగు ప్రాంతాల నుంచి ఎందరో అక్కడ చదివి స్వాతంత్య్ర సమరంలో, తరువాత కమ్యూనిస్టు కార్మిక వుద్యమాలలోకి దూకేందుకు ప్రాతిపదిక వేసిన సంస్ధ అది. నేడు మనువాదుల నిలయంగా, ప్రయోగశాలగా మారింది.

బేటీ పఢావో, బేటీ బచావో అన్న నినాదం ఇచ్చిన వారి పాలనలో నిశ్చింతగా చదువుకుంటూ సురక్షితంగా వుండొచ్చు అనుకుంటున్న చోట సెప్టెంబరు మూడవ వారంలోసూర్యుడు అస్తమించక ముందే అదీ ప్రధాని నరేంద్రమోడీ పర్యటనకు ముందు రోజు సాయంత్రం, ముగ్గురు యువకులు ఒక విద్యార్ధినితో అనుచితంగా ప్రవర్తించారు. దాని గురించి వెంటనే వార్డెన్‌కు ఫిర్యాదు చేస్తే అసలు ఆ సమయంలో నువ్వెందుకు అక్కడ వున్నావ్‌ అని ఎదురు ప్రశ్న వచ్చిందట. దాంతో మిగతా అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ కేవలం ముట్టుకోవటమేగా, అంతకు మించి ఏం చేయలేదటకదా అయినా ప్రధాని పర్యటన ముగిసింతరువాతే దాని గురించి చూద్ధాం అని నిర్లక్ష్య సమాధానాలిచ్చారట. విసిని కలుసుకుంటామంటే కుదరదు పొమ్మని అనుమతించలేదట. ఆ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ గిరీష్‌ చంద్ర తిఫాఠి ఒక పరివార్‌ కార్యకర్త అన్నది బహిరంగ రహస్యం. మిగతా అధికారులు కూడా సాక్షి మహారాజ్‌ వంటి వారి నుంచి స్ఫూర్తి పొందిన వారే. అందుకే విద్యార్ధినులు రాత్రి ఎనిమిది గంటలలోగానే రూములకు చేరుకోవాలి. పది గంటల తరువాత ఎవరూ సెల్‌ఫోన్లు వుపయోగించకూడదు. పురుష విద్యార్ధుల మాదిరి యువతులు కాంటీన్లలో ఎలాంటి మాంసాహారం తీసుకోకూడదు. ఇలాంటి లక్ష్మణ రేఖలను ఎన్నింటినో అక్కడి విద్యార్ధినులు పాటించాల్సి వుంది. ఇంతకూ వేధింపు జరిగిన సమయం బయట తిరగటానికి అనుమతించిన వ్యవధిలో, అందునా సూర్యాస్తమయం కూడా కాలేదు.

విశ్వవిద్యాలయంలో ప్రధాని కార్యక్రమం లేదు, అది వున్న రోడ్డు మార్గంద్వారా ప్రయాణిస్తారంతే. కడుపు మండిన విద్యార్ధినులు గంగమ్మ, అవులు పిలిస్తే పరిగెత్తుకొచ్చే మోడీ గారూ అకతాయిలు మమ్మల్ని అల్లరి చేస్తున్నారు, అవమానిస్తున్నారు, మా మొర వినండి మేం పిలుస్తున్నాం అంటూ ఒక గేటు దగ్గర ఆందోళనకు దిగారు. దాంతో వేరే మార్గంలో ప్రధాని ప్రయాణం ముగిసే వరకు మిన్నకుండి తరువాత దొరికిన వారిని దొరికినట్లు మగపోలీసులతో చితకబాదించారు. ఒక యోగి పోలీసులు ఎలా వుంటారో తొలిసారిగా అమ్మాయిలకు రుచి చూపించారు. వందలాది మందిపై కేసులు బనాయించారు. ఇదంతా ఆడపిల్లలను వేధించిన వారిని పట్టుకొనే క్రమంలో కాదు, దానిని ఎదిరించిన వారి నోరు మూయించే పక్రియలో భాగం. మోడీ-యోగి సర్కార్‌ నిజరూపం గురించి తెలుసుకోండమ్మా, తెలుసుకోండయ్యా అని వేల గొంతులు చెప్పినా తలకు ఎక్కనిది ఒక్క రోజు లాఠీ, రెండో రోజు కేసులు అరటి పండు వలచినట్లు వేలాది మంది విద్యార్ధినులకు, అన్ని వేలకు మరికొన్ని రెట్లు ఎక్కువగా తలిదండ్రులకు సామూహిక జ్ఞానబోధ చేశాయంటే అతిశయోక్తి కాదు.

ఒకనాడు ప్రాచ్య దేశాల ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంగా ఖ్యాతికెక్కిన విశాలమైన బనారస్‌ విశ్వవిద్యాలయంలో చీకటి పడితే స్వేచ్చగా సంచరించటానికి సరిపడా విద్యుత్‌ వెలుగులు కూడా లేవని ఆడపిల్లలు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. ఎవరు అధికారంలో వున్నా అదే తీరు నడిచింది. బిజెపి అందుకు మినహాయింపు కాదు. బహుశా దేశంలో 30వేల మందికి పైగా విద్యార్ధులున్న విశ్వవిద్యాలయం ఇదేనేమో ? మీ ఆడపిల్లలు చదువుకోవాలంటే ముందు వారిని రక్షించండి అన్నది ఆందోళన జరిగిన రాత్రి ఆడపిల్లలు ప్రదర్శించిన ఒక ప్లేకార్డులోని అంశం. ఆందోళన చేశారు. ఎన్నడూ బయటకు రాని వారు వీధులకెక్కారు. వారేం చెబుతారో విందామని కనీసం ముఖ్యమంత్రి యోగి అయినా వారి వద్దకు వచ్చి ఓదార్చాల్సిన అవసరం వుందా లేదా. అలాంటి దేమీ లేకపోగా ఆడపిల్లలు కనుక బయటి నుంచి సంఘవ్యతిరేకశక్తులు ప్రవేశించి కుట్రచేశాయంటే చాలా బాగోదు కనుక యోగి గారు అమ్మాయిలలోనే సంఘవ్యతిరేకశక్తులు ఆందోళనకు కారణమంటూ సెలవిచ్చారు. సరే వంది మాగధులు కుట్ర గురించి చెబుతున్నారనుకోండి.

అంటే ఏమిటటా ? ప్రధాని పర్యటనకు ముందు రోజు ముగ్గురు ఆకతాయిలను ప్రతిపక్షాలు పని గట్టుకొని బనారస్‌ విశ్వవిద్యాలయానికి పంపించాయి. వారిచేత ఒకమ్మాయిని అల్లరి చేయించాయి. ఆమె చేత అధికారులకు ఫిర్యాదు చేయించాయి. అధికారులతో రెచ్చగొట్టేట్లు మాట్లాడించాయి. విద్యార్ధినులను ఆందోళనకు దించాయి. ప్రధాని పర్యటన ముగిసేవరకు పోలీసులను అదుపు చేసి తరువాత దాడి చేయించాయి. రెండో రోజు వందలాది మందిపై కేసులు పెట్టించాయి. తరువాత కొంత మందిపై చర్యలకు వుపక్రమింప చేశాయి. అని జనం అనుకోవాలి. మరి ఇంత జరుగుతుంటే, కూత వేటు దూరంలో ప్రధాని కార్యక్రమాలు వుంటే నిఘా యంత్రాంగం, యోగి సర్కార్‌ ఏ గుడ్డి గుర్రానికి…. అబ్బే ఇది పాత సామెత, ఏ కర్రావు పేడెత్తుతూ తెల్లావు మూత్రాన్ని వడిసి పడుతున్నట్లు ?

నరేంద్రమోడీ అంటే సమయం వచ్చినపుడు నోర్మూసుకుంటారు గానీ విద్యార్ధినులు వారి తలిదండ్రులకు అంత ఖర్మేం పట్టింది. ముందుగానే దసరా సెలవుల పేరుతో విశ్వవిద్యాలయాన్ని మూసివేశారు. దాంతో ప్రస్తుతం వేలాది మంది విద్యార్ధినులు హాస్టళ్లను ఖాళీ చేసి తమ గ్రామాలు, పట్టణాలకు వెళ్లిపోయారని వార్తలు. ప్రధానంగా వుత్తర భారత్‌లోని వుత్తర ప్రదేశ్‌, బీహారు, రాజస్ధాన్‌ తదితర రాష్ట్రాలకు చెందిన వారంతా అక్కడ వూరుకుంటారా ? ఎవరి మీద కేసులు పెట్టారో తెలియదు, తమ మీద ఏ తప్పుడు ప్రచారం చేస్తారో తెలియదు. వారి దసరా, అనంతర కబుర్లు కూడా ఇవే. ఇంటి దగ్గర వున్ననన్ని రోజులు ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తే జరిగిందేమిటో, మోడీ-యోగి సర్కార్‌ నిర్వాకం ఏమిటో చర్చ జరగకుండా వుంటుందా? కొంతమంది అయినా కొత్త కార్యకర్తలు తయారవుతారు. అందుకే నష్ట నివారణ చర్యలలో భాగంగా కొంత మంది వున్నతాధికారులచేత రాజీనామా, కొంత మంది పోలీసులు, విశ్వవిద్యాలయ అధికారులపై కొన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. అసమర్దంగా అంతకంటే బాధ్యతా రహితంగా వ్యవహరించిన వైస్‌ ఛాన్సలర్‌ను ఏదో ఒక పేరుతో ఇంటికి పంపే ఏర్పాట్లలో వున్నట్లు వార్తలు. మన సంఘపరివార్‌ వ్యక్తే కదా అని మూసిపెడితే విశ్వవిద్యాలయం పాచిపోతుంది.

ఎక్కడ శవం కనపడితే అక్కడకు రాబందులు వాలినట్లుగా ఎక్కడ బిజెపి ప్రభుత్వంపై విద్యారు&ధలు ఆందోళన చేస్తుంటే అక్కడకు కాషాయ ట్రోల్‌ సేనలు దాని మీదకు దిగిపోతాయి. బనారస్‌ విషయంలో కూడా అదే జరిగింది. వుద్యమంలోకి కమ్యూనిస్టులు ప్రవేశించారని తెలుసుకొని తాను వైదొలుగుతున్నట్లు ఒక యువతి చెప్పిందట. ఇదంతా అమెరికా పోలీసు కట్టుకధల కాపీ. అక్కడ కూడా విద్యాలయాల్లో ఏదైనా జరగ్గానే వాటి వెనుక కమ్యూనిస్టులున్నారని మరుసటి రోజు కథనాలు వెలువడతాయి. రెండవది అంతకంటే విడ్డూరమైన ప్రచారం. బనారసులో వుద్యమం ప్రారంభం కాగానే ఎన్‌డిటివీ నుంచి ఒక వ్యాను వచ్చిందట, దాని వెనుకే మరో రెండు వ్యాన్లు వచ్చాయట. వాటిలోంచి ఐదుగురు విద్యారి&ధనులు దూకి వుద్యమకారులతో కలసిపోయారట. వెంటనే సదరు టీవీ విలేకరి ఇతరులతో గాక వారితోనే మాట్లాడించిన వెంటనే వారు అక్కడి నుంచి మాయమయ్యారట. ఇది ఒక నకిలీ వార్త కధనం. ఇక్కడ మన బుర్రను వుపయోగించాల్సి వుంది. అదే వాస్తవం అయితే ఎన్‌డిటివీ వార్తలో కనిపించిన అమ్మాయిలు ఎవరో కనిపెట్టటం కష్టమా? వారు అక్కడి వారు కానట్లయితే ఎవరో ఏమిటో వెల్లడించాలి. ఇలాంటి కట్టుకధలు రాయటం, ఎన్డీటీవిపై బురదజల్లటానికి తప్ప మరొకటి కాదు. నకిలీ వీడియోలనే తయారు చేసిన వారికి ఇలాంటి కట్టుకధలు ఒక లెక్కా ?

బనారస్‌ వుదంతం చూసిన తరువాత ఒక సున్నితమైన సమస్య పట్ల ఎలా వ్యవహరించాలో కూడా విద్యాసంస్ధల వున్నతాధికారులకు తెలియదని, వారి చర్మాలు ఎంతగానో మొద్దుబారి పోయాయనన్నది స్పష్టమైంది. ఒక యువతి తనను అల్లరి పెట్టారనో, అఘాయిత్యం జరపబోయారనో నిర్దిష్ట ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావటమంటేనే జరగకూడనిదేదో జరిగిందనుకోవాలి. ఫిర్యాదు చేయటానికి వెళ్లిన బాధితులనే నేరగాళ్ల మాదిరి పోలీసులు ప్రశ్నించినట్లుగా విశ్వవిద్యాలయ అధికారులు అసలు ఆ సమయంలో అక్కడ నువ్వెందుకున్నావ్‌, నిన్నే ఎందుకు అలా చేశారు, ఆ డ్రస్సేమిటి, ఆ పోకడేమిటి అన్నట్లు ప్రవర్తించటమే సమస్య మరో రూపం తీసుకోవటానికి దారితీసింది. యువతి పట్ల చిన్నపాటి వేధింపును ప్రధాని రాక సందర్భంగా కావాలని ముందుకు తెచ్చి రాజకీయం చేశారని విసీ గిరీష్‌ చంద్ర త్రిపాఠీ వర్ణించారు. తొలుత స్పందించిన వారు సక్రమంగా వ్యవహరించి వుండాల్సిందని వారణాసి కమిషనర్‌ చేసిన వ్యాఖ్యను విసి అంగీకరించలేదు. ప్రతివారు సక్రమంగా వ్యవహరించి వుంటే విశ్వవిద్యాలయ ప్రధాన ప్రోక్టర్‌ ప్రొఫెసర్‌ ఓఎన్‌ సింగ్‌ నైతిక కారణాలతో రాజీనామా ఎందుకు చేసినట్లు ? అసలు లాఠీచార్జి చేయాల్సినంతగా శాంతి భద్రతలేమి అదుపు తప్పాయి. ఇప్పుడు చేసిన పొరపాటును కప్పిపుచ్చుకోవటానికి మరికొన్ని తప్పులతో ఏదో ఒక నివేదికను జనం ముందు పడేస్తారు, తాత్కాలికంగా అయినా విద్యార్ధినుల నోరు మూయిస్తారు. దేశంలో మితవాద భావజాల పట్టులో వున్న వుత్తరాది ప్రాంతానికి చెందిన ఆమ్మాయిల్లో ఇంత ప్రతిఘటన తెగింపు ఎలా వచ్చిందన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇది బిజెపి వంటి మనువాద, ఇతర ఫ్యూడల్‌ శక్తుల పట్టులో వున్న పార్టీలకు ఆందోళన కలిగించే పరిణామం అయితే ప్రగతివాద శక్తులు హర్షించే అధ్యాయం. అన్యాయం, అక్రమాలను ప్రతిఘటించటానికి ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అని బిజెపిఏ కాదు అధికార పులినెక్కిన ఏ పాలకపార్టీ తలకెక్కించుకోదని వేరేచెప్పాల్సిన పని లేదు.