Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

మిన్ను విరిగి మీద పడ్డా తన అంతరాత్మ అయిన అమిత్‌ షాతో మనకు లాభమో నష్టమో చెప్పు, అవసరమైతే నోరు విప్పుతా అంటారు ప్రధాని నరేంద్రమోడీ. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు దాన్నే నిర్ధారిస్తున్నాయి. ప్రయోజనం లేని మొగుడు తోటలో వుంటేనేం కోటలో వుంటే ఏమిటి ప్రయోజనం అన్న సామెత మాదిరి మోడీ వచ్చి మూడు సంవత్సరాల నాలుగు నెలలైంది ఆయన నోరు తెరిస్తే ఏమిటి మూస్తే ఏమిటి అని జనం అనుకోవటం ప్రారంభించారు. ఆ పెద్ద మనిషి మూసుకున్నా దేశం కోసం మేం నోరు తెరవక తప్పదంటున్నారు బిజెపి నేతలు. మోడీ పోయినా పార్టీని దక్కించుకోవాలి కదా మరి ! ఇంతకాలం చెప్పిన వాటికి భిన్నంగా ఇప్పుడు వాస్తవాలను చెప్పినా జనం నమ్ముతారా ? అన్నది అసలు సమస్య !

డాలరుతో మారకంలో రూపాయి బలపడినట్లే కనిపించి తిరిగి పతనం అవుతోంది. ఆ క్రమంలో అది పడుతూ లేస్తూ వుంది. సెప్టెంబరు ఎనిమిదిన గరిష్ట స్ధాయిలో రు.63.78 వున్నది కాస్తా ఆ తరువాత 194పైసల విలువ కోల్పోయింది. బుధవారం నాడు 65.72కి చేరింది. శుక్రవారం నాడు 65.31గా వుంది. అంతర్జాతీయ మార్కెట్‌ ముఖ్యంగా డాలరుతో మన బంధం ముడివేసుకున్న కారణంగా, మన పాలకులు గత 70సంవత్సరాలుగా అనుసరిస్తున్న దివాలాకోరు ఆర్ధిక విధానాల పర్యవసానంగా కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా మన రూపాయి పరిస్ధితి తయారైంది. విలువ తగ్గినా, పెరిగినా కార్పొరేట్లకు పోయిందేమీ లేదు. ఆ కారణాలతో దివాలా తీసి బలవన్మరణాలకు పాల్పడిన పెద్దలు ఒక్కరంటే ఒక్కరు కూడా వున్నట్లు మనకు వార్తలు లేవు. వారు బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులను ఎగవేయటం, మన్మోహన్‌, మోడీ వంటి పాలకులు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు బ్యాంకులకు ఎగవేసిన కార్పొరేట్ల అప్పులను ఏటా వేల కోట్ల వంతున రద్దు చేయటం తప్ప. బ్యాంకులు చేశాయా, పాలకులు చేయించారా అన్నది జనానికి అనవసరం మనవి ప్రభుత్వ రంగ బ్యాంకులు కనుక పాలకులే మనకు బాధ్యులు. 2016 మార్చి వరకు అంతకు ముందు ఐదు సంవత్సరాలలో రద్దు చేసిన మొత్తం బకాయి 2,25,180 కోట్ల రూపాయలు. అంతకు ముందు ఆరు సంవత్సరాలవి కూడా కలుపుకుంటే రెండున్నరలక్షల కోట్ల రూపాయలు. రుణగ్రస్తులైన సామాన్య వ్యాపారులు, జనమే గగ్గోలు పెట్టి ఆత్మహత్యలకు పూనుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది తప్ప పెద్దలకు లేదు.విజయమాల్య వంటి వాడైతే అమ్మాయిలను వెంటేసుకొని మరీ పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. గత ఆరునెలలుగా రూపాయి బలపడితే కొంత మంది వ్యాపారులు సంతోషించారు, ఇప్పుడు కొంత మంది వ్యాపారులతో పాటు జనమంతా గగ్గోలు పెట్టే దిశంగా ఈ పతనం కొనసాగుతుందా అని పిస్తోంది. రూపాయి విలువ పెరిగినపుడే పెట్రోలు ధరలను మండిస్తుంటే ఇదేంట్రా బాబూ అనుకుంటున్న జనానికి రూపాయి విలువ పడిపోయిందంటే మరింతగా బాదుడు తప్పదు. అయినా సరే నరేంద్రమోడీ నోరు విప్పరు, ఇలాంటి మేళాన్నా మనం తలకెక్కించుకున్నాం !

కొత్తల్లుడు నోరు విప్పకపోతే మాఅల్లుడి పలుకే బంగారం అని అత్తామామలు మురిసి పోతారు, ఏదైనా వుంటే గదిలోకి తీసుకు వెళ్లి అమ్మాయికే చెబుతాడు అని అత్తింటి వారు సిగ్గుపడుతూ తొలి రోజుల్లో గొప్పగా చెప్పుకుంటారు. కానీ పాతపడిన తరువాత సమయం వచ్చినపుడు కూడా నోరు తెరవకపోతే మీ ఆయనకదేం జబ్బే అని అడిగితే నేనూ మోసపోయా, ఆయనకు నత్తి, మాట్లాడటం సరిగా రాదు అని కూతురు అసలు విషయం చెప్పక తప్పదు. మా మోడీ ఎలాగూ మాట్లాడరు కనుక మేం మాట్లాడక తప్పదు అంటున్నారు బిజెపి అగ్రనేతలలో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత సిన్హా . ఆర్ధిక రంగాన్ని చిందరవందర చేసిన మంత్రి అరుణ్‌జైట్లీ గురించి ఇప్పటికీ నేను నోరు విప్పక పోతే నా బాధ్యతలను విస్మరించిన వాడిని అవుతాను. పార్టీలో పెద్ద సంఖ్యలో వున్నటువంటి, బయట మాట్లాడటానికి భయపడే వారి తరఫున నేను మాట్లాడుతున్నాను అన్నారాయన. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. నోట్ల రద్దు, జిఎస్‌టి ఇలా ప్రతి చర్యనూ మోడీకి ఆపాదించిన పూర్వరంగంలో ఆయన పూలనే కాదు రాళ్లను కూడా భరించాల్సి వుంటుంది. అయితే ‘ అంత సహనం’ ప్రస్తుతం బిజెపిలో లేదు. అందుకే లోతు తెలుసుకొనేందుకు ఆంచులను తాకి చూస్తున్నట్లుగా యశ్వంత సిన్హా ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీని ఎంచుకున్నారు. ఆయనేమీ తక్కువ తినలేదు, అసలు విషయాలు చెప్పకుండా 80 ఏండ్ల వయస్సులో వుద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడని సిన్హాను ఎత్తిపొడిచారు. అంతే కాదు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా వున్న సిన్హా కుమారుడు జయంత సిన్హా చేత పోటీగా తండ్రి వ్యాసానికి ఖండనగా మరో పత్రికలో వ్యాసం రాయించారు.మంత్రిత్వశాఖకు సంబంధం లేని తమ కుమారుడి చేత వ్యాసం రాయించిన పెద్దలు మరి అతనిని సహాయ ఆర్ధిక మంత్రిగా ఎందుకు తొలగించారో అని యశ్వంత సిన్హా ఎత్తి పొడిచారు. కొడుకు వ్యాసంలో పెద్ద పసేమీ లేదనుకోండి.

ఇంతకీ సీనియర్‌ సిన్హా చెబుతున్నదేమిటి? ప్రయివేటు పెట్టుబడులు గత రెండు దశాబ్దాల కనిష్టానికి తగ్గిపోయాయి. పారిశ్రామిక వుత్పత్తి మొత్తంగా కుప్పకూలిపోయింది. వ్యవసాయం సంక్షోభంలో వుంది. పెద్ద సంఖ్యలో వుపాధి కల్పించే నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందుల్లో వుంది. ప్రతి త్రైమాసికానికి అభివృద్ధి రేటు పడిపోతూ 5.7శాతానికి చేరింది. ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడుకు నోట్ల రద్దు ఆజ్యం పోసింది. ప్రస్తుత ప్రభుత్వం 2015లో జిడిపి లెక్కింపు పద్దతిని మార్చింది. ఫలితంగా రెండువందల ప్రాతిపదిక పాయింట్లు పెరిగి అభివృద్ధి రేట్లు రికార్డయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుత ఆర్ధిక సంవత్సర తొలి త్రైమాసిక వృద్ధి రేటు 5.7, అదే పాత లెక్కల ప్రకారం అయితే 3.7 లేదా అంతకంటే తక్కువ. నరేంద్రమోడీ నోరు మూసుకొని గానీ ఇతర మంత్రులు, బిజెపి నేతలు తెరిచిగానీ ఈ అంకెలను సవాలు చేసే స్ధితిలో లేరు.

దేశ ఆర్ధిక వ్యవస్ధకు వుద్దీపన కలిగించనున్నారనే వార్తలు రావటంతోనే వరుసగా వారం రోజుల పాటు స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ఇంటి పెద్ద సామర్ధ్యం మీద ఒకసారి అపనమ్మకం కలిగిన తరువాత బయటి వారే కాదు జాగ్రత్తగా గమనిస్తే ఇంట్లో వారే ఎవరికి వారు జాగ్రత్త పడటం వుమ్మడి కుటుంబాల్లో తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ పరిస్ధితి అలాగే వుందంటే అతిశయోక్తి కాదు. యశ్వంత సిన్హా చెప్పినట్లు గణాంక విధానం మార్చిన కారణంగా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఒక ఏడాది తరువాత అభివృద్ధి ఎంతో పెరిగినట్లు కనిపించింది. అది వాపు తప్ప బలుపు కాదని అప్పుడే ఎందరో చెప్పారు. ఇప్పుడు రుజువైంది. ఇంకా వాపుగానే కనిపిస్తున్నప్పటికీ మూడు సంవత్సరాల కనిష్టానికి మన అభివృద్దిరేటు పడిపోయింది. నిజానికి ఈ పరిస్ధితిని అధికారంలో వున్న పెద్దలు వూహించలేదా అంటే నమ్మటం కష్టం. మార్కెట్లో చెలామణి అవుతున్న నల్లధనాన్ని వెలికి తీయటానికి పెద్దనోట్ల రద్దు అనే తప్పుడు ఇచ్చిందెవరో మోడీ పదవీచ్యుతుడై ఎన్‌డిఏలో ముసలం పుట్టిన తరువాత గానీ బయటకు రాదు. దానితో నాలుగు లక్షల కోట్లరూపాయల రాబడి అప్పనంగా ప్రభుత్వానికి వస్తుందని ఆ మొత్తంతో కొన్ని మెరుపులు మెరిపించి మంచి రోజులొచ్చయనే ప్రచార హోరులో మధ్యంతర ఎన్నికలతో మరో ఐదు సంవత్సరాలకు ఓట్లు కొల్లగొడదామని వేసిన అంచనాలు నీరు గారిపోయాయి. మోడీ ప్రతిష్టనిర్మాణంలో భాగంగానే నోట్ల రద్దు ఆయన తీసుకున్న నిర్ణయమే అని ఆపాదించిన వారు అదిప్పుడు శాపంగా మారిందని అర్ధమైన తరువాత తేలుకుట్టిన దొంగల మాదిరి వున్నారు.ముఖ్యమంత్రిగా వుండగా తీవ్రంగా వ్యతిరేకించిన జిఎస్‌టి అమలు మంచి చెడ్డలను పూర్తిగా ఆధ్యయనం చేయకుండానే ఆదరాబాదరా అమలులోకి తెచ్చారు. ఈ రెండు చర్యలూ తాత్కాలికంగా అయినా ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనానికి కారణమయ్యాయని మోడీ సర్కారు తప్ప అందరూ అంగీకరిస్తున్నారు. అంతా బాగుంది, ఏదైనా వుంటే అది తాత్కాలికమే అని సొల్లు కబుర్లు చెబుతున్న పెద్దలు వాటినే కొనసాగిస్తే ఒక దారి. కానీ ఆర్ధిక వ్యవస్ధను తిరిగి పని చేయించేందుకు ఒక వుద్దీపన పధకం గురించి కసరత్తు చేస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ఆరుణ్‌జైట్లీ సెప్టెంబరు 20న చేసిన ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి.

మరో ఆరు రోజుల తరువాత గత మూడు సంవత్సరాలుగా మూలన పడవేసిన ప్రధాని ఆర్ధిక సలహా మండలి దుమ్ముదులిపారు. ఇది ఆర్ధిక వ్యవస్ధలో నెలకొన్న భయాలను మరింత పెంచేదే తప్ప తగ్గించేది కాదు. ఇప్పటి వరకు ద్రవ్యలోటు 3.2శాతం కంటే పెరగరాదు అన్న ఆంక్షలను చూపి అన్ని రకాల పెట్టుబడులు, అభివృద్ధి పనులకు కోత పెట్టిన సర్కార్‌ ఇప్పుడు కట్టుకున్న ఆ మడిని పక్కన పెట్టి ఆర్ధిక వ్యవస్ధలోకి అదనంగా 50వేల కోట్లను కుమ్మరించి ఆర్ధిక మందగింపును ఆపగలమా అని సర్కార్‌ ఆలోచిస్తున్నట్లు రాయిటర్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న మంద్యానికి కారణంగా గత మూడు సంవత్సరాలుగా గ్రామీణ ఆర్ధిక వ్య వస్ధలో రైతాంగ వుత్పత్తులకు ధరలు పడిపోవటం ఒక ప్రధాన కారణంగా అనేక మంది చెబుతున్నారు. దేశ బ్యాంకింగ్‌ వ్యవస్ధలో నిరర్ధక ఆస్థులు 2013 మార్చి నాటికి 1.56లక్షల కోట్ల రూపాయలు కాగా ఈ ఏడాది మార్చినాటికి 6.41లక్షల కోట్లకు పెరిగాయి. రుణాలు ఇచ్చింది మన్మోహన్‌ సర్కారే అనుకుందాం వసూలు చేయకుండా మోడీ సర్కార్‌ను అడ్డుకున్నదెవరు? యుపిఏ హయాంలో విజయమాల్య వేల కోట్లు తీసుకొని ఎగవేసి విదేశాలకు పారిపోతుంటే నరేంద్రమోడీ సర్కార్‌ వెళ్లిరండి సార్‌ అని విమానం ఎక్కించిందా లేదా ? ప్రతి వారూ పరిశ్ర మలు, వ్యాపారాలకు వడ్డీ రేటు తగ్గించమని కోరేవారే తప్ప అదే సూత్రం వ్యవసాయానికి ఎందుకు వర్తింపచేయరని అడుగుతున్నవారేరి?

నరేంద్రమోడీ సర్కార్‌ అప్పుచేసి పప్పుకూడు అన్నట్లుగా వ్యవహరిస్తోందంటే చాలా మంది నమ్మరు. మన ప్రభుత్వాలు ఏటా ఎంత మొత్తం అప్పు తెచ్చుకోవాలో, దాన్నెట్లా తీర్చుకోవాలో ముందే నిర్ణయించుకుంటాయి. ఆ మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో పన్నెండు నెలల్లో వంద రూపాయల అప్పు తీసుకోవాల్సి వుంటే మొదటి నాలుగు నెలల్లోనే 92 తీసుకొని అనుభవజ్ఞుడైన నరేంద్రమోడీ ఖర్చు పెట్టేశారు. అందువలన ఏ మాత్రం అదనంగా ఖర్చు చేయాలన్నా అప్పులన్నా తేవాలి లేదా అదనంగా నోట్లన్నా అచ్చువేయాలి. మొదటి పని చేస్తే అభివృద్ధి పనులు ఆగిపోయి అప్పులు తీర్చుకోవాల్సి రెండోది జరిగితే జనానికి ధరలు పెరుగుతాయి. బలి ఇవ్వటానికి మంచి యువకుడి కోసం దుర్భిణీ వేసి వెతికిన పాతాళభైరవి మాంత్రికుడి మాదిరి నరేంద్రమోడీ ఏదైనా మంత్రదండం దొరక్క పోతుందా అని వెతుకుతున్నారు. ఏదైనా పిచ్చిపని చేసి జనం దృష్టిని మళ్లిస్తే తప్ప అల్లావుద్దీన్‌ అద్బుత దీపాలకు, మంత్రదండాలకు పరిష్కారమయ్యేవి కాదిప్పుడు ముసురుకున్న సమస్యలు. వచ్చేటపుడు మంచిదినాలను తెస్తున్నా అన్న మోడీ చెడ్డదినాలతో పోయాడు అని పించుకుంటారా ?