Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

‘కమ్యూనిజం విజయం సాధిస్తుంది ‘ ‘ నిన్ను ఏదైనా సందేహం తొలుస్తూ వుంటే విజయం సాధించే వరకూ ముందుకు సాగిపో ‘ సెప్టెంబరు 24,25 తేదీలలో ఒక అమెరికన్‌ సైనికుడు చేసిన ట్వీట్లివి. అతడే సెకెండ్‌ లెప్టినెంట్‌ కల్నల్‌ స్పెన్సర్‌ రపోనే. మొదటిది రపోనే ఆత్మవిశ్వాసం, రెండవది ప్రముఖ విప్లవకారుడు చే గువేరా సుప్రసిద్ద నినాదం. రపానే అల్లరిచిల్లరి యువకుడు కాదు. అమెరికాలోని ప్రతిష్టాత్మక మిలిటరీ శిక్షణా కేంద్రం వెస్ట్‌పాయింట్‌లో గతేడాది అతను గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. అక్కడ ప్రవేశం దొరకాలంటే ఎంతో ప్రతిభవుంటే తప్ప అసాధ్యం.

అమెరికాలో ఎవరినైనా వేధించాలనుకుంటే కమ్యూనిస్టు అని ముద్ర వేయటం పరిపాటి. ఇంటి చుట్టుపక్కల వారు కూడా ఆ ముద్రపడిన వారిని దగ్గరకు రానివ్వరు. అంతగా అక్కడి పాలకులు కమ్యూనిజం, కమ్యూనిస్టుల గురించి వ్యతిరేకత నూరి పోశారు. అలాంటి అప్రజాస్వామిక, దుర్మార్గపు దేశంలో స్పెన్సర్‌ రపోనే చే గువేరా అభిమానినని, కమ్యూనిజం విజయం సాధిస్తుందని ప్రకటించటం అమెరికా యువతలో సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాలంపై పెరుగుతున్న ఆసక్తి, అవును నేను సోషలిస్టును, కమ్యూనిస్టునే ఏం చేస్తారో చేసుకోండి అనే తెగింపు ధోరణికి ఒక చిహ్నంగా చెప్పవచ్చు. దీనర్ధం తెల్లవారేసరికి అక్కడేతో పెద్ద మార్పు జరుగుతోందని కాదు. ప్రతి సంఘటన పెను మార్పులకు దారితీయదు, అదే విధంగా సంభవించిన ప్రతి పెనుమార్పు చిన్న ఘటనగానే ప్రారంభం అవుతుందని చెప్పటమే ఇక్కడ వుద్దేశ్యం.

మొదటి ప్రపంచయుద్ధానికి ముందు జర్మన్‌ సామాజికవేత్త వెర్నర్‌ సోమ్‌బార్ట్‌ రాసిన ఒక వ్యాసానికి అమెరికాలో సోషలిస్టులు ఎందుకు లేరు అని శీర్షిక పెట్టారని, ఇప్పుడు దాన్నే మరోవిధంగా అమెరికాలో సోషలిస్టులు ఎందుకు తయారవుతున్నారని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందని హరాల్డ్‌ మేయర్సన్‌ అనే ఒక జర్నలిస్టు గతేడాది రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యమా లేక ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంత తప్పుడు ప్రచారం చేసినా సోషలిజం పట్ల జనంలో వున్న సానుకూల దృక్పధానికి చిహ్నమా ? యువతరం ఆలోచించాలి. ఏదైనా ఒక వ్యవస్ధ విఫలమై ఆటంకంగా మారితేనే దానికంటే మెరుగైన ప్రత్యామ్నాయం గురించి జనం ఆలోచిస్తారన్నది చరిత్ర చెప్పిన సత్యం.

బెర్నీ శాండర్స్‌ అనే డెమోక్రటిక్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు స్వయంగా తాను సోషలిస్టును అని ప్రకటించుకున్నాడు. అతగాడి ప్రకటనపై అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారు. అమెరికా వంటి చోట్ల ఎవరైనా అలా ప్రకటించుకుంటే అనుమానించటం సహజమే. అయితే శాండర్స్‌ రాజకీయ ప్రస్తానాన్ని చూసినపుడు మిగతా డెమోక్రాట్ల కంటే భిన్నంగా కనిపిస్తాడు. ఎవరి నిజాయితీ అయినా ఆచరణే గీటురాయి. అలా చూసుకున్నపుడు కమ్యూనిస్టులు, సోషలిస్టులు అంటే కత్తులు విసిరే చోట ఎంపీ స్ధాయిలో వున్న వ్యక్తి అమెరికాలో అలా ప్రకటించుకొని బావుకునేదేమీ వుండదు. మన దేశంలో రాజకీయ ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు సిబిఐ, ఐటి, ఇడి వంటి సంస్థలను పాలకులు ఎలా వాడుకుంటున్నదీ చూస్తున్నాము. అమెరికాలో అంతకంటే ఎక్కువగానే వేధిస్తారు. అలాంటపుడు శాండర్స్‌ తాను సోషలిస్టును అని చెప్పుకోవటం ఏమిటి? అతనికి మద్దతుగా డెమోక్రటిక్‌ పార్టీ ప్రచారంలో లక్షలాది మంది యువతీ యువకులు మేమూ సోషలిస్టులమే అంటూ మద్దతు ఇవ్వటానికి ముందుకు రావటాన్ని గతేడాది అధ్యక్ష ఎన్నికల సందర్బంగా చూశాము. అమెరికాలో ఇలాంటి మార్పును ఎవరైనా వూహించారా ? వారెలాంటి సోషలిజాన్ని కోరుకుంటున్నారు అనేది తరువాత, ఒక సోషలిస్టును అభ్యర్ధిగా నిలపాలంటూ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావటమే గొప్ప మార్పు. కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కంటే ముందే ఎందరో సోషలిజం గురించి కలలు కన్నారు, ఆ దిశగా పనిచేశారు. దాన్ని ఆచరణలో పెట్టేందుకు కమ్యూనిస్టు ప్రణాళికతో నిర్ధిష్ట కార్యాచరణకు పూనుకున్నారు. నేడు అనేక సోషలిస్టు భావనలు, మార్గాలు ప్రచారంలో వున్నందున తమకు ఏది సరైనదో అమెరికన్లు నిర్ణయించుకుంటారు.

న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక 2015 నవంబరులో నిర్వహించిన ఒక పోల్‌లో 56శాతం మంది డెమోక్రాటిక్‌ పార్టీ ఓటర్లు సోషలిజం పట్ల సానుకూలత వ్యక్తం చేశారు.ప్యూ సంస్ధ 2011లో జరిపిన సర్వేలో 30 ఏండ్లలోపు వయస్సున్న 49శాతం మంది యువత సోషలిజం పట్ల సానుకూలత, 47శాతం పెట్టుబడిదారీ విధానం పట్ల మొగ్గు చూపినట్లు ప్రకటించారు. ఈ సర్వేలన్నీ ఎవరు కోరుకుంటే చేశారు? చేసిన వారెవరూ సోషలిజం మీద అభిమానం వున్నవారు కాదు. అంత మంది యువతీ యువకులను సోషలిజంవైపునకు ఎవరు నెట్టారు. అమెరికా సమాజంలో పెరుగుతున్న అసమానతలపై వ్యక్తమైన నిరసనే వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం, తరువాత ప్రఖ్యాత ఫ్రెంచి ఆర్ధికవేత్త పికెటీ వెలువరించిన అసమానతల తీరు తెన్నులు, కనీసవేతనంగా గంటకు పదిహేను డాలర్ల వేతనం కోసం దేశవ్యాపితంగా జరుగుతున్న వుద్యమాలన్నీ అమెరికా సమాజంలో జరుగుతున్న మధనానికి సూచికలు. అనేక పరిమితులున్నప్పటికీ అమెరికన్ల ఆలోచనలో వస్తున్న మార్పులను అక్కడి సర్వేలు ప్రతిబింబిస్తున్నాయి. పూ సంస్ధ సర్వే ప్రకారం 2000 సంవత్సరంలో తాము వుదారవాదులమని చెప్పుకున్న డెమోక్రాట్లు 27శాతం వుండగా 2015నాటికి యువతరంలో 42శాతానికి పెరిగింది. తాము సోషలిస్టులం అని చెప్పుకున్నవారు 2004లో 37శాతం వుండగా 2015 నాటికి 49శాతం అయ్యారు. బ్లూమ్‌బెర్గ్‌ పోల్‌ ప్రకారం దక్షిణ కరోలినా డెమోక్రాట్లలో 39 మంది సోషలిస్టులమని,74శాతం పురోగామివాదులమని, 68శాతం వుదారవాదులమని తమను తాము వర్ణించుకున్నారు. అమెరికా అంతటా ఇదే విధంగా వుందని చెప్పలేము. కొన్ని చోట్ల అయినా వచ్చిన మార్పునకు ఇది సూచిక. దీనికి ప్రధాన కారణం అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధ పనిచేయకపోవటాన్ని గతంలో ఎన్నటి కంటే ఎక్కువగా అమెరికన్లు గుర్తించటమే. పై సర్వేలు జరిగిన తరువాత జరిగిన పరిణామాలు అలాంటి ధోరణులు మరింతగా పెరిగేందుకు తోడ్పడేవే తప్ప వెనక్కు పోయేవి కాదు.

మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు అమెరికాలో సోషలిస్టులు లేకపోవటానికి గల కారణాలను జర్మన్‌ సామాజికవేత్త వెర్నర్‌ సోంబార్ట్‌ వివరించారు.అమెరికాకు వలస వచ్చిన కార్మికులకు తమ దేశాలలో తాము అనుభవించినదానికంటే అమెరికాలో పరిస్ధితులు మెరుగ్గా వున్నందున సోషలిస్టులుగా మారాల్సిన అవసరం నాడు లేదనుకున్నారు. ఇతర ఐరోపా దేశాలలో కంటే తమ పని పరిస్థితులు దారుణంగా వున్నందున అమెరికా కార్మికవర్గం, యువతలో నేడు సోషలిస్టు ఆలోచనలు తలెత్తుతున్నాయి. ఇక్కడ ఒక అంశాన్ని గమనంలో వుంచుకోవాలి. ఐరోపాలో కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకోవటానికి, నిపుణులైన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి చోట్లకు వలస పోకుండా నిరోధించేందుకు ఐరోపా పాలకవర్గం కొన్ని సంక్షేమ చర్యలను అమలు జరిపింది. ఇప్పుడు తమ దేశంలో కూడా అలాంటి వాటిని అమలు జరపాలని అమెరికా యువత కోరుకుంటున్నారు. ఇప్పుడు అదే ఐరోపాలో ఆ సంక్షేమ చర్యలకు తిలోదకాలివ్వటాన్ని అక్కడి కార్మికవర్గం వ్యతిరేకిస్తున్నది. అమెరికా కార్మికవర్గం ఈ అనుభవాలను గమనంలోకి తీసుకొని తన స్వంత మార్గాన్ని నిర్ణయించుకోవటం అనివార్యం.

అమెరికాలో జరుగుతున్న సైద్ధాంతిక, కార్యాచరణ మధనానికిి ప్రతిబింబమే స్పెన్సర్‌ రపోనే స్పందన. అతనిప్పుడు అక్కడి మీడియాలో ఒక సంచలన వార్తగా మారాడు. సోషలిజం, కమ్యూనిజం ఎంతో ఆకర్షణీయంగా వున్నపుడు యువత వుత్జేజితులు కావటంలో విశేషమేమీ లేదు. దానికి అనేక ఎదురు దెబ్బలు తగిలి, శత్రుదాడి తీవ్రంగా వుందిపుడు. హరినామ స్మరణం కూడా వినిపించటానికి వీల్లేదన్నచోట ఓ ప్రహ్లాదుడు పుట్టినట్లుగా ఆమెరికాలో ఒక సైనికుడు బహిరంగంగా కమ్యూనిజం పట్ల విశ్వాస ప్రకటన చేయటం నిజంగా విశేషమే. దేనికైనా సిద్దపడిన వాడే సైనికుడు. అతడు కమ్యూనిస్టు యోధుడు కావచ్చు, మరొకరు కావచ్చు.

న్యూయార్క్‌ నగరానికి 80కిలోమీటర్ల దూరంలోని వెస్ట్‌పాయింట్‌ అనే ప్రాంతంలో వున్న ప్రతిష్ఠాత్మక అమెరికా మిలిటరీ అకాడమీలో నాలుగేళ్ల డిగ్రీకోర్సును గతేడాది పూర్తి చేసిన పాతికేండ్ల యువకుడు స్పెన్సర్‌ రపోనే. డెమోక్రటిక్‌ సోషలిస్ట్సు ఆఫ్‌ అమెరికా(డిఎస్‌ఏ) పార్టీలో సభ్యుడినని స్వయంగా చెప్పుకున్నాడు. గతేడాది డెమోక్రటిక్‌ పార్టీలో దేశాధ్యక్షపదవికి పార్టీ అభ్యర్ధిగా నిలిచేందుకు హిల్లరీ క్లింటన్‌తో పోటీ పడిన బెర్నీశాండర్స్‌కు మద్దతు తెలిపిన లక్షలాది మంది యువతీ యువకులు తాము ఆ పార్టీకి చెందిన వారమేనని, సోషలిస్టుల మని బహిరంగంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.

ఒక యువకుడిగా ప్రపంచంలో ఒక పెద్ద భావజాలంగా వున్న కమ్యూనిజం గురించి, దానితో వుత్తేజితుడైన చే గువేరా గురించి సానుకూలంగా స్పందించటం తప్ప రపోనే చేసిన తప్పేమీ లేదు. అయితే ఇది అమెరికా విలువలు, లక్షణాలకు వ్యతిరేకమని కొందరు గగ్గోలు పెడుతున్నారు. తమ సంస్ధ లేదా అమెరికా మిలిటరీ విలువలకు అతని వ్యాఖ్యలకు ఎలాంటి సంబధమూ లేదని వెస్ట్‌పాయింట్‌ సంస్ధ వివరణ ఇచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో రపోనే ట్రంప్‌ మీద కూడా వ్యాఖ్యలు చేశాడు. ‘ఆ ప్రసంగంతో అతనొక ఫాసిస్టు అనే ఒక నీచమైన అనుమానాన్ని ట్రంప్‌ నివృత్తి చేశాడు.’ అని గత జూలైలో పేర్కొన్నాడు.

గత నెలలో కొందరు ఫుట్‌బాల్‌ క్రీడాకారులు అమెరికా జాతీయ గీతాలపన సందర్బంగా తమ మోకాళ్ల మీద నిలబడి అమెరికాలో వున్న జాతివివక్ష, అమెరికా పోలీసులలో వున్న హింసా ప్రవృత్తిని నిరసన తెలిపారు. దానిపై అధ్యక్షుడు ట్రంప్‌ ఒక ప్రకటన చేస్తూ జాతీయ గీతాలాపన సందర్భంగా నిలబడకపోవటాన్ని విమర్శించారు. కొన్ని జట్లకు చెందిన వారు జాతీయ గీతాలాపన సమయానికి అసలు మైదానానికే రాలేదు. క్రీడాకారులు మోకాళ్ల మీద నిలబడటం జాతీయ గీతాన్ని అవమానించటం కాదని అనేక మంది క్రీడాకారుల చర్యను సమర్ధించారు. ఈ సందర్భంలోనే లెప్టినెంట్‌ కల్నల్‌ రపోనే తన ట్వీట్లను చేశాడు.

రపోనేపై మిలిటరీ ఎలాంటి చర్య తీసుకుంటుందో తెలియదు గానీ వెస్ట్‌పాయింట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ రషీద్‌ హుస్సేన్‌ను సంస్ధ యాజమాన్యం సెలవుపై పంపింది. అతను రపోనే చదువు సంధ్యల మార్గదర్శకుడిగా వ్యవహరించారు.తాను రపోనేతో ఎంతో సన్నిహితంగా వున్న మాట నిజమే అని రషీద్‌ నిర్ధారించారు. గతేడాది రపోనే డిగ్రీ తీసుకున్న సమయంలో తీసిన 56 ఫొటోలను అతని సోదరి తన ఫేస్‌బుక్‌ ఆల్బంలో పోస్టు చేసింది. వాటిలో రపోనే తన టోపీ లోపలి భాగంలో కమ్యూనిజం విజయం సాధిస్తుంది అనే నినాదాన్ని చూపుతూ బిగించిన పిడికిలి చూపిన, అదే విధంగా తన యూనిఫారం కింద వేసుకున్న చే గువేరా బమ్మ వున్న టీ షర్టును చూపుతున్న చిత్రాలున్నాయి. ఇప్పుడు అవి సామాజిక మాధ్యమం, మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రొఫెసర్‌ రషీద్‌తో కలసి అధ్యయనంలో భాగంగా ‘స్టాఫ్‌ రైడ్‌ ‘ అనే కార్యక్రమంలో పాల్గనేందుకు 2014లో మన దేశ సందర్శన సందర్భంగా దిగిన ఫొటోలు కూడా వున్నాయి. రషీద్‌తో ఒక విద్యార్ధిగా రపోనే సాన్నిహిత్యంలో ముస్లిం, కమ్యూనిస్టు అనుకూల, అమెరికా ప్రభుత్వ వ్యతిరేక భావాలు పెంపొంది వుంటాయని కొంత మంది కోడి గుడ్డు మీద ఈకలను వెతికే మాదిరి వ్యాఖ్యలు చేస్తున్నారు. మిలిటరీ శిక్షణలో వుండగానే అమెరికా ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత కలిగి వున్న రపోనే అభిప్రాయాలను గమనించిన అకాడమీ అధికారులు అతనికి లాంఛనంగా హితవు చెప్పారు తప్ప అకాడమీ నుంచి తొలగించలేదని మీడియాలో కధనం వచ్చింది. రపోనే వెల్లడించిన అనేక అభిప్రాయాలను సహాధ్యాయులు అనేక మంది పట్టించుకోకపోవటమో లేదా కొందరు సమర్ధించటమో చేసినట్లు ఇప్పుడు కొందరు చెబుతున్నారు. రపోనే అమెరికా వుపాధ్యక్షుడు, రక్షణ మంత్రిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను కూడా తాజా ట్వీట్లకు జత చేస్తున్నారు. విశేషం ఏమంటే వ్యక్తిగతంగా వారిపై చేసిన వ్యాఖ్యల కంటే సిద్ధాంతపరంగా కమ్యూనిజం, చేగువేరాలను సమర్ధించటం అమెరికా అధికార యంత్రాంగానికి తీవ్రమైన తప్పిదంగా కనిపిస్తోంది. అంటే అమెరికా పెట్టుబడిదారీ విధానం, దాని కమ్యూనిస్టు వ్యతిరేకత, యుద్ధకాంక్షలను విమర్శించటాన్ని మాత్రం సహించదని స్పష్టం అవుతున్నది.’ స్పెన్సర్‌ నా కుమారుడు, అతనిని నేను ఎంతగానో ప్రేమిస్తాను, అయినప్పటికీ అతని అభిప్రాయాలు, ప్రవర్తనను అభిమానించటం లేదా ఖండించటంగానీ చేయను, ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లి వచ్చినప్పటి నుంచి అతని రాజకీయ అభిప్రాయాలలో గమనించదగిన మార్పు కనిపిస్తోంది’ అని తండ్రి రిచర్డ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నాడు. అయితే తరువాత వాటిని తొలగించాడు.గతంలో బ్రాడ్లే మానింగ్‌గా మిలిటరీలో పని చేస్తూ వికీలీక్స్‌కు సమాచారం అందించాడనే ఆరోపణపై జైలు శిక్షకు గురైన వ్యక్తి మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా క్షమాభిక్షతో విడుదల చేసిన విషయం తెలిసిందే. అతడు లింగమార్పిడి చేయించుకొని చాలేసియా మానింగ్‌గా మారింది. గతంలో స్పెన్సర్‌ రపోనే న్యూయార్క్‌లో ఇన్‌ఫాంట్రీ ఆఫీసర్‌గా పని చేసినపుడు ఒక పోస్టులో ఇలా రాశాడు.’ ఒక కమ్యూనిస్టుగా ఈ సంస్ధలో పనిచేస్తూ ప్రతి రోజూ వైరుధ్యాల గురించి ఆలోచిస్తాను. ఇలాంటి సంస్ధలలో దీర్ఘకాలం కొనసాగటానికి ఆమె(చాలేసియా మానింగ్‌) ధైర్యం,పట్టుదల నాకు ఎంతో శక్తినిస్తున్నాయి.’ అని పేర్కొన్నాడు. ఈ ఏడాది జనవరిలో మరో పోస్టులో చేగువేరా గెరిల్లా యుద్దతంత్రం గురించి చదివానని, గెరిల్లా పోరాటం గురించి మావో చెప్పింది కూడా చదవాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. తన అభిప్రాయాలను ఇంత సూటిగా వెల్లడించిన స్పెన్సర్‌పై చర్య తీసుకొనేందుకు తొందర పడవద్దని కొందరు పత్రికా వ్యాఖ్యతలు మిలిటరీకి హితవు పలికారు. పట్టించుకుంటుందా, మొరటుగా ముందుకు పోతుందా ?