Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ఆయేషా మీరా, అరుషి కేసులలో నిందితులు నిర్దోషులు, వారు హత్య చేయలేదని కోర్టులు తీర్పులిచ్చాయి. ఎవరూ వారిని చంపకపోతే వారెలా హత్యకు గురయ్యారు? జాతిపిత మహాత్మాగాంధీ హత్యకేసులో కూడా, నిందితులు, వారి వెనుక కుట్ర చేశాయన్న సంస్ధలు పరిశుద్ధులని నిర్ధారించేందుకు ప్రయత్నం జరుగుతోందా ? మన న్యాయవ్యవస్ధకు ఎలాంటి దురుద్ధేశ్యాలను అపాదించకుండానే జరుగుతున్నవాటిని చూసి ఏమైనా జరగవచ్చని సామాన్యులు అనుకోవటంలో తప్పులేదు కదా. దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న కొందరు వూహిస్తున్నట్లుగా ఒక వేళ ఆయేషా, అరుషి కేసుల తీర్పులే మహాత్మాగాంధీ విషయంలో పునరావృతం అయితే జాతిపితను చంపింది ఎవరు అన్న ప్రశ్న భవిష్యత్‌ తరాల ముందు వుంటుంది. ఇలాంటి పరిణామాన్ని ఎవరూ వూహించి వుండరు కదా !

మహాత్మాగాంధీ జన్మించి 148 సంవత్సరాలు గడిచాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నాధూరామ్‌ గాడ్సే, మరొకడు కలిసి ఆయనను హత్యచేసి 69 సంవత్సరాలవుతోంది. ఇన్ని సంవత్సరాల తరువాత హత్యలో మూడోవాడు,వాడు పేల్చిన నాలుగో బుల్లెట్టే ప్రాణం తీసింది దాని గురించి విచారణ జరపండి అని సుప్రీం కోర్టులో ఒక కేసు దాఖలైంది. ముంబైకి చెందిన డాక్టర్‌ పంకజ్‌ ఫడ్నిస్‌ అనే వ్యక్తి అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించే సంస్ధగా పరిగణించబడే అభినవ్‌ భారత్‌ ట్రస్టీ. నాధూరామ్‌ గాడ్సే, నారాయణ్‌ ఆప్టేలో పాటు మహాత్మాగాంధీ హత్య సమయంలో మరో విదేశీ అజ్ఞాత వ్యక్తి వున్నాడని, నాలుగవ బుల్లెట్‌ పేలిందని దాని గురించి విచారణ జరపాలని గతేడాది దాఖలు చేసిన పిటీషన్ను బంబాయి హైకోర్టు కొట్టివేసింది. అదే వ్యక్తి సుప్రీం కోర్టుకు విన్నవించారు. అమెరికా సిఐఏ నుంచి తనకు కొంత విలువైన సమాచారం త్వరలో అందనుందని, దానిని కోర్టుకు సమర్పిస్తానని కూడా అతను వాదించాడు. ఇద్దరు సభ్యులతో కూడిన బెంచ్‌ తదుపరి వాదనలను అక్టోబరు 30కి వాయిదా వేస్తూ ఈ కేసును విచారణకు చేపట్టవచ్చో లేదో తమకు సలహా ఇవ్వాలని అమరేందర్‌ శరణ్‌ అనే సీనియర్‌ న్యాయవాదిని నిర్ణయించింది. ఆ కేసు తదుపరి ఎటు తిరుగుతుందో అన్న ఆసక్తి సహజంగానే రేకెత్తింది. అనేక ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

ఒక వైపు మహాత్మాగాంధీని పొగుడుతూనే మరోవైపు ఆయనను కించపరిచే ద్వంద్వ వైఖరిని మనం ప్రస్తుత అధికారపక్షంలో చూస్తున్నాం. ప్రస్తుత అధ్యక్షుడు అమిత్‌ షా కొద్ది వారాల క్రితం గాంధీని చతురుడైన కోమటి అని వర్ణించిన విషయం తెలిసిందే. గాంధీని హత్యచేసిన ‘గాడ్సేను దేవుడే పంపాడు, అసలు గాంధీనే వురి తీసి వుండాల్సింది, గాంధీని చంపటానికి గాడ్సేకు వుండే కారణాలు గాడ్సేకున్నాయి, అవును నేను గాడ్సేకు పెద్ద అభిమానిని, అయితే ఏమిటి’ అని ఆరాధించే అనేక మంది ప్రధాని నరేంద్రమోడీ భక్తులైతే అందుకు ప్రతిగా ట్విటర్‌ ద్వారా మోడీ వారిని అనుసరిస్తూ ప్రోత్సహిస్తున్నారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎవరో వూరూ పేరు లేని వారైతే పట్టించుకోనవసరం లేదు బిజెపి జాతీయ ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ ఒక ట్వీట్‌లో ‘గాంధీని హత్యచేయటానికి గాడ్సేకు వుండే కారణాలు ఆయనుకున్నాయి, న్యాయబద్దమైన సమాజం వాటిని కూడా వినాలి’ అని వ్యాఖ్యానించాడు. వారందరికీ ఆరాధ్యదైవంగా పరిగణించబడే నరేంద్రమోడీ మరోవైపు ‘ గాంధీ జయంతి సందర్బంగా బాపూకు నేను ప్రణమిల్లుతున్నాను. ఆయన మహత్తర ఆశయాలు ప్రపంచవ్యాపితంగా కోట్లాది మందికి ప్రేరణనిస్తున్నాయి’ అని ట్వీట్‌ చేస్తారు.

సైద్ధాంతికంగా గాంధీని వ్యతిరేకించిన సుభాస్‌ చంద్రబోసే గాంధీని జాతిపితగా వర్ణించారు. మన రాజ్యాంగంలో జాతిపితగా గుర్తించే అవకాశం లేదు. అయినా మహాత్ముడి వ్యక్తిత్వం కారణంగా ఆయనను జాతిపితగా వర్ణిస్తున్నాము. కరెన్సీపై ఆయన చిత్రాన్ని ముద్రించటం అంటే అంతటి స్ధాయిని కల్పించటమే. బిజెపి, దానిని వెనుక నుంచి నడిపించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ ఆయనను జాతిపితగా గుర్తించలేదు, పిలవలేదు.అలాంటి వ్యక్తిని గాడ్సే గాంగ్‌ ఎందుకు చంపింది. అనేది అవలోకించాల్సి వుంది. ప్రస్తుతం దేశంలో హిందూమతోన్మాదశక్తులు రెచ్చిపోతున్నాయి. గాంధీని చంపటం ఒక పెద్ద ఘనతగా, అలాంటిదానిని తమకు దక్కకుండా చేసేందుకు పూనుకున్నారని హిందూమహాసభ పేరుతో వున్న వారు ప్రకటించారు.

మహాత్మాగాంధీని చంపింది హిందూమహసభకు చెందిన నాధూరామ్‌ గాడ్సే అనే తమ వారసత్వ ఆస్థి లేదా వుత్తరదాయిత్వాన్ని దెబ్బతీసేందుకు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయని హిందూమహాసభ ఆగ్రహం వెలిబుచ్చింది.మూడో వ్యక్తి, నాలుగో బుల్లెట్‌ పేరుతో దాఖలైన కేసులో సుప్రీంకోర్టు అమికస్‌ క్యూరీ నియామకం జరుపుతున్నట్లు ప్రకటించగానే హిందూమహాసభ జాతీయ వుపాధ్యక్షుడు అశోక్‌ శర్మ ఒక ప్రకటన చేశారు. హిందూ మహాసభ నుంచి పుట్టిన భావజాలమే బిజెపి మరియు ఆర్‌ఎస్‌ఎస్‌ వునికి కారణం. ఆ రెండు సంస్ధలు ఈరోజు ధరించిన ముసుగులను బహిరంగపరచగలిగేది తమ సంస్ధ మాత్రమే అని వాటికి తెలుసు, హిందూమహసభ గుర్తింపును నాధూరామ్‌ గాడ్సే నుంచి విడదీయలేరు, గాంధీ హత్యలో గాడ్సేకు ఖ్యాతి దక్కకుండా చేసేందుకు అతని పాత్రపై అనుమానాలను సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. గాడ్సే లేకపోతే హిందూమహాసభ పూర్తిగా వునికి కోల్పోతుందని వారికి తెలుసు.ఇదందా బిజెపి ద్విముఖ వ్యూహంలో భాగం. గాడ్సేను పొగడలేదు కనుక గాంధీ పట్ల సానుకూల వైఖరిని అనుసరించేందుకు ఒక వైపు ప్రయత్నిస్తోంది. మరోవైపు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ ప్రమాణాల గురించి బహిరంగంగా మాట్లాడగలిగేది హిందూ మహాసభే కనుక దానిని పూర్తిగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పిటీషన్‌ దాఖలు చేసిన వ్యక్తి పూర్తిగా సంఘ్‌ తరఫున పని చేస్తున్నాడు.’ అని అశోక్‌ శర్మ వ్యాఖ్యానించాడు.

ఇలాంటి మతోన్మాద, హంతక శక్తులకు అంతటి బరితెగింపు ఎలా వచ్చింది? వారిని రక్షించే శక్తులది పైచేయి అయిందా, జనం విచక్షణ కోల్పోతున్నారా ? దేశవిభజన సమయంలో చెలరేగిన మతఘర్షణలపై గాంధీ తీసుకున్న వైఖరి మతోన్మాదులకు నచ్చనందునే ఆయనను పొట్టన పెట్టుకున్నారు. మతాల గురించి గాంధీ చెప్పిందేమిటి? గాంధీ ధర్మం ప్రకారం సహనానికి మించి అన్ని మతాల పట్ట చిత్తశుద్దితో కూడిన గౌరవం వుంది.ఆమేరకు ఆయన విజ్ఞప్తి చేశారు.మతోన్మాదానికి ఏ మాత్రం అవకాశం లేదు. వివిధ సందర్భాలలో ఆయన చెప్పిన, రాసిన మాటలు ఇలా వున్నాయి. ‘ నావరకు విభిన్న మతాలు ఒకే తోటలోని అందమైన పూలవంటివి లేదా దివ్యమైన చెట్టు యొక్క వివిధ కొమ్మలు. మానవ పరిణామక్రమాన్ని పూర్తి చేసేందుకు ప్రతి మతం తనదైన అంశభాగాన్ని అందచేసింది. ప్రపంచంలోని అన్ని విశ్వాసాలు ఒకే చెట్టులోని అనేక శాఖలు, మిగతావాటితో పోల్చితే దేనికది ప్రత్యేకతలు కలిగి వున్నప్పటికీ వాటికి వనరు ఒక్కటే.’ వివిధ మతాలు ఒకే చెట్టుమీది ఆకుల వంటివి. ఏ రెండు ఆకులూ ఒకే విధంగా వుండవు. ఒకే చెట్టుమీద పెరిగిన కొమ్ములు లేదా ఆకుల మధ్య వైరం వుండదు. ప్రపంచంలోని అన్ని గొప్పమతాలలోని నిజాల విశ్వాసిని, కేవలం సహనమే కాదు ఇతర మతాల విశ్వాసాలు కూడా మన వంటివే అనే గౌరవం లేకపోతే భూమ్మీద శాంతి నెలకొనదు. నేను ప్రబోధించే విశ్వాసం దాన్ని అమలు చేయటానికి మాత్రమే నన్ను అనుమతించదు, ఏ వనరునుంచి వచ్చినప్పటికీ మంచిని గ్రహించే విధి నిర్వహణ అనివార్యం చేస్తుంది. దీర్ఘ పఠనం, అనుభవం తరువాత నేను కొన్ని నిర్ధారణలకు వచ్చాను. అన్ని మతాలు నిజమైనవే,అన్ని మతాలలోనూ కొన్ని తప్పులున్నాయి, నా స్వంత హిందూమతం మాదిరి నాకు అన్ని మతాలూ ప్రియమైనవే, అదే విధంగా మానవులందరూ వారి స్వంత బంధువుల మాదిరి ప్రియంగా వుండాలి. ‘ ఒక క్రైస్తవ మిత్రుడు ఒకసారి గాంధీని ఒక ప్రశ్న అడిగాడు. మీ మతం అన్ని మతాల సంయోగం అని మీరు చెబుతారా ? అంటే ఆ సంయోగాన్ని నేను హిందూయిజం అని పిలుస్తాను, మరియు మీ విషయానికి వస్తే క్రైస్తవమే సంయోగం అవుతుంది అని గాంధీ చెప్పాడు.

ఇటువంటి భావాలున్న వ్యక్తి దేశవిభజన సమయంలో చెలరేగిన మతఘర్షణలకు నిరసనగా దీక్ష చేపట్టటాన్ని అవకాశంగా తీసుకొని హిందూమతోన్మాదశక్తులు తమ కసి తీర్చుకున్నాయి.ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభ వంటి సంస్దలకు నాయకత్వం వహించిన వారి కార్యకలాపాలు రచనలు, వుపన్యాసాలను గమనించితే వారికి ఇటాలియన్‌ ఫాసిస్టు ముస్సోలినీ, జర్మన్‌ హిట్లర్‌ నాజీలు స్ఫూర్తి ప్రదాతలుగా కనిపిస్తారు. భారత్‌ను జర్మనీగా భావించి అక్కడ యూదులను దేశద్రోహులుగా ఎలా చిత్రించారో ఇక్కడ ముస్లింలను అలా పరిగణించాలని భావించారు. ఐరోపా మతరాజ్యాల మాదిరి భారత్‌ను ఒక హిందూ రాజ్యంగా చూడాలని అనుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో తాము గెలవాలని కోరుకున్న ముస్సోలినీ, హిట్లర్‌ మట్టి కరవటం, యూదులను వూచకోత కోయటాన్ని సభ్యసమాజం వ్యతిరేకించటం, జర్మనీ, ఇటలీలు ఓడిపోవటం, భారత్‌ నుంచి పాకిస్తాన్‌ విడిపోవటం వంటి అంశాలతో తాము వూహించుకున్నది ఒకటి జరిగింది ఒకటనే ఆశాభంగానికి గురైన శక్తులు గాంధీ కారణంగానే హిందువులు చేతగాని విధంగా తయారయ్యారనే తప్పుడు నిర్దారణలకు వచ్చి ఆయనను హతమారిస్తే తప్ప హిందూమతం పటిష్టం కాదనే అంచనాతో హత్యకు పాల్పడివుంటారని చెప్పవచ్చు. వారి వారసులు ఇప్పుడు గాంధీ హత్యను మరోవిధంగా వ్యాఖ్యానించటానికి, వుపయోగించుకోవటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే సుప్రీం కోర్టులో మూడో వ్యక్తి, నాలుగో బుల్లెట్‌ కథ.

గత లోక్‌సభ ఎన్నికలలో మూడింట రెండువంతుల సీట్లు బిజెపికి వచ్చాయి గానీ వచ్చిన ఓట్లు 31శాతమే. బిజెపిని వ్యతిరేకించే పార్టీల ఓట్ల చీలిక దానికి సీట్ల పంట పండించింది. గరిష్ట మతరాజకీయాల అనంతరం పరిస్ధితి ఇది. వుత్తర ప్రదే శ్‌ ఎన్నికలలో కూడా బిజెపికి ఎన్నడూ లేని సంఖ్యలో సీట్లు వచ్చాయి. కానీ ఓట్ల లెక్కలో లోక్‌సభ ఎన్నికల కంటే తగ్గాయి. అత్యవసర పరిస్దితి అనంతర ఓట్లవివరాలను చూస్తే తమకు వున్న పరిమితులేమిటో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నాయకత్వానికి అవగతం అయ్యాయి. అందువలన అధికారంలో కొనసాగాలన్నా, మరో రూపంలో మతోన్మాద అజెండాను అమలు జరపాలన్నా విశ్వసనీయతను సృష్టించుకోవటం అవసరంగా భావించినట్లు కనిపిస్తోంది.

నాటి నుంచి నేటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలందరూ హిందుత్వ గురించి, దేశాన్ని హిందూదేశంగా ప్రకటించాలని కోరుతూ, హిందూ ధర్మానికి ముప్పు కలుగుతోందని చెబుతున్నవారే. అది వారికి ఆక్సిజన్‌ వంటిది. అదిలేకపోతే దానికింక మనుగడే వుండదు. ఎందుకంటే మిగతా అంశాలన్నీ అన్నీ పార్టీలు చెప్పేవే. గాంధీ హత్యకు కుట్రచేసిన గాడ్సే, ఇతరులందరూ ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభలలో సభ్యులుగా వున్న హిందుత్వశక్తులే. గతంలో జనసంఘం, ప్రస్తుతం బిజెపిగా వ్యవహరిస్తున్న పార్టీకి అది ఒక మాయని మచ్చ. దానిని తొలగించుకోవాలని ఎప్పటి నుంచో పెద్ద ప్రయత్నం జరుగుతోంది. గాంధీని హతమార్చిన విషయాన్ని కాదనలేరు కనుక ఆయనను చంపింది రాజకీయ కారణాలతో తప్ప మతఅంశాలు కాదని చెప్పటానికి అనేక మంది బిజెపి ప్రముఖులు గతంలో ప్రయత్నించారు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన వారు గాంధీని హత్యచేసిన ఘనత తమఖాతాలో వేసుకొనేందుకు ఇంకా మోజుపడుతున్నారు.అది బహిరంగంగా చెప్పుకోలేరు. అదే సమయంలో అధికారం కావాలంటే అదొక ఆటంకంగా వుంది కనుక అధికారికంగా ఏదో విధంగా మత ముద్ర బదులు రాజకీయ ముద్రవేయాలని చూస్తున్నారన్నది ఒక విమర్శ. గాడ్సే గతాన్ని తుడిచి వేసుకొనేందుకు అతడసలు ఆర్‌ఎస్‌ఎస్‌ కాదని ప్రకటిస్తారు.హత్య సమయంలో అతను సంఘపరివార్‌లో లేడంటారు. అయితే గాడ్సే తమ్ముడు గోపాల్‌ గాడ్సే అసలు విషయాలు చెప్పాడు.’ నాధూరామ్‌, దత్తాత్రేయ, నేను, గోవింద్‌ సోదరులందరం ఆర్‌ఎస్‌ఎస్‌లో వున్నాం. మా ఇండ్లలో కంటే మేం ఆర్‌ఎస్‌ఎస్‌లోనే పెరిగామని నేను చెప్పగలను, అది మాకు ఒక కుటుంబం వంటిది.ఆర్‌ఎస్‌ఎస్‌లో నాధూరామ్‌ ఒక మేధోపరమైన కార్యకర్తగా ఎదిగాడు, తన ప్రకటనలో ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వైదొలిగినట్లు చెప్పాడు, ఎందుకంటే గాంధీ హత్య తరువాత గోల్వాల్కర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో ఇబ్బందుల్లో వుంది కనుక అలా చెప్పాడు. అతను ఆర్‌ఎస్‌ఎస్‌ను వదలి పెట్టలేదు. వెళ్లు, గాంధీని హత్యచేయమని ఆర్‌ఎస్‌ఎస్‌ తీర్మానించలేదని చెప్పుకోవచ్చు తప్ప అతనితో మాకేమీ సంబంధం లేదని చెప్పకూడదు.ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేస్తూనే 1944 నుంచి హిందూ మహాసభలో కూడా నాధూరామ్‌ పని చేయటం ప్రారంభించాడు.’ అని పేర్కొన్నాడు. గోపాల్‌ గాడ్సే చెప్పింది వాస్తవమే అనటానికి నాటి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వుత్తర ప్రత్యుత్తరాల్లోని అంశాలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఆరవ వాల్యూమ్‌ పేజి 56లో ‘సావర్కర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసిన మతోన్మాద విభాగం హిందూమహాసభ కుట్ర చేసి అమలు చేయించింది’ అని పేర్కొన్న విషయాన్ని జర్నలిస్టు ఏజి నూరాని తన పుస్తకంలో వివరించాడు.

దేశ రాజకీయ చిత్రపటం నుంచి గాంధీ, నెహ్రూ వంటి స్వాతంత్య్రం పోరాటనాయకులను తొలగించాలని బిజెపి నేతలు బాహాటంగానే చెబుతున్నారు. హత్యకేసు విచారణ సమయంలో గాడ్సే చెప్పిన అంశాల కొనసాగింపే ఇది. జిన్నాకు గాంధీ తదితరులు లంగిపోయారని గాడ్సే ఆరోపించాడు. చెవులప్పగించిన వారికిది వినసొంపుగానే వుంటోంది. ఎందుకంటే గత 70సంవత్సరాలుగా మధ్యలో కొంత కాలం మినహా గాంధీ, నెహ్రూల వారుసులుగా చెప్పుకొనే వారే అధికారంలో కొనసాగారు. అనుసరించిన దివాళాకోరు ఆర్ధిక విధానాల కారణంగా సమాజంలోని వివిధ తరగతులలో అసంతృప్తి నెలకొంది. దీన్ని సొమ్ము చేసుకోవాలంటే ఒక దగ్గర మార్గం సకల అనర్ధాలకు గాంధీ, నెహ్రూవారసులే కారణం అంటే చాలు. సరిగ్గా జర్మనీలో హిట్లర్‌ కూడా అదే చేశాడు. ఐరోపా యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచాన్ని పంచుకొనే పోటీలో జర్మన్‌ సామ్రాజ్యవాదులు వెనుకబడ్డారు. అందువలన మొదటి ప్రపంచయుద్ధంలో విజేతలు జర్మనీని దెబ్బతీసేందుకు అవమానకరమైన షరతులతో సంధిని రుద్ధారు. దాన్ని చూపి జనాన్ని రెచ్చగొట్టి హిట్లర్‌ రాజకీయంగా ఎదిగాడు. ఇప్పుడు బిజెపి చేస్తోంది అదే. కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలలో ఎలాంటి మార్పు లేదు. అవే దివాలా కోరు విధానాలను అమలు జరుపుతున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనం ప్రారంభమైన సమయంలో అంకెల గారడీ చేసి నరేంద్రమోడీ సర్కార్‌ లేని అభివృద్ధిని చూపింది. దేన్నయినా మూసిపెడితే పాచి పోతుంది. మూడు సంవత్సరాల కాలంలో అదే జరిగింది. తప్పుడు సలహాలు విని తాత్కాలికంగా అయినా కొన్ని మెరుపులు మెరిపించి మరోసారి ఓట్లను కొల్లగొడదామనే ఎత్తుగడుతో పెద్ద నోట్లను రద్దు చేశారు. ముఖ్యమంత్రిగా తన జీవిత కాలమంతా వ్యతిరేకించిన జిఎస్‌టిని ముందు వెనుకలు ఆలోచించకుండా బలవంతంగా అమలు జరిపించారు. ఆర్ధికాభివృద్ధి వెనుకపట్టు పట్టటం తాత్కాలికమే అని కొత్త పల్లవి అందుకున్నారు. దాని మంచి చెడ్డల గురించి మరోసారి చూద్దాం.

అసలు మహాత్మా గాంధీ అనుసరించిన విధానాలేమిటి? అవి ఇప్పుడెలా వున్నాయో, వర్తమాన మేథావులు వాటిని ఎలా చూస్తున్నారో చూద్దాం. అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నీతి నాయర్‌ గాంధీ జయంతి సందర్భంగా ఒక విశ్లేషణ చేశారు. దానితో ఎకీభవించాలా లేదా మరో కోణం నుంచి చూడాలా అనేది వేరే విషయం. అమె విశ్లేషణ సారం ఇలా వుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ రాజఘాట్‌లో శ్రద్ధాంజలి ఘటించటాన్ని కోట్లాది మంది చూశారు. గాంధీకి ఇష్టమైన ప్రార్ధనలను రేడియో వినిపించి, నలుపు, తెలుపుల డాక్యుమెంటరీలను టీవీలలో ప్రసారం చేశారు. అయితే ఈ తీపి మాటలు, విధిలో భాగంగా వెల్లడించే శ్రద్ధాంజలులు, జాతిపితకు సంబంధించిన వాస్తవాలను మూసిపెట్టేందుకే. అధికార భారత్‌లో వాస్తవానికి గాంధీ గతించారు.

మహాత్మాగాంధీ సంప్రదింపుల శక్తిని విశ్వసించారు. కాశ్మీరులో పరిస్ధితి నెత్తుటి మరకలా వుంది. సంప్రదింపులు లేవు,క్లుప్తంగా చెప్పాలంటే అధికారం పశుబలాన్ని ప్రయోగించింది. నిరాయుధనిరసనకారులపై భద్రతాదళాలు ప్రయోగించిన పిల్లెట్లతో వందలాది మంది అంధులయ్యారు. దీనికి వ్యతిరేకంగా గాంధీజీ ఎన్ని సత్యాగ్రహాలు చేసి వుండేవారు? భిన్న సామాజిక తరగతులను ఐక్యం చేసేందుకు తన ప్రార్ధనా సమావేశాలలో గాంధీజీ బైబిల్‌, ఖురాన్‌, గీతలోని అంశాలను ప్రస్తావించేవారు, ఇప్పుడు హిందూ చిహ్నలను మాత్రమే వినియోగిస్తున్నారు. ఏ పధకమైనా పేదలకు లబ్ది చేకూర్చిందా లేదా అన్నదే దాని విజయానికి గీటురాయిగా తీసుకోవాలన్నది గాంధీ వైఖరి. మోడీ తన పుట్టిన రోజు కానుకగా జాతికి అంకితం చేసిన సర్దార్‌ సరోవర్‌ డామ్‌ నీటిని నాలుగు రాష్ట్రాలలో రువు ప్రాంతాలకు వుద్దేశించగా దానికి భిన్నంగా దామాషాకు వ్యతిరేకంగా కోకాకోలా, టాటానానో కారు వంటి కొన్ని ఎంపిక చేసిన కార్పొరేట్ల అవసరాలకు అనుగుణ్యంగా నీటిని మళ్లిస్తున్నారు. అత్యంత పేదలైన గిరిజనుల నివాసాలు మునిగిపోయాయి, దశాబ్దాలు గడిచినా, పాకేజీలు ప్రకటించినా నిర్వాసిత గిరిజనుల జీవితాల్లో మార్పులేదు. ప్రజాస్వామ్యంలో మీడియా పోషించాల్సన విమర్శనాత్మక పాత్రను గాంధీజి విశ్వసించారు. నేడు దేశంలో ప్రభుత్వ విమర్శకులను భయపెట్టే పద్ధతులను నిరంతరం అనుసరిస్తున్నారు. జర్నలిస్టులను హత్యచేయటం నుంచి స్వతంత్రంగా వ్యవహరించే సంపాదకులను రాజీనామా చేయించటం వరకు అవి వున్నాయి.

గాంధీ గోవధను వ్యతిరేకించినప్పటికీ హిందువేతరులపై ఒక మతాన్ని రుద్దటాన్ని ఎన్నడూ అంగీకరించలేదు. హిందువులు బీఫ్‌ తింటారని, ఆవు చర్మాలతో వ్యాపారం చేస్తారని ఆయనకు బాగా తెలుసు. భిన్న ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలున్న ముస్లిం, పార్సీ, క్రైస్తవులు తదితర బహుళ సామాజిక తరగతుల గురించి గాంధీజి పదే పదే చెప్పారు. కానీ నేడు ఆయన ప్రాతినిధ్యం వహించినదానికి విరుద్దంగా గో రక్షకులు రాత్రి పగలూ వీధులలో తిరుగుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ స్వచ్చభారత్‌ కార్యక్రమంలో గాంధీ జీవించి వున్నారు. చీపుర్లు పట్టి మోడీ మంత్రులు ఫొటోలు తీయించుకోవటంలో చూపుతున్న శ్రద్ధ పారిశుద్ధ్య నియమాలను పాటించటంలో లేదు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ కాలండర్‌ నుంచి రాట్నం వడుకుతున్న గాంధీ పొటోను తొలగించి నరేంద్రమోడీది చేర్చటం ఖాదీతో గాంధీ అనుబంధాన్ని కనిపించకుండా చేయటమే. గోరక్షకుల దాడులకు బలైన బాధిత కుటుంబాల ఇండ్లకు శాంతియుతంగా వెళ్లిన కార్యకర్తల కార్యక్రమంలో గాంధీ జీవించి వున్నారు. జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా అక్టోబరు రెండున దేశవ్యాపితంగా మౌనంగా అయినప్పటికీ శక్తివంతంగా జరిపిన జర్నలిస్టుల నిరసనల్లో గాంధీ వున్నారు. ప్రపంచవ్యాపితంగా జరిగిన అనేక శాంతియుత నిరసనల్లో గాంధీ భావజాలం పని చేసింది.

గాంధీకి అధికారికంగా ఏర్పాటు చేసిన రాజఘాట్‌ స్మారక చిహాన్ని చూపేందుకు బస్సుల్లో స్కూలు పిల్లల్ని తీసుకు వెళ్లేవారు ఒక పధకం ప్రకారం మితవాద మతోన్మాది నాధూరామ్‌ గాడ్సే చేతిలో గాంధీ హత్యకు గురైన బిర్లా భవనాన్ని ఎందుకు చూపరు అని గాంధియన్‌ విద్యావేత్త కృష్ణకుమార్‌ 2007ఒక రచనలో ఆశ ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గాడ్సే పేరును పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నారు. భారతీయ, విదేశీ అతిధులు కూడా బిర్లా భవనాన్ని ఎవరూ సందర్శించరు. గాంధీ హత్యవెనుక వున్న కారణాలేమిటని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగే అవకాశం లేకుండా చేసేందుకు హత్యజరిగిన నాటి నుంచి ఒక ‘నిశబ్ద ఒప్పందం’ జరగటమే దీనికి కారణం అయివుండాలని కృష్ణ కుమార్‌ నిర్ధారణకు వచ్చారు. గాంధీ హత్య జరిగిన తరువాత హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలపై దాడులు చేసి కార్యకర్తలను అరెస్టుచేసి వారి రికార్డులను స్వాధీనం చేసుకొన్నారు. తరువాత రికార్డులను నెహ్రూ మ్యూజియంలో భద్రపరిచారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం తొలగింపు, కార్యకర్తల విడుదల తరువాత వారు రహస్యంగా హిందూ సామాజిక తరగతిని పటిష్టపరిచేందుకు పనిచేస్తున్నారు. విరాళాలు వసూలు చేసేటపుడు రాతపూర్వక రికార్డులు నిర్వహించకూడదని నిర్ణయించారు. గాడ్సేకు మరణశిక్ష విధించిన న్యాయమూర్తులలో ఒకరైన జి.డి ఖోస్లా కొన్ని సంవత్సరాల తరువాత ‘ ఆరోజు కోర్టులో ప్రేక్షకులుగా వున్నవారు ఒక జూరీని ఏర్పాటు చేసి గాడ్సే అప్పీలు మీద విచారణ జరపమని దానికి అప్పగించి వుంటే గాడ్సే తప్పుచేయలేదని అత్యధిక మెజారిటీతో తీర్పు చెప్పి వుండేవారు’ అని పేర్కొన్నారు.

సంవత్సరాలు గడిచిన కొద్దీ అనేక రోడ్లకు మహాత్మాగాంధీ పేరు పెట్టారు, దేశమంతటా అనేక విగ్రహాలు నెలకొల్పారు తప్ప ఆయన సందేశాన్ని నిర్లక్ష్యం చేశారు. లౌకికవాదులుగా పిలుచుకొనే పార్టీలు 1977-79 మధ్య కాలంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు స్ధానం దొరికింది. ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు జనతా పార్టీ రెండింటిలో ద్వంద్వ సభ్యత్వం కలిగి వుండటమనే సమస్యకారణంగా దేశంలోని తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం కూలిపోయింది.( ఇప్పుడు బిజెపిగా ఏర్పడిన వారు తాము ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వాన్ని వదులుకొనేది లేదని జనతా పార్టీ నుంచి బయటికి వచ్చారు) రాజకీయాలు మరియు ఇటీవలి సంవత్సరాలలో సాగుతున్న రాజకీయ బేరసారాలలో దేశంలో గాడ్సే స్ధానం గురించి పరిశీలించటానికి ఏమాత్రం చోటులేదు. భగత్‌ సింగ్‌, బిఆర్‌ అంబేద్కర్‌ వంటి గాంధీ సమకాలిక పెద్దలు వున్నప్పటికీ భిన్న తరగతుల మధ్యó మహాత్ముడి స్ధానంలో గాంధీ కొనసాగుతూనే వుంటారు.ఆయన అనుసరించిన, ఆచరించిన పద్దతులు వర్తమాన భారతంలో ఎన్నడూ లేనివిధంగా మరింతగా ప్రతిబింబించాలి.’ నీతి నాయర్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఏకీభవించినా, విబేధించినా అవి ఆలోచనాత్మకంగా వున్నాయని చెప్పవచ్చు. మూసిపెట్టటానికి ప్రయత్నించకుండా మరిన్ని కోణాల నుంచి ఈ అంశాలను చర్చించవచ్చు.

గమనిక: ఈ వ్యాసం ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాయబడినది.