Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

మహాత్మాగాంధీ హత్యలో మరోవ్యక్తి వున్నాడంటూ విచారణ జరపాలని కోరటం వెనుక గాడ్సే, తద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్రను చరిత్ర నుంచి అధికారికంగా తుడిచివేయాలనే ప్రయత్నం కనపడుతోంది.తమకు అనుకూలంగా చరిత్రను మార్చుకొనేందుకు మితవాద హిందూశక్తులు ప్రయత్నిస్తున్నాయని మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. దాని సారాంశం ఇలా వుంది.తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేయటం, గందరగోళపరచేందు ప్రయత్నించటం ఇదే మొదటిసారి కాదు. ఇది గాంధీ హంతకుల నుంచి సైద్ధాంతిక స్ఫూర్తి పొందిన హిందూ మితవాదుల పెద్ద పధకంలో భాగం. హత్య గురించి అనుమానాలను పెంచేందుకు మరొక స్ధాయికి తీసుకుపోయారు.ఇటువంటి విజ్ఞాపనను కోర్టు తిరస్కరించకపోవటం ఆశ్చర్యపరిచింది. అదృష్టం కొద్దీ గతేడాది ముంబై హైకోర్టు వినతిని తిరస్కరించింది. పిటీషన్‌ వేసిన వ్యక్తి తాను వీర సావర్కర్‌ భక్తుడిని అని స్వయంగా అంగీకరించాడు. సావర్కర్‌పేరును కేసు నుంచి తొలగించాలని కోరాడు. జస్టిస్‌ కపూర్‌ కమిషన్‌ 1969లో సమర్పించిన నివేదికలో గాంధీ హత్యకు వున్న సంబంధాన్ని నిరూపించటమేగాక హత్యకుట్రలో సావర్కర్‌ పాత్ర, ప్రమేయం వున్నట్లు కూడా తెలిపింది. అంతకు ముందే కేసు నుంచి సావర్కర్‌ విముక్తి చేసినప్పటికీ ఈ కమిషన్‌ తన నివేదికలో అతని ప్రమేయం గురించి పేర్కొన్నది. అప్పటి నుంచి సంఘపరివార్‌ మరియు సావర్కర్‌ వాదులకు ఈ నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ కమిషన్‌ నివేదికను రద్దు చేయాలని ఫడ్నిస్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు అనుమతించింది. వర్తమాన చరిత్రను కించపరుస్తూ దాని స్ధానంలో తమ వూహలనే చరిత్రగా చొప్పించాలని చూసే ఈ పధకంలో బంబే హైకోర్టు తిరస్కరించటం, సుప్రీం కోర్టు అనుమతించటం కొన్ని అడుగులు.

పిటీషన్‌దారు ఆరోపించిన దాని ప్రకారం 1948 జనవరి 30న రెండవ అజ్ఞాత వ్యక్తి జరిపిన నాలుగవ రౌండ్‌ కాల్పులకే గాంధీ మరణించారు. రెండున్నర అడుగుల దూరం నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన గాడ్సే తూటాల కారణంగా ఆయన మరణించలేదు. రెండవ వ్యక్తి రహస్యంగా జరిపిన కాల్పులను ఎవరూ వినలేదు, అతను వున్నట్లు కూడా ఎవరూ గుర్తించలేదు.ఆ సమయంలో అక్కడదాదాపు వెయ్యి మందికి పైగా వున్నారు. గాంధీ మరణం తరువాత అంత్యక్రియలకు ముందు చేయించే పార్ధివ దేహానికి స్నానం చేయించి,శుద్ధి చేసే సమయంలో దేహంపై కప్పిన షాల్‌ మడతలలో ఒక బుల్లెట్‌ కనిపించిందని మనుబెన్‌ అనే వ్యక్తి చెప్పాడని పిటీషనర్‌ పేర్కొన్నాడు. దాన్నే నాలుగవ బుల్లెట్‌గా చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం మూడుసార్లు కాల్పులు జరిగినట్లు మూడు గాయాలున్నట్లు రెండు బుల్లెట్లు వెనుకవైపుకు దూసుకుపోయాయని, మూడింటిలో ఒక బుల్లెట్‌ గాంధీ వెనుక పది అడుగుల దూరంలో పడి వుండగా తరువాత కనుగొన్నారు. ఒకటి బాపు శరీరంలోనే వుండిపోయి చితిలో తరువాత కరిగిపోయి కనిపించింది. మూడవ బుల్లెట్టే షాల్‌లో దొరికిందని, నాలుగవది అసలు లేదని తుషార్‌ గాంధీ పేర్కొన్నారు.

గాంధీ హత్యకు వుపయోగించిన 9ఎంఎం బెరెట్టా తుపాకి గాడ్సే చేతికి ఎలా వచ్చిందన్న అంశం గురించి తుషార్‌ గాంధీ తన విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు. పిటీషన్‌దారు రెండు బెరెట్టా తుపాకులున్నాయని పేర్కొన్నారు. అవును నిజమే.ఒకే 606824 నంబరు గల రెండు తుపాకులున్నాయి.ఒకటి అసలైనది, రెండవది సందర్శకుల కోసం రూపొందించిన దాని నమూనా రాజఘాట్‌లోని జాతీయ గాంధీ మ్యూజియంలో వున్నాయి.ఈ తుపాకీ గాడ్సే చేతిలోకి ఎలా వచ్చిందన్నది ఆసక్తికరం. హత్యకు రెండు రోజుల ముందు వరకు అంటే జనవరి 28వరకు గాడ్సే-ఆప్టే ముఠాకు విస్వసనీయమైన ఆయుధం దొరకలేదు. ఇరవయ్యవ తేదీన వారు మూడు తుపాకులు కలిగి వున్నప్పటికీ హత్యాయత్నం విఫలమైంది. మరుసటి రోజునుంచి మరో ఆయుధం కోసం అన్ని వనరులనూ సంప్రదించారు. ఆ రోజుల్లో అక్రమ తుపాకుల విక్రయ కేంద్రంగా గ్వాలియర్‌ వుండేది. అక్కడ దత్తాత్రేయ పర్చూరే అనే డాక్టరున్నాడు. అతను సావర్కర్‌ వీర భక్తుడు, హిందూమహాసభ సభ్యుడిగా నాధూరామ్‌, ఆప్టేలకు తెలుసు. డాక్టరు దగ్గర మంచి తుపాకీ వుందని తెలిసి అది కావాలని అడిగారు. తిరస్కరించిన దత్తాత్రేయ వారికి ఒకదానిని సమకూర్చేందుకు అంగీకరించాడు.గంగాధర్‌ దండావతే అనే తన కింద పనిచేసే వ్యక్తికి ఆ బాధ్యత అప్పగించాడు. జనవరి 28 సాయంత్రానికి అతను ఐదువందల రూపాయలకు ఒక తుపాకీని తెచ్చాడు.దానితో గాడ్సే-ఆప్టేలకు కాల్చటం రాకపోతే ఆ డాక్టరు తన ప్రాంగణంలో కాల్చిచూపించాడు.

సమీపం నుంచి హత్యలు చేయటానికి ఆ రోజుల్లో బెరెట్టా సెమీ ఆటోమాటిక్‌ తుపాకిని ఎక్కువగా వుపయోగించేవారు. ఇటాలియన్‌ ఫాసిస్టు ముస్సోలినీ సైన్యాధికారులు వుపయోగించేందుకు బెరెట్టా కంపెనీ పరిమితంగా వాటిని తయారుచేసేది. ఇప్పటికీ దాన్ని ఫాసిస్టు స్పెషల్‌ అని పిలుస్తారు. వుత్తర ఆఫ్రికాలోని అబిసీనియాను ఆక్రమించేందుకు ముస్సోలినీ సేనలు ప్రయత్నించినపుడు మిత్రపక్షాల సేనలు వాటిని ఓడించాయి. ఆ యుద్ధంలో బ్రిటీష్‌ సైన్యంలోని నాలుగ గ్వాలియర్‌ ఇన్‌ఫాంట్రిలో కమాండింగ్‌ అధికారిగా పనిచేసిన లెప్టినెంట్‌ కల్నల్‌ వి.వి జోషి ముస్సోలినీ సేనల లంగుబాటుకు చిహ్నంగా ఒక అధికారి నుంచి బెరెట్టా తుపాకిని స్వీకరించాడు. అది యుద్ద ట్రోఫిగా మారింది. తరువాత జోషిని నాటి గ్వాలియర్‌ రాజు జియాజీరావు సింధియా సంస్ధాన కోర్టులో అధికారిగా నియమించాడు. జోషి దగ్గర వున్న బెరెట్టా తుపాకి దొంగ తుపాకులు అమ్మేవారి దగ్గరకు అక్కడి నుంచి హంతకుల దగ్గరకు ఎలా చేరిందన్న విషయాన్ని ఎవరూ దర్యాప్తు చేయలేదు. గాంధీ హత్యలో డాక్టరు దత్తాత్రేయ సహనిందితుడు. అతడిని పంజాబు హైకోర్టు కేసు నుంచి విడుదల చేసింది. ఎందుకంటే అతడు సాంకేతికంగా అప్పటికి బ్రిటీష్‌ పౌరుడు. స్వయంగా తన నేరాన్ని అంగీకరించినప్పటికీ బ్రిటీష్‌ ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం నిందితుడిగా మార్పిడి జరగలేదనే సాకుతో విడుదల చేశారు. గాంధీ హంతకులకు సంబంధించి నకిలీలకు ఇవన్నీ ఇబ్బంది కలిగించే వాస్తవాలు. వారు ఇప్పుడు తమకు నిజాలను తారు మారు చేయగల, చరిత్రను తమకు అనుకూలంగా తిరిగి రాయగల సామర్ధ్యం, అధికారం వచ్చాయని భావిస్తున్నారు. ఇప్పటికే పురాతన చరిత్రను దిగజార్చటంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు వర్తమాన చరిత్రను తమ అవసరాలకు అనుకూలంగా మార్చుకొనేందుకు పూనుకున్నారు. అని తుషార్‌ గాంధీ పేర్కొన్నారు.

చరిత్ర రెండు రకాలు, ఒకటి హీనమైనది, రెండవది ఘనమైనది. మొదటి చరిత్ర కలవారు రెండోవారిని కించపరిచేందుకు, తమకు లేని చరిత్రను కృత్రిమంగా తయారు చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. మన దేశంలో గాంధీ మహాత్ముడిని హత్యచేసిన వారు మతోన్మాదులు అన్నది తిరుగులేని సత్యం. ఒకవైపు హంతకుడు,కుట్ర చేసిన వారిని అనధికారికంగా కీర్తిస్తూ మరోవైపు వారితో తమపై ఏర్పడ్డ మచ్చను చెరిపివేసుకొనేందుకు కాషాయశక్తులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. నాధూరామ్‌ గాడ్సే మావాడు కాదు అన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వాదనదానిలో మొదటిది. అయితే హత్యానంతరం కమిషన్‌ విచారణలో వారికి వున్న సంబంధాన్ని నిర్ధారించటంతో పాటు గాడ్సే సోదరుడు స్వయంగా నాధూరామ్‌ గాడ్సే ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్‌ను వీడలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఏర్పడిన జనసంఘ్‌పై గాంధీ హత్య మరక చాలా పెద్దదిగా కనిపించేది, ఎందుకంటే గాడ్సేను సమర్ధించే ఆర్‌ఎస్‌ఎస్‌ వారు, హిందూమహాసభకు చెందిన వారందరూ ఆ పార్టీలో కనిపించేవారు. 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్దితిని ప్రకటించటం ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని కూడా జైళ్లలో వేయటంతో వారు ప్రజాస్వామ్యం పరిరక్షణలో జైలుపాలైన వారిగా ఫోజు పెట్టి తమపై వున్న మచ్చను కాస్త మసకపారేట్లు చేసుకున్నారు. జనతా పార్టీలో మత ముద్రను చెరిపివేసుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు, అయితే ఆర్‌ఎస్‌ఎస్‌-జనతా పార్టీలలో ఏదో ఒకదానిలో మాత్రమే సభ్యులుగా వుండాలన్న అంశం తెరమీదకు వచ్చినపుడు తమ ఓటు బ్యాంకును కాపాడుకోవాలంటే లౌకిక ముద్ర కంటే మతముద్రే లాభమని లెక్కలు వేసుకొని బిజెపి రూపమెత్తారు. తరువాత బాబ్రీ మసీదు కూల్చివేత- అయోధ్యలో రామాలయ నిర్మాణం తదితర అజెండాను ముందుకు తీసుకువచ్చినా విజయం సాధించలేకపోయారు. ఎదురుదెబ్బలు తిన్నారు. గత ఎన్నికలలో గణనీయ సంఖ్యలో సీట్లు సాధించినా మూడోవంతు కూడా ఓట్లు రాలేదు. ఆ వచ్చినవి కూడా నరేంద్రమోడీ గుజరాత్‌ను అభివృద్ది చేసిన ప్రగతివాదిగా చిత్రించటం, అన్నింటి కంటే కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, అసంతృప్తి కారణంగా ఆమేరకైనా ఓట్లు వచ్చాయి. ఆ ఓటింగ్‌ నిలవదని బిజెపి, సంఘపరివార్‌ నాయకత్వానికి తెలుసు. అందువలననే తమపై వున్న తిరోగామి ముద్రలను తుడిచివేసుకొనేందుకు పూనుకుంది. దానిలో తొలి అడుగు స్వచ్చభారత్‌ పిలుపును మహాత్మాగాంధీకి జతచేసి తాము ఆయనను గౌరవిస్తున్నామనే సందేశం పంపేందుకు ప్రయత్నించారు. దాని వలన ఆయనను హత్యచేసిన మచ్చపోయే అవకాశం లేదు. గతంలో ఏ సందర్భంలోనూ ప్రస్తావించని అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ నివేదిక పేరుతో ఒక కధనాన్ని ప్రచారంలో పెట్టారు. ఆ పధకంలో భాగమే బ్రిటీష్‌ గూఢచార విభాగానికి చెందిన గుర్తుతెలియని మూడో వ్యక్తి, అసలు లేని నాలుగో బుల్లెట్‌ కధ. మహాత్మాగాంధీని నిజంగా వదిలించుకోవాలని బ్రిటీష్‌ పాలకులు నిర్ణయించుకొని వుంటే ఆయనేం ఖర్మ యావత్తు స్వాతంత్య్రపోరాట నాయకత్వాన్నే అంతం చేసి వుండేది. అందునా స్వాతంత్య్రం ప్రకటించి, మన దేశం నుంచి వెళ్లిపోయిన తరువాత మహాత్ము డిని హత్యచేయాల్సిన అవసరం బ్రిటీష్‌ వారికి ఏమాత్రం లేదు. ఎందుకంటే వారు వెళ్లిపోయినా బ్రిటీష్‌ కార్పొరేట్ల పెట్టుబడులు అలాగే వున్నాయి. మహాత్ము డిని హత్య చేయించి వాటిని కాపాడుకోగలమనే పిచ్చి ఆలోచన వారికి కలిగే అవకాశం లేదు.

అయినా బ్రిటీష్‌ గూఢచారి కధ చెబుతున్నారంటే రాబోయే రోజుల్లో దాన్ని బలపరిచేందుకు వీలుగా అమెరికాలో కొత్త స్క్రిప్టు,దర్శ కత్వం, సినేరియో వంటి వన్నీ తయారువుతున్నాయని భావించాల్సి వుంది. మన మార్కెట్‌, మన మిలిటరీతో సంబంధాల విషయంలో అమెరికా పట్టు సాధించిన కారణంగా దానికి అనుగుణంగా వ్యవహరించే శక్తులకు లబ్ది చేకూర్చేందుకు అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. అనేకదేశాలలో ఇది రుజువైంది.మన దేశంలో కూడా అదే పునరావృతం అవనుందా ?

గమనిక: ఈ వ్యాసం ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాయబడినది.