బుధవారం నాడు మహాసభను ప్రారంభిస్తున్న గీ జింపింగ్
చైనా కమ్యూనిస్టుపార్టీ 19వ మహాసభ ప్రారంభం
ఎం కోటేశ్వరరావు
ప్రియమైన పాఠకులు ఈ వ్యాసం చదవటం ప్రారంభించే సమయానికి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరొక చారిత్రక అధ్యాయానికి చైనాలో తెరలేచింది. వారం రోజుల పాటు జరిగే చైనా కమ్యూనిస్టుపార్టీ 19వ మహాసభ బుధవారం నాడు ప్రారంభమైంది. బీజింగ్‌లోని తియన్మెస్ స్క్వేర్‌లోని గ్రేట్ హాల్‌లో మహాసభ ప్రారంభం వుపన్యాసంలో రానున్న ఐదు సంవత్సరాల కార్యాచరణకు సంబంధించిన అంశాలను పార్టీ ప్రధాన కార్యదర్శి గీ జింపింగ్ ఆవిష్కరించారు.’ ప్రస్తుతం చైనా, ప్రపంచం కూడా తీవ్ర మరియు సంక్లిష మార్పుల మధ్య వుంది. వ్యూహాత్మక అభివృద్ధి అవకాశాల విషయంలో చైనా ఇప్పటికీ ఒక ముఖ్యమైన యుగంలోనే వుంది. అవకాశాలు మెరుగ్గా వున్నాయి, అదే సమయంలో తీవ్రమైన సవాళ్లు కూడా వున్నాయి.’ అని జింపింగ్ చెప్పారు.
ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహసభల గురించి అటు శత్రువులు, ఇటు స్నేహితులలోనూ సహజంగానే ఎంతో ఆసక్తి తలెత్తుతుంది. గతంలో జరిగిన మహాసభలకు ముందు ప్రపంచ మీడియాలో ఎన్నో కట్టుకథలు, పిట్టకథలు రాసేవారు. ఈ సారి కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా తన పాఠకులు, వీక్షకులకు అటువంటి వినోదాన్ని చాలా పరిమితం చేసి ఎందరినో నిరాశపరిచింది.
పురాతన చరిత్రలో ఎన్నో వైవిధ్యాలను నమోదు చేసిన చైనా వర్తమానంలో కూడా అదే బాటలో నడుస్తోంది. పెట్టుబడిదారీ దేశాలు, వ్యవస్ధలతో ఆర్ధిక సంబంధాలు కలిగి వున్న కారణంగా కొన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నప్పటికీ ఏడాదికేడాది ఎన్నో విజయాలు సాధిస్తూ చైనా సోషలిస్టు వ్యవస్థ ముందుకు పోతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్ధకు పట్టిన జబ్బులు ఎప్పుడు వదులుతాయో, పక్షవాతం ఎన్నటికి నయమౌతుందో తెలియని స్ధితిలో చైనా గురించి అవాస్తవాలు రాసే మీడియా విశ్వసనీయత నానాటికీ పడిపోవటం వంటి కారణాలతో ఈ సభల సందర్భంగా వాటి జోలికి పోలేదా ? పది సంవత్సరాల క్రితం ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రం అమెరికాలో ప్రారంభమైన సంక్షోభానికి త్వరలో పదేండ్లు నిండబోతున్నాయి. తమతో పాటే చైనా కూడా మునిగిపోతుందని పిచ్చి కలలు కన్న వారిని చైనా కమ్యూనిస్టులు కొరడాతో కొట్టి లేపి మా విజయాలు చూడండి అని చూపుతున్న కారణంగానే 19వ మహాసభ సందర్భంగా వారు ఒళ్లు దగ్గర పెట్టుకున్నారా ?
కమ్యూనిస్టు పార్టీల మహాసభలు రెండు విధాలుగా జరుగుతాయి. అధికారంలో వున్న కమ్యూనిస్టు పార్టీలు సైద్దాంతిక సమస్యలతో పాటు తమ దేశ ఆర్ధిక వ్యవస్ధ, జనజీవన పరిస్ధితులను ఎలా మెరుగుపరచాలో సభలలో చర్చించి లక్ష్యాలను నిర్ణయించుకుంటాయి. ప్రస్తుతానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ముందు పెద్ద సైద్ధాంతిక సవాళ్లు లేవనే చెప్పాలి. అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదుల కుట్రలను వమ్ము చేసి, ప్రపంచ దేశాలతో సఖ్యత పెంచుకొని తన జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరచి వర్తమానం నుంచి మరో సోషలిస్టు దశకు ఎలా చేరటమా అన్నదే వారి ముందున్న పెద్ద సవాలు . అధికారంలో లేని కమ్యూనిస్టు పార్టీలు జరిపే సభలలో సైద్ధాంతిక, రాజకీయ ఎత్తుగడల పంధా, జనజీవన పరిస్థితుల మెరుగుదలకు చేపట్టాల్సిన పోరాటాల వంటి సమస్యలు ప్రధాన అజెండాగా వుంటాయి.
2012లో జరిగిన 18వ మహాసభ తరువాత చైనా సాధించిన అభివృద్ధి గురించి జాతీయ గణాంకాల సంస్థ వివరాలను గత వారంలో విడుదల చేసింది. 2013ా16 సంవత్సరాల మధ్య ప్రపంచ సగటు వృద్ధి రేటు 2.6, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 4 వుంటే చైనాలో 7.2శాతం వుంది.ఈ ఏడాది తొలి త్రైమాసిక వృద్ధి రేటు 6.9శాతం. గతేడాది ప్రపంచ జిడిపి విలువలో చైనా వాటా 14.8శాతం(11.2లక్షల కోట్ల డాలర్లు).గత నాలుగు సంవత్సరాలలో 3.4శాతం పెరిగింది. ఇదే కాలంలో ప్రపంచ పురోభివృద్ధికి చైనా 30శాతం వాటా అందించింది.ఇది అమెరికా, జపాన్, యూరోజోన్ దేశాల మొత్తం కంటే ఎక్కువ. జిడిపిలో సేవారంగం వాటా 45.3 నుంచి 51.6కు పెరిగింది. పట్టణాలలో పని చేసే గ్రామీణుల వార్షిక పెరుగుదల రేటు 1.8శాతం. పట్టణాలలో శాశ్వతనివాసితుల శాతం 52.57 నుంచి 57.35కు పెరిగింది. ఏటా కోటీ 30లక్షల కొత్త వుద్యోగాలు కల్పిస్తున్నప్పటికీ 31 పెద్ద నగరాలలో నిరుద్యోగులు ఐదుశాతం వున్నారు.పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు 1.91నుంచి 2.11శాతానికి పెరిగింది. పేటెంట్ దరఖాస్తుల స్వీకరణ 69శాతం, మంజూరు 39.7శాతం పెరిగింది.కొత్త కంపెనీల నమోదు పెరుగుదల 30శాతం. జనం ఖర్చు చేయగలిగిన తలసరి ఆదాయం 7,311యువాన్ల నుంచి 23,821కి పెరిగింది.వార్షిక పెరుగుదల రేటు 7.4శాతం. అది గ్రామీణుల విషయంలో 10.7శాతం వుంది.
1921లో షాంఘై నగరంలో చైనా కమ్యూనిస్టు పార్టీ తొలి మహాసభ జరిగింది.మావో సేటుంగ్‌తో సహా కేవలం 13 మంది మాత్రమే ప్రతినిధులు ఆ సభకు హాజరయ్యారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో కొన్ని డజన్ల మంది కార్యకర్తలు, నాయకులు మాత్రమే అసమయానికి వున్నారు.వారి నాయకత్వంలో కమ్యూనిస్టుపార్టీ 28 సంవత్సరాల తరువాత అనూహ్యరీతిలో చైనాలో అధికారాన్ని స్వీకరిస్తుందని వారు ఆ సమయంలో వూహించి వుండరు. ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమ చరిత్రలో చైనాకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అక్కడి భౌతిక పరిస్ధితులకు అనుగుణ్యంగానే ‘చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ’ నిర్మాణం చేపట్టాలని 1982లో పన్నెండవ మహాసభ నిర్ణయించింది. బీజింగ్‌లో జరుగుతున్న 19వ సభకు 8.9కోట్ల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశమంతటి నుంచీ ఎన్నికైన 2,287 మంది ప్రతినిధులు హాజరుకావాల్సివుంది. ఈ సభలో ఇరవై అయిదు మందితో పొలిట్‌బ్యూరో, ఏడుగురితో పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ, 205 మందిని కేంద్రకమిటీ సభ్యులుగా మరి కొందరిని ప్రత్యామ్నాయ కమిటీ సభ్యులుగా ఎన్నుకుంటారు. కేంద్రకమిటీ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటుంది.
గతమహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గ్జీ జింపింగ్(64) తిరిగి ఆ బాధ్యతకు ఎన్నికయ్యే అవకాశాలున్నాయని, పార్టీలో అంతర్గతంగా ఎలాంటి నాయకత్వ సమస్యలేదని, స్టాండింగ్ కమిటీలోని ఏడుగురిలో ఐదుగురు బాధ్యతల నుంచి తప్పుకొంటారని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ మహాసభలలో చర్చించబోయే అంశాలను ముందుగానే గత మహాసభలో ఎన్నికైన కేంద్రకమిటీ ఖరారు చేస్తుంది.రాబోయే మహాసభ వరకు ఏమి చెయ్యాలో ముసాయిదా నివేదికలను రూపొందిస్తుంది. ఒక వేళ కేంద్రకమిటీలో తీవ్రమైన భిన్నాభిప్రాయాలుంటే పార్టీ అత్యున్నత విధాయక పార్టీ మహాసభకు నివేదిస్తుంది. అంగీకారమైతే వాటిని నివేదికలు లేదా తీర్మానాలలో చేర్చుతారు, లేదా సవరణ ప్రతిపాదనలను ఓటింగ్‌కు పెట్టి అంతిమ నిర్ణయం చేస్తారు.
ఈ మహాసభ సమయంలో పిట్టకథలేమీ లేవంటే అసలేమీ లేవని కాదు. అవి లేకపోతే మీడియాకు కిక్కు వుండదు కదా. బహిరంగంగా మాట్లాడే అసమ్మతి వాదులను మహాసభ సమయంలో బీజింగ్ వదలి వెళ్లమన్నారని, విదేశీ జర్నలిస్టులతో మాట్లాడవద్దన్నారని రాశారు. అధికారిక వార్తా సంస్ధ నుంచి వచ్చే కథనాలను తప్ప వేరే పుకార్లను వ్యాపింపచేయవద్దని, చోటివ్వవద్దని మీడియా సంస్ధలకు జారీ చేసిన రహస్య సెన్సార్ నిబంధనలలో పేర్కొన్నారని ఒక పత్రిక రాసింది. ఇవెంత హాస్యాస్పదమో వేరే చెప్పనవసరం లేదు. ఇవే నోళ్లు గతంలో అసమ్మతి వాదులను జైలు పాలు చేశాయని చెప్పి ఇప్పుడు నగరం విడిచి వెళ్లమని చెప్పాయని చెబుతున్నాయి. అధికార మీడియా సంస్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా రహస్య సెన్సార్ నిబంధనలు అని చెప్పటం కట్టుకధగాక మరేమిటి? గత నాలుగు దశాబ్దాలుగా చెబుతున్న ఒక పిట్టకధ చైనీయులు చెప్పే అంకెలను నమ్మకూడదు. ఎవరు నమ్మమన్నారు? వివిధ దేశాలతో వాణిజ్య మిగులు కారణంగా ఏ దేశం వద్ద లేనన్ని డాలర్లు పోగుపడ్డాయా లేదా? చివరకు అమెరికాయే వారి నుంచి అప్పుతీసుకొంటోందా లేదా? అన్ని దేశాల నుంచి పెట్టుబడిదారులు అక్కడికి వెళ్లి పరిశ్రమలు, వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారా లేదా ?
ప్రపంచ ధనిక దేశాలలో కొనసాగుతున్న సంక్షోభాన్ని ఇతర దేశాలపై నెట్టేందుకు, ఇతర దేశాల మార్కెట్లను ఆక్రమించుకొని ఇబ్బందుల నుంచి తాము బయట పడాలని పెట్టుబడిదారీ వర్గం చేయని ప్రయత్నం లేదు. వారికి కంటగింపుగా వున్న తమను వేయి కళ్లతో చూస్తున్నాయని చైనా నాయకత్వానికి తెలియంది కాదు. గత మూడు దశాబ్దాలుగా విపరీత వేగంతో జరిగిన అభివృద్ది వారికి కొత్త సమస్యలను తెచ్చింది. ఆర్ధికరీత్యా తమతో సంబంధాలు కలిగి వున్నప్పటికీ సోషలిస్టు వ్యవస్థను కూల్చేందుకు, మిలిటరీ రీత్యా దెబ్బతీసేందుకు పశ్చిమ దేశాలు నిత్యం ప్రయత్నిస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. వీటిని ఎదుర్కొంటూనే, అంతర్గతంగా సామాజికంగా తలెత్తుతున్న సమస్యల నుంచి తమ వ్యవస్ధను మెరుగుపరుచుకోవటం అనే ద్వంద్వ సవాళ్లను ప్రస్తుతం చైనా నాయకత్వం ఎదుర్కొంటున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ ప్రపంచంలో వున్న వైరుధ్యాలను ప్రస్తుతానికి అది వుపయోగించుకోగలుగుతోంది. ఈ రోజు చైనా సాధిస్తున్న పురోగతి, దాని నుంచి ఇతర పెట్టుబడిదారీ దేశాల మాదిరి లబ్ది పొందకుండా మనకు మనమే గిరిగీసుకోవద్దని ఆస్ట్రేలియా-చైనా వాణిజ్య మండలి మాజీ సిఇవో లారీ పెర్సీ ‘ఆస్ట్రేలియన్’ పత్రికలో చైనా కమ్యూనిస్టుపార్టీ మహాసభ సందర్భంగా రాసిన వ్యాసంలో సలహా ఇచ్చారు. నలభై అయిదు సంవత్సరాల క్రితం 1971లో ఆస్ట్రేలియా ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు విట్‌లామన్ చైనా సందర్శించారు. అది జరిగిన మూడు రోజుల తరువాత అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ రహస్యంగా చైనా వెళ్లి నిక్సన్ పర్యటనకు ఏర్పాట్లు చేసి వచ్చాడు. ఆ పర్యటనను నాడు అధికారంలో వున్న ఆస్ట్రేలియా సంకీర్ణ కూటమి దాన్ని బుద్దిలేని వ్యవహారంగా చూసిందని ఆ వుదంతాన్ని పేర్కొంటూ అమెరికాయే చైనాతో సంబంధాలు పెట్టుకొని లబ్ది పొందుతున్నపుడు మనం కూడా చైనా నుంచి ఎందుకు లబ్ది పొందకూడదని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఇది ఒక్క ఆస్ట్రేలియా కార్పొరేట్ల వైఖరే కాదు. గత పది సంవత్సరాలుగా ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న మన దేశంతో సహా అన్ని పెట్టుబడిదారీ దేశాల కార్పొరేట్ల ఆలోచనకు అది ప్రతిబింబం. అందువలనే బయట వున్న ఆర్‌ఎస్‌ఎస్ గాంగ్ చైనా వ్యతిరేక ప్రచారం చేసి ఇంతకాలం తాము తయారు చేసిన కమ్యూనిస్టు వ్యతిరేకులను సంతృప్తి పరుస్తుంటే అధికారంలో వున్న ఆర్‌ఎస్‌ఎస్ నేతలు చైనాతో వాణిజ్యం, పెట్టుబడులతో కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారు. ఇది వారి ద్వంద్వ స్వభావం అనేకంటే మోసకారి తనం అనాలి.
చైనా కమ్యూనిస్టు పార్టీ విజయాల వెనుక ఎంతో పకడ్పందీగా పధకం రూపొందించటం, ఆచరణ గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా అంగీకరిస్తారు. బ్రిటీష్ వారి కౌలుకింద వున్న హాంకాంగ్ ప్రపంచంలో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ కేంద్రాలలో ఒకటిగా మారింది. తిరుగుబాటు రాష్ట్రంగా వున్న తైవాన్ కూడా అదేమాదిరి అభివృద్ధి చెందింది. వాటితో పోల్చుకుంటే ప్రధాన భూభాగం ఎంతో వెనుక బడి వుంది. కౌలు గడువు తీరి హాంకాంగ్ చైనాలో విలీనమైంది. అక్కడ వున్న పెట్టుబడుల అవసరం చైనాకు వుంది. అందువలననే సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి భంగం కలగకుండానే ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానం కింద 2050వరకు హాంకాంగ్ ఆర్ధిక వ్యవస్ధలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఒక ఒప్పందం చేసుకొని అక్కడి పెట్టుబడిదారులకు స్పష్టమైన హామీనిచ్చింది.
చైనాలో సంస్కరణలు మొత్తం మీద ఎంతో అభివృద్దికి దోహదం చేసినప్పటికీ ఆదాయ, ప్రాంతాల మధ్య అసమాన అభివృద్ధి అసమానతలు, అవినీతి పెరుగుదల వంటి సమస్యలతో పాటు, సామాజికంగా మత ప్రభావం పెరుగుదల వంటి కొత్త సమస్యలను చైనా ఎదుర్కొంటోంది. వాటిని తక్కువగా చూడనవసరం లేదు. వాటిని పరిష్కరించటంలో చైనా నూతన నాయకత్వం ఎలాంటి చర్యలను చేపడుతుందన్నదే ఆసక్తికరం.