Tags

, , , , ,

కొండూరి వీరయ్య

అర్థశాస్త్రంలో 2017 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ బహుమతి రిచర్డ్‌ థేలర్‌ను వరించింది. దానివల్ల అర్థశాస్త్ర పరిశోధనా రంగంలో ఉన్న మేధావులు ఎంతైనా చర్చించుకోవచ్చు. కానీ థేలర్‌కు నోబెల్‌ బహుమతి రావటం పట్ల దేశంలో బిజెపి సంబరాలు చేసుకోవటమే ఈ వ్యాసానికి నేపథ్యం. థేలర్‌ను ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించిన వెంటనే బిజెపి ఐటి సెల్‌ ( దేశవ్యాప్తంగా బిజెపి, ప్రధాని పేరు మీద ప్రచారమవుతున్న అవాకులు, చవాకులు, అర్థ సత్యాలు, అసత్యాలు, నిరాధారమైన అభిప్రాయాల పోగు పోసే కేంద్రం – సంక్షిప్తీకరణ కోసం బిజెపి గోబెల్స్‌ విభాగం అని పిలుద్దాం) సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన వెలువడించింది. మోడీ అమలు చేసిన నోట్ల రద్దు పథకాన్ని థేలర్‌ సమర్ధించాడు అన్నది ఈ ప్రకటన సారాంశం. నోబెల్‌ విజేత పేరు ప్రకటించగానే బిజెపి ఐటి సెల్‌ అధ్యక్షుడు అమిత్‌ మాలవీయ తన ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. యథా ప్రకారం ఈ ప్రకటనను సుక్షితులైన బిజెపి ఐటి కరసేవకులు దేశమంతా వ్యాపింపచేశారు. థేలర్‌ నోబెల్‌ విజేత కావటానికి, మోడీ నోట్ల రద్దు నిర్ణయానికి ఏమిటి సంబంధం ?

బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ గురించిన చర్చను భారతదేశంలో నోట్ల రద్దు అనుభవాలతో పోల్చవచ్చు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తొలి దఫా సమర్ధకులు ముందుకు తెచ్చిన వాదన ఇలా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నగదు వినియోగం వల్లనే ఆర్థిక వ్యవస్థ పలు సమస్యలు ఎదుర్కొంటోంది. నగదు పట్ల ప్రజల మక్కువ తగ్గించాలంటే నగదు పనికిరాని కాగితం కింద మార్చటం ద్వారా ఆర్థిక లావాదేవీల్లో వారి ప్రవర్తన, కొనుగోళ్ల పద్దతి, ప్రాధాన్యతలనను నగదురహిత ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లించటానికి నోట్లు రద్దు నిర్ణయం ఉపయోగపడుతుంది అన్నది ఈ విశ్లేషణల సారాంశం. ఈ సందర్భంగానే తొలిసారిగా పామర చర్చల్లో సైతం ఆర్థిక లావాదేవీలు- ప్రవర్తనాశీలత (బిహేవియరల్‌ ఎకనమిక్స్‌) గురించిన చర్చ సార్వత్రికమైంది. నగదు రహిత లావాదేవీల ప్రయోజనాల గురించి బిజెపి గోబెల్స్‌ విభాగం కంప్యూటర్లెక్కి కూయటమే కాదు. మన జేబుల్లో ఉన్న సెల్‌ఫోన్లల్లో కూడా అర్థరహిత సమాచారాన్ని నింపేసింది. ఇదే నిజమని నమ్మిన పలువురు మేధావులు, ఆర్థిక వేత్తలు, ఆరెస్సెస్‌-బిజెపి కంప్యూటర్‌ కరసైనికులతో గొంతు కలిపి నోట్ల రద్దు విమర్శకుల నోళ్లు మూయించటానికి విశ్వ ప్రయత్నం చేశారు.

విదియ నాడు కనపడకపోతే తదియ నాడు కనపడుతుంది అని తెలంగాణలో ఒక సామెత ఉంది. అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌శౌరి వంటి వాళ్ల మొదలు నోట్ల రద్దుకు సిపార్సు చేసిన గురుమూర్తి వంటి వారంతా ఆర్థిక వ్యవస్థ పట్ల నిర్వేదం వ్యక్తం చేస్తూ వరుసగా నోళ్లు తెరిచారు. గత ఆర్నెల్లుగా ఈ ప్రమాదాన్ని వామపక్ష ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తూనే వచ్చారు. నిద్రపోయే వాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్లు నటించేవాడిని లేపలేము కదా… ఈ విమర్శల పట్ల ప్రభుత్వ స్పందన ఈ సామెతనే గుర్తు తెస్తోంది. రెండ్నెల్ల క్రితం స్వయంగా రిజర్వు బ్యాంకు విడుదల చేసిన వార్షిక నివేదికలో నోట్ల రద్దు నిర్ణయంతో ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు అని నిర్దారించింది. ఆగస్టు చివరి వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడిన ఆర్థిక సర్వేలో నోట్ల రద్దు, జిఎస్టీ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్త కుంగిపోయింది అన్న అంచనాను వెల్లడించింది. బిజెపి గోబెల్స్‌ విభాగం మోడీ నిర్ణయాన్ని సమర్ధించుకోవటానికి థేలర్‌ను అరువు తెచ్చుకొంటోంది. నిజంగా నోట్ల రద్దు మీద థేలర్‌ అభిప్రాయం ఏమైనా ఈ రకమైన అరువుతెచ్చుకున్న మద్దతు ద్వారా కుదేలైన ఆర్థిక వ్యవస్థ బతికి వస్తుందా అన్న ప్రశ్నకు బిజెపి కంప్యూటర్‌ కరసేవకులు, వారిని పనికి పురామాయించిన పెద్ద తలకాయలు సమాధానం ఇవ్వాలి.

బిహేవియరల్‌ ఎకనమిక్స్‌కు పునాదులు ఆధునిక వినిమయ వాదంలో ఉన్నాయి. సరళీకరణ విధానాల ఆరంభానికి ముందు ఆర్థిక నిర్ణయాలు ప్రధానంగా వ్యవస్థాగతంగా ఉండేవి. అంటే ఆయా దేశాల రాజకీయ ఆర్థిక వ్యవస్థల ప్రయోజనాలు, పురోగతి నేపథ్యంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకునే పద్ధతి. ఈ క్రమంలో జాతీయ వనరులు అర్థవంతమైన వినియోగంతో పాటు పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభాల రేటుపై నియంత్రణలకు దారితీసింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారీ వ్యవస్థను బతికించటానికి కీన్స్‌ ముందుకు తెచ్చిన సంక్షేమ ఆర్థిక విధానాలు, వాటి ద్వారా సాధారన ప్రజానికి కలిగే కొద్దిపాటి వెసుబాట్లు కూడా దిగమింగటం పెట్టుబడిదారీ వ్యవస్థకు సాధ్యం కాలేదు. దాంతో సంక్షేమ ఆర్థిక విధానాలపై మొదలైన మితవాద ఆర్థికవేత్తల దాడిలో ఒక కోణమే బిహేవియరల్‌ ఎకనమిక్స్‌. ఈ ధోరణి ప్రకారం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రతి వ్యక్తీ వినియోగదారుడే. వినియోగపు అస్థిత్వమే వ్యక్తి అస్థిత్వంగా మారుతుంది. ప్రపంచీకరణ విధానాలు పుంజుకున్న తర్వాత ఈ ధోరణి మరింత ముదిరి నిర్ణీత మోతాదులో వినియోగం చేయలేని వాళ్ల గురించి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఆలోచించాల్సిన అవసరం లేదు అనేంత వరకు వెళ్లింది. ఆధునిక మాల్స్‌లో ఖరీదైన వస్తువుల అమరిక ఆరోహణ క్రమంలో అమర్చటాన్ని మనం రోజూ గమనిస్తూనే ఉంటాం. కొనుగోలు చేసే వస్తువుల ఖరీదును బట్టి కొనుగోలుదారుడికి అందే సమపర్యలుంటాయి.

వాణిజ్య ప్రకటనల కోలాహలం బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ పునాదిగా పెరిగిన ధోరణే. ఈ వాణిజ్య ప్రకటనల వెనక ఉన్న ఉద్దేశ్యం కేవలం ఉత్పత్తుల గురించిన సమాచారాన్ని వినియోగదారుల వద్దకు చేర్చటమే కాదు. తమ ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని వారిని ప్రభోదించటం, ప్రభావితం చేయటం కూడా. సూత్ర రీత్యా బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ చెప్పేది విస్తృతమైన ప్రత్యామ్నాయాలు (ఒకే సరుకు వివిధ బ్రాండ్లలో) అందుబాటులో ఉంటే నచ్చింది ఎంచుకునే స్వేఛ్చ వినియోగదారుడికి ఉంటుంది. ఈ ఆర్థిక సూత్రీకరణలో ప్రధాన లోపం ఉంది. అది వినియోగదారుల ఆర్థిక సామాజిక స్థాయి, కొనుగోలు శక్తి, అవసరాలుతో నిమిత్తం లేకుండా మూసపోసిన కొనుగోలుదారుల మందను తయారు చేయటమే ఈ లోపం.

ఈ ధోరణి మరో చర్చను కూడా ముందుకు తెస్తుంది. ఇది మరింత ప్రమాదకరమైనది. డేటా మోడలింగ్‌తో ముడిపడిన అంశం ఇది. దీన్ని పరిశీలించటానికి ఆర్థిక రంగం కంటే రాజకీయ రంగం మరింత అర్థవంతంగా ఉంటుంది. 2013 మొదలు 2017 సెప్టెంబరు వరకు బిజెపి, మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానం ఇది. ప్రజలను నిర్దిష్ట ఆలోచనలు, అవసరాలు, అవగాహనలు, అస్థిత్వాలు ఉన్న వ్యక్తులుగా కాక తమ సమాచార సరఫరాకు క్షేత్రంగా మాత్రమే చూసే ధోరణి. ఒక సారి వ్యక్తులు తమ సామాజిక అస్థిత్వం కోల్పోయిన ప్రయోగశాలలో పరిశీలనావస్తువులుగా మారిన తర్వాత వారి నిర్ణయాలను ప్రభావితం చేయటంలో డేటా మోడలింగ్‌ ద్వారా చూపించే ప్రొజెక్షన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. 2014 ఎన్నికల్లో మోడీ అనుసరించిన ప్రచార వ్యూహం ఇది. ఆ తర్వాత కూడా వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ విధంగా ఓటర్లు, ప్రజల రాజకీయ అభిప్రాయాలు ప్రభావితం చేయటం ద్వారా ఓటింగ్‌ విషయంలోనూ లేదా ప్రభుత్వ నిర్ణయాలను అంచనా వేసే విషయంలోనూ తప్పు దారి పట్టించటం ద్వారా తమ ప్రభుత్వం తమ పబ్బం గడుపుకుంటున్న తీరును గమనిస్తూనే ఉన్నాము. ఇదే ధోరణి బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ ద్వారా వస్తూత్పత్తుల వినియోగం విషయంలో కొనుగోలు దారుల బ్రెయిన్‌ వాష్‌ చేసే టెక్నిక్కులు విపరీతంగా రూపొందించబడతాయి. ఇదే ధోరణిని తాజాగా హిందూత్మ మతోన్మాద శక్తులు వంటబట్టించుకున్నాయి.

కీన్స్‌ విధానాలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సామాజిక అవసరాలు తీర్చటానికి ఉపయోగపడే సమీకృత, పరస్పరాధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తెస్తే సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలతో సమాంతరంగా పుట్టుకొచ్చిన బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ వికేంద్రీకృత ఆర్థిక విధాన నిర్ణయ వ్యవస్థను ముందుకు తెస్తుంది. ఈ ధోరణిలో ఆర్థిక వ్యవస్థలోని ఏ రంగానికి ఆ రంగం పూర్తి స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ఆయా రంగాల లాభాల రేటును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించటం జరుగుతుంది. దాంతో స్థూల ఆర్థిక వ్యవస్థలో ఉండాల్సిన సమతౌల్యం దెబ్బతింటోంది. ప్రణాళికా రంగం రద్దు చేసిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు దీనికి సరైన ఉదాహరణ.

అమెరికాలో ఒబామా ప్రభుత్వం గానీ ఇంగ్లాండ్‌లో టోనీ బ్లెయిర్‌ ప్రభుత్వంగానీ తమ కార్యాలయాల్లోనే ప్రత్యేకంగా సామాజిక ప్రవర్తనా శాస్త్రవేత్తల బృందాలను నియమించి పాలకవర్గం అవసరాల నేపథ్యంలో ప్రజల మనోభావాలు ప్రభావితం చేయటానికి తద్వారా ఓటర్ల నిర్ణాయక సామర్ధ్యాన్ని ప్రభావితం చేయటానికి అవసరమైన ప్రయోగాత్మక విధానాలు రూపొందించాయి. ఆయా దేశాల నుండి పాఠాలు నేర్చుకున్న మోడీ ప్రభుత్వం అవే ప్రయోగాత్మక విధానాలు భారతదేశంలో అమలు చేయటం ద్వారా ఓటర్ల నిర్ణాయక సామర్ద్యాన్ని అన్ని వేళలా ప్రభావితం చేయాలనుకొంటోంది.చేయగలననుకొంటోంది. ఏదైనా కీలక సందర్భం, సమస్య ముందుకొచ్చినపుడు ప్రజల దృష్టిని మళ్లించటానికి అవరమైన అప్రాధాన్య విషయాలను, అర్థసత్యాలను, అసత్యాలను, నిరాధారమైన విషయాలను ప్రజల ముందు కుప్పలు పోయటానికి బిజెపి కంప్యూటర్‌ కరసేవకులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. బిహేవియరల్‌ ఎకనమిక్స్‌లో సరైన నిర్ణయం అంటే కంపెనీల లాభాలు పెంచేందుకు దోహదం చేసేది. బిహేవియరల్‌ పాలిటిక్స్‌లో సరైన నిర్ణయం అంటే పాలకవర్గాల ప్రయోజనాలు ముందుకు తీసుకెళ్లేంది. ప్రజలు గొర్రెల మంద కాదు. ఈ రెండు రకాల ప్రమాదాల నుండి సగటు మనిషి తన సామాజిక రాజకీయ జంతువుగా (అరిస్టాటిల్‌ అన్నట్లు) తన అస్థిత్వాన్ని కాపాడుకోవటానికి చేసే ప్రయత్నమే ఇటువంటి కుహనా సిద్ధాంతాలపై సాగించే పోరాటంలో అంతర్భాగమవుతుంది.