Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

ఏమో, అధికారమే పరమావధిగా భావించే వారు దేనికైనా పాల్పడవచ్చు. నరేంద్రమోడీ రాజధర్మాన్ని పాటించే వ్యక్తి కాదని గతంలో ఎన్నోసార్లు రుజువైంది కనుక ఏమైనా చేయవచ్చు. నిబంధనలు ఏమి వున్నప్పటికీ ఒకే రోజు లెక్కింపు జరిపే సందర్భాలలో ఎన్నికలు జరిగే వ్యవధి ఎక్కువగా వున్నప్పటికీ వివిధ రాష్ట్రాలు, నియోజకవర్గాలకు ఒకే సారి షెడ్యూలు ప్రకటించటం ఆనవాయితీ. దానికి విరుద్ధంగా కేంద్ర ఎన్నికల సంఘం హిమచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ల విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించి విమర్శల పాలైంది. కేంద్ర అధికారపక్షం , ప్రధాని నరేంద్రమోడీ వత్తిడి మేరకే ఇది జరిగిందన్నది జనవాక్యం. మోడీది ఒక పద్దతి అయితే ఆయన చెట్టపట్టాలు వేసుకొని భాయి భాయి అన్నట్లుగా వున్న జపాన్‌ ప్రధాని షింజో అబె మరొక తీరుతో వ్యవహరించారు. అన్నీ ముందే సిద్ధం చేసుకొని ప్రతిపక్షాలకు ,ఓటర్లకు తగిన వ్యవధి ఇవ్వకుండా ఆకస్మిక ఎన్నికలను రుద్ధారు. పద్నాలుగు నెలల గడువున్నప్పటికీ జపాన్‌ ప్రధాని అక్టోబరు 22న మధ్యంతర ఎన్నికలు జరపాలని నిర్ణయించి జరిపించేశారు.అక్కడి రాజ్యాంగం ప్రకారం ప్రధాన మంత్రి పార్లమెంట్‌ను రద్దు చేసిన 40 రోజులలోగా ఎన్నికలు జరపాల్సి వుంది. అయితే 26 రోజులకే పూర్తి చేశారు.

జపాన్‌ పార్లమెంట్‌ ‘డైట్‌ ‘ వ్యవధి నాలుగు సంవత్సరాలు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత 1946 నుంచి ఇప్పటి వరకు 27 ఎన్నికలు జరిగాయి. సగటున ప్రతి 31నెలలకు ఒక ఎన్నికను జనం మీద రుద్దారు. ఇది జపాన్‌లో ప్రజాస్వామ్యం పరిహాసంపాలైన తీరు, అక్కడి ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధల సంక్షోభాన్ని వెల్లడిస్తున్నది. ఇక ఫలితాల విషయానికి వస్తే మన తెలుగు మీడియాతో సహా కార్పొరేట్‌ మీడియా అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎల్‌డిపి) కూటమి మూడింట రెండువంతుల మెజారిటీ సాధించినట్లు వూదర గొట్టింది. నిజానికి పాలక కూటమి విజయానికి ఎలాంటి ఢోకా లేదని ముందుగానే అక్కడి మీడియా, విశ్లేషకులు చెప్పేశారు. అయితే రద్దయిన సభలో వున్న స్ధానాల కంటే తక్కువ వచ్చాయి. ప్రతిపక్షాల చీలిక కారణంగా పాలక కూటమి ఏక సభ్య నియోజకవర్గాలలో ఓట్లకంటే సీట్లు ఎక్కువ తెచ్చుకుంది. దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగిన చోట్ల అధికారానికి వచ్చిన ఎల్‌డిపికి వచ్చిన ఓట్లు 33శాతమే, వాటిని మొత్తంలో లెక్కించి చూస్తే 17.3శాతమే. జపాన్‌ ఎన్నికల చరిత్రలో అతి తక్కువ ఓట్లు పోలు కావటం ఇది రెండవసారి. ఓటింగ్‌ వయస్సును 20 నుంచి 18కి తగ్గించిన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో 53.69 శాతం పోలు కాగా కనిష్ట రికార్డు గత ఎన్నికలలో 52.66గా నమోదైంది. ఎన్నికల పట్ల ఓటర్లు పెద్దగా ఆసక్తి కనపరచలేదన్నది స్పష్టం.

డైట్‌లోని దిగువ సభ 475 స్ధానాలలో 295 సీట్లకు నియోజకవర్గాల వారీ ప్రత్యక్ష పద్దతి, 180 సీట్లకు పదకొండు బ్లాకుల వారీ దామాషా పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి. ఇదే విధంగా ఎగువ సభలోని 242 స్ధానాలకు గాను 146 మంది సభ్యులను 47 ఒకటి అంతకంటే ఎక్కువ స్ధానాలున్న నియోజకవర్గాల నుంచి ప్రత్యక్ష ఎన్నికల పద్దతిలో 96 స్ధానాలకు దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి. దిగువ సభ పరిమితి నాలుగు సంవత్సరాలు కాగా ఎగువ సభ ఆరు సంవత్సరాలు, ప్రతి మూడు సంవత్సరాలకు సగం సీట్లకు ఎన్నికలు జరుగుతాయి.1982 నుంచి ఎన్నికల సంస్కరణలలో భాగంగా పరిమితమైన దామాషా విధానాన్ని ప్రవేశ పెట్టారు.జపాన్‌ ఎన్నికలలో సామాన్యులు పాల్గొనే అవకాశం లేదు. ఒక్కొక్క అభ్యర్ధి డిపాజిట్‌గా చెల్లించే 6లక్షల ఎన్‌లలో (మన రూపాయలలో 3లక్షల 42వేలు) తెచ్చుకున్న ఓట్లను బట్టి పదిశాతంపైన తెచ్చుకున్న వారికి వచ్చిన ఓట్లను బట్టి కొంత డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి ఇస్తారు. అందువలన డబ్బున్నవారే, వారినే పాలక పార్టీలు రంగంలోకి దించుతాయి. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియదు కనుక జనం ఆలోచించుకొనే లోపే పాలకపార్టీ అతి తక్కువ వ్యవధిలో ఆకస్మిక ఎన్నికలను ప్రకటించటం సర్వసాధారణం.

తాజా ఎన్నికల ఫలితాలకు వస్తే ఎన్నికలు జరిగిన 465 స్ధానాలకు గాను పాలక ఎల్‌డిపికి రద్దయిన సభలో 291 స్ధానాలుండగా తాజాగా 284కు తగ్గాయి, దాని మిత్రపక్షమైన కోమీ పార్టీ బలం 35 నుంచి 29కి పడిపోయింది. వాటి బలం 313, ప్రతిపక్షాల విషయానికి వస్తే రెండు కూటములుగా పోటీ చేశాయి. యుద్ధ, అణ్యాయుధాల వ్యతిరేక, అహింసా విధానాలను ఆమోదించే రాజ్యాంగ బద్ద డెమోక్రటిక్‌ పార్టీ, కమ్యూనిస్టుపార్టీ, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ పౌర కూటమిగా పోటీ చేశాయి. వరుసగా ఈ పార్టీలకు 55,12,2 చొప్పున 69 వచ్చాయి. రెండవది కోయికీ కూటమి, ఇది ఎల్‌డిపి నుంచి విడిపోయిన టోకియో గవర్నర్‌ యురికో కోయికి నాయకత్వంలో సెప్టెంబరు 25న ఏర్పడిన కిబోనోటో(ఆశాజీవి), నిప్పన్‌ ఇషిన్‌ కయ్‌ పేరుతో వున్న ఒక చిన్న పార్టీ కలసి పోటీ చేశాయి. వాటికి 50,11 చొప్పున 61 వచ్చాయి. పాలక పార్టీ నుంచి బయటకు పంపిన వారు, వచ్చిన వారితో కిబోనోటో పార్టీ ఏర్పడింది. జపాన్‌ రాజకీయాలలో ఇంతకాలం ప్రధాన ప్రతిపక్షంగా, గతంలో అధికారానికి వచ్చిన డెమోక్రటిక్‌ పార్టీ దీనిలో విలీనమైంది. రెండవ కూటమిలోని రాజ్యాంగ బద్ద డెమోక్రటిక్‌ పార్టీ ఎన్నికల ప్రకటన జరిగిన తరువాత అక్టోబరు 2న కొత్తగా ఏర్పడింది. ఎన్నికల ప్రకటన జరిగిన తరువాత కూడా కొత్త పార్టీల నమోదు, పోటీకి అక్కడ అవకాశం వుంది. ఒక్క కమ్యూనిస్టు పార్టీ తప్ప ప్రతి ఎన్నిక సమయంలో జపాన్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలలోని ముఠాలు కొత్త పార్టీలను ఏర్పాటు చేయటం ఎన్నికలలో కొన్ని సీట్లు సంపాదించటం మామూలు విషయం. ఈ ముఠాలు, వ్యక్తులు ఎప్పుడు ఏ పార్టీలో వుంటాయో తెలియదు. సరిగ్గా అలాంటి పరిస్ధితే మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఏర్పడటం చూస్తున్నాము. ఇలాంటి అవకాశవాదానికి కార్పొరేట్ల, వ్యక్తుల వ్యాపారలావాదేవీల ప్రయోజనాలు, లాభాలే అసలైన కారణాలుగా వున్నాయి. రద్దయిన సభలో 20 స్ధానాలున్న కమ్యూనిస్టుల బలం ఈసారి 12కు పడిపోయింది. ఏడు అంగీకృత అంశాలపై ఐక్యంగా పోటీ చేసిన మూడు పార్టీల పౌర కూటమి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించటమే వూరట కలిగించే అంశం.

రద్దయిన సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ వున్న ఎల్‌డిపిలో ఎలాంటి చీలిక లేకపోయినప్పటికీ ప్రధాని షింజే అబే ముందస్తు ఎన్నికలకు పోయిన కారణాలను చూస్తే మన దేశంలో నరేంద్రమోడీ కూడా అదే పని చేస్తారా అని అనుమానించకతప్పదు. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని నెరవేర్చుకొనేందుకు షింజో అబే ఆకస్మిక ఎన్నికలు జరిపారని విశ్లేషకుల అభిప్రాయం. గత రెండున్నర దశాబ్దాలుగా జపాన్‌ ఆర్ధిక వ్యవస్ధ ఒక దీర్ఘకాల పక్షపాత రోగి మాదిరి వుంది. అమెరికా తరువాత వున్న రెండవ స్ధానాన్ని చైనా ఆక్రమించటంతో మూడో స్ధానానికి దిగజారింది. ప్రస్తుతం వున్న స్ధితి నుంచి తమ దేశ కార్పొరేట్‌ సంస్ధలకు మరింతగా మార్కెట్‌ను కల్పించాలంటే అహింసా విధానం నుంచి తప్పుకొని మిలిటరీ పునరుద్ధరణ, ఇతర దేశాలలో జోక్యానికి వీలుగా తన స్వదేశీ, విదేశీ విధానాన్ని మార్చాలని గత కొంత కాలంగా అక్కడి పాలకవర్గం ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ సమీక్ష పేరుతో దాన్ని అమలు జరపాలని చూస్తున్నారు. చైనా, వుత్తర కొరియాల నుంచి ముప్పు, వాటి ఆయుధ పరీక్షలను సాకుగా చూపుతున్నారు. తాజా ఎన్నికలకు ఆర్ధిక వ్యవస్ధలో మార్పుల గురించి చెప్పినప్పటికీ అంతర్గతంగా పైన చెప్పిన అజండా వుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్‌ రక్షణ బాధ్యతను అమెరికా, జర్మనీ బాధ్యతను అమెరికా నాయకత్వంలోని నాటో కూటమికి అప్పగించి ఆ రెండు దేశాలకు మిలిటరీ లేకుండా చేశారు. మరోసారి మిలిటరీతో యుద్ధాలకు దిగకుండా ఆమేరకు ఆ దేశాలు రాజ్యాంగాలను రాసుకున్నాయి. అయితే దానిని వుల్లంఘించేందుకు అడ్డదారిలో 1954లో ఆత్మరక్షణ బలగాల పేరుతో పరిమిత మిలిటరీని జపాన్‌ ఏర్పాటు చేసింది. తొలి రోజుల్లో మిలిటరీకి చేసే ఖర్చును పరిశోధన, అభివృద్ధి వైపు మళ్లించి యుద్ధ నష్టాలనుంచి కోలుకోవటంతో పాటు అమెరికాతో వస్తు ఎగుమతుల్లో పోటీ పడేంతగా బలపడింది. అయితే క్రమంగా ఆత్మరక్షణ సైన్యానికి ఖర్చు పెంచింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక మిలిటరీ బడ్జెట్‌లున్న దేశాలలో జపాన్‌ ఎనిమిదవ స్ధానంలో వుంది. ఈ ఖర్చు పెరుగుదలతో పాటు పెట్టుబడిదారీ వ్యవస్ధలో వుండే అంతర్గత దౌర్బల్యం కారణంగా పరిమితులు ఏర్పడి అభివృద్ది గిడసబారి పోయింది. దాన్నుంచి బయటపడాలంటే మార్కెట్‌ వాటా పెంచుకోవాలని, అందుకు గాను వివాదాల్లో జోక్యం చేసుకొనేందుకు రాజ్యాంగ సవరణ చేసి 2020 నాటికి మిలిటరీని తిరిగి రంగంలోకి తేవాలని జపాన్‌ పాలకవర్గం దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. అయితే దానికి అనేక ఆటంకాలు కూడా వున్నాయి. అమెరికన్లు ఒక పట్టాన ఒక స్వతంత్రశక్తిగా పూర్వపు స్ధాయికి జపాన్‌ లేదా జర్మనీలను ఎదగనిచ్చేందుకు సుతరామూ అంగీకరించరు. తాజా ఎన్నికల తీర్పు ప్రకారం మధ్యలో ఎలాంటి సంక్షోభాలు తలెత్తకపోతే షింజో అబే సర్కార్‌ 2021వరకు అధికారంలో వుంటుంది.

గత కొద్ది నెలలుగా షింజో అబే ప్రతిష్ట మసకబారుతోంది. అనేక ఎన్నికలలో పాలకపార్టీ మట్టి కరిచింది. ఏకంగా అబే భార్య, ఎంపీలు, మంత్రులు కొందరు అవినీతి కుంభకోణాలలో చిక్కుకు పోయారు,రక్షణ మంత్రితో సహా కొందరిని పదవుల నుంచి ఆగస్టులో తొలగించాల్సి వచ్చింది.టోకియో గవర్నర్‌ యురికో కొయికే తిరుగుబాటు జెండా ఎగురవేసి కొత్త పార్టీని పెట్టారు. జూలైలో జరిగిన స్ధానిక ఎన్నికలలో ఆమె గ్రూపు మెరుగైన ఫలితాలు సాధించింది. అందువలన సాధారణ ఎన్నికల నాటికి మరింత బలపడకుండా ఆకస్మిక ఎన్నికలు జరిపి ఆమెను ఓడించాలనే ఆలోచన కూడా అక్టోబరు ఎన్నికలకు పురికొల్పిందని భావన.ఆగస్టు ఒకటిన ఒక సర్వేలో 60శాతం మంది అబే పనితీరును వ్యతిరేకించగా 32శాతమే ఆమోదం తెలిపారు. వుత్తర కొరియాతో సంబంధాలు కలిగి వున్న కారణంగా ఆ దేశంతో సమస్యలు రాకుండా చక్రం తిప్పుతారనే విశ్వాసంతో వున్న ప్రజలు జపాన్‌ మీదుగా వుత్తర కొరియా క్షిపణి ప్రయోగం జరపటంతో నివ్వెర పోయారు.

మన దేశంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుండగా జిఎస్‌టిని తీవ్రంగా వ్యతిరేకించిన బిజెపి, నరేంద్రమోడీ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. మన దేశంలో వసూలు చేస్తున్న పన్నులు మరీ తక్కువగా వున్నాయని వాటిని పెంచాలని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ చాలా కాలం నుంచి వత్తిడి తెస్తున్నాయి.పన్ను సంస్కరణల ముసుగులో దాన్ని అమలు జరపటానికి పూనుకున్న మోడీ జిఎస్‌టిని పెద్ద విజయంగా వర్ణించుకున్న విషయం తెలిసిందే. జపాన్‌లో కూడా పన్ను పెంచాలన్నది అంతర్జాతీయ ద్రవ్య సంస్ధల వత్తిడి. 2012లో అధికారంలో వున్న డెమోక్రటిక్‌ పార్టీ వినియోగ పన్ను(జిఎస్‌టికి మరోపేరు) మొత్తాన్ని 8 నుంచి 10శాతానికి పెంచాలని నిర్ణయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ అప్పుతీర్చేందుకు కేటాయించాలని ప్రతిపాదించింది. అయితే ప్రతిపక్షంలో వున్న షింజే అబే నాయకత్వంలోని ఎల్‌డిపి దానిని వ్యతిరేకించి అదే ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చింది. పెంచిన పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని అప్పు తీర్చటానికి బదులు సంక్షేమ చర్యలైన అల్పాదాయ కాలేజీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, మూడు-ఐదు సంవత్సరాల వయస్సున్న పిల్లల సంక్షేమం వంటి వాటికి ఖర్చు చేయాలని చెబుతూ దానిని అబోనోమిక్స్‌గా ప్రచారం చేసింది. 2014లో పన్ను పెంచాలనే తరుణంలో జపాన్‌ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయింది. సంక్షేమ చర్యలు నిలిచిపోయాయి. దాంతో మరోసారి ప్రజల అనుమతి పేరుతో మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చి షింజో అబే విజయం సాధించాడు. ఇప్పుడు ఆ పన్నును జనం మీద రుద్ధేందుకు తమకు జనం అనుమతిచ్చారని చెప్పేందుకు ఈ విజయాన్ని వినియోగించుకోనున్నారు.

అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో వున్న పార్టీలలో జపాన్‌ కమ్యూనిస్టు పార్టీయే పెద్దది. గత రెండు దశాబ్దాల ఎన్నికల చరిత్రను పరిశీలించినపుడు సగటున తొమ్మిదిశాతం ఓట్లు తెచ్చుకుంది. తాజా ఎన్నికలలో దామాషా బ్లాక్‌ నియోజకవర్గాలలో ఓట్లు 11.37 నుంచి 7.91శాతానికి పడిపోయాయి, సీట్లు 20 నుంచి 11కు తగ్గాయి. ఏక సభ్య ప్రత్యక్ష ఎన్నికల నియోజకవర్గాలలో ఓకినావా ఒకటవ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధి తిరిగి ఎన్నికయ్యారు.దీనితో మొత్తం పన్నెండు. ఏకసభ్యనియోజకవర్గాలలో గతెన్నికలలో 292చోట్ల పోటీ చేయగా ఈ సారి 206కు పరిమితమైంది. 67 స్ధానాలలో మిత్రపక్షాలకు మద్దతుగా అభ్యర్దులను వుపసంహరించుకుంది. ఈ చర్య పౌర కూటమి మెరుగైన ఫలితాలు సాధించటానికి తోడ్పడింది. ఈ ఎన్నికలలో తగిలిన ఎదురుదెబ్బల గురించి తిరిగి కోలుకుంటామని కమ్యూనిస్టుపార్టీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. అందుకు గాను పార్టీ కార్యక్రమాన్ని జనం అర్ధం చేసుకొనేందుకు, వర్తమాన సంక్లిష్ట రాజకీయ పరిస్ధితులలో కూడా మద్దతు ఇచ్చి ఓటు చేసేందుకు ముందుకు వచ్చే విధంగా కార్యకలాపాలను మరింత పెంచాలని, పార్టీ సభ్యత్వాన్ని , పార్టీ దినపత్రిక అకహటా పాఠకులను పెంచుకోవటంతో పాటు సభ్యులందరినీ పూర్తిగా పనిలోకి దింపాలని ప్రకటనలో పేర్కొన్నది. తాజా ఎన్నికలలో గతంతో పోలిస్తే పాల్గొన్న సభ్యులు, పత్రిక సర్క్యులేషన్‌ తగ్గిపోయారని తెలిపింది.

జపాన్‌ కమ్యూనిస్టు పార్టీ గత ఎన్నికల రికార్డు చూసినపుడు ఓట్లు, సీట్లలో హెచ్చుతగ్గులు ఒక ధోరణిగా వున్నాయి. గత మూడు సంవత్సరాలలో స్ధానిక సంస్ధలు, రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలో గతం కంటే వున్న బలాన్ని పెంచుకోవటంతో పాటు కొత్త ప్రాంతాల విస్తరించటాన్ని కూడా చూడవచ్చు.మచ్చుకు జూలైలో జరిగిన టోకియో రాష్ట్ర ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ 127 స్దానాలలో 19 చోట్ల విజయం సాధించింది. గతేడాది పార్లమెంటు ఎగువ సభకు జరిగిన ఎన్నికలలో కూడా బలాన్ని పెంచుకొని 242 సీట్లకు గాను 14 స్ధానాలకు పెంచుకుంది. ప్రపంచ మంతటా ముఖ్యంగా పెట్టుబడిదారీ దేశాలలో కమ్యూనిస్టుపార్టీలకు ఎదురు గాలి వీస్తున్న సమయంలో జపాన్‌లో సాధిస్తున్న ఓట్లు, సీట్లకు ఎంతో ప్రాధాన్యత వుంది. అహింసా రాజ్యాంగాన్ని సవరించి తిరిగి మిలిటరీని పునరుద్దరించేందుకు పాలకవర్గ పార్టీలు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయో అంతే తీవ్రంగా కమ్యూనిస్టు పార్టీ జపాన్‌ శాంతియుత రాజ్యాంగాన్ని కాపాడాలని, యుద్ధాలకు దూరంగా వుండాలని కలసి వచ్చే శక్తులతో పని చేయటం అనేక మంది అభిమానానికి పాత్రమైంది. రానున్న రోజులలో కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని ఆ పార్టీ తీర్మానాలు చెబుతున్నాయి.

జపాన్‌ రాజకీయంగా మితవాదం దిశగా పయనిస్తుండవచ్చుగాని అక్కడి కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికీ కొంత ప్రభావం చూపగలుగుతున్నదని ‘ఫోర్బ్స్‌’ పత్రిక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని కమ్యూనిస్టు పార్టీ నేత విశ్వాసం వెలిబుచ్చారు, అయితే కమ్యూనిస్టులు జపాన్‌లో పూర్తిగా అంతరించలేదు. జపాన్‌ రాజకీయాలలో అనేక యుద్ధాలలో ఆరితేరిన భీష్ముడి వంటి లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ కంటే ఆరుసీట్లు మాత్రమే తక్కువగా ఇటీవలి టోకియో రాష్ట్ర ఎన్నికలలో సీట్లు తెచ్చుకుంది. ఎలాంటి వుగ్రవాద చర్యలకు పాల్పడకపోయినప్పటికీ ఇప్పటికీ జపాన్‌ పోలీసులు కమ్యూనిస్టు పార్టీని ఒక తీవ్రవాద పక్షంగానే పరిగణిస్తారు. వారిపై నిరంతర నిఘా, వేధింపులకు గురవుతుంటారు. అయినా వారి పలుకుబడి తగ్గలేదు. పార్టీ పత్రిక అకహటా 11.2లక్షల సర్క్యులేషన్‌ కలిగి వుంది. సమీప భవిష్యత్‌లో జపాన్‌ తీవ్ర మితవాద పత్రిక శంకై షింబున్‌ను అధిగమించనుందని ఒక వార పత్రిక జోస్యం చెప్పింది. లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ మరియు దాని ఒడిలో కూర్చొనే కోమీ పార్టీ, చీలికలతో వుండే ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీలో ఏదో ఒక దానిని మాత్రమే ఎంచుకొనే అవకాశం అనేక సంవత్సరాలుగా జపాన్‌ ఓటర్లకు ఏర్పడింది. రెండింటి మీద తీవ్ర అసంతృప్తి చెందిన ఓటర్లు కమ్యూనిస్టుపార్టీకి ఓటు చేస్తారు. కమ్యూనిస్టు రాజ్యమైన వుత్తర కొరియా చర్యలు కమ్యూనిస్టు అనే పదం పట్ల సాధారణ జనంలో విముఖత కలిగించి వుండవచ్చు. అయితే ఎన్నికలలో ఎదురు దెబ్బ తగలటానికి అతి పెద్ద కారణం టోకియో గవర్నర్‌ యురికో కోకీ అనుసరించిన వైఖరి ప్రతిపక్ష ఐక్యతకు అడ్డం పడింది. అహింసా పూరితమైన రాజ్యాంగ కలిగి వుండాలనే వైఖరితో కేవలం వారం రోజుల్లోనే రూపుదిద్దుకున్న రాజ్యాంగ బద్ద డెమోక్రటిక్‌ పార్టీ (సిడిపి) ప్రధాన ప్రతిక్షంగా ఎన్నికలలో అవతరించింది. పచ్చి మితవాద ఆశాజీవి పార్టీ, ఎల్‌డిపి, కొమిటోను కూడా ఓడించటానికి కమ్యూనిస్టు పార్టీ సిడిపికి మద్దతు ఇవ్వటం ద్వారా కమ్యూనిస్టు పార్టీ తనను తాను నష్టపరుచుకొని వుండవచ్చు. ఎల్‌డిపి-బుద్ధిస్టు కొమిటో పార్టీలకు కంచుకోట వంటి కాంటో నియోజకవర్గంలో సిడిపి-కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధి తొలిసారిగా గెలిచారు. సిడిపి ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నిక కావటానికి కమ్యూనిస్టుపార్టీ దోహదం చేసిందని ఎన్నికల విజయోత్సవ సభలో అక్కడ విజయం సాధించిన ఎడనో బహిరంగంగా చెప్పారు. తమ రెండు పార్టీలు మంచి విజయాలు సాధిస్తాయని కమ్యూనిస్టు నేత కాజూ షి ఆశాభావం వెలిబుచ్చారు గాని సిడిపి మాత్రమే లబ్దిపొందింది, కమ్యూనిస్టుపార్టీ తన పునాదిని కోల్పోయింది అని ఫోర్బ్స్‌ విశ్లేషకుడు పేర్కొన్నారు.

డబ్బు రాజకీయాలు, పార్టీల ఫిరాయింపులు, అవినీతి అక్రమాలకు పాల్పడటం, కార్పొరేట్ల కొమ్ము కాయటంలో మన దేశానికి జపాన్‌కు ఎన్నో సామ్యాలున్నాయి.ఒకసారి అధికారానికి వచ్చిన తరువాత దాన్ని నిలుపుకొనేందుకు తొక్కని అడ్డదారులు వుండవు. ఈ పూర్వరంగంలో జపాన్‌లో అబెనోమిక్స్‌ మాదిరే మోడినోమిక్స్‌ కూడా ఎదురుతన్నుతోంది. నోట్ల రద్దు, జిఎస్‌టి ఇప్పటికే మోడీని వుక్కిరిబిక్కిరి, నోటమాట రాకుండా చేస్తున్నాయి. వైఫల్యాలు, తప్పుడు విధానాల పర్యవసానాల నుంచి బయట పడేందుకు తప్ప మోడీ నాయకత్వానికి ఇప్పుడు మరొక పని లేదు. దేశమంతటా గుజరాత్‌ అభివృద్ధి నమూనా అమలు జరుపుతామని వూదరగొట్టిన పెద్దలు ఇప్పుడు చేసిందేమిటో చూశాము. మిగతా రాష్ట్రాలలో మాదిరి ఎన్నికల తాయిలాలను గుజరాత్‌లో ప్రకటించటానికే కేంద్ర ఎన్నికల కమిషన్‌పై వత్తిడి తెచ్చి ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించకుండా వాయిదా వేయించారన్నది స్పష్టం. ఇలాంటి అధికార దుర్వినియోగం బహుశా ఇదే ప్రధమం. అయితే జపాన్‌ వేరు, భారత్‌ వేరు. షింజో అబే మాదిరి తిరిగి గత ఎన్నికలలో వచ్చినన్ని సీట్లు తెచ్చుకోగలమని నరేంద్రమోడీ దురాశపడితే నిరాశే మిగులుతుందని గ్రహించటం అవసరం.